Wednesday 31 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (218)


ఆలయాలు- కళలతో పెనవేసి కొన్న ఆనాటి వాతావరణాన్ని మెగస్థనీసు ప్రశంసించాడు. ప్రజలను కళల ద్వారా ఉత్తేజితుల్ని, సంస్కారవంతుల్ని చేసిన ఆనాటి వాతావరణాన్ని చూసి ముగ్ధుడైపోయాడు.


కనుక ప్రజలకు మానసిక తృప్తిని, ధార్మిక సంస్కారాన్ని ఇచ్చే ఆ నాటక కళల సంస్కృతి పునరుజ్జీవింపబడాలి. ప్రజలు, ప్రభుత్వమూ ప్రోత్సహించాలి.


ఇక ఆలయం కూడా ఆగమ శాస్త్ర నియమాలను తు, చ, తప్పక పాటిస్తూ మంత్ర పఠనం వల్ల పవిత్రం చేస్తూ ఉండగా, అందు పురాణ ప్రవచనాదులు జరుపబడుతూ ఉంటే పూర్వవైభవం వస్తుంది. అర్చకులకు, శిల్పులకు, కళాకారులకు తగిన భృతి ఉన్నపుడు మాత్రమే అన్నీ సక్రమంగా జరుగుతాయి. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది.


Tuesday 30 March 2021

31 మార్చి 2021, బుధవారం, ఫాల్గున బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ

 


31 మార్చి 2021, బుధవారం, ఫాల్గున బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.


ఫాల్గుణ మాసంలో వచ్చింది కనుక దీనికి భాలచంద్ర/ ఫాలచంద్ర సంకష్టహర చతుర్థి అని పేరు.


ఓం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి బుధవారం వచ్చింది.)


31 మార్చి 2021, బుధవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 09:18 నిమి||


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గణపతయే నమః

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (217)

ఆలయం - దైవకార్యాలు


రెండువేల సంవత్సరాల వెనుక మెగస్తనీసు మనదేశం వచ్చి ఆశ్చర్యపోయాడు. భారతీయులు అబద్ధమాడరని, వీథిలో డబ్బును విడిచినా ఎవ్వరూ దానిని తాకరని, న్యాయస్థానాలు లేవని ఇంకా ఏవేవో విషయాలను వ్రాసేడు. అట్లా మనం ఈనాడూ ఉండగలగాలి.


ఆనాటి సమాజం అట్లా ఉండడానికి కారణం ఏమైయుంటుంది? నేడీ పతనానికి కారణమేమిటి? ఆనాటి పవిత్ర వాతావరణం వల్లనే శీలవంతులుండేవారు. పూర్వకాలంలో ఆలయాలలో భారత ప్రవచనాలుండేవి. కథా కాలక్షేపాలు సరేసరి. ఇట్టి ప్రవచనాలు సాగడానికి ఆనాటి రాజులు కొన్ని మాన్యాల నిచ్చేవారు. ఏ నాటకం ఆడినా, ఏ కళను ప్రదర్శించినా భగవత్ సంబంధంతోనే ఉండేది. ఎవరి వృత్తులు వారు చేసికొంటూ విధిగా ఆలయాన్ని దర్శించేవారు. 


ఈనాడు మానవుల చంచల మనః ప్రవృత్తికి అనేకం దోహదం చేస్తున్నాయి. చలనచిత్రాలు, నవలలు, శృంగార కథలు, శృంగార దృశ్యాలు మనిషిని క్రుంగదీస్తున్నాయి. వాటికి తోడు రాజకీయ పార్టీలు, కక్షలు, ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా అసంతృప్తి, అవినీతి తాండవిస్తోంది.


ఆనాటి కథా కాలక్షేపాలులేవు. ఏ హరికథా కాలక్షేపం చేసేవాడో వచ్చి వెళ్లిపోవడమే జరుగుతోంది! తన తరంతోనే కళ అంతరిస్తుందని బాధపడుతున్నాడు. ముందు తరాల వారికి ప్రోత్సాహం లేదని, భద్రత లేదని వాపోతున్నాడు. విద్వాంసులకే కాదు, శిల్పులు మొదలగు వారికి ఉద్యోగ భద్రత ఆనాడుండేది. జానపద కళలు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. పొట్టగడవడమే వారికి కష్టంగా ఉంది. పొట్టకూటికై ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. పిల్లలకు తమ కళలను తల్లిదండ్రులు నేర్పడం లేదు. ఆ నాటకాలు, ఆ తోలు బొమ్మలాటలు, కొయ్యబొమ్మలాటలు, ఆ హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు ఈనాడు లేవు. ఆ శిల్ప నైపుణ్యం ఏది? జానపద కళలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం ఏవో సభలు ఏర్పాటు చేయడం, మంత్రులు రావడం, ఉపన్యాసాలీయడం, ఫోటోలు పత్రికలలో ప్రచారం మొదలగు ఆర్భాటంతో ముగుస్తోంది. తరతరాలు కాపాడుకొనే భద్రతను కల్పించలేకపోతున్నారు.

Monday 29 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (216)

ఒక్కొక్క ఆలయానికి ప్రత్యేకంగా పరిపాలన పద్ధతి ఉండక అంతా ప్రభుత్వాధీనంలో ఉండడం వల్ల ప్రజలు తమ గోడును వినిపించవలసి వస్తోంది. ఏదైనా మంచి పనిని ఉద్యోగులు మొదలుపెడితే పూర్తికాకుండానే ఐదిలీలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది.


పవిత్రతకు ప్రాధాన్యం ఈయక పైపై కుంభాభిషేకాలు జరిగినా ఫలం శూన్యమే. భక్తులు ఈ విషయంపై దృష్టిని సారించి ఆలయం ఒక వ్యాపార స్థలంగా ఉండకుండా చూడాలి. ప్రజలలో సామూహికమైన చైతన్యం రావాలి.


అనాచారాలను పేర్కొనడం నా విధిగా భావిస్తున్నాను. ఏదో ఒక కళాశాల నుండో, పాఠశాల నుండో 50, 60 మంది విద్యార్థులు ఒక్క మారే వస్తూ ఉంటారు. అందు యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలూ ఉంటారు. వారు నెలసరి (బహిష్టు) నియమాలను పాటించకుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇది తప్పని తెలియక వస్తూ ఉంటారు. పూర్వం ఇంట్లోనే ఆ రోజులలో దూరంగా ఉంచేవారు. వారు వచ్చినా స్వామి, మైలపడతాడా అని సంఘసంస్కర్తలు ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు స్వామి పవిత్రంగా అన్నిచోట్ల ఉంటాడని ఆలయాలకే రానవసరం లేదని వాదిస్తూ ఉంటారు. ఆలయాలు శాస్త్ర ప్రకారం నిర్మింపబడ్డాయి. నియమాలను పాటించకపోతే ఎలా? శాస్త్ర నియమాల ఉల్లంఘన వల్లనే యాత్రాస్థలాలలో ప్రమాదాలు, అనుకోని విపత్తులు సంభవిస్తున్నాయని భావిస్తున్నాను.


అంత గొప్ప క్షేత్రంలో ప్రమాదాలు జరగడమేమిటండి? స్వామి తన పవిత్రతను కోల్పోయాడా అని ప్రశిస్తూ ఉంటారు. నేను బాధపడుతూ స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టే అనాచారాన్ని తట్టుకోలేక దయకలవాడైనా అప్పుడప్పుడు ప్రమాదాల రూపంలో శిక్షవేస్తున్నాడేమో అని అనిపిస్తోందని ఒకమాట అంటాను.


క్షేత్రాలు, విహారయాత్ర కేంద్రాలు కావు. భక్తి లక్ష్యమైనా పై పవిత్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదు. అపచారాలతో క్షేత్రాలను నింపుతున్నాం.


ఇట్లా అనాచారాలు తెలిసి చెప్పకపోవడం నా ధర్మాన్ని విస్మరించినట్లౌతుందని చెప్పడం జరిగింది. భక్తులలో పరివర్తన తీసుకురావాలని వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నా.  


Sunday 28 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (215)



ఆలయాల పవిత్రత


గ్రామగ్రామాన లయాలు వెలుస్తున్నాయి. జీర్ణ దేవాలయోద్ధరణ జరుగుతోంది. కుంభాభిషేకాలు సరేసరి. నా దగ్గరకు వచ్చి కొంత మంది సలహాలడుగుతూ ఉంటారు. చాలా సంతోషంగానే ఉంది.


అదే సందర్భంలో కొంతమంది వచ్చి చెప్పే విషయాలు వింటూ ఉంటే బాధ కూడ కల్గుతోంది. వాళ్లు మిగతా వాళ్లతో చెప్పుకోవడం కంటే నాతో చెప్పుకోవడంలో కొంత తృప్తిని పొందుతున్నారు. ఇతరులు సలహాలు చెప్పడానికి జంకవచ్చుగాని, నేను నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పాలి కదా! ఏది శాస్త్ర విరుద్ధమో ఏది సమ్మతమో స్పష్టంగా చెప్పాలిగదా! వినండి.


ఆలయాలు ప్రశాంతంగా, పవిత్రంగా ఉండాలి. భగవత్ చింతన తప్ప ఇతర ఆలోచనలను అక్కడ రానీయకూడదు. అయితే మనం చూస్తున్నదేమిటి? అనేక ఆలయాల చుట్టు ప్రక్కల కొట్లు కట్టి వ్యాపారం సాగిస్తున్నారు. టీ, సిగరెట్టు కొట్లుంటాయి. దేవాలయానికి ఆదాయం వస్తుందని అన్నింటిని ప్రోత్సహిస్తున్నారు. ఒక్క స్వామి ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన ప్రదేశమంతా అద్దెకీయబడుతోంది. అట్టి గందరగోళ పరిస్థితిలో భగవత్ భావన కనుమరుగౌతోంది. కలుషిత వాతావరణంలో భక్తి సన్నగిల్లుతుంది. 


కార్యాలయ భవనాలు, కుటీరాలు, ఫలాహార శాలలు మొదలగునవి ఎన్నో చుట్టు ప్రక్కల వెలుస్తున్నాయి. కైంకర్యానికి చెందని అనేక క్రియాకలాపాలు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో అనాచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. 


Saturday 27 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (214)



ఆలయ పూజా విధానంలో నేడు రకరకాల మార్పులు చేస్తున్నారు. పవర్ హౌస్ నుండి విద్యుత్తు ఎట్లా అన్ని చోట్లకు సరఫరా అవుతుందో అంతటా వ్యాపించిన వానిని ఒక చోట కేంద్రీకరించగా అవి ఆలయాలయ్యాయి. ఆగమాల ప్రకారంగానే పూజలు జరగాలి. చేతులున్నాయని ప్రతివాడు విద్యుత్ పరికరాలను ముట్టుకుంటే ఎలా? అట్లాగే మన పరిమిత బుద్ధులనుపయోగించి మార్పులు చేసినా దుష్ఫలితమే మిగిలేది.


కొందరేమంటారంటే ఆలయంలో అర్చకుడు సరిగా లేడంటారు. అయినా ఆలయ పవిత్రతకు భంగం లేని రీతిలో మనమెందుకు నియమాలను మార్చకూడదని ప్రశ్నిస్తారు. వీళ్ల వల్ల స్వామియే గెంటివేయబడుతున్నాడు. ఆచారం కొంతలేకపోయినా ఆలయం వెంటనే పవిత్రతను కోల్పోదు. కాని ప్రతివాడు, కలుగచేసికొని అనాచారాన్ని వ్యాప్తి చేస్తే నష్టబోయేది మనమే. భగవంతునికి నష్టం లేదు. కనుక ఆగమాస్త్రాలు విధించని వాటిని క్రొత్తగా ప్రవేశపెట్టవద్దు. మనం అందరం ఆచారాలకు కట్టుబడి భక్తిశ్రద్ధలతో ఆలయాలకు వెడుతూ ఉంటే మనలను చూసైనా పూజారి తన దోషాలను సరిదిద్దుకొంటాడు.


రాజకీయ నాయకులు చీటికీ మాటికీ మత విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. మనం క్రొత్తగా ప్రవేశపెట్టేది స్థిరంగా ఉంటుందని చెప్పగలమా! నదులు పొంగిపొర్లేటప్పుడు ఒడ్లకు కొంత చేటువస్తుంది. అది వర్షకాలంలో సహజం. దానికై చింతించనవసరం లేదు.


క్రొత్త క్రొత్తగా వచ్చే తిరుగుబాటు భావాలు కలవారిని ఒప్పించవచ్చు. సంఘ సంస్కర్తలు ప్రాచీన శాస్త్రాలను చదవరు. అందువల్ల కొన్ని సందర్భాలలో కోపోద్రిక్తులౌతారు. వారిని చూసినపుడు కోపగించరాదు. ప్రతిపక్షాన్ని గౌరవించడమే మనవంతు. శాస్త్రీయమైన ఆచారాలను ప్రేమతో విశదీకరించాలి.


కొన్ని వందల సంవత్సరాల వెనుక రాజులచే ఇవి పోషింపబడ్డాయి. ముందు మన నడవడిక తిన్నగా ఉంటే భక్తి శ్రద్ధలుంటే ఎదురు తిరుగు భావాలు కలవారిని ఒప్పించవచ్చు.


Friday 26 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (213)

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (213)



ఆలయాలలో పూజ

ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞత చెప్పడం మనవంతు. అట్లా ధన్యవాదాలందిస్తూ ఉంటాం. ఒక గడ్డి పరకను సృష్టించలేని మనకు, కూడు, గుడ్డ, నీడనిచ్చినవానికి కృతజ్ఞత చెప్పకపోతే ఎలా? అందుకే మనం అన్నం వండుకొన్న తర్వాత అతనికి నివేదించి నైవేద్యంగా సమర్పించి భుజిస్తూ ఉంటాం. అట్లాగే వస్త్రాభరణాలను స్వామికి సమర్పిస్తున్నాం. వాటిని ధరిస్తున్నాం. అందరూ అన్నీ సమర్పించి పూజ చేయడం కుదరదు. అందువల్ల అందరికీ ఉపయోగపడే రీతిలో ఆలయాలేర్పడ్డాయి. అందరూ తమకు తోచినది అర్పించి కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తారు.


అంతటా వ్యాపించిన మహాశక్తిని, తమ మంత్ర శక్తి ద్వారా ఒక చోట కేంద్రీకరింపచేసారు ఋషులు. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసారు. అట్లా ఆలయ వ్యవస్థ ఏర్పడింది.


అందరూ ఇంట్లో తమశక్తి కొలదీ పూజచేసికొని ఆలయానికి రోజూ వెళ్లి మ్రొక్కుతూ ఉంటే ఆలయంలో జరిగే పూజా విధులు సక్రమంగా జరుగుతాయి. ఏదైనా దేవాలయానికి వెడుతున్నానని నేనంటే నా కోసమైనా ఆలయాన్ని శుభ్రంగా ఉంచుతారు, దీపాలు వెలిగిస్తారు, అలంకరిస్తారు, చక్కని నైవేద్యాలు పెడతారు.


మనం సూక్ష్మధర్మాలను విస్మరించాం. అన్న ప్రదాతకు సరియైన నివేదన ఉండాలి. విగ్రహాన్ని అలంకరించిన వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. ఇట్టి విషయాలను మనం పట్టించుకోం. మురికి బట్టలు కట్టుకొన్న వాడీ జగత్తులో ఎవడని ప్రశ్నిస్తే ఆలయంలో దేవుడే కన్పిస్తున్నాడు. అవి శుభ్రంగా ఉంటే మన మనస్సు, శుభ్రంగా ఉంటుంది. ప్రతి రోజు ఆలయ సందర్శనం చేయాలని ఎన్నో నియమాలను విధించారు పూర్వులు, శివవిష్ణు ఆరాధన చేయాలన్నారు. ఇట్లా ప్రతి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతున్నాయా లేదా అని చూడడం మన అందరి వంతు.


Thursday 25 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (212)

అంటే ఏం జరిగింది? ఆకారంలేని, గుణాలు లేని, అనంతమైన దానిని గుణాలున్నట్లుగా భావిస్తున్నాం. నిర్గుణుడైన పరమాత్మనుండే అన్ని రూపాలూ వచ్చాయి. ఒక్కొక్క గుణానికి ఒకొక్క రూపాన్ని పెట్టి ఒక్కొక్క దేవతగా ఆరాధిస్తున్నాం. మనకర్థమయ్యే రీతిలో, మనస్థాయికి తగ్గట్లుగా ఆ పరమాత్మ తత్వం అవతరిస్తే దానిని స్వీకరిస్తున్నాం, పూజిస్తున్నాం.


మనమే రూపంలో ధ్యానించినా అతడు దయను చూపిస్తాడు. మనస్థాయిని క్రమక్రమంగా పెంచుతాడు.


చిట్ట చివర దశలో మనస్సు దాటిన స్థితిని మనస్సునకు అనుగ్రహిస్తాడు. అనగా సంకల్ప వికల్పాలు లేని స్థితిని ప్రసాదిస్తాడన్న మాట. అట్టి నిర్వికల్ప స్థితిలో పరమాత్మను నిర్వికారునిగా, నిద్క్రియునిగా, నిర్వికల్పునిగా భావించగలం. మొదటి మెట్టులో మనముండగా అతడు అతీతుడని భావిస్తాం. అందుకై అతనికి కల్యాణ గుణాలున్నట్లు, ఒక ఆకారం ఉన్నట్లు భావిస్తాం. మన మనస్సు పరిపక్వమైన కొలదీ అతని అతీత స్థితిని అర్థం చేసికొనగలం. మనస్సుకి ఏ పని లేనపుడు పచ్చని పండు పచ్చగానే కన్పడినట్లు, మనస్సు అణగినపుడు, పరమాత్మను, పరమాత్మగానే దర్శిస్తాం. మంత్ర పఠనంలో, ఆచారాలలో, పూజావిధానంలో అనేక నియమాలుంటాయి. పరమాత్మను ఒక విధంగా ఊహించుకొని పూజించినపుడంతే. ఆ ఊహ అణగిన వానికి నియమము లేదు, క్రియ కూడ లేదు. పూజ, మనస్సుతో, క్రియతో సాగుతుంది కదా! కాని మనస్సు పరిపక్వమైనపుడు జ్ఞానమే ప్రకాశిస్తుంది. పూజాదులు లేవు. ఇట్టి జ్ఞానము మనకు మొదటి దశలోనే కల్గిందని భ్రాంతి పడకూడదు. జ్ఞాన సంపాదనకై పూజను అంగంగా భావిస్తారు. మన ఊహలకు తగ్గట్లు విగ్రహాలున్నాయని భావించవద్దు. ఋషులకు ఫలానా మూర్తులని, ఫలానా మంత్రాలని, ఫలానా నియమాలని పరమాత్మయే ముందు నిర్దేశించాడు. పరమాత్మయే మూర్తి, యంత్ర, మంత్ర, తంత్ర రూపంగా అవతరించాడని భావించి ఆ మార్గం గుండా భక్తితో, అంకిత భావంతో పయనించగా పయనించగా కృపావర్షం కురిపిస్తాడు. జ్ఞానోదయం కల్గుతుంది. 


జ్ఞానం రానీ, రాకపోనీ, పూజచేస్తున్నామంటే ప్రేమతో సాగాలి. ఈ ప్రేమ, భక్తి మనకు అనంత తృప్తిని ప్రసాదిస్తాయి. దీనివల్ల అతని ప్రేమను పొందగలం, అదే గొప్ప అనందం. ఆపైన ఆతడద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో లేదో అతని ఇష్టం. అది రాలేదని బాధపడనవసరం లేదు. భక్తి అనుగ్రహం చాలు.   


Wednesday 24 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (211)



విగ్రహారాధన - జ్ఞానము


ఒక అరటి పళ్ల అత్తాన్ని నా ముందుంచారు. ఇది పసుపు పచ్చగా ఉందని నేనంటే అవునని మీరు అంటారు. ఇందుకు సందేహం లేదు. ఇది ఎరుపుగా ఉందనిఒక పండును చూపిస్తూ అన్నాననుకోండి. ఎర్రగా ఉండంటారేమిటని ప్రశ్నిస్తారు. కాదని అంటారు వెంటనే. నేను దీని రంగు ఫలానా అని చెప్పకుండా ఈ అరటిపండు ఎర్రగా ఉందని కాసేపు ఊహించండని అన్నాననుకోండి. నేనన్నది కాదన్నా ఎర్రదానిగా ఉన్నట్లు ఊహిస్తారు. మనస్సును సమాధానపరచుకొంటే అట్లా భావించవచ్చు.


పూజకూడా అట్టిదే. ఉపాసనా మార్గాలు అనేకం ఉన్నాయి. పరమేశ్వరుడిట్లా ఉంటాడని, ఈ గుణాలతో ఉంటాడని భావించండని ఈ ప్రతిమలను దేవతలని భావించండని అంటారు. అట్లాగే అరటిపండు పసుపే. పరమాత్మ స్వభావమట్టిదే. అతడు నిర్గుణుడని అంటే ధ్యానం చేయడం సామాన్యులకు అలవికాని పని. మనకెందుకులే, మనకు చిక్కదులే అని నిరాదరణ చూపిస్తారు. అరటిపండు ఎర్రగా ఉందని చెప్పినపుడు మాత్రం, పరమాత్మ ఈ విగ్రహంలో ఉన్నాడనిపుడు ముందుగా మనసు కాదంటుంది. కనబడేది రాయికదా! దేవుడంటారేమిటని శంకిస్తారు. కాని దీనిని పరమాత్మగా భావించండని అనినపుడు, పచ్చని పండుసు ఎర్రగా ఉందని భావించండని అనినట్లు భావించడం మొదలుపెడతారు. ఏది ఎరుపో మనస్సు గుర్తించగలదు. కాని పరమాత్మ స్వభావం మనకు అర్థం కాదు. కనుక వ్రిగహాన్ని విగ్రహంగానే చూస్తే దాని మీద మనస్సు లగ్నం కాదు. తెలిసిన వాటితో మనస్సు బంధింపబడి ఉంటుంది. ఆ విగ్రహం స్త్రీ మూర్తిగా అందంగా మలచబడగా అమ్మవారిట్లా వచ్చిందని ఊహించండని అంటే మనస్సు అంగీకరిస్తుంది లగ్నమౌతుంది కూడా.


Tuesday 23 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (210)



ఈ సందర్భంలో నీలకంఠుల శ్లోక తాత్పర్యం వినండి.


పెరియపురాణంలో ఒక కథలో స్వామి, ఒక కూలి వానిగా వచ్చి ఒక మధుర పదార్థం తినడానికి నెత్తిమీద గంప పెట్టుకొని మట్టిని మోసే సందర్భమది. ఈ కూలీ సరిగా పనిచేయడం లేదని ఆనాటి పాండ్య రాజు ఒక కొరడా దెబ్బవేస్తాడు. ఆ దెబ్బ అందరికీ తగిలింది. కొట్టిన రాజునకు కూడా. అందువల్ల స్వామి, అన్ని ప్రాణులలోనూ ఉన్నట్లే కదా! అపుడు కవి ఇట్లా చమత్కరించాడు. దెబ్బ తినేటపుడు నీవు శివాద్వైతాన్ని చూపించావయ్యా! (అందరూ ఒకటే అన్ని). కాని మధుర పదార్ధం తినేటపుడు నీవొక్కడివే తిన్నావు ఆ తింటున్నపుడు, అందరూ తింటున్నట్లు చేయలేక పోయావు. ఇట్లా ఉండడం బాగుందా అని ప్రశ్నించాడు.


దీని నుండి బ్రహ్మముగా ఆంతరంగా ఉన్నా ఈశ్వరునిగా ప్రకటింపబడుతూ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడని తేలింది. అతనివి పంచకృత్యాలు, సృష్టి స్థితి, సంహారములు. ఇవి భ్రాంతితో కూడిన ప్రపంచానికి సంబంధించినవి. మిగిలినవి రెండున్నాయి. మాయ చేసే కృత్యం తిరోధానం. ఈ మాయ నుండి విడుదల చేయడం అనుగ్రహం. అద్వైత స్థితిని చేరుకోవడానికి ఇట్టి అనుగ్రహమే లభిస్తుంది. ఆ అనుగ్రహం కోసమే తపశ్చర్య. అట్లా చేయాలని అనిపించడమూ అతని అనుగ్రహమే. అట్టి నమ్మకంతో, ప్రేమతో కొలవడమే భక్తి.


Monday 22 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (209)



శివుని దక్షిణామూర్తి స్వరూపము, బ్రహ్మమును తెలుపుతుంది. ఆ దశలో అతనికి క్రియలేదు. అది కేవలమూ నిశ్శబ్దము. పరమశివుడెన్నెన్ని పనులు చేయడం లేదు? చిదంబరంలో నృత్యం చేస్తూ ఉంటాడు. దారుకావనంలో భిక్షాటన మూర్తిగా ఉంటాడు. అందరినీ ఆకర్షిస్తాడు. దక్షయజ్ఞంలో సూర్యుని దంతాలనే ఊడగొట్టాడు.


లోలోపల అణగియుండి, నిర్వికారుడై బాహ్యంగా అనేక కృత్యాలు నిర్వహిస్తూ ఉన్నట్లుగా కనబడతాడు.


ప్రపంచమనే సరస్సులో సాధారణ జనులీదుతూ ఉంటారు. జ్ఞానులందులకు విరుద్ధము. తీరాన్ని దాటి యుంటారు. ఈ ఇద్దరి మధ్య ఒడ్డు. సరస్సులో మునిగిన వానికి బాహ్య తీరాలు కనబడవు. జ్ఞాని, ఈ సరస్సును చూడడు. భగవానుడు ఒడ్డు వంటివాడు. సరస్సును చూస్తాడు, అవతలి తీరాన్ని చూస్తాడు. ప్రపంచం, విలయమయిందని భావించే జ్ఞానినీ చూస్తాడు. సరస్సులో మునిగితేలే వానిని చూస్తాడు. ఆ జ్ఞానిని పిలిచి సరస్సులో మునిగే వానిని ఉద్దరించుమని చెబుతాడు. ఒడ్డునకు చేర్చుమని ఆదేశిస్తాడు.


తానన్నిటా వ్యాపించానని భగవానునికి తెలుసు. అయినా తనకంటే భిన్నుడని భావించే సామాన్యులకు భిన్నంగానే ఉన్నట్లు తోపింప చేస్తాడు. అది ఒక వినోదం. 


Sunday 21 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (208)

ఈశ్వరుడు


జ్ఞాని, స్వస్వరూపానికి మించిన దానిని చూడడు. అనగా స్వస్వరూపాను సంధానమే చేస్తాడు. ఒకే ఒక పరమాత్మ, అనేక రూపాలుగా కన్పిస్తాడని భావిస్తాడు. బాహ్యకారాలు కనబడుటకు మాయ కారణమని, పరమాత్మ అన్నిటిలో ఉన్నాడని భావిస్తాడు. మాయా ప్రపంచంలో జ్ఞాని చేయవలసినది ఏదీ లేదు. చూచేవాడు, చూడబడేది, చూచేది, అన్నీ ఒకటైనపుడు పని ఏముంటుంది? బ్రహ్మముగానే అట్టి వాడుండి పోతాడని ఉపనిషత్తు చెప్పింది.


బ్రహ్మమునకు పని లేదు. మాయా ప్రపంచంలో చిక్కుకొని ఈశ్వరుని పూజిస్తూ తాము చేసే పనులలో సహకరించుమని భక్తులు ప్రార్ధిస్తూ ఉంటారు. మంచి పనుల కోసం తోడ్పాటు కావాలని చిత్తశుద్ధితో ప్రార్థించినప్పుడు అవి జరిగేటట్లు స్వామి అనుగ్రహిస్తాడు. ఇట్లా చూసినపుడు, పనులు లేకుండా బ్రహ్మము లేదని భావించలేం. మనం ప్రార్ధించినా, ఫ్రార్ధించకపోయినా జగన్నిర్వహణను కొనసాగిస్తూనే ఉంటాడు. అందరిని పోషిస్తూ, పాలిస్తూ ఉంటాడు. కనుక అట్టి పెద్ద పని, అతనికుంది.


అయితే పనిలేని బ్రహ్మమొకడు, పనియున్న బ్రహ్మ ఒకడూ ఉంటారా అని సందేహం. ఇద్దరూ భిన్నులు కారు. జ్ఞాని కొలిచే బ్రహ్మమే (నిరాకారమే) ఈశ్వరునిగా జగన్నిర్వాహకునిగా ఉంటాడు.


Saturday 20 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (207)



అతడన్నింటికి అతీతుడైనా భక్తులతడున్నాడని అనుభవంలో తెలిసికొంటారు. వారి ఇంద్రియాల ద్వారా కూడా తెలిసికోగలరు, మాట్లాడగలరు, చూడగలరు కూడా. తాను లేనని వాదించేవానికి తానున్నానని వచ్చి ఋజువు చేయడు. ఒక రూపం ధరించి యున్నానని చూడండని చాటింపు వేయడు. కాని భక్తునకు, రూపం లేని వాడు తానైనా రూపం ధరించి సాక్షాత్కరిస్తాడు. తీగలో ఉన్న విద్యుత్తు కంటికి కన్పిస్తోందా? అది ఒక బల్బుకు అనుసంధానం చేసినప్పుడు, ఆ బల్బులో ఫిలమెంటు (సన్నని తీగ) ఉంటే స్విచ్ వేసిన వానికి స్వచ్ఛమైన వెలుగు కనబడడం లేదా? అట్లాగే భక్తి యనే ఫిలమెంటు ఉంటే శ్రద్ధయనే బల్బు, స్విచ్చి ఉండగా ఆకారంలేని భగవంతుడనే విద్యుత్తు, కాంతి రూపంలో గోచరిస్తుంది. అట్లాగే భగవానుడు కూడా దివ్య మంగల స్వరూపునిగా గోచరిస్తాడు, సూర్యతాపం వల్ల సముద్రంలోని నీరు అవిరిగా మారుతోంది. ఆవిరి కంటికి కన్పిస్తోందా? అది చల్లబడి మేఘంగా మారినపుడు వర్షం ఆ వస్తోంది. ఆ నీరు ఇంకా చల్లబడితే మంచుగడ్డలు. అట్లాగే మన హృదయం లేదా మనస్సు, ఎంత చల్లబడితే ధ్యానం చేయగలిగితే, ఆకారం లేని పరమాత్మ ఆకారం ధరించి సాక్షాత్కరిస్తాడు.


ఈ ధ్యానము నిరంతరం సాగినపుడు, అన్ని కోరికలు విడిచినపుడు, తీవ్రమైన భక్తియున్నపుడు భగవదనుభవం కల్గుతుంది. ఎవరికైనా అట్టి భక్తి, జ్ఞానము కలిగితే మిగతా వారికి ఏమిటి లాభమని ప్రశ్నిస్తారు. కాని అట్టి వారిని ఒక్కమారు దర్శించినా ఏవో బాధలు పోయినట్లు, శాంతి లభించినట్లుంటుంది. కారణమేమనగా భగవదనుభూతిని సంపూర్ణంగా పొందారు కనుకనే. శాంతికంటే కావలసినది ఏముంది? అట్టి శాంతి ప్రదాతలే జ్ఞానులూ, భక్తులూ.

Friday 19 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (206)



ఆకారంతో -ఆకారం లేకుండా


పువ్వు యొక్క వాసన, కన్ను గ్రహించలేదు. ముక్కుమాత్రమే గ్రహిస్తుంది. చెఱుకుగడ తీపి ముక్కునకు తెలియదు. నాల్కకే తెలుసు. సంగీతాన్ని నాల్క రుచి చూడలేదు. కేవలం చెవి మాత్రమే. చలి, వేడిని తెలుసుకొనేది చర్మం మాత్రమే. చెవులకు తెలియదు, పై నాల్గు కన్నులకు తెలియదు. కాని రంగులు చెవులకు, ముక్కు, నోరు, చర్మానికి తెలియవు. ఒక్కొక్క దానిన ఒక్కొక్క ఇంద్రియమే గ్రహిస్తుందని, అన్ని ఇంద్రియాలు అన్నిటిని గ్రహించలేవని చివరకు నాస్తికుడు కూడా అంగీకరిస్తాడు. నాల్గు ఇంద్రియాల ద్వారా వస్తువులను తెలిసికొనలేకపోయినా ఒక్క ఇంద్రియం ద్వారానైనా ఒకదాని ఉనికిని తెలిసికొంటాడు. చెవుల ద్వారా సంగీతాన్ని తెలిసికొంటున్నాం. దీనితో రుచి చూడడం, వాసన చూడడం, స్పృశించడం కుదరకపోయినా సంగీతం లేదని ఎవ్వడూ అనడు.


ఐదు ఇంద్రియాలకు అందనిది ఒకటుందని ఒక్క మాటు ఆలోచించి చూడండి. శాస్త్రజ్ఞులు, విద్యుదయస్కాంత తరంగాలున్నాయని అంటున్నారు. ఇవి విశ్వం అంతటా వ్యాపించాయని నిర్ధారించారు. కాని ఇవి ఇంద్రియగోచరాలు కావు. ఇవి విశ్వంలోనే కాదు, మన శరీరంలో మెదడులోనూ వ్యాపించాయంటే నమ్ముతున్నాం. అట్లాగే ఒక సమష్టి మనస్సు (Cosmic Mind) గొప్పదైన బుద్ధి అనగా మహత్తు ఈ ఇంద్రియాలను, వస్తువులను నిర్మించి, ఒక క్రమ పద్ధతిలో ఉంచింది. దానినే భగవానుడంటున్నాం. అది విద్యుత్తు మాదిరిగా సర్వత్ర వ్యాపించింది. అది లోపలా ఉంది. దాని నుండి ఇంద్రియాలు వెలువడి విషయాలను గ్రహిస్తున్నాయి. అదే కార్య నిర్వహణ చేస్తూ ఉంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. ఈ నియమాన్ని పరాశక్తి ఏర్పరచింది. ఇట్లా పరాశక్తి తన ఆధీనంలో వీటి నుంచింది. కానీ, ఈ ఇంద్రియాలకు లోబడి ఆ శక్తి పని చేయడం లేదు. ఇవి ఆ శక్తిని నియమించలేవు. అందువల్లనే ఆ పరాశక్తిని చూడలేకపోతున్నాం. కనబడడం లేదు కనుక ఆ పరాశక్తియే లేదని కొట్టి పారవేస్తూ ఉంటాం.


Thursday 18 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (205)



ఈ విషయం ప్రక్కన ఉంచుదాం. ప్రాథమిక దశలో కర్మను చేసే వాణ్ణి ప్రేమిస్తాడా? పూజచేసే వాణ్ణి భగవానుడు ప్రేమిస్తాడా? ఈ ప్రశ్న వేయండి. ఒక ధనవంతుని దగ్గర ఇద్దరు సేవకులున్నారు. ఒక సేవకుడు పనులు చేయకుండా యజమానిని స్తోత్రం చేస్తూ ఉంటాడు. మరొకడు యజమాని చూస్తున్నాడా? లేదా అనే భావన లేకుండా తనకప్పగించిన పనిని చేసికొని పోతూ ఉంటాడు. యజమాని మూర్ఖుడైతే స్తోత్రం చేసేవాణ్ణి మెచ్చుకొంటాడు. అతడు తెలివైన వాడైతే తన కప్పగించిన పనులు చేసేవాణ్ణి మెచ్చుకొంటాడు. అయితే భగవానుడు మూర్ఖుడైన యజమాని కాదు. కేవలం భజనలు చేసేవాణ్ణే చేరదీస్తాడని భావించకండి. కర్మ చేసేవాణ్ణి ఆదరిస్తాడు. అయితే భక్తిలేని శుష్క కర్మ చేసేవాడు, అతని ప్రీతికి పాత్రుడు కాలేడు. ఈ కర్మ చేసే వానికీ పూర్తి తృప్తి కలగదు.


చేసే పని సక్రమంగా ఉండాలి. ఈ విశ్వం భగవానునిచే సృష్టింపబడింది. అందరూ అతని సేవకులే. అందరికీ ఆయన ప్రభువే. అంతేకాదు బ్రహ్మాండాలలో ఉన్న జీవులు ఏకోదరులవంటివారు. అతడు ప్రభువే కాకుండా మన తల్లి, తండ్రి కూడా. కనుక అందరూ అతని సంతానమే. వేదధర్మం ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని విధించింది. దానికి తగ్గట్లు మన పని మనం నిర్వహిద్దాం. పరస్పరం ప్రేమతో, ఐకమత్యంతో ఉందాం. చేయవలసిన వాటిని కర్తవ్యంగా భావిద్దాం. ప్రపంచ కుటుంబానికి ఎట్టి విఘాతం లేకుండా ప్రవర్తిద్దాం. అట్టి భావనతో మనం ఉండగలిగితే పరమేశ్వరుని పట్ల భక్తి కల్గుతుంది. ప్రేమతో, భక్తితో కర్మ, మిళితమైతే అతని దయకు పాత్రులమౌతాము. ఆ స్థాయి వచ్చేవరకూ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో కొనసాగించాలి. ఆ స్థితికి చేరుకొన్న తరువాత ఇక విడిగా పూజ, భజనలలో మునగవచ్చు.


Wednesday 17 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (204)



కర్మ - భక్తులు


ఆదిశంకరులు, కొద్ది క్షణాలలో ముక్తిని పొందుతారని తెలియగా, కొంతమంది శిష్యులు వారిని సమీపించి ఆచార్యా మీరెన్నో శాస్త్ర విషయాలను విశదీకరించారు. కాని మేము సులభంగా, సూటిగా ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశించందని శిష్యులు ప్రార్ధించారు. ఐదు శ్లోకాలలో వారు దానిని వివరించారు.


దీనినే సోపాన పంచకమని అంటారు. వేదంలో చెప్పిన కర్మలను అనుష్టించండి, వాటిని ఈశ్వర పూజగా భావించి ఆచరించండి. కోరికల వలలో బడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా మీమీ ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తే ప్రపంచానికి మంచి కల్గుతుందని ఉపదేశించారు.


ఇప్పటికే వేదంలో చెప్పబడిన వాటిని తు చ. తప్పక పాటించే వారున్నారు. ఇక చాలా మంది పూజ, ఉత్సవాలు, భజనలు చేస్తున్నారు. ఎవరైనా కర్మానుష్ఠానం చేస్తే పాటించాలి అని గేలి చేసేవారూ ఉన్నారు. వీళ్లు చేసే పనులలో శ్రద్ధలేదు, గంటలు వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, భజనలు చేస్తే సరిపోతుందా అని కర్మానుష్ఠానపరులు భక్తులనుద్దేశించి గేలిచేస్తూ ఉంటారు. 


సోపాన పంచకంలో కర్మను, ఈశ్వర ప్రీతికోసం చేయాలన్నారు. కర్మ చేయాలి, ఈశ్వరుణ్ణి మరువకూడదని సారాంశం. ఈశ్వరార్పణ బుద్ధియనుట ప్రధానం. ఇది ఉత్తమ తరగతికి చెందింది. సంగ రహితమైన కర్మానుష్ఠానం సామాన్యులకు సాధ్యం కాదు. కర్మ ఫలాలను విడిచిపెట్టి కర్మ చేస్తే అదే కర్మయోగం. సామాన్యులు పనులు చేస్తూ ఉన్నపుడు భగవానుని స్మరించడం తక్కువగా ఉంటుంది. అందువల్ల కర్మ విడిగా, భక్తి విడిగా నని తలుస్తూ ఉంటారు. పోనీ, అట్లా అవి విడిగా ఉన్నాయని భావించినా కొంత కాలానికి ఈశ్వరార్పణ బుద్ధి ఏర్పడుతుంది. లేదా పూజ చేయడమే కర్మగా మారవచ్చు లేదా కర్మ, పూజ మాని వేసి, చివరగా బ్రహ్మానందాన్ని అనుభవించే దశ వస్తుంది.


Tuesday 16 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (203)



మన దేహ, మానసిక శక్తులనుపయోగించి ఒక ఇంటిని కట్టాం. తన కున్న శక్తితో పిచ్చుక గూడు కట్టింది. అట్టి అనంతశక్తులనుపయోగించే స్వామి, ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఒక ప్రాణికి, మరొక ప్రాణికి శక్తులలో తేడాలున్నాయి. చిట్టచివరకు వెడితే అనంతశక్తి కలవాడొకడున్నాడని ఊహిస్తాం.


ప్రకృతిలో విరుద్ధమైన జంటలుంటాయి. చలి-ఎండ; రాత్రి-పగలు; మెత్తనిపువ్వులు - గ్రుచ్చుకొనే ముళ్లు; తీపి-చేదు; ప్రేమ-పగ; ఇట్లా పరస్పర విరుద్ధంగా ప్రకృతి సాగుతోంది. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మన మనస్సునకు విరుద్ధమైనది ఒకటుండవద్దా? మానవ మనస్సు ఏం చేస్తోంది! పిచ్చి పనులు చేసి దుఃఖపడుతోంది. తృప్తిలేదు. అసత్కార్యాలకు భిన్నంగా శాంతంగా, దుఃఖాతీతంగా, సుఖశాంతులతో కూడిన తత్వం ఒకటి ఉండాలి. అతడే స్వామి.


ప్రకృతిలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. క్షణక్షణమూ జరుగుతుంది. సముద్రాలు, పర్వతాలలో మార్పు లేదని మనం భావిస్తాం గాని వాటిలోనూ మార్పులున్నాయి. కాలానికి అన్ని లోబడవలసిందే. ఏదీ శాశ్వతంగా ఉండదు. అది దాని ధర్మం. పై జంటలున్నట్లే శాశ్వతమైనది, అవ్యయమైనది ఒకటి ఉండాలి. అదే ఈశ్వరతత్వం.


సరే అతడున్నాడని అంగీకరిద్దాం. అయితే అతణ్ణి భజించి ఏం లాభం? మన మెప్పుడూ కోరికలతో ఉంటాం. ఆయనకు కోరికలే లేవు. మనకు పరిమిత శక్తి ఉంది. కోరికలు లేకపోయినా అధిక శక్తిమంతుడతడు. 


జ్ఞానంలోనో, శక్తిలోనో గొప్ప వాడే కాదు. దయాసముద్రుడు కూడా. మనలోని అగాధాలను పూడ్చుకోవాలంటే అతని కృపావర్షం మనపై పడాలి. కోరికలు తీరాలన్నా అతడు ప్రేమామృతాన్ని వర్షించాలి. అందుకే భజన.


మనకా కోరికలు లేకపోతే మనమూ పరిపూర్ణ స్వరూపులమే. పరమాత్మ మన కోరికలను తీర్చి, ఇక కోరికలు అడుగని స్థితిని ప్రసాదిస్తాడు. మన అపూర్ణత్వాన్ని పూర్ణత్వంగా మార్చగలడు.

Monday 15 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (202)

కనుక అన్నిటిని సృష్టించిన వానికే ఇదంతా చెందుతుంది. అందువల్ల అతడు ఉడైయార్. స్వామికి అన్నీ చెందాయి కనుక అన్నిటిని అతనికి విడిచిపెడితే మన బాధలేముంటాయి? నెత్తిపై బరువుంటుందా?


నేను, నేనని తెగ బాధపడిపోతున్నాం. ఈ నేను, నేను - వాడిదే అనే భావం కలిగినపుడు బాధలెక్కడ ఉంటాయి? ప్రేమ, ద్వేషాలకు తావులేదని గ్రహించినపుడు బాధలులేవు. అఖండ శాంతి. భగవానుని స్వామియని ఎప్పుడైతే సంబోధిస్తున్నామో వెంటనే ఏదీ నాది కాదు, నీదే అనే భావన తొంగి చూస్తుంది. అతడన్నింటిని పంచి పెట్టడానికి అతనికే అర్హత వస్తుంది. కనుక ఇట్టి గుర్తింపు మనలో ఉన్నపుడు భక్తి రాణిస్తుంది.


ప్రకృతిలో ఈశ్వర తత్వం


ప్రకృతిలో అనేక శక్తులు వెదజల్లబడియున్నాయి. ఒకటా? రెండా? అనేకం. వీటన్నింటిని మించిన శక్తి ఒకటుంది.


మనకు దేహశక్తి యుండడం వల్ల వస్తువుల నెత్తగల్గుతున్నాం. మనకంటె ఎద్దు, అధికమైన బరువు మోస్తుంది. దానికంటే ఒంటె; దానికంటే ఏనుగు ఎక్కువ బరువును మోస్తుంది.


ఇక మానసిక శక్తిని చూడండి. చెట్టుకంటే పురుగునకు ఎక్కువ మానసిక శక్తి ఉంటుంది. దానికంటే చీమకు, దానికంటే పశువునకు, అంతకంటే మానవునకు అట్టి శక్తి అధికంగా ఉంది.


అన్ని శక్తులకు ఒకటి మూలాధారమని గుర్తిస్తాం. అతడే స్వామి. 


Sunday 14 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (201)



స్వామి అంటే


స్వామి అంటే ఎవరు? స్వం అనగా అధీనము. ఆస్తి, స్వం అనే పదానికి తెలుగులో సొమ్ము, స్వంతం అనే మాటలను కూడా వాడుతాం. అంటే మన ఆధీనంలో ఉందని. కేరళలో దేవాలయానికి చెందిన దానిని దేవస్వం అంటారు. అనగా దీని యజమాని, స్వామియైన భగవానుడే. స్వామిని తమిళంలో ఉడైయార్ అంటారు. ప్రాచీన కాలంలో తమిళనాడులో శాసనాలలో స్వామిని ఉడైయార్ అని చెక్కబడి యుంటుంది. ఉదా: తిరుచిత్రం బలముడైయార్, తిరువేంగడముడైయార్, తిరునాగేశ్వరముడైయార్ మొదలైనవి.

గురువు, భగవానుడూ ఒక్కరే గనుక వైష్ణవులు రామానుజులను ఉడైయార్ అని భక్తితో సంబోధిస్తారు.

స్వామి అంటే ఆస్తి కలవాడని, ఏమిటా ఆస్తి? సమస్త ప్రపంచమూ. మనమందులో ఉన్నాము కనుక, అతని ఆస్తిలో భాగమే. అన్నీ నీవేయని తాయుమానవార్ కీర్తించాడు. కాని మనమేమంటామంటే ఇది నా ఇల్లు, ఇది నా పొలమని అంటాం. కాని అసలు యజమాని అతడే. అతడే కనుక లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అందు మనమూ ఉన్నాము, మనకు ఆస్తిహక్కు ఉండదు.

మనమొక ఇంటినో, వస్తువునో తయారు చేస్తాం. శాస్త్రజ్ఞులు క్రొత్త క్రొత్త యంత్రాలను తయారుచేస్తారు. ఎవరేది చేసినా ప్రపంచంలోని వస్తువులను ఆధారం చేసికొనే కదా! ఆ వస్తువుల నిర్మాత, భగవానుడే. మనమతని ఆస్తిని గ్రహించి క్రొత్త క్రొత్త రూపాల్ని చూపిస్తున్నాం. ఇంతకంటే మనం చేసేదేమీ లేదు. ఈ పంచభూతాలను సృష్టించండి, పోనీ, అణువులను నిర్మించండని ఎవరైనా అడిగితే చేయగలమా? మహామహా శాస్త్రజ్ఞుడే చేయలేదు కదా శాస్త్రజ్ఞులొక ఆకును సృష్టించగలరా?

Saturday 13 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (200)



మనిషే సమర్థుడని అతడన్ని పనులు చేయగలడని భావిస్తాం. మనమెట్లా ఈ ప్రపంచంలో ఉన్నామో అట్లాగే ఒక జంతువు అడవి నుండి నగరానికి వచ్చి వింతగా చూస్తోంది. ఇట్లా ఉందేమిటని అదీ ఆశ్చర్య పడుతోంది. అట్లా దానినుంచడానికి మనవంటి సమర్థుడొకడుండాలి. 


గులాబీ పువ్వుల క్రమ వికాసానికి ఏ ధర్మం పనిచేస్తోందో అచలంగా పర్వతాలుండడానికి, గ్రహగతులకూ ఏదో ఒక ధర్మం ఉండనే ఉంది. ప్రపంచం అంతా కార్య కారణ సంబంధంతో ఉంది. విడిగా ఉన్నట్లు కనబడినా బంధించే ఒక సూత్రముంది. ప్రకృతి తన నియమం తప్పకుండా ఉండడానికి ఏదో ఒక మహత్తరమైన బుద్ధి ఉండాలి. బుద్ధిలేకుండా ఏ పని, ఎవ్వడూ చేయడు.


తాను సమర్థుడనని మానవుడు భావించినట్లుగానే మన కంటే పెద్ద సమర్థుడుందాలని, ఒక దయామూర్తి ఉండాలని భావించడంలో తప్పేముంది? సృష్టించడాన్ని, పాలించడాన్ని యాంత్రికంగా నిర్వహిస్తున్నాడా? దయతో నిర్వహిస్తున్నాడు. అతడిచ్చిన శక్తి సామర్థ్యాలతో అట్టి అనంత శక్తిమంతుని ప్రార్ధించడం సబబుగా ఉండదా?


అతడే భగవానుడు, మనకున్న శక్తి నిచ్చువాడతడే. అడుగు జాడలను బట్టుకొని దొంగను వెదకునట్లుగా ఈ కనబడే ప్రకృతిని చూసి దీని కారకుణ్ణి అన్వేషించగలగాలి. మనం అడుగులు వేయడానికి గల శక్తినీ అతడిచ్చాడు. అట్టి మనకున్న శక్తియే ఒక అడుగువేయుట.


అరచేతిని చూడండి. పుట్టినప్పటినుండి గిట్టేవరకు గీతలుంటాయి. అతడు గీసినట్లు మనం గీయగలమా? ఒక ఆకునకు ఎన్ని ఈనెలుంటాయో! అవీ ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. అందరి శక్తియుక్తులకు మించిన శక్తితో ఎంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాడు. ఆ గొప్ప దొంగ మనకు తెలియకుండా ఎన్నో పనులు చేసాడు. ఆ గజదొంగ, కనబడడు. ఒక గుహలో దాగియుంటాడని వేదాలు కీర్తిస్తున్నాయి. అదే హృదయగుహ, మనలో దాగియుండి మనకు తెలియకుండా ఎన్నో వింత పనులు చేస్తున్నాడు. ఎవరని తహతహయే భక్తి, తేరిపార చూస్తాం, వెదుకుతాం, కాని కనబడడు.


Friday 12 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (199)



భక్తి


భగవానుడు


మనమేదైనా ఒక ఇంటిని చూస్తే ఎవరో ఒకరు కట్టారని భావిస్తాం. ఒక బండిని చూస్తే తయారు చేసిన మనిషి గుర్తుకు వస్తాడు. నిర్మాణానికి ఒక లక్ష్యముంటుంది. దీని వెనుక ఒక ఆలోచన, బుద్ధి ఉంటుందని అనుకొంటాం కదా! ఒక వరుసలో కొన్ని వస్తువులను పెట్టగా ఈ క్రమానికి ఒక కారకుడుంటాడు.


ఈ విశ్వాన్ని తిలకించినపుడు ఒక పద్ధతిలో నిర్మించిన వాడొకడుండాలని ఊహిస్తాం కదా! మనకుపయోగించే వస్తువులు, ఉపకరణాలను ఏర్పాటు చేసిన వానికి ఎంతో తెలివి, శక్తి ఉండాలని భావిస్తాం.


ఈ ఇల్లు ఎవరు కట్టారంటే చటుక్కున ఫలానా వ్యక్తి పేరు చెబుతాం. ఈ అరటి చెట్టు ఎట్లా తయారయిందని అడిగితే ఆ నిర్మాతను గురించి చెప్పలేం. అయినా ఎవడో తయారు చేసియుండాలి. ఒక్కొక్క పొర మీద ఒక్కొక్క పొరతో ఉంటుంది. అందమైన డొప్పలెట్లా వచ్చాయి? ఏ సాధనం వల్ల ఇట్లా ఉన్నాయి! అట్లాగే ఈ నదీ నదాలు, పర్వతాలను చూసినపుడు వీటికి సృష్టికర్త ఎవరని ప్రశ్నిస్తే చూపించలేము కదా!


ఇవి ఏనాటి నుండో ఉన్నాయి, సృష్టికర్త గురించి అడుగుతారేమిటని తిరిగి ప్రశ్నించవచ్చు. అయితే ఇప్పుడే వికసించిన ఈ గులాబీకి ఎవరు కర్త? నిన్నటి వరకూ మొగ్గగా ఉంది. దీనిలో అనేక దళాలు, సుగంధం పుట్టుకు వచ్చాయి. మన కళ్ల ముందే వికసించింది కదా! అని అడిగితే దీనిని నిర్మించిన వానిని చూపించలేము.


Thursday 11 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (198)



సంస్కృతం – తమిళం


ప్రాచీనమైన తొల్ కాప్పియం రచనా కాలం నుండి పూర్వులైన తమిళులు సంస్కృత వాఙ్మయాన్ని ధారాళంగా వాడుకున్నారు. ఏదైనా కొత్త పదం యొక్క అవసరం వచ్చినపుడు కృత్రిమంగా దానిని సృష్టించకుండా సంస్కృతం నుండే గ్రహించేవారు. సంస్కృతాన్ని అందరి భారతీయుల సౌత్తుగా పరిగణించేవారు. తమిళానికి పరాయి భాషగా సంస్కృతాన్ని లెక్కించలేదు.


తిరువళ్ళువర్ కంటే తమిళానికి సేవ చేసినవారు మరొకరు లేరు. ఇతని పద్యం రెండు వాక్యాలతో ఉంటుంది. అతడు వ్రాసిన కురల్ లో మొదట్లో ఆది, భగవాన్, ఉలగు అనే మాటలున్నాయి. ఉలగు అనగా ప్రపంచం. సంస్కృతంలోని లోకం అనే శబ్దాన్నుండే ఉలగు అనే పదం వచ్చింది. లోక మనగా మనచే చూడబడేది. ఆంగ్లంలోని Look కూడా దీనినుండి పుట్టిందే. చూసే ఇంద్రియం పేరు లోచనం, అదీ దాని నుండే వచ్చింది. వీటికి తమిళంలో పదాలు దొరకకపోవు. అయినా ఈ పదాలను వాడి అతని ఉదారభావాన్ని ప్రకటించాడు. మొదటి పద్యమే ఇట్లా ఉందని గ్రహించండి.


సంస్కృత బంధం నుండి విడివడాలని నేటి తమిళ సోదరులు మహోద్యమం చేస్తున్నారు. వారు కృత్రిమ పదాలను తయారు చేసినా వాటి మూలాలు సంస్కృతంలోనే కన్పిస్తాయి. ఉదా: సంస్కృతంలో మంత్రి అనే పదానికి అమైచ్చార్ అని తమిళంలో వ్రాసినా అది సంస్కృతంలోని అమాత్య పదం నుండే వచ్చింది.


అభిమానాన్ని నేయంగా మార్చారు. అది సంస్కృతంలోని స్నేహానికి వికృతి.


ఒకాయన ఒక ముఖ్య రాజకీయ నాయకునికి విజ్ఞాపన్ అని వ్రాసేడు. ఆయన కోప్పడి విన్నప్పంగా మార్చాలన్నాడు. విజ్ఞాపనం విన్నపమైంది. ప్రాకృతంలో దీనిని విన్నాప్పం అంటారు. మూలం ఒక్కటే.


ఇట్లా ఎన్నెన్నో ఉదాహరణలను పేర్కొనవచ్చు. తమిళ పదాలనే వాడాలని పట్టుబట్టేవారిని తప్పు పట్టడం లేదు. వారు భాషకు దోహదం చేస్తున్నమాట సత్యమే. అయ్యా మీరు చేస్తున్నది సంస్కృతానికి వికృతులను కల్పిస్తున్నారని మృదువుగా వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. వాగ్దేవిని వారిలో ద్వేష భావంతో లేకుండా చూడమని ప్రార్థిద్దాం. అట్లే వ్యాస భారతాన్ని వ్రాసిన వినాయకుణ్ణి, తమిళ భాషకు మూలమైన గణపతిని మమ్మల్ని అందర్నీ దీవించుమని, మాలో ద్వేషాలు లేకుండా చూడమని తమిళాన్ని, సంస్కృతాన్ని సమానంగా గౌరవించునట్లు చేయుమని ప్రార్థిద్దాం. 



Wednesday 10 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (197)



మంచి మనస్సు, మాట ఇచ్చే దేవుడు


భగవానుడెన్నో రకాల ప్రాణివర్గాలను సృష్టించాడు. ఒక్క మానవునకే మాట్లాడే శక్తి ఉంది. మాట్లాడే శక్తినిచ్చేవాడు గణపయ్యయని అవ్వైయార్ కీర్తించింది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం మానవులకే ఉంది. అట్టి జ్ఞానాన్ని, మంచి మనస్సు, మంచి మార్గాన్ని ప్రసాదించేవాడూ గణపయ్యయని గట్టిగా చెప్పింది.


మన మనస్సు కరగాలన్నా, మంచి మాటలు మాట్లాడాలన్నా సన్మార్గమే అనుసరించాలి కదా. ఏది మంచి మార్గమో అవ్వైయార్ ఒక పుస్తకంలో చెప్పింది. పాలు, తేనె వంటి నాల్గింటిని నీకు అర్పిస్తామని, మూడింటిని అనగా తమిళంలోని మూడు శాఖలను ప్రసాదించుమని అడిగినట్లు లోగడ పేర్కొన్నాను.


మంచి మార్గాన్ని సద్గతి యని అంటారు. అంటే కేవలం మంచి జీవితాన్ని గడపడం కాదు. ఆ సద్గతి చివర వస్తుంది. అదే మోక్షమార్గమని అంటారు పెద్దలు.


పురుషార్థాలు ధర్మంతో మొదలిడి మోక్ష పదంతో ముగుస్తాయి. అట్టిది అవ్వైయార్ జీవితంలో స్పష్టంగా గోచరించింది. గణపతి తన తుండంతో ఈమె నెత్తి కైలాసంలో ఉంచాడు కదా!  


Tuesday 9 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (196)

 


వినాయకుడు - తమిళ భాష


సంస్కృతిలో భాషకు అధిక ప్రాధాన్యం ఉంది. భాషవల్లనే అనేక గ్రంథాలు కథలు, కవిత్వం, నీతి శాస్త్రం, జ్ఞానం మొదలైన విషయాలను చెప్పేవి వెలువడతాయి. తమిళ భాషలో గణపతికి అధిక ప్రాధాన్యం ఉందని, ఏ చిన్న మాటను వ్రాయడానికి మొదలు పెట్టినా గణపతి చిహ్నాన్ని తమిళ భాషాక్షరంతో సూచించి వ్రాస్తారని లోగడ పేర్కొన్నాను. ఇట్టి మంగలారంభం ఎక్కడా కనబడదు. అట్టి అక్షరం తమిళభాష చేసుకొన్న అదృష్టం.


తిరప్పుగళ్లో, అరుణగిరినాధుడు అనే సత్పురుషుడు, తమిళ సాహిత్యానికి వ్యాకరణానికి, సంగీత నాటకాలకు వినాయకుడే మొదలని, ఇతడు మేరు పర్వతంపై అట్టి గ్రంథాలు వ్రాసేడని పేర్కొన్నాడు. అంటే వ్యాసుని భారతానికి వ్రాయసగానిగా ఉండడానికి ముందే తమిళ సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని అందించాడని ఊహించవచ్చు.


అవ్వైయార్ ఉపదేశం లేకుండా, ఈ ప్రాంతంలో విద్యాభ్యాసమే లేదు. వినాయకుని పాదాలు పట్టుకుంటే మంచి హృదయం, మంచి మాట, మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయని ఏ శ్రమ లేకుండా ఇతణ్ణి పూజించవచ్చని అవ్వైయార్ తన పాటలలో పాడింది. ఉపవాసాలు, హఠయోగం వంటివి అక్కర్లేదని చెప్పింది. కొన్ని పువ్వులుంచినా చాలని అతడు పగడపు రంగులో ఉంటాడని, ఆ పిల్లవానికి తల్లి పోలిక యని పాడింది. కామాక్షి రంగు ఎరుపే!

Monday 8 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (195)



గణేశుని వల్ల సంస్కృతి యొక్క విస్తృతి


శైవతేవారంలో, వైష్ణవ దివ్య ప్రబంధాలలో దివ్యక్షేత్రాలు పేర్కొనబడ్డాయని చెప్పాను. అంతేకాదు, కావేరీ తీరంలో శైవ వైష్ణవ మహాత్ములతో సంబంధం లేని క్షేత్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. తమిళనాడు, దివ్యదేశంగా పేర్కొనబడింది. ఇది భక్తికి నిలయం. దానికంతటికీ కావేరీ తీరమే కారణం. ఆ కావేరిని ప్రవహింపజేసినవాడు గణపతి. ఈ దేశంలో అన్ని కళలకు దైవత్వానికి సంబంధం గట్టిగా ఉంది. దీనికంతకూ గణపతియే కారణమని మరొక్కసారి నొక్కి చెబుతున్నా.


ఎక్కువ ఆలయాలున్నవాడు


మిగతా ప్రాంతాలలో ఉన్న మొత్తం గణపతి ఆలయాలు ఒక్క తమిళనాడులో ఉన్న సంఖ్యతో సరిపోవు. మహారాష్ట్ర ప్రాంతం, గాణపత్యానికి నెలవే. అయినా తమిళనాడులో ఉన్న సంఖ్యకంటే తక్కువగానే అలయాలుంటాయి.

Sunday 7 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (194)

 

కేవలం నాస్తికులు మినహా నూటికి 99 మంది భగవంతుని పట్ల ప్రేమ కలవారే. అట్టి ప్రేమ, నిష్పలం కాదు. ఈ రాగభక్తి అన్ని దేశాలలో అన్ని కాలాలలో మంచి ఫలితాన్ని ఈయకపోదు. కాని అది ఇచ్చే ఫలం కొద్దిగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి తక్కువగా ఉన్నపుడు రాబడి కూడా దానికి తగ్గట్లే అంతంతమాత్రమే ఉంటుంది.


కాని పూజా నియమాలు, మంత్రాలు, స్తోత్రాలు, కర్మకాండ, శారీరక పవిత్రత, ఆచారాలు మొదలైనవి అన్నీ భగవంతుని పట్ల ప్రేమ ఉన్నా లేకపోయినా పనిచేస్తాయి. ఇట్లా నియమాలను పాటించడం వల్ల ఈశ్వరుని పట్ల అనురాగం వృద్ధి పొందుతోంది.


ప్రాపంచిక, ఆధ్యాత్మిక సౌభాగ్యం వృద్ధి పొందాలంటే మనస్థితి గతులను బట్టి భగవత్ ప్రేమను చూపించాలి. తీవ్రమైన అనురాగ భక్తి కలవారి పట్ల అతడు దయ చూపిస్తాడు. మిగిలిన వారు అనురాగాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. స్తోత్ర, మంత్ర పఠనాదులను ఎల్లా చేయాలో అట్టి నియమాలనూ పూర్వులందించారు.


ఇక వైధీభక్తిలో కొన్ని నియమాలు, పద్ధతులు భిన్న భిన్న దేశాలలో రకరకాలుగా ఉన్నాయి. అవి వారి మతానుసారంగా ఉంటాయి. వేదమంత్రాలను, దానిననుసరించి ఆగమ పూజకు అధిక శక్తి యుంటుందని భగవత్ నిర్దేశముంది. మంత్ర పఠనాదుల ద్వారా క్రియా కలాపానికి భారతభూమి చాలా అనుకూలమని, మంచి ఫలితం ఉంటుందని భగవానుని అభిప్రాయము. ఎట్లా ఎందుకుందని అంటే ఏమీ చెప్పలేము. స్విట్జర్లాండును చక్కని వాతావరణంతో నింపి సహారా ఎడారిని భగభగా మండేటట్లు ఎందుకు చేసాడంటే ఏం చెప్పగలం? సమాధానం చెప్పలేకపోయినా ఉన్న పరిస్థితిని అంగీకరించక తప్పదు.


ఈ భూమి కర్మభూమిగా ప్రసిద్ధం. కర్మ అంటే శాస్త్ర కర్మమని, అందువల్ల మంత్రాలుంటాయని అర్థం. అందువల్లనే ఆత్మలింగం గాని; రంగనాథ విగ్రహం కాని భారతదేశంలోనే ఉండాలని వినాయకుడు తలిచాడు. లంకకే కాదు, అన్ని దేశాలకూ ఈ దేశంలో పూజించడం వల్ల లాభమని భావించాడు. అట్టి లీలలు చూపాడు. 


ఉభయ కావేరుల మధ్యలో ముఖ్యమైన విష్ణు క్షేత్రాలున్నాయి. ప్రసిద్ధమైన శివ, విష్ణు ఆలయాలు కావేరీ తీరంలో చోళప్రాంతంలో ఉన్నాయి.

Saturday 6 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (193)



పూజలో ఒక క్రమపద్ధతి - భక్తితో పూజ


రెండు రకాల భక్తిలున్నాయి. ఒకటి వైధీభక్తి. రెండవది రాగభక్తి. శాస్త్రప్రకారం నియమ నిష్ఠలను పాటిస్తూ సాగేది వైధీభక్తి, రాగభక్తిలో భక్తుడు తన ఇష్టం వచ్చినట్లు భక్తితో కీర్తిస్తాడు.


దీనినే అనురాగ భక్తియని అంటారు. ఈనాడెట్టి నియమాలను పాటించరు కనుక తమకు రాగభక్తి ఉందని భావిస్తారు. ఇట్టిది రాగభక్తి కాదు. భగవంతుని గురించి ఊట మాదిరిగా పెల్లుబికే భక్తి కావాలి. భగవంతునకు సంపూర్ణ శరణాగతిని చూపించాలి. అన్ని బంధాలను త్రెంచుకొని, భగవంతుని పట్లనే కాదు, సమస్త జీవులపట్ల ప్రేమను చూపించగలగాలి.


శాస్త్ర ప్రకారం వైధీభక్తి కూడా ప్రేమతో కూడినదే. ఏదో యాంత్రికంగా సాగేది కాదు. కాని శాస్త్ర నియమాలను పాటించాలి. అందు ప్రధానంగా ప్రేమ ఉండాలి. ముందు ఆత్మ పూజ చేసుకుని తర్వాత విగ్రహాన్ని పూజించాలి. ఆత్మపూజ అంటే ఏమిటి? పూజ చేసేవాని శరీరమే దేవాలయం, పూజ చేసేవాడు పూజించే భగవంతుడు వాడిన పుష్పాలను తీసివేసి కొత్త పుష్పాలతో పూజ చేయునట్లుగా అజ్ఞానమనే నిర్మల్యాన్ని తీసివేయాలి. అట్లాగే తాను పూజచేసేవాడినని పూజింపబడే వేరని అనే భేదభావనను తీసి వేయగలగాలి. పైవాడే నేను అనే సో హం భావనతో సాగాలి: 


దేహోదేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః

త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సో హంభావేన పూజయేత్


అతడే మనమౌతూ ఉండగా అతనిపట్ల ప్రేమరహితంగా ఉండగలమా? చాలామందితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం. అట్లాగే మనకు మనమే దగ్గరగా ఉండమా?

ఈ శ్లోకం చదువుతూ ఉన్నపుడు ఆ తక్కువ సమయంలో అతని పట్ల ప్రేమ కలిగి యుంటాం. అతడు మనమనే భావన కొంతకాలమే ఉంటుంది. మేమట్లా ఉండిపోగలమని ఎవరైనా బీరాలు పలికితే అవి వట్టి మాటలని భావించండి. ఇక నియమాలకు కట్టుబడనిది రాగభక్తిగా చెలామణి అవుతుంది.


Friday 5 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (192)



భారతదేశ ప్రత్యేకత


పరమేశ్వర మూర్తులు ఈ దేశాన్ని విడిచి పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నాడు గణపతి?


చెట్టుకి నీళ్ళు పోయాలంటే దాని మొదట్లో పోస్తాం గాని, ఆకులపై కొమ్మలపై నీళ్ళు చల్లుతామా? కనుక దైవత్వానికి సంబంధించిన దాంట్లో ప్రపంచం, ఒక పెద్ద వృక్షమైతే దాని వేళ్ళు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని తడిపితే చెట్టు కలకలలాడుతుంది. అట్లా అన్ని దేశాలూ సుఖ సంపదలతో ఉంటాయి. అట్లా భారతదేశంలో కర్మానుష్టానం పూజలు, సక్రమంగా జరిగితే మిగతా దేశాలూ శక్తిని పుంజుకుంటాయి. ప్రపంచ క్షేమానికి ఇక్కడ ఆరాధన సక్రమంగా జరగాలి.


భగవంతుడేమని భావించాడు? ఒక ప్రాంతంలో మంచి వాతావరణం ఉండాలి, పంటలు, పచ్చదనం కొన్ని దేశాలలో ఉండాలి. వజ్రాలు, బంగారం విలువైన ఖనిజ సంపద మరొక దేశంలో ఉండాలి. కొన్ని దేశాలలో అధిక ఉష్ణోగ్రత, మరొక దేశంలో అతిశీతలత్వం. కొన్ని దేశాలు ఖాగ్యవంతంగా ఉండి మిగిలిన దేశాలకు అనేక రూపాలలో ఆ సంపద, రవాణా కావాలి. ఇక దైవసంబంధ విషయాలలో భారతదేశం ఒక పవర్ హౌస్ వంటిది.  అన్ని దేశాలకు విద్యుత్ కేంద్రం వంటిది. గుండె, అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆధ్యాత్మిక శక్తిని మిగతా దేశాలకు అందీయగలదు. ఇది ధర్మ భూమిగా, కర్మభూమిగా ఉండాలని అతని సంకల్పం. అంతమాత్రంచే ఇతర దేశాలలో ఆరాధనలుండకూడదని కాదు. శరీరంలో ఒక భాగానికి రోగం వస్తే కొన్ని మందులను పైపైన పూస్తాం కదా! అట్లాగే మిగతా దేశాలలోనూ పూజలు సాగవలసిందే! అయితే గుండె సరిగా ఉన్నపుడు ఏ రోగం శరీరానికి వచ్చినా కుదర్చడానికి వీలు పడుతుంది. అందువల్ల ఆరాధనా విధానాలలో అనేక నియమాలు, నిష్ఠలూ ఇక్కడున్నాయి. గుండె వంటి భారతదేశం రోగరహితంగా ఉంటే మిగతా అవయవాల వంటి మిగతా దేశాలూ బాగుంటాయి.


Thursday 4 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (191)



కమండులువును త్రోయడం, కావేరీ నది ప్రవహించడం జరిగింది సహ్యాద్రి తీరంలో. అక్కడ ఒక ఉసిరిక చెట్టుంది. ఆ చెట్టు ఏమిటో కాదు అది మహావిష్ణువే. అది విష్ణుమాయవల్ల లోపాముద్రగా మారి అగస్త్యుని భార్య అయింది. అగస్త్యుని కమండులువులోని నీరుగా మారిందట.


ఇట్లా కావేరి, భగవానుని పాదం నుండి ప్రవహించగా గంగ నా పాదం నుండి ప్రవహిస్తోంది. కాని గంగ కంటే నామీద నాకధిక ప్రీతి యుందని, మొత్తం నా శరీర స్పర్శ నీకు కల్గుగాక అని అనుగ్రహించాడు విష్ణువు. నీవు నదిగా ప్రవహిస్తున్నప్పుడు రెండుగా చీలుతావు, ఒక ద్వీపం దగ్గర రెండు పాయలూ కలిసి నపుడు నీవు నన్ను రెండు చేతులతో ఆలింగనం చేసుకొంటావని కావేరీతో విష్ణువన్నాడట.


మరొక సందర్భంలో శైవ వైష్ణవాలు కలిసాయి. విభీషణుడు రాముడి నుండి రంగనాథుని విగ్రహం పొందినట్లు, రావణుడు పరమేశ్వరుని నుండి ఆత్మలింగాన్ని పొందాడు. దానిని నేలమీద పెట్టకూడదని షరతు పెట్టాడు. లంకకు వెళ్ళేవరకూ చేతిలోనే ఉండాలి సుమా! అన్నాడు. అదీ భారత భూమిని దాటకూడదని పన్నాగం పన్నినట్లున్న కథ మీకు తెలిసిందే. ఆ లింగం స్థాపించబడిన చోటు గోకర్ణం. అది కర్ణాటకలో పశ్చిమ తీరంలో ఉంది. ద్వారక, రామేశ్వరం మాదిరిగా ఇదీ ఒక ద్వీపంలా ఉంటుంది. అక్కడున్న స్వామికి మహాబలేశ్వరుడని పేరు. అక్కడ పెట్టి పెట్టగానే రావణుడు పెకలించబోయాడు. వీలుపడలేదు కనుక స్వామి పేరు తగ్గట్లుగానే ఉంది రావణున్ని ఎట్లా వినాయకుడడ్డుకున్నాడో, విభీషణునికీ విఘ్నం కలిగించాడు. ఇట్లా ఇతని లీలలు అనంతం. ఇతనివల్ల గోకర్ణ, శ్రీరంగ క్షేత్రాలు ప్రసిద్ధిని పొందాయి.


Wednesday 3 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (190)


వినాయకుని లీలలలోని ఔచిత్యం


శ్రీరంగం యొక్క స్థల పురాణం సరిగా నాకు గుర్తులేదు. ఇది వైష్ణవ క్షేత్రం కనుక వినాయకుని పేరు, అతని లీలలను వారు వర్ణించి యుండకపోవచ్చు. ధర్మవర్మ అనే చోళరాజు, రామునకు సమకాలికుడు. ఇక్కడ మూలస్థానానికి ముందున్న వసారా ధర్మవర్మ పేరుతో ఉంది. ఇక్ష్వాకు రాజుల కుల దైవాన్ని ఇక్కడ ప్రతిష్టించాలని ఘోర తపస్సు చేశాడు. అతని తపః ఫలంగా విశ్రాంతికై విభీషణుడు దీని నిక్కడ ఉంచగా అది స్థిరంగా ఉండిపోయిందని విన్నట్లు గుర్తు. కానీ విఘ్నేశ్వరుడే ఈ లీలను ప్రదర్శించాడని లోకంలో ప్రచారంలో ఉంది. ఇట్లా శైవ వైష్ణవ శాఖల సంగమంగా ఉంది కథను, ఇంకా వింటే నిజమనిపిస్తుంది.


విభీషణుడు బెదిరిస్తూ ఉంటే వినాయకుడు ఱాతికోట నెక్కాడని విన్నాం కదా! విభీషణుడు తనని తరిమి తరిమి నెత్తిపై దెబ్బ కొట్టాడు కదా! దీనికి దృష్టాంతంగా ఆ కొండపై నున్న విఘ్నేశ్వర మూర్తి తలపై దెబ్బ తగిలినట్లుంది. ఇట్లా కొండపై విఘ్నేశ్వరుడుండదం అఱుదు. ఇందులో ఒక తత్త్వం దాగియుంది. మూలాధారం, సహస్రారంతో చేరిందనే యోగపరమైన అర్ధమూ వస్తుంది.  


రంగనాథునకు, గణపతికి ఇంకొక సంబంధం ఉంది. అగస్త్యుని కమండులువును కాకి రూపమెత్తి తిరగబడినట్లు చేసాడని విన్నాం. అగస్త్యుడు ఈ కాకిని తరుముతూ పరుగెత్తాడట. అప్పుడా కాకి, బ్రహ్మచారి రూపం ధరించింది. విభీషణుని కథలోనూ బ్రహ్మచారియే. అగస్త్యుడూ ఒక దెబ్బ కొట్టాలని పరుగెత్తాడు. కొట్టబోయేముందు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు గణపతి. నీ తలమీద దెబ్బ కొడదామని అనుకున్నాను. ఓహో! నువ్వా అన్నాడు. అపుడు తన తలమీదే కొట్టుకున్నాడట. ఈ కథ జరిగిన తరువాత వినాయక భక్తులు తమ తలమీద కొద్దిగా కొట్టుకునే ఆచారం వచ్చింది. ఇది పూజలో ఒక అంగమైంది.

Tuesday 2 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (189)



దక్షిణాన్ని చూసే ముగ్గురు దేవతలు


దక్షిణామూర్తి రూపంలో, నటరాజు రూపంలో పరమేశ్వరుడు, దక్షిణవైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు గణపతి, విష్ణువును ఆవైపు చూస్తున్నట్లు ప్రతిష్ఠించాడు. దక్షిణామూర్తి ధ్యానమూర్తిగా, అచంచలంగా ఉన్నట్లు కన్పిస్తాడు. నటరాజు, నిరంతరం నృత్యం చేస్తున్నట్లుగా జగత్తును ఆనంద డోలికలలో ఊపుతున్నట్లుగా ఉంటాడు. మహావిష్ణువు పడుకొన్న రూపంలో, ఒరిగిన రూపంలో సమాధి స్థితిలో ఉన్నట్లుంటాడు. యోగనిద్రలో ఉన్నట్లుంటాడు. దీనిని సమాధి స్థితి అని నొక్కి చెప్పకుండా యోగ నిద్ర అని ఎందుకు చెప్పినట్లు? విష్ణువు, అనేక ఇంద్ర జాలాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అవి మనకర్ధం కావు. అతని సమాధి స్థితిలో సృష్టికార్యం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? మనం కలలో ఎందరినో వ్యక్తులను సృష్టిస్తూ వినోదిస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రపంచం అతని కలవంటిదన్నారు. నిద్రలోనే కలలు వస్తాయి. అందువల్ల సమాధిని కూడా నిద్రకాని నిద్రయని అన్నారు. మరొకటి, సమాధిలో నిటారుగా యోగి కూర్చొని యుంటాడు. ఇతడు ఇక్కడ వంగి విశ్రాంతి తీసుకొన్న రూపంలో సాక్షాత్కరిస్తాడు. అయితే మన నిద్రకు, అతని నిద్రకు తేడాను చూపించడం కోసం అతనిది యోగనిద్రయని అన్నారు.


విఘ్నేశ్వరుని చేతి మహిమ వల్ల, అతని గొప్ప ఆలోచనల వల్ల శివునకు దేనిని అన్వయిస్తున్నామో విష్ణువునకూ అదే. అందుకే అతడు రంగరాజు. వైష్ణవ క్షేత్రాలలో ఇది ప్రముఖమైంది, ప్రధానమైంది. ప్రతిష్ఠ జరిగినచోటు శ్రీరంగం.

కొంచెం భిన్నంగా చెప్పానేమో! రంగరాజు ఉండడం వల్ల అది శ్రీరంగంగా పిలువబడలేదు. ఆ ప్రదేశం రంగం అవడం వల్ల దానినతడు పరిపాలించడం వల్ల అతడు రంగరాజయ్యాడు. ఇక్ష్వాకుల కాలంలో అతని పేరు నారాయణుడే, లేక విష్ణువే! లేదా అనంతశాయి కావాలి. వినాయకుడు అతనికై రంగాన్ని సృష్టించాడు కనుక అతనికి రంగరాజని పేరు వచ్చింది, ఇది కావేరీ తీరంలోనే.

రంగం అంటే నాటకాలు ప్రదర్శించే స్థలం. దానిని ప్రజలు చూస్తారు. రంగస్థలిలో, ఆ గొప్ప నటుడు, ప్రపంచమనే నాటకాన్ని నడుపుతున్నాడు. ఆ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, రంగంలోనే. నటరాజు చూపించే నృత్యం, చిదంబరంలోనే. దానిని సభయని అంటారు. చిత్ సభ, మామూలు జనులు దీనిని కనకసభయని పిలుస్తారు. అక్కడ సభ ఎట్లాగో ఇక్కడ రంగం అట్టిది.

నా తండ్రికి ఒక సభయుండగా యోగనిద్రలోనున్న నా మేనమామ యైన విష్ణువకు సభ యుండవద్దాయని వినాయకుడు భావించాడు. ఇతడు యోగనిద్రలో ఉండే నాటకాన్ని నడుపగలడు. ఇద్దరు చేసే పనులు ఒకటియైనా పేర్లతో కొంత తేడా ఉంటే రమ్యంగా ఉంటుందని రంగమని, విష్ణు సన్నిధికి పేరు పెట్టాడు. అందుకే అక్కడ ప్రతిష్ట.

Monday 1 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (188)



స్వామియే భక్తునికి లొంగాలని భావించినపుడు మాత్రమే లొంగుతాడు యశోద, కృష్ణుణ్ణి త్రాళ్ళతో బంధించినపుడు జరిగింది కదా!


(త్రాటితో యశోద, కృష్ణుణ్ణి కట్టాలని ప్రయత్నించగా రెండు అంగుళాల త్రాడు తక్కువ వచ్చిందని, కట్టలేకపోయిందనే కథ, ఖాగవతంలో ఉంది కదా, రెండంగుళాలు తక్కువ అవడమేమిటి? మహత్తు, అహంకారం, తన్మాత్రలని ప్రకృతి, పరాప్రకృతిగా ఉంటుంది. పంచ భూతాలతో కూడినది, అపరాప్రకృతి. ఈ రెంటి ప్రకృతులకు స్వామి అందడని సూచిస్తోంది ఆ కథ. కనుక తనంతట తాను లొంగిపోయాడు కన్నయ్య. - అనువక్త) 


విభీషణుడు, వినాయకుని తలపై ఒక దెబ్బ కొట్టాడు. అపుడు నిజరూపాన్ని చూపించాడు గణపయ్య. అట్టి దర్శనం వల్ల ఇతనిలో కోపం, బాధ మటుమాయ మయ్యాయి. "లంకకు స్వామిని తీసుకొని వెళ్ళలేకపోయానని బాధపడకు, నేనెట్లా విగ్రహాన్ని ఉంచానో గమనించావా? ఇది లంకను చూస్తున్నట్లుగానే ఉంటుంది. లంకపై నిరంతరం ఈ స్వామి అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటాడులే. సాధారణంగా దక్షిణవైపు చూస్తున్నట్లు విగ్రహాల్ని ప్రతిష్ఠించరు. నీకోసం అట్లా చేసాను, దిగులు చెందకు” అని గణపయ్య ఊరడించాడు.