Friday, 27 December 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటాచలంలో శ్రీనివాసుడు

అలా అగస్త్యుని ఆశ్రమంలో ఉన్న శ్రీనివాసునికి నారాయణపురం నుంచి ఆకాశరాజుకు ఆరోగ్యం క్షీణించిందని, మరణానికి చేరువలో ఉన్నాడని కబురు వస్తుంది. వెంటనే పద్మావతీదేవితో శ్రీనివాసుడు నారాయణపురం బయలుదేరతాడు. తన తమ్ముడు తొండమానుడిని, కొడుకు వసుదను కాపాడమని కోరిన ఆకాశరాజు, శ్రీన్వాసునికి చివరిసారిగా నమస్కరించి పరమపదానికి చేరుకుంటాడు. ఆయన మరణం తరువాత యధావిధిగా దహనసంస్కారాలు పూర్తి చేశాక, పెట్టిన శ్రాద్ధభోజనానికి భోక్తలుగా వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు కూర్చుంటారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత, శ్రీనివాసుడు, పద్మావతీదేవి, వకుళమాత, అగస్త్యుడు తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు.

ఆకాశరాజు మరణంతో రాజ్యం ఎవరికి చెందాలన్న వివాదం వస్తుంది. రాజుకు తమ్ముడిని కనుక తనకే చెందాలని తొండమానుడు అంటే, కాదు కాదు, మా నాన్న శౌర్యపరాక్రమాలతో జయించిన రాజ్యం కొడుకునైన నాకే చెందాలని వసుద వాదిస్తాడు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి, యిద్ధానికి సిద్ధపడతారు. యిద్ధంలో గెలిచినవారిదే రాజ్యం అన్న ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ తమతమ సైన్యాలను సిద్ధం చేసుకున్నారు. నారాయణపురానికి దక్షిణంలో యుద్ధం.

ఇద్దరూ శ్రీనివాసుని వద్ద సాయాం కొరడానికి వస్తారు. నేను ఒక్కడినే, ఇద్దరికి ఎలా సహాయపడగలను అనె సందిగ్ధంలో పడి, పద్మావతీదేవిని అడుగుతారు. నేను ఒక్కడినే ఉన్నాను, ఇద్దరూ నాకు కావలసినవారే కదా, ఎవరికి సాయపడమంటావ్? చెప్పు అంటూ పద్మావతీదేవిని అడుగగా, నా తమ్ముడు చిన్నవాడు, ఒంటరివాడు, తండ్రి లేనివాడు, నా పినతండ్రి ఒకరి సహాయపడే శక్తి ఉన్నవాడు, తనని తాను రక్షించుకోగలడు, కనుక వసుదకు సహాయపడడమే ఉచితం అంటుంది. పద్మావతీదేవి చెప్పినదే ఉచితం అని తలచిన స్వామి వసుదకు సాయం చేద్దాం అని నిశ్చయించుకుంటాడు. కానీ భక్తుడిని కాపాడడం భగవంతుని బాధ్యత. అందుకే భక్తుడైన తొండమానుడి రక్షణ కోసం తన శంఖుచక్రాలను తొండమానుడికి ఇచ్చేస్తాడు.

అందరూ యుద్ధభూమికి చేరుకుంటారు. శ్రీనివాసుడు వదిలి బాణాలకు తొండమానుడి రధమూ, గుర్రాలు నాశనమవుతాయి. తన సైన్యం కూడా నశించిపోతుంది. ఇది చూడలేని తొండమానుడు, శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుదపైకి విసరగా, వసుదను రక్షించడానికి అడ్డం వెళతాడు శ్రీనివాసుదు. చక్రం వచ్చి శ్రీనివాసుడి భుజానికి తగిలి గాయం అవుతుంది. వెంటనే శ్రీనివాసుడు మూర్చిల్లుతాడు (కళ్ళు తిరిగి కిందపడిపోతాడు). ఈ యుద్ధానికి అంతరిక్షం నుంచి చూస్తున్న దేవతలు, భగవంతుడు మూర్చిల్లడం చూసి ఆశ్చర్యపోతాడు.



దీంతో ఇరుపక్షాలు యుద్ధం ఆపేసి శ్రీనివాసుడికి పరిచర్యలు చేయడంలో కాసేపు మునిగిపోతారు. ఈ విషయం చారుల ద్వారా తెలుసుకున్న పద్మావతీదేవి పరుగుపరుగున అగస్త్యమునితో కలిసి యుద్ధభూమికి వస్తుంది. శ్రీనివాసుని ముఖంపై నీరు చల్లి స్పృహ వచ్చేలా చేస్తుంది. స్ఫృహ వచ్చిన శ్రినివాసుడు 'నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీకీ యుద్ధభూమిలో పనేంటీ?' అని పద్మావతీదేవ్ని కోపగించుకుంటాడు. అహస్త్యుడు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సంధి చేయడానికి పద్మావతీదేవి వచ్చిందని చెప్పి సమాధానమిస్తాడు. 'స్వామి మీ భక్తులను మీరే కాపాడండి. ఈ యుద్ధం వల్ల ఒరిగేదేంటి? తొండమానుడు, వసుద, ఇద్దరూ రాజ్యం ఏలడానికి వచ్చారు. ఇద్దరికి రాజ్యం పంచిపెడితే సరిపోతుంది కదా స్వామి' అని పలుకుతుంది. దానికి శ్రీనివాసుడు ఒప్పుకోడు. 'యుద్ధం చేయడం క్షాత్రధర్మం. యుద్ధంలో తొండమానుడిని, అతడి కొడుకును చంపి రాజ్యం వసుదకు వచ్చేట్లు చేస్తాను. లేకుంటే నేను ప్రాణం విడువటానికి సిద్ధపడతాను' అంటాడు పట్టుదలతో. పద్మావతీదేవి ఖిన్నురాలై అగస్త్యుని 'మీరే సర్ధిచెప్పండి నా శ్రీనివాసునికి' అని చెప్తుంది. అగస్త్యుడి ప్రార్ధనతో శాంతపడిన శ్రీనివాసుడు ఇద్దరిని పిలిచి వారి అభిప్రాయం అడుగుతారు. ఇద్దరూ భగవత్భక్తులు కనుక శ్రీనివాసుడు ఎలా చెప్తే అలా చేస్తామంటారు.

తరువాత శ్రీనివాసుడు ధనాగారాన్నీ, సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి తొండనమాడు రాజధానిగా తొండమానుడిని, నారాయణపురం రాజధానిగా వసుదానునికి పట్టాభిషేకం చేస్తాడు. వారి వద్ద కొన్ని రోజులు గడిపి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు. వసుదానుడు తన అక్కకు అరణంగా తన రాజ్యంలో 16వ వంతు ఇచ్చాడని, అలా పద్మావతీదేవికి 32 గ్రామాలు వచ్చాయని పురాణం చెప్తున్నది.

మరో పురాణం ప్రకారం శ్రీనివాసుడే ఇద్దరితో "నేను మీ కోసం నా ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్ధం చేశాను. సంధి కూడా కురిచాను. కనుక మీరిద్దరు నా మీ రాజ్యంలో భాగాలు ఇవ్వాలి" అని అనగా, ఇద్దరూ 16 గ్రామాల చొప్పున 32 గ్రామాలు ఇచ్చారని కనిపిస్తుంది.

 తొండమానుడు మహాభక్తుడు. మొదట శ్రీనివాసుడు తన చుట్టమనీ, మానవమాత్రుడనీ తలచినా, తరువాత జరిగిన సంఘటనలు ఆయనలో శ్రీనివాసుడే మహావిష్ణువు అన్న ఆలోచనలు కలిగించాయి. శ్రీనివాసుని పెళ్ళికి బ్రహ్మ, రుద్రుడు మొదలైన వాళ్ళు రావడం, లక్ష్మీదేవియే వివాహం జరిపించడం, విశ్వకర్మ భవనం నిర్మించడం, శుకుడు, అగస్త్యుడు, వశిస్ఠుడు లాంటి మహామునులు రావడం, శ్రీనివాసుడు తనకు శంఖుచక్రాలు ఇవ్వడం, సుదరశనచక్రానికి అడ్డుపడి వసుదను కాపాడడం, ఇవన్నీ తన బుర్రల్లో గిర్రున తిరిగాయి. అంతే స్వామి మానవుడు కాదు, మానవరూపంలో భూమికి దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. వెంటనే అగస్త్యుని ఆశ్రమం వద్దకు వెళ్ళి ప్రార్ధన చేస్తాడు. 'మహాప్రభో! దేవదేవ! శ్రీనివాసా! నిన్ను ఇనాళ్ళు మానవమాత్రుడు అనుకున్నాను. సృష్టి, స్థితి, లయలను నడిపే పరబ్రహ్మవని గుర్తించలేకపోయాను. ఈ జీవితం నీటిపై బుడగలాంటిది. అటువంటి ఈ జీవితంలో నిన్ను సేవించడమే పరమలక్ష్యం. దేవతాసార్వభౌముడవైన నిన్ను మోక్షం అడగడం మరచి, యుద్ధంలో సాయం కోరాను. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇలా నువ్వే విష్ణువనీ గుర్తించగలిగాను. నన్ను అనుగ్రహించు స్వామి' అని వేడుకున్నాడు.

తన పాదాలపై పడిన తొండమానుడిని పైకి ఎత్తిన శ్రీనివాసుడు, 'నీ భక్తికి మెచ్చాను, నాకు సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగిస్తాను. నీ అన్న పద్మావతీదేవితో వివాహం చేసి, నన్ను గృహస్థుడిని చేశాడు. 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నా వ్రతం పూర్తి కావస్తోంది. వేంకటాచలం మీద నాకు ఒక ఇల్లు లేదు. కనుక నాకు ఒక ఆలయం కట్టించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ ఘనకార్యం చేసి చరితార్ధుడవి అవ్వు' అని పలికాడు.

రాజా! నాకు తూర్పు దిక్కు ముఖద్వారముతో, రెండు గోపురములతో, మూడు ప్రాకారములతో, ఏడు ద్వారములతో ఉండేట్లుగా ఆలయం నిర్మించు. అందులో ఆస్థాన మండపం, స్వపన మండపం, యాగమండపం, వస్త్రాలగది, బలిపీఠం, ధ్వజస్థంభమూ, సకల సదుపాయాలతో నిర్మించు అని ఆలయ నిర్మాణ పధకం మొత్తం తొండమానుడికి చెప్తాడు వేంకటేశ్వరుడు. నిర్మాణం చేసే సమయంలో ఆలయం ప్రదేశంలో ఉన్న రెండు చింతచెట్లను కాపాడు అంటూ రెండు చింతచెట్లను చూపిస్తాడు. ఎందుకంటే ఈ చింతచెట్లు నాకు రక్షణ కలిగించాయి. కనుక వాటిని ముట్టుకోవద్దు. అలాగే లక్ష్మీదేవికి సంపెగ చెట్టు అంటే ఇష్టం. కనుక దానిని కూడా ముట్టుకోవద్దు. మందిరం నిర్మాణంలో వీటికి హాని కలుగకుండా చూడు. ఆగ్నేయదిశలో పాకశాల నిర్ముంచు.

అట్లాగే దానికి ఎదురుగా భూతీర్ధం ఉన్నది. అది శిధిలావస్థలో పాడబడి ఉన్నది. దానిని కూడా బాగు చేయించి, మంచి రాతికట్టడంతో నిర్మించు. ఈ భూతీర్ధం పూర్వజన్మలో నీవు నిర్మించినదే అని చెప్తాడు.  'నేను నిర్మించినదా? స్వామీ నా పూర్వజన్మ వృతాంతమేమిటి?' అని అడుగుతాడు తొండమానుడు. 'ఈ బావిని నేనెందుకు తవ్వించాను? ఎవరి కోసం చేశాను?' అని అడుగగా, స్వామి ఈ విధంగా చెప్తున్నాడు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

 నీ మనసు కామంతో కలత చెందింది. అది నా మాయ వల్లనే జరిగింది. నిలకడలేని మనసుతో సాధన పురోగతి చెందదు. నీ ఈ చేష్టవలన నీ దేహం కూడా కలుషితమైంది. నా పుష్కరిణి దగ్గరే నీ దేహం విడిచిపెట్టు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో మరణించడం చేత, నీ పుణ్య కర్మ చేత, గొప్ప రాజ వంశంలో జన్మిస్తావు. అనేకమంది భార్యలతో, చాలా డబ్బుతో భోగం అనుభవిస్తావు. చిన్న వయసు నుంచే నాకు భక్తుడవు అవుతావు. నాకు ఆలయం నిర్మించి చరితార్ధుడవు అవుతావు. నీ శరీరాన్ని ఆత్మహత్యతో వదిలిపెట్టకు. మరణ సమయంలో మాత్రమే, స్వామి పుష్కరిణికి చేరుకుని, తుదిశ్వాస విడువు. అంతరవరకు యధావిధిగా, ఇంతకు పూర్వంలాగే నా సేవలో తరించు అని ఆకాశవాణి పలుకుతుంది.

రంగదాసు సుమారు 100 సంవత్సరములు స్వామి కైంకర్యంలో గడిపి, కాలధర్మం ప్రకారం మరణిస్తాడు, తరువాత చంద్ర వంశంలో సుధర్మునికీ, నాగకన్యకూ జన్మిస్తాడు. అతడే తొండమానుడు. ఆకాశరాజు తమ్ముడు. పూర్వ జన్మల వాసనల వల్ల 5 ఏళ్ళ వయసుకే మంచి విష్ణు భక్తుడై, గొప్ప సాధకుడయ్యాడు.

అని చెప్పిన శ్రీనివాసుడు, గత జన్మలో నీవు తవ్వించిన బావే ఈ భూతీర్ధం అని చెప్తాడు. శ్రీనివాసుని ఆదేశం ప్రకారం బావిని శుభ్రం చేయించి, మంచి కట్టడం కట్టించి, తూర్పు ముఖంగా ఆలయం కట్టించి, మంచి శిల్పకళానైపుణ్యం ఉట్టిపడేలా శిల్పాలతో, విమాన వేంకటేశ్వరునితో, బంగారు కలశములతో, విమానంతో ఆలయం కట్టించి, సలక్షణ రీతిలో ఆలయ నిర్మాణం చేయించాడు తొండమానుడు.

శ్రీనివాసుడు ఒక శుభముహూర్తాన, పద్మావతీదేవితో మంగళస్నానం చేసి, ఈ ఆలయంలోకి గృహప్రవేశం చేశాడు. వసుదానుని కుటుంబ సమక్షంలో, ఇతర భక్తులు, మహర్షుల సమక్షంలో, బృహస్పతి, వశిష్టాదుల ఆధ్వర్యంలో ఈ శుభకార్యం జరిగింది. అందరికి ఆనందాన్ని పంచే ఈ గోపురానికి, ఆనందనిలయం అని పేరు వచ్చింది.

వచ్చే యాత్రికుల కోసం ఒక యోజన దూరంలో మెట్లు కట్టించి, కొండ ఎక్కడ సులభం చేశాడు. ఎక్కడిక్కడ విశ్రాంత మండపాలు, చలివేంద్రాలు బావులు నిర్మించాడని పురాణం చెప్తుంది.  

మొదట శ్రీనివాసుడు అందరికి కనిపించే రూపంతో తిరుమల ఆలయంలో ఉండేవారు. అయితే ఒకసారి తొండమానుడి మీద కోపం వస్తుంది. అప్పుడు స్వామీ 'నేను మీకు సులభంగా కనిపించి, దర్శనమిస్తున్నానని, అన్ని చూసుకుంటాననీ ధీమాగా ఉన్నావు. వ్యక్తుడిగా ఉన్న నేను, ఇప్పటి నుంచి అవ్యక్త రూపంతో ఉంటాను' అని సంకల్పించి, విగ్రహరూపంగా మారిపోయారు. తానూ అన్ని గమనిస్తూ ఉంటాననీ, భక్తుల కోరికలు తీరుస్తాననీ, తన దర్శన మాత్రం చేతనే భక్తుల పాపం పరిహారం చేస్తాననీ, కానీ గతంలోలాగా తాను అందరికి కనిపించననీ, శిలా రూపంగా అవతరిస్తాడు. అంటే స్వామి ఇచ్ఛారూపం అది. ఒకరు చెక్కినది కాదు, దేవతలు చేసినది కాదు. ఈ ఆనందనిలయంలో బ్రహ్మదేవుడు రెండు అఖండ జ్యోతులను వెలిగించాడు. అవి కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాయి. కలియుగాంతంలో కొండెక్కుతాయి. అప్పుడు కలియుగ దైవం వేంకటేశ్వరుడు తిరుమల నుంచి వైకుంఠానికి తరలిపోతాడు. ఆనందనిలయం అనే విమానం అప్పుడు కూలిపోతుందని, ఆ తర్వాత కృతయుగం ప్రారంభవుతుందని బ్రహ్మదేవుడి సంకల్పం.

ఏడుకొండలవాడా! వేంకటరమణా! గోవిందా గోవిందా!!  

గత కొద్ది రోజులుగా ప్రచురిస్తున్న ఈ కధను విశ్రాంత ఐ.ఏ.ఏస్., పి.వి.ఆర్.కే. ప్రసాదుగారు రాసిన తిరుమల లీలామృతం అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. ఇన్నాళ్ళు మీ దగ్గరి నుండి ఈ కధ విషయంలో అందుకున్న ప్రశంసలన్నీ వారికే అంకితం.

ఓం నమో వేంకటేశాయ 

Sunday, 22 December 2013

కంటితో జాగ్రత్తగా చూసి అడుగు వేయండి

చక్షుః పూతం పాదం నశ్యేత్ - కంటితో జాగ్రత్తగా చూసి అడుగు వేయండి అని మార్కండేయ పురాణంలో ఒక మాట. మనం నడిచేదారిలో ఏవో ఏవో జీవులు సంచరిస్తూ ఉండవచ్చు. మనం పొరపాటున ఏ జీవికి హాని తలపేట్టినా, జీవహింస చేసిన, అది మోక్షమార్గంలో మనిషి ప్రయాణానికి ఆటంకం అవుతుంది. ఆత్మజ్ఞానం పొందాలనుకునేవారు, యోగా చేసేవారు, ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు, అసలు అందరూ కూడా అహింసను తప్పక పాటించాలనీ శృతులు, స్మృతులు, పురాణాలు గుర్తుచేస్తున్నాయి.

ఇప్పుడిది గుర్తు తెచ్చుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ చలికాలం మనం దేశంలో కుక్కలు పిల్లలు పెట్టే సమయం. వీధికుక్కలు ఎక్కడపడితే అక్కడ పిల్లలు పెట్టేస్తాయి. అవే కాదు పిల్లులు, ఇంకా అనేక జీవులు కూడా. ఆ చిన్ని చిన్ని జీవులు తెలియక రోడ్ల పైకి రావడం, అధిక వేగంతో వాహానం నడిపేవారి వల్ల, ప్రమాదానికి గురై మృత్యువాతపడడం చూస్తూనే ఉంటాం. ఇవే కాక, హైవేల పై రోడ్ల మీదా పాములు, కోతులు కూడా వాహనప్రమాదంలో మరణించడం గమనిస్తూనే ఉంటాం. ఇది సాధరణ మనిషికి చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ భగవంతునికి, ప్రకృతి ధర్మానికి ఇది పెద్ద అపచారంగా కనిపిస్తుంది. భగవంతునికి మనం ఎంతో, మిగితా జీవరాశి కూడా అంతే. ఆయన ఆత్మలను చూస్తాడే కానీ, శరీరాలను కాదు. మన వల్ల పొరపాటున ఏ జీవికి ప్రమాదానికి గూరైనా, ఆ పాపం మనలను ఆత్మసాక్షాత్కారంలో వెనక్కు లాగుతుంది. భగవంతునికి దూరం చేస్తుంది.

అవి అలా రోడ్ల మీదకు రావడం తప్పండీ అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేసేస్తాం. కానీ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి. మనిషి మాత్రమే బుద్ధిజీవి. మనిషి మాత్రమే తన బుద్ధిని ఉపయోగించి సరిన మార్గంలో నడవగలుగుతాడు. మిగితా జీవరాశి వాటివాటి ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకుంటాయి. వాటికి మనకులాగా ట్రాఫిక్ నిబంధనలు ఉండవు. కనుక నడిచే ముందు, వాహనం నడిపే ముందు, ఫోన్లు మాట్లాడకుండా, ప్రయాణించే మార్గం వైపు చూసి నడపండి.' చక్షుః పూతం పాదం నశ్యేత్' అన్న మార్కండేయ పురాణవచనాన్ని గుర్తుంచుకోండి. మీ వల్ల ఏ జీవికి హానీ కలగకుండా ఉండేలా చూడండి.            

అల్పజీవినైనా, అల్పవస్తువునైనా తృణీకార భావంతో చూడరాదు. ఒకరిపట్ల నువ్వు గౌరవం చూపితే వారు నీ పట్ల గౌరవం చూపుతారు. ఒక మూగజీవినైనా పాదాలతో తాకరాదు అని శ్రీ శారదాదేవి / శ్రీ శారదామాత అన్న మాటను గుర్తుంచుకోండి.

Saturday, 21 December 2013

మార్గశిర మాసం

మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో. మాసాలల్లో మార్గశీర్షం నేను అన్నాడు. మార్గం అనగా దారి, శీర్షం అనగా తల/గొప్పది/ఉత్కృష్టమైనది. లోకంలో ఉన్న అన్ని దారులలో కెల్లా నన్ను చేరే మార్గం మాత్రమే ఉత్తమమైనది అని అర్దం. మార్గశీషం విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసం. విష్ణువుకే కాదు, విష్ణుపత్ని లక్ష్మీదేవికి కూడా మహాప్రీతికరం. ఈ మాసంలోనే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుంది. ఏ ఇంట మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారో, ఆ ఇంట తన కళను ఉంచుతుంది. డిసెంబరు 3, 2013 నుండి మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిరమాసంలో శ్రీ విష్ణు సహస్రనామ పారయణ చేయడం, విష్ణుమూర్తిని తులసీదళాలతో అరించిచడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు.

అలాగే ఈ నెల 16 నుంచి ధనుర్మాసం మొదలైంది. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించడంతో మొదలైన ఈ ధనుర్మాసం కూడా విష్ణువు ఆరాధనకు ప్రత్యేకమైనది. ఈ మాసంలోనే గోదాదేవి రచించిన తిరుప్పావైని పారాయణ చేస్తారు, వింటారు. పరమాత్మ పట్ల గొదాదేవికి. ఆండాల్ అమ్మవారికి ఉన్న అచంచలమైన ప్రేమ వల్ల, ఆమె పరమాత్మలో ఐక్యం అయ్యారు. భక్తియోగంతో, ఎంతో సులువుగా భగవంతుడిని చేరుకోవచ్చని చెప్తుందీ సంఘటన. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇళ్ళ ముంగిట గొబ్బెమ్మలు పెట్టి, ఉదయం ఆటలు ఆడతారు మన తెలుగువారు. విష్ణువు ఆలయాల్లో తిరుప్పావై గానం చేసినట్టే, ఈ నెల రోజులు శివుడి ఆలయాల్లో తిరువెం
బావై గానం చేస్తారు.    

Monday, 2 December 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - శ్రీనివాసుని వివాహ వేడుక

ఓం నమో వేంకటేశాయ

మాకు వార్షికం ఇస్తే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికం, ఇంగ్లీష్‌లో బోనస్ అన్నమాట. దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యం, జ్ఞానం మొదలైనవి వార్షికం. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తాడని చెప్తారు. కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయలాంటే, వారికి ఎంతో కొంత మూటజెప్పాల్సి ఉంటుంది. అధికశాతం మంది ఏ పని చేస్తున్నా, 'అయితే నాకేంటీ? ఇందులో నాకు లాభమేమిటి?' అన్న ధోరణితోనే చేస్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం.

బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటిదేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో, ఆయా లోకాలవారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్యతేజో మూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానంచేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది.

వీళ్ళందరి సంగతి అటుంచితే, ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. ఏంటో, వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేదో, సమయానికి చేరుకుంటారా? ..... ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకు, లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతులవారు, ఆదిశేషులవారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తుంటారు. మీరేం కంగారు పడకందీ స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారనీ, కాసేపాగి, గంగా దాటారనీ, గోదావరీ నదిని దాటి కృష్ణానదిని సమీపించారని చెప్తుంటారు. అంటే ఎప్పటకప్పుడు 'లైవ్ అప్‌డేట్స్' ఇస్తుంటారనమాట.

దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్దం చేరి అక్కడ స్నానం చేసి, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక, ఎదురువెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు. వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు.

ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. "ఇంత మంది నా దగ్గరకు వచ్చినా, నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు" అని పలికి, "ఇతనిని విశ్వకర్మ పదివి నుంచి తొలగించి, నా యందు భక్తిప్రపత్తులు కలిగిన వానిని నియమించు" అని ఇంద్రునితో పలుకుతాడు. వర్ధకి అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడతాడు. మొత్తం వేంకటాచలం అంతా అతిధులతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పండుగ వాతావరణం, కోలాహలం, సందడి, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి కళ వచ్చేసింది వేంకటాచలంలో. ఇంతమంది అతిధులు రావడం ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా.

అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో "ఇంత మంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినపుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా, అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంత మంది అతిధులతో మనం నారాయణ వనం వెళితే, అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి, మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణమే జరుగుతుంది.

బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక, ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముకుడికి, వంటావార్పు అగ్నిహోత్రునికీ, నీటి సదుపాయం వరుణునికి, ఆకులుదొన్నెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి (ఒకరకంగా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అనుకోండి) వసువులకు, పౌరోహిత్యం వశిష్టునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగుకి (లైటింగ్ అర్రెంజ్మెంట్) చంద్రునికి  అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్ళి పనుల్లో మునిగిపొయినట్టు కనిపించినా, అంత ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు, అనేక రూపాల్లో, అనేక కార్యాలు చేస్తున్న అద్భుత సన్నివేశం ఇది.

వచ్చిన అతిధులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలాపడిపోతాడు. ఎందుకో ఎవరికి తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ' ఎంతమంది వస్తే ఏంటి? నా మహాలక్ష్మీ రానంతవరకు ఎవరూ రానట్లే ' అంటాడు. ఇంకా శ్రీనివాసుడు 'ఆమెను ఎవరు పిలుస్తారు? పిలిస్తే వస్తుందా? అంటారేమో, సూర్యుడిని పంపుదాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం, ప్రీతి అని నాకు తెలుసు' అని అంటాడు.

ఈ విషయం విన్న సూర్యుడు భయంతో ఒణికిపోతాడు. పెద్దల వ్యవహారం, అందునా భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయకలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏ మాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు 'నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది' అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్య్డు ఏం చెప్పాలని నసుగుతాడు.

నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చేయి బ్రహ్మపైన, మరొక చేయి శివుడి పైన వేసి, ఎంతో కష్టపడితే కానీ, నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరీ కూడా ఆయనే, అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి 'ఆమె నమ్ముతుందా?' అంటాడు. నా మాయతో ఆమె కూడా మొహితురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు.

శ్రీనివాసుడు మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం (కొల్హాపూర్) వెళతడు. మొదట ప్రణయకలహ గుర్తుకొచ్చి రానన్న, తరువాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగుపరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ............ ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది, నిజానికి వారిద్దరికి బేధం కూడా లేదనే చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం, తాము ఆడుతున్న లీలానాటకాన్ని రక్తి కట్టించడం కోసం అమ్మ ఏమి తెలియనట్లు, అబద్ధం నమ్మినట్లు నటించింది.

మొత్తానికి లక్ష్మీదేవి కూడా వేంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్ళిపెత్తనమంతా లక్ష్మీదేవిది, వకుళాదేవిది అయ్యింది. పెళ్ళిపనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువలంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో, శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి, నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తరువాత అభ్యంగనస్నానం చేయించి, మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమొ అని భయంతో, 'గోరు వెచ్చటి నీరు మాత్రమే పోయొండమ్మా మా ఆయనకు' అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్ళి కళతో మరింత మెరిసిపోతున్నాడు, దానికితోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా, సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళస్నాన ఘట్టం ముగిసింది.

తరువాతి కార్యక్రమం పుణ్యావచహనం, అటు తరువాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. 'శమీవృక్షమే మా కులదైవం' అని చెప్పిన స్వామి, కూమారధారలో ఉన్న శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలని అడుగుగా, వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాం అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకువస్తుంది.

అంతా చేశాం, అంతా పిలిచాం కానీ వరాహస్వామికి ఆహ్వానపత్రిక ఇవ్వడం మరిచాం, పత్రిక సంగతి తరువాత, కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకువస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్ళికి హాజరు కాలేనని, తన పంటలపై తరుచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడడం కోసం ఇక్కడే ఉండాలసిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి, తన తరుఫున వకుళమాత వస్తుందని చెప్తారు. "మీరు అందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడు ఉంటుంది" అంటారు. తరువాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి.

ఇక అందరం పెళ్ళికి బయలుదేరుదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. "కులదేవతను ఆహ్వానించి పూజించిన తరువాత అన్నసంతర్పణ చేయకుండా ఎలా వెళతాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయానం చేసి అలసిపోయారు. అందరికి కడుపునిండా తృప్తిగా భోజనాలు పెట్టకా, అప్పుడు బయలుదేరితే బాగుంటుంది" అంటారు.

సమంజసమే కానీ, ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది? అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి పదిమంది ముందు పరువు పోగొట్టుకోమంటామా? డబ్బు లేకపోతే అప్పోసొప్పో చేసైనా శుభకార్యం జరిపంచాలి" అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడు సందేహం. అలకాపురీ అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అంటారు బ్రహ్మ. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు.

అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వత్థవృక్షం (రావి చెట్టు) వద్దకు వెళతారు. అక్కడికి వెళ్ళాకా, నాకు కొంచం డబ్బు కావాలి అని అడుగుతారు. "స్వామి, మీరిలా నన్ను అడగడమేమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరుపునే నేనీ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి, చక్రవడ్డీ కట్టాలనీ, ఇదే కలియుగంలో కనిపిస్తుందని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు.

అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం, కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్షులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసుడితో. పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు.

బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక, పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి, ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు.

శివుడు సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాసపర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువంటారు. కోపం తో మూడవకన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో! నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం, కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు.

అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే, నేమి సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు సాక్షులు వచ్చారు కనుక, అప్పు పత్రం రాసుకుందాం అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు.
అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు. అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో, వైశాఖమాస శుక్లపక్ష సప్తమినాడు పదునాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణేములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డితో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుంచి వెయ్యి సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు. రెండవ సాక్షి రుద్రుడు (శివుడు). మూడవ సాక్షి అశ్వత్థరాజము.

అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. 'భవిషత్తులో నా భక్తులు మంచిదో, పాపిష్టిదో, చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను' అంటాడు. అందరికి అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బి మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు.

ఇదంతా మనకు ఒక సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన దివ్యలీల. ఇంటికి వచ్చిన అతిధులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి, పెద్దపెద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిధులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలి వంటివి అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా 'ఇదంతా నీదే స్వామి. ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు.' ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా, అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, తెలివితేటలు, కళలు, ఇలా ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక, అహకారం లేకుండా, ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్ధకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటలలోని అంతరార్ధం.

అప్పు అయితే తీసుకున్నాం కానీ, ఇంకా చేయాల్సిన పెళ్ళి పనులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహం. ఇంతలో శివుడు కలుగజేసుకుని 'ఓ తాతాయ్య! ఆపవయ్యా నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా. నీవు ఆజ్ఞ చేయి, అందరూ నీవు చెప్పినట్టుగాన్ చేస్తారు' అంటాడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే, ఆయ్న నుంచి రుద్రులు పుట్టడం వలన, రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే, శివకేశవులు బావ, బావామరిదులు. కానీ నిజానికి శివుడు అనాది, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడు. శివుకేశవులు ఇద్దరూ ఒక్కటే తత్వం. కాని సృష్టి నడవడం కోసం, వేర్వేరు పాత్రలు పోషిస్తూ, వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తున్నారు. అంతే.    

అందరు దేవతలకు వారివారి శక్తినిబట్టి, యోగ్యతను అనుసరించి పని అప్పహించబడింది. వంటపని అంతా అగ్నిదేవునికి, మర్యాదలు, పిలుపులు ఆరుముఖాల షణ్ముఖుడికి (కుమారస్వామికి), వచ్చినవారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు, వీటన్నిటికి డబ్బులు సర్దడం కుబేరుని బాధ్యత. పిల్లగాలులు వీస్తూ వచ్చినవారికి ఆహ్లాదం కలిగించడం వాయుదేవుని పని. ఎవరి పనులు వారి చేస్తుంటారు. ఇంతలో అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి. నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.

నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.

ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం వేసి చేసిన పరమాన్నం, కూరలకు,, నెయ్యి కాచడానికి దేవతీర్ధం, తుబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో వివధ రకాలైన భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.  

దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తిపారవశ్యతంతో, తమ ఇఛ్ఛాశక్తి చేత పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలు బ్రహ్మండమంతా వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.

"నైవేద్యం పెట్టిన తరువాతే అథిదలందరీకి వడ్డన. నువ్వే భగవంతుండివి, యజ్ఞభోక్తవి, కనుక ముందు నువ్వు భోజనం చేయి" అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడంటాడు. "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.  

నేను ఇంకో రూపంలో ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహునిగా వెలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.

(తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోకభాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడుని నరసింహస్వామి సంహరించారట. ఆ సమయంలో మహోగ్రంగా ఉన్నారు స్వామి. ఆయన బలం చూసిన దేవతలు 'అహో బలం, అహో బలం' అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లింది. అక్కడే నృసింహుడు వెలిశారు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది.)                

నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేది. వైశ్వదేవం మిగిశాకా అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు.

చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) పరిచి, వారివారి పెద్దతనానాన్ని అనుసరించి ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.
వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఏలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందు ఈనాటి పాశ్చ్యాత ఆహారనియమాలు, భుజించే విధానం ఎంత మూర్ఖమైనవో   అర్ధం అవుతుంది. భవిషోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్తు మర్యాదలు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది.

దాన్ని అనుసరించి వేంకాటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, ఉడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువును స్మరించారు.

అంతటా వ్యాపించిన ఒకే తత్వము, చిన్న దేహములు కలిగిన అనేక జీవులయందూ కూడా ఉండి, మూడులోకములు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్ధ్యం కలిగి, చిన్నచిన్న జీవుల దేహమందూ వాసము చేస్తూ వారూ తిన్న ఆహారమను స్వీకరిస్తున్నది, ఆని ప్రార్దించి

భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవిందా అని శ్రీనివాసుడనగా గోవిందా ఆని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. భోజన ప్రారంభానికి ముందు  శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని, అతిధులందరికి నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్ణులైనవారికి ఈ కొద్దిపాటి అన్నమూ, నీరుచే ఏ మాత్రము తృప్తి కలుగదు. అయినా తపోధనులారా! మీరు కరుణ కలిగినవరు కనుక నీ పెట్టిన ఈ కాస్త ఆహారమునూ, అధికంగా, ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్ధుడిని చేయండి అన్నాడు. చివరగా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ అంటూ ముగించాడు.

నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అను చెప్పి అతిధులు భుజిస్తారు. భోజన మధ్యకాలంలోనూ, ఆఖరునా గోవింద నామం మళ్ళీ చెప్తారు. మనం తినే ఆహారంలో ఆరవవంతు మనసుగా మారుతుంది. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏమి ఆలోచిస్తామో, ఏది మాట్లాడుతామో, అది మన మనసులో తీవ్రప్రభావం చూప్సితుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెబితే, మన మనసులో భగవన్నామం మంచి ఆలోచనలకు ప్రేరకం అవుతుంది.

అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం. అది కూడా వారివారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే. శ్రేష్టులైన ద్విజులకు ఒక రామటెంక (నాణెము), వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగమూ, ........ ఇలా ఇచ్చడు స్వామి.

అందరి భోజనాలు మిగిశాకా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలురు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.

అలా అందరి భోజనాలు పూర్తయ్యాక, ఆ రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళవాయిద్యాలు, కబురులు, సబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మసరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ శుకాచార్యులవారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి, తన ఆశ్రమానికి విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు.    

"కోట్లాదిమందితో ఉన్నాను, నేను ఒక్కడినే రాలేను, ఇంతమందిని తీసుకువస్తే నీకు ఇబ్బంది. అందరం ఆకాశరాజు ఆతిధ్యం స్వీకరించాలనుకుంటున్నాం" అంటాడు శ్రీనివాసుడు. "నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరు తిన్నటే" అని శుకుడు శ్రీనివాసుడిని బ్రతిమాలుతాడు. "నాన్నా! నీ పెళ్ళికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు. కనుక ఆయన చేసిన సాయానికి గుర్తుగా, ఆయన ఆతిధ్యం అంగీకరించి, భోజనం చేయి" అంటుంది వకుళమాత. అమ్మ మాట కాదనలేని స్వామి సరేనంటాడు.

శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెప్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది, భక్తుని కోరిక మన్నించిన భగవంతుడు, భక్తుడి ఇంట భోజనం చేయడం. కానీ లోకులు అలా ఆలోచించరు కదా. బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానారకాలుగా అనుకొవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా, ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడమేంటి? ఇదేం వింత? శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది, మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా? అందరిని అవమానిస్తున్నాడు .......... ఇలా రకరకాల మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని తలచారు. 

లోపల భోజనం చేస్తున్న స్వామికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత. అందుకే భోజనం చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు త్రేనుస్తాడు. అంతే! బయటనున్న అందరికి ఆకలి ఒక్కమాటున తీరిపోతుంది, కడుపు నిండిపోతుంది. అందరికి శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవలయందూ ఆకలిరూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ, అందరి ఆకలిని తీర్చడం వింత ఏమీ కాదు. ఇది జరిగింది వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు. ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు.

నవమినాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు. శ్రీనివాసుని స్వాగతించడానికీ ఎదురువచ్చిన ఆకశరాజుతో స్వామి, అతిధులందరూ ఆకలితో ఉన్నారు, భోజనాలకు ఏర్పాట్లు చేయండని ప్రత్యేకంగా చెప్పినట్టు పురాణంలో కనిపిస్తుంది.      

దశమినాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళస్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ "ఈనాటి రాత్రియే వివాహమూహుర్తం కనుక మనం ఐధుగురం, నేను, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, మీరు (వశిష్ఠుడు) భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి (పెండ్లికూతురు), వారి పురోహితుడు భోజనం చేయకూడదు" అని చెప్పి, కుబేరునితో "కుబేరా! బ్రాహ్మణభోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు, ముహూర్తం రాత్రి 13నాడులకు, ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడం నిషేధం" అని చెప్తాడు.

శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహవేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్ళాడని పురాణం చెప్తోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్టులతో శాస్త్రచర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్ళడం కోసం ఇంద్రుడి ఐరావతం తీసుకువస్తాడు ఆకాశరాజు. ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. ఐరాతవతంపై శ్రీనివాసుని కూర్చొబెట్టి, లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, ఇలా అందరి సమేతంగా తీసుకివెళతాడు ఆకాశరాజు.

శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజూ, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమనీ, ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఏవరి పాదదూళి సోకితే పరమదరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం (కాళ్ళు కడిగిన నీటిని) రాజ్యమంత ప్రోక్షణ చేయించాడు (చల్లించాడు). ముహూర్తం సమీపించగా, కోటి సువర్ణనాణేములు కానుకగా ఇచ్చాడు ఆఖశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్నఖచితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు.

అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరాణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కీరీటం, అంతే బరువుగల నడుముపట్టీ, భుజకీర్తులు, నూపురములు, 2 నాగ భుజ భూషణములు, భుజాల వరకు వేళాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు (చెవికి పెట్టుకునే ఆభరాణాలు), 32 తులాల బరువుగలిగిన నవరత్నఖచిత కంకణాలు, నాగభూషణాలు రెండు, 111 తులాల బరువు కలిగిన, వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజనపాత్ర, చెంబు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టువస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు.

వధూవరుల ప్రవరలు చెప్పించి, బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. ' అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాకు పుత్రిక అయినా పద్మావతీదేవిని యయాతి మునిమనుమడు, శూరశేనుని మనుమడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వేంకటేశ్వరునకిచ్చి వివాహాం చేయదలిచారానీ చెప్తూ, కన్యాదానం పూర్తి చేశారు.

కంకణధారణ చేయించడం దగ్గరి నుంచి మొత్తం వివాహవేడుకను అధ్భుతంగా వర్ణిస్తుంది పురాణం. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి, ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తరువాత వచ్చిన అతిధులందరికీ దక్షిణతాంబులాలు ఇచ్చాడు ఆకాశరాజు. కోటిసహస్ర గోవులను బ్రాహ్ముణలకు దానం ఇచ్చాడు ఆకాశరాజు.

అంతా ముగిశాకా కొత్త దంపతులతో కలిసి అందరూ భూరిభోజనాలు చేశారు.

మొత్తం 5 రోజుల పెళ్ళి జరిగిందని పురాణం చెప్తోంది. ఐదవరోజు అప్పగింతలు జరిగాయట. అపగింతల్లో నాభికి పాలు అద్ది, ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితీ అత్తారింటికి వెళ్ళిపోతోందన్న బాధతో భోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు, పద్మావతీదేవి సోదరుడు వసుద, ఆమె పినతండ్రి తొండమానుడు. అప్పటివరకు ఉస్తాహంతో, కోలాహలంతో నిండిన పెళ్ళిమండపం ఒక్కసారిగా దుఃఖంలో మునుగిపోయింది. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడిచికి పద్మావతీదేవిని తీసుకువెళ్ళి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. అటు తరువాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు.

ఇలా అమ్మవారిని పంపుతూ, ఆకాశరాజు పద్మావతీదేవికి మూదువందల పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, వెయికడవల పాలు, నూరుకుండ పెరుగు, పదిహేనువందల చర్మపాత్రల నిండ నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండ నూనె, రెండువందల కుండల నిండా పంచదార, దోసపండ్లు, మామిడిపండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, రెండువందల కుండల నిండుగా తేనె, లెక్కలేనన్నని అరటికాయలు ఇచ్చారాని, వాటిని 10,000 గుర్రాలు, 1,000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్యమోక్షాన్ని ఇచ్చాడని పురాణం.

స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పద్మావతీదేవి కల్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈరోజుకి చూడచ్చు.

వివాహం జరిగిన తరువాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తిసుకున్నానని, అందువల్ల, అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నానని చెప్పిన శ్రీనివాసుడు, తన పెళ్ళికి హాజరైన దేవతలకు, ఋషిమునులకు వస్త్రాలు, కానుకలు వారీవారీ యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. ఇది జరిగాక మహాలక్ష్మీ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమం తొండవాడ, శ్రీనివాసమంగాపురానికి దగ్గరలో ఉండిందని భావిస్తున్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్టించి పూజించిన శివలింగం మనం ఇప్పటికి దర్శించవచ్చు. స్వామి నివసించిన చోటనే శ్రీనివాసమంగాపురంలో ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వామి కల్యాణ వేంకటేశ్వరుడు. ఈయన్ను దర్శించి, ఇక్కడ పద్మావతీ శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుంది.

ఈ విధంగా శ్రీనివాసుని కల్యాణ కధను జనకమహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మునులకు సూతమహాముని చెప్పాడు.  శ్రీ వేంకటేశ్వర కల్యాణగాధకు ఫలస్తుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం లభిస్తుందో, ఈ కధ చదివినా, విన్నా అంతే ఫలితం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కల్యాణం చేయిస్తారో, వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. నీ కోసం ఈ శ్రీనివాస మహాత్యాన్ని చెప్పాను. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని, మహాత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో, వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్నమాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడు మంగళప్రదము అని శతానందుడు జనకమహారాజుతో చెప్పాడు.