Saturday 20 June 2015

యోగా దినోత్సవం

21 జూన్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం.

ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంత. ఈ సందర్భంలో అసలు యోగా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

జన్మలపరంపరకు కారణమైన చిత్తవృత్తులను నిరోధించి, జననమరణ చక్రం నుంచి ఉద్ధరించేది యోగం/యోగ అన్నారు యోగసూత్రాల్లో పతంజలి మహర్షి. మనం యోగా అంటున్నాం కానీ నిజానికి దాన్ని యోగ్ లేదా యోగం అనే అనాలిట. యోగం అనే సంస్కృతపదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్దం కలియకు. ఎవరి కలియక? జీవాత్మ, పరమాత్మల కలియకకు, లేక ఆ కలియకలు కారణమయ్యే ప్రక్రియకే యోగం అని పేరు.

యోగ అంటే కేవలం ఆసనాలే అని అనుకుంటున్నారు. కాదు కాదు అలా చేశారు. ఒకప్పుడూ యోగ్ కేవలం భారతదేశానికి, తూర్పు ఆసియాదేశాలకు, సనాతనహిందూ ధర్మం వ్యాపించిన దేశాలకే పరిమితమైంది. దానికి కారణం కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతానికి యోగకు అవినాభావ సంబంధం ఉంది. యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాల్లో ఆఖరిది సమాధి - భగవంతునిలో లీనమైపోవటం- మోక్షం. ఆసనాలు 3 వ మెట్టు. ధ్యానం చేయండి అంటూ తరుచూ ప్రకటనలు, సలహాలు ఇస్తుంటారు. ధ్యానం యోగంలో 7 వ మెట్టు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. యోగం యమనియమాలతో మొదలవుతుంది. యోగకు ఆహారనియమాలు తప్పనిసరి. కానీ ఈరోజు దాన్ని ప్రపంచంలో అనేకమంది మార్కెటింగ్ చేసి వ్యాపారం చేస్తున్న కారణంగా అసలు విషయాలు చెప్పడంలేదు. యోగం అనేది ఒక జీవనవిధానం. యోగం ద్వారా పరమాత్మను ప్రాతి పొందాలంటే అష్టాంగ యోగాన్ని అవలంబించాలి.

హిందూధర్మమే జీవనవిధానం. అందులో యోగం ఒక భాగం. హిందూ ధర్మం, పునర్జన్మ సిద్ధాంతం లేని యోగం అసంపూర్ణం. యోగం హిందూ షట్ దర్శనాల్లో ఒకటి. అది భగవంతుని కనుగొనే విధానం. యోగ మతాతీతం అంటున్నారు. యోగం మతాతీతమే కానీ అది హిందూధర్మంలో భాగం. దాన్ని ప్రతి హిందువు తప్పకుండా ఆచరించాలి. ఇక అన్యమతాల విషయానికి వస్తే, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే, హైందవేతరుల గ్రంధాలు యోగంతో విభేధిస్తాయి. క్రైస్తవం, ఇస్లాం మొదలైన అబ్రహామిక్ మతాలకు హిందూ ధర్మానికి అసలు ఎక్కడ పొంతన ఉండదు. ఆత్మపరమాత్మతో సమ్యోగం చెందడం, ప్రతి జీవిలో భగవంతుడు ఉండడం, జీవుడు భగవంతుడి అంశ అనడం, పునర్జన్మ, కర్మ మొదలైన అనేక విషయాలను ఆయా మతాలు అసలు ఒప్పుకోవు. కనుక వారు యోగాభ్యాసం చేయడమంటే వారి మత గ్రంధాలను వదిలేయడమే అవుతుంది. ఈ మాత్రం కూడా అవగాహన లేక, యోగం యొక్క శక్తిని తక్కువ చేయలేక క్రైస్తవయోగ అని కొత్తగా యోగకు నామకరణం చేశాయి మిషనరీలు. అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదు.

యోగను ఎవరైన చేయవచ్చు అన్నమాట వాస్తవం కానీ యోగ చేసేవారు క్రమంగా వారికి తెలియకుండానే హిందువులవుతారు. యోగను చేయడం వలన క్రమంగా వారిలో మార్పు కలిగి, వారు కూడా ఆత్మానుభూతిని పొందుతారు. అయితే ఆత్మను నమ్మడం కూడా భారతీయమతాల్లోనే ఉంది. భౌద్ధం శూన్యవాదాన్ని, నిరీశ్వర వాదాన్ని చెప్పింది. కానీ భౌద్ధులు సనాతనధర్మం నుంచి యోగాన్ని స్వీకరించారు, పరమాత్మను చేరుకున్నారు. దీనిబట్టి మనం అర్దం చేసుకోవలసిందేమిటంటే యోగం మాత్రమే మతాలకు, జీవితానికి సంపూర్ణతను ఇస్తుంది. బౌద్ధ సన్యాసులు ప్రారంభంలో బౌద్ధమతాన్ని ఆచరించినా, క్రమంగా మంత్ర, తంత్ర, యంత్ర, యోగ ప్రక్రియల ద్వారా సనాతనధర్మాన్నే పాటిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతున్నారు.    

యోగం వలన ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అవును యోగం ఆరోగ్యాన్నిస్తుంది, కానీ యోగం యొక్క లక్ష్యం భగవంతునితో కలయిక. ఎలాగైతే చెరుకు రసం తీయడంలో క్రమంగా కాస్త చెరుకుగడలు నలిగి వ్యర్ధపదార్ధం వస్తుంది, అలాగే బ్రహ్మైక్యం కోసం యోగాన్ని ఆచరిస్తే ఆరోగ్యం కూడా వస్తుంది. యోగాకున్న నియమాలను ఏమీ పాటించకుంటేనే అద్భుతఫలితాలు కనబడుతుంటే, ఇక యోగాన్ని సంప్రదాయపద్ధతిలో పాటిస్తే, ఇంకేంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి.

చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే 'నువ్వు చేశావా?' అంటే అమ్మో, నేను కాదు, నేను కాదు అన్నట్టుగా హిందువులు యోగా మాది కాదు, మాది కాదు అనడం మూర్ఖత్వం. యోగ లంటిది అద్భుతప్రక్రియలు ఇంకేదైనా మతంలో ఉంటే వారు ఇలాగే అంటారా? అందరూ బాగుపడలాన్న నిస్వార్ధ ఆకాంక్ష హిందువులదే కావచ్చు కానీ దానికోసం యోగాన్ని త్యాగం చేయనవసరంలేదు. యోగం తమదేనని, తమ పూర్వీకులైన ఋషులు అందించారని హిందువులు గర్వంగా చెప్పుకోవాలి.

భారతదేశం ఇంతవరకు నరేంద్రమోదీ లంటి ప్రధానిని చూడలేదు. మోదీ స్వయంగా ఒక యోగి, యోగం యొక్క ఫలాలు ఎలా ఉంటాయో మోదీగారికి బాగా తెలుసు. అందుకే యోగాకు విస్తృత ప్రచారం కల్పించి, అందరి జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో యోగాకు కూడా ఒక రోజు ఉండాలని సంకల్పించారు, దానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇప్పుడు యోగకు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించాలి. అందుకుగానూ హైందవ యోగులతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి, యోగ మీద భారతదేశం పేటెంట్‌లు తీసుకోవాలి. యోగ సంకరం కాకుండా చూసుకోవాలి. యోగాను నేర్పుతున్న సంస్థల నుంచి, ముఖ్యం హైందవేతర సంస్థల నుంచి రాయల్టీ తీసుకుని దాన్ని దేశంలో ఉన్న పేదలకు ఉపయోగించాలి.

అందరం యోగాను నేర్చుకుందాం. జీవితాన్ని మార్చుకుందాం.

అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

మీ అభిప్రాయాలు కామెంట్ చేసి తెలియపరచండి

1 comment:

  1. https://satyadarpanam.blogspot.com/2012/07/1_22.html?showComment=1621527734601#c3062899030645676950

    ReplyDelete