Sunday 31 March 2024

శ్రీ గరుడ పురాణము (136)

 


హే వృషభధ్వజా! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష (అంటే గురువారంతో) శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏ మాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు.


పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం.


విశాఖ ఉత్తరఫల్గునీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయముంటుంది.


(అధ్యాయం -59)


గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం

 

( పురాణంలో ఈయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు)

 

మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహా దశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది, బుధునిది పదిహేడు, శనిది పది, గురువుది పందొమ్మిది, రాహువుది పన్నెండు, శుక్రునిది ఇరవై ఒక్కటి.

 

సూర్యదశ (అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం) దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది.


Saturday 30 March 2024

శ్రీ గరుడ పురాణము (135)

 


కృష్ణపాడ్యమి, బుధవారంనాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్టి, షష్టి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలసి వచ్చిన రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే.


ద్వాదశి - ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి - బుధవారం, అష్టమి - గురువారం, సప్తమి - శుక్రవారం, షష్టి - శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి - దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క వూరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు.


మేష-కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్య-మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధను- మీన సంక్రాంతి చతుర్దశితో కలసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు.


మహాదేవాదులారా! రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్టతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలూ, శనివారంతో ఉత్తరఫల్గుని, హస్త, చిత్రలూ యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాదికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును.


ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి.


విష్కంభయోగం అయిదు గడియలూ (120 నిముషాలు) శూలయోగం ఏడు గడియలూ, గండ, అతి గండయోగాల్లో ఆరేసి గడియలూ, వ్యాఘాత, వజ్ర యోగాల్లో తొమ్మిదేసి గడియలూ, వ్యతీపాత, వైదృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలమూ మృత్యుతుల్యములు. మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలనూ పరిత్యజించవలసిన సమయాలివి.


ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధా నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని, యోగించినవి ఉత్తమ, శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగమూ, పాపనాశనమూ కూడా వుంటాయి. ఇవి సర్వదోషహరములు.


Friday 29 March 2024

శ్రీ గరుడ పురాణము (134)

 


అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు.


హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్ఠములు.


కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వఫల్గునీ నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలనూ, సరోవరాలనూ, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులనూ తవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకూ, ఖనిజాలకూ పాతిపెట్టబడిన నిధులకూ భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి.


రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠా నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నపుడే ఏనుగు, ఒంటె, గుఱ్ఱం, ఎద్దు వంటి పశువులను వశపఱచుకొనే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి.


పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలూ చేయడం శుభకరం.

రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష (వారుణ) శ్రవణ ఈ తొమ్మిది నక్షత్రాలనూ ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలనుచేయాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి.


చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమి తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు.


Thursday 28 March 2024

శ్రీ గరుడ పురాణము (133)

 


ఇక ఏయే తిథులలో ఏయే దిశలలో ఏయే యోగినులుంటారో వినండి.


తిథులు - యోగిని పేరు - దిశ


పాడ్యమి, నవమి - బ్రహ్మాణి - తూర్పు

విదియ, దశమి - మాహేశ్వరి - ఉత్తరం

పంచమి, త్రయోదశి - వారాహి - దక్షిణం

షష్టి, చతుర్దశి - ఇంద్రాణి - పశ్చిమం

సప్తమి, పున్నమి - చాముండ - వాయవ్యం

అష్టమి, అమావాస్య - మహాలక్ష్మి ఈశాన్యం

ఏకాదశి, తదియ - వైష్ణవి - ఆగ్నేయం

ద్వాదశి, చవితి - కౌమారి – నైరృత్యం

యోగిని నెదురుగా పెట్టుకొని యాత్రచేయరాదు. అనగా ఉదాహరణకి, దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్ళవచ్చును.


Wednesday 27 March 2024

శ్రీ గరుడ పురాణము (132)


 

జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన


ముందుగా నక్షత్రాల కుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.


కృత్తిక - అగ్ని

రోహిణి - బ్రహ్మ

మృగశిర - చంద్రుడు

ఆర్ధ్ర - రుద్రుడు

పునర్వసు - ఆదిత్య

పుష్య - తిష్యుడు

ఆశ్లేష - సర్పుడు

మఘ - పితృగణాలు

పూర్వఫల్గుని - భగుడు

ఉత్తరఫల్గుని - అర్యముడు

హస్త - సవిత

చిత్ర - త్వష్ట

స్వాతి - వాయువు

విశాఖ - ఇంద్రాగ్నులు

అనురాధ - మిత్రుడు

జ్యేష్ఠ - ఇంద్రుడు

మూల - నిరృతి

పూర్వాషాఢ - శివుడు

ఉత్తరాషాఢ - విశ్వేదేవులు

అభిజిత్ - బ్రహ్మ

శ్రావణ - విష్ణు

ధనిష్ఠ - వసువులు

శతభిష - వరుణుడు

పూర్వాభాద్ర - అజపాదుడు

ఉత్తరాభాద్ర - అహిర్బుధ్ని

రేవతి - పూష

అశ్వని - అశ్వనీకుమారులు

భరణి - యమధర్మరాజు


Tuesday 26 March 2024

శ్రీ గరుడ పురాణము (131)

 


విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహామునులు సూర్యమండలానికెదురుగా వుండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వులాయన యశోగానాన్ని కావిస్తుంటారు. అప్సరలు నర్తిస్తుంటారు. వాలఖిల్యులను పేరు గల మునులు, యక్షరాక్షస నాగ ప్రతినిధులూ రథమును పరివేష్టించి వుండి అవసరమైన మేరకు రక్షణ కలిపించే ఉద్దేశ్యంతో వుంటారు.


చంద్రరథానికి మూడు చక్రాలుంటాయి. గుఱ్ఱాలు కుంద పుష్పం రంగులో తెల్లగా వుంటాయి. వాటి సంఖ్య పది. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరూ, నిప్పు కలిపిన ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమరంగులో వుండి వాయువేగంతో పోగలిగిన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి.


శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై, అనుకర్ణ (రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు, అడ్డకర్రలు) తో, ఎత్తయిన శిఖరంతో పతాకంతో, మిక్కిలి బలము, వేగము గల అశ్వాలతో శోభిస్తుంటుంది.


భూమి పుత్రుడైన మంగళుని రథం అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన బంగారం రంగులో మెరిసిపోతుంటుంది. అగ్ని సంభవాలైన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి. వాటి రంగు పద్మరాగమణుల అరుణ వర్ణం బృహస్పతి స్వర్ణరథంపై ఏడు పాండుర వర్ణం (తెలుపు పసుపు కలిసిన) లో ప్రకాశిస్తున్న గుఱ్ఱాలను పూన్చి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ వుంటాడు.


శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలులాగే రథంపై తిరుగుతాడు. చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును సార్థకం చేసుకుంటాడు.


రాహువు రథాశ్వాలు ఎనిమిది. ఇవి ధూసరవర్ణంలో అంటే పాండుర వర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో వుంటాయి. అవి ఒకమారు కదిలాక ఆగవు.


కేతువు రథానికుండే ఎనిమిది గుఱ్ఱాలూ లాక్షారసం వలె అరుణకాంతులను వెదజల్లుతుంటాయి. వీటి వేగం వాయువేగాన్ని మించి వుంటుంది.


ఈ విధంగా విష్ణువు యొక్క విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన ఆదేశం మేరకు ఈ రథాలలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవుల, దేవతల జాతకాలను మారుస్తూ తిరుగుతుంటాయి.


(అధ్యాయం - 58)


Monday 25 March 2024

శ్రీ గరుడ పురాణము (130)

 


రౌరవ, సూకర, రోధ, తాళ, విశసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ నానాభక్ష (లాలాభక్ష), దారుణ, పూయవశ, పాపవహ్నిజ్వాల, అధఃశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, శ్వభోజన, అప్రతిష్ట, ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు.


ఈ లోకాలన్నిటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశలోకాలున్నాయి. ఇంతవఱకు చెప్పబడిన దానిని బ్రహ్మాండమంటారు. దీనికి బాగా పైన దీనికి పదింతల పరిమాణంలో మరొక లోకముంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు. (అధ్యాయాలు 56,57)


నవగ్రహాల రథాలు


దేవతలారా! సూర్యదేవుని రథం వైశాల్యము తొమ్మిది వేల యోజనాలు. దాని ఈషా దండానికీ అంటే కాడికీ రథ మధ్యానికీ మధ్య వుండే దూరం రథ వైశాల్యానికి రెట్టింపు వున్నది. ఇరుసు ఒక కోటీ ఎనభై యేడు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రమొకటే. దానికి మూడు నాభులు (పూర్వ, మధ్య, అపర అన్జలు) అయిదు అరలు (పరివత్సరాదులు) ఆరునేములు (వసంతాది ఆరు ఋతువులు)


సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రము. ఇరుసులలో రెండవది నలభై వేల యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటీ అయిదున్నరవేల యోజనాల పొడవును కలిగియున్నవి. 


గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే ఏడు ఛందాలూ సూర్యభగవానుని సప్తాశ్వాలు.


సూర్యునికి పన్నెండు పేర్లు పన్నెండు తత్త్వాలు పన్నెండు ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో వుంటాడు. ఆ రథం వెనుకనొక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు వుంటారు. (అనుబంధం-8లో చూడండి).


Sunday 24 March 2024

శ్రీ గరుడ పురాణము (129)

 


మహాదేవా! క్రౌంచద్వీపానికి రాజు మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనకు కూడా ఏడుగురు కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత్, మహాశైల, దుందుభి, పుండరీకవాన్ నామక సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి పుండరీక నామములు గల నదులు ప్రవహిస్తున్నాయి.


శాకద్వీపరాజైన భవ్యునికి కూడా జలద, కుమార, సుకుమార, అరుణీబక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన ఏడుగురు కొడుకులున్నారు. ఇక్కడ నలిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అను పేరుగల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి.


పుష్కర ద్వీపపాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన ఇద్దరుకొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, ధాతకి. వారి పేర్లతోనే ఇక్కడ రెండు వర్షాలేర్పడ్డాయి. ఈ రెండిటి మధ్య మానసోత్తరమను పేరు గల మహాపర్వతముంది. ఇది యాభైవేల యోజనాల ఎత్తుతో, అంతే విస్తీర్ణంలో పఱచుకొని వుంది. ఈ పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రముంది. ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తుంటుంది. అక్కడ పదివేల యోజనాల విస్తీర్ణంలో పఱచుకొని లోకాలోకమను పేరు గల పర్వతముంది. అది ఎల్లప్పుడూ చీకటి  చేత కప్పబడి వుంటుంది. ఎంత కష్టపడి దానిని చూడడానికి ప్రయత్నించినా, సామాన్య మానవులకి అదేదో అండకటాహంచే ఆవరింపబడినట్లు అనగా నల్లటి గుడ్డు పెళ్ళ చేతనో తాబేటి చిప్పతోనో మూయబడినట్టు మాత్రమే కనిపిస్తుంది.


కపర్ద్యాది దేవతలారా! ఈ భూమి ఎత్తు డెబ్బది వేల యోజనాలు. ఇందులో పదేసి వేల యోజనాల దూరంలో పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గభస్తిమాన్, మహాతల, సుతల, పాతాళ లోకాలని వ్యవహరిస్తారు. ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర సదృశ, శైల, స్వర్ణ వర్ణాలలో వుంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి దారుణ పుష్కర ద్వీపంలోనే నరకాలుంటాయి.


Saturday 23 March 2024

శ్రీ గరుడ పురాణము (128)

 


ప్లక్ష పుష్కరాది ద్వీపాలు, పాతాళం


ప్లక్ష ద్వీపాధీశుడైన మేధాతిథికి ఏడుగురుపుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుభోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు.


ఈ ద్వీపంలో గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజమను పేర్లు గల సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త శిఖి విపాశా, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి.


వపుష్మాన్ (లేదా వపుష్మంతుడు) శాల్మక ద్వీపానికి రాజు. అతనికి ఏడుగురు కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనే వారి పేర్లతోనే ఆ వర్షాలు -అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్ష ద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేళ్ళు గల ఏడు పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విధృతి నామకములైన సప్తనదులు కూడా వున్నాయి. ఇవన్నీ పాపనాశకాలే.


కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మాన్ (జ్యోతిష్మంతుడు) ఆయనకూ ఏడుగురు కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, ద్యుమాన్, పుష్పవాన్, కుశేశయ, హరి, మందరాచలము అను పేర్లు గల యేడు వర్ష పర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివా, పవిత్ర, సన్మతి, విద్యుదభ్ర, మహీ, కాశాయను సప్త పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి.


Friday 22 March 2024

శ్రీ గరుడ పురాణము (127)

 


భరతవర్ష వర్ణన


శివశంకరా! జంబూ ద్వీప మధ్యభాగంలో ఇలావృత దేశముంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వ వర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్ అను దేశమూ వున్నాయి.


మేరు పర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతోంది. దానికి దక్షిణంలో నున్న ప్రాంతం భరతవర్షం లేదా భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భరతవర్షానికి తూర్పున కిరాత, పడమట యవన దేశాలున్నాయి. దక్షిణంలో ఆంధ్ర, ఉత్తరంలో తురుష్కాది దేశాలున్నాయి. ఈ భరతవర్షంలోనే నాలుగు వర్ణాల ప్రజలుంటారు.


ఇక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్ష, వింధ్య, పారియాత్రములనే ఏడు కులపర్వతాలున్నాయి. ఈ భరతవర్షంలోనే వేదస్మృతి, నర్మద, వరద, సురస, శివా, తాపి, పయోష్ఠి, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరధి, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపర్ణి, చంద్రభాగ, సరస్వతి, ఋషికుల్య, మత్తగంగ, పయస్విని, విదర్భ, శతద్రు మున్నగు మంగళ ప్రదములూ పాపవినాశినులూ నగు నదులు నిత్యం ప్రవహిస్తుంటాయి.

పాంచాల, కురు, మత్స్య, యౌధేయ, పటచ్ఛర, కుంత, శూరసేన దేశాలలో నివసించే వారిని మధ్య దేశీయులంటారు. పాద్మ, సూత, మాగధ, చేది, కాశేయ, విదేహ ప్రాంతాలు తూర్పులో ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు, వింధ్య ప్రాంతంలో నున్న ప్రదేశాలూ పూర్వ-దక్షిణాల తటవర్తి భూభాగంలో వున్నాయి. పుళింద, అశ్మక, జీమూత, నయ రాష్ట్రాలవారూ, కర్ణాటక, కంబోజ, ఘణ దేశాలవాసులూ దాక్షిణాత్యులన బడతారు. ఇక అంబష్ఠ, ద్రవిడ, లాట, కంభోజ, స్త్రీముఖ, శక, ఆనర్తవాసులు దక్షిణ పశ్చిమ దేశీయులు.


స్త్రీ రాజ్య, సైంధవ, మ్లేచ్ఛ, నాస్తిక, యవన, మథుర, నిషధ ప్రాంత నివాసులంతా పడమటివారి క్రింద పరిగణింపబడుతున్నారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, ఖశ, మహాకేశ, మహానాస దేశాలు ఉత్తర పశ్చిమాల్లో వున్నాయి.


లంబక, స్తననాగ, మాద్ర, గాంధార, బాహ్లిక, మ్లేచ్ఛ దేశాలు హిమాలయానికి ఉత్తర తటంలో వున్నాయి. త్రిగర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సటంకణ, అభీషాహ, కశ్మీరదేశాలు ఉత్తర పూర్వ దిశలలో వున్నాయి.


ఇదీ భరతవర్ష భౌగోళికత.


(అధ్యాయం -55)


Thursday 21 March 2024

శ్రీ గరుడ పురాణము (126)

 


(మేరు పర్వతం గూర్చి బాగా విపులంగా భవిష్యపురాణంలో చెప్పబడింది) కర్ణిక పదహారు వేల యోజనాలు.


మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం; ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి- అను వర్ష పర్వతాలున్నాయి.


హే నీలకంఠా! ప్లక్షాది ద్వీపాల్లో నివసించేవారికి మృత్యువుండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా వుండదు.


జంబూ ద్వీపాన్ని పాలించిన అగ్నీధ్ర మహారాజుకి తొమ్మండుగురు కొడుకులు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల, నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభాగాలు వారి పేళ్ళతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి యను పత్నిద్వారా ఋషభుడను పుత్రుడు కలిగాడు. ఋషభ పుత్రుడైన (మొదటి) భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడై వుండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతీహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విష్వగ జ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు.


ఆధ్యాయం - 54


Wednesday 20 March 2024

శ్రీ గరుడ పురాణము (125)

 


భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం


మనుపుత్రుడైన ప్రియవ్రతునకు పదిమంది కొడుకులు కలిగారు. వారు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధ మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్.


వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు (అనగా పూర్వజన్మజ్ఞానం కలవారు), మహా సౌభాగ్య (అంటే ధనంకాదు) శీలురు. రాజ్యం పట్ల గానీ ఇతర సాంసారిక విషయాలపై గాని వారు ఏ మాత్రమూ ఆసక్తి చూపక పోవడంతో ప్రియవ్రతుడు మిగతా ఏడుగురికీ సప్తద్వీపసమన్వితమైన పృథ్విని పంచేశాడు.


యాభైకోట్ల యోజనాల్లో విశాలంగా పఱచుకొని వున్న ఈ పృథ్వి నదిలో తేలియాడే నౌకలాగా అశేషజలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది.


జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర- అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సురా, ఘృత, దధి, దుగ్ధ, జల- అనే సప్తసముద్రాలచే చుట్టబడియున్నవి. ఈ ద్వీపాలు, సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమములోనే ఒకదానికి తరువాతిది రెండింతల విస్తీర్ణంలో వున్నాయి.


జంబూ ద్వీపంలో మేరువను పేరు గల పర్వతమొకటుంది. అది ఒక లక్ష యోజనాల విస్తీర్ణంలో పఱచుకొనివున్నది. దాని యెత్తు ఎనభై నాలుగు వేల యోజనాలు. అది పదహారు వేల యోజనాల క్రిందికి భూమిలోకి పాతుకుపోయి వుంది. మేరు పర్వత శిఖర విస్తృతి ముప్పది రెండు వేల యోజనాలు.


Tuesday 19 March 2024

శ్రీ గరుడ పురాణము (124)

 


ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై వుంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగివుంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులనూ, వేశ్యాదులనూ పోషిస్తుంటాడు.


నందనిధీశునికి రాజస తామస గుణాలు రెండూ వుంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై వుంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై వుంటాడు. మిత్రులను మార్చేస్తూ వుంటాడు.


నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్త్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర, ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద మూడు తరాల వఱకూ నిలబడుతుంది. (నందనిధీశుని సంపద ఒక తరందాకానే వుంటుంది).


శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్నిభోగాలనూ అనుభవిస్తాడు. కాని ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ, భోగాలే చూసుకుంటాడు. వీని సంపద ఒక తరమే నిలబడుతుంది.


మిశ్ర (కలగాపులగపు) నిధుల వారి లక్షణాలు వైవిధ్యభరితాలు. మునులారా! విష్ణుభగవానుడు శంకరాది దేవతలకు నిధుల, అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు.


(అధ్యాయం - 53)


Monday 18 March 2024

శ్రీ గరుడ పురాణము (123)

 


నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు


నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహభాషణం (శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే) కొనసాగుతోంది.


“మునులారా! విష్ణుభగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము.


పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద (నంద), నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను తొమ్మిదవ నిధితో కలసి ఇవి నవనిధులైనాయి.


మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి వున్న వానికెటువంటి లక్షణాలుంటాయో చూద్దాం.


పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్త్వికుడూ, దయగలవాడూ, అయివుంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువ గల ధాతువులను సంపాదించి యతులకూ, దేవతలకూ, యాజ్ఞికులకూ వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్త్వికులు.


మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లపుడూ యుద్ధతత్పరులై వుంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు.


కచ్ఛపనిధి లక్షణాలున్న వ్యక్తి తామసగుణాలను కలిగివుంటాడు. ఎవరినీ నమ్మడు. సంపద బాగానే వున్నా తానూ అనుభవించడు. ఎవరికీ దానమూ చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటినీ భూమిలో పాతి వుంచుతాడు.


Sunday 17 March 2024

శ్రీ గరుడ పురాణము (122)

 


కార్తీక శుద్ధషష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమినాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలూ నశిస్తాయి.


ప్రతిశుద్ధ ఏకాదశినాడూ, నిరాహారంగా వుండి ద్వాదశినాడు విష్ణుభగవానుని పూజ చేస్తే ఒక ఏడాదిలోపలే అన్ని మహాపాపాలూ నశిస్తాయి.


సూర్య,చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవార్చన, బ్రాహ్మణ పూజనంలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి. ఎన్ని పాపాలు చేసినవాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి.


(ఇక్కడ సతీసహగమనం గూర్చి చెప్పబడింది. పరిహరించబడింది)


పతివ్రతయై, పతిసేవ, శుశ్రూషలలో దత్తచిత్తయై వుండే స్త్రీని ఏ పాపమూ అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది.


సంయతచిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాల నాచరిస్తూ, బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప ముక్తులై ఉత్తమగతులను పొందుతారు." (అధ్యాయం 52)


Saturday 16 March 2024

శ్రీ గరుడ పురాణము (121)

 


మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని గాని పాలు, నెయ్యి, గోమూత్రాలనుగాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆపానసంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు.

 

రాజదండన వుంటే యమదండన వుండదంటారు కదా! నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికి పోయినవాడికి రాజదండన ద్వారా పాపం నశిస్తుంది.

 

గురుపత్నీగమనం చేసినవాడు తనంత పొడవే వున్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో వుంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలూ తగిలేలాగా గాఢంగా కౌగలించుకోవాలి; లేదా బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి; లేదా నాలుగైదుమార్లు చాంద్రాయణవ్రతాన్నాచరించాలి. అప్పుడే ద్విజుడు ఘోరపాపము నుండి విముక్తుడు కాగలడు.

 

మహాపాతకులతోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహా పాతకానికి చెప్పబడిన సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడూ చేసుకోవాలి; లేదా తనకున్న సర్వస్వాన్నీ దానమిచ్చేయాలి; లేదా చాంద్రాయణ, అతికృచ్ఛవ్రతాలను చేయాలి.

 

గయ మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్యనాడూ శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపజేసుకోవచ్చు.

ప్రతి కృష్ణ చతుర్దశినాడూ ఒక సంవత్సరం పాటు ఉపవాసముండి ప్రశాంతచిత్తులై పవిత్రనదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామమంత్రాలనుచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికీ ఏడేసి తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు.

 

వ్రతాలను చేస్తున్నంత కాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూవుండాలి.


Friday 15 March 2024

శ్రీ గరుడ పురాణము (120)

 


దానధర్మము కంటే శ్రేష్ఠమైన ధర్మము లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకొనేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరవు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ, తన దగ్గర అన్నీ పుష్కలంగా వున్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది.


(అధ్యాయం 51)


ప్రాయశ్చిత్తాలు


బ్రాహ్మణుని చంపు బ్రహ్మహంతా, తాగుబోతూ, దొంతనంచేయు స్తేయీ, గురుపత్నితో రమించు, గురుపత్నీగామీ - ఈ నాలుగు రకాలవారూ మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు అయిదో రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసి కర్మకాండయే ప్రాయశ్చిత్తం.


బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో పన్నెండు సంవత్సరాలుండాలి లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి.


అలా కాకుంటే అగ్నిజ్వాలలలో ప్రవేశించి గానీ అగాధ జలాల్లోకి దూకిగానీ ప్రాణ పరిత్యాగం చెయ్యాలి. గోవును గానీ బ్రాహ్మణుని గానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.


అశ్వమేధయాగాంతంలో చేసెడి అవబృథ స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిదుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్నీ దానం చేసి వనవాసానికి పోవడం వల్లనూ, త్రివేణీ సంగమంలో మూడురాత్రులుపవాసముండి రోజుకి మూడుమార్లు 

స్నానం చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లనూ, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్ళ పాటు రోజుకి ముమ్మారు స్నానం చేయడం వల్లనూ కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింప బడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలోకూడా.


Thursday 14 March 2024

శ్రీ గరుడ పురాణము (119)

 


మరికొన్ని దానాల ఫలాలిలా వుంటాయి.


వస్త్రదానం - చంద్రలోకం,

అశ్వదానం - అశ్వనీ కుమారలోకం,

గోదానం - విపులసంపత్తి

అనడుహదానం(ఎద్దు) - సూర్యలోకం

వాహనం, శయ్య - భార్య, అభయం

ధాన్యదానం - శాశ్వతసుఖం,

వేదదానం (చదివించడం) - బ్రహ్మసాన్నిధ్యం,

జ్ఞానోపదేశం - స్వర్గలోకం,

అగ్నికోసం కట్టెల దానం - గొప్ప తేజస్సు


రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వతారోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. అసిపత్రవనం నరకానికి వెళ్ళే మార్గంలో వున్న ముళ్ళ అడవి. ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులూ, గొడుగులూ విరళంగా దానం చేసినవారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధా కలగదు.


ఉత్తరాయణం, దక్షిణాయనం, మహావిషువత్కాలం, సూర్య చంద్ర గ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినపుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది.


* ఉత్తరాయణం - సూర్యుడు మకర-మిధున రాశుల మధ్య వుండే కాలం మాఘం నుండి ఆషాఢ మాసం దాకా.


* దక్షిణాయనం - సూర్యుడు కర్కాట- ధేనురాశుల మధ్య వుండే కాలం ఇది శ్రావణ మాసం ఉండి పుష్యమాసం దాకా వుంటుంది.


* మహావిషువత్కాలం - పగలూ రాత్రీ సరిసమానంగా వుండే కాలం. ఇది తులా, మేష సూర్య సంక్రాంతులలో వస్తుంది.


Wednesday 13 March 2024

శ్రీ గరుడ పురాణము (118)

 


అలాగే కృష్ణమృగచర్మంపై బంగారంతో బాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలూ నశిస్తాయి.


వైశాఖమాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకలపాప వినాశకుడైన విష్ణుభగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్నవారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకొని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలనుపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే భోజనాదులచే దానంచే సంతృప్తిపరిస్తే ఆయా దేవీమతల్లులు ప్రసన్నులవుతారు.


సంతానాన్ని కోరుకొనేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మ వర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో బ్రహ్మదేవునాపాదించుకొని వారిని పూజాదానాలతో తృప్తి పఱచాలి. ఆరోగ్యం కావాలనుకొనేవారు. ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే 'ధనానికి అగ్నినీ, కార్యసిద్ధికి వినాయకునీ, భోగానికి చంద్రునీ, బలప్రాప్తికి వాయుదేవునీ, మోక్షానికి హరినీ పూజించాలి.


ఇంకా ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు.


వారిదస్తృప్తి మా ప్నోతి 

సుఖమక్షయ మన్నదః |

తిలప్రదః ప్రజామిష్టాం 

దీపదశ్చక్షురుత్తమం ॥

భూమిదః సర్వమాప్నోతి 

దీర్ఘమాయు ర్హిరణ్యదః । 

గృహదోగ్యణి వేశ్మాని 

రూప్యదోరూపముత్తమం ॥


Tuesday 12 March 2024

శ్రీ గరుడ పురాణము (117)

 


దానధర్మం - దేవతోపాసన


సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకంగా సంతోషంగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానం 'ఇక్కడ' సుఖభోగాలనూ 'అక్కడ' మోక్షాన్నీ కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే, ఎవరైనా, న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం వుంటుంది.


అధ్యాపనం(చదువు చెప్పుట), యాజనం, ప్రతిగ్రహం ఈ మూడూ బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్నిగాని విద్యను గానీ సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చెయ్యాలి. దానమనేది నాలుగు ప్రకారాలు. నిత్య, నైమిత్తిక, కామ్య, విమల.


ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజూ చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదాన మంటారు. దైవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమలదానం. ఇది కల్యాణకారి.


చెఱకు లేదా యవ లేదా గోధుమ (లేదా వరి) పంటతోనిండి వుండి సస్యశ్యామలమైన భూమిని వేదవిదులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే వుండదు. భూదానాన్ని మించిన దానం లేదు, వుండదు.


బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినమూ శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది.


వైశాఖ పున్నమినాడుపవాసముండి అయిదుగురుగాని ఏడుగురుగాని బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపఱచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రం ద్వారా పూజించినవారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్క్షణమే నశిస్తాయి.


ప్రీయతాం ధర్మరాజేతి

యథామనసి వర్తతే ॥


(ఆచర 51/13)


ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే.


Monday 11 March 2024

శ్రీ గరుడ పురాణము (116)

 


మునులారా!* దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదంకానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆదిమధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి. 


(*ఇక్కడ భారతీయులారా! మానవులారా! అని పెట్టుకోవాలి. ఎందుకంటే విష్ణువు, బ్రహ్మ, సూతమహర్షి బోధించినది శివాదిదేవతలకు, వ్యాసునికి, శౌనకాది మహామునులకు కాదు; వారి ద్వారా మనకి)

ఓం తద్విష్ణోరితి... అనే మంత్రాన్నీ పురుషసూక్తాన్నీ మనసులో అనుకుంటూనే వుండాలి. శరణాగతి చేస్తూనే వుండాలి.


విష్ణువు పట్ల అనురక్తచిత్తుడు, శాంతస్వభావుడునైన భక్తుడు తద్విష్ణో..., అప్రేతే సశిరాః అనే మంత్రాలతో పూలనభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. * పంచయజ్ఞాలను ఆ దేవదేవుని కంకితంగా నిర్వర్తించాలి. (* దేవయజ్ఞ, భూత యజ్ఞ, పితృయజ్ఞ, మానుష యజ్ఞ, బ్రహ్మ యజ్ఞాలు పంచయజ్ఞాలు.)


వైశ్యదేవమే దేవయజ్ఞం. కాకి మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్ళకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మనే పితృయజ్ఞమంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపజేస్తుంది. తరువాత బంధువులతో కలసి మౌనంగా భోంచెయ్యాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ అన్నాన్ని నిందించరాదు.


మునులారా! ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినమూ యథాశక్తి వేదాభ్యాసమూ, పంచయజ్ఞాలూ చేసే వారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలయిపోతాయి. మోహం వల్ల గాని బద్దకం చేత గానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు.


ఇక అశౌచమనగా అపవిత్రము. అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశౌచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు.


విద్వాంసులైన బ్రాహ్మణులు మైల పట్టిన పది దినాలనూ అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన, మృత్యువుల కారణంగా ఏర్పడతాయి.


మైల నుండి క్షత్రియులు పన్నెండు దినాలకూ, వైశ్యులు పదిహేను రోజులకూ, శూద్రులయితే ఒక నెలకి శుద్ధులౌతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులూ అశుచి వుంటుంది.


సన్యాసులకు మైల అంటదు. అశౌచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశౌచముంటుంది. (అధ్యాయం - 50) 

Sunday 10 March 2024

శ్రీ గరుడ పురాణము (115)

 


అనంతరం


ఓం ఆపోహిష్ఠా మయోభువః, ఇదమాపః ప్రవహత, అనే మంత్రాలనూ వ్యాహృతులనూ పఠిస్తూ శరీరాన్ని తుడుచు కోవాలి. మరల ఆపోహిష్టా... ఇత్యాది మంత్రాలనూ అఘమర్షణ మంత్రాలనూ మూడేసి మార్లు జపించడం ద్వారా అఘమర్షణ విధిని పూర్తిచేయాలి. పిమ్మట ద్రుపదాదివ... లేదా గాయత్రి లేదా 'తద్విష్ణోః పరమం పదం' మున్నగు మంత్రాలను చదవాలి. ఓంకారాన్ని పలుమార్లుచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటి నుంచుకొని చివర్లో దానిని తలపై జల్లుకొంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకొని సూర్యభగవానుని తలచుకొంటూ మంత్రం చదివి నీటిలో వదలివేయాలి.


ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదుత్యం..., చిత్రం... తశ్చక్షు.... ఓం హం సః శుచిషద్... అనే మంత్రాలనూ, సావిత్రి మంత్రాన్నీ, సూర్య సంబంధి వైదిక మంత్రాలనూ సూర్యునుద్దేశించి చదవాలి. తరువాత పూర్వాగ్రకుశాసనంపై కూర్చుని సూర్యుని దర్శిస్తూ స్పటిక, రుద్రాక్ష లేదా పుత్ర జీవ రుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి.


శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొల లోతుననిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి. లేనివారు పొడిబట్టలు కట్టుకొని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమి పై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారము, స్వాధ్యాయం చేసుకోవాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణలివ్వాలి. మంత్రప్రారంభంలో ఓం కారాన్నీ, చివర్లో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు 'తర్పణలిస్తు న్నాను' అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా జంధ్యాన్ని ఉపవీతీ, నివీతీ, ప్రాచీనవీతీ దశలలోకి మార్చుకోవడం మరచిపోరాదు. క్రోధాదులను మనసులోకి రానీయకుండా పుష్పాలను పట్టుకొని పురుషసూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలూ జలంలో వ్యాపించి వుంటారు. కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసేవానికి అనగా పూజకునికి సమాహితచిత్తము అత్యంతావశ్యకము. దేవతలందరినీ తలచుకొని ఒక్కొక్కరికీ వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం ప్రశస్తమైన పూజావిధి.


Saturday 9 March 2024

శ్రీ గరుడ పురాణము (114)

 


తరువాత అగ్నిని ప్రజ్వలింపజేసి విధివత్తుగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడైనపుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర పత్ని, శిష్య, సహోదరులలో నెవరో ఒకరు ఈ ఆహుతులనివ్వాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు.


తరువాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర, నైవేద్యాది ఉపచారాలతో పూజించి, తన గురువుగారిని కూడా పూజించాలి. తరువాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్రజపం చేసి అపుడు శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగములే వేదార్థ ధారణ కలిగించుట. వేదార్థ విచారమును చేయించుట. ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తరువాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇదీ ఒక సద్రాహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం. తరువాత అవసరం మేరకు రాజు వద్దకు గానీ శ్రీమంతుల గృహాలకు గానీ పోయి వారి చేత దైవ, ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి.


మధ్యాహ్నకాలంలో మరల స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టినీ, పూలనూ, అక్షతలనూ, తిలలనూ, కుశలనూ, ఆవుపేడనూ ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెఱువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలనూ శరీరాన్నీ తోముకొని స్నానం చేయాలి. ఆవుపేడను కూడా ఇలాగే వినియోగించాలి. (అయిదు ముద్దలను ఉసిరికాయలంతేసి తయారు చేసుకోవాలనీ ఈ పంచమృత్తికాపిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమనీ శాస్త్రం చెప్పింది).


జలాశయం తీరంలోనే మృత్తికా గోమయాదులను వంటికి పూసుకొని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరల సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగియుండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవస్వరూపుడైన సూర్యుని దర్శిస్తూ మూడుమార్లు జలంలో మునకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.


అంతశ్చరసి భూతేషు గృహాయాం విశ్వతోముఖః ॥

త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపోజ్యోతీ రసోఽమృతం। (ఆచార 50/45, 46)


ద్రుపదాదివ... అనే మంత్రాన్ని పూర్తిగా మూడుమార్లు జపించి, ప్రణవ, వ్యాహృతులతో సావిత్రీ మంత్రాన్ని మూడుమార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి.


Friday 8 March 2024

శ్రీ గరుడ పురాణము (113)

 


స్నానానికి పూర్వం పాలుగారే చెట్టునుండి గానీ, మాలతి, ఉత్తరేను, మారేడు గన్నేరు కర్ర నుండిగాని తీసిన పలుదోముపుల్లతో ఉత్తరం వైపుగానీ తూర్పువైపు గానీ తిరిగి పవిత్ర స్థలంలో కూర్చొని పళ్ళు తోముకోవాలి.


ఆ తరువాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి పవిత్రస్థానంలో పారవేయాలి. తరువాత స్నానం చేసి దేవతలకూ, ఋషులకూ, పితృగణాలకూ విధ్యుక్తంగా తర్పణా లివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకులాగే అంగభూత ఆచమనం చేయాలి. సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోదక బిందువులతో, ఆపోహిష్ఠా... మున్నగు వారుణ మంత్రాలనూ, సావిత్రీ మంత్రాన్నీ జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్నీ భూఃభువఃస్వః అనెడి వ్యాహృతులనూ జోడించి గాయత్రిని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి *. (* సంధ్యోపాసన సంపూర్ణంగా ఈ కాండ లోనే 35వ అధ్యాయంలో విశదీకరింపబడింది.)


సంధ్య వార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క.  

ప్రాంగ్ముఖం సతతం విప్రః సంధ్యోపాసన మాచరేత్ | 

సంధ్యాహీనో, శుచిర్నిత్య మనర్హః సర్వకర్మసు ॥ 

యదన్యత్కురుతే కించి న్నతస్య ఫలభాగ్భవేత్ ॥

అనన్య చేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ॥

ఉపాస్య విధి వత్సంధ్యాం ప్రాప్తాః పూర్వపరాంగతిం |

యో న్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః ||

విహాయ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతం |

తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్ ॥ 


(ఆచార 50/21-25)


సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి, పరమాత్మ, భగవంతుడునైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సంయత భావంతో పది లేదా వంద లేదా వేయిమార్లు, వీలును బట్టి, గాయత్రి మంత్ర జపాన్ని చేయాలి. తప్పనిసరిగా రోజూ వేయిమార్లు గాయత్రి మంత్రజపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవకార్యంగా సర్వ వైదిక వాఙ్మయంలోనూ ప్రశంసింపబడుతోంది. గాయత్రి లేక ద్విజుడు లేడు.


ఏకాగ్రచిత్తంతో, ఉదయమే, భాస్కర భగవానుని ధ్యానించాలి. ఋగ్యజుస్సామ వేదాలలో కనుపించు వివిధ సౌరమంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి, తలను నేలపై ఆనించి క్రింది మంత్రాలతో నమస్కరించాలి.

 

ఓం ఖఖోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే

నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణే

త్వమేవ బ్రహ్మ పరమమాపోజ్యోతీ రసోఽమృతం

భూర్భువః స్వస్త్వ మోంకారః సర్వోరుద్రః సనాతనః (ఆచర 50/28-30)

 

ఉత్తమ శ్లోకాన్నీ, ఆదిత్య హృదయాన్నీ త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరల శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి.


Thursday 7 March 2024

శ్రీ గరుడ పురాణము (112)

 



నిత్యకర్మలు - అశౌచాలు


శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడూ బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చేయాలి.


విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలం లోనే నెలకొనియున్న ఆనంద స్వరూపి, అజరామరుడు, సనాతన పురుషుడునగు విష్ణు భగవానుని ధ్యానించాలి. తరువాత యథావిధిగా శౌచాదిక్రియలను చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్నానము లౌకిక, పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపజేస్తుంది.


రాత్రి సుఖంగా నిద్రించేవారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు, అశుచులూ కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలుపెట్టాలి.


స్నానం ప్రాతఃకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న, అనిష్టకారిణియైన కాలకర్ణియను శక్తి, దుఃస్వప్న కారణంగా కలిగే చింతలూ, పాపాలూ కడుక్కుపోతాయి. నిజానికి, స్నానం లేని కార్యమేదీ ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు. లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానమంటారు.


బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములారు రకములు. ఏది చేయడానికి తన కధికారముందో దాన్ని మానవులుచేయాలి. మంత్ర సహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకొనేది బ్రాహ్మస్నానము. శిరసు నుండి సిరిపాదము దాకా యథావిధానంగా భస్మంతో అన్ని అంగాలనూ మెత్తుకొనేది ఆగ్నేయస్నానం. ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకొనేది వాయవ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతోంది. ఎండ వుండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్యస్నానం. సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం. దీనినే మానస - ఆత్మ వేదనమంటారు. బ్రహ్మాకార అఖండ చిత్త వృత్తి అని బ్రహ్మవాదులందరిచేతా సేవింప బడేది కావున దీనినే ఆత్మతీర్థమని కూడా అంటారు. (తీర్థమంటే స్నానమని అర్థముంది)


Wednesday 6 March 2024

శ్రీ గరుడ పురాణము (111)




వాయువును నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం. మంత్రోచ్ఛారణ చేస్తూ దేవధ్యానంలో వుండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భప్రాణాయామమంటారు. వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే వుండి పోవడాన్ని పూరకమనీ, వాయువును పీల్చుట నాపి దేహాన్నీ ఇంద్రియాలనూ స్థిరంగా వుంచడం కుంభకమనీ, అంతవఱకు లోపల ఆపిన వాయువును మెలమెల్లగా బయటకు వదలుట రేచకమనీ వ్యవహరింపబడుతున్నాయి. 

ప్రణవ (ఓంకార) జప ప్రక్రియలో 'మాత్ర' (అంటే రెప్పపాటు కాలం)కి విశేష మాహాత్మ్యముంది. ఆ మాత్రానుసారము పన్నెండుమార్లు ప్రణవ-జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశమాత్రిక (లఘు) అనీ, ఇరవై నాలుగు మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక (మధ్యమ) అనీ, అదే ముప్పదియారు పర్యాయములైతే 'షట్' త్రింశన్మాత్రిక (ఉత్తమ) అనీ అంటారు.


ఈ యామాల్లోనే నిరోధం ప్రత్యాహారం, బ్రహ్మచింతన ధ్యానం, మనోధైర్యం ధారణ. ఇవి పారిభాషిక పదాలు.


అహంబ్రహ్మా నేను బ్రహ్మను అను అభేదజ్ఞానంతో బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచి పోవడమే సమాధి. తరువాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్త్వమసి అను శ్రుతి ద్వారా తెలుసుకోవడమే బ్రహ్మానందము.


'నేను అశరీరిని, ఇంద్రియాతీతుడను. మనోబుద్ధ్యహంకారాల నుండి జాగృతుడను, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను, బ్రహ్మ యొక్క తేజః స్వరూపమేదైతే వుందో అదే నేను. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్య, ఆనందస్వరూప, అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే' అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది. ఆ వ్యక్తి ముక్తిని పొందాడని అర్థం. ఇది తపస్సు.


(అధ్యాయం 49)


Tuesday 5 March 2024

శ్రీ గరుడ పురాణము (110)

 


ఇపుడు ఈ చతుర్వర్ణాలవారూ చేరుకొనే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు ప్రాజాపాత్య లోకప్రాప్తి నొందుతారు. యుద్ధంలో పారిపోకుండా, తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందగలరు. నిత్యమూ తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు మరుద్ దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది.


ఊర్ధ్వ రేతస్కులై, బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి వందల యేళ్ళ తపస్సు ద్వారా బ్రహ్మలోకంలో నొక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు ఎనభై ఎనిమిది వేలమంది మన భారతీయ పరంపరలో వున్నారు. ఆ స్థానమే గురుకుల నివాసియైన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. పునర్జన్మవుండదు. ఆ మోక్ష పదం పరబ్రహ్మ వ్యోమమనీ, ఈశ్వర సంబంధి పరమానంద నిలయమనీ, అమృతస్థానమనీ చెప్పబడింది. ఇదే ముక్తిపదం అష్టాంగమార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి.


అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము- ఈ అయిదింటి ని'యమ' (సునియమ)ములంటారు. ప్రాణులను బాధింపకుండుట అహింస, ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు (సత్యము), ఇతరుల వస్తువులను కోరకుండుట, వాడకుండుట అస్తేయము, లైంగిక సంబంధము లేకుండ జీవించుట బ్రహ్మచర్యము, తనకున్నదంతా త్యాగం చేయడం అపరిగ్రహం*.


(* ఈ పదాలకు ఈ అర్థాలున్నది శాస్త్ర పరిభాషలో మాత్రమే. వీటి రూఢ్యర్థాలు - అంటే - లోకంలో స్థిరపడిన అర్ధాలు వేరు.)


శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ప్రణిధానములనబడు అయిదింటినీ నియమములంటారు. శౌచమనగా శరీరాన్నీ పరిసరాలనూ మనస్సునూ పరిశుభ్రంగా వుంచుకొనుట. సంతోషమనగా తుష్టి, ఇంద్రియ నిగ్రహమే తపము, మంత్రజపమే స్వాధ్యాయము. భగవత్ పూజ నాదికములు ప్రణిధానము.


పద్మాది ఆసనములను భక్తితో వేసి జపము చేయుట ఆసనసాధనము.