Friday 30 June 2023

శ్రీదత్త పురాణము (184)

 


పూర్వకాలంలో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనంలో శాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అధ్యయన - అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతడి ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవ గ్రహాలలాగా తొమ్మండుగురు పుత్ర సంతానం కలిగారు. వారిలో ధ్రువుడు - క్షమి - మధుడు - తారుడు జ్యోతిష్మంతుడు అనే అయిదుగురూ పరమ వైష్టికులు. కర్మిష్ఠులు. - నిత్యాగ్నిహోత్రులు. గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా వున్నారు. తక్కిన నలుగురూ విరక్తి మార్గం ఎంచుకున్నారు. నిర్మోహుడు -జితమాయుడు - ధ్యానకాష్టుడు- గుణాతిగుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహులై నిస్సంగులై నిష్పరిగ్రహులై శిఖా యజ్ఞోపవీతరహితులై అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీరి దృష్టిలో బంగారం ముద్దకూ, మట్టి గడ్డకూ తేడా లేదు. ఆకో అలమో మొలలకు అచ్ఛాదనగా ధరించడం, పండో ఫలమో దొరికింది తినడం - ఇదీ వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు- జితాహారులు. వాత శీత సహిష్ణువులు. ఈ చరాచర జగత్తులో అణువు అణువునా విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనంగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం. అణువంతైనా కర్మాచరణం చెయ్యని యోగులు, ధృఢ జ్ఞాన సంపన్నులు. సద్విచార విశారదులు.


వీళ్ళు నలుగురూ ఒక రోజున నీయింటికి వచ్చారు. అప్పుడు నీవు మత్స్యదేశంలో విప్రుడుగా భార్యాపుత్రాదులతో ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. నీకు అది ఎనిమిదవ జన్మ. వైశ్య దేవం ముగించుకొని అతిధులకోసం ఎదురుచూస్తూ నువ్వు వాకిలిలోకి వచ్చే సరికి ఈ నలుగురు నిరహులూ నీకు కనిపించారు. ఆదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో అతిధి మర్యాదలు చేసి సముచితాసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలి బద్ధుడవై వినమిత శిరస్కుడవై నిలబడ్డావు.


మహానుభావులారా ! ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది. జీవితం సమస్తమూ ధన్యమయ్యాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికీ స్వయంగా శ్రద్దగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు భక్తితో శిరస్సున జల్లుకున్నావు. అటుపైని వారికి పాద పూజలు చేసావు. షోడశోపచారాలు చేసావు. రుచిగా శుచిగా శాక పాకాలతో విందు భోజనం పెట్టావు. ఆ యతులు నలుగురూ పరంజ్యోతియైన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ యింటిలోనే విశ్రాంతి తీసుకున్నారు.


Thursday 29 June 2023

శ్రీదత్త పురాణము (183)

 


ఇంతకీ వికుండలా! నువ్వు తెలియక చేసినా మాఘస్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తోంది. నరక యాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది మాఘస్నానం. సరే ప్రసక్తాను ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదయినా విషయాన్ని శ్రుతి స్మృతి పురాణేతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే బిడియ పడకుండా అడుగు. నాకు తెలిసింది చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా! - అని ముగించాడు యమదూత. వికుండలుడు కృతజ్ఞతా భావంతో నమస్కరించాడు.


మహానుభావా! పేరుకు నువ్వు యమ దూతవేకానీ ఎంత సౌమ్యుడివి. తదయాయముడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమయ్యింది. నీ వంటి ఉత్తమ సజ్జమలతో సాంగత్యం గంగానది లాగా వెంటనే సర్వ పాపాలను పోగొడుతుంది. ఉపకారం చెయ్యడం, ప్రియం చెప్పడం అనేవి సజ్జమలకి సహజగుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా!


దేవదూతా! నాదొక విన్నపం. కారుణ్య మూర్తివి నువ్వే ఆలోచించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకం నుండి తప్పించడమెలాగ? నా పుణ్యం నుండి అవసరమైనంతా ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వ జన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేసానా? ఎంత పుణ్యం ధారపాయ్యగలను? ఇవి కాస్త తెలియజెప్పి పుణ్యం కట్టుకో. నీ మేలు మరిచిపోలేను అంటూ దీనంగా చేతులు పట్టుకున్నాడు.


వికుండల పూర్వ జన్మ


దేవదూత క్షణకాలం ధ్యాన మగ్నుడు అయ్యాడు. మైత్రీ బంధం అతడికి ఒక నిర్భంధం అయ్యింది. జ్ఞాన దృష్టిని సారించాడు. విషయమంతా అవగతమయ్యింది. మెల్లగా కన్నులు తెరిచాడు. వైశ్యకులోద్భవా ! నీ పూర్వజన్మం నీ సంచిత పుణ్యం అంతా సహేతుకంగా చెబుతాను విను.


Wednesday 28 June 2023

శ్రీదత్త పురాణము (182)

 


బాల్య, యౌవన, కౌమారాల్లో వార్ధక్యదశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశ్యుపవాసం ఉంటే చాలు ఇటూ అటూ పాపాలన్నీ హుష్ కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరి వాసరాన పుణ్యతీర్ధ స్నానం చేసి హేమ -భూ-గో-వస్త్ర-తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా - ఇక చెప్పేది ఏముంది స్వర్గలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యంలేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికీ తధ్యం. ఇవి చెయ్యని వారు - అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్ధస్నానమూ ఏదో ఒక దానమూ కాశింతధ్యానమూ చెయ్యనివారు కచ్చితంగా ఇహపరాలకు చెడతారు. దుఃఖభాగులవుతారు.


ధర్మ మహిమ


మిత్రమా ! నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను పనిలో పనిగా వినేసేయ్. త్రికరణ శుద్ధిగా జీవించడం - అంటే మనోవాక్కాయకర్మతో ఏ ప్రాణికీ ద్రోహం చెయ్యకపోవడం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవాపరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించడం - ఇవి కచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక్క సంగతి - చేసిన తపస్సుగానీ, చేసిన దానాన్ని గానీ, చేసిన ఉపకారాన్ని గాని పదిమందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్ధి ఈ పని చెయ్యడు. శక్తివంచన లేకుండా యవలు - వస్త్రాలు - ఛత్రాలు - కందమూల ఫలాలు - అన్న పానీయాలు మొదలైన వాటిని పది మందికీ పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగలడు కదా! అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజునూ గొడ్డుబోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్రా! ఒకరికి పెట్టనిది తనకు మిగలదు - ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మాలోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్మంతులై ధనాఢ్యులై సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటు పైన స్వర్గ లోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మంతొక్క వలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా! వెయ్యి మాటలెందుకు. ధర్మం సుగతికీ అధర్మం దుర్గతికి దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవరచుకోవాలి. ఇదీ సారాంశం.


Tuesday 27 June 2023

శ్రీదత్త పురాణము (181)

 



యోగ్యుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామం దానంచేస్తే నదీ సముద్రకాననాద్రి సహితంగా సమస్త భూగోళాన్ని దానం చేసినట్లే. అంతటి పుణ్యం దక్కుతుంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం కానీ క్రయవిక్రయాలు జరపడం కానీ అలాంటి వాటిని ఆమోదించడం గానీ అసలైనదా నకిలీదా అని పరీక్షించడంగానీ - ఇవ్వి మహాపాపాలు. శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనుల్ని ఎప్పుడూ ఎన్నడూ ఎవ్వడూ చెయ్యకూడదు.


పాప భీతి ఉన్నవారు వాసుదేవుణ్ని స్మరించడం మంచిది. అది సర్వపాపహరం. ఘోరారణ్యాల్లో కఠోర నియమాలతో సంవత్సరాల పాటు తపస్సులు చెయ్యడం కన్నా త్రికరణ శుద్ధిగా గోవింద నామస్మరణ చెయ్యడం చాలా తేలిక, పుణ్య ఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండూ సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనంగా ఇంకొక విశేషం ఏమిటంటే ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్రచిత్తంతో హరి నామం స్మరించు, నువ్వు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వ తీర్ధ స్నాన ఫలం సర్వదేవాలయ సందర్శన ఫలం - సమస్తమూ విష్ణు నామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యం గానీ నరక నివాస మహా సౌఖ్యంగానీ ఏ మాత్రమూ దక్కవు. నాయనా? వికుండలా! నేను వైష్ణవుణ్ని పరమభాగవతోత్తముణ్ని అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు సరికదా సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాల పడతారు. రాకరాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు.


ఏకాదశి మహిమ


వికుండలా! మా ప్రభువు యమధర్మరాజుల వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిన వేస్తాను. గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలిసో తెలియకో కావాలని కానీ తప్పనిసరియై కానీ, ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడూ రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదని ఘంటా పధంగా చెప్పారు. ఈ పద్మనాభైకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి, శరీరంలో బంధీగా వుండడం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా! దీన్నే హరివాసరం అంటారు. వెయ్యి అశ్వమేధాలు, నూరు రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో పదహారోవంతుకైనా సాటి రావంటే అతిశయోక్తికాదు. ఏకాదశేయింద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు. కావాలని చెయ్యకపోయినా, ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్ష కారిణి. శరీరారోగ్య ప్రదాయిని. సుకళత్రదాయిని. జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ పుష్కర కురుక్షేత్రాది పుణ్యతీర్దాలు ఏవీ సాటి రావు. ఆయాచోట్ల చేసే పుణ్య కార్యాలకన్నా అధికపుణ్య ప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం, పగలంతా ఉపవశించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంలో. అంతే కాదు ఇది చేసిన వ్యక్తి - తల్లి వైపున పది తరాలునూ తండ్రి వైపున పది తరాలనూ తన వాళ్ళు పది మందినీ ఉద్దరించిన వాడవుతాడు. తరింపజేసిన వాడవుతాడు.


అలా ఉద్దరించబడ్డ వారంతా గరుడ కేతనులై వనమాలికా భూషితులై పీతాంబర ధారులై వైకుంఠం చేరుకుంటారు.


Monday 26 June 2023

శ్రీదత్త పురాణము (180)

 


అంగన్యాస కరన్యాసాలతో షోడశోపచారాలతో గీత వాదిత్రస్తోత్ర నృత్యాలతో సాలగ్రామ శిలాచక్రంలోని శ్రీమన్నారాయణుడికి నిత్యము పూజలు చేసే పుణ్యశాలి ఈ కలియుగంలో సైతం ధర్మపరాయణుడై వివిధ భోగభాగ్యాలను అనుభవించి అటుపైన సహస్రకోటి కల్పాలు వైకుంఠంలో శ్రీ హరి సన్నిధిలో ఆనందంగా గడుపుతాడు. కోటి లింగాలను అర్చించినందువల్ల వచ్చే పుణ్య ఫలం ఎంతటిదో ఒక్క సాలగ్రామ శిలను అర్చించడంచేత వచ్చే పుణ్యఫలం అంతటిది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలూ ఏమీ లేక పోయినా ఫర్వాలేదు. యధాలాపంగానైనా సాలగ్రామ శిలను ఒక్కసారి అర్చిస్తే చాలు అతడు ముక్తిని పొందుతాడు. శ్రీ మన్నారాయణుడు సాలగ్రామ శిలారూపియై నివశించే చోట సకల దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతులు, చతుర్దశభువనాలు సన్నిధి చెయ్యడం తథ్యం. సాలగ్రామ శిలాసాన్నిధ్యంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే, పితృదేవతలు పరిపూర్ణంగా సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే చాలు పంచగవ్యాన్ని వెయ్యిసార్లు ప్రాశించిన ఫలం దక్కుతుంది. కోటి సహస్ర తీర్థాలలో కోటి సహస్ర పర్యాయాలు మునిగిన పుణ్యం దక్కుతుంది. సాలగ్రామ శిలాతోయంలో చక్రాంకిత శిలాజలాన్ని సమ్మిశ్రితం చేసి శిరస్సున, దేహాన్న జల్లుకున్నా ముమ్మారు లోపలికి పుచ్చుకున్నా ఇక అతడి శరీరం చక్రాంకితమైనట్లే. ఏ మాత్రం సందేహం లేదు. అయితే పుణ్యాత్ములకు తప్ప ఈ శంఖ చక్ర ముద్రలు ఇతరులకి కనిపించవు. ఇవి పరమగుప్తాలు.


అందుచేత ఓ వైశ్య శిఖామణీ! మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల ఇళ్ళవైపు వెళ్ళవద్దని కట్టడిచేసాడు. విష్ణుపాదోదకాన్ని సేవించిన వారు కనుక విష్ణు భక్తులంటే మాకు చచ్చేంత భయం.


మిత్రమా! వాపీ కూప తటాకాదుల్లో మూడు రోజులు స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యఫలాన్ని సముద్రుణ్ని చేరని ప్రవాహాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ ప్రవాహాలలో పదిహేను రోజులపాటు స్నానాలు చేసినందువల్ల వచ్చే పుణ్య ఫలాన్నీ సముద్రుణ్ని చేరే నదీనదాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ నదీ నదాల్లో నెల నాళ్ళు మునిగిన పుణ్యఫలాన్ని సముద్రుడు ఒక్క మునకతో అందిస్తాడు. ఆరు నెలలు సముద్రస్నానం చేసినందువల్ల దక్కే పుణ్యాన్ని గోదావరి ఒక్క స్నానంతో ఇస్తుంది. గోదావరిలో సంవత్సరం పుణ్యాన్ని గంగమ్మ ఒకే ఒక్క మునకతో ఇస్తుంది. పుష్కరం పాటు గంగా స్నానం చేసినందువల్ల లభించే పుణ్యఫలాన్ని విష్ణుపాదోదకమైన ఈ సాలగ్రామ శిలాజలం శిరస్సేచనంతో అందిస్తుంది. కనుక ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వారికి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్న ప్రదేశం - మూడు ఆమడల విస్తీర్ణం వరకూ పవిత్ర తీర్ధంకిందనే లెక్క. ఆ ప్రాంతంలో చేసిన చేసిన దానాలూ, హోమాలు కోటి రెట్లు అధికంగా వేగంగా ఫలితాన్ని అందిస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సేవించగల్గితే ఆ మనిషికి ఇంకెప్పుడూ మాతృస్తన్యం గ్రోలవలసిన పరిస్థితి రాదు. పునర్జన్మ లేనిముక్తి పొందుతాడు.


Sunday 25 June 2023

శ్రీదత్త పురాణము (179)

 


సాలగ్రామ మహిమ


వజ్ర కోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షువులు వాసుదేవుణ్ని అర్చిస్తారు. సాలగ్రామశిల విష్ణువుకి అధిష్టానం, ఇది సర్వ పాప ప్రణాశకం, సర్వ పుణ్య ప్రదం. అందరికీ ముక్తిదాయకం. ప్రతి రోజూ సాలగ్రామ శిలా చక్రంలో శ్రీ హరిని పూజించినవారు వెయ్యి రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. అక్షరమూ అచ్యుతమూ అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది, సాలగ్రామ శిలార్చనంతో పుణ్యాత్ములు పొందుతారు. కాష్టంలోని వహ్ని మధనంతో బయట పడినట్లు సాలగ్రామార్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైన దుష్కృత్యాలు చెయ్యడం వల్ల ఏ సత్కార్మాచరణకూ అధికారంలేని మహాపాపాత్ములైనా ఒక్క సారి సాలగ్రామ సమార్చన చేస్తే వారింక మా యమాలయం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసమంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో క్రీడించడంకన్నా వైకుంఠంలో విహరించడం కన్నా ఇష్టమైన విషయం.


సాలగ్రామ శిలాచక్రంలో శ్రీ మన్నారాయణుణ్ని ఒక్కసారి అర్చిస్తే అతడు ఆహో రాత్రాలు హోమాలు చేసిన పుణ్యాన్ని చతుస్సాగర సమేతంగా భూగోళాన్ని అంతటిని దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండలా! సాలగ్రామ శిలలు పన్నెండువున్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను. విను. స్వర్ణ కమలాలతో కోటి ద్వాదశ లింగాలను పన్నెండు కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం వస్తుందో అది ఒక్క రోజున ద్వాదశ సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశీలి విష్ణులోకంలో పన్నెండు కల్పాల పర్యంతం నివసించి అటుపైని భూగోళం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్ వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శిలార్చన చేస్తే వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలా చక్రంలో గోవిందుణ్ని అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకూ వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. తీర్ధయాత్రలు చెయ్యకపోయినా దాన ధర్మాలు చెయ్యకపోయినా యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా సాలగ్రామ శిలార్చన చేస్తే చాలు ముక్తి లభించడం తథ్యం. సకల పాపాలకు ఇది విరుగుడు. నరక నివాసం గర్భవాస క్లేశం (పునర్జన్మ) క్రిమి కీటక, పశు పక్షి నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసిరాజు అనగల్గినది ఈ సాలగ్రామ శిలార్చన, దీక్షా స్వీకారంతో మంత్ర పూర్వకంగా ఈ శిలా చక్రంలో చక్రిని అర్చించి బలి ప్రధానం చేసినవాడు విష్ణులోకంలో శాశ్వత నివాసం పొందుతాడు. ఇది ముమ్మాటికీ నిజం. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం జేసి ఆ పావనోదకాన్ని శిరస్సున జల్లుకొన్న భక్తుడు సకల పుణ్య తీర్థాలలోనూ స్నానం చేసిన పవిత్రతనూ, సర్వ యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని క్షణంలో నిస్సందేహంగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైన గంగా గోదావరీ రేవాది నదులు సకల పుణ్య తీర్ధ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకంలో సన్నిధి చేస్తాయి.


Saturday 24 June 2023

శ్రీదత్త పురాణము (178)

 


వైష్ణవ మహిమ


వికుండలా! మరొక అద్భుత రహస్యం నీకు చెబుతాను. ఇది యమధర్మరాజు సమ్మతమూ సర్వలోక అభయ ప్రదమూనూ, శ్రద్ధగా ఆలకించు. విష్ణు భక్తి పరాయణులైన పరమవైష్ణవులు మాలోకాన్ని గానీ మా ప్రభువును గానీ చూడరంటే చూడరు. ఇది ముమ్మాటికీ సత్యం. మా ప్రభువు మాకు ఎప్పుడూ హెచ్చరిక చేస్తుంటాడు వైష్ణవుల - జోలికి వెళ్ళవద్దనీ, వారు మన ముఖం చూడరనీను. బుద్ధి పూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తూ నైనా కేశవుణ్ని స్మరించిన వాడు సకలాఘ విముక్తుడై విష్ణులోకం చేరుకుంటాడు. అంచేత విష్ణు భక్తుడు ఒక వేళ దురాచారుడైనా పాప కార్యాలు చేసినా మనం అతడి జోలికి పోకూడదు అని మా ప్రభువు కట్టడి చేసాడు. అంతేకాదు వైష్ణవులు - భుజించిన ఇళ్ళఛాయలకూ వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారి జోలికి వెళ్ళవద్దు అన్నాడు. ఆ ఉభయులూ గత కిల్బిషులు అవుతారట. అంచేత వైష్ణవుడుగానీ వైష్ణవున్ని పూజించిన వారు కానీ వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారు కానీ యధాలపంగా హరినామ స్మరణ చేసిన వారుగానీ మా రాజధానికి రారు. వారికి ఆ అవసరం లేదు. ఎంతటి పాపిష్టికైనా విష్ణు భక్తిని మించిన నరక నివారణోపాయం మరొకటి లేదని తెలుసుకో. నరకాంబుధిని హాయిగా దాటించే నావ హరినామ సంకీర్తన. ఆ మనిషి వర్ణ బాహ్యుడైనప్పటికీ విష్ణుభక్తుడైతే చాలు. ముల్లోకాలనూ పావనం చేస్తాడు. నరకంలో మ్రగ్గిపోతున్న తల్లి తండ్రుల్ని కొడుకు చేసే కేశవార్చన ఉద్ధరించి వైకుంఠానికి తీసికొని వెడుతుంది. వైష్ణవులకు సేవలు చేసే వారూ వైష్ణవభుక్త శేషాన్ని ప్రసాదంగా స్వీకరించే వారూ హరిధామం చేరుకుంటారు. అంచేత వైష్ణవాన్నాన్ని అభ్యర్థించి ఆరగించాలి. లేదంటే కనీసం వారి ఇంట, వారిచేతుల మీదుగా కాసిన్ని మంచినీళ్ళయినా పుచ్చుకోవాలి. గోవింద నామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ అసువులు బాసినా వారి జోలికి మేముగానీ మా ప్రభువుగానీ వెళ్ళంగాక వెళ్ళం.


అంగన్యాస కరన్యాసాలతో బుషిచ్చందో దైవతంగా దీక్షా విధి పూర్వకంగా యంత్ర సహితంగా ద్వాదశాక్షర లేదా అష్టాక్షరీ మహామంత్రాన్ని నిత్యమూ జపించే విష్ణుభక్తుల్ని అల్లంత దూరం నుంచి ఒకసారి దర్శిస్తే చాలు బ్రహ్మ హత్యాపాతకుడు సైతం పరిశుద్ధుడు అయిపోతాడు.


ఓం నమో భగవతే వాసు దేవాయ అనేది ద్వాదశాక్షర మంత్రం.


ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షర మహా మంత్రము. శంఖ చక్రాంకితులైన వైష్ణవులు విష్ణురూపులై బ్రహ్మా యుగాంతకాలం వైకుంఠంలో నివసిస్తారు. హృదయంలోగానీ సూర్యబింబంలో గానీ జలరాశిలో గానీ ప్రతిమలో గాని స్థండిలం మీద గానీ (నేల) వనమాలి రూపాన్ని భావించి లేదా రూపించి ధ్యానించేవారు విష్ణుపదం చేరుకుంటారు.


Friday 23 June 2023

శ్రీదత్త పురాణము (177)

 


ద్రవ్యం - అన్నం - తోయం - ఒకటేమిటి శివస్వం (శివుడి సొమ్ము) దేనిని అపహరించి తీసుకుపోకూడదు. శివనిర్మాల్యం దాటరాదు. శ్రద్ధగా తీసికెళ్ళి ఏదైనా కూపంలో విడిచిపెట్టాలి. లోభం వల్లగానీ, మోహం వల్లగానీ శివస్వాన్ని (శివసొమ్మును) ఈగ కాలంతైనా సొంతానికి వాడుకున్నాడంటే వాడు కల్పాంతం వరకు నరకంలో కుతకుతా.. ఉడికిపోతాడు.

 

ఆవిరి గడ్డితోగానీ, ఆకుతో గానీ, వాననీరు దిగకుండా శివాలయం నిర్మిస్తే ఆ పుణ్యాత్ములు శివ సన్నిధిలో చిరంతనంగా ఆనందానుభూతి పొందుతుంటారు. త్రిమూర్తులలో ఎవరికి ఆలయం కట్టినా మఠం కట్టినా వారు ఆ స్వామిలోకంలో స్వామి సన్నిధిలో స్థిర నివాసం పొందుతారు.

 

ధర్మ పత్రాలూ, సాధుమథాలూ, గోశాలలు, బాటసారులకు సుఖంగా దారి ప్రక్కన విశ్రాంతి మందిరాలూ, యతి సదనాలూ, దీనకుటీరాలూ, వేదాధ్యయన మందిరములూ, విప్రులకు గృహాలు నిర్మించిన దాతలు ఇంద్రలోకంలో శాశ్వత నివాసం పొంది ఇంద్ర భోగాలు అనుభవిస్తారు. వీటిని జీర్ణోద్ధరణ చేస్తే ఈ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. అంతేగానీ - శిధిలమైన వాటిని పూర్తిగా పాడు పెట్టి కొత్తవి నిర్మించిన పుణ్యానికిపోతే పాపం ఎదురై నరకం దక్కుతుంది.

 

దేవాలయములు, విప్రగృహాలూ, యతిమఠాలూ మొదలైన వాటికి ధనలోభంతో ఆధిపత్యం చేపట్టినవాడు సర్వపాపభాజనుడు అవుతాడు. మఠాలకు సంభందించిన పత్రం, పుష్పం, ఫలం, తోయం, ద్రవ్యం అన్నం- వీటిని ఎవడైనా కాజేస్తే నరక నివాసం తప్పదు. కాబట్టి ఎవడినైనా సపుత్ర మిత్ర పశు బాంధవంగా నరకంలోకి నెట్టివెయ్యాలను కుంటే అతడికి దేవాలయ గోశాలా విప్రగృహ మఠాధిపత్యం అప్పగిస్తే సరి. మఠాధిపత్యం తన చేతిలో ఉంది గదా అని మఠాన్నాన్ని తానూ ఒక పూట భుజిస్తే ఆ దోషం చంద్రాయణ వ్రతంతో గానిపోదు. ఇలా ఏదో రకంగా చిన్నదో పెద్దదో పాపం చుట్టుకోక తప్పని పదవులు కనక వీటిలో ఉన్న వారిని స్పృశిస్తే సచేల స్నానం చెయ్యాలి. త్రిమూర్తుల అర్చనలకోసం పుష్ప వాటికలు నిర్మించినవారు దేవ లోకంలో నిత్య నివాసం పొందుతారు.


Thursday 22 June 2023

శ్రీదత్త పురాణము (176)

 


కనుదోయికి అవ్యకాంతలు అడ్డంవస్తే మాతృభావన చేసి మరలి పోయే పుణ్యాత్ములూ, పరకాంతలను మానసికంగానైనా వాంఛించని విగ్రహ సంపన్నులూ ఇహ పరలోకాలలో దేవలతలతో సమానం. వీరి వల్లనే భూమి ఇలా నిలబడుతోందంటే అతిశయోక్తి కాదు. అంచేత బుద్ధిమంతులు పరదారాభిలాషను వదులుకోవాలి. లేదంటే అనేక వేల సంవత్సరాలు నరక కూపాలలో మ్రగ్గిపోవలసి వస్తుంది. పరకాంతలపట్లనే కాదు ఏ పరద్రవ్యం పట్లా లోభం పనికి రాదు. అలోభులకు అమరలోకం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ వుంటుంది. క్రోధం వహించవలసినంతటి కారణం ఉన్నప్పటికీ ఎవడు క్రోధానికి ఓడిపోడో అతడు స్వర్గాన్ని గెలుచుకున్నాడన్న మాటే. స్వర్గం ఎప్పుడూ అక్రోధనులదే. వృద్ధులైన తల్లి తండ్రుల్ని దేవతలుగా ఆరాధించే వారు, తండ్రి కన్నా గురువును అర్చించే వారు సత్యలోకంలో బ్రహ్మదేవుడికి అతిధులు అవుతారు.


దుస్సాంగత్యాలకు దూరంగావుండి శిల సంరక్షణ చేసుకున్న స్త్రీలు స్వర్గలోక నివాసం పొందుతారు. శీలవతులను చూస్తే మేమూ మా ప్రభువూ శిరసు వంచుతారు.


అభ్యాసరతులూ శాస్త్రాభ్యాస నిరతులూ పురాణ ప్రవక్తలూ ధర్మ ప్రభోధకులూ వేదాంత చర్చ నిషణ్నులూ! హతకిల్బిషులై మోహాతీతమైన బ్రహ్మలోక నివాసం పొందుతారు. వేదశాస్త్రాలలోని సారాంశాలను జ్ఞాన యజ్ఞరూపంగా అడిగిన వారికి అడగని వారికీ ఉదారంగా పంచిపెట్టే జ్ఞానదాతలు భవబంధనివారకులు కనుక వారిని పైలోకాలలో దేవతలు కూడా అర్చిస్తారు.


శివపూజా మహిమ


రేవానదీతీరంలో వెలసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకి ఒక సారిగానీ రెండుసార్లు గానీ మూడు పూటలాకానీ అర్చించాలి. స్పటిక లింగాలూ, రత్నలింగాలూ, స్వయంభూ పార్ధివలింగాలూ ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో దేనినైనా అర్చించవచ్చు. ఇవి ఏవీ చేరువలో లేని వారు ఏదైనా ఒక తీర్ధం లోనో, కొండ మీదనో, వనంలోనో, ప్రతిష్టితమై చేరువలో వున్న ఏదో ఒక శివలింగాన్ని నమశ్శివాయ మంత్రం జపిస్తూ అర్చించాలి. ఇలా అర్చించిన వారి కిహ పరాలలో ఏనాడూ యమలోకం అనే పలుకే వినపడదు. శివపూజా ప్రభావం ఎంతటిదంటే శివుడిపట్ల త్రికరణ శుద్ధిగా అనురక్తులైన శివభక్తులు పద్నాలుగు ఇంద్రకల్పాల పర్యంతం శివలోకంలో నివసిస్తూ శివుడితో వినోదిస్తూ వుంటారు. ప్రసంగవశాన కానీ, మోసగించడానికి గానీ కపటబుద్ధితో గానీ దంభాచారంగాకానీ లోభగుణంచే గానీ ఎలాగైనా సరే మహాదేవుణ్ని తెలిసో తెలియకో అర్చించినవారు రవిపుత్రుడైన యముణ్ని చూడరుగాక చూడరు. సర్వపాప ప్రణాశకం సర్వైశ్వర్యప్రదం ఈ శివార్చన, దీన్ని మించిన పుణ్య ప్రదమైనది మరొకటి ఈ జగత్రయంలో లేదు, ఇక్కడ ఒక రహస్యం వుంది. షట్కాల శివలింగార్చన చేస్తున్న శివభక్తులం కదా అని ఎవరైనా జనార్ధనుడ్ని ద్వేషిస్తే అదీ శివద్వేషంతో సమానం అవుతుంది. విష్ణుభక్తులు శివుణ్ని ద్వేషిస్తే అది విష్ణు ద్రోహం అవుతుంది. ఉభయులకీ నరకం తప్పదు.


Wednesday 21 June 2023

శ్రీదత్త పురాణము (175)

 


ఏ వ్రతంకానీ ఏ దానం కానీ ఏ తపస్సుకానీ ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకంతో సమానంకావని పెద్దలు ఎందరో చెప్పగా విన్నాను. గంగానదిని మిగతా తీర్థాలతో సమానంగా భావించే వాడు దారుణ రౌరవ నరకానికి పోతాడు. గంగామృత జలమంటే - ధర్మద్రవం - గంగా జలం. సమస్త నదీనద వాపీ కూప తటాకాదులకు ఇది బీజప్రాయం. సాక్షాత్తూ వైకుంఠుడి పాద పద్మాల నుండి స్రవించి ముల్లోకాలకు ప్రవహిస్తుంది. ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు నెత్తిన పెట్టుకుంటాడు చెప్పు. గంగా జలం నిస్సందేహంగా నిర్గుణ పరబ్రహ్మం, పరా ప్రకృతి. దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండంలో మరొకటి ఏది వుంటుంది? ఎలా వుంటుంది? ఎక్కడ వుంటుంది ? అసంభవం. ఈ పవిత్రనదికి యోజనాల దూరంలో నివసిస్తున్నప్పటికీ నరుడు గంగా గంగా అనుకుంటే చాలు ఏ తీర్ధంలో మునిగినా మునగకపోయినా గంగా స్నాన ఫలం పొందుతాడు. నరకహేతులై ఏ ప్రాయశ్చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకమైనా గంగాజలంతో దగ్ధమైపోతుంది. కనుక జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించి గంగాస్నానం చెయ్యాలి.


బ్రాహ్మణులకి కొన్నింటినే దానం పట్టే యోగ్యత ఉంటుంది. దీన్ని ప్రతి గ్రహ సమర్థత అంటారు. ఇది ఉన్నప్పటికీ అప్రతి గ్రహమే నియమంగా జీవితం గడిపిన సద్వీపుడు తనువు చాలించిన తరువాత తారా రూపం ధరించి ఆకాశ వేదికను అలంకరిస్తాడు. ఊబిలో కూరుకుపోతున్న గోవును కాపాడిన వాడూ ఆ ప్రయత్నంలో మరణించిన వాడూ ఇలాగే గగనాంగనాన తారకలై వెలుగొందుతారు.


స్నేహితుడా! ప్రాణాయామ పరాయణులు యమలోకాన్ని ఉప్పున ఊదేస్తారు. వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామంతో ప్రక్షాళితులవుతారు. నిత్యమూ పదహారు ప్రాణాయామాలు చేస్తే భ్రూణ హత్యా మహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు. రకరకాల తపస్సులు వ్రతాలూ, నోములూ, నియమాలూ, నిష్టలూ, గో సహస్ర దానాలూ, అన్నీ కలిపి ఒక ప్రాణాయామానికి సరిపోతాయి. ఆహారపానీయాలను పూర్తిగా త్యజించి నెలకొక్క మారు మాత్రమే ధర్భాగ్రం మీదుగా ఒక్క నీటి బొట్టును మాత్రమే పుచ్చుకొని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో! మిత్రమా! ఎంతటి మహాపాతకం అన్నా చెప్పు, క్షుద్రోప పాతకమన్నా కానీ క్షణంలో ప్రాణాయామానికి భస్మమై పోవలసిందే.


Tuesday 20 June 2023

శ్రీదత్త పురాణము (174)

 

యధావిధిగా తిలపాత్రను దానంచేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కానీ దుష్ట చింతనలు కానీ అంటవు. యమభయం ఉండదు. లోకంలో ప్రసిద్ధంగా షోడశమహాదానాలు ఉన్నాయి. 1) తులా పురుషదానం 2) హిరణ్య గర్భదానం 3) బ్రహ్మాండ దానం 4) కల్పవృక్షదానం 5) గోసహస్రదానం 6) కామధేనుదానం 7) హిరణ్యాశ్వదానం 8) హిరణ్యాశ్వరధ దానం 9) హేమగజదానం 10) పంచలాంగల దానం 11) ధరాదానం 12) విశ్వచక్ర దానం 13) కల్పలతాదానం 14) సప్తసాగర దానం 15) రసధేను దానం 16) మహాభూత ఘటదానం. వీటిలో ఏ ఒక్కదానం చేసినా రౌరవ నరకం నుండి తప్పించుకోవచ్చు. మంచిరోజుల్లో గానీ సంక్రమణ సమయాల్లో గానీ వ్యతీపాత వేళల్లో గానీ స్నాన జపహోమాలు చేసిన వారికి సుగతులే కానీ దుర్గతులు ఉండవు. దాతలు ఇటు మా నరకం వైపు రావడం అసంభవం. అలాగే - వారి పునర్జన్మలు సంపన్నుల భవనాల్లో తప్ప, ధన హీనుల కొంపల్లో పడరు.


పత్యవాదులూ, మితభాషులు, అక్రోధనలూ, క్షమాశీలురూ, నీతిశాలురూ, అసూయా రహితులూ, దాక్షిణ్య సంపన్నులు, భూత దయాపరులూ, పరదోష గోపనులూ, పరగుణ ప్రశంసకులూ, పరుల సొమ్ము గడ్డిపరకైనా ఆశించనివారూ యమలోకానికి రారంటే రారు. ఇతరుల మీద ఉత్తినే లేనిపోని నిందలు మోపే వాడికన్నా మహాపాపిష్టి మరొకడు ఉండడు. వీడు మహా ప్రళయం వచ్చి సృష్టి అంతమయ్యేంత వరకూ అసి పత్ర - రౌరవాది ఘోర నరకాలలో యమయాతనలు అనుభవిస్తునే ఉంటాడు.


వాక్పారుష్యం ఉన్న వాడు నిస్సందేహంగా నిరయానికి (నరకానికి) పోతాడు. అటుపైన దుర్గతులు (కుత్సిత జన్మలు) పొందుతాడు. వణిక్ శ్రేష్టా! పాపాలు అన్నింటిలోకి కృతఘ్నత అనేది మహాదారుణమైన పాపం. ఎన్ని తీర్ధయాత్రలు చేయనీ ఎంతలేసి ఒప్పులు చెయ్యనీ కృతఘ్నుడికి నిష్కృతిలేదు. చిరకాలం నరకంలో ఘోరయాతనలు అనుభవించవలసిందే.


జితేంద్రియుడై జితాహారుడై పవిత్ర నదీ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మాలోకం వైపు రావలసిన పని ఏముంటుంది చెప్పు, మిత్రమా! తీర్ధాలలో మునకలు వెయ్యకపోతే మానే, అక్కడకు వెళ్ళి పాతకాలు మాత్రం చేయరాదు. తీర్ధపజీవనం మహాపాతకం. గ్రుంకులాడటానికి వచ్చిన వాళ్ళ మీద తాను బ్రతకడం. ఇది పనికి రాదు. తీర్థాలలో దానాలు పట్టరాదు. ధర్మాన్ని అమ్ముకోరాదు. తీర్ధంలో చేసిన పాపమైనా ప్రతి గ్రహమైనా దుర్దరమే. అంటే- ఏ ప్రాయశ్చిత్తంతోనూ తొలగించుకోడానికి శక్యంకానిది. అందుచేత తీర్థాలలో మరీ జాగరూకుడై వుండాలి మానవుడు. పుణ్యం మాట దేవుడెరుగు ముందు పాపం మూటగట్టుకొని తెచ్చుకోకుండా ఉంటే చాలు. అదే పదివేలు. కానీ నేస్తమా! గంగాస్నానం ఉన్నదే అది చాలా గొప్పది. గంగా తీరాలలో ఏ తీర్ధంలో మునిగినా ఒక్కమునకంటే ఒక్క మునక చాలు జన్మజన్మార్జితాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి. మనుసులు పూర్తిగా పరిపూతులైపోతారు. - అంతే కాదు మిగిలిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏదోషమూ అంటదు. వారు నరకం ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు.


Monday 19 June 2023

శ్రీదత్త పురాణము (173)

 


ఒకప్పుడు స్వర్గచ్యుతుడవుతున్న కేసరి ధ్వజుణ్ని చూసి జాలిగొన్న వైవస్వత మహారాజు - కేసరిధ్వజా ! కర్మ భూమికి వెడుతున్న నువ్వు మళ్ళీ స్వర్గానికి రావాలనుకుంటున్నట్లయితే అన్న దానం చెయ్యి - అన్న దానం చెయ్యి- అన్న దానం చెయ్యి అని ముమ్మారు హెచ్చరించాడు. మిత్రమా! ఇదంతా నేను మా యమధర్మరాజు గారు - చెప్పగా విని తెలుసుకొన్నాను. అన్న దానానికి సాటి వచ్చే దానం ఈ భూగోళం మీద ఇప్పటికి లేదు. ఇక ముందు ఉండబోదు. గ్రీష్మం (వేసవి) లో పానీయం దానం చేసినవాడు, హేమంతంలో ఇంధన దానం చేసినవాడూ, ఏ ఋతువులోనైనా అన్న దానం చేసినవాడూ ఏనాడూ నరకయాతనలు పడవలసిన అగత్యం ఏర్పడదు.


వికుండలా! నరకాన్ని తప్పించుకునే ఉపాయం మరొకటి ఉంది. ఇది చాలా గోప్యం అయినా, నీకు గాబట్టి చెబుతున్నాను. శ్రద్ధగా విను. తెలిసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అందరూ చేస్తూనే ఉంటారు. అందుచేత ఆరేసి నెలలకి ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు మనిషి నిష్కల్మషుడు అవుతాడు. నరకం వైపు తొంగి చూడవలసిన పనే ఉండదు. లేదంటే నరకవాసం తప్పదు. వాజ్మనఃకాయకర్మలతో చేసిన ప్రతీపాపానికీ ప్రాయశ్చిత్తం ఉంది. అది చేసేసుకుంటే జన్మాంతరంలో దేవ గంధర్వ లోకాలను అందుకోవచ్చు.


వేదాలకు కన్న తల్లి గాయత్రి. ఆ మహామంత్రాన్ని నిత్యమూ జపించే వారికి, మరింక ఏదైనా తారక మంత్రం జపించే వారికి (ఉపాసించే వారికి) ఏనాడూ ఏ పాపము అంటదు. వేద అధ్యయన అధ్యాపన హోత్రులూ అక్షయ పుణ్యలోకాలను పొందుతారు. ఎల్లప్పుడూ ఏవేవో తీర్ధయాత్రలు, వ్రతాలు చేసేవాళ్ళు జితేంద్రియులు కాగలిన వాళ్ళు యమలోకానికి ఎగనామం పెట్టినట్లే. ధర్మశీలుడు, పరాన్న - పరపాకాలను పూర్తిగా పరిత్యజించాలి. పరాన్నం తినడం అంటే పర దుష్కృత్యాన్ని భుజించడమే. ఎవరి నుండి ఏది తీసుకున్నా పర్వాలేదు కానీ భోజనం మాత్రం తీసుకోకూడదు. దారుణం అయిన నరకం ఒకటి ఉంది. అనేప్పుృహ ఉన్నవాడెవడూ పరాన్నపాకాలకు ఆశించడు.


రోజూ స్నానం చేసేవాడు మాలోకానికి రాడు. నిత్య స్నానంతో సకల జంతువులూ పాప పంకిలాల నుండి తేలికగా విముక్తమవుతాయి. ప్రాతః స్నానం బాహ్యభ్యంతర మాలిన్యాలను ప్రక్షాళన చేస్తుంది. నిష్పాపులకు నరకంతో పనిలేదు. స్నానం చెయ్యకుండా భోజనం చేస్తే అది మలభక్షణంతో సమానం. స్నానం చెయ్యని ఆశుచికి పితృదేవతలు విముఖులవుతారు. స్నానహీనుడైన నరుడే పాపాత్ముడు. అతడే అశుచి. పుష్కలంగా నరకం అనుభవించి అటు పైన అపరిశుభ్ర అనాగరిక జాతుల్లో పునర్జన్మ పొందుతాడు. పర్వదినాన నదీ స్నానం చేసిన సుకృతి ఏనాడూ దుర్గతిని పొందడు. కుత్సిత జన్మలు ఎత్తడు.


Sunday 18 June 2023

శ్రీదత్త పురాణము (172)

 


తులసిని స్వయంగా నాటి నీరు పోషించి ఆ తులసీ దళాలతో శ్రీ హరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మ లోకంలో నిత్య నివాసం పొందుతారు. అంతటిది తులసీ మహిమ. ఇక శివలింగార్చనా మహిమ వివరిస్తాను, తెలుసుకో.


అతిథిపూజ - సదాచారాలు


దేవతల్ని బ్రాహ్మణుల్ని, అతిధుల్నీ నిత్యమూ సంతోష పెట్టేవారు. బ్రహ్మలోక నివాసం పొందుతారు. మూర్ఖుడో, పండితుడో, శ్రోత్రియుడో, పతితుడో ఎవడైనా కానీ గాక - మధ్యాహ్న వేళ ఇంటికి వచ్చిన అతిధి సాక్షాత్తూ బ్రహ్మదేవుడితో సమానం.


కాలిబాటను నడిచి నడిచి అలసిపోయి ఆకొన్న విప్రుడికి గానీ మరొకడికి గానీ అన్నపానీయాలు అందించిన వ్యక్తి అమరలోకంలో చిర నివాసం పొందడం ఖాయం. బాటసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట ఆకలిదప్పులు తీర్చుకొని తృప్తిగా పెడతారో ఆ గృహస్తు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లు, మధ్యాహ్నం కానీ సాయంకాలంగానీ భోజనవేళ ఇంటికి వచ్చిన అతిధికి చిన్న బుచ్చుకొని తిరిగి వెళ్ళవలసిన దుఃస్థితి కలిగించని గృహమేధికి మా యమలోకం వైపు రావలసిన పనే ఉండదు. లేదు లేదు అనే పలుకు విని రిక్త హస్తాలతో - తిరిగివెడుతున్న అతిధి ఆ ఇంటి నుండి జన్మ జన్మార్జితాలైన పుణ్యాలను తీసుకుపోతున్నాడని గ్రహించు.


అతిధి పూజా ప్రభావం వల్ల బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులూ ముని రాజులూ ఎంతోమంది ఉన్నారు. సారాంశంగా చెప్పాలంటే అతిధికి సాటి వచ్చే బంధువులేడు. అతిధికి సాటి వచ్చే ధనం లేదు. అతిధికి సాటి వచ్చే ధర్మం లేదు. అతిధికి సాటివచ్చే హితుడు లేడు. జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసే లోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిధికి ప్రమాదవశాత్తూనైనా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి బురిడీ కొట్టినట్లే.


పది మందికి అన్నంపెట్టిన వాడు ధగ ధగలాడే దివ్య విమానాల్లో అమృతం ఆరగిస్తాడు. పుణ్య ఫలానికి సరిపడా స్వర్గభోగాలు అనుభవించి అటుపైన స్వర్గ చ్యుతుడై ఉత్తర కురు భూముల్లో భారత వర్షంలో సత్కులంలో జన్మిస్తాడు. వంశ కర్త అవుతాడు. వైశ్య కుమారా భూతకోటికి ప్రాణాలు అన్నంలో ఉన్నాయి. అంచేత అన్న దాత అంటే ప్రాణ దాత అన్నమాటే.


Saturday 17 June 2023

శ్రీదత్త పురాణము (171)

 


వాపీకూప తటాకాలను నిర్మింపజేసిన దాతల పుణ్యానికి అంతు వుండదు. వాటిలో నీళ్ళను త్రాగి ఒక్కొక్క ప్రాణీ దప్పిక తీర్చుకుంటుంటే దాతల పుణ్యం రెట్టింపు అవుతూ వుంటుంది. కనక వారికి అక్షయ స్వర్గలోక నివాసమే. ప్రాణి కోటికి జీవనం, ప్రాణులు త్రాగు నీటిలో వున్నాయి. అంచేత చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకూ పశుపక్ష్యాదులకూ నీరందించి దప్పికతీర్చే మహానుభావులు ఇహలోకం విడిచాక శాశ్వతంగా స్వర్గసీమలోనే నివసిస్తారు.


మిత్రమా! ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, మూడేశి వెలగ చెట్లు - ఉసిరిక - మారేడు చెట్లు - అయిదు మామిడి చెట్లు - పది చింత చెట్లు నాటిన వాళ్ళు దేవలోకంలో ఇంద్రభోగాలు శాశ్వతంగా అనుభవిస్తారే - తప్ప నరకం ముఖం చూడవలసిన అవసరం వీరికి ఏనాడూ రాదు. ఒడిలో పుట్టి పెరిగి దారితప్పిన పదిమంది సంతానం కన్నా బయటి నేల మీద దారి ప్రక్కన నాటి పెంచిన అయిదుచెట్లు మిన్న - ఫరవాలేదు పత్ర పుష్ప ఫలాలతో ఇవి కూడా పితృతర్పణ చేస్తాయి. అహితాగ్నులై అగ్నిహోత్రులు చేసిన దాని కన్నా పుత్ర సంతానాన్ని పొందిన దానికన్నా దారి ప్రక్కన ఇంత నీడనిచ్చే చెట్టుని నాటినందువల్ల వచ్చే పుణ్యం అత్యధికం. ఇది చేస్తే చాలు అన్నీ యజ్ఞాలు చేసినట్లే. అన్నీ దానాలు చేసినట్లే. పువ్వులతో ఆకులతో కళకళ లాడుతూ పక్షులతో కిలకిల లాడే పచ్చని చెట్టు నరికే మూఢులు పోయేది ఘోరనరకానికే.


తులసీ మహాత్త్వం


వైశ్యకుమారా! ఏ చెట్టును నాటినా పుణ్యమే. తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం. తులసీ వనం ఏ పెంచిన వారు యముణ్ని లెక్క చెయ్యదు. అది సర్వపాపహరం. సర్వవాంఛా ప్రదం, తులసీవనం కానీ తులసీ మొక్క గానీ ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్ధం. మేము యమదూతలం ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం. తులసి మొక్కను నాటినవారు దాని గింజలూ ఆకులూ ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు. తులసీ పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ వాహనాధిరూఢులై విష్ణు లోకం చేరుకుంటారు. నర్మదా దర్శనం. గంగాస్నానం, తులసీదళ సంస్పర్శనం- ఇవి మూడూ పావనకరణ శక్తిలో ఒక కక్ష్యకు చెందినవి. తులసిని నాటినా, పెంచినా, నీరుంచినా, దర్శించినా, స్పృశించినా మానవులకు వాజ్ఞ్మనః కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి. శుక్లపక్షంలోగానీ, కృష్ణపక్షంలోగానీ తులసీ దళాన్ని పరమేశ్వరుడికి దానమిస్తే ఆ పుణ్య ఫలానికి మరింక ఏదీ సాటిరాదు. పిప్పుల తరువులు నూరు నాటితే ఆమ్ర వనాలు వెయ్యిపెంచితే వచ్చే పుణ్య ఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతాయుతయుగాలు నాకలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. తులసీ దళాలతో హరిహరార్చన చేసిన భక్తుడు మరింక గర్భావాస క్లేశం అనుభవించడు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. పుష్కరాది సకల తీర్ధాలు, గంగాది సమస్త పుణ్యనదులూ వాసు దేవాది సర్వదేవతలూ ఒక్క తులసీ దళంలో ఉండటం అపూర్వమైన విషయం (విశేషం).


Friday 16 June 2023

శ్రీదత్త పురాణము (170)

 


తిన్నగా ప్రవహించేవి వంకర టింకరగా ప్రవహించేని - నదులన్నీ కట్ట కడపటికి సముద్రంలో లీనమైనట్లు సర్వ ధర్మాలు అహింసలో సంగమిస్తున్నాయి. తన చుట్టూతా వున్న ప్రాణికోటికి తానేమీ హాని చెయ్యకుండా అభయమిచ్చినవాడు సర్వతీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యాన్ని సర్వయజ్ఞాలూ ఘనంగా చేసినంతటి ఫలాన్నీ పొందుతాడు.


శాస్త్ర విహితంగా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారు యమలోకం ఛాయలకైనా పోవలసిన పని ఉండదు. బ్రహ్మచారి - గృహస్థుడు - వానప్రస్తుడు - యతి వీరంతా స్వధర్మనిరతితో జీవికసాగిస్తే చాలు. చనువుగా వెళ్ళి స్వర్గలోకం వీపెక్కి కూర్చుంటారు. వీరు జితేంద్రియులు కూడా అయితే సరాసరి బ్రహ్మలోకమే చేరుకుంటారు. ఇష్టా పూర్ణాలు నిర్వహించినవారు నిత్యమూ పంచయజ్ఞాలు చేసేవారు దయాన్వితులూ నిత్యాన్ని హోత్రులూ వీరంతా స్వర్గప్రాప్తికి అర్హులు. రణ రంగంలో శత్రువులు చుట్టుముట్టినా ఎంతటి విపత్కర పరిస్థితి దాపురించినా దీనాలాపాలు పలకని మహాశూరులు సూర్యమండల మార్గం ద్వారా శ్రీ మన్నారాయణుణ్ని చేరుకుంటారు.


వికుండలా! అనాధ స్త్రీ బాల వృద్ధ రోగి సంరక్షకులూ విప్రపోషకులూ వికలాంగ సేవా పరులూ శరణన్న వారిని కాపాడటం కోసం ప్రాణాలు వదిలిన వారూ సరాసరి స్వర్గం చేరుకుంటారు. శాశ్వతంగా అక్కడే వుంటారు. ఊబిలో కూరుకుపోతున్న ఆవునూ, రోగ పీడితుడైన విప్రుణ్ని ఉద్దరించిన పుణ్యాత్ములు అశ్వమేధుల లోకం చేరుకుంటారు. గోవులకు గడ్డీ గాదం వేసి సకల శుశ్రూషలు చేస్తూ ఏనాడు వృషభం నడిబొడ్డున ఎక్కకుండా గో సేవా పరాయణులై కాలం గడిపినవారు ఆయువు తీరాక కచ్చితంగా గోలోక వాసులవుతారు. గోవులు దాహం తీర్చుకోడానికి వీలుగా గొయ్యితవ్వి నీళ్లు పెట్టిన పుణ్యాత్ముడు ఈ లోకాన్ని కన్నెత్తి చూడకుండా స్వర్గానికి చేరుకుంటాడు.


Thursday 15 June 2023

శ్రీదత్త పురాణము (169)

 


యమదూత కృత ధర్మ ప్రభోదం


వైశ్య కుమారా! చాలా మంచి ప్రశ్న వేశావు. పాప ప్రక్షాళన కావడంతో నీ మనస్సు విశుద్ధి పొందింది. అందుకని శ్రేయోదాయకాలైన ఆలోచనలు నీకు వస్తున్నాయి. నిజానికి యమ దూతను నేను. సేవా పరాయణుడ్ని. సంభాషణలకి దిగకూడదు. కానీ అడిగావు కనుక మైత్రిని పురస్కరించుకొని నాకు తెలిసినంత వరకు చెబుతాను. గ్రహించు. పరపీడన అనేది నరక హేతువు. ఆలోచనలతో గాని పనులతో కానీ మాటలతో కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ పీడించని వారు నరకాన్ని దర్శించవలసిన పనేలేదు.


ప్రాణి హింసా పరాయణుడు ఐతే అతడు వేద వేదాంగవేత్త అయినా మహాదాత అయినా తపస్వి అయినా యజ్ఞ యాగాదులు వందలు వేలు చేసినా స్వర్గాన్ని పొందలేడు. అహింసయే పరమ ధర్మం. అహింసయే పరమ తపస్సు. అహింసయే పరమ దానం అని మునీశ్వరులు ఎప్పుడూ చెబుతుంటారు.


నల్లులు, దోమలు, చీమలు, మొదలైన అల్పజీవుల్ని సైతం ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు రక్షించే దయాళుడు. ఏనాడూ నరకం ముఖం చూడరు. సల సల మరుగుతున్న రక్తంతో యమలోకానికి అగడ్తలావున్న ప్రేత తరంగిణిని (వైతరణి) చూడ వలసిన దుర్గతి వారికి పట్టదు. అలాకాక - పొట్ట కూటికోసం జలచరాలనూ స్థల చరాలనూ హింసించే వాడు కాల సూత్ర నరకంలో పడతాడు. అక్కడ తమ మాంసాన్ని తామే భోజనం చేస్తూ క్రుళ్ళిన నెత్తురు త్రాగుతూవసాపంకంలో త్రెళ్ళుతూ ఇనుప ముట్టెల పురుగులతో హింసించబడుతూ కటిక చీకటిలో పరస్పరం చితకబాదుకుంటూ దారుణా రావాలు చేస్తూ ఒక మహా కల్పం పాటు నరక యాతనలు అనుభవించి అటు పైన భూలోకంలో స్థావరాలుగా కొన్ని యుగాలు జీవించి ఆ పైన క్రూర జంతు జన్మలు ఎత్తి చివరకు కుంటి గ్రుడ్డి కుష్టురోగి దరిద్రుడు అంగహీనుడుగా మానవజన్మ ఎత్తుతాడు. ప్రాణి పీడలకు శిక్ష ఇది. అందుచేత ఓ వైశ్య కుమారా! మనసా వాచా కర్మణా ఎవరికీ ఎన్నడూ ద్రోహం చెయ్యకూడదు. పీడ కలిగించకూడదు. ఇహ పరాలలో హితం కోరుకునే ధర్మజ్ఞుడు ఎప్పుడూ పరపీడనకు ఒడిగట్టడు. ప్రాణి హింస చెయ్యని వాడు నరకానికి భయపడవలసిన పని లేదు. సర్వ ధర్మాలకు పరాకాష్ట అహింస అనేది.


Wednesday 14 June 2023

శ్రీదత్త పురాణము (168)



యమదూతోత్తమా! నువ్వు చెప్పేది నిజమే. ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పట్నించీ నేను పాపాలు తప్ప ఒక్కటంటే ఒక్కటైనా పుణ్య కార్యం అయినా చేసి ఎరుగను. నా మనస్సు సత్కర్మలకు ఇష్టపడదు. ఈ జన్మలో నేను చేసిన వన్నీ పాపకార్యాలే. ఏ సుకృతం చేసానో ఎంతకీ తోచడం లేదు. నీకు గనుక తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకో.


వికుండలా! నువ్వు చేసిన సుకృతం నీకు తెలీదు. నాకు తెలుసు. చెబుతాను విను. ఒకనాడు నీవు క్రూర జంతువును వేటాడుతూ గాఢారణ్యంలోకి వెళ్ళావు. మళ్ళీ నీ అన్నగారిని కలుసుకోలేదు. గుర్తుందా? గాధారణ్యంలో తిరుగుతూ యమునా నదికి దక్షిణం ఒడ్డున సుమిత్రుడు ఆశ్రమంలోకి వెళ్ళావు. అతడు హరిమిత్రుడి కొడుకు. వేద వేదాంగ పారంగతుడు. బ్రహ్మ జ్ఞాని, జితేంద్రియుడు. ఆ పుణ్య ప్రదమైన ఆశ్రమంలో ఆ మహానుభావుడితో నీవు సఖ్యం చేసావు. అని మాఘమాసం చివరి రోజులు, సత్సాంగత్య ప్రభావంతో నువ్వు ఆ రెండు నాళ్ళు మాఘ స్నానాలు చేసావు, యమునా నదిలో కాళిందీ పుణ్య జలాలలో పాప ప్రణాశని అనే సార్ధక నామ ధేయం గల రేవులో (తీర్ధం) నువ్వు చేసిన మొదటి స్నానానికి సర్వపాప విముక్తి పొందావు. రెండవ మాఘ మజ్జనానికి ఫలంగా ఇదిగో స్వర్గానికి వెళ్తున్నావు. తన పాప ఫలాన్ని నరకంలో నీ అన్న అనుభవిస్తుంటే నీ పుణ్య ఫలాన్ని స్వర్గంలో నువ్వు పొందు. అక్కడ నీకు ఏ సుఖాలు దక్కుతాయో చెప్ప లేను గానీ నీ అన్న మాత్రం - కత్తికోతలు - రుచిచూస్తాడు. గదా ఘాతాలకు బలి అవుతాడు. బండ శిలల క్రింద నలుగుతాడు- కణ కణ లాడే నిప్పుల్లో పొర్లుతాడు.


యమ దూత చెబుతూంటే వికుండలుడి మనస్సు విల విల లాడింది. అయ్యో! అన్నయ్యా! నరక యాతనలు అనుభవిస్తావా అని మూగగా రోదించాడు. ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే. గుర్తుకి వచ్చింది. వెంటనే తేరుకుని వినయంగా మధురంగా ఇలా అడిగాడు.


దూతవరా! ఇప్పుడు మనం మిత్రులమయ్యాం. ఏడు అడుగులు కలిసి నడిస్తే చాలు సజ్జనులకు మైత్రి కుదిరినట్లే కదా! మనం కలిసి ఏడడుగులు ఏమిటి చాలా దూరం నడిచాం. అదీ మధురంగా మాట్లాడుకుంటూ నడిచాం. అందుచేత మనం మిత్రులు అయ్యాం. ఈ మైత్రిని పురస్కరించుకొని అడుగుతున్నాను. అన్నీ తెలిసిన వాడివి. దయచేసి నా సంశయం తీర్చు. మానవులు ఏ కర్మలు చేస్తే యమలోకాన్ని దర్శించకుండా తప్పించుకుంటారు? ఏ కర్మలు చేస్తే ఏ నిరయు(నరకము)లో పడతారు? ఇది కొంచెం తెలియజెప్పు?


Tuesday 13 June 2023

శ్రీదత్త పురాణము (168)

 


ఒక రోజు శార్దూలాన్ని వెంట తరుముతూ శ్రీ కుండలుడు ఒక కొండగుహలోకి ప్రవేశించాడు. మరో క్రూరమృగాన్ని వెంటాడుతూ వికుండలుడు వేరొక గాఢారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే గుహ నుండి బయటకు రాలేదు అతను. గాధారణ్యం నుండి బయటకు రాలేదు ఇతను. అన్నదమ్ములు ఇద్దరూ ఇంక కలుసుకున్నదిలేదు. జేష్టుడు శార్దూలానికి, కనిష్టుడు సర్పజాతికి ఆహారమయి పోయారు. వింత ఏమిటంటే పాపిస్టులిద్దరూ ఒకే రాత్రి ఒకే సమయాన మృతి చెందారు. యధావిధిగా యమదూతలు వచ్చారు. బంధించి ఇద్దర్నీ యముడి సన్నిధికి తీసుకుపోయారు. యమ ధర్మరాజు చిత్ర గుప్తుడ్ని వీరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జ్యేష్టుడ్ని రౌరవ నరకంలోకీ, కనిష్టుడ్ని స్వర్గంలో వదలి రమ్మని ఆజ్ఞాపించాడు. యమ దూతలు ముందు మొదటి పని చేసారు. మధుర సంభాషణలతో రెండో వాడ్ని స్వర్గానికి తీసికొని వెళ్తున్నారు.


నాయనా! పద పద నువ్వు చేసిన పుణ్యకార్యాలకి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించుదువుగాని స్వర్గంలో వదలివస్తాం- అని వాళ్ళు బుజ్జగిస్తుంటే వికుండలుడికి పెద్ద సందేహం వచ్చింది. నేను ఏం సత్కర్మలు చేసాను చెప్మా- అని బుర్ర తడుముకున్నాడు. ఏదీ తోచలేదు. అన్నగారితో సమానంగా అన్ని పాపాలు తనూ చేసాడు. అన్నగారితో సమానంగా దుర్మరణం పాలయ్యాడు. అన్నతో సమానంగా యమదర్శనం చేసాడు. అంచేత అన్న గారితో సమానంగా రౌరవ నరకం తనకూ దక్కాలి. మరి ఈ స్వర్గ ప్రాప్తి ఏమిటీ? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఎంతకీ అర్ధం కాలేదు. ఎందుకొచ్చిన చింత దూతల్ని అడిగి తెలుసుకుంటే పోలే - అనిపించింది అడిగేశాడు. 


విడుండలా! తల్లి-తండ్రి- కొడుకు - భార్య- కోడలు- అన్న- తమ్ముడు - అక్కచెల్లెలు ఈ వరుసలు ఈ అనుబంధాలు పుట్టుకని బట్టి ఏర్పడతాయి. కర్మలు అనుభవించడానికి ఇవి భూమికలు - ఎక్కడెక్కడివో పక్షులు ఒక చెట్టు మీద వాలినట్లు ఒక ఇంటిలో వీరందరి కలయికానూ, వీరిలో ఎవరి కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు తప్ప ఒకరిది ఇంకొకరు పులుముకుందామన్నా రాదు. బదలాయిద్దామంటే పోదు.


వైశ్య కుమారా! నిజం చెబుతున్నాను. ఎవడు చేసుకున్న కర్మఫలం - అది మంచిగానీ చెడు గానీ వాడు అనుభవించవలసిందే. నీ అన్నగారు మహాపాతకాలు చేసాడు. అందుకని వాటి ఫలంగా రౌరవ నరకంలో పడ్డాడు. నువ్వు ఏదో పుణ్యం చేసావు కనుకనే స్వర్గ సుఖాలు అనుభవించడానికి వెడుతున్నావు. 

Monday 12 June 2023

శ్రీదత్త పురాణము (167)

 


ఈ వ్యాపకంలోనే అతడికి తెలియకుండానే వయస్సు గడిచిపోయింది. చెవుల దగ్గర జుట్టు తెల్లబడింది. ఓహో వార్ధక్యం ముంచుకొస్తోంది అని గ్రహించాడు. ఒక్క నిముషం గాఢంగా ఆలోచించాడు. సంపాదించిన ధనంలో ఆరవవంతు తీసి చకచకా ధర్మ కార్యాలు చేసాడు. శివ-విష్ణుదేవాలయాలు కట్టించాడు. సముద్రం అంతటి చెరువు త్రవ్వించాడు. నూతులూ, దిగుడు బావులూ, సరోవరాలు, అనేకం ఏర్పాటు చేయించాడు. వట-అర్క-అశ్వత్థ-కంకేళీ-జంబూ-నీపాది వృక్షాలతోవనాలు, పుష్పతరులతానికుంజాలతో ఉద్యానవనాలు పెంపొందింపజేసాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు నిత్యమూ నిరతాన్న దాన పథకం అమలు జరిపాడు. నగరం వెలుపల నాలుగు దిక్కులా అందంగా చలివేంద్రాలు ఏర్పాటుచేసాడు. పురాణాలు చెప్పిన షోడశమహాదానాలు చెయ్యమన్న వేళ చెయ్యమన్న చోట చెయ్యమన్న తీరుగా చేసాడు.


చివరకు యావజ్జీవ ప్రాయచ్ఛిత్తం కూడా యధావిధిగా జరిపించుకున్నాడు. యోగ్యులు సమర్ధులు అయిన తన కుమారులు శ్రీకుండల— వికుండలుల కిద్దరికీ ఇల్లు వాకిలీ మిగిలిన సంపదా అప్పగించి తాను భార్యతో కలసి వాన ప్రస్తానికి వెళ్ళిపోయాడు. అక్కడ గోవింద నామస్మరణ జేస్తూ తపోనియమాలతో దేహాన్ని కృశింపజేసి ఒక శుభగడియలో అనాయాసంగా విష్ణు సాయుజ్యం పొందాడు.


కొడుకుల హయాం వచ్చింది. దానధర్మాలు బందు అయిపోయాయి. సహాయ సహకారాలు అంతరించిపోయాయి. అహంకారమూ అతిశయమూ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి. పొగడ్తలతో లోబరుచుకొని అక్రమాలు, అన్యాయాలు చేయించేవాళ్ళు చుట్టూతా చేరారు. అన్నదమ్ములిద్దరూ దుర్వ్యసనాలలో పూర్తిగా చిక్కుకుని పోయారు. అమ్మచెప్పినా బంధువర్గం చెప్పినా హితం కోరి తండ్రి, స్నేహితులు, జ్ఞానవయోవృద్ధులూ చెప్పినా అన్నదమ్ముల చెవులకు ఏమంచీ ఎక్కలేదు. వీరిని దగ్గరకు చేరనివ్వలేదు. గానా బజానాలతో, మేజువాణీలతో, విటవిటీ గోష్టులతో తందాన గాళ్ళతో (స్తోత్ర పాఠకులు) రేయింబవళ్ళు ఒక్కలాగా గడుపుతున్నారు. విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, కస్తూరీ చందనాలు, మల్లికా కుసుమ మాలలు, ముత్యాల దండలు, గజ వాణీరధ క్రీడలు, సజీవ నిర్జిన ద్యూతాలు, మధు పానాలు, మాంస భక్షణలు, వార స్త్రీ సంభోగాలు, పరదారాభి గమనాలు, వీటిన్నింటికోసం ధనాన్ని మంచి నీళ్ళలా ఖర్చుపెట్టారు. వంద ఇవ్వవలసిన చోట వెయ్యి విసిరారు. వార - స్త్రీ నిట శైలూష మల్ల చారణ నంది బృందాలు బాగా బాగుపడ్డారు. అనవసర అసత్కార్యన్యయాలతో - - పిత్రార్జితమంతా ఊసర క్షేత్రంలో పోసిన విత్తనాలయ్యింది. సభ్య సమాజంకోసం ఖర్చుపెట్టలేదు. బ్రాహ్మణముఖతః ఖర్చుపెట్టలేదు. సర్వ పాప వినాశకుడైన శ్రీ మహావిష్ణువు సమార్చనకోసం ఖర్చు చేయలేదు. కానీ ధనమంతా ఖర్చయిపోయింది. వాళ్ళకే తెలియకుండా వ్రేళ్ళ సందుల నుండి జారిపోయింది. తమ తండ్రి దశాబ్దాలు శ్రమపడి కూడబెట్టిన సొమ్మును కొడుకులిద్దరూ రెండేళ్ళలో ఖర్చుపెట్టారు. అలవాట్లకు అవసరాలకు ధనం కావలసివచ్చింది. స్థిరాస్థులు కరిగిపోయాయి. ఆ తర్వాత ఆభరణాలకు, విలువైన సామాగ్రికి కాళ్ళు వచ్చాయి. ఇంతకాలమూ తమ చుట్టుతా చేరి భజన చేసిన బృందాలన్నీ మాయమయ్యాయి. ఉద్యోగులూ, సేవకులూ అందరూ వదలి వెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ మిగలారు. ఆ ఇంటిలో ఆకలికి ఇవేమీ తెలీవు కదా! స్థితిలో వచ్చిన హెచ్చు తగ్గులు దానికేమి తెలుస్తాయి. లోలోపల అది దహించివేస్తోంది. ఇరుగు పొరుగుఇళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెట్టారు. ఇది నలుగురికీ తెలిసి ఛీ ఛీ అన్నారు. లోకానికి భయపడి, రాజదండనలకు భయపడి అన్నదమ్ములు ఇద్దరూ ఊరు వదలి అడవికి పారిపోయారు. అక్కడ రకరకాల జంతువుల్ని వేటాడి పక్షుల్ని సంహరించి పళ్ళూ ఫలాలూ తిని కొన్ని సంవత్సరాలు హాయిగా జీవనయాత్ర సాగించారు. వేట - మాంసం ఈ వైశ్యకుమారులిద్దరూ భిల్లవీరుల్లా తయారయ్యారు. మనస్సులో కోమలత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంది. చిట్టిపొట్టి జంతువుల్ని విడిచి పెట్టి సింహశార్దూలాలని వేటాడటం మొదలు పెట్టారు. ఇద్దరూ పోటీలు పెట్టుకొని క్రూర మృగాల్ని వేటాడుతున్నారు. ఆనందిస్తున్నారు.


Sunday 11 June 2023

శ్రీదత్త పురాణము (166)

 


బ్రహ్మ సంతోషించి చంద్ర ముఖీ! నీకు సూర్యరథంలో స్థానం కల్పిస్తున్నాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నంత కాలం నువ్వు సూర్యలోకంలో సమస్త భోగాలను అనుభవించు అని వరం ప్రసాదించాడు.


కార్తవీర్యా! ఆ బ్రాహ్మణి ఋచీక మాఘస్నాన పుణ్యం వల్ల అప్సరోవరాంగనయై తిలోత్తమగా దేవ కార్యం నిర్వహించి అటుపైన అతి దుర్లభమైన సూర్యలోకంలో ఇష్ట భోగాలు ఇప్పటికీ అనుభవిస్తుంది. అందుచేత అందరూ ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా మాఘస్నానాలు చెయ్యాలి. సకల పురుషార్ధాలు సిద్ధిస్తాయి. సకల పాతకాలు నశిస్తాయి.


నదీ తీరంలో చేసిన మాఘస్నానానికి నువ్వు చేసే కోటి యజ్ఞాలు కూడా సాటి రావు.


హేమకుండలోపాఖ్యానం


కార్తవీర్యార్జునా! మాఘ స్నానమహిమ తెలిసింది గదా! నీకిప్పుడు అత్యంత పురాతనమైన మరొక వృత్తాంతం చెబుతాను. సదాచారాలను వాటిని ఆచరిస్తే కలిగే పుణ్యాలనూ ఆచరించనందువల్ల వచ్చిపడే అనర్ధాలును అన్నీ ఇందులో ప్రస్తావనకు వస్తాయి. కృతయుగం నాటి మాట ఇది.


నైషదమహానగరంలో హేమకుండలుడు అనే వైశ్యుడు వుండేవాడు. కుబేరుడితో సాటి వచ్చే సంపన్నుడు. సత్కులీనుడు. విప్ర-అగ్ని దేవతా పూజలు తప్పక చేసే అలవాటు ఉన్నవాడు. కృషి-వాణిజ్యమూ అతడి ప్రధానవృత్తులు. గోవుల్నీ, గుర్రాల్ని, మహిషాల్ని, కొనడం బాగా పెంచడం ఎక్కువ సొమ్ముకి అమ్మడంతో బాగా ఆర్జించాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గడ్డీ, గాదం, కట్టెలు, కందమూల ఫలాలు, ఉప్పు, జాజికాయలు, పిప్పళ్ళు, రకరకాల ధాన్యాలు కూరగాయలూ, వంటనూనెలూ, వస్త్రాలూ, ధాతువులూ, బెల్లమూ, కలకండ వంటి చెరకు ఉత్పత్తులు - ఒకటేమిటి అన్నింటినీ క్రయవిక్రయాలు చేసేవాడు. లాభాలు బాగా గడించేవాడు. ఎనిమిదికోట్ల సువర్ణ టంకాలు నిలువజేసాడు. సంపన్నులలోకెల్లా సంపన్నుడయ్యాడు. అమ్మడం కొనడం, లాభాలు గడించడం.


Saturday 10 June 2023

శ్రీదత్త పురాణము (165)

 


దైత్య వీరుల ముక్కు పుటాలు ఆశ్చర్యంతో ఆనందంతో స్పందించాయి. స్కంధావారంలో (దైత్యసైన్యం) కలకలం బయలు దేరింది. ఆ దివ్య పరిమళం ఎక్కడిదో ఎవరిదో తెలుసుకుందామని దైత్య గూఢచారులు నాసికలు విప్పార్చుకొని తీరం వెంబడి ఎగువకు నడక సాగించారు. అశోకవనం చేరుకున్నారు. అప్పటికి తిలోత్తమ స్నానం ముగించి మంకెన పువ్వులాంటి నాజూకు చీరను కుచ్చిళ్ళుపోసి కట్టుకొని అదే రంగు రవిక తొడుక్కుని నల్లని సిగలో తెల్లని మాలతో కుసుమాలు ధరించి కదులుతున్న కంకణాలూ వదరుతున్న నూపురాలు గునుస్తున్న మణి మేఖలా ధరించి గుండెల మీద ఎగిసిపడుతున్న ముత్యాల దండలతో చిరుగాలికి లాస్యం చేస్తున్న నీలి ముంగురుతో ఆ కంకేళీ వృక్షం మొదటి శిలా వితర్ధిక మీద ముద్దుగా, వయ్యారంగా కూర్చుని వీణను పలికిస్తోంది. దానితో తనూ స్వరం కలిపిపాడుతోంది.


చంద్రకళలాగా హృదయాన్ని పరవసింపజేస్తున్న తిలోత్తమను నైత్యభటులు చూసారు. ఆశ్చర్యచకితులై ఆనందపులకితులై చూపారు. క్షణంలో తేరుకొని పరుగు, పరుగున వెళ్ళి సుందోపసుందులకు విన్నవించారు. దేవతాంగనా? దానవాంగనా? నాగాంగనా? యక్షాంగనా? ఏమో తెలీదు. కానీ నారీ రత్నం. సర్వోత్తమ సర్వదా ఉత్తమ. మీరు రత్న భోక్తలు. సృష్టిలో ఉత్తమమైన ఏ వస్తువైనా మీకు స్వాధీనం కావలసిందే. ఆమె నారీ రత్నం. ఇక్కడికి చేరువలోనే ఆశోక వనంలో ఒంటరిగా కూర్చొని ఉంది. జగన్మోహనంగా వీణ పలికిస్తోంది. తానూ పాడుతోంది. మన్మధుణ్ని సైతం మోహింపజేసే సౌందర్యం. ఇంతకన్నా మేము వర్ణించలేము. బయలు దేరండి. మీ కళ్ళతో మీరు చూడండి.


గూఢచారులు ఇలా చెప్పేసరికి సుందోపసుందులు బయలు దేరారు. సుందుడు తాగుతున్న మధువును విసిరేసి ఒక్క ఉదుటున నిలబడ్డాడు. అప్పరాంగనలతో కృత్రిమ సరోవరంలో జలకేళి సలుపుతున్న ఉప సుందుడు కూడా మదగజం లాగా గట్టుకి వచ్చాడు. ఇద్దరూ వెడదాం అంటే వెడదాం అనుకున్నారు.


కాల దండాల్లాగా భయంకరమైన ఇనుప గదలను భుజాలకెత్తుకొని ఎడమ చేత్తో మీసాలు త్రిప్పుతూ భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేస్తు రెండు మహాపర్వతాల్లాగా సుందోపసుందులు బయలు దేరారు. వీరిద్దరిని సంహరించడానికి వచ్చిన చండికలా కూర్చున్న తిలోత్తమ దగ్గరకు వచ్చారు. ఆమె సౌందర్యం ఆమె గాన మాధుర్యం వారిద్దరిలోన మన్మధాగ్నిని మరింత ప్రజ్వలింపజేసింది. సోదరా! పోటీకి రాకు. ఈ సుందరిని నేను స్వీకరిస్తాను. అంటే నేనే స్వీకరిస్తాను అని ఇద్దరూ వివాదపడ్డారు. అది చిలికి చిలికి గాలివానగా మారింది. గదా యుద్ధంగా మారింది. కాల మహిమ. పరస్పరం చావబాదుకున్నారు. చివరికి సుందోపసుందులు ఇద్దరూ ప్రాణాలు వదిలారు. అయ్యో ! ఈ మహాతల్లి ఎవరో ? ఈవిడ కోసం మన ప్రభువులు ఒకరినొకరు చంపుకున్నారే అని దైత్యసైన్యం విలపించింది. వజ్రాయుధం నిశ్శబ్దంగా పర్వత శిఖరాలను కూల్చినట్లు ఇద్దరినీ మడియించిన తిలోత్తమ దశదిశలకూ తన వీణా నాదంతో ఈ శుభవార్తను అందిస్తూ ఆకాశానికి ఎగిరిపోయింది. బ్రహ్మలోకం చేరుకుంది.


Friday 9 June 2023

శ్రీదత్త పురాణము (164)

 


కార్తవీర్యా భృగువంశంలో ఒక బ్రాహ్మణాంగన ఉంది. ఋచీక అని పేరు. దురదృష్టవశాత్తూ బాల్యంలోనే వైధవ్యం సంప్రాప్తించింది. ఆ దుఃఖం తట్టుకోలేక ఘోరంగా తపస్సు చేసింది. వింధ్యాచలం చేరువలో ప్రవహిస్తున్న రేవావది ఒడ్డున అకరంటకం అనే క్షేత్రంలో తీవ్ర తపస్సు చేసింది. నారాయణ ధ్యాన పరాయణగా, సదాచారవతిగా, సంగ వివర్జితగా, జితేంద్రియగా, జితక్రోధగా, సత్యవాదినిగా, మిత భాషిణిగా, సుశీలగా, దానశీలగా, దేహశోషణశాలినిగా, నియమ నిష్టలతో తపస్సు సాగించింది. ఉంఛ వృత్తితో ధాన్యం గింజలు ఏరి తెచ్చుకొని వాటిని వండి అగ్ని కార్యం తీర్చుకొని పితృ- దేవతా- అతిధులకు పెట్టి షష్టకాలంలో తాను భుజించేది. కృచ్ఛ-అతి కృచ్ఛ- పారాక - తప్తకృచ్చాది వ్రతాలను ఆచరిస్తూ తపస్సు సాగిస్తోంది. మాఘ మాసం వచ్చిందంటే చాలు నర్మదా నదిలోనూ రేవాకపిల నదీ సంగమ స్థలంలోనూ నిత్యమూ స్నానాలు చేసేది. వల్కలు ధరించి స్థిర చిత్తంతో దృఢ దీక్షతో నారాయణ మహా మంత్రం జపంచేసేది. కొంత కాలానికి ఈ తపో నియమాలతో కృంగి కృశించి ఋచీక తనువు రాలిపోయింది. మాఘస్నానాల పుణ్య ఫలంవల్ల విష్ణులోకంలో నాలుగు వేల యుగాలు నివసించింది. అప్పుడు బ్రహ్మ దేవుడు సుందోపసుందుల్ని నాశనం చేయడం కోసం ఈ ఋచీకను తన సత్యలోకంలో అవతరింప జేసాడు. మాఘ స్నాన పుణ్య శేషంవల్ల సౌందర్యరాశిగా దేవతా సమ్మోహినిగా అప్సరాంగనా శిరోమణిగా బ్రహ్మలోకంలో అవతరించింది. బ్రహ్మ సంబరపడి తన పన్నాగం నెరవేరుతుందని గ్రహించాడు. మృగశాబ్దాక్షీ! దైత్యున్ని నాశనం చెయ్యాలి. వెంటనే బయలుదేరు - అని ఆజ్ఞాపించాడు.


తిలోత్తమ వీణాపాణియై బ్రహ్మలోకం నుండి ఆకాశ మార్గాన బయలు దేరింది. దేవతా శత్రువులైన ఆ దైత్యులున్న ప్రాంతానికి చేరుకుంది. అది రేవానది అవతలి తీరం. సుందోపసుందులు అక్కడ విడిది చేసి యున్నారు. ఆ గుడారాలకు అల్లంత దూరాన రేవానదికి ఎగువన అశోకవనం ఉంది. అక్కడ తాను దిగింది. దిగుతూనే ఒక కంకేళీ తరుమూలం దగ్గర వీణను ఉంచి తాను నదీ స్నానానికి దూకింది. ఈతలు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా చాలాసేపు జలకాలు ఆడింది. ఆమె తనూ పరిమళాలు నీటిలో కరిగి దిగువకు ప్రవహించాయి.


Thursday 8 June 2023

శ్రీదత్త పురాణము (163)

 


ద్రోహాలు చేస్తాం. ఒకటేమిటి దీనికోసమని అరిషడ్ వర్గానికే ఊడిగం చేస్తాం. ఇంత చేస్తే ఇది పరమ పిశునం. పరమ కృతఘ్నం క్రూరం, క్షణికం. దగాచేసి చటుక్కున రాలిపోతుంది. ఒక్క రోజు పోషణమానితే కంపు కొడుతుంది. ఇది వాతపిత్తాదిదోషత్రయ విభూషితం. దీన్ని తృప్తి పరచడం ఎవడివల్లా కాదు. దీని కోరికలు తీర్చడం అసంభవం. దీని అహంకారం అంతా ఇంతానా? తాపత్రయ విమోహితం. నిజానికి ఇదొక చిల్లులగంప. దీని స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ధర్మాచరణం కన్నా అధర్మాచరణం అంటేనే స్వతహాగా ఇది ఇష్టపడుతుంది. దీనికున్న తృష్ణలు (కోరికలు) అబ్బో అసంఖ్యాకం. అందుకే ఇది నరక ద్వారానికి ఎప్పుడూ చేరువలో ఉంటుంది. ప్రాణవాయువు బయటకు పోగానే పురుగులు పడుతుంది. లేదా కుక్కలకీ నక్కలకీ ప్రీతి పాత్రమవుతుంది. లేదా ఇంత మట్టిగానీ పిడికెడు బూడిదగాని అవుతుంది. ఇలాంటి నశ్వరమైన ఈ శరీరానికి కనీసం మాఘస్నానమైనా లేకపోతే అది ఇంకెంత వ్యర్ధమో ఆలోచించు.


విష్ణు భక్తిలేని విప్రుడు, యోగి (భోక్తగా) లేని శ్రాద్ధం, బ్రాహ్మణుడు లేని రాచరికం, సదాచారం లేని వంశం - ఇవి నిరర్ధకాలు. దంభంతో కూడిన ధర్మం, క్రోధంతో కూడిన తపస్సు, సంశయంతో కూడిన జ్ఞానం, ప్రమాదంతో కూడిన శ్రుతం- ఇవి కూడా వ్యర్ధాలు. పతిభక్తి లేని ఇల్లాలు, స్త్రీ సాంగత్యం మరిగిన బ్రహ్మచారి, ప్రజ్వలించని అగ్నిలో వేసిన హోమం, సాక్షిలేని భుక్తి, పరపోషణలో వున్న కన్య, తన పొట్ట కోసమే చేసుకున్న వంట, శూద్ర బిక్షతో యాగం, లోభి దగ్గరున్న ధనం అభ్యాసానికి దూరమైన విద్య, శత్రుత్వాలు పెంచుకొనే రాజు, పొట్ట కూటికోసం చేసే తీర్ధయాత్రలు, వ్రతాలు; సత్య దూరమైన వాక్కు, సంధిగ్ధమైన మంత్రం పై శూన్యమైన సంభాషణం, వ్యగ్ర చిత్తమైన జనం ఇవన్నీ వృధా, వృధా. అశ్రోత్రియుడికి ఇచ్చిన దానం, నాస్తికమైన లోకాలు, శ్రద్ధలేని ఆముష్మిక కర్మలు- వ్యర్థం. అలాగే మాఘస్నానం లేని మానవజన్మ కూడా వ్యర్థం. సూర్యుడు మకరంలో ఉదయిస్తున్న వేళ మాఘస్నానం చెయ్యనివాడు  పాపాలు పోగొట్టుకోగలడా, స్వర్గం చేరుకోగలడా ? అసంభవం.

రాజా మాఘమాసంలో సూర్యోదయవేళ నదీ జలాలన్నీ పంచమహాపాతకులనూ, ఉపపాతకులనూ, చూసి-రండి, రండి. దయచేసి ఒక్కసారి మా నీటిలో మునగండి. మీ పాపాలు తొలగించుకోండి. మంచి తరుణం మించిన దొరకదు అని గొంతెత్తి పిలుస్తాయి - తెలుసా. మాఘమాసం వచ్చిందంటే సకల పాపాలూ వీడు మాఘస్నానం చేస్తాడేమో. మనకు పోయే కాలం దాపురిస్తుందేమో అని గడ గడా వణికి పోతుంటాయి. మాఘస్నానం చేసినవారు- మబ్బుల చెర వదలిన చంద్రకిరణాల్లాగా నివురు రాల్చిన నిప్పుల్లాగా పాప విముక్తులై కళ కళ లాడతారు.


మనో వాక్కాయకర్మలతో చేసిన పాపాలన్నీ అవి చిన్నవైనా పెద్దవైనా, తెలిసి చేసినవైనా, తెలియక చేసినవైనా ఆర్ధ్రాలైనా, శుష్కాలైనా మాఘస్నానంతో దగ్ధమైపోతాయి. అగ్నిలో పడిన సమిధల్లాగా హృతమైపోతాయి. రాజా ! పాపాత్ములు మాఘ మజ్జనం చేస్తే పాప విముక్తులై శుద్ధి పొందుతారు. పుణ్యాత్ములు చేస్తే సారాసరి స్వర్గం పొందుతారు. ఇందులో ఏ సందేహమూ లేదు. విష్ణు భక్తి విషయంలోలాగానే దీనికి అందరూ అధికారులే అర్హత. అనర్హత అన్న ప్రశ్నేలేదు. మాఘమాసం అందరికీ అన్నీ ఇస్తుంది. అందరి పాపాలు తొలగిస్తుంది. మాఘ స్నానమే మహామంత్రం. మాఘస్నానమే మహా తపస్సు. మాఘ స్నానమే అన్నింటికీ ప్రాయశ్చిత్తం. మాఘ స్నానమే సర్వోత్తమం. సంపారమహాకిల్బిషాలను ప్రక్షాళన చెయ్యగలిగిన ఆధ్యాత్మ జ్ఞాన కౌశల్యం శతానేక జన్మాంతర పుణ్యంవల్ల గానీ లభించదన్నారు. అలాగే మాఘస్నానం చెయ్యాలి అనే కోరిక జన్మాంతర సంస్కారం వల్లకానీ కలుగదు. పావనాలలోకెల్లా పరమ పావనం - మాఘస్నానం. సర్వ కామ్య ఫలప్రదం. ఒక్కసారి మాఘ మజ్జనం చేస్తే చాలు ఆ చంద్ర తారార్కంగా ఇహ - పరలోక భోగాలును అనుభవిస్తారు. ఈ మాఘ స్నాన ఫలాన్ని చెప్పే ఇతి హాసం ఉంది చెబుతాను ఆలకించు. 


Wednesday 7 June 2023

శ్రీదత్త పురాణము (162)

 


దత్త దేవా! మహానుభావా! నీ దయవల్ల వినవలసిందంతా వినేశాను. తెలుసుకోదగింది తెలుసుకున్నాను. కానీ కొన్ని సందేహాలు మళ్ళీ కలుగుతున్నాయి. లోకాన్ని చూస్తుంటే క్రొత్త క్రొత్త ప్రశ్నలు పుడుతున్నాయి. సత్కార్మాచరణవల్ల కలిగే పుణ్యమూ దుష్కర్మాచరణవల్ల కలిగే పాపమూ నీ ముఖతః విపులంగా తెలుసుకోవాలని నా కోరిక. అంతకన్నా ముందు మరొక సందేహం నాకు తీర్చాలి. మనిషి సుఖాభిలాషికదా! మరి కావాలని కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటాడు? మాఘమాసం గడ్డుకాలం (శీతాకాలం) ఎముకలు కొరికే చలిలో తెల్లవారు జాముననే లేచి ఆ బాలవృద్ధులు నదీ కూపతటాకాల్లో చన్నీటి స్నానాలు చేస్తారెందుకని? ఇది ఏమైనా వ్రతమా? అయితే దాని ఫలమేమిటి? బహుశా నాలానే ఈ మునులందరూ కూడా వినాలని కుతూహల పడ్తునట్లుగా వుంది. దయ చేసి వినిపించు.


మాఘమాస మాహాత్మ్యం


మాహిష్మతీపురాధీశా! మంచి ప్రశ్నవేశావు, వెనుకటికి బ్రహ్మదేవుడు నారదుడుకి చెప్పాడు. మాఘస్నాన ఫలం బహుదొడ్డది. ఆత్మ స్వరూపాన్ని విస్మరించిన సకామకర్ములకి అభీప్సిత సుఖసంతోషాలు ప్రసాదిస్తుంది. నిష్కామకర్ములకు అంతర్భహిశ్శుద్ధితో పాటు నెమ్మదిగా ఆత్మ ప్రకాశాన్ని అందిస్తుంది. అది అంతా చెబుతాను. అందరూ శ్రద్దగా ఆలకించండి. దేశం- తీర్ధం - శ్రద్ధ- ఆచరణ- వీటిలో ఉండే తారతమ్యాలను బట్టి మాఘస్నాన ఫలంలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. మన భారతవర్షం విశేషించి కర్మభూమి. ఇక్కడ జన్మించి మాఘస్నానాలు చెయ్యని వాని బ్రతుకు వ్యర్ధం.


మాఘ స్నానం చెయ్యనివాడు ఎన్ని సత్కర్మలు చేసినా (ఇతరములు) అవన్నీ నిష్పలమైపోతాయి. సూర్యుడులేని ఆకాశంలాగా, ఇంద్రుడు లేని స్వర్గంలాగా వెలవెలపోతాయి. ఈ వ్రతం కేశవుడికి అత్యంత ప్రీతిపాత్రం. మిగతా దానధర్మాలు జపతపాలు కలిగించే ఆనందంకన్నా శ్రీ హరికి ఇది కలిగించే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ. సూర్యుడి తేజస్సుకు సాటి వచ్చేకాంతి మరొకటి లేనట్లే మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువుకానీ క్రియగానీ మరొకటి లేదు.


అందుచేత వాసుదేవుడికి ప్రీతికరంగా సర్వ పాపపావనోదకం స్వర్గలోక సంపాదకం - ఈ మాఘస్నాన వ్రతాన్ని ప్రతి మానవుడూ శ్రద్ధగా ఆచరించాలి. ఈ కలియుగంలో దీన్ని మించిన వ్రతంలేదు. మాఘ స్నానం చెయ్యకుండా మలినమైన దేహాన్ని కండలు పట్టించి సుందరంగా పెంచి పోషించి ఏమి ప్రయోజనం? ఎముకలు నిలిపి స్నాయువుతో కట్టి మాంసమూ, రక్తమూ నింపి, చర్మంతో కప్పిన ఈ దేహం మూత్ర పురీషాలతో కంపుకొడుతుంది. పొంచి వున్న ఆపదలాంటి ముసలితనంలో ఇది ఒక రోగ మందిరం. మలినమయం. సర్వదోష నిలయం. ఇది ఏ నిమిషాన చెయ్యని పిచ్చి పని ఉన్నదా? ఇతరుల్ని ఏడిపిస్తాం. పాపాలు చేస్తాం. ఆర్తి కలిగిస్తాం.


Tuesday 6 June 2023

శ్రీదత్త పురాణము (161)

 


కుమారా కార్తవీర్యా! యోగసిద్ధుడికి కర్మభయంలేదు. పూర్తిగా భయాతీతుడు. అందుచేత విధినిషేధాలు ఇతడికి సమానం. నిషిద్ధ కర్మలు అని ప్రక్కన పెట్టడు, విహితసత్కర్మలు అని చేపట్టడు. పసిబిడ్డలాగా ప్రవర్తిస్తూ వుంటాడు. ఇతడు ఆత్మరతుడు. ఆత్మ తృప్తుడు. ఇతడికి ఆచరించదగిన కర్మ అంటూ ఏదీ వుండదు. ఆచరించినందువల్ల లాభంగాని ఆచరించనందువల్ల నష్టంగానీ ఏదీ యోగికి ఉండవు, అసలు ఇతడికి ఈ సమస్తంలోనూ ఏ ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు ఎల్లవేళలా పరమానందంలో మునిగి తేలుతుంటారు. ఒకడు యోగ యుక్తుడైన కర్మ భయాతీతుడు. ఇంకొకడు- బుద్ధి కూడా అందని స్థానాన్ని అంటే బ్రహ్మైక్యాన్ని పొందినవాడు.


కార్తవీర్యా! ఇక ఇంటికి వెళ్ళు నీ రాజ్యాన్ని నువ్వు పాలించు. రక్షించు. అది నీ ధర్మం యజ్ఞాలతో దేవతల్ని శ్రాద్ధాలతో పితృదేవతల్ని దాన ధర్మములతో బ్రాహ్మణులను సంతృప్తి పరచు. అప్పుడప్పుడూ దర్శనానికి వచ్చి నన్ను ఆనంద పెట్టు, అవ్యగ్ర చిత్తుడవై నన్ను నిరంతరం స్మరిస్తూవుండు. నేను బోధించిన జ్ఞానాన్ని, నేను కలిగించిన అనుభవాన్ని ఏనాడూ మరచి పోకూడదు సుమా! ఏకాగ్ర చిత్తంతో తత్వాన్ని ధ్యానించు. ఇంకా నేనేమి చెప్పానో అన్నింటినీ ఆచరించు. వెళ్ళిరా.


దత్తస్వామి ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యార్జునుడు మరొక్క మారు సాగిలపడి మ్రొక్కి లేచి మనసంతా ఆనందంతో పులకరించిపోతూ వుండగా కళ్ళవెంబడి ఆనంద భాష్పములు చిమ్ముతూ ఉండగా అక్కడ వున్న ఋషి మండలికి ప్రదక్షిణంచేసి, నమస్కరించి అందరి ఆశీస్సులు అందుకొని సెలవు తీసికొని బయలుదేరాడు.


వెనక్కి వెనక్కి తిరిగిచూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు. మాహిష్మతీనగరం చేరుకొని యధావిధిగా పరిపాలన సాగించాడు. గురూపదేశాన్ని అక్షరాలా పాటిస్తూ రాచకార్యములు నిర్వహిస్తున్నాడు. 


సంవత్సరకాలం గిర్రున తిరిగిపోయింది. ఒకనాడు బయలు దేరి సహ్యాద్రి పర్వతానికి చేరుకుని స్వామి దగ్గరకు వచ్చి దత్తస్వామికి అక్కడ వున్న మునిజనులందరికీ నమస్కరించాడు. స్వామి ఆదరంగా దగ్గరకు పిలచి చేరువలో కూర్చోపెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయినాయి. నాయనా! ఏదో అడగాలని వచ్చినట్లున్నావు. సంశయం దేనికి? అడుగు అని ప్రోత్సహించేసరికి కార్తవీర్యుడు సవినయంగా తన సందేహాన్ని ఇలా బయటపెట్టాడు.   


7 జూన్ 2023, బుధవారం, జ్యేష్ఠ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

 


7 జూన్ 2023, బుధవారం, జ్యేష్ఠ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.


ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి బుధవారం వచ్చింది. )


7 జూన్ 2023, బుధవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 10.20 నిమి||


గమనించగలరు.


జ్యేష్ఠ మాసంలో వచ్చింది కనుక దీనికి కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి అని పేరు.


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది.

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


Monday 5 June 2023

శ్రీదత్త పురాణము (160)

 


ఇలా అడుగుతున్న కార్తవీర్యున్ని చూసి దత్తస్వామి ముసిముసి నవ్వులు నవ్వుతూ నాయనా కుమారా! స్నానం చెయ్యి. నిత్య విధులు ఆచరించు. ఆహారం తీసుకో, రేపు మళ్ళీ సమాధిలోకి ప్రవేశించుదువుగాని అన్నారు. అర్జునుడు అలాగే చేసి ఆ మర్నాడు దత్తస్వామి అనుమతితో గుహలో ప్రవేశించి సమాధి స్థితిని పొందాడు. ఆరునెలల మళ్ళీ దత్త గురుడి ఇచ్ఛ ప్రకారం ఇవతలకి వచ్చాడు. వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు.


తనయా! స్నానంచేయి. నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకో రేపు మళ్ళీ గుహలోకి ప్రవేశించి సమాధిలో వుండు. సంవత్సరం తరువాత మళ్లీ ఇలాగే లేచి వద్దువుగానీ- అని గురుస్వామి ఆజ్ఞాపించారు. అర్జునుడు అలాగే చేసి సరిగా ఏడాదికి సమాధి నుండి లేచి స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. అప్పుడు భక్త వత్సలుడైన గురుస్వామి ప్రేమగా చేరబిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చోబెట్టుకొని మృదువుగా ఇలా సంభాషించారు.


రాజా కృతార్ధుడవయ్యావు నీవు. నాకు చాలా ఆనందంగా వుంది, అప్పట్లో నువ్వు అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఒక్క దానికి మాత్రం అప్పుడు చెప్పలేదు. అది ఇప్పుడు చెబుతున్నాను. సదాచారం గురించి అడిగావు గుర్తుందా? అది చెబుతాను తెలుసుకో. నిజానికి ఇప్పుడు నీకు గానీ నాకు గానీ ఈ సదాచారం అవసరం లేదు. మనం దీనికి అతీతులం. కానీ సనాతనాలైన వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్ట కూడదు. అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యమూ వీటిని ఆచరిస్తూ వుంటాను. అయితే - భక్త జనబాధను తప్పించుకోవడానికి అప్పుడప్పుడూ సదాచారమునకు వ్యతిరేకిగా ప్రవర్తిస్తూ వుంటాను. మదవతీ, మధ్య, మాంసాలను సేవిస్తున్నట్లు, కృశానాదులలో సంచరిస్తూవున్నట్లు కనిపిస్తాను. కానీ నాయనా! నన్ను చూసి నువ్వు ఇవి నేర్చుకోకు. సదాచారానికి భిన్నంగా ఏనాడూ ప్రవర్తించకు. గృహస్థాశ్రమానికి నిర్ణీతాలైన ధర్మాలను స్థిరంగా ఆచరించు. ఇది లోక శ్రేయస్సుకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితులలోనూ అన్యధా ప్రవర్తింపకు ఎందుకంటే సమాజంలో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్నే ఇతర జనమూ ఆదరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే తక్కిన లోకమూ దాన్నే అనుసరిస్తుంది.


Sunday 4 June 2023

శ్రీదత్త పురాణము (159)

 


కార్తవీర్యార్జునుడు కృతజ్ఞుడై చేసిన స్తుతికి సకల దేవతా పతాక భూమి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి హృదయ-నేత్ర-వదనారవిందాలు నిండుగా వికసించాయి. ప్రేమ తొణికిసలాడే చూపులతో కటాక్షించి ఇలా పలికాడు.


రాజన్యసత్తమా ఇప్పటికి నీకు తత్వం అర్ధం అయ్యింది గదా! పరోక్షజ్ఞానం లభించింది. అపరోక్షాను భూతి కూడా కావాలి. అది కూడా కలిగిస్తాను. ఇదిగో హృద్యమూ, నిరామయమూ గూఢమూ అయిన గుహ. ఇందులోకి ప్రవేశించు. దృడాసనం వేసుకొని నడుమూ, మెడ, శిరస్సు, సమానంగా వుండేలా (నిటారుగా నిగిడించి కూర్చో, కూర్చుని నేను ఉపదేశించిన తత్వాన్ని సుస్థిరంగా చింతన చెయ్యి అక్కడ ఏ అవబోధ కలుగుతుందో ఏ సమాధి సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి కృతార్ధుడవు అవుదువుగాని, అని పలికి అంబుజాక్షుడు అమృతానందదాయకమైన తన దక్షిణ హస్తాన్ని అతడి శిరస్సు మీద ఆనించాడు. అతడు శిరస్సువంచి నమస్కరిస్తూ గుహలోకి ప్రవేశించాడు. పద్మాసనం వేసుకొని యధావిధిగా కూర్చున్నాడు. దత్తస్వామి ఆజ్ఞాపించినట్లు చేసాడు. చాలా తక్కువ వ్యవధిలో భగవదనుగ్రహం వల్ల సమాధి స్థితిని పొందారు. స్థాణువులా నిశ్చల శరీరుడు అయ్యాడు. పద మూడు నెలలు గడిచాయి. క్రమంగా నరభావనలోకి దిగివచ్చాడు. మెల్లగా లేచారు. గుహ నుండి వెలుపలికి వచ్చాడు. స్వామి పాదాలకు ప్రణమిల్లాడు. స్వామి అతన్ని దయార్ధంగా లేవనెత్తి ప్రేమగా పొదివి పట్టుకున్నారు. ఇద్దరూ ఏకాంతంగా సమావేశమయ్యారు. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగారు. నాయనా! అర్జునా! ఏటి అనుభవం చెప్పు గుర్తున్నదా? ఇంత కాలం నువ్వు సమాధిలో వున్నావు. అవ్యగమైన బుద్ధిని, పరమనైశ్చల్యాన్ని ఎలా పొందగలిగావు?


దేవా! నిన్ను ధ్యానించడం మొదలు పెట్టాను. ఆ క్షణంలోనే నా ఇంద్రియాలూ మనస్సూ చిత్తులో లయమైపోయాయి. ఆ పరమానందంలో నిమగ్నమైన నాకు ఇక త్రిపుటి భాసించలేదు. ఆ నిరుపమానానందాన్ని క్షణంలో సగంసేపు అనుభవించాను అంతే. బలీయమైన నా ప్రారబ్దం మళ్ళీ నన్ను లాక్కు వచ్చి దేహ దశకు తెచ్చింది. దయానిధీ! నాకు ఆ దివ్యానుభవాన్ని కలిగించింది నీ పాదపద్మమే తప్ప మరొకటి ఏదీ కాదు. దేవా! నీ దయవల్ల నిరాకులంగా పరమానంద సందోహం అందుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే భవాబ్దిని దాటాను. తెలుసుకోవలసింది తెలుసుకున్నాను. పొంద వలసినది పొందాను. చెయ్యవలసింది చేసాను. నాకిక వీటిలో శేషమేదీ లేదు. నా మనస్సులో హాయిగా వుంది. మళ్ళీ ఆ చిత్యుభానుభవం కోసం పరుగులు తీస్తోంది. యోగ విద్యాపారంగతా! నాకిప్పుడు రాజ్యం వున్నా ఒకటే వూడినా ఒకటే. ఉన్నది అని సుఖం లేదు. లేదని దుఃఖం లేదు. ఇది గ్రాహ్యమని ఇది ఆగ్రాహ్యమని ఏమీ అనిపించడంలేదు. అన్నీ ఒకటిగా ఉన్నాయి. దేశం - కాలం - పదార్ధం. అన్నింటా ఒకే ఒక్క చిదాత్మ కనిపిస్తోంది. నేనిప్పుడు పూర్ణానందుణ్ని అంతటా పూర్ణానందమే నిండి ఉంది. చిదానందమయం కాని పదార్ధం ఏదీ నాకు కనిపించడం లేదు. దశదిశలూ ఆనందమయాలుగా భాసిస్తున్నాయి. పరమాత్మా! అనుమతి ఇస్తే మళ్ళీ గుహలోకి ప్రవేశిస్తాను. నీ పదార్థాలను దర్శించడం నీ స్వరూపాన్ని తిలకించడం రెండూ సమానమే. అంచేత నువ్వు ఏది ఆదేశిస్తే అది చేస్తాను. నీ అనుజ్ఞ కోసం నీ ఆదేశం కోసం నిలబడ్డాను.


Saturday 3 June 2023

శ్రీదత్త పురాణము (158)

 


స్వామిన్! ఈ భవాబ్దిలో కొట్టు మిట్టాడుతున్న జీవులకు ఏకైక శరణ్యుడవు. ఉద్దారకుడవూ నువ్వే. జీవులకే కాదు యోగులకు, పరమహంసలకు సైతం గతివి నువ్వే నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడివి. సర్వేశుడవి స్వయం ప్రకాశకుడవు, సర్వ రక్షకుడవు, అటువంటి నిన్ను దేహ ఇంద్రియ- ప్రాణ విషయాలను పరిత్యజించి ప్రసన్నుడనై దేవా! ఇదే శరణు వేడుతున్నాను. అగ్ని అరణుల్లో అవ్యక్తరూపంగా వుంటుంది. మధిస్తే స్ఫులింగ రూపంతో స్పష్టపడుతుంది. హవిస్సుతో ప్రదీప్త రూపంపొందుతుంది. అలాగే నువ్వు మూలా ధార వివరంలో పరాఖ్యతో అవ్యక్త రూపుడవై ప్రభవిస్తావు. అటుపైన నాభి దగ్గర మణి పూరక చక్రంలోకి పశ్యంతిగా ప్రవేశిస్తావు. కంఠం దగ్గర విశుద్ధ చక్రంలో మధ్యమానామధేయంతో ప్రకాశిస్తావు. చివరకు ముఖం నుండి అక్షరాకృతితో వైఖిరీ నామధేయంతో స్పష్టపడతావు, శబ్ద బ్రహ్మమా నీకివే నా నమస్కృతులు, దేవా! నువ్వే త్రివృత్తు, అబ్జయోనివి నువ్వే. ఈశుడవు నువ్వే, అవ్యక్తుడవు నువ్వే అద్వితీయుడవు నువ్వే.


వయస్సుతో మహాత్ముడవు ఆద్యుడవు. బీజాలు క్షేత్రంలో ప్రవేశించి ఆశ్లిష్ట శక్తులై బహు రూపాలతో ప్రకాశం పొందినట్లు ఈ సృష్టిలో సర్వత్రా తానై విరాజిల్లే నీకు వందనములు, పట తంతు న్యాయంగా ఈ విశ్వం నీలో ఓతప్రాతమయ్యింది. మాయలో నవ్వే అనేక రూపాలుగా భాసిస్తున్నావు. కనుక ద్వితీయ భాసం లేదు. అద్వితీయుడవు. ఆత్మ స్వరూపుడవు, సచ్చిదానందుడవు. నీకిదే నమస్కరిస్తున్నాను.


మాయా విభాసమైన ఈ జగత్తు అనే వృక్షానికి పుణ్య పాపాలు విత్తనములు, వాసనలు వ్రేళ్ళు. సత్వరజస్తమో గుణాలు నాళాలు, దశేంద్రియాలు శాఖలు. పంచమహభూతాలే స్కందాలు. వాత పిత్త శ్లేష్మాలు మూడూ వల్కలాలు. జీవుడూ, ఈశ్వరుడూ అనే పక్షి జంటకు ఇది గూడు. గృహస్థులు దీని దుఃఖ ఫలాన్ని హంసలు, పరమ హంసలూ దీని సుఖఫలాల్ని అనుభవిస్తున్నారు. ధీరులైన వారు వాడియైన విద్యా గుకారంతో (కొడవలి) దీన్ని సమూలంగా ఖండించి నీలో ఐక్యం పొందుతున్నారు. అఖిల హేతూ! సర్వసారా! సురేశా! స్వజన సుఖదశీలా! దేవ వేద్యా! పురాణపురుషా! ఋషభా! ఆద్యా! విశ్వవంద్యా! ముకుందా! చిత్ప్రకాశా! పాప సముద్రం నుండి బయటపడ్డ నేను నీకిదే నమస్కరిస్తున్నాను. గురూ! గురుతరా! గురుగమ్యా! గుణాకారా! గురూత్తమా! దేవా! దేవ వంద్య పదాంబుజా! నీకిదే ప్రణమిల్లుతున్నాను.


Friday 2 June 2023

శ్రీదత్త పురాణము (157)

 


మనస్సుకి విక్షేపం కలిగితే దాన్ని వెంటనే శమింపజేసుకోవాలి. మనస్సు లయమై సుషుప్తిని పొంది దాన్ని ప్రబుద్ధం చెయ్యాలి (మేల్కొల్పాలి), ఇలా నిరంతర జాగరూకుడై యోగి తన మనస్సును ఏ వృత్తులూ లేని స్థితికి చేర్చాలి. ఇదే కషాయపక్వత అంటే ఇదే అఖండాకారత అంటే. ఇదే సమత అంటే. అప్పుడు అతడు నివాత దీప కళికలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటాడు. జ్ఞాతృకేయ విభాగళూన్యుడై బ్రహ్మాకారస్థితిలో ఉంటాడు. అతడికి ఏ చలనమూ వుండదు. ఏ రసాస్వాదనమూ ఉండదు. ఏ సంగమూ ఉండదు. వృత్తి శూన్యుడూ బ్రహ్మీభావం పొందిన వాడూ అయిన ఇటువంటి యోగికి హృదయగ్రంధి (అహంకార గ్రంధి) బ్రద్ధలైపోతుంది. సర్వ సంశయాలు పటాపంచలైపోతాయి. కర్మలన్నీ అంతరిస్తాయి. జీవన్ముక్తుడు అవుతాడు.


కార్తవీర్య రాజా! బ్రహ్మాను భవ పర్యంతం యోగావస్థను నీకు ఎరుకపరచాను. దీనితో నువ్వు కూడా బ్రహ్మ సాక్షాత్కారం పొంద గలుగుతావు. ఇది తథ్యం. అయితే నాయనా! ఈ యోగవిద్యను ఎవరికి పడితే వారికి బోధించకూడదు. అవినీతుడికి అస్సలు బోధించరాదు. వినీతుడూ, శుద్ధ చిత్తుడూ అయిన శిష్యుడికే పరీక్షించి బోధించాలి. యోగీశ్వరుడైన స్వామి ఇలా తత్వోపదేశం ముగించాడు. కార్తవీర్యార్జునుని కళ్ళల్లో ఆనందభాష్పములు వరదలు కట్టాయి. హృదయాంబుజం వికసించింది. తనువంతా పులకించిపోయింది. భక్తి ప్రపత్తులతో మరో మారు సాష్టాంగపడి నమస్కరించాడు. చాలా సేపటికి తెప్పరిల్లి మెల్లగా లేచాడు. అంజలి ఘటించి వినమ్రంగా నిలబడ్డాడు. దత్తదేవా! మహానుభావా! అగ్ని కాంతులతో చీకట్లు తొలగినట్లుగా నీ తత్వబోధతో నాలోని మోహాంధకారం తొలగిపోయింది. హృదయాంబుజాన్ని వికసింపజేస్తూ జ్ఞాన సహస్ర భానుడు ఉదయించాడు. హే అకుంఠ ధామన్! నీ పాద పద్మ సేవతప్ప ఈ చీకట్లను తొలగింపజేసేది ఈ సృష్టిలో మరొకటి లేదు. నీ పాదమూలం విశుద్ధి ప్రదం, సర్వరోగ నివారకం సర్వ మంగళ ప్రదం. సర్వయోగ సిద్ధిదాయకం పురుషార్ధ సిద్ధి కోరేవాడు ఎవడైనా సరే కృతజ్ఞుడై నీ పాదమూలాన్ని ఆశ్రయించాలి. మరి దేనిని ఆశ్రయించినా వ్యర్ధమే. అందుకే హంసలూ, పరమహంసలూ వచ్చి ఆనంద మకరందాన్ని ఎగజిమ్మే నీ పాద పద్మాలను యోగ విభవం కోసం కరణువేడుతున్నారు. నీ పాదాలను తదేక దీక్షతో ఆర్చించేవారికి చతుర్విధ పురుషార్థాలూ తమంత తాముగా కోరి సిద్ధిస్తున్నాయి. ప్రభూ! నీ పాద పద్మం కేవలం త్రిమూర్తి వేద్యం. అది సర్వాశ్రయం, సర్వలయకరం, స్వాత్మావభాసం విశదప్రకాశం. నేను ఆ పాద పద్మానికి నమస్కరిస్తున్నాను. అది చల్లనిది. శాంతకరమైనది సుశేవ్యం. శుభప్రదం, శివప్రదం, తాపనాశకం, జన్మజరామయభయాలను తొలగిస్తుంది. ఆశ్రితులందరికీ సారవంతమైన ఆనందాన్నిస్తుంది. నీ పాదపద్మానికి అంజలి ఇస్తున్నాను. తాడునుచూసి సర్పమని అనుకున్నట్లుగా ఈ సద సదాత్మకమైన విశ్వమంతా మాయవల్ల నీలో సత్యంగా కన్పిస్తుంది.

Thursday 1 June 2023

శ్రీదత్త పురాణము (156)

 




సోహమ్ అనే అఖండార్థ దృఢ మనోవృత్తిలో సదా తన చైతన్యం వ్యాపించి వుంటుంది. అహంబ్రహ్మ- బ్రహ్మైవాహమ్ అనే వృత్తి తాలూకు ప్రవాహ దృఢత్వంలో చిత్తు ప్రతిబింబితమవుతుంది. సూర్యకాంతమణి యోగంతో దూదిలో అగ్ని రగుల్కొన్నట్లుగా చిత్ప్రతిబింబం తరుక్కుమంటుంది. విచక్షుణులైన విద్వాంసులకే ఇది సుకేయం. ఆ ప్రతిబింబంతో వ్యాప్తమైన ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తానూ నశిస్తుంది.

అంటే ఈ వృత్తికి ప్రయోజనం తమోనాశకు తప్ప స్వప్రకాశ విషయీకరణంకాదు. తమోనాశంతో వృత్తి నాశమూ అవుతుంది. వృత్తి అనే ఉపాధి నాశనమవ్వడంతోనే చిత్ప్రతి బింబం చిత్తు అయిపోతుంది. అప్పుడు అది ఒక్కటే భాసిస్తుంది. కాంతిమంతమైన ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం. అది మనో వాక్కులకు అందదు.

దీన్ని ఒక చిత్త వృత్తి అనీ మనస్సుతోనే దర్శించగలమని చెప్పడం దాని సంగతి అస్సలు తెలియని వారికి ఏదో కొంత తెలియచెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనస్సుకు అందుతుందా, వాక్కులకి అందుతుందా? స్వప్రకాశమూ నిత్యమూ అయిన ఆ పరంజ్యోతి వాజ్ఞ్మనస్సులకు ఆవలిది. అందనిది "యతో వాచో నివర్తంతే ఆప్రాప్యమనసా సహ- అని ప్రతి కీర్తించింది దీనినే. అయితే అజ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్త వృత్తి అనేది దారి చూపించడానికి పనికి వస్తుంది. బ్రహ్మతత్వాన్ని గూర్చిన అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ వృత్తి వ్యాప్యత్వం అవసరమవుతుంది. సాధకుడు ఆ దారిన పోగా పోగా బ్రహ్మసాక్షాత్కారం అవుతుంది. ఆ దర్శనం అయ్యేంత వరకూ ఈ వృత్తి వుండాలి. అటు తర్వాత ఉండకూడదు. ఈ వృత్తిలో స్వభావ సిద్ధంగానే జ్ఞాతృక్షేయ విభాగం ఉంటుంది. కాబట్టే దీన్ని సవికల్ప సమాధి అనడం వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాది. ఇందులో పరతత్వం అవిభాజ్యంగా (జ్ఞాతృజ్ఞేయవిభాగరహితంగా) అనుభూతమవుతుంది.

కార్తవీర్యార్జునా ! నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి కొన్ని విఘ్నాలు (ఆటంకాలు) వచ్చిపడుతూ వుంటాయి. అవే అణిమాది - ఆష్ట సిద్ధులు, యోగి వాటిని ఆశించాడో ఇంక భ్రష్టుడయ్యాడన్న మాటే, ఆ సిద్ధులు కూడా నశ్వరములు అని గుర్తించి వాటి జోలికి పోకుండా విరమించుకోవాలి.