Tuesday 31 August 2021

శ్రీ హనుమద్భాగవతము (28)



ఋషులు శాపము


బాలుడైన హనుమంతుడు మిక్కిలి చంచలుడు, అల్లరివాడు, పైగా ప్రళయంకరుడైన శంకరుని అవతారము, కపిశాబకము, అదీగాక ఎంతోమంది దేవతలచే అమోఘమైన వరాలను పొన్దినవాడు. ఇతని అల్లరికి తల్లిదండ్రులు ఎంతో ప్రసన్నులవుతున్నారు. సింహము తోకను ప్ట్టుకొని దానిని నలువైపుల త్రిప్పుట, ఏనుగును పరీక్షించుట అనే పనులు తఱుచుగా అతని నిత్యక్రీడలైనాయి. ఒక్కొక్కప్పుడతడు పెద్ద పెద్ద చెట్లను సమూలముగ పెఱికి వేసేవాడు, ఇతనికి తెలియని, ఎక్కని పర్వత శిఖరం ఏదీ లేదు. దుర్గమములైన వనములను, పర్వతములను సంపూర్ణముగా ఇతడు చూసి ఉన్నాడు.


వన్యప్రాణులకి ఇతడంటే భయము, కాని అవి మనస్సులో అతనిని ప్రేమించుచుండేవి. ఇతడు సర్వప్రాణులకు -- మిత్రుడు, రక్షకుడై ఉన్నాడు. బలవంతుడు ఎవ్వడైనా బలహీనుని బాధిస్తే బాలుడైన హనుమంతుడు ఊరకునేవాడు కాదు. ఇతడొక చెట్టు నుండి మఱియొక చెట్టు పైకి దూకుతు కొన్ని ఆమడల దూరము వెళ్ళేవాడు. తన బరువుచే ఏ చెట్టు కొమ్మయైన విరుగుతుందని సందేహము గలిగితే వెంటనే అతడు తేలికగా మారేవాడు.


వరముల వలన గలిగిన శక్తితో హనుమానుడు ఋషుల ఆశ్రమములలోనికి వెళ్ళేవాడు. అచట వారికి కష్టమును కలిగించే పనుల చేస్తుండేవడు. ఒక ఋషి ఆసనమును మఱియొక ఋషి సమీపమున ఉంచేవాడు. ఒకని మృగచర్మాన్ని కప్పుకొని చెట్టుపైకి ఎగిరేవాడు, లేదా దానిని అక్కడే వ్రేలాడ వేసేవాడు. ఒకరి క్మండలములోని నీరును పారబోసేవాడు, మఱియొకరి కమండలం పగులగొట్టేవాడులేదా నీటిలో పారబోసేవాడు.  


హనుమంతుడు జపము చేసుకుని మునుల ఒడులలో కూర్చున్నవాడు. అహింసాపరాయణులైన ముని ధ్యానస్థుడై 'జపం చేసుకొనుచుండగా ఇతడు ఆయన గడ్డమును లాగి పారిపోయేవాడు. ఒకరి కోపీనాన్ని, మఱియొకరి పారాయణ గ్రంథమును పండ్లతోను, చేతులతోను పట్టుకొని అటు ఇటు విసరి వేసేవాడు. స్రుక్సువాదులను విఱుగగొట్టును, మహాత్ముల యజ్ఞపాత్రలను పగులగొట్టేవాడు. కష్టముతో సంపాదించుకొన్న నారచీరలను చింపిపార వేసేవాడు. బ్రహ్మాది దేవతలు వరములిచ్చి ఉండటంతో ఋషులు బాలహనుమానుని ఏమీ అనలేక మిన్నకున్నారు, కాని అతని బాధలను మాత్రము తట్టుకొన లేకపోయేవారు. తమ మూఢాచారాలను ఖండించటం కోసం ఆంజనేయుడట్లొనఱిన్చినాడని ఋషులు తెలుసుకొన లేకపోయారు. 

Monday 30 August 2021

శ్రీ హనుమద్భాగవతము (26)



అక్కడే ఉన్న సూర్య దేవుడు 'నేను ఇతనికినా తేజస్సులోని శతాంశము(వందవ అంశను) ఇస్తాను, దానితో పాటు తగిన సమయమున విద్యను బోధించి ఇతనిని శాస్త్రమర్మజ్ఞునిగా చేస్తాను, ఇతడు సాటి లేని విద్వాంసుడు, వక్త అవుతాడూ అని పలికాడు. 


“నా పాశము చేత, జలము చేత ఇతడెప్పుడు ఖూడా సురక్షితంగానే ఉంటుందాని వరుణుడు పలికాడు.


“ఇతడు రోగరహితుడుగా ఉంటాడు... నా దండము వలన ఇతనికెప్పుడూ మరణము సంభవించ”దని యముడు పలికాడు.


పింగళవర్ణుడు, యక్షులకు రాజైన కుబేరుడిట్లా పలికాడు. “యుద్ధంలో ఇతనికెప్పుడూ విషాదము కలుగదు, నా గద నుండి ఇతనికి రక్షణ కలుగుతుంది. నా పరివారమైన యక్ష రాక్షసులచే ఇతడెప్పుడూ పరాజితుడు కాడు.”


“ఇతడు నా చేతగాని, నా ఆయుధముల చేతగాని ఎప్పుడూ వధ్యుడు కాడు” అని శంకరుడు వరమిచ్చాడు...


విశ్వకర్మ ఇలా పలికాడు -'ఈ బాలుడు నాచే నిర్మితములైన శస్త్రాస్త్రములచే ఎల్లప్పుడూ సురక్షితుడై ఉండగలడు'.


ఇట్లా దేవతలందఱూ అమోఘములైన వరాలను ఇచ్చిన పిమ్మట బ్రహ్మ దేవుడు ఎంతో ప్రసన్నుడై ఇతడు దీర్ఘాయుమ్మంతుడు, మహాత్ముడు, సర్వివిధములైన బ్రహ్మదండములచే అవధ్యుడై ఉన్డగలడూ అని పలికెను


ప్రసన్నుడైన చతురాననుడు వాయు దేవునితో మఱల ఇలా పలికాడు. వాయు దేవా! నీ ఈ పుత్రుడు శత్రువులకు భయండు ఇచ్ఛానుసారముగా రూపమును ధరించి తలంచిన చోటికి వెడలగలడు. వీని గమనము అవ్యాహతము. ఇతడు మహాయశస్వి అవుతాడు. అద్భుతములు, రోమాంచ కారకములైన కార్యముల చేస్తాడు.'


ఇలా వరములనిచ్చి బ్రహ్మాది దేవతలు, మహర్షులు తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు.


Sunday 29 August 2021

శ్రీ హనుమద్భాగవతము (26)



ఎదుట నిలచియున్న బ్రహ్మదేవుని చూడగానే వాయుదేవుడు పుత్రుని ఒడిలోనికి తీసుకుని నిలబడ్డాడు. అప్పుడు హనుమానుని చేవులకు అలౌకికమైన కుండలాలు వ్రేలాడుచున్నాయి, శిరస్సున కిరీటము, కంఠమున హారములు, దివ్యమైన అవయవాలపై స్వర్ణాభూషణములు శోభిల్లుతున్నాయి. వాయుదేవుడు బ్రహ్మ దేవునిచరణముల పైబడ్డాడు. 


చతురాననుడు వాయుదేవుని లేవనెత్తి ఎంతో ప్రేమతో అతడు కుమారుని అవయవములను తన కరకమలములతో నిమిరాను, బ్రహ్మకరస్పర్శచేత పవనపుత్రుడు మూర్ఛ నుండి తేరుకొని, లేచి కూర్చున్నాడు. తన పుత్రుడిట్లా జీవితుడవటం చూసి జగత్తునకు ప్రాణస్వరూపుడైన వాయు దేవుడు వెనుకటివలె వీచసాగాడు. దానివలన మూడులోకాలకు మరల ప్ర్రాణములు వచ్చినట్లు అనిపించాయి.


బ్రహ్మ సంతుష్టుడై హనుమంతునకు వరములను ఇస్తూ “ఈ బాలునకు బ్రహ్మశాపము తగులదు, వీని అవయవములను ఏ శస్త్రాస్త్రములు కూడా ఎప్పుడును ఛేదింపజాలవు " అని పలికాడు. మరల ఆయన దేవతలనుద్దేశించి ‘దేవతలారా! అసాధారణుడైన ఈ బాలుడు భవిష్యత్తులో మీ అందరికి పరమ హితమును చేకూర్చే వాడవుతాడు. అందువల్ల మీరు ఇతనికి వరములను ఇవ్వండి' అని పలికాడు.


దేవేంద్రుడు వెంటనే ప్రసన్నుడై హనుమానుని కంఠాన్ని వాడని కమలమాలతో అలంకరించి ఇలా పలికాడు - ' నేను ప్రయోగించిన వజ్రాయుధము చేత ఈ బాలుని దవడ విరిగిపోయినది, అందువలన ఈ కపిశ్రేష్ఠుడు నేటి నుండి హనుమంతుడను పేరుతో పిలువబడుతాడు*. 


మత్కరోత్సృష్టవజ్రేణ హనురస్యయథా హతః |


నామ్నా పై కపిశార్దూలో భవితా హనుమానితి ||


(వా. రా. 7-88-11)


ఇంతేకాక ఈ బాలునిపై నా వజ్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు, ఇతని శరీరం నా వజ్రముకంటెను ఎంతో కఠినముగా ఉండగలదు.”


Saturday 28 August 2021

శ్రీ హనుమద్భాగవతము (25)

 


రాహువు ఎంతో వేగంతో సూర్యుని వైపు పరుగిడెతున్నాడు. అతనిని చూసిన వెంటనే హనుమానునకు ఆకలి గుర్తుకువచ్చింది. అతడు రాహువును సుందరమైన భక్ష్యముగా భావించి అతనిపై బడ్డాను.

 

సురేశ్వరా! రక్షించు రక్షించూ అని అరుస్తూ రాహువు ఇంద్రుని దగ్గరకు పరుగెత్తాడు.

 

సురాధిపతి రాహువును రక్షించుటకు పరిగెత్తాడు. రాహువు తప్పించుకొనిపోయిన తర్వాత హనుమంతుడు ఐరావతాన్ని చూశాడు. మధురఫలముగా భావించి దాని పైకి దూకాడు. అపుడు హనుమానుని స్వరూపము ప్రజ్వలించు అగ్నివలె ప్రకాశిస్తూ భయంకరంగా ఉంది. ఇంద్రుడు భయపడ్డాడు, తనను కాపాడుకొనుటకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది హనుమానుని ఎడమ దవడకు తగిలింది, దవడ విరిగింది. వెంటనే అతడు గిలగిల తన్నుకొనుచు పర్వతశిఖరము పైబడి మూర్ఛితుడయ్యాడు.

 

అట్లా తన ప్రియపుత్రుడు వజ్రాఘాతముతో గిలగిల తన్నుకొంటూ క్రిందపడుట చూసిన వాయు దేవుడు ఇంద్రునిపై కోపగించాడు. శక్తిశాలి యైన వాయు దేవుడు తన గతిని నిరోధించి, పుత్రుని తీసుకునొ పర్వతగుహలోనికి ప్రవేశించాడు.

 

త్రిలోకాలలో ఉన్న సర్వప్రాణు లశ్వాసలు నిలచి పోయాయి. వారి అవయవముల సంధులు విడివడటం ఆరంభించాయి. అందఱు ఎండిన కట్టెల వలె అవసన్నులయ్యారు. వారి సర్వధార్మిక కృత్యములు నిలచిపోయాయి.

 

ప్ర్రాణసంకటముతో భయబడిన ఇంద్రుడు, దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు, గుహ్యకులు మొదలైఅన వారు ప్ర్రాణరక్షణకై బ్రహ్మ దగగ్రకు పరుగెత్తారు. బ్రహ్మ అందరిని వెంట పెట్టుకుని పర్వతగుహలోనికి వెళ్ళాడు. అక్కడ వాయు దేవుడు తన పుత్రుని ఒడిలో ఉన్చుకొని, హృదయానికి హత్తుకొని దుఃఖాతిరేకంతో కన్నీటిని విడిస్తున్నాడు. మూర్ఛితుడైన హనుమానుని శరీరకాంతి సూర్యాగ్నుల వలెను, సువర్ణము వలెను ఉండటం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు. 

Friday 27 August 2021

శ్రీ హనుమద్భాగవతము (24)



సూర్య దేవుడు గూడ తన వైపు వస్తున్న ఈ అలౌకిక బాలుని చూశాడు. పవనకుమారుడు తండ్రి వేగముతో తనవైపే వచ్చుచున్నాడనీ, వానిరక్షణకై వాయు దేవుడుగూడ వెంట వచ్చుచున్నాడనీ వెంటనే తెలుసుకొన్నాడు. “ఆహా! స్వయముగా చంద్రమౌళియైన ఈశ్వరుడే హనుమానుని రూపములో నన్ను ధన్యునిగా చేయటానికి ఇటువైపు వస్తున్నాడు. ఇది నా అదృష్టం " అని సూర్యుడు భావించాడు. వెంటనే అగ్ని మయుములైన ఆతని కిరణములు చల్లబడ్డాయి. హనుమంతుడు సూర్యునిరథముపై కూర్చుండి ఆయనతో ఆడుకొనసాగాడు.


దైవికముగా ఆ దినము అమావాస్యా తిథియైనది. సింహికా పుత్రుడైన రాహువు సూర్యుని పట్టుకొనుటకు వచ్చాడు. సూర్యుని రథముపై కూర్చుంని ఉన్న ఆ బాలుడు అతని కంటబడ్డాడు. రాహువు బాలుని విషయం గురించి ఆలోచించక సూర్తుని పట్టుకొనుటకు ముందుకు వెళ్ళాడు. వెంటనే హనుమంతుడు అతనిని పట్టుకొన్నాడు. హనుమానుని వజ్రపు పిడికిలిలో బంధితుడై రాహువు గిలగిలా తన్నుకో సాగాడు. చివరకు ఎలాగో అతడు బయటపడి పరుగెత్తాడు. అతడు సరాసరి దేవేంద్రుని దగ్గరకు చేరి కనుబొమలను ముడివేసి క్రోధితుడై ఇలా పలికాడు. ‘సురేశ్వరా! నా ఆకలి తీరుటకై నాకు నీవు సూర్యచంద్రులను సమర్పించితివి, కాని ఇప్పుడు నీవీ అధికారమును మఱియొకని ఎందుకు ఇచ్చావు?”


ఆశ్చర్యాన్ని కలగజేస్తున్న రాహువు మాట విని ఇంద్రుడు అతని ముఖాన్ని చూడసాగాడు. అంతట రాహువు ఇలా పలికాడు. ‘నేడు పర్వ సమయం అవ్వటం చేత నేను సూర్యుని గ్రసించుటకు అతని కడకు వెళ్ళాను. ఇంతకుమునుపే అక్కడున్న మఱియొక రాహువు నన్ను పట్టుకొన్నాడు. నేనెట్లాగో ప్రాణాలను కాపాడుకొని ఇక్కడకు వచ్చాను”.


కనులవెంట నీరు కార్స్తున్న రాహువు మాట విని ఇంద్రుడు ఎంతో చింతితుడయ్యాడు. అతడు తన సింహాసనము నుండి లేచి, ఐరావతాన్ని అధిరోహించి పై సంఘటన జరిగిన ప్రదేశమునకు వెళ్ళాడు. రాహువు కూడా అతని వెంట వెళ్ళాడు. శచీపతీ ఆశ్చర్యచకితుడై రాహువును ఖూడా భయమును కలిగించినవాడు సూర్యుని దగ్గరున్న ఆ పరాక్రమవంతుడెవడై ఉంటాడోనని ఆలోచిస్తున్నాడు.

Thursday 26 August 2021

శ్రీ హనుమద్భాగవతము (23)



బాల్యకాలము 


అంజనా దేవి తన ప్రియపుత్రుడైన హనుమంతుని మిగుల శ్రద్ధతోను ప్రేమతోను పెంచుతున్నది. కేసరి కూడా కుమారునిపై ఎంతగానో ప్రేమ చూపుతుండేవాడు. హనుమానుడు సంతోషముతో కిలకిలయనిధ్వని చేయుచుండ అంజనా కేసరులు ఆనంద మగ్నులయ్యేవారు. అతని బాల్య క్రీడలు ఎంతో ఆకర్షకములుగానూ, సుఖకరములుగానూ, అద్భుతములుగానూ ఉండేవి. ఒకనాటిమాట. కేసరి ఎక్కడికో వెళ్ళాడు. అంజన ఖూడా బాలుని ఉయ్యాలలో పరుండబెట్టి ఫలపుష్పముల తెచ్చుటకై వనమునకు వెళ్ళింది. బాలునకు ఆకలేసింది. తల్లి సమీపంలో లేదు. అతడు కాలుచేతుల ఆడిస్తూ ఏడ్వసాగాడు. వెంటనే అతని దృష్టి తూర్పుదిక్కుపై పడింది. అప్పుడే అరుణోదయమవుతోంది. అతడు సూర్యుని అరుణబింబాన్ని ఎఱ్ఱనిపండని తలచాడు.*


(క) ఖ ఆధ్యాత్మరామాయణము 4-9-18, 19.

అసౌ హి జాతమాత్రోఽపి బాలార్క ఇవ మూర్తిమాన్ | 

గ్రహీతుమో బాలార్కపుప్లావాంబరమధ్యతః ॥ 

(స్కంద పు. అవంతీ ఖండము, చతురశీతిలింగమాహాత్మ్యము 78-21)


తేజస్సునకు పరాక్రమమునకు వయస్సుతో నిమిత్తము లేదు. ఇక్కడ హనుమంతుని రూపములో అంజనా దేవి ఒడిలో ప్రళయంకరుడగు శంకరుడు ఏకాదశరుద్రాంశతో ఆడుతున్నాడు. వాయు దేవుడు మొదటనే బాలునకు ఏగిరే శక్తిని ఇచ్చాడు. దానివలన హనుమంతుడు వెంటనే వాయు వేగముతో ఆకాశంలోకి వెళుతుండేవాడు. అతని ఆ వేగమును చూసి దేవదానవయక్షాదులు విస్మితులై ఇట్లా పలుకసాగారు. 'ఈ వాయుపుత్రుని వేగముతో సమానమైన వేగము స్వయముగా వాయువునకు గాని, గరుడునకుగాని, మనస్సునకుగాని లేదు. ఇంత చిన్నవయస్సులోనే ఇతనికి ఇంతటి వేగము, పరాక్రమము ఉంటే యౌవనకాలంలో ఇంకా ఎంత శక్తి ఉంటుందో గదా!'



తనపుత్రుడు సూర్యునివైపు వెళుతుండటం చూసిన వాయు దేవుడు “సూర్యుని తీక్ష్ణకిరణములు నా యీ బాలునకు ఎట్టి బాధను కలుగజేయు కుండుగాక' యని భావించి మంచు వలె శీతలుడై అతని వెంటపోసాగాడు.

Wednesday 25 August 2021

శ్రీ హనుమద్భాగవతము (22)



వైశాఖమాసమున కృష్ణపక్షంలో దశమి తిథి శనివారము నాడు పూర్వభాద్రానక్షత్రము వైధృతీయోగము గల నాటి మధ్యాహ్న సమయంలో అంజన పుత్రుని కనినది. అతడు మహా బలసంపన్నుడు, మహాసత్త్వసంపన్నుడు, విష్ణుభక్తితత్పరుడు.


శ్లో! సర్వదేవమయం వీరం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |

వేద వేదాంగతత్త్వజ్ఞం సర్వవిద్యావిశారదమ్ ||

సర్వబ్రహ్మవిదాం శ్రేష్ఠం సర్వదర్శన సమ్మతమ్ |

మాణిక్యకుండలధరం దివ్య పట్టాంబరాన్వితమ్ ||

కనకాచలసంకాశం పింగాక్షం హేమమాలినం |

స్వర్ణ యజ్ఞోపవీతం చ మణినూపుర శోభితమ్ ||

ధ్వజవజ్రాంకుశచ్ఛత్ర-పద్మ రేఖాంఘిసంయుతం | 

ధీర్ఘ లాంగూలసహితం దీర్ఘ కాయం మహాహనుమ్ || 

కౌపీనకటిసూత్రాభ్యాం విరాజంతం మహాభుజం | 

ఆశ్చర్యభూతం లోకానాం-వజ్రసంహననం కపిమ్స ||

సర్వలక్షణసంపన్నం కీరీటకనకాంగదం | 

ప్రభయాఽమితయా విష్ణోరవతారమివావరమ్ ||


(పరాశరసంహిత 6వ పటలము) 


సకల దేవతలు తానే యైనవాడు, బ్రహ్మవిష్ణుశివ స్వరూపుడైన సృష్టిస్థితిలయాత్మకుడు, వేదవేదాంగముల తత్త్వ మెరింగినవాడు, సకలవిద్యలందు పరిపూర్ణుడు, బ్రహ్మజ్ఞానులందరిలో శ్రేష్ఠుడు, సర్వదర్శనములకు సమ్మతమైనవాడు, మాణిక్యములు పొదిగిన కుండలములను ధరించినవాడు, దివ్యములగు పీతాంబరములను ధరించినవాడు. 'మేరుపర్వతసమానుడు, పింగాక్షుడు, స్వర్ణ మాలికలను సువర్ణ యజ్ఞోపవీతమును ధరించిన వాడు, మణిసమన్వితములైన నూపురములను ధరించి శోభిల్లు వాడు, ధ్వజము వజ్రము అంకుశము ఛత్రము పద్మము రేఖలతో కూడిన పాదపద్మములు కలవాడు, పెద్దహనువు (దవడ) కలవాడు, పొడవైన వాలముగలవాడు, దీర్ఘమైన కాయము (శరీరము) కలవాడు కౌపీనమును మొలత్రాడును ధరించినవాడు, మహాబాహువులుకలవాడు, లోకములకు ఆశ్చ ర్యమును గలిగించువాడు, వజ్రదేహముకలవాడు, వానర రూపుడు, సమస్తశుభలక్షణములు కలవాడు, కిరీటమును బంగారుభుజకీర్తులను ధరించినవాడైన శ్రీ ఆంజనేయుడు అమితమైన కాంతిచే వేరొక శ్రీమన్నారాయణావతారమా అన్నట్లుగా ఉన్నాడు.


శ్లో॥ పపాత పుష్పవృష్టిశ్చ - నేదుర్దుందుభయో దివి | 

ననృతు దేవగంధర్వా-స్తుష్టు వుస్సిద్ధచారణాః |

వనౌ వాయుస్సుఖస్పర్శం నిర్మలోదకాః ||


-- పరా. సం, 6వ పటలము.


ఆ ముహూర్తములో పుష్పవర్షము కురిసింది, దీవియందు దుందుభులు మ్రోగాయి. దేవతలు గంధర్వులు నృత్యము చేసారు, సిద్ధులు చారణులు స్తోత్రములు చేసారు. వాయువు వసమున సుఖస్పర్శ కలిగిస్తూ వీస్తోంది. నదులు స్వచ్ఛనిర్మల జలములతో పరిపూర్ణములై ఉన్నాయి.


శ్రీ హనుమద్భాగవతము (21)



అసురుల అకృత్యములతో భూమి ఆక్రాంతమయ్యింది. భూదేవి ప్ర్రార్థనలను మన్నించి బ్రహ్మశివాదులు శ్రీమన్నారాయణుని భూమి భారమును హరించమనీ, అసురసంహారకుని ప్రసాదించమనీ ప్రార్థించారు.


అపుడు శ్రీహరి ఒక్కక్షణం ఆలోచించి రాక్షసుల నాశము తప్పక జరుగుతుందని పలికాడు. తదనంతరం ఆయన శ్రీహరిహర మహా తేజములను సంగ్రహించి సదాశివునందు ప్రవేశపెత్తాడు. ఈ తేజము మహావానరునిగా ఆవిర్భవించి అసురనాశనం ఒనరించమని పలికాడు. తాను కూడా అవతరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగలనని అభయమొసంగాడు.


పరమేశ్వరుడు పార్వతితో కలసి భూమండలముపై విహరిస్తూ వేంకటాచలము చేరారు. ఆ పర్వతముపై సజ్జనులకు శరణ్యుడైన శ్రీనివాసుడు విరాజిల్లియున్నాడు. ఆదిదంపతులిద్దరూ శేషాచలముపై పుష్పోద్యానముల చెంత, సరస్సుల చెంత విహరింపసాగారు. అదే సమయంలో కింపురుషలోక వాసులైన వానర దంపతులు క్రీడించుటను పార్వతిగాంచెను. ఆమె సంతానేచ్ఛతో ఆది దేవుని సమీపించింది, పరమేశ్వరుడు వానరరూపమును ధరించి వేయిసంవత్సరములు పార్వతీ దేవిపై తన మనస్సును లగ్నం చేసి క్రీడించాడు. తుదకు శ్రీమహా దేవునినుండి శ్రీహరిహర తేజము బయల్వెడలి పార్వతిని సమీపించింది. ఆమె ఆ మహా తేజమును భరింపలేక దానిని అగ్ని దేవునకు ఇచ్చింది. ఆయన కూడా దానిని భరింపలేక సూక్ష్మరూపుడైన వాయువునకు ఇచ్చాడు.


ఆ సమయంలో వేంకటాచలముపై సత్పుత్రప్రాప్తికై అంజన ఘోరతపమాచరించుచున్నది. శంకరుని ఆదేశానుసారము ఆ శ్రీహరిహర తేజాన్ని వాయుదేవుడు అంజనా దేవికి ఇచ్చాడు. ఆ మహా తేజమునుండి శ్రీహరిహర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుడవతరించాడు.


శ్లో॥ వైశాఖే మాసి కృష్ణాయాం దశవిమందసంయుతా | 

పూర్వప్రోష్ఠపదాయుక్తా తథా వైకృతిసంయుతా | 

తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వై సుతమ్ |

మహాబలం మహాసత్త్వం విష్ణుభకిపరాయణమ్ |  (పరాశరసంహిత 6వ పటలము)


Tuesday 24 August 2021

శ్రీ హనుమద్భాగవతము (20)



శంకరుడు అంజనా దేవికి పుత్రరూపములో అవతరించాడు. జనన కాలమందె హనుమానుని సౌందర్యము సాటిలేనిదిగా, వర్ణింప నలవిగానిదిఫా ఉంది. ఆయన శరీర కాంతి పింగళ వర్ణము; రోమములు, నేత్రములు కూడా పింగళవర్గముగానే ఉన్నాయి. ఆయన విద్యుత్కాంతితో సమానమైన, సువర్ణ నిర్మితమైన, మనోహరమైన కుండలములను ధరించే అంజనా దేవి హృదయము నుండి అవతరించాడు. అతని శిరస్సుపై మణిజటితమైన కిరీటము శోభిల్లుతోంది. కౌపీనమును, అంగవస్త్రమును ధరించియున్నాడు. విశాలమైన ఆతని వక్షఃస్థలమున యజ్ఞోపవీతము, హస్తమున వజ్రము, కటిప్రదేశమున ముంజగడ్డితో పేనిన మొలత్రాడు శోభిల్లుతున్నాడు. తన పుత్రుని అలౌకికమైన రూపసౌందర్యాన్ని చూడగానే అంజనా దేవి ఆనందానికి అవధులు లేవు. 

పవిత్రమైన ఈ భూమిపై హనుమంతుడు అడుగు పెట్టగానే దశదిశలయందు హరోల్లాసములు వ్యాపించాయి. కపిరాజైన కేసరియొక్క ఆనందమునకు అవధులు లేకపోయాయి. దేవతలు, ఋషులు, కపులు, పర్వతములు, సరస్సులు, నదులు, సముద్రములు, పశుపక్షులు, భూమి, సర్వము పులకించినది. అంతటా ఆనందసామ్రాజ్యము వ్యాప్తమైనట్లు ఉండింది.

పరాశరసంహితలో శ్రీహనువదవతారప్రసంగము

ఒకప్పుడు మైత్రేయమహర్షి శ్రీ పరాశరమహర్షిని దర్శించి "మహాభాగా! శ్రీ ఆంజనేయుడనే నామముతో ప్రసిద్ధమైన భగవదవతారమును గుర్నిచి ప్రవచించండి. అతడెవ్వడు ? ఎవరికుమారునిగా అవతరించాడు? ఏయే దివ్యలీలలను ఒనరించాడు ? అతని అవతారమెట్టిది? వర్ణించు” అని అడుగగా శ్రీపరాశరుడు ఇట్లు పలికాడు.


Monday 23 August 2021

శ్రీ హనుమద్భాగవతము (19)



ఈయన జన్మదినము మంగళవారమని కొందఱు, శనివారమని కొందఱు తలంచుచున్నారు. భావులకు భక్తులను సర్వ తిథులు శ్రేష్ఠములే.

(ఖ) ప్రాదురాసీత్తదాతాం పై భాషమాణో మహామతిః | 

మేషసంక్రమణం భానౌ సంప్రాప్తే మునిసత్తమాః | 

పూర్ణిమాఖ్యే తిథే పుణ్యే చిత్రానక్షత్రసంయుతే ॥


(స్కందవు. వైష్ణవఖం 40.42-48) 


(గ) ఆశ్వినస్యాసితే పక్షే స్వాత్యాం భౌమే చతుర్దశ | 

మేషలగ్నేఽఞ్జనీగర్భాత్ స్వయం జాతో హరః శివః ||


(వాయుపురాణము)


(ఘ) శుక్లాదిమాసగణనయా ఆశ్వినకృష్ణః కార్తిక 

కృష్ణ తులార్కే మేషలగ్నే సాయంకాలే 

అతశ్చతుర్దశ్యాం సాయంకాలే జన్మోత్సవః |


(హృషీకేశపంచాంగము, వారణాసి)


శివునియొక్క ఏకాదశ రుద్రావతారుడు, మారుతాత రుతాత్మజుడు, కేసరీ నందనుడు అంజనా దేవి పుత్రుడై ఈ భూమిపై హనుమానుడు అవతరించిన సమయములో ప్రకృతియంతయు మనోహరముగా ఉండింది. దిక్కులు ప్రసన్నములయ్యాయి. సూర్య దేవుని కిరణములు సుఖకరముగా, శీతలముగా ఉన్నాయి, సెలయేళ్ళలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది. పర్వతములు కుతూహలముతో ఆంజనేయునుని రాకకై ఎదుగుతూ ఉన్నాయి. జలపాతములు ప్రసన్నముగా ఎగురుతూ చల్లగా పారుతున్నాయి, వనములలోను ఉపవనములలోను, ఉద్యాన వనములలోను వివిధములైన రంగులు కలిగిన మనోహరములైన పుష్పములు విశసించియున్నాయి. వాటిపై భ్రమరములు ధ్వని చేయుచు తిరుగుచున్నాయి. మలయానిలము మెల్లగా వీస్తోంది.

Sunday 22 August 2021

శ్రీ హనుమద్భాగవతము (18)



అసంఖ్యాకులగు దేహధారులు శ్రీ ఆంజనేయస్వామిని ఉపాసించి ఇష్టసిద్ధులను, శాంతిని, పరమపదమును పొంది చరితార్థులైరి. ఎవరైతే శ్రీహరిహరులను హనుమత్స్వరూపంగా భావన చేస్తారో వారు ధన్యులు.


శ్లో! ఏకో దేవ స్సర్వద శ్రీహనుమాన్ 

ఏకోమంత్ర శ్రీహనుమత్ప్రకాశః 

ఏకోమూర్తిః శ్రీహనుమత్స్వరూపా 

చైకం కర్మ శ్రీహనూమత్సపర్యా॥ (ప. స)


అన్నింటిని ప్రసాదించగల శ్రీహనుమంతుడే ఏకైక దైవము. ఆంజనేయుని దివ్యమహిమలను ప్రకాశింపజేసే మంత్రమే ఏకైకమంత్రము. శ్రీ హనుమంతుని రూపము గల విగ్రహమే ఏకైక అర్చావిగ్రహము. శ్రీ హనుమదారాధనా సేవాదులే జీవుని నిజమైన కర్మములు.


శ్లో|| అంజనా సుప్రజావీర -పార్వతీశ్వర సంభవః 

సమర్ధోఽసి మహావీర- మహాబల పరాక్రమః

నరాణాం చ సురాణాం చ - ఋషీణాం హితాయ వై ||


శ్రీ అంజనాకుమారా! నీవు పార్వతీపరమేశ్వరు నుండి అవతరించినవాడవు. మహావీరుడవు, మహాబలపరాక్రమవంతుడవు. నీవు దేవతలకు, మానవులకు, ఋషులకు హితం మొనరించువాడవు.


శ్రీ హనుమదవతరణము


చైత్రశుక్ల పూర్ణిమా మంగళవారము శుభసమయమున భగవానుడగు శివుడు తనకు పరమారాధ్యుడైన శ్రీరాముని ముని మనోమోహకమైన అవతార లీలను దర్శించుటకు, ఆయనకు సహాయము చేయుటకు తన పదునొకండవ రుద్రాంశతో* అంజనా దేవికి పవనపుత్రుడు మహావీరుడు అయిన హనుమానుని రూపమున ఈ భూమిపై అవతరించాడు. 

*యో వై చైకాదశో రుద్రో హనుమాన్ సమహాకపిః |

అవతీర్ణ సహాయార్ధం విష్ణోరమితతేజసః ॥


(స్కం. మాహే. కే. 8-99,100)


పదుకొండవరుద్రుడే అమిత తేజస్వియైన విష్ణువుకు సహాయము చేయుటకు మహాకపియైన హనుమానుని రూపములో అవతరించెను.


కల్పభేదముచేత కొందఱు ఈయన చైత్రశుక్ల ఏకాదశీ దినమున మఘానక్షత్రమున జన్మించినాడనీ, కొందఱు కార్తికకృష్ణ చతుర్దశీ తిథియందు, కొందఱు కార్తికపూర్ణిమా తిథి యందును జన్మించెనని చెప్పుచున్నారు.


(క) చైత్రే మాసి సితే పక్షే హరిదిన్యాం మఘాభిధే | 

నక్షత్రే స సముత్పన్నో హనుమాన్ రిపుసూదనః॥ 

మహాచైత్రీ పూర్ణిమాయాం సముత్పన్నోఽజ్జనీసుతః | 

వదంతి కల్పభేదేన బుధా ఇత్యాదికేచన ॥


(ఆనందరామాయణము, సారకాండ 13.162-68) 


చైత్రశుక్ల ఏకాదశీ దినమున మఘానక్షత్రమునందు శత్రునాశకుడైన హనుమానుడు జన్మించాడు. కొందఱు విద్వాంసులు కల్పభేదాన్ని అనుసరించి చైత్రపూర్ణిమనాడు హనుమంతుడు జన్మించినాడని చెప్పుచున్నారు.

 

Saturday 21 August 2021

శ్రీ హనుమద్భాగవతము (17)



శ్రీ ఆంజనేయుని నవావతారములు 


పరాశర సంహితను అనుసరించి శ్రీ ఆంజనేయుని తొమ్మిది అవతారములు అత్యంత ప్రసిద్ధములు.


శ్లో ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః || 

తృతీయో వింశతిభుజః చతుర్థః పంచవక్త్రశః ॥ 

పంచమోఽష్టాదశభుజః శరణ్యన్సర్వ దేహినామ్ | 

సువర్చలాపతిష్షష్ఠః సప్తమస్తు చతుర్భుజః || 

అష్టమః కధితశ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః |

నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్ ||


(శ్రీ పరాశర సంహిత 60 వ పటలము)


1. ప్రసన్న హనుమదవతారము, 2. వీరాంజనేయావతారము, 3. వింశతి (ఇరువది) భుజాంజనేయావతారము, 4. పంచముఖాంజనేయావతారము, 5. అష్టాదశ (పదు నెనిమిది) భుజాంజనేయావతారము, 6. సువర్చలా హనుమదవతారము, 7. చతుర్భుజ (నాలుగు) ఆంజనేయావతారము, 8. ద్వాత్రింశత్ (ముప్పది రెండు) భుజాంజనేయావతారము, 9. వానరాంజనేయావతారము,


విజయుడను క్షత్రియుడు ప్రసన్నాంజనేయుని ఆరాధించి భవబంధవిముక్తుడై పరమపదమును పొందాడు. మైందుడను భక్తుడు వీరాంజనేయ స్వామిని ఉపాసించి లోకములను సాగరంలో తేల్చగల్గాడు. బ్రహ్మ దేవుడు వింశతిభుజాంజనేయోపాసన చేసి సృష్టికర్త కాగలిగాడు. విభీషణకుమారుడైన నీలుడు పంచముఖాంజనేయుని పూజించి చరితార్థుడయ్యాడు. దుర్వాసమహర్షి అష్టాదశభుజాంజనేయుని ఉపాసించి యోగులలో అగ్రగణ్యుడయ్యాడు. శ్రీహీనుడగు ధ్వజదత్తుడనే బ్రాహ్మణుడు సువర్చలాహనుమదీశ్వరుని ఉపాసించి శ్రీమంతుడయ్యాడు. కపిలుడనే బ్రాహ్మణుడు చతుర్భుజుడైన హనుమంతుడిని ఆరాధించి జననమరణచక్రమును ఛేదించి పరమ పదమును పొందాడు. సోమదత్తుడనే రాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆ రాజు ద్వాత్రింశద్భుజాంజనేయు నుపాసించి సకలరాజ్యమును మరల పొంది చక్రవర్తి కాగలిగాడు. గాలుడనే కిరాతుడు వానరాంజనేయుని పూజించి కుష్ఠువ్యాధినుండి విముక్తుడయ్యాడు.


Friday 20 August 2021

శ్రీ హనుమద్భాగవతము (16)



అందుకు శ్రీమన్నారాయణుడు “ భక్తవశంకర ! నీవు లింగస్వరూపుడవు, నీవీ రూపమున నుండ నేను నీ చేత సేవలను పొందలేను. రాబోవు కల్పములలో నేను దుష్టశిక్షణార్థమై అవనిపై శ్రీరామచంద్రునిగా అవతరిస్తాను, ఆయా అవతారములలో నా శక్తి యగు సీత నా నుండి దూరమవుతుంది. ఆమె లేని నేను అవతార కార్యం పూర్తి చేయలేను. ఆ అవతారములో నీవు ఆదిపరాశక్తి సహితముగా నా అంశను పొంది శ్రీ ఆంజనేయుడవై అవతరించి నీ ప్రతిజ్ఞాపాలన ఒనరించు. శక్తి దూరమైన నాకు నీ నవ్యశక్తిని ప్రసాదించి నన్ను పరిపూర్ణునునిగా చేయుము. దుష్టశిక్షణలో శిష్టరక్షణములో నాతో కలసి పాల్గొను. భగవంతుడవైన నీవే భక్తునిగా అవతరించి పరమభక్తుల ఆచరణ ఇలా ఉంటుందని ఆచరించి సకల విశ్వములకు చూపించు. సకలవిశ్వములందు గల భక్తులకు రక్షకుడు, సకల దుష్టసంహారకుడవై, మోక్షప్రదాతవై, ఐశ్వర్యదాయకుడవై, సచ్చిదానంద స్వరూపుడవై, శ్రీహరిహరుల ఏక రూపుడవై ప్రకాశించు, మమ్ములనందరిని రక్షింపు' అని ప్ర్రార్థించెను.


శ్రీహరి పలికిన వచనముల నాలకించి ఆశుతోషుడైన శివుడు తథా స్తనిపలి కెను. సకల దేవతలు మహర్షులు పరమా నందభరితులై జయజయ మధ్వానముల నొనరించిరి.


కాలాగ్ని రుద్రావతారుడు శ్రీ ఆంజనేయుడు


శివలోకములో సతీశివులు రామనామ మాధుర్యమును ఆస్వాదించుచున్నారు. ప్రసంగ మాధుర్యంలో పరమేశ్వరుడు సతీ దేవితో ఇట్లు పలికెను. ‘మహమాయా! ఎవని నామస్మరణముచే నా శరీరన్ పులకిస్తుందో ఆ నాస్వామి భూమి పై దుష్టశిక్షణార్థము అవతరించనున్నాడు. దేవతలందరూ భగవంతుని సేవించుటకు అవనిపై అవతరిస్తారు. నేను కూడ శ్రీరామ సేవకుడనై నా మనోరథాన్ని సఫలము చేసుకుంటాను'.     


శంకరుని వచనములను ఆలకించి జగజ్జనని కొంచం ఆలోచించి ఇట్లా పలికాడు - 'నాథా! రావణుని సంహరించుటకు భగవంతుడు అవతరించనున్నాడు. రావణుడు మీకు అనన్య భక్తుడు, ధన్యజీవి, అలాంటి పరమభక్తుని సంహార కార్యములో మీరెలా పాల్గొంటారు?


అప్పుడు శంకరుడు మందహాసము చేసి ఇలా పలికెను. 'దేవీ రావణాసురుడు నా భక్తుడైనా నా యొక్క కాలాగ్ని రుద్రాంశను మఱచాడు. దేవీ! నేను పదకొండు రూపాలలో ఉంటాను. రావణుడు తన పది తలలును అర్పించి నా పదిరూపాలను మాత్రమే ఆరాధించాడు. కానీ కాలాంతకమైన నా కాలాగ్ని రుద్రాంశను మఱచాడు. రావణుడు పూజించక వదలిన కాలాగ్ని రుద్రాంశతో నేను అవతరించి శ్రీరామచంద్ర ప్రభువును సేవిస్తాను. రావణునితో యుద్ధం 'చేస్తాను.


పరమేశ్వరుడే ఆదిపరాశక్తితో కూడి, శ్రీమన్నారాయణాంశను పొంది అవనిపై అంజనేయుడై అవతరించాడు. అనేక కల్పములలో ఆ సదాశిపుడు అనేకావతారములను ధరించాడు. ఆయన అవతారములలో తొమ్మిది అవతారములు సుప్రసిద్ధములు. 

Thursday 19 August 2021

శ్రీ హనుమద్భాగవతము (15)



శ్రీమన్నారాయణుడు విశ్వమోహినీరూపమును ధరించి గార్దభనిస్వనుని అంతఃపురము దగ్గరనున్న ఒక పర్వతము పై స్వరముతో అవతరించాడు. ఆ అందాలరాసి సుమధుర స్వరంతో సామవేదగానం పాడసాగింది. 'ఆ గానము విని పరవశుడై అసురేశ్వరుడు పర్వతాగ్రమునకు చేరి కోటికందర్ప సౌందర్య రాసి మోహినిని చూసి పరమాశ్చర్యచకితుడై ఇలా పలికాడు. సౌందర్యరాసీ! నేను త్రైలోక్య నాథుడను. నీవ్వరిదానవు? ఏ లోకము నుండి వచ్చావు? నీ మధురగానము ఆలకింపగానే నా శరీరం పులకించింది. నీ సౌందర్యమును చూడగానే నా మనస్సు నీకు అంకితమైనది. సుందరాంగీ! నన్ననుగ్రహించు. నాకు పట్టపురాణివై దేవలోక భోగములను అనుభవింపుము. అప్పుడా మోహిని 'నాతో ఆడిపాడి నన్ను గెలిస్తే అలాగే చేస్తాను' అన్నది. అసుర సార్వభౌముడు మోహితుడై మోహినితో ఆటపాటలయందు మైమరిచిపోయాడు. మోహిని ఆ అసురునకు అమృతమని సురా పాత్రను అందించింది. ఆతడు పరస్త్రీ వ్యామోహముచే సురను సేవించి జాగ్రన్నిద్రావస్థలకు మధ్య ఉండే స్థితిని పొందాడు.


శ్రీమన్నారాయణుడు సమయం ఆసన్నమైనదని గ్రహించి మోహినీరూపాన్ని విసర్జించి వృకనారాయణునిగా అవతరించాడు. బ్రహ్మాది దేవతలందఱు ఆ వృకనారాయణ మూర్తిని అనేకవిధముల స్తుతింపసాగారు.


‘మహావాలో మహాపాదః వృకః పర్వతసన్నిభః' |


శ్రీవృకనారాయణుడు సుదీర్ఘమైన (వాలము) తోక కలిగి ఉన్నాడు (అది కాలము). పెద్దపాదములను కలిగి ఉన్నాడు (అవి సకల విశ్వ సముదాయములు), పర్వతా కారుడై ఉన్నాడు. శ్రీవృకావతారుడు తన మహావాలముతో గార్దభ నిస్వనుని బంధించి కాలసర్పములవంటి తనవాడినఖము (గోర్ల) లతో చీల్చి చెండాడు. గార్ధభనిస్వనుని దేహమునుండి ఒక వెలుగు బయలు దేరి శ్రీవృకనారాయణుని పాదములందు విలీనమయ్యింది. దేవతలు పుష్పవర్షమును కురిపించారు. బ్రహ్మాదులు అనేక విధముల శ్రీహరిగుణములను గానము చేసారు.


శివుడు ఆ ప్రదేసానికి వచ్చి కరుదెంచి శ్రీహరితో ఇలా పలికాడు “జగన్నాథా! జయము నీదే! నేటినుండి నేను నీ సేవకుడనయ్యాను”

అపుడు శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు. “సదాశివా! నీవు నాకు పూజ్యుడవు, సేవ చేయవలసిన పని లేదు.”

 'శ్రీహరీ! నేను నిన్నెప్పురాధిస్తూనే ఉంటాను. మనము శపథముల చేసుకున్నాం కదా! కావున నీవు నా సేవలు పొందవలసిందే' యని శంకరుడన్నాడు.


Wednesday 18 August 2021

శ్రీ హనుమద్భాగవతము (14)

 


పూర్వము గార్ధభ నిస్వనుడనే అసురచక్రవర్తి ఉండేవాడు, వాడు పరమశివభక్తుడు, కాని శ్రీహరి ద్వేషము కలవాడు. అమృతత్వమును కోరి పరమశివుడిని ఆరాధించాడు. ఘోరమైన తపసు చేశాడు. శివానుగ్రగానికి పాత్రుడై జాగ్రన్నిదావస్థలలో ఎవరిచేత కూడా మరణము లేకుండా వరమును పొందాడు. వరగర్వముతో ఆ అసురేశ్వరుడు శ్రీమన్నారాయణుని సాధించుటకు ప్రయత్నింపసాగాడు. శ్రీహరి ధర్మస్వరూపుడు, సత్య స్వరూపుడు, యజ్ఞమూర్తి గావున ఈ మూడింటిని భగ్నం చేస్తే అతడు శక్తిరహితుడవుతాడని, సునాయాసంగా ఓడిపొతాడని అధర్మపరులు అసురేశ్వరునకు దుర్భోధ చేసారు.

అపుడా అసురచక్రవర్తి సత్యవంతులను, ధర్మపరాయణులను, బాధించడం ఆరంభించాడు. యజ్ఞయాగాదులను భగ్నం చేయుట మొదలుపెట్టాడు.  శ్రీహరిభక్తులను హింసింపసాగాడు. దేవలోకంపై దండెత్తి దేవతలను నిర్జించి వారిని హింసింప సాగెను, అసురుని ఆగడములను భరింపలేక దేవతలు బ్రహ్మ దేవుని శరణు వేడారు. బ్రహ్మ దేవతలను తోడ్కొని శ్రీమన్నారాయణుని శరణువేడారు. అప్పుడు శ్రీహరి అసురుని సంహరించి ధర్మసంస్థాపన చేస్తానని దేవతలకు అభయం ఇచ్చారు, ఆ విషయము తెలిసుకున్న శంకరుడు వైకుంఠమునకు వెళ్ళాడు. శ్రీహరిచే సత్కారములు పొంది సుఖాసీనుడై ఇలా పలికాడు : ‘అచ్యుతా! గార్దభనిస్వనుడు నా భక్తుడు, వానికి ఎవ్వరూ కీడు చేయలేరు. నాచే అమోఘములైన వరములను పొంది 'అతడు మృత్యువు లేని వాడైనాడు'. 

శ్రీహరి ఇట్లు పలికెను : ‘సదాశివా! ‘జాతస్య మరణం ధృవమ్'. ఆ అసురుడు మరణింపక తప్పదు. వాని అధర్మమే వాని మృత్యువునకు కారణము కాగలదు. అనతి కాలంలోనే వానిని సంహరించి దుష్టశిక్షణము శిష్టరక్షణ చేస్తానూ. శంకరుడు ఇట్లా పాలికాడు. 'మాధవా! గార్దభనిస్వమని సంహరించుట అసంభవము. నీవా పని చేస్తే నేను నీకు దాస్యం చేస్తాను, ఇదే నా శపధము’. 

శ్రీహరి శంకరుని ప్రతిజ్ఞ విని మందహాసము చేసి మౌనము వహించాడు.

Tuesday 17 August 2021

శ్రీ హనుమద్భాగవతము (13)



అంజన సర్వలోకమహేశ్వరుని చరణాలకు నమస్కరించి వినయపూర్వకముగా 'కరుణామయుడవైన సదాశివా! సర్వసద్గుణ సంపన్నుడు, యోగ్యుడైన ఒక పుత్రుని ఇమ్ము' అని అడిగింది.


ఈశ్వరుడు ప్రసన్నుడై 'ఏకాదశరుద్రులలో పదునొకండవ అంశ అయిన రుద్రరూపమే నీకు పుత్రరూపంలో జన్మించగలదు, మంత్రాన్ని స్వీకరించు. వాయుదేవుడు నిన్ననుగ్రహిస్తాడు. దానివలన నీకు సర్వసద్గుణసంపన్నుడగు పుత్రుడు జన్మింస్తాడ’ని పలికాడు


పార్వతీశ్వరుడంతర్థానమయ్యాడు. అంజనా దేవి అంజలి చాచి శివప్రదత్తమైన మంత్రాన్ని జపించసాగింది. ఆ సమయములోనే వెనుక చెప్పబడిన ఆడ గ్రద్ద కైకేయి పాయస భాగాన్ని తీసికొని ఆకాశంలో పరుగెడుతోంది. వెంటనే ఒక పెనుగాలి వీచింది. గ్రద్ద శరీరము ముడుచుకొని కొనిపోజొచ్చింది. పాయసము దాని ముక్కు నుండి జారింది. వాయు దేవుడు మొదటి నుండి సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఆ పాయసాన్ని అంజన దోసిలిలో పడవేస్డు. శంకరుడు మొదట చెప్పిన దానిని అనుసరించి ఆమె వాయు దేవుడిచ్చిన పాయసాన్ని (చరువును) ఆదరముతో స్వీకరించి గర్భము దాల్చింది.*


ఈ కథకు పూర్వభాగము- * బ్రహ్మలోకంలో అప్సరసలలో సువర్చల అనే ఒక అప్సరస ఉండేది ఆమె ప్రవర్తనకు కోపగించిన పితామహుడు (బ్రహ్మ) మౌన్ష్యలోకంలో ఆడగ్రద్దగా జన్మింపవలసినదిగా ఆమెను శపించాడు. తన్ను కరుణించమని ఆమె ప్రార్థించింది. అపుడు బ్రహ్మ ఇలా పలికాడు. దశరథ మహారాజు చేసే పుత్రకామేష్టి యజ్ఞంలో అగ్నిదేవుడు చరువును తీసుకుని ప్రత్యక్షమవుతాడు, అప్పుడా చరువు మొగ్గురు రాణులకు పంచబడుతుంది. నీవు కైకేయీ భాగమైన చరువును తీసుకుని పారిపోతావు. ఆ చరువును నీవు తినజాలవు, కాని దాని స్పర్శచేతనే నీవా గ్రద్దరూపాన్ని వదలి మఱల అప్సరసరూపాన్ని ధరించి బ్రహ్మలోకానికి రాగలవు.


బ్రహ్మదేవుని వాక్కుననుసరించి జరిగింది. గ్రద్దముక్కు నుండి చరువు జారినంతనే దాని శరీరము కూడా విడివడినది. అది వెనుకటివలె దివ్యమగు అప్సరసగా మారి బ్రహ్మలోకానికి వెళ్ళింది.


(ఆనందరామాయాణము)


Monday 16 August 2021

శ్రీ హనుమద్భాగవతము (12)



యౌవనమంతా గడచిపోయి వార్థక్యము వచ్చినా తనకు ఎలాంటి సంతానము కలుగకుండుటచే రఘుకులశిరోమణి ఐన దశరథమహారాజు చింతామగ్నుడయ్యాడు. ఆయన వశిష్ఠుని ఆదేశాన్ని అనుసరించి ఋష్యశృంగ మహర్షిచే 'పుత్రకామేష్టి' అనే యజ్ఞము చేయించాడు. ఋషి భక్తితో హోమము చేశాడు. ప్రసన్నుడై అగ్ని దేవుడు చరువు (హవిష్యాన్నము, పాయసము) ను తీసుకుని ప్రత్యక్షమై 'రాజా ! నీ కార్యము సిద్ధించినది. నీవీ పాయసమును రాణులకు పంచు' అని పలికి అంతర్ధానమయ్యాడు.


దశరథుడు పాయసములోని సగ భాగాన్ని తన పెద్ద భార్య అయిన కౌసల్యా దేవికి ఇచ్చాడు, మిగిలిన సగాన్ని రెండుభాగాలుగా చేశాడు. వాటిలో ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. మిగిలిన దానిని రెండుభాగాలుగా చేసి కౌసల్యా కైకేయిల చేతులలో ఉంచి వారిని సంతోషపరిచాడు. అనగా వారి అనుమతిను తీసుకుని సుమిత్రకు ఇచ్చాడు.


కైకేయి పాయసమును చేతిలో ఉన్చుకొని ఆలోచించసాగింది. ఇంతలో ఒక గ్రద్ద ఆకాశమునుండి వేగముగా వచ్చి ఆమె చేతిలోని పాయస భాగాన్ని ముక్కున బట్టుకొని ఎగిరిపోయింది.


కైకేయి కలత చెందింది. అపుడు దశరథుని ప్రేరణనను అనుసరించి కౌసల్యా సుమిత్రలు తమ దగ్గర ఉన్న పాయసములోని కొంత భాగాన్ని కైకేయికి ఇచ్చారు. ముగ్గురు రాణులు గర్భములు దాల్చారు. కౌసల్యకు శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణశతృఘ్నులు జన్మించారు.

వానర రాజైన కేసరి తన సహధర్మచారియైన అంజనా దేవితో కలసి సుమేరుపర్వతముపై నివసించుచున్నాడు. అంజన పుత్రప్రాప్తికై ఏడు వేల సంవత్సరములు ఉమానాథుని ఉపాసించింది. శివుడు ప్రసన్నుడై 'వరమడుగా మని అంజనతో పలికాడు.

Sunday 15 August 2021

శ్రీ హనుమద్భాగవతము (11)



భయపడి అంజన తన చీరను సరిజేసికొని తన్ను స్పృశించినవానిని గద్దించుచు 'మర్యాద లేకుండా నా పాతివ్రత్యమును నాశనము చేయదలంచుచున్నవారెవరు?' అని పలికి శాపమీయటానికి ఉద్యుక్తురాలయ్యింది.

పతివ్రత యగు అంజన క్రుద్ధురాలైనదని భావించి వాయు దేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు.

యశస్వినీ! నేను నీపాతివ్రత్యమును భంగము చేయటంలేదు. నేను అవ్యక్తరూపముతో నిన్ను ఆలింగనము చేసుకుని మానసిక సంకల్పముద్వారా నీకు బలపరాక్రమసంపన్నుడు, బుద్ధిమంతుడైన పుత్రుడిని ఇచ్చుచున్నాను. నీ పుత్రుడు మహా ధైర్యవంతుడు. మహాతేజస్వి, మహాబలుడు, మహాపరాక్రమవంతుడు, దుముకుటలోను ఎగురుటలోను నాతో సమానుడు కాగలడు'.

అంజన ప్రసన్నురాలయ్యెను, వాయు దేవుని క్షమించెను. ఆమె గర్భవతియయ్యెను, కేసరియొక్క సంతోషమునకు హద్దు లేకపోయెను* - ఈ కథకు మూలము - వాల్మీకి రామాయణం, కిష్కింధాకాండము 66 వ అధ్యాయము.

 

Saturday 14 August 2021

శ్రీ హనుమద్భాగవతము (10)



సూర్య భగవానుడు మేషరాశిలో నుండెను. ఆనాడు చిత్రానక్షత్రం కలిగిన పూర్ణిమాతిథి. అంజనా దేవి చేయు కఠోరతపస్సునకు సంతసించి వాయు దేవుడు ప్రత్యక్షమై ‘అంజనా దేవీ! నీ తపస్సునకు నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను. అభీష్టమగు వరమడుగు, తప్పక నెరవేరుస్తానూ అని పలికెను.


ప్రత్యక్షుడైన వాయుదేవుని దర్శించి, ప్రసన్నురాలైన అంజన ఆయన చరణాలకు నమస్కరించి 'మహాత్మా! నాకు ఉత్తమపుత్రుడు జన్మించు వరము ఇవ్వమని తన మనోరథాన్ని వెళ్ళడి చేసినది. 


సంతుష్టుడైన వాయు దేవుడు ‘సుముఖీ! నేనే నీకు పుత్రుడనై నీనామమును విశ్వవిఖ్యాతము చేయుదు’నని పలికెను. 


వరమును బొందిన అంజనయొక్క సంతోషమునకు అంతులేదు. తన ప్రియురాలునకు వరము లభించిందన్న వార్తను విని కపిరాడైన కేసరి కూడా ఎంతో ఆనందపరవశుడయ్యాడు - స్కందపురాణం వైష్ణవఖండం 


ఒకనాటి విషయము. పరమలావణ్యవతి, విశాలలోచన అయిన అంజన చక్కగ అలంకరించుకొని ఉంది. ఆమె యొక్క సుందరశరీరము పై పచ్చనివస్త్రము శోభిల్లుతూ ఉంది, చీర యంచు ఎఱుపురంగు. ఆమె వివిధములైన సుగంధపుష్పాభరణాలతో దివ్య సౌందర్యము మూర్తీ భవించినట్లుగా కనిపిస్తూ ఉంది.


అంజన పర్వత శిఖరముపై నిలుచుండి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించుచు ముగ్ధురాలవుతూ ఉండేది. 'నాకొక యోగ్యుడైన పుత్రుడు కలిగిన ఎంత బాగుండునో అనే కోరిక ఆమె మనస్సులో ఆ సమయంలో ఉద్భవించింది.


వెంటనే వాయుతరంగ మొకటి వేగముగ వచ్చినది. అంజనా దేవిచీరకొంగు కొంచం జారెను. ఆమె వక్షోజాలు కనబడసాగినాయి. అపుడు తననెవరో స్పృశించుచున్నట్లు ఆమెకు తోచింది.

Friday 13 August 2021

శ్రీ హనుమద్భాగవతము (8)



బహుకాలము భర్తతో సుఖంగా జీవితాన్ని గడుపుతున్న అంజనకు ఎలాంటి సంతానము గలుగలేదు. ఆ కారణముతో ఆమె ఎంతో కఠోరంగా తపస్సు చేయనారంభించింది. అట్లా తపమాచరిస్తున్న అంజనను చూచి మతంగ మహాముని సమీపించి 'అంజనా దేవీ! నీ వింత కఠోరతపస్సు ఎందుకు చేయుచున్నావు? అని అడిగారు.


అంజన మహామునిచరణాలకు నమస్కరించి వినయముతో ఇట్లా ప్రత్యుత్తరమిచ్చింది - 'మునీశ్వరా ! కేసరి అనే వానర శ్రేష్ఠుడు నా తండ్రి నుండి నన్ను కోరాడు. ఆయన నన్ను కేసరికి సమర్పించాడు. నేను నా భర్తతో గూడి పెక్కు దినములనుండి సుఖముగా జీవితాన్ని గడుపుతున్నాను. కాని నేటివరకు నాకు సంతానము కలుగలేదు. అందువలని నేను కిష్కింధలో అనేక వ్రర్తాలను, ఉపవాసాలను, తపస్సును చేసాను. కాని పుత్రసంతానము కలుగ లేదు. అందుచే దుఃఖితురాలనై మఱల తపస్సు చేయ నారంభించాను. విప్రవరా! దయయుంచి మీరు నాకు యశస్వియైన పుత్రుడు లభించే ఉపాయము చెప్పండి”.


తపోధనుడైన మతంగమహాముని అంజనతో ఇట్లా పలికాడు. నీవు వృషభాచలము (వేంకటాచలము)నకు వెళ్ళి భగవానుడైన వేంకటేశ్వరుని చరణములకు నమస్కరించు. ఆయన భుక్తి ముక్తి దాయకుడు. పిమ్మట అచటినుండి కొలది దూరమున నున్న ఆకాశగంగ అనే తీర్థానికి వెళ్ళి స్నానము చేయ్యి, దానిలోని నీటిని త్రాగి వాయు దేవుని ప్రసన్నునిగా చేసుకో. దానివలన దేవతలకు, రాక్షసులకు, మనుష్యులకు అజేయుడు, అస్త్రశస్త్రములకు లొగని పుత్రుడు నీకు జన్మించగలడు'.


అంజనా దేవి మహాముని చరణాలకు నమస్కరించి వృషభాచలానికి చేరింది. వేంకటేశ్వరుని పాదపద్మములకు భక్తితో నమస్కరించినది. పిమ్మట ఆమె 'అకాశగంగ’ అనే తీర్థంలో స్నానమాచరించి, పరమపావనమైన దాని జలాన్ని త్రాగినది. దాని ఒడ్డున కూర్చుని తీర్థము వైపు తిరిగి వాయు దేవుని ప్రసన్నతకై ఎంతో సంయమముతో తపస్సు చేయనారంభించింది. శారీరకకష్టములను గూడ లెక్క చేయక శ్రద్ధా విశ్వాసములతోనూ, ధైర్యముతోనూ అఖండమైన తపస్సు చేయసాగింది.

Thursday 12 August 2021

శ్రీ హనుమద్భాగవతము (7)



యోగీశ్వరుడైన శంకరుడు తన వెంట రావడం చూచి మోహిని చిఱునవ్వు నవ్వి తీగలమాటున తన శరీరాన్ని దాచుకొనటానికి పరిగెత్తింది. భూతభావనుడు మోహిని వెంట పరుగెత్తుచున్నాడు. ఆమె ముందు పరుగెత్తుతున్నది. నీలకంఠుడు తనస్థితినే మఱచాడు. ఆయన పరుగెత్తి మోహిని చేతిని స్పృశించాడు.


ప్రజ్వలిస్తున్న అగ్నియందు అజ్యాహుతి (ఆవునెయ్యి) పడింది, కాని మోహిని తన చేతిని విడిపించుకొని పారిపోయింది. ఆమె స్పర్శచే ఉత్తేజితుడైన కామారియైన ఈశ్వరుడు పూర్తిగా స్పృహలేనివాడయ్యాడు. వనములు, పర్వతములు, ఋష్యాశ్రమములు; దేవలోకములు మొదలైన ప్రదేశములగుండా శంకరుడు మోహిని వెంట పరుగెత్తసాగాడు. పార్వతీ దేవి, శివగణములు, సురగణములు, ఋషులు మున్నగు వారందఱు ఆశ్చర్యచకితులై ఈ దృశ్యమును చూస్తూ ఉన్నారు, కాని మౌనముగా ఉండిపోయారు. అసఫలమైన కామము క్రోధంగా రూపాంతరం చెందుతుంది. మఱల ప్రళయంకరుడైన శంకరుని కోపానికి ఆహుతి ఎవరు కానున్నారోకదా! అందఱు స్తబ్ధులై ఉండిపోయారు.


చివరకు యోగిరాజైన శివుని రేతస్సు స్థలితమయింది. పిమ్మట తన స్థితి ఎట్టిదో గ్రహించాడు. విశ్వనాథుడు వెంటనే రెండు చేతులను జోడించి, తలవంచి 'ప్రభూ! నీ లీల అగమ్యము. నీ మాయను అధిగమించుట అసంభవం' అని పలికాడు.


తన పరమ ప్రభువు యొక్క లీల అగమ్యము అనిర్వచనీయమని తెలిసికొని శంకరభగవానుడు ఆయనను స్తుతించసాగాడు. ఇంతలో వనమాలాధారి, చతుర్భుజుడైన విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఉమావల్లభుడైన శివుని నిష్ఠను విశ్వాసాన్ని ప్రశంసించి అంతర్థానమయ్యాడు. పరమపిత, కర్పూరగౌరుడైన శంకరుడు కూడా పార్వతీ దేవితో భగవానునిగుణములను గానము చేస్తూ కైలాసానికి వెల్లాడు.


శంకరుని అమోఘవీర్యము వ్యర్థం ఎట్లా అవుతుంది? ఆ వీర్యమును రామకార్యసిద్ధికై ప్రయోగించాలనే దృష్టితో శంకరుడు సప్తర్షులను ప్రేరేపించాడు. వారా వీర్యమును ఆకు దొప్పలో ఉంచారు. సమయాన్ని అనుసరించి దానిని కేసరి భార్యయైన అంజన యొక్క చెవి గుండా ఆమె గర్భములోనికి ప్రవేశపెత్తారు. తత్ఫలముగా హనుమానుడు ప్రకటుడయ్యాడు. *(శివపురాణం రుద్రసంహిత 20 వ అధ్యాయం)


Wednesday 11 August 2021

శ్రీ హనుమద్భాగవతము (6)



దేవాధిదేవుడవగు మహాదేవా! నీవు యోగులకు ఉపాసింపదగిన వాడవు, మన్మధుని దగ్ధము చేసినవాడవు. అట్టి  నీవు స్త్రీ అవతారమును చూడనేల? నీ దృష్టిలో అది విశిష్టమైనది కాదని విష్ణువు నవ్వుతూ బదులు చెప్పెను.


‘దేవా! ఆ అవతారస్వరూపాన్ని దర్శింపకుండ ఉండలేను, దయ యుంచి నా కా మోహీనీరూపాన్ని చూపించామని పార్వతీపతి పలికెను. 


'అట్లే యగుగాక!' యని మహావిష్ణువు క్లుప్తంగా సమాధానమిచ్చి అంతర్థానమయ్యెను. ఆ సమయమున అల్లడ క్షీరసముద్రం లేదు, నీలమేఘశరీరము, శంఖచక్రగదాపద్మధారియైన లక్ష్మీపతి గూడ లేడు. ఆ ప్రదేశమున మనోహరమైన పర్వతములు, సుందరమైన వనము ఉండింది. పార్వతీ సహితుడై శంకరుడు ఆ వన మధ్యమున నుండెను. 


ఆడవి అంతట వసంతశోభ వ్యాపించియుంది. వృక్షములు కొత్త చిగుళ్ళతో చూడ ముచ్చటగొలుపుతున్నాయి. అంతట పుష్పములు విరబూసి ఉన్నాయి. సువాసనలను వెదజల్లు ఆ పూవుల పై తుమ్మెదలు మూగుతున్నాయి. కోకిలలు 'కుహూ కుహూ' అని శబ్దం చేస్తున్నయి. చల్లని పిల్ల గాలికి కోమలములగు లతలు, పుష్పములు మెల్ల మెల్లగ అటు ఇటు ఊగుతున్నాయి. అంతటా ఋతు రాజుయొక్క సామ్రాజ్యము వ్యాప్తమైనట్లు ఉంది, ఒకవిధమైన మాదకత్వము సర్వ ప్ర్రాణులలోను కనబడసాగినది.


యోగులకు ఉపాస్యుడగు త్రినేత్రుడు కొలదిదూరములో లతలమాటున నుండి బంతియాడుచున్న ఒక రూపవతి యైన స్త్రీని చూసాడు.


కామారి ధైర్యవిహీనుడు కాజొచ్చాడు, తన్నుతాను మఱచాడు. నిర్ని మేషదృష్టితో బంతియాడుచున్న ఆమోహినిని వీక్షిస్తూ ఉండిపోయాడు.


వెంటనే ఒక వాయుతరంగము వచ్చినది, ఆ గాలికి అసామాన్య సౌందర్యశాలిని యైన మోహినివస్త్రము జారినది, ఆమె వివస్త్ర అయింది. సిగ్గుచే కుంచించుకొని మోహిని లతల మాటున దాక్కొనుటకు ప్రయత్నిస్తోంది. భస్మము పూసుకోనే కామారి యొక్క మిగిలిన ధైర్యముగూడ తొలగినది. ఆయన మహామహిమామయి యైన పార్వతీ దేవి యెదుటనే లజ్జను విడచి యున్మత్తునివలె మోహిని వెంట పరిగెత్తాడు.

Tuesday 10 August 2021

శ్రీ హనుమద్భాగవతము (5)



హనుమంతుని పుట్టుకకు సంబంధించిన విభిన్నమైన కారణములు


హనుమానుని పుట్టుకకు సంబంధించిన గాథలు శాస్త్రములలో ననేక విధములుగా ఉన్నవి. వివరింపబడుచున్నవి. అవి సంక్షేపముగ క్రింద


కరుణామయమూర్తియు, ప్రేమమూర్తియైన భగవానుని లీల మధురము, మనోహరము, అద్భుతము. దానిని వినుట చేతి స్మరించుట చేత మునులు ముగ్ధులవుతూ ఉంటారు. భక్తులకు అది పరమనిధి, కాని ఆ లీల రహస్యమయముగా ఉండును. పరమ క్షేమంకరమైన ఆ భగవల్లీలా రహస్యమును దేవతలుగాని, యోగీంద్రులగు మునులుగాని ఎఱుంగజాలరు. అట్టివారే ఆశ్చర్యచకితులై మౌనముగా నున్న కామాదిదోషగ్రస్తులమగు మనవంటి సాంసారిక మనుష్యులుకేమి తెలుస్తుంది? కరుణామయుడుగు ఆ పరమాత్ముని లీలలను గానము చేసిన మనకు సర్వశుభములు గలుగుననుటలో ఎట్టి సందేహము లేదు.


దేవదానవులకు అమృతమును పన్చుటకు విష్ణుభగవానుడు మోహినీరూపమును ధరించెను. ఇది విని కర్పూర గౌరుడగు నీలకంఠుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. భగవానుని స్త్రీ వేష మెట్లుండెననగా, ఆప్తకాముడగు శంకరభగవానునకు తన ప్రాణారాధ్యుడగు విష్ణు దేవుని విశిష్ట రూపాన్ని, విశిష్టలీలను దర్శించాలనే కోరిక పుట్టింది.


గంగాధరుడు పార్వతీ దేవితో పాటు పాలసముద్రాన్న్ని చేరి స్తుతించగా లక్ష్మీపతి ప్రత్యక్షమయ్యారు. దేవాధిదేవుడైన మహా దేవుడిట్లా విన్నవించుకొన్నాడు. 'ప్రభూ! నేను నీ మత్స్యాది అవతారస్వరూపముల నన్నింటిని దర్శించాను, కాని అమృతమును పన్చునపుడు నీవు పరమలావణ్యమయమైన స్త్రీ వేషాన్ని ధరించావు. ఆ అవతారస్వరూపాన్ని నేను దర్శింపలేకపోయాను. దేవదానవులమోహానికి కారణమైన ఆ నీ రూపాన్ని దయ యుంచి నాకొక్క మాఱు చూపించు.”

Monday 9 August 2021

శ్రీ హనుమద్భాగవతము (4)



అంజనా దేవి


స్వర్గాధిపతీ, శచీదేవి పతియైన ఇంద్రుని దగ్గరనున్న రూపగుణ సంపన్నలైన అప్సరసలలో పుంజికస్థల అనే ఆమె మిక్కిలి ప్రసిద్ధి చెందిన అప్సరస. ఆమె అమిత సౌందర్యవతి, చంచలస్వభావము గలది. ఒకసారి ఆమె తపస్సంపన్నుడైన ఒక ఋషిని చూసి పరిహసించింది.


ఋషి ఓర్వలేకపోయాడు. కోపంతో ఆయన 'వానర స్త్రీవలె చిలిపి చేష్టలు చేయు నీవు వానరస్త్రీని అగుదువు గాక ' అని శపించాడు.


ఋషి శాపాన్ని వినినంతనె పుంజికస్థల కంపించింది. వెంటనే ఆమె ఋషి చరణములపై బడి, చేతులజోడించి దయ జూపవలసినదిగా ప్రార్థింపసాగినది.


సహజంగానే దయాస్వభావుడైన ఆ ఋషి దయార్ద్రతుడై ఇలా పలికెను. 'నా వాక్కు అసత్యము కాజాలదు, నీవు వానరస్త్రీవి కాకతప్పదు, కాని నీవు ఇష్టానుసారముగా రూపాన్ని ధరించగలవు. ఇష్టము వచ్చినపుడు వానర స్త్రీవి, మానవ స్త్రీవి కాగలవు.


ఈ పరమరూపవతియైన ఆ పుంజికస్థల ఋషి శాపముచే వానర రాజు, బుద్ధిమంతుడైన కుంజరునకు పుత్రికగా జన్మించినది. ఆమె సాటిలేని సౌందర్యము కలది. ఆమె అన్దముతో సాటివచ్చు స్త్రీ ఈ భూమిలో ఎవ్వరును లేరు. మూడులోకములలో ప్రసిద్ధి చెందిన ఆ కుంజరునిపుత్రిక పేరు 'అంజన'.


లావణ్యవతి యైన అంజనకు వీరవరుడు, వానర రాజు నగు ‘కేసరి' అనే వానితో వివాహము జరిగినది. కేసరినివాసము కాంచనగిరి (సుమేరుపర్వతము). సర్వసౌకర్యములకు నిలయమైన ఈ పర్వతముపై అంజన తన భర్తతో సర్వసౌఖ్యములను అనుభవించుచుండెను. వీరుడగు కేసరి రూపవతియైన తన భార్య అంజనను ఎక్కువగా ప్రేమించుచుండెను. అంజన కూడ ఎల్లప్పుడు ప్రాణారాధ్యుడగు తన భర్త యందు అమితమైన అనురాగమును చూపుతుండేది. ఇట్లా సుఖముగా ఎన్నో దినములు గడచినవి; కాని వారి కెట్టి సంతానం కలుగలేదు. 

Sunday 8 August 2021

శ్రీ హనుమద్భాగవతము (3)



అంజన పూర్వజన్మవృత్తాంతము


దేవలోకములో పుంజికస్థల అనే అప్సరస ఉన్నది. ఆమె సర్వగుణసంపన్నురాలు. పరమశివుని అవతారమైన దుర్వాసమహర్షి అమరావతికి వెళ్ళగా దేవేంద్రుడు పుంజికస్థలను ఆ మహాపురుషుని సపర్యలకు నియమించెను. ఆమె భక్తి భావముతో మహర్షి నారాధించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలయ్యెను, వరం అడగమని మహర్షి పలికారు. అందులకు పుంజికస్థల దేవతలకు సైతం అగమ్యమైన పరమపదాన్ని అర్థించింది. అపుడు దుర్వాసమహర్షి శ్రీహరి హర మహామంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయవలసినదిగా ఆమెను ఆదేశించారు.


మందాకినీనదీతీరములో మంత్రోపాసన చేయసాగింది. శ్రీహరిహర ఆమె యొనరించిన తపము నకు శ్రీ ఆదిపరాశక్తి, శ్రీమన్నారాయణుడు, శ్రీసదా శివుడు ప్రసన్నులై సాక్షాత్కరించారు. పుంజికస్థల పరమానంద భరితురాలై జరా వ్యాధిరహితము (జర = ముసలితనము, వ్యాధి = రోగము), పరమానంద నిలయమునైన పరమపదాన్ని అర్థించింది. అపుడు శ్రీహరిహరులిట్లు పల్కిరి. “దేవాంగనా ! నీకు పుణ్య శేషము ఉంది, నీ వా పుణ్యమును అనుభవించుటకు మరల వానరాంగనగా జన్మించాలి, తదనంతరము నీకు జన్మరాహిత్యము సిద్ధింస్తుంది, కావున వేరొక వరము అర్థించు”. పుంజికస్థల సంతానాభిలాష కలదియై ఇట్లు పలికెను “భక్త జనమందారులారా! నాకు మీ వంటిపుత్రుని ప్రసాదించం" డని కోరింది. ఆందులకు వారు “అప్సరసా! మావంటి వారు మరియొకరులేరు. కావును మేమే ఏకరూపులమై నీకు కుమారునిగా అవతరిస్తాము. వానరాధీశ్వరుడగు కుంజరుడు పరమభక్తాగ్రేసరుడు. నీవు వానికి పుత్రికగా జన్మింపు”మని ఆ దేశించి అంతర్హితులైరి.


బుద్ధిమంతుడు, పరమభాగవతోత్తముడు వానర రాజు నగు కుంజరునకు పుత్రికగా పుంజికస్థల జన్మించెను. ఆమె సాటిలేని సౌందర్యము కలది. ఆమె అందముతో సాటివచ్చు స్త్రీయెవ్వరును లేరు. మూడులోకములలో సౌందర్యగుణాలలో ప్రసిద్ధి చెందిన ఆ కుంజరునిపుత్రిక పేరు అంజన. అంజన గురించి మరియొక చరిత్ర కలదు. కల్ప భేదముననుసరించి ఈ ప్రసంగములన్నీ సత్యములే యని గ్రహించాలి.

Saturday 7 August 2021

శ్రీ హనుమద్భాగవతము (2)



కేసరి పూర్వజన్మవృత్తాంతము


యక్షలోకములో మహాయక్షుడను చక్రవర్తి కలడు. అతడు పరమశివభక్తుడు, కుబేరునకు చెలికాడు. సకలసంపదలున్నను అతనికి సంతానము లేదు. కుబేరుని ఆదేశానుసారముగ మహాయక్షుడు పరమశివుని గురించి చిరకాలము తపమాచరించెను. భక్తుని అనన్యతపస్స్సునకు ప్రసన్నుడై ఆశుతోషుడైన శంకరుడు సతీ దేవిసహితముగ సాక్షాత్కరించెను. 


పరమకళ్యాణమూర్తులైన ఆ ఆదిదంపతులను చూసి మహాయక్షుడు పరమానందభరితుడై అనేక విధముల స్తుతించెను. అభీష్టవరము నర్థింపుమని పరమశివుడు పలుకగా యక్షేశ్వరుడు పరమసౌందర్యరూపులగు సతీశంకరులను గాంచి మీరు నాకు పుత్రసంతానముగా కలుగవలెనని అర్థించెను. అందులకు సతీ శివులు సమ్మతించి ఇరువురు ఏకరూపులై అవతరిచెదమని వరం ఇచ్చేను. కింపురుష వర్షములో మహావానరుడైన కేసరిగా జన్మింపుమని మహాయక్షుని ఆదేశించి వారు అంతర్హితులైరి. ఆ మహాయక్షడే వానరేశ్వరుడైన కేసరిగా జన్మించెను. వానరులు కింపురుషలోకవాసులు. వారు ఆనంద బ్రహ్మోపాసకులు, కేనోపనిషత్తులో సచ్చిదానంద బ్రహ్మమును ‘వన’ అను నామముతో ఉపాసించువర్ణనము కలదు.  


'వనే భవం వానమ్, వానం రాతి ఇతి వానరః | 


సచ్చిదానంద బ్రహ్మంలోగల ఆనందాన్ని 'వాన'మని కీర్తిస్తారు. ఆ ఆనందరసాన్ని ఆస్వాదన చేసేవారిని వానరులు అందురు.

Friday 6 August 2021

శ్రీ హనుమద్భాగవతము (1)



రచయిత - పౌరాణిక రత్న, మహాపురాణాంధ్రీకరణచణ - 

శ్రీ మట్టుపల్లి శివ సుబ్బరాయ గుప్త 


శ్రీ రామాయ నమః


శ్రీహనుమద్భాగవతము


మంగళాచరణము


యన్మాయావశవర్తి విశ్వమఖలం 

బ్రహ్మాది దేవాసురా

యత్సత్త్వాదమృపైవ భాతి సకలం 

రజ్జీ యథా హేర్క్రమః । 

యత్పాదప్లవ మేక మేవ హి భవా 

మ్భోధే స్తితీర్షావతాం

వన్దేహం తమ శేష కారణపరం | 

రామాఖ్యమీశం హరిమ్ ॥


ఎవరిమాయకు సమస్తవిశ్వము బ్రహ్మాది దేవతలు అసురులు వశమై ఉన్నారో, ఎవరియునికిచే రజ్జువునందు సర్పభ్రమ (త్రాడును చూసి పాముగా భ్రమించడం) వలె ఈ దృశ్యమానజగత్తు అంతయు సత్యముగా తోచుచున్నదో, ఎవరి చరణములె భవసాగరమును తరింపగోరువారికి ఏకైక మగు నావయై యున్నవో, ఆ కారణము లన్నింటికంటె పరమైన అనగా సర్వకారణములకు కారణమైన వాడు, అందఱి కంటె శ్రేష్ఠుడైనవాడు, రాముడని చెప్పబడువాడు నగు శ్రీహరిభగవానునకు నేను నమస్కరించుచున్నాను.


శ్రీమత్ప్రసన్న శశిపన్నగభూషణాయ 

శైలేన్ద్రజావదన చుబ్బతలోచనాయ । 

కైలాసమన్దరమహేన్ద్ర నికేతనాయ 

లోకత్రయార్తి హరణాయ నమః శివాయ |


శోభాయమానము నిర్మలము నగు చంద్రకళ సర్పము ఆభరణములుగా గలవాడు, గిరిరాజకుమారి యగు పార్వతిచే కైలాసగిరియందు చుంబింపబడిన (ముద్దిడుకొనబడిన) నేత్రములు గలవాడు, మహేంద్రగిరియందు నివసించువాడు, లోకత్రయముయొక్క దుఃఖమును పోగొట్టువాడు నగు శంకరు నకు నమస్కరించుకున్నాను.


సీతారామపదామ్బజే మధుపవద్

యన్మానసం లీయతే|

సీతారామగుణావలీ నిశి దివా 

‘యజ్జిహ్వయా పీయతే |

సీతారామవిచిత్రరూపమనిశం 

యచ్చక్షుపోర్భూషణం

సీతారామసునామధామ నిరతం| 

తం మారుతిం సమ్భజే || 


శ్రీ సీతారాముల పాదపద్మములయందు తుమ్మెదవలే మనస్సుగలవాడు, సీతారాముల గుణావళిని రేయింబవళ్ళు తన జిహ్వచే పానము చేయుచున్న వాడు, సీతా రాముల విచిత్రకూపమును ఎల్లప్పుడు తన నేత్రములకు ఆభూషణముగా జేసికొనిన వాడు, సీతారాముల సునామమునకు నిలయమైనవాడు నగు ఆ మారుతిని నిరంతరము చక్కగ భజించుచున్నాను. 

Thursday 5 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (72)



నీటిని యీదునపుడు- నీటిని వెనుకకు తోస్తూ ముందుకు పోతాం. అలానే స్వార్థాహంకార, మమకారాలను నెట్టివేస్తూ త్యాగ బుద్ధితో ముందుకు సాగి పరమపద సోపానాన్ని అందుకోవాలి. అదే పురుషార్థం. అది సాధించాలంటే పావని పరమ చరితం అవశ్య పఠనీయం. ఆచరణకు అనువైనది.


స్వామి వివేకానందుడు- నేటి సమాజానికి హనుమన్మూర్తిని ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని

ఇలా అంటారు. “భగవద్భక్తి వల్ల పుట్టే త్యాగమే లక్ష్యంగా పెట్టుకుని సింహబల సాహసాలతో, దూషణల వంటి వికారాలకు అతీతులై, కర్మ ఫలాకాంక్షను వదలి కార్యరంగంలో దుమకాలి. ఇదే భారత జాతీయ ధర్మం. దీనికి ఉదాహరణ ఆంజనేయస్వామి. ఆ హనుమన్మహావీరుడే మనకి ఆదర్శ పురుషుడు.


జితేంద్రియ చక్రవర్తి, అద్వితీయ ధీశాలీ, రామనామం పై ఉన్న ఆఖండ భక్తితో ప్రాణభీతిని విడనాడి ఒక్క దుముకులో సాగరాన్నెలా లంఘించాడో చూడండి. ఆయన ఎంతటి భగవత్సేవకుడో! ఎంతటి ఆదర్శమూర్తో!! 


తన అఖండ బాహుబలంతో, అద్వితీయ పరాక్రమంతో రావణుని రాక్షస సైన్యాలను హాహాకార మెత్తించగలిగిన మహా వీరుడతడు. మరోవైపున రామపద పంకజార్చన చేసే భక్తులలో అద్వితీయుడు కూడా ఆతడే. అటువంటి నిశ్చలమైన భక్తియే దేశానికప్పుడు అత్యవసరం !!!


కాన ఓ చదువరులారా! ఆంజనేయుని మనసారా స్మరించుచూ- ఆ పావని చూపిన బాటలో పయనించుచు సంపూర్ణ ఆయురారోగ్య భోగ భాగ్యాలతో- మీ జీవితాలను వసంతయామిని వోలె గడుపుకోవాలనీ, మిమ్ములను సదా వెన్నంటి మారుతాత్మజుడు కాపాడుగాకయని కోరుతూ


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్.


స్వస్తి.  

---- రాయప్రోలు రథాంగపాణి


Wednesday 4 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (71)



త్యాగే నైకే అమృతత్వ మానశుః


ఆంజనేయుడు నవ వ్యాకరణవేత్త. శబ్ద బ్రహ్మ, రామనామ రసాస్వాదన తత్పరుడు. రామ చరిత్రను సమయము దొరికినపుడెల్లా తాను నడయాడు పర్వత శిలాఫలకాలపై రచించుచుండెడి వాడు. రామాయణం పూర్తిగా పర్వత శిలలపై రూపు దిద్దుకున్నది. వారి రచనలో శబ్దార్థాలు సరసంగా, సుమధురంగా ఆపాత మధుర ఆలోచనామృతాలుగా సాగినై, పాఠకుల మనోఫలకాలపై సీతా రాముల గాథ చెరిగిపోని- మాసిపోనిరీతిగా ముద్రింపబడేటట్లు రచన సాగింది.

మారుతాత్మజుడు రామాయణ రచన పూర్తి చేశాడన్న వార్త కర్ణపరంపరగా వాల్మీకి మహామునికి తెలిసింది. అప్పటికే మహర్షి శ్రీమద్రామాయణాన్ని ఆదికావ్యంగా మలచాడు, సామీరిని చేరి ఒకసారి తాను రాసిన రామాయణాన్ని చూపవలసినదిగా కోరాడు. వీతరాగుడైన మారుతి రాళ్ళపై తాను రాసిన రామకథను చూపుతాడు. ఆ శబ్దాల హెుయలు, ఆ భావ సంపద, రచనా రమణీయకత ఆదికవిని ఆశ్చర్యంలో ముంచెత్తినవి.


అంజనా నందనా! నీ రచన అనితరసాధ్యం. నీ రామగాథ ముందు నా రామాయణం సూర్యుని ముందు దివిటీ. కీర్తికాంక్షనై నేను చేసిన నా రచన వృథాయగునేమో! అని ఏమేమో పల్కు వల్మీకభవునితో పావని— "మహర్షీ! మీరు చింతించవలసినది లేదు. ఈ నదీనదాలు పర్వతాలవలె యీ జగాన మీ రామాయణమే శాశ్వతంగా నిలుస్తుంది” అంటూ తాను వ్రాసిన ఆ కొండరాళ్ళను వాల్మీకి చూచు చుండగనే సముద్ర జలాలలోకి దొర్లిస్తాడు. ఇక నా రామకథ ఎవరికంటా పడదు. నీ రామాయణమే అందరి నాల్కలపై నిలుస్తుంది అని చెప్పగా ----


వాల్మీకి నిరుత్తరుడై  "వాయుకుమారా! నిర్మలకీర్తి ఆచంద్రతారార్కం నిలచి ఉంటుంది. నీ త్యాగబుద్ధి నిరుపమానం" అని ప్రశంసిస్తాడు. ]


'త్యాగే నైకే అమృతత్వ మానశుః' త్యాగంతోనే అమృతత్వం సిద్ధిస్తుంది. త్యాగ నిరతితో స్వామి చేసిన యీ కార్యం ఎంతటి ఉదాత్త ఉదాహరణో! కీర్తికాంక్షలు తన లక్ష్యాన్ని దూరం చేస్తాయి. త్యాగ బుద్ధి గమ్యస్థానం చేరుస్తుంది.

Tuesday 3 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (70)



ఆంజనేయుని అదృష్టం


రామప్రభు రాగను మొదటగా భరత, శతృఘ్నులకు వినిపించినదియు మారుతియే. యీవిధంగా రఘువంశానికి ఆనంద హేతువైన వార్తల నందించి ఆ వంశాన్ని కాపాడినవాడు మారుతాత్మజుడు. రామ పట్టాభిషేక సమయంలో 'గుర్తింపు పొందిన వారికి - సన్మాన సత్కారాలు, నేత్రోత్సవంగా జరిగాయి. సన్మానితులు సంతోష తరంగాల తేలియాడారు. అందరికీ అన్ని సత్కారాలు జరిగాయి. రామాయణ మహామాలా రత్నమైన హనుమంతునికి దప్ప. ఇది సభలో గుసగుసలకు తావిచ్చింది. కారణం కనుక్కో లేకపోయారు తన సర్వస్వం ప్రభుసేవకే అంకితం చేసిన మారుతి ఎవరి గుర్తింపూ పొందలేకపోయాడే! ఇదేమిటి చెప్మా!!! అందరి హృదయాల ప్రశ్నార్థకం.


ఇంతలో రాముడు జనకరాజ నందినికి ఒక అమూల్య ముత్యాల హారం ఇచ్చి “జానకీ! ఈ హారాన్ని నీ అభిమాన పాత్రుడైన సేవకునకు అర్పించ' మన్నాడు సభలో ఇంత వేడుక జరుగుతున్నా మారుతి జితేంద్రియుడై శ్రీ రామచంద్రుని దివ్య పాదార విందాలనే చూస్తూ తదేకంగా ఉన్నాడు. ఈ గౌరవ పురస్సరాలతో తనకు పనిలేదు. ఇవన్నీ తన స్వామి పదసేవ ముందు దిగదుడుపే, హారాన్ని చేతపట్టి సీతామాత చిరునగవుతో వాతాత్మజుని గళసీమ నలంకరించింది. కృతజ్ఞతాంజలి బద్ధుడై మారుతి సీతారాములకు నమస్కరించినాడు.


"స్వయముగా సీతామాత తన కర కమలములతో శిరమున వైచినదీ ముత్యాల హారం. మారుతి ఎంత అదృష్టవంతుడో కదా!" అని సదస్యులు మిన్నుముట్టే కరతాళ ధ్వనులతో సంతోషాన్ని ప్రకటించారు. ప్రత్యేకంగా మారుతి నింతగా సమ్మానించినా సుంతయినా అతిశయించలేదు.


మారుతి కార్యసాధకు డెటులుండవలెనో ఆచరించి చూపాడు. కార్యసాధకునకు అచంచల ఆత్మ విశ్వాసం, పట్టుదల, నిరంతర కఠోర పరిశ్రమ, సంయమనము, ఏకాగ్రత, త్రికరణశుద్ధి, స్వార్థ రాహిత్యము మొదలగు సద్గుణాల సలవరచుకోవాలి. మిన్ను విరిగి మీదపడినా ధైర్యం కోలుపోరాదు. ఉత్సాహం వీడరాదు. ఆవేశం ఆసలే పనికిరాదు. రోషం వదలాలి. లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించాలి. ఇవన్నీ ఆచరణలో చూపిననాడు అత్యద్భుత విజయాలు సాధించవచ్చు. ఇట్టి కార్యసాధకుడు ఎవరెస్టు శిఖరాన్ని అందుకోగలడు. ఇహ పరాలలో సన్మానితుడు కాగలడు. తనంత తానుగా అష్టలక్ష్మి - అష్ట ఐశ్వర్యాలనిచ్చును. పై సద్గుణ సంపత్తి నలవరచుకోనివాడు అవమానాలపాలై నలుగురిలో చిన్న బోవును.


Monday 2 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (69)



ఆంజనేయుడు జాంబవంతుని దేహాన్ని కరముతో నిమిరాడు. ఆ కరస్పర్శ జాంబవంతుని అస్త్రబాధ తొలగించింది సంతోషంతో -


"హరి శార్దూలా! ఆ గచ్చ. ఈ తరుణంలో వానరులను నీవే కాపాడాలి. హిమగిరి కావలగల కైలాసగిరిలో సంధాసకరణి, సువర్ణకరణి, సంజీవని ఆదిగా గల ఓషధులున్నవి. తక్షణం పతిత జనావనులను కాపాడ వానిని తీసుకురమ్ము" అనగా


మరుక్షణం గగనాని కెగరిన హనుమ అద్భుతంగా క్షణాలలో చక్రాయుధుడైన చక్రపాణిలా వజ్రాయుధధారి శచీనాధునిలా గిరినే ధరించి నేలకు దిగాడు. ఆ ఓషధుల గాలి తగలగనే — స్పృహలోనికి వచ్చారు వానర వీరులు, మారుతి ఆ గిరిని పని పూర్తికాగనే యధాస్థానంలో ఉంచి వచ్చాడు.


ఇలాగే మరోసారి లక్ష్మణస్వామి మూర్ఛితుడు కాగా కైలాస గిరిని తెచ్చి లక్ష్మణుని పునరుజ్జీవితుని చేశాడు. స్వామివారి నామాలలో "లక్ష్మణ ప్రాణదాతా చ" అని ఉన్నది. ఈరీతిగా సమరాంగణంలో వానరసేనను కంటికి రెప్పలా కాపాడిన అతులిత బలధాముడు. 


యుద్ధరంగాన ఎందరో రాక్షస వీరులను మట్టి కరపించిన ఆంజనేయుడు మహాకాలునివలె విజృంభించినాడు. "ఆహా! ఏమీ వీని శౌర్యము. నేటికిగదా నాకు సరిజోడు లభించినది" ఆ మెచ్చుకుని ఎదిరించిన రావణుడే - యీ మహాబల పరాక్రమవంతుని ముందు నిలబడలేక మర్యాదగా తప్పుకున్నాడు. ఇక అనిలాత్మజుడును రాముని చేతిలోనే 'రావణుని మరణ' మన్న విధిని తలచి వదలివైచినాడు.


సమర రంగాన అసువులు వీడాడు రావణుడు. యుద్ధము ఆగినది. ఈ వార్తను ముందుగా జనకసుతకు వినిపించి ఆనందాన్ని చేకూర్చిందీ మారుతియే. ఆమె “ఆంజనేయా! నేడు మంగళ వారము, ఈరోజు రావణుని మరణవార్త వినిపించి నాకు సంతోషాన్ని కలిగించావు కాబట్టి నేటినుండి యీ వారాన్ని జయవారం అంటారు. ఎవరైతే యీ రోజు గంగ సింధూరం అద్ది నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో- వారికి కార్యసిద్ధి కాగలదు" అని ఆశీర్వదించింది, మంగళవారం ఆంజనేయునికి ప్రియమైన రోజు. 


Sunday 1 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (68)



సద్వర్తనము వదలక యుండిన మనుజుడు పూజ్యుడు జన సమాజమునన్


సేతువు నిర్మించి, సముద్రం దాటి ఆవలితీరం చేరి యుద్ధ సన్నద్ధులై చివరిసారిగా రావణునికి హితవు చెప్పటకై రాముడు అంగదుని రాయబారిగా పంపినాడు. అంగద రాయబారం విఫలమైంది. వానరసేన రాక్షసులను ఢీకొంది. పోరు భీకర రూపం దాల్చింది. ధూమ్రాక్ష, వజ్రదంష్ట్ర, అకంపన, ప్రహస్తాది రాక్షస వీరులు రాము నెదిరించి అసువులు బాసారు. కుంభకర్ణుడు కుంభినీ ధవుని చేరాడు. ఇంద్రజిత్తు మాయా యుద్ధం ప్రారంభించాడు. బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంతాది వానర, భల్లూక వీరులు మూర్ఛతులయ్యారు. వానర సైన్యంలో ఇరువురుని మాత్రమే బ్రహ్మాస్త్రం కట్టడి చేయలేక పోయింది. ఆ ఇరువురూ విభీషణ, ఆంజనేయులు. వారు ఆహవరంగం అంతా కలయతిరుగుతూ- "యీ పరిస్థితినుండి తమ వారి నెలాగ తప్పించాలి" అని ఆలోచిస్తున్నారు. ఇంతలో జాంబవంతుని సమీపించారు. విభీషణుడు జాంబవంతుని "తాతా! ఎలా ఉన్నావు" అన్నాడు.


"విభీషణా! నా శరీరం బాణాహతికి దెబ్బతిన్నది. చూపు మందగించింది. చూడలేకున్నాను. నీ స్వరాన్నిబట్టి గుర్తించాను. ఆంజనేయునికి క్షేమమా?" అన్నాడు.


భల్లూకరాజు మాటలు విభీషణుని ఆనందాశ్చర్యాలకు లోను చేసినయ్. 


రామ లక్ష్మణులనో- సుగ్రీవునో- అంగదునో అడుగక ఆన్జనేయుని క్షేమం విచారిస్తున్నావేమి రాజా! అనగా—


అస్మిన్ జీవతి వీరోతు హతమమవ్యహతం బలం

హనూమత్యుజ్ఘిత ప్రాణే జీవనోపి మృతావయం.

ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది

వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్.


విభీషణా! ఆంజనేయుడు జీవించియున్న- వానర వీరులందరూ మరణించిననూ జీవించియున్నట్లే. పావని పరమపదించిన అందరం జీవించి ఉన్నా జీవచ్ఛవాలమే. వాయువేగము గలవాడూ, పరాక్రమంలో ఆగ్నిసముడూ అంజనా నందనుడు.

అదే సమయానికి అచటికి చేరుకున్న పావని—— 

తతో వృద్ధ ముపాగమ్య నియమే నాభ్యవాదయేత్ 

గృహ్య జాంబవతః పాదౌ హనుమాన్ మారుతాత్మజః.


తనపై ప్రగాఢ విశ్వాసముంచిన జాంబవంతుని పాదద్వయము నంటి శిరము వంచి నమస్కరించాడేగాని పొగడ్తగా భావించి అహంకరించలేదు. గర్వమెరుగని వినయవంతుడు. ఆడంబర మెరగని నిరాడంబరుడు. ఇంతటి మన్నన పొందిన హనుమ వినయం ప్రధానం అన్న సందేశం ఇచ్చాడు జగానికీ సన్నివేశంలో. దీనిని వివరించే ఒక చక్కని సుభాషితం మనకుంది. ఆచరించి చూపండి.


తన నడవడి సత్పురుషులు

కొనియాడగ సుబ్బకదియ గుణముగ దద్వ 

ర్తనమున్ వదలక యుండిన

మనుజుడు పూజ్యుండు జన సమాజములో నన్