Sunday 2 September 2018

యక్ష ప్రశ్నలు - 78


హిందూ ధర్మం - 273 (కర్మసిద్ధాంతం- 13)



ప్రకృతి త్రిగుణాత్మకం. జీవుడు భగవంతుని అంశ. కనుక అతడు త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడైన జీవుడు, తానే మనస్సు అనుకుని, త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడుతున్నాడు. ఆ కారణంగానే తాను దైవాంశ అనే విషయాన్ని తెలుసుకొనలేకపోతున్నాడు. ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి సంబంధించి, ఒకానొక సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారు ఇలా చెప్పారు (దీనిని వి.వి.యస్. శర్మగారు భద్రపరిచి మనకు అందించారు) - ఒక సమయంలో ఒక శిష్యుడు గురువుగారితో మాట్లాడుతూ "నేను సాధన వలన మీస్థితికికి చేరగల వరాన్ని ప్రసాదించండి." అని కోరాడు. అప్పుడు గురువుగారు "ఈ జన్మలో పరిణామం పొందిన జీవులు, ఊర్ధ్వలోకములనుండి అవతరించిన జీవుల స్థితికి చేరవు" అని చెప్పారు. ఈ సంభాషణలో ప్రప్రథమంగా అక్కడ ఉన్న వారికి ఆయన ప్రస్తుత స్థితి తెలిసింది. అలా చెప్పగల ఈయన ఎవరు? ఆయన ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? ఆయన అవతరణ వెనుక కారణ మేమిటి? ప్రథమమున అవతరించిన వారికి ఈయనకు సంబంధమేమిటి? సృష్టి ఆదినుండి ఆయన ప్రయాణమేమిటి? ఈ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెబుతూ వచ్చారు. 
సృష్టి ప్రారంభం
ఆరంభం అంటే శూన్య స్థితి. ఏదీ లేదు, ఎవరూ లేరు అనుకోవచ్చు. ఆస్థితిలో ఎవరో ఒక్కరికి తానొక్కరే ఉన్నాననే భావన కలిగినది. ఆయన స్థితి అవధులు లేని ఆనందం ఆయనకు ఈయబడిన నామం సదాశివుడు. సృష్టికి మూలం. సృష్టి అంటే ఒకరికి మరొకరు. ఒకటి అయిన సదాశివం రెండు అయినది. తనే అయిన పరమ శివుడు, తన శక్తి పరాశక్తి. తన శక్తియే తన ప్రకృతి. ఆ సమయంలో తన నుండి కోట్లాది తేజోరేణువులు వెలికి వచ్చాయి. ప్రతి రేణువు పరమ శివుని ప్రతిరూపమే. క్రమముగా ప్రతి రేణువుకు, రేణువుకు, ప్రకృతికి పరస్పర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాల ఫలితంగా ప్రత్యణువు తాను ప్రత్యేకమనే భావనలోనికి వచ్చి పరమ శివునితో సంబంధమును కూడా విస్మరించినది. అప్పుడు ఈ రేణువులు జీవులు అనబడినవి. మూలాన్ని విస్మరించడమే వానిలో వ్యాపించిన అవిద్య, అజ్ఞానం. దానితో శివుడు, జీవుడు అనే ద్వంద్వ ప్రవృత్తి ఏర్పడింది. జీవుల మధ్య పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ఏర్పడినవి. జీవుల మధ్య హానికరమైన సంస్కారాలు కల జీవులు ఉత్పన్నమైనారు. పరాశక్తికి వాటిని నిర్మూలింపవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఇది సృష్టి ఆరంభంలో జరిగినది. దీనితో జీవులకు పరిమితులు ఏర్పడినవి.
పరమశివుని అనుగ్రహము వలన జీవులకు తమ ఆరంభస్థితిని తిరిగిపొందే అవకాశ మీయబడినది.. దీనికై తిరిగి తిరిగి సృష్టిచేసే సంకల్పము పరమేశ్వరునికి కలిగింది. ఇది జీవుల పరిణామానికి ఏర్పడిన మార్గము. ఇదియే తమసోమా జ్యోతిర్గమయ (అవిద్యనుండి జ్ఞానానికి ప్రయాణము) అనే ప్రార్థన. ఈ సంకల్పమునకు స్థిరత్వమునిచ్చి సృష్టి స్థితి లయాల వ్యవస్థ చేయునది మహావిష్ణువు. ఆయన నాభికమలం నుండి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ప్రతి సృష్టిలోనూ జీవులకు భౌతిక శరీరాలు, భౌతిక జీవనానికి అవసరమైన సామగ్రి సృష్టిస్తాడు. జీవులు వేర్వేరు పరిణామ దశలలో ఉంటారు. సమయము ఆసన్నమైనప్పుడు బ్రహ్మ నుండి పుట్టిన రుద్రుడు తిరోధాన కార్యము చేబడతాడు. ఈ రుద్రుడు సృష్టిని సంకల్పించిన సదాశివుడే. లోకాలు, జీవులు యథాస్థితిలో విష్ణుగర్భంలోనికి తీసికొన బడి తరువాత ప్రతిసర్గ మొదలయేవరకు, నూతన బ్రహ్మకల్పారంభము వరకు, ఆస్థితిలోనే నిలిచి ఉంటారు. ఇది మహావిష్ణువు యోగనిద్రా సమయము. 
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్ ||
ఈ సృష్టి విజ్ఞానం శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్న మనకు ఎలా తెలిసింది? అనంత కాల చక్రంలో ఈ ప్రతి సృష్టి కార్యక్రమం నేటివరకూ జరుగుతూనే ఉన్నది. సదాశివ పరమశివులతోబాటుగా మరియొకరు ఈ సృష్టికి సాక్షిగా అనేక బ్రహ్మకల్పాలను చూస్తూ ఉన్నారని అర్థమౌతున్నది. అర్హత గల కొన్ని ముముక్షువులైన జీవులకు, జిజ్ఞాసువులకు, సామాన్య మార్గమునకు మారుగా వేగముగా పరిణామము చెందే విధానమును బోధించుటకు ఆ సాక్షి సృష్టి చక్రములో ప్రవేశించాడు.. ఈ సనాతనుడైన ప్రత్యక్ష సాక్షియే మూర్తీభవించిన గురుతత్త్వము."  ఆ గురుస్వరూపమే దక్షిణామూర్తి, హయగ్రీవుడు.

ఇంకా ఉంది ....