Monday 31 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (7)



ఎంతటివారైనా పిల్లలు కాకుండ పెద్దవారు కారు. మానవుని భావి జీవితానికి బాల్యం (చిన్నతనం) పునాది. ఆ బాల్యాన్ని సరి యగు మార్గానికి మళ్ళించిన మున్ముందు ఆతని జీవితం పూలబాట కాదేని ముళ్ళబాట- సహజంగా చెడును ఆకర్షించే మనసును, ఆవైపునకు బాల్యాన పోనీయరాదు. తల్లిదండ్రులు, గురువులు — గురుతర బాధ్యతతో పిల్లలకు క్రమశిక్షణగల చదువును నేర్పించాలి అలా చేసినవాడు “చెడు కనకు- వినకు-చూడకు" అను సూక్తికి ఉదాహరణలై భావి భారత సత్పౌరులై సత్పథాన పయనించగలరు. "మొక్కయి వంగనిది మానై వంగునా" అనికదా పెద్దల సుద్ధి.


తల్లి ఆనతిపై ఆంజనేయుడు సూర్యభగవానుని చేరి "గురు దేవా! నన్ను శిష్యునిగా స్వీకరింపుము. వేద వేదాంగముల నుప దేశింపుము, జ్ఞానభిక్ష ప్రసాదింపు"మని కోరెను.


సకలశాస్త్ర మర్మజ్ఞుడు, సర్వలోక సాక్షియగు సూర్యదేవుడు "కుమారా! నేనొకచోట నిలకడగ నిలుచువాడను కాను కదా! నిరంతరం వినువీధినీ విహరించేవాడను. ఎలా విద్య నభ్యసించగలవు" అని పల్కెను.


అందుకు ఆంజనేయుడు "ప్రభూ! మీరావిషయంలో ఆలోచించవలసిన పనిలేదు” అని ఉదయాద్రిపై ఒక పాదమును, అస్తాద్రిపై మరొక పాదము నుంచి సూర్యగమనావరోధి కాకుండగ వెనుకకు నడుస్తూ ఏకాగ్రత కోలుపోక శ్రద్ధగా, ఆసక్తిగా సాంగో పాంగముగా వేదాధ్యయనము చేసి నవ వ్యాకరణములను నేర్చెను సకలశాస్త్ర పారంగతుడయ్యెను. బుద్ధిమతాం వరిష్ఠుడయ్యెను.


Sunday 30 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (6)



ఇదొక మహత్కార్యం. గొప్ప సాహసం. ఆంజనేయుడు బాలుడుగ నున్నపుడే తన ధైర్య, బల సాహసాలతో అద్భుత కార్య సాధనకు పూనుకున్నాడు. ఆ కార్యసాధనలో హనువుకు దెబ్బ తగి లినా సహించి సత్ఫలితాల నంది, భవిష్యత్కాలంలో బ్రహ్మవు కాగలవన్న వరాన్ని దాశరధి నుండి పొందినాడు. మరెన్నో అద్భుత కార్యాలు సాధించాడు.


విదిళించ నురుగు సింగపుకొదమయు 

మదనులినగండ కుంజరములపై 

నిది బలశాలికి నైజము కద 

తేజోనిధికి వయసు కారణమగునే.


తన శక్తి సామర్థ్యాలను ప్రకటించడానికి వయసుతో పని లేదు. అది సహజ స్వభావ సిద్ధం. దీనిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు తమ సంతానానికి ఉన్నత కార్యాలను సాధించు నేర్పు, ఉన్నత భావాలను గూర్చి తెలపాలేగాని అల్ప విషయాల పైకి మనసును పోనీయరాదు. ఇదే ఆంజనేయుని బాల్యం మనకు నేర్పే నీతి-రీతి.


మొక్కయి వంగనిది మానై వంగునా ?


సకల దేవతా వర ప్రభావం వలన అమిత బల సంపన్నుడైన బాల ఆంజనేయుని ఆల్లరి ఇంతింతనరానిదీ. సహింపరానిదైనది. ఓర్పుకే ఒక పరీక్షగా నిలిచినై ఆ అల్లరిచేష్టలు. మునులు, మహర్షులు, పరమర్షులు, పిన్నలు, పెద్దలు ఒకరేమిటి? వారు వీరు అన నేల ? ఆ ప్రాంత నివాసులందరు అంజనాసూనుని చేతిలో బాధలు పడినవారే. తమ కుమారుని అల్లరి భయంకర రూపు దాల్చుట అంజనా కేసరులకు దిగులు పుట్టించినది. ఏమి చేయాలో పాలుపోక చివరకు తపోధనులను ఆశ్రయించిరి. త్రికాల వేత్తలైన వారు దివ్య దృష్టితో బాలుని గమనించి ఇలా శపించిరి. "ఆంజనేయా! ఏ బల గర్వముతో మమ్ములను హింసించుచున్నావో ఆ శక్తి సామర్థ్యము లను మరచెదవు గాక! ఎవరైన నీ బలపౌరుషాలను గుర్తుచేసిననే గాని నీశక్తి నీకు గుర్తురాదు!" తదాది ఆంజనేయుడు అమాయకుని వోలె ప్రవర్తించ సాగెను. అది గమనించి తల్లిదండ్రులు బాలునికి విద్యాబుద్ధులు నేర్పింపదలచిరి. ఉపనయన సంస్కారముల గావించి విద్యాభ్యాసమునకై సూర్యునికడ కంపిరి.

Saturday 29 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (5)



మూర్చిల్లిన కుమారునిగాంచి వాయుదేవుడు దుఃఖితుడైనాడు. తనయుని తినుకుని కొండగుహచేరి ఉపచరించుచు వాయుస్తంభన చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.    


చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.


యాజకుల్ వహ్ని హవ్యములు వ్రేల్వగ జూచు


హస్తముల్ సాచినయటుల నుండె


దివిజులు ప్రేరేస దివికెగిరిన దేవయాసంబు


లెగిరిన యటుల నుండె


మునులు నదీతోయముల దోగముంచిన


యంగములో ముంచిన యటుల నుండె


బశు మృగ నరముఖ ప్రాణు లుర్వినిబెట్టు


నడుగులు బెట్టిన యటుల నుండె


భానుమండల మొక్కచో బాదుకొనియె 

గాలగతిదప్పే సత్రియల్ గడచె వేద 

పాఠముడివోయె బాహ్యమభ్యంతరంబు

గాడ్పు బంధించి చనిన యక్కాలమందు.


ఇలా లోకాలన్నీ వాయు సంచారం లేక అల్లాడిపోసాగినవి. ఇంద్రాది దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. ఆ బ్రహ్మదేవుడును ఇంద్రుని తొందరపాటుకు మందలించి అందరిని తీసుకుని వాయు వున్న పర్వత గుహ చేరి చేష్టలుడిగిన బాలుని స్పృశించి చైతన్య వంతుని చేసినాడు. దేవతలందరితో "యీ బాలుడు సామాన్యుడు కాడు. దేవకార్య సిద్ధ్యర్థం జన్మించిన మహానుభావుడు. మీ మీ శక్తుల నీతనికి ప్రసాదించండి" అని పలికినాడు చతురాననుడు.


అంటూనే ముందుగా తానే "ఏ అస్త్రము వలనా మరణం లేని" వరం ఆంజనేయునకు ఇచ్చినాడు.


ఇంద్రుడు పశ్చాత్తప్తుడై స్వేచ్ఛా మరణాన్ని వరంగా ప్రసాదించగా, సూర్యుడు సకల శాస్త్ర విశారదునిగా చేస్తానన్నాడు. ఇలా దేవతలందరూ తమ తమ శక్తులను వరంగా అనుగ్రహించారు. సంతసించిన వాయుదేవుడు బంధించిన శీతల వాయువులతో ప్రాణి లోకంను ప్రాణవంతం చేశాడు, విరిగిన హనువు కలవాడగుట వలన ఆంజనేయుని నాటినుండి హనుమంతుడన్నారు.


Thursday 27 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (4)



ఇది బలశాలికి నైజము కధ


కానక కన్న సంతానమగుట అంజనా కేసరులు ఆంజనేయుని కడు గారాబముగ సాకుచుండిరి. కుమారుని బాల్యక్రీడలు కని ఆ తల్లిదండ్రులు అవధి లేని ఆనంద తరంగాల తేలియాడుచుండిరి. ఒకనాడు ఆంజనేయుడు ఆకలిగొని ప్రాగ్దిశన అపుడే ఉదయించు బాలభానుని గాంచి పండిన పండుగా భ్రమించి దానిని పట్టుకొనుటకై ఒక్క ఉదుటున ఎగిరి వాయువేగ మనోవేగాల అంబరవీధిన సాగిపోవుచుండెను.


సూర్యుని చేరబోవు కుమారుని చూచి వాయుదేవుడు గమనా యాసము కలుగనీయక చల్లగ వీచుచు వెన్నంటి సాగెను. తననే చేరవచ్చు తన మిత్రకుమారునకు తన కిరణాల వేడి తగలనీయ రాదను భావనతో కాబోలు సూర్యుడును చల్లగనే తోచెను.


ఆనాడు సూర్య గ్రహణం. సూర్యగ్రసనమునకై రాహువు వచ్చెను. అంజనా నందనుడు రాహువునే కబళింపబోయెను. రాహువు వెఱగంది భీతచితుడై సరగున శచీనాథుని చేరి తన దీన గాథను విన్నవించెను. ఇంద్రుడు సంభ్రమాశ్చర్యాలతో సింహికా తనయుని వెంటగొని ఐరావతారూఢుడై వచ్చి హనుమంతునితో ఇది తగదని పలికెను. ఇరువురకు పోరు సాగింది. ఆత్మరక్షణార్థం ఇంద్రుడు వజ్రాయుధమును సామీరిపై ప్రయోగించెను. అది బాలుని ఎడమ హనువును తాకింది. పర్వత శిఖరాన పడిపోయినాడు. ఆ దెబ్బకు మూర్ఛితుడై పర్వత శిఖరాన పడిపోయినాడు.


Wednesday 26 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (3)



ఇంతలో- వీచిన గాలి తాకిడికి చీరకొంగు తొలగినది. వక్ష స్థలమూ- శరీర భాగాలూ కనిపించసాగినై, యతికైనా- మతిపోయే ఆ అందం వాయుదేవుని డెందాన్ని హరించింది, మోహం జనించింది. నిగ్రహం కోల్పోయిన వాయుదేవుడు అంజనను గట్టిగా కౌగిలించుకున్నాడు.


తనను కౌగిలించుకున్నది దేహమే లేని వాయువు కావడం వలన అంజన ఏమి జరుగుతున్నదో గమనించలేక పోయినది. ఐతే తనకేదో జరుగుతున్నదని మాత్రం కొంత వడికి గ్రహించుకున్నది. భయకంపితురాలైనది. పెద్దగ అరచినది. 'నా శీలమును అపహరింప చూస్తున్నదెవరు ?' అంటూ శపించ సిద్ధపడింది.


పరిస్థితిని గ్రహించిన వాయుదేవుడు ప్రత్యక్షమై “అంజనా? 'మాభీః' భయపడవలసినది లేదు. నీ శీలమునకేమి తక్కువలేదు. నేను పవనుడను. నా ఆలింగనము వలన గొప్ప ధైర్యవంతుడూ, నీతికోవిదుడూ, మహా పరాక్రమవంతుడూ, తేజస్వంతుడూ, మహా బలుడూ, ఎగురుటలోనూ- దుముకుటలోనూ- నాతో సమానుడైన ఒకకుమారుడు నీకుజన్మించగలడు" అనిచెప్పి అదృశ్యుడయ్యెను.


కలనైనా ఊహించని యీ హఠాత్సంఘటన అంజనను అనందవార్ధిలో ముంచెత్తినది. పుత్ర జననోత్సాహ వార్తను భర్త కేరిగించినది. కేసరియు, అవధిలేని ఆనందంతో పొంగిపోయినాడు. అంజన గర్భవతియైనది. అచటి పర్వత ప్రాంతాలలో విహరిస్తూ నవమాసాలు నిండగనే- వైశాఖ బహుళ దశమీ పూర్వాభాద్రా నక్షత్ర వైధృతియోగ మధ్యాహ్నవేళ ఒక కుమారుని కన్నది. అతడే ఆంజనేయుడు. అంజనాగర్భ సంభూతుడగుట వలన యీ పేరు వచ్చినది. 


Tuesday 25 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (2)


ఆంజనేయ ఆవిర్భావం


ఒకప్పుడు మేరుపర్వత ప్రాంతమును పరిపాలించిన వానర వీరుడు కేసరి, మహా బలశాలి. పరాక్రమవంతుడూనూ- తనవారికి కొంగు బంగారం- వైరులతో సింహస్వప్నం! మూర్తీభవించిన ధర్మ మూర్తి. ఇతని ఏలుబడిలోని వారందరూ కలకాలం ఇతనినే తమకు రాజుగా- మహారాజుగా ఉండాలని కోరుకునేవారు.


దేవలోకాన 'పుంజిక స్థల' అను అప్సరస కలదు. సాటిలేని అందం ఆమెది. అందానికే అందాలు నేర్పే సోకులాడి. చంచల నేత్ర- చపల హృదయ, శాపకారణంగా మనుజ లోకాన జనించినది అంజనగా. కుంజరునకు దైవదత్తమైన కూమార్తైనది. పద్మ పత్ర విశాలాక్షి. తలిరాకుల సోయగం. మేని అందానికి తోడు ఆమె వేషధారణ ఆమెకు మరింత శోభను చేకూరుస్తూ- 'బంగారము నకు తావి అబ్బినటుల' ఉండేది.


కుంజరుడు. అంజనను, తన మేనల్లుడూ, మహావీరుడైన కేసరికిచ్చి వివాహం చేశాడు. ఈడూ జోడైన యీ ఆలుమగల సంసార యాత్ర సరాగాల రాగాల సాగింది.


ఎంతకాలానికి సంతతి కలుగలేదు. చింతాక్రాంతులయ్యారు అంజనా కేసరులు. ఎందరి మన్ననలో పొందిన వీరికి సంతానం లేని దిగులు- ఎవరితో చెప్పుకోలేనిదీ ఎవరూ తీర్చలేనిదీయైనది.


ఒకనాడు- సహజసిద్ధమైన పరమ సుకుమార లావణ్యంతో అపురూప సౌందర్యవతిగా వెలుగొందే ఆంజన- పూవునకు తావిలా శరీరానికి తగిన వస్త్రాలనూ, దివ్యాభరణాలనూ ధరించి- తనను, చూచువారి కనులు చెదరునట్లుగా వసంతయామిని వోలె పర్వత శిఖరాన నిలబడి చల్లగ వీచే పిల్లవాయువుల లాలనలో-ప్రకృతిలోని అందచందాలను పరికించు సమయాన మదిలో 'వీరమాతనైన బాగుండెడిది గదా!!" అన్న భావన వచ్చినది.

Monday 24 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (1)



రాయప్రోలు రథాంగపాణి గారు రాసిన పుస్తకమిది.


అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం 


శ్రీ మహాగణాధిపతయేనమః 

ఓం నమో భగవతే వాయునందనాయ


హనుమత్సందేశం


అవతార విశిష్టత


సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణా| 

వందే విశుద్ధ విజ్ఞానా కవీశ్వర కపీశ్వరౌ ॥


అనేకములైన పెద్ద పెద్ద కొమ్మలతో చాల దూరం విస్తరించి యున్న ఒక పెద్ద మఱిచెట్టును ఆశ్రయించి ఎందరో అనాధలు ఎండబారి పడకుండ తల దాచుకుంటారు. నానాజాతి పక్షులు నలు దిక్కులకు మేతకై వెడలి సాయం సమయాన ఆ చెట్టుకొమ్మలపై నివసిస్తుంటాయి. ఎవరికీ ఏ హానీ చేయని ఆ నోరులేని పక్షులను అదే చెట్టు ఊడల మాటున పొంచి కొందరు కిరాతులు తమకాహారంగా హింసిస్తారు. కొందరు రకరకాలైన జీవన సమస్యలతో పోరాడలేక నిరాశా నిస్పృహలకులోనై-ఆ చెట్టు ఊడలనే ఉరిత్రాడుగ చేసుకుని ప్రాణత్యాగం చేస్తారు. చిత్రం ఏమంటే వీరిలో ఎవరిని గుఱించీ అంటే తన చెంతన జరిగే హింస, ఆహింసల గుణించి ఇసుమంతైనా పట్టించుకోక ఆ మఱిచెట్టు తన పని తాను చేసుకుపోతుంది. ఇదే సృష్టి! ఇదొక సృష్టి రహస్యం !!


ఐతే మానవుడు మాత్రం యీ సృష్టిని తనకనుకూలంగా కావలసిన రీతిలో మార్చుకోవాలనే తపనతో మనసు నిలుపుకోలేక కష్టనష్టాల కడలిలో కొట్టుకుపోతూ సాయానికై పరితపిస్తున్నాడు.


దైవ సృష్టిలో తరతమ భేదాలు లేవు. పక్షపాతం లేదు. అందరూ సమానమే. అందరినీ ఒకేలా చూస్తాడు.


తనను తిరస్కరించినవానిని సైతం దగ్గరకు చేర్చుకుంటాడు. సేద దీరుస్తాడు. తన తప్పు తాను తెలుసుకుని బాగుపడాలనే భావనతో మానవునికి తోడుగా అవతార పురుషులను పంపుతాడు. ఒక్కో వేళ తానే అవతార మూర్తిగా అవతరిస్తాడు.


అట్టి మూర్తులలో హనుమన్మూర్తి ప్రతిభావంతమైనదీ, మహా మహిమాన్వితమైనదీనూ -----


ఆంజనేయస్వామివారి జనన, విద్యాభ్యాసాది విధానమంతా మానవజాతికి ఒక సందేశ కావ్యమే.


కేవలం స్వామివారి చరిత్రను చదివిన చాలదు. స్తోత్ర పారాయణాదులను పఠించినదానికన్న వారి సందేశమును ఆచరణలో చూపినవారి జన్మ నిజముగ ధన్యము. వారే స్వామికి విశ్వాస పాత్రులు. ఆ భావంతో.... ఇక చదవండి....

Sunday 23 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (30)



సోదరులు తిన్నగా ఉన్నా వారికి ఉపదేశించడం లేదు. ఆంజనేయునకే, ప్రత్యక్ష శిష్యునకే ఉపదేశించాడు. మిగిలినవారు విన్నారు. అందుకే


అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్త్వం


అనగా ఆంజనేయుడు వినయ భరితుడై వింటున్నాడు. అతనికి తిన్నగా అందిస్తున్నా ఋషులందరూ అతని మనస్సులో ఉన్నారు. అందుకే తత్త్వం మునిభ్యః పరం. అనగా ఋషులకు పరావిద్యనిచ్చాడు.


సీతారామాంజనేయ సంవాదమని తెలుగులో ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. ఇందు రాముడే కాదు, సీత కూడా ఉపదేశించినట్లుంది. అద్వైతం గురించి మౌలిక గ్రంథాలు ప్రాంతీయ భాషలలో ఉండవు. అవి సంస్కృత గ్రంథాలకు అనువాదాలే. కాని ఈ గ్రంథం ప్రత్యేకతను సంతరించుకొంది. ఇందు సీత ముందుగా రామతారక మంత్రాన్ని హనుమకు ఉపదేశించినట్లుంది. ప్రాణసమానురాలైన సీత నుండి రామమంత్రం రావడం గొప్ప కదా! తరువాత రాముడు, సాంఖ్యయోగాన్ని, అమనస్కయోగాన్ని ఉపదేశిస్తాడు. అనగా అద్వైతాన్ని. అదంతా విపులంగా ఉంటుంది ఈ గ్రంథంలో.


సీతారాములు హనుమకు ఏదిచ్చినా తృప్తి పడరు. ఆంజనేయుడు కోరేదీ ఏమీ లేదు. వారిని సేవించడంలోనే తృప్తిని పొందుతాడు. కాని సీతారాములకు తృప్తి కలగడం లేదు. అందువల్ల జ్ఞాన సంపదనీయాలను కొన్నారు. అది తరిగే సంపద కాదు. అందువల్ల ఉపదేశమిచ్చారు. వారు జగత్తునకే తల్లిదండ్రులు కదా! ఆంజనేయునకు గురువులైనారు. వారే తల్లి, తండ్రి, గురువు దైవమయ్యారు. వేదానికి శిరోభాగం ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులలో ముక్తికోపనిషత్తు ఒకటి. ఇందు రాముడు, ఆంజనేయునకు ఉపదేశించినట్లుంది. ఆ పేరే అద్వైత సారం అందిస్తోందని తెలివిడి చేస్తోంది.


ఈ ఉపనిషత్తులో ఋషుల సమక్షంలో ఆంజనేయునకు తిన్నగా ఉపదేశించినట్లుంది. దక్షిణామూర్తి నుండి వినిన సనకాదులందున్నట్లు చెప్పబడింది.


ఇందు ఆంజనేయుడు, ఎన్నో ప్రశ్నలు వేసి జ్ఞాన క్షీరాన్ని పొందినట్లుంది. నీ తత్త్వ స్వరూపం చెప్పు రామా అని అడిగినట్లు ముక్తావస్థను ప్రసాదింపుమని అడిగినట్లుంది.


ఇందులో 108 ఉపనిషత్తుల పేర్లు ఉన్నాయి. ఏ ఉపనిషత్తు, ఏ వేదానికి చెందిందో కూడా ఉంది. ఏ శాంతి మంత్రాన్ని, ఏ ఉపనిషత్తు ముందు పఠించాలో కూడా ఉంది. ఇందు వేద శాఖల ప్రస్తావన ఉంది.


రాముడొక్కడే మర్యాద పురుషోత్తముడు కాడు. ఆంజనేయుడూ అట్టివాడే. అందుకే అతడు సమస్త సద్గుణ సంపన్నుడని తులసీదాసు కీర్తించాడు. సకల గుణ నిధానం అన్నాడు. అన్ని గుణాల కంటే ఉత్తమమైనది జ్ఞానమని అందువల్ల రాముని నుండి ఉపదేశాన్ని పొందాడు. మన జీవితాలలోనూ ధర్మమనే సంపదను సంపాదించాలి. జ్ఞాన సంపదను సంపాదించాలని ఇతని జీవితం, పాఠం చెప్పడం లేదా?


అన్నింటిలో అందరికీ గురుప్రాయుడైన ఆంజనేయుడు, స్వయంగా శిష్యుడై నిరంతరం అభ్యసిస్తూనే ఉన్నాడు. ఇది గుణపాఠం కాదా? గురువు, శిష్యుడై గురువు నుండి జ్ఞానాన్ని పొందిన ఆంజనేయుడు మన అందరికీ ఆదర్శప్రాయుడే. 


ఇక్కడితో కంచి పరమాచార్య స్వామి వరు హనుమంతులవారి పై ఇచ్చిన అమృతవాణి సమాప్తం.  


Saturday 22 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (29)



ఇక రాఘవుడు పరావిద్యనుబోధిస్తున్నాడు. ఇంతకు మందు ఆంజనేయుడు సూర్యుని నుండి నేర్చుకొన్నది అపరావిద్య. విష్ణువైన రాముడే సూర్యభగవానునకు పరావిద్యను బోధించినట్లు గీతలో ఉంది.


ఇమంవైవస్వతం యోగం ప్రోక్తవానహం అవ్యయం


అనగానేను నీకందించబోయే ఉపదేశాన్ని ఏనాడో సూర్యునకిచ్చానని అన్నాడు అర్జునునితో కృష్ణుడు.


ఆవు ఎందరికో పాలనిస్తుంది. పాలు చేపడానికి ముందు దూడ ఉండాలి. కదా! అట్టిదే ఉపదేశమనే క్షీరం. ఉపదేశం పొందడానికి అర్హులైన వారెందరో ఉన్నా ఉపదేశాన్ని శిష్యునకే అందిస్తాడు. గీతలో ధ్యాన శ్లోకం ఇట్లానే చెబుతుంది. గోపాలుడైన కృష్ణుడు ఉపనిషత్తులనే గోవును పిదికి గీతామృతాన్ని అందించాడు. అర్హులైన వారు దానిని త్రాగవచ్చు. వారి ప్రతినిధిగా అర్జునుని దూడగా గ్రహించాడని ఉంది.


సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందనః


పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.


కృష్ణుడు జ్ఞానాచార్యుడు కాగా అర్జునుడు శిష్యుడయ్యాడు. రామునకు హనుమయే శిష్యుడు. ఆ హనుమయే అర్జునుని పతాకంపై ఉన్నవాడు. అట్లా ఉండడం వల్ల అర్జునుడు విజయుడైనాడు.


దక్షిణామూర్తి మాదిరిగా రాముడు చిన్ముద్రనుపట్టాడు. ఒక కాలును మడిచి మరొక కాలిపై వేసుకొని ఒకటి వ్రేలాడుతూ ఉండగా అనగా వీరాసనంలో ఉండి ఉపదేశించాడు. ధ్యాన శ్లోకం చూడండి:


కాలాంభోధరకాంతి కాంతమనిశం వీరాసనాధ్యాసినం

ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని


అనగా వర్షాన్ని కురిపించే మేఘం యొక్క రంగుతో వీరాసనంలో ఉండి, చిన్ముద్ర ధరించినవాడై ఒకచేతిని మోకాలిపై ఉంచినవాడై యున్నాడు.

మరొక ధ్యాన శ్లోకమూ ఉంది. దీనిని రామాయణ పారాయణానికి ముందు చదువుతారు. ఇందూ వీరాసనంలో ఉన్నట్లుంది. ఇందు చిన్ముద్ర ప్రస్తావన లేదు. ఇందు ఋషుల సమక్షంలో ఆంజనేయునకు ఉపదేశించినట్లుంది:


వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే

మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం

అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం

వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం 


దక్షిణామూర్తిలా వీరాసనంలో కూర్చొని యున్నా వేదాంతోపదేశం చేస్తున్నా దక్షిణామూర్తిలా ఒక్కడేలేదు. రాముడు రాజు, ఋషి కూడా. అనగా కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని కలిగిన వాడు. అతడు బంగారు మంటంపై భార్యతో కూడియున్నాడు. అందువల్ల వైదేహీ సహితం. విదేహరాజ్యంలో జన్మించింది. కనుక వైదేహి. రాముడిక్కడ జ్ఞానాచార్యునిగా ఉన్నాడు కనుక అతని భార్యను సీతయని గాని, జానకియనిగాని అనలేదు. వైదేహి అనే ఉంది. అనగా శరీర భావన లేనిది. ఆత్మస్వరూపురాలన్నమాట. కనుక ఆమె తత్త్వరూపిణియే. అట్టి స్త్రీ తన ఎడమ ప్రక్కన ఉండగా ఉపదేశిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆమె తత్త్వాన్నే ఉపదేశిస్తున్నాడు. ప్రక్కన భరతాదులున్నారు. భరతాదిభిః పరివృతం రామంభజే శ్యామలం, అని ఉంది.


Friday 21 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (28)



అవతారం యొక్క మొదటి ప్రయోజనం పూర్తికాగా రాముడు, చక్రవర్తియై వైదిక కర్మానుష్ఠానం ఎట్లాచేయాలో తన నడవడిక ద్వారా చూపించాడు. జ్ఞాన మార్గాన్ని అన్వేషించే ఋషులు వచ్చారు.


రాముడు జ్ఞాన స్వరూపుడని ఋషులకు తెలియనిది కాదు. వారితరుల మనస్సును పసికట్టగలరు. వారింతకు ముందు ఉపదేశం పొందినవారైనా, జ్ఞానులైనా సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడైన రాముని నుండే తత్త్వోపదేశం పొందితే గట్టిపడడమే కాదు, జీవన్ముక్తులౌతారు కూడా.


ఉపదేశించడానికి రాముడూ ఇష్టపడ్డాడు. బ్రహ్మవిద్య గురించి ఆనందించేవారు, ఇతరులతో ఆ ఆనందాన్ని పంచుకోరా? రాముడెవరినుండి నేర్చుకోనవసరం లేదు. మానవునిగా అవతరించాడు కనుక ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం తాను గురువును సేవించాడు. వసిష్ఠుని నుండి ధనుర్విద్య మొదలైన వాటితో బాటు వేదాంతాన్ని అభ్యసించాడు. ఆ గురు శిష్యుల ఉపదేశానికి చెందిందే యోగ వాసిష్ఠమనే గ్రంథం. దానిని జ్ఞానవాసిష్ఠమని అనడం సబబు. అన్ని సాధనమార్గాలూ యోగమార్గానికి చెందినవి. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు. కానీ యోగం అంటే ప్రసిద్ధమైన పాతంజల యోగశాస్త్రమని తలుస్తాం. కాని మన గ్రంథము, అద్వైతజ్ఞానికి చెందింది.


తాను నేర్చుకొన్నది ఇతరులకందించాలి. దానివల్ల ఉపదేశించే వానికీ తృప్తికల్గుతుంది. రామునకూ అందించాలనే ఉత్సాహముంది. రావణ వధానంతరము వీలుచిక్కింది. అపుడు ఋషులు వచ్చారు. అయినా వినయ భరితుడైయున్నాడు. తాను క్షత్రియుడు, బ్రాహ్మణ ఋషులకు ఉపదేశించడమా అని సందేహించాడు. ఆపైన వయస్సులో ఋషులు పెద్దవారై యున్నారు. బ్రహ్మవిద్య చెప్పాలని ఉన్నా తిన్నగా మాత్రం వారికి ఉపదేశించలేదు. 


అపుడిట్లా భావించాడు. ఇంద్రియాలను పూర్తిగా జయించిన ఆంజనేయుడిక్కడ ఉన్నాడు కదా! జ్ఞానం గురించి అతనికి తెలియకపోయినా అతనికి మోక్షప్రాప్తి ఖాయమని తెలుసు. అయినా జ్ఞాన మార్గాన్ని అందించాలని ఉపక్రమించాడు. ఇంత కంటే మరొక శిష్యుడు దొరుకుతాడా? కనుక ఇతణ్ణి ముందు పెట్టుకొని తత్త్వోపదేశం చేయాలనుకొన్నాడు. ఇక్కడున్న ఋషులూ వినవచ్చు అని భావించాడు.

Thursday 20 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (27)



రామ-హనుమల మధ్య ప్రభు-సేవకభావం భగవానుడు భక్తుల అనుబంధం ఉన్నట్లు అనుకొంటాం కదా! కాని చివరగా గురు-శిష్య సంబంధమూ ఉంది. సద్గురు - సత్ శిష్య సంబంధం కంటే మించినది లేదు. ఇతడు సత్పురుషుడు - రాముడు సచ్చిదానందరూపుడే. ఇట్లా గురుశిష్యులుగా భావించడమూ పుణ్యమే.


ఒక్క ప్రక్క రాముడు చక్రవర్తి. ధర్మప్రకారం పాలించినవాడు. మరొక ప్రక్క జ్ఞాన రాజు కూడా. ఆత్మోపదేశం ఇచ్చే జ్ఞానగురువు. జనకుడట్టివాడు. అతడు రాజు, రాజర్షి కూడా, రాజైవేదాంత చర్చలు చేసేవాడు.


రాముడు, ఆంజనేయునకే కాదు, ఋషులందరికీ ఉపదేశించాడు. రాముడు, నారాయణావతారమని ఋషులకు తెలుసు. రాక్షస సంహారం కోసం అవతరించాడనీ తెలుసు. ఆ పని పూర్తియై రాజ్యాన్ని ఏలుతున్నాడు. ధర్మం, ఆచరణలో ఉంటుందని ఆచరించి చూపిస్తున్నాడు. అదే అవతార లక్ష్యం. మూడవ పనిని చూడబోతున్నారు ఋషులు.


దేనికైనా పూర్వాంగం, ఉత్తరాంగం ఉంటుంది. ముందు చేయవలసినది పూర్వాంగం. తరువాత ఉత్తరాంగం. వైదిక సంప్రదాయంలో ధార్మిక కర్మలు చేసి నడవడికను తీర్చిదిద్దుకొని తరువాత బ్రహ్మమునకై విచారించాలి. ఆ బ్రహ్మము, ధర్మాధర్మములకతీతము. మనకున్న షట్ దర్శనాలలో పూర్వమీమాంస ఒకటి. ధర్మాన్ని తెలిసికోవాలని ధర్మజిజ్ఞాసతో మొదలౌతుంది. ఉత్తరమీమాంస బ్రహ్మ జిజ్ఞాసతో ఆరంభమౌతుంది. దానినే వేదాంతమంటారు. ఏయే వైదిక కర్మలు చేయాలో చెప్పేది పూర్వ మీమాంస. బ్రహ్మను తెలిసికొనుటకు సాధన సంపత్తిని, మార్గాన్ని చూపేది ఉత్తర మీమాంస.   


Wednesday 19 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (26)



ముందుగా ఎందుకు పూజించాలి? బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు కనుక. ఈ మాట శ్లోకంలో మధ్యలో ఉంది. నాయకమణిలా.


అయితే ఒక సందేహం కల్గుతుంది. ఎవరికైనా బ్రహ్మజ్ఞానం కల్గిందంటే తనంతట తాను పొందలేడు. గురూపదేశాన్ని అనుసరించడం వల్ల అట్టివాడవుతాడు. ఉపదేశం పొందినంత మాత్రంచే సిద్ధి పొందలేడు. శ్రవణ మనన నిదిధ్యాసలున్నాయి. శ్రవణం అనగా గురువు నుండి ఉపదేశమును వినుట; మననమనగా దానిని గుర్తుపెట్టుకొనుట. నిదిధ్యాసమనగా ఆ తాత్పర్యము నందు లీనమై, ధ్యానమగ్నుడై, వినినదానిని అనుభవంలోకి తెచ్చుకొనుట, జ్ఞానం పొందాడంటే ఎవరినుండి విన్నాడని సందేహం కల్గుతుంది. అనగా ఎవరు గురువు?


మనం అనేక కథలనితని గురించివిన్నాం. చిన్నపుడు సూర్యభగవానుడే ఉపదేశించాడు. పాఠాలను నేర్చుకొన్నాడు. అది అంతాజ్ఞానం కాదు. ఇవన్నీ ఆత్మ జ్ఞానాన్ని బోధించేవి కావు. బుద్ధితో శాస్త్రాలను అభ్యసించాడు. నవవ్యాకరణాలను నేర్చుకొన్నాడు. బుద్ధి పదునెక్కింది. అందువల్ల బుద్ధిమతాంవరిష్ఠుడయ్యాడు. బుద్ధికంటే జ్ఞానం గొప్పదని అన్నాం. అతణ్ణి జ్ఞానిగా తీర్చిదిద్దిన వాడెవ్వడు?


ఆత్మజ్ఞానమే పరావిద్య. అన్ని శాస్త్రాలూ అపరావిద్యకు చెందినవి. పరాయనగా శ్రేష్ఠము. అపరయనగా తక్కువది. రామాయణ కథ అంతా ముగిసిన తరువాత, పట్టాభిషేకం పూర్తియైన తరువాత ఇతనికి జ్ఞానోపదేశమైంది.


రామసేవలోనే ఆంజనేయ ప్రభావం అంతా కన్పిస్తుంది. రామునకంతగా కైంకర్యం చేసినపుడు జ్ఞానోపదేశాన్ని పొందాడు. రామావతారం పూర్తి అయ్యే వరకూ రామునితో ఉన్నవాడు మరొకరి దగ్గరకు వెళ్లి ఉపదేశం పొందడం. కుదురుతుందా? కనుక రాముడే ఉపదేష్ట.


Tuesday 18 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (25)



ఇతర మేధావులకంటే ఆంజనేయ స్వామి భిన్నుడు. వేదాంత శాస్త్రాన్ని జీర్ణం చేసికొన్నవాడు. అనుభవించినవాడు. స్వామితో ముఖాముఖి పరిచయమున్న తులసీదాసు అందుకే జ్ఞానినామగ్రగణ్యం అన్నాడు.


ఏమిటీ గొప్పలక్షణాలు? శ్లోకంలో, అతులిత బలధామమ్ = సాటి లేని బల పరాక్రమం కలవాడు; స్వర్ణశైలాభదేహం = బంగారు మేరు పర్వతంలా ధగధగా మెరిసే దేహం, శరీరానికి ఈ కాంతి, బ్రహ్మచర్యం వల్లనే. తరువాత దనుజవన కృశానుం = రాక్షసులనే అరణ్యానికి అగ్నివంటివాడు. తరువాత జ్ఞానినామగ్రగణ్యం అన్నాడు.


తరువాత అతని మనస్సు యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నాడు. సకల గుణనిధానం = అన్ని మంచి గుణాలకు నిలయమైనవాడు. అందు తీక్షమైన బుద్ధి యొకటి. తరువాత వానరాణాం అధీశం = చంచలమైన కోతులను నియమించువాడు. జితేంద్రియ బ్రహ్మచారిగా. మనస్సనే కోతిని నియమించిన వాడనే అర్థంతో ఆలంకారికంగా తులసీదాసు పేర్కొన్నాడు.


ఇక రఘుపతి వరదూతం రాఘవునిదూత. వరదూతకు బదులు ప్రియభక్త అనే పాఠాంతరం ఉంది. ఈ మాటకు రెండర్థాలు చెప్పవచ్చు. రఘుపతి యొక్క ప్రేమను పొందినవాడని లేదా రఘుపతి ప్రీతిని కల్గినవాడనీ అర్ధం.


చివరగా వాతజాతం = వాయునందనుడు. అనగానే మన మెవరికి నమస్కరిస్తామో అతణ్ణి పేరునుబట్టి గుర్తిస్తాం కదా! నమామి = : నమస్కరిస్తున్నా.


Monday 17 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (24)



ఇతడు కేవలం కల్పనలతో, ఊహలతో వ్రాసాడా? కేవలం స్వామి పట్ల భక్తితో వ్రాసేడు. స్వామితో ప్రత్యక్ష సంబంధమున్న అతని చరిత్ర చెబుతోంది. స్వామి యొక్క అంశతో పుట్టాడు. స్వామి నక్షత్రమైన మూలా నక్షత్రంలో ఇతడు జన్మించాడు.


పైన పేర్కొన్న శ్లోకం తులసీదాసు వ్రాసినదే. అది సుందరకాండకు మంగల శ్లోకం. రామాయణం ప్రాంతీయ భాషలో ఉన్నా మంగల శ్లోకాలు సంస్కృతంలోనే ఉంటాయి.


వాతజాతం నమామితో శ్లోకం ముగిసింది అనగా వాయుపుత్రుడని, వాతాత్మజుడని.


ఎందుకీ శ్లోకాన్ని పేర్కొన్నానో వివరిస్తాను ఇందు జ్ఞానినామ గ్రగణ్యం. అనగా జ్ఞానులలో శ్రేష్ఠుడని, అనగా బ్రహ్మజ్ఞానులలో, ఆత్మజ్ఞానులలో మొదటి స్థానం ఆక్రమించాడని అర్థం.


అతనికి బలం, ధైర్యం, నేర్పు, బుద్ధి, పాండిత్యం, అఖండ బ్రహ్మచర్యం ఉన్నవని తెలుసు. కాని అన్ని సుగుణాలను ధర్మకార్యాలలో వెచ్చించాడు. రామప్రీతి కోసమే. రామభక్తి సామ్రాజ్యంలో మునిగిపోయాడు. అట్లా కర్మఫలాన్ని ఆశించకుండా కర్మయోగిలా ప్రవర్తించాడు. అతడు భక్తియోగి కూడా. అయితే అతడు జ్ఞానయోగియని చాలా మందికి తెలియదు.


అతడు బుద్ధిమంతుడు కనుకనే బుద్ధిమతాం వరిష్ఠుడయ్యాడు. జ్ఞానం కంటే బుద్ధి, విలక్షణమైనది. అనేక రంగాలలో ఎందరో మేధావులను చూస్తాం. కాని అందర్నీ జ్ఞానులని అంటామా? బ్రహ్మ జ్ఞానం కలవానిని బ్రహ్మజ్ఞాని అంటాం. అతడు పరమాత్మ, జీవాత్మలు ఒక్కటే అనే జ్ఞానంతో ఉంటాడు. అట్టి జ్ఞానం కలగడానికి ఎన్నో శాస్త్రాలు చదవాలి. శాస్త్రాలను అర్థం చేసికోవడానికి బుద్ధి ఉపయోగిస్తుంది. అయితే ఆ బుద్ధి, ఆధ్యాత్మ జ్ఞానాన్ని సంపాదించడానికే వినియోగపడాలి. చాలా మంది మేధావులు ఇట్లా ఈ విషయంలో వినియోగించకుండా వారి వారి ప్రత్యేక రంగాలలో వినియోగిస్తారు. ఒకవేళ వేదాంత శాస్త్రంలో ప్రవేశపెట్టినా అది బౌద్ధికమైన చర్చకే పరిమితమౌతుంది. దానిని అనుభూతికై వినియోగించరు. అటువంటప్పుడు దానిని జ్ఞానమనలేము. అతడెంతో మేధావి కావచ్చు, నిజమైన అధ్యాత్మ జ్ఞానికాడు.

Sunday 16 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (23)



అతడు జ్ఞాని, జ్ఞాన గురువు కూడా


అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం

దనుజవనకృశానుం జ్ఞాని నామగ్రగణ్యం

సకలగుణనిధానం వానరాణామధీశం

రఘుపతి వరదూతం వాతజాతం నమామి


ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకం. తులసీదాస్ వ్రాసిన రామచరిత మానస్, ఉత్తర దేశంలో ప్రసిద్ధిని పొందింది. తమిళదేశంలో కంబ రామాయణం కంటే ఉత్తరదేశస్థులు తులసీరామాయణాన్ని భక్తి శ్రద్ధలతో పూజచేసి, పారాయణ చేస్తూ ఉంటారు. 400 సంవత్సరాల వెనుక వ్రాయబడిన గ్రంథమది.


తమిళ భాష మాదిరిగా హిందీ భాష ప్రాచీనమైనదికాదు. కాని ఈ రామాయణం వల్ల ఆ భాష వినుతికెక్కింది. సారస్వత స్థాయి ఎక్కువగా ఉన్నా ఇది విద్వాంసులు గణించే భాషలో వ్రాయబడలేదు. సామాన్య జనులు చదివి, విని, అర్థం చేసికొనే రీతిలో వ్రాసాడు. కనుక కంబరామాయణం కంటె ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఇందు భక్తి, కవితా సౌందర్యమున్నా, కేవల భక్తి వల్లనే ప్రజలమన్ననలను పొందింది.


హిందువులు బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్చబడే దశలో తులసీదాసు ఇది వ్రాసాడు. అనేకులు ఇతర మతంలోకి ప్రవేశించకుండా ఉండడానికి కారణం ఇతని రామాయణ రచనయే. ఒత్తిళ్లకు లొంగిపోగూడదనే భావన ప్రజలలో పాతుకొని పోవడానికి ఇదే కారణం. 40 చరణాలతో విడిగా హనుమాన్ చాలీసా కూడా వ్రాసేడు. ఇది హనుమ, కవచంగా వ్రాసి ఉంటాడని తెలియ చేస్తోంది. ఎవరు దీనిని చదివినా వెంటనే ఆకర్షింప బడతారు. బలహీనుడు చదివి బలాన్ని పుంజుకొంటాడు. ఇది తులసీదాసు కాలంలోనే ప్రసిద్ధిని పొందింది. మతం మార్పిడికి కంచెలా రక్షించింది.


Saturday 15 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (22)



ఇతనికి ముసలితనం బాధలేదు. ఉక్కు వంటి శరీరం. ఉత్తరదేశంలో ఇతణ్ణి బజరంగబలియని కొలుస్తారు. (వజ్రశరీరం). ఒకవేళ అతనికేమైనా రోగం వచ్చినా అది రామప్రసాదంగా భావిస్తాడని నేననుకొంటున్నా. ఈ జగన్నాటకంలో ధృతరాష్ట్రుడు, సూర్ దాస్ వంటివారు గ్రుడ్డివారుగా పుట్ట లేదా? మనవల్ల ఇతరులకు ఇబ్బంది కల్గించినా వారి కర్మను కొంత తొలగించామని భావించగలగాలి. వారు మనలను సరిగా చూడకపోతే మనకర్మను మనం పోగొట్టుకొంటున్నామని భావించగలగాలి. అట్లాగే అతడూ భావిస్తాడు. అంటే రోగం లేని హనుమకు రోగం వచ్చినా అట్లాగే తలంచే స్థితిలో ఉంటాడు.


ఇంతకూ సారాంశమేమిటి? ఇదంతా పైవాడు ఆడించే నాటకమని భావిస్తే. అంతా సంతోషమయంగా ఉంటుంది. సంతోషంగానే స్వీకరించగలగాలి. అట్టి మానసిక స్థితిని సంపాదిస్తే కష్టాలేమీ మనలను బాధించవు. నాటకాన్ని చూసి వినోదించునట్లుగా జీవితాన్ని అట్లా చూడగలగాలి. పరమపదంలోని సౌఖ్యం కంటే ఇట్టి భావన వల్ల కలిగిన ఆనందమే గొప్పగా ఉంటుంది. పరమపదంలో నవరసాలుండవు. ఈ లోకమే నవరసభరితం. ఇక్కడే చమత్కారం. భగవానుడెన్నో వేషాలు ధరిస్తున్నాడు కదా! అతడు కష్టాలు కల్గిస్తున్నాడా అని ప్రశ్నించుకోకుండా ఈ నవరస నాటకాన్ని చూసి సంతోషిద్దాం. ఇట్టి భావన మనలో పాదుకొలిపేటట్లు ప్రార్థిద్దాం.


అతనిలా మనం ఉండగలగాలి. ఎవరైనా మనకు నమస్కరిస్తే అతని మాదిరిగా చిరంజీవిగా ఉండాలని దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అనాలి.

Friday 14 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (21)



చిరంజీవిగా ఉండడం శిక్షగా భావించకుండా గౌరవంగా ఎందుకు భావించాడు? అంతా రామమయమని అద్వైత భావనతో ఉన్నాడు. అద్వైత సుఖానికి మించిన రామనామాన్ని రాముడిచ్చాడు. నిరంతర నామోచ్చారణ వల్ల ఆ నామమే తానయ్యాడు. అతని నుండి భక్తికాంతులు వెలువడ్డాయి. కిరణాలు చీకటిని పోగొట్టినట్లు మనలోని అజ్ఞానం పటాపంచలౌతోంది. భజనలు వింటూ ఉంటే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. పరమపదంలో (వైకుంఠం) భజనలున్నా పెద్ద కాంతి ముందు చిన్న దీపం వెలిగించినట్లు వెలవెల బోతుంది. కాని ఈ లోకంలో ఉన్న చీకటిలో దీపం వెలిగిస్తే దీపకాంతి స్పష్టంగా ఉంటుంది. అంటే చీకటిలో దీపకాంతి స్ఫుటంగా ఉంటుంది. నామమనే దీపాన్ని వెలుగునట్లు చేస్తాడు.


పరమపదంలో అతడు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఉండి అతడు రామదాసుడై రామకార్యానికి తనవంతు సాయం చేస్తాడు. భక్తి ధర్మాలను వ్యాప్తిలోనికి తీసికొని రావడానికే ఉన్నాడు. పొడిగా నున్న ప్రాంతం వర్షాన్ని కోరుతుంది. అట్లాగే ఇక్కడ ఉండడం అనుగ్రహమే అని భావిస్తాడు.


మహాత్ములు తమ కాప్తులు మరణించినా బాధపడరు. ఇదంతా నాటకమని భావించడం వల్ల దుఃఖించరు. నాటకంలో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్ని పాత్రలూ ఒకేసారి రావు. లంకలో వానరులు చనిపోయారు. వారికై ఇతడు బాధపడలేదు. రామలక్ష్మణులకోసం సంజీవ పర్వతాన్ని తీసికొని వచ్చినపుడు వానరులూ బ్రతికారు. అప్రయత్నంగా వారు బ్రతకడం జరిగింది. బ్రతికారని సంతోషించలేదు.

Thursday 13 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (20)



అది శిక్షకాదు. అనుగ్రహమే. అతణ్ణి చిరంజీవిగా ఉంచడం, మనలను అనుగ్రహించడమే.


శంకరులితనిని అంజనాభాగ్యం అన్నారు హనుమత్ పంచరత్నంలో, అనగా ఇట్టి వాణ్ణి కన్న తల్లి అదృష్టవంతురాలని. అది మన భాగ్యం కూడా.


అతడెట్టి పవిత్రుడో కదా! కామస్పర్శలేని పవిత్రత. ఎవనికైనా అతనికున్న భక్తి, జ్ఞాన, పరాక్రమాదులున్నాయా? అన్ని గుణాలున్నా వినయం ఉట్టిపడే వాడు. స్వార్ధం అణుమాత్రం ఉందా? అతని గుణాలు వింటేనే మనలో భక్తి పొటమరిస్తుంది కదా!


రాముడితణ్ణి ఇక్కడ ఉంచడం వల్ల కలిలో మంచి కూడా జరుగుతుందని ఉంచాడేమో! మన కంటికి హనుమ కనబడకపోవచ్చు. అతడంతటా వ్యాపించియే యున్నాడు. గరుడుడు, ఆదిశేషుడు, నంది, చండికేశ్వరుల వంటి భక్తులెందరో ఉన్నా హనుమను స్మరిస్తూ ఉంటాం.


అయితే ఎందుకూ పనికి రాని మన మధ్యలో ఉండడమా? అని ప్రశ్న. అక్కడే అతని గొప్పదనం దాగియుంది. ఇదంతా రాముడాడించే నాటకమని అతడు భావిస్తాడు. అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థాపించడమే అతడు చేసే పని. ఇదంతా రాముడే తనచేత చేయిస్తున్నాడని భావిస్తాడు. నాటకంలో వీర, ప్రతివీరులిద్దరూ కొట్టుకొంటున్నట్లు కన్పిస్తారు. నిజంగా కొట్టుకొంటున్నారా? అట్లా అధర్మంపై యుద్ధం చేసాడు.


అంతా రామమయమని భావిస్తే జీవితం కష్టమయంగా ఉండదు. అతడు సర్వాత్మనా ఉన్నాడని గట్టిగా భావిస్తే అదే మోక్షానికి దారి చూపిస్తుంది. 

Wednesday 12 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (19)



ప్రేమ, శాంతులే ఎల్లెడలా వెల్లివిరియాలని భావించాడు. మంచివి, నాశనమైపోతూ ఉంటే మనం నిర్లిప్తులమై ఉండడాన్ని అతడు సహిస్తాడా? ప్రేమతో, ఉత్సాహంతో చేసే పనులన్నిటినీ హర్షిస్తాడు. అనుగ్రహిస్తాడు.

 

అతడు, అజాడ్యాన్ని మనపై కురిపించుగాక.

 

అమరుడైన ఆంజనేయుడు

 

అతణ్ణి చిరంజీవిగా కీర్తిస్తాం. అయితే పాపపుపనులు చేస్తూ చాలాకాలం బ్రతికిన వాణ్ణి పాపీ చిరాయుః అని అంటాం కదా! ఇట్టివాడు బ్రతికిన కొద్దీ వయోభారంచే అనేక రోగాలు, ఇతరులపై ఆధారపడడం, తన కళ్లముందే తనకంటే చిన్నవారు చనిపోవడం చూస్తాడు.

 

అయితే చిరంజీవియైన హనుమను, రాముడు తనతో బాటు తీసికొని పోయాడా? పరమపదానికి తీసికొనిపోక ఈ లోకంలోనే ఎందుకుంచాడు? అయోధ్యా నగరవాసులందరూ రాముణ్ణి అనుగమించారు కదా. హనుమను పక్షపాతధోరణిలో చూడడమేమిటి?

Tuesday 11 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (18)



సముద్రాన్ని దాటేటపుడు సురస, సింహిక, లంకిణులు అడ్డుకోలేదా? సురసనోరు తెరవగా అందు చిన్న ప్రాణిలా ప్రవేశించి చెవి నుండి బయటకు రాలేదా? ఆమెను చంపగలడు. కాని స్వామికార్యం తొందర పెట్టడం వల్ల అది చేయలేదు. అది అజాడ్యం అంటే. దానికెంతో నిబ్బరముంచాలి.


మైనాకుడు సముద్రం నుండి లేచి విశ్రాంతి తీసికోవయ్యా అని ప్రార్థించినపుడు ముందు రామకార్యం చేయాలి. తరువాత చూద్దాంలే అనలేదా! ఇతని తోకకు నిప్పంటించినా పనిని మానాడా? ఎన్నో ఆటంకాలను గెంటివేసాడు.


ఇట్లా తన బుద్ధిని, బలాన్ని, ధైర్యాన్ని అజాడ్యాన్ని తన కోసం కాకుండా రామునికై వెచ్చించాడు.


అతడు బ్రహ్మచారి. సంసార బంధాలు లేవు. ముందు సుగ్రీవుణ్ణి, తరువాత రాముణ్ణి సేవించాడు. అతని నిస్స్వార్థబుద్ధి వల్లనే అతని గుణాలు రాణించాయి. చివరకు యశస్సు అనగా కీర్తి దక్కింది.


యశస్సు మినహాయించి మిగిలిన ఇతర లక్షణాలన్నీ రావణునకు, హిట్లరకూ ఉన్నాయి. వారు మంచిపనులు చేసారని యశస్సు లభించిందా? కనుక బలాదుల వల్ల యశస్సు రాదని గుర్తించండి. సంఘసేవలోనే యశస్సు.


సీతారాములిద్దరూ జ్ఞానోపదేశం చేసారు. సీతమ్మ ఏ ఉపదేశం ఇచ్చింది? ఎవరామె? సాక్షాత్తు పరదేవతయే కదా! ప్రేమతో ఉపదేశమిచ్చింది. రావణ వధానంతరం ఒక గంతువేసి సీతమ్మను బాధపెట్టిన రాక్షసస్త్రీలనందరినీ చంపుతానన్నాడు. అపరాధం చేయని వాడెవడైనా ఉన్నాడా? కావలసింది దయ. వారందరూ రాజాజ్ఞకు లోబడి అట్లా క్రూరంగా నాపట్ల ప్రవర్తించారు, వారి తప్పే ముంది? అని హనుమను సీతమ్మ వారించింది. విభీషణుడు రాజైతే వారే నాకు తిరిగి నమస్కరించరా అని పల్కింది.


అప్పటినుండి హనుమ దయామూర్తి అయ్యాడు. అయితే ఏదైనా చెడ్డపని జరిగినపుడు మాట్లాడకుండా ఉన్నాడని భావించకండి. పైపైన భీషణ వాక్యాలు పలికినా లోలోన ప్రేమ, దయలు తొణికిసలాడాయి.


Monday 10 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (17)



అట్లాగే మనం మంచి పనులు చేయుటకు ఉద్యుక్తులం కావాలి. ఆటంకాలు వచ్చేటప్పుడు, అంతా కలియుగమని, కలిపురుషుడు తాండవిస్తున్నాడని అంటాం. ఒంటబట్టని అద్వైతాన్ని, మాయాప్రభావాన్ని నిరాఘాటంగా వ్యక్తీకరిస్తూ ఉంటాం. శంకరులిట్లా మాటిమాటికీ కలి ప్రభావం గురించి మాట్లాడారా? ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసికొన్నారు. తీర్థయాత్రలు, గ్రంథ రచనలు, వాదాలు మొదలైన వెన్నో చేసారు. క్రియాశీలురెవరంటే ఒకడు ఆంజనేయుడు, మరొకరు శంకరులు. చిట్టచివరి దశలో క్రియారాహిత్యమే అచలత్వమే ఉండాలి. మన లక్ష్యం మనస్సు చంచలంగా లేకపోవడం, సంకల్పరహిత స్థితి. కాని మనం శరీరాన్ని మంచి వాటికై కదపడం లేదు. అందువల్ల మనస్సు నానాతిరుగుళ్లు తిరుగుతోంది. అలసిపోయి నిద్రలోకి జారుకొంటున్నాం. సద్వినియోగం లేదు.


చాలా మంది పారాయణలు, భజనలు, ఉపవాసాలు, దేవాలయ సందర్శనాలు మొదలుపెడతారు. క్రమక్రమంగా వీటిపట్ల మోజు సన్నగిల్లుతూ ఉంటుంది. ఒక ప్రణాళికను రూపొందించడం వల్ల ఒకనాడు సామూహిక పూజా విధానాలుండేవి. అవి నేడు మచ్చుకు కనబడడం లేదు. అయితే ఒక క్లబ్బును స్థాపిస్తే అది దినదిన ప్రవర్ధమానమౌతుంది. ఇట్లా అన్నిటిలో అజాడ్యం.


ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆంజనేయుడు డీలా పడ్డాడా? పుట్టీ పుట్టగానే పండనుకొని సూర్యుని దగ్గరకే వెళ్లాడు. అక్కడ ఇంద్రుడు అడ్డుకొనడం, వజ్రాయుధం ప్రయోగించడం, తుదకితని హనువు చిట్లింది. అందువల్ల హనుమ అయ్యాడు. అంతమాత్రంచే నిరుత్సాహపడ్డాడా? ఆ సూర్యుని దగ్గరే నవవ్యాకరణాలను అభ్యసించాడు. ఉదయాద్రి నుండి అస్తాద్రికి పయనించే సూర్యునికి అభిముఖంగా ఉండి నేర్చుకోలేదా? చిన్నపుడే ఋషుల ఆశ్రమాల దగ్గరకు వెళ్లి చిల్లరమల్లర పనులు చేసాడు. వారు తట్టుకోలేక నీ శక్తి, నీకు తెలియకుండా ఉండుగాక అని శపించారు. రామ కార్యం వచ్చినపుడే నీ శక్తి, నీకు తెలుస్తుందని శాపానుగ్రహం ప్రసాదించారు. సుగ్రీవుని దగ్గరకు చేరాడు. ఇక్కడా ఆటంకాలే. వాలి సుగ్రీవునిపై దండెత్తాడు. ఇతడూరుకోక, వాలి రాలేని ప్రదేశంలో సుగ్రీవుణ్ణి ఉంచాడు. రాముడు రాగానే తన శక్తిని గుర్తించాడు. సముద్ర తరణం - పర్వతాన్ని పెకలించడం - లంకాదహనం - ఒకటేమిటి ఎన్నో పనులను నిర్వహించాడు.


Sunday 9 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (16)



ఒక్కొక్కమాటు మనమనస్సు చాలా సోమరిపోతుతనంతో, ఉత్సాహం లేకుండా ఉంటుంది కదా. శక్తి - పదార్థాలలో శక్తి చైతన్యం. చిత్ నుండి చైతన్యం. అదే జీవనం; అదే బుద్ధి. జడం నుండి జాడ్యం. మానవ జీవితం చిత్-జడాలతో ఉంటుంది. (చిత్-జడగ్రంథి). ఇందు జీవం లేకపోతే (శివం) శవమే. ఈ జడమైన శరీరం, జీవంతో కలిసినపుడు జీవాత్మయని పిలువబడుతున్నాడు. అదే చిత్-జడగ్రంథి, శరీర భావన ఎప్పుడైతే అంతరించిందో అపుడు చిన్మయమే.


జడమైన శరీరంతో ఇది పనులలో ఎట్లా నిమగ్నం కావాలో చూద్దాం. పనులు చేసేటపుడు చురుకుగా ఉంటాం. జడంగా ఉండం. రాజకీయాలు, సినిమాలు, పిచ్చాపాటీ కబుర్లు, నవలలు, ఫలాహారశాలలు మొదలగు వాటి వల్ల మనకున్న శక్తిని ఖర్చుపెట్టడం వల్ల వృథా అయిపోయి సోమరిపోతులుగా మిగిలిపోతున్నాం. ఎవరైనా సైన్సు, ఆధునికమైన సదుపాయాలు సమకూర్చుకోవడం, సంఘసంస్కరణలు, హేతువాదం, విప్లవాలు మొదలగు వాటిని చర్చించేటప్పుడు చురుకుగానే ఉంటాం. కాని ధర్మం క్షీణించడాన్ని చూసి కూడా వాటిని పట్టించుకోము. అర్జునుడంత వానికే ఈ జాడ్యం పట్టుకొనినపుడు నపుంసకునిగా ప్రవర్తించవద్దని కృష్ణుడు హెచ్చరించాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ అన్నాడు. ఇట్లా ధార్మిక కృత్యాల పట్ల జాడ్యం లేకుండా చేయుమని ప్రార్థిద్దాం.


మనదేశంలో 64 కళలున్నాయి. సాంకేతిక విద్య మొదలైన వాటికి చెందినవి ఉన్నాయి. అట్టివి ఈనాడు ఆచరణలో లేకపోయినా కనీసం వాటిని రక్షించుకోవాలనే తపన లేని కాలంలో ఉన్నాం. ఇదే జాడ్యం. అనేక గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఉన్నవాటిని రక్షించుకోవాలనే తపన లేని కాలంలో ఉన్నాం. ఈ సందర్భంలో స్వామి మనకు అజాడ్యాన్ని కల్గించుగాక. ఆయన బుద్ధి, బలం కలబోసిన మూర్తి కదా! ఎప్పుడూ ఉత్సాహవంతుడే. కార్యనిమగ్నుడే. అతని విగ్రహాలనుగాని, చిత్తరువులనుగాని చూస్తే తేటతెల్లమౌతుంది. పర్వతాన్ని మోసినట్లు, ఆకాశంలో సంచరిస్తున్నట్లు కనబడతాడు. సోమరితనం సున్న. అలసటలేదు. ధర్మంకోసం తపన. ఏ ఆటంకము వచ్చినా దాటుతూ ఉంటాడు. నెరవేరవలసినదానిని ఏమరుపాటు లేకుండా నిర్వహిస్తూనే ఉంటాడు.

Saturday 8 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (15)



ఎంత బుద్ధిమంతుడైనా, ఎంతగా ఇంద్రియాలను జయించినా అంతకంటే అతడు రామభక్తునిగా, రామదాసుగా ప్రసిద్ధుడు. భక్తిమంతులలోనూ వరిష్ఠుడే. దూతకు అన్ని లక్షణాలూ ఉండాలి. అందుకే అప్పజెప్పిన పనిని ఆనందంతో నిర్వహించి సీతారాముల దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీ రామదూతం శిరసానమామి.


మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 

వాతాత్మజం వానర యూధ ముఖ్యం 

శ్రీరామదూతం శిరసా నమామి


అంజనానందనుడు అజాడ్యాన్ని ప్రసాదించుగాక


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా 

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్


ఎందుకు హనుమను ప్రార్థించాలో పై శ్లోకం వివరిస్తోంది. దేనికైనా ముందు బుద్ధి కావాలి కదా! బలమనగా శారీరక బలం కావాలి. తరువాత వచ్చేది కీర్తి. ధైర్యం నిర్భయత్వం = భయంలేకపోవుట. నిర్భయత్వంలోనే ధైర్యం ఇమిడియుంది. నిర్భయత్వమని విడిగా ఎందుకున్నారు? ధైర్యానికి చాలా అర్థాలున్నాయి. నిశ్చయం, శాంతమనస్కత, మొదలైనవి కూడా. ధైర్యంలోకి వస్తాయి. ఆంజనేయుణ్ణి కొలవడం వల్ల ధైర్యం వస్తుంది. ఇతరులితనిని చూసి భయపడకుండుట నిర్భయత్వం. అభయత్వం. ఇది సన్యాసి దీక్ష తీసికొనేటపుడు ఉంటుంది. అరోగతా = రోగం లేకపోవుట; అజాడ్యం = జడత్వం లేకపోవుట. వాక్పటుత్వం = బాగా మాట్లాడు నేర్పు. వాల్మీకి, కంబడు ఇతని వక్త్రృత్వాన్ని మెచ్చుకొన్నారు.


అనగా ఈ ఏడు కావాలి. మనకెవ్వరూ చెప్పకుండా మనం వీటిని కోరాలి. ఎనిమిదవది అజాడ్యం. శ్లోకంలో ఇది ఏడవది. దీనికై ఎందుకు ప్రార్థించాలి? పనులు చక్కబెట్టుకోవాలంటే జడత్వం పనికిరాదు. కనుక అజాడ్యమన్నారు. అంటే అర్థమేమిటి?


Friday 7 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (14)



శ్లోకంలో ముందుభాగమేమిటి? అందేముంది? వాయువేగం, మనోవేగమని చెప్పాడు. ఈ రెంటి వేగాలున్నవాడు. అంటే ఇతని ఇంద్రియాలు, మనస్సు వేగంగా తిరుగుతున్నాయని కాదు.


మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 



ఇతనిలో మనోజవం, మారుతతుల్యవేగం రెండూ ఉన్నాయి. జవం అనగా వేగం. మారుతం గాలి. మంద మారుతం అంటాం. మారుతం యొక్క కుమారుడు మారుతి. భజనలలో వీరమారుతి, గంభీర మారుతి అని భజన చేస్తాం కదా.


కదిలే మనస్సు, కదిలే వాయువు వంటి వేగ సంపన్నుడైనా వాయు తనయుడే. వాతాత్మజుడే. ఆపైన వానర యూధ ముఖ్యుడు కూడా. ఇంకా ఏమని నుతిస్తున్నాం?


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం


అంటే ఇంద్రియాలను జయించినవాడు. అంతేకాదు, ఆరవ ఇంద్రియమైన మనస్సునూ జయించినవాడు. అనగా కదిలే దానినీ.


అందువల్ల బుద్ధిమంతుడయ్యాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడయ్యాడని 'బుద్ధిమతాం వరిష్ఠం'. బుద్ధి, మనస్సునకు లంగరు వేస్తుంది. మనస్సునకు పైన ఉండేది, నియమించేది బుద్ధి. అందువల్ల జితేంద్రియుడై బుద్ధిమతాం వరిష్ఠుడయ్యాడు.


బుద్ధిమంతుడంటే సరిపోదు. అతని కంటే పైవాడు, బుద్ధిమతాం వర అంతకంటే గొప్పవాడు బుద్ధి మతాం వరిష్ఠుడు. ఇద్దరుంటే అందొకర్ని వరీయ అంటాం. ఇంతకంటే గొప్పవాడు లేడన్నపుడు బుద్ధిమతాం వరిష్ఠుడని అంటాం. అంటే అతనితో ఎవ్వర్నీ పోల్చలేమన్నమాట.


జ్ఞానులలో (బ్రహ్మవిత్, బ్రహ్మ విద్వర, బ్రహ్మవిద్వరీయ. బ్రహ్మవిద్వరిష్టుడని అంటాం. అట్లా ఇతడు బుద్ధిమతాంవరిష్ఠుడు.

Thursday 6 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (13)



అయినా చేతులతో అనేక ఘనకార్యాలు చేసాడు. రామధాన్యంలో మనస్సు నిశ్చలంగా ఉంటుంది. రామకార్యాలపై శరీరం చురుకుగా పనిచేస్తుంది. 


ఎట్లా? వాయువేగ, మనోవేగాలతో వెడతాడు. పంచభూతాలలో వేగంగా కదిలేది గాలి, ఇంద్రియాలలో మనస్సుకంటే వేగంగా వెళ్లేది ఏదీ లేదు.


నా మనస్సు గాలి మాదిరిగా చంచలంగా ఉంది, కృష్ణా, గాలినెట్లా బంధించలేమో దీనిని అట్లా బంధించలేకపోతున్నానని వాపోయాడు అర్జునుడు: 


చంచలంహి మనఃకృష్ణ వాయోరివ సుదుష్కరం


గాలిలేని చోట దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో యోగి మనస్సు అట్లా ఉంటుందని గీతలో అన్నాడు.


యథాదీపో నివాతస్థో నేంగతే సోపామా


నివాతం అనగా గాలి లేక పోవుట, వాతమనగా గాలి, వాతం, వాయువు ఒక్కటే. వాతరోగం అని అంటాం వాడుకలో.


ఎవరీ ఆంజనేయస్వామి? ఒక కపి, వాయునందనుడు కూడా. వాయు కుమారుడగుటచే వాతాత్మజుడు.


వాతాత్మజం వానరయూధముఖ్యం

శ్రీరామ దూతం శిరసా నమామి.


యూధమనగా గుంపు. వానరుల గుంపునకు ముఖ్యుడగుటచే వానరయూధ ముఖ్యుడయ్యాడు.

Wednesday 5 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (12)



మారుతి గొప్పదనం


'కోతి బుద్ధిరా' అంటూ ఉంటాం. కోతి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మపై దుముకుతుంది. కొద్ది క్షణాలు కూడా నిలకడగా ఉండలేదు. అట్లాగే అస్తిమితమైన మనస్సు కలవారిని అట్లా అంటాం.


హృదయకపిమత్యంత చపలం అని శంకరులన్నారు. పరమేశ్వరా! చంచలమైన ఈ కోతిని భక్తియనే త్రాటితో కట్టవయ్యా అని అన్నారు. దానిని తీసికొని పోయి ఆటలాడించి పొట్టపోసికో అని సరదాగా అన్నారు. చేతిలో కపాలం ధరించి బిచ్చమెత్తుకోవడం కంటే ఈ కోతితో ఆటలాడించి పొట్టపోసుకోవయ్యా, అంటూ 'హృదయ కపి'యని వాడారు.


పాశ్చాత్యులు కూడా మంకీ మైండ్ అంటారు. కోతి శరీరం, బుద్ధి, నిరంతరం కదులుతూనే ఉంటాయి.

ఆవుగాని, ఏనుగుగాని మాంసం తినకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆకలితో నున్న పులిగడ్డి మేయదని అంటారు. ఒకవేళ అది శాకాహారంతో ఉంటే ఆశ్చర్యపోతాం. 


ఆంజనేయుడు కపియై చంచల మనస్సుతో నున్న శరీరాన్ని ధరించాడు. కాని అతడింద్రియాలను, మనస్సును నిగ్రహించాడు. తన శరీరాన్ని, మనస్సును రామునకర్పించాడు. అక్కడే అతని గొప్పదనం దాగియుంది.


అయితే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడానికి ఏ అరణ్యంలోనో తపస్సు చేసికొంటూకాలం గడిపాడా? ఎవరైనా ఏకాంతస్థలానికి వెళ్లి మనస్సును నియమించడానికి ప్రయత్నం చేయవచ్చు. అట్లాచేయక అందరి మధ్య ఉంటూ అన్ని పనులనూ చక్కబెట్టాడు. అసాధ్యసాధకుడయ్యాడు. సముద్రాన్ని దాటడం, సంజీవనీ పర్వతాన్ని తేవడం, లంకాదహనం మొదలైనవన్నీ మామూలు వ్యక్తులు చేయగలరా?


అయితే అతని మనస్సును ఎక్కడ ఉంచాడు? రాముని పాదపద్మాలపై.


Tuesday 4 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (11)



రామాయణం సగం పూర్తయ్యే వరకూ హనుమ ఎవ్వరో తెలియదు. కిష్కింధకాండలో వస్తాడు. అప్పటినుండి నాయకుని కంటే ఇతనికే అధిక ప్రాధాన్యం వచ్చింది. తరువాత సుందరకాండ అంతా ఇతని వీర విహారమే. పారాయణ చేయవలసి వస్తే దానినే చేస్తారుగాని మిగతా కాండలను చేయరు. కదా! రామాయణ రథాన్ని నడుపుమని రాముడు, హనుమతో అన్నాడు. సీతా సమక్షంలో రామనామాన్ని జపించడం వల్ల సీత రక్షింపబడింది. రామనామం వల్లనే సముద్రాన్ని దాటగలిగాడు. లంకకు వెళ్లడం కష్టం. కాబట్టి సేతువును కట్టవలసి వచ్చింది.


ఏది చేసినా తాను చేసానని హనుమ, ఎన్నడూ భావించలేదు. ఇదంతా సీతారాముల కరుణ వల్లనే అనేవాడు. సముద్రం దాటడాన్ని లోకం ప్రశంసించింది. కాని తారక నామం వల్లనే కదా! ఆమె శోకాగ్ని లంకను దహించలేదా? అని భావించాడు. వాళ్ల పనులు తాను చేసినా వారి నామ ప్రభావం వల్లనే చేయగలిగానని మనసా భావించే వాడు. వారి ఋణం తాను తీర్చుకోలేనని బాధపడ్డాడు. చూసారా? అతని వినయాన్ని, మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఎంతో ఉపకారం చేసాం. ఒక్కడూ కన్నెత్తి చూడడు, పన్నెత్తి మాట్లాడడని అనుకొంటాం. కాని సీతారాములు హనుమవల్ల; హనుమ సీతారాముల వల్ల బలాన్ని పుంజుకొన్నానని భావించడాన్ని గమనించారా? ఆంజనేయుని ఋణం తీర్చుకోలేకపోయామనే బాధపడ్డారు, సీతారాములు.


రామాయణం నుండి నేర్చుకోవలసిన నీతి ఇది. తనకు బలం రామునివల్ల అని హనుమ భావించగా అతనికి వినయమే అతనికి బలాన్నిచ్చింది. బలం, వినయం సాధారణంగా కలిసియుండవు, రెండూ ఇతనిలో ఉన్నాయి. మనలో రెండూ లేవు సరికదా, మాటి మాటికీ అహంకరిస్తూ ఉంటాం కూడా. హనుమ అట్టి వాటిని ప్రసాదించుగాక. 


Monday 3 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (10)



ఋష్యమూక పర్వతంలో మొదటిసారి రాముడు హనుమను చూసినపుడు మిగిలిన కథనంతా హనుమయే నిర్వహిస్తాడని భావించాడు. హనుమంతుని సాయమున్నా సుగ్రీవుని భార్యను వాలి అపహరించుకొని పోయిన కాలమది. వాలిని ఓడించడానికి తగిన సాహాయ్య సంపత్తి రామునకుందో లేదో పరీక్షించి చూడుమని హనుమను దూతగా పంపాడు సుగ్రీవుడు. ఆ సందర్భంలో హనుమ, తనకుపకరిస్తాడని రాముడు భావించాడు. ఈ నాటకాన్ని నడిపేవాడు. రాముడే కదా!


మీరెవరని తెలిసికొనే సందర్భంలోని మాటలను బట్టి హనుమ యొక్క గొప్పదనాన్ని ఊహించాడు. ఇతడు మహావిద్వాంసుడు, గొప్ప వక్తయని గ్రహించాడు. బాగా మాట్లాడడమే కాదు, అనంత శక్తి సంపన్నుడని గ్రహించాడు. ప్రపంచం ఒక రథమైతే ఇతడు దానికి ఇరుసువంటి వాడని ఒకనాడు తెలిసికొంటామని రాముడే అన్నాడు.


ఋషిశాపం వల్ల హనుమకు తన శక్తి తెలియని కాలమది. అందువల్లనే ఇతని సాయమున్నా రాజ్యాన్ని, సుగ్రీవుడు భార్యను పోగొట్టుకొన్నాడు. అనతికాలంలో జాంబవంతుడు ఈ లోపాన్ని గుర్తించి హనుమకు తన శక్తిని తెలుసుకొనే వానిగా తీర్చిదిద్దుతాడని, హనుమ సముద్రాన్ని దాటుతాడని, లంకను దహిస్తాడని రామునకు తెలుసు. కొంతకాలం తరువాత ఇతని శక్తియుక్తులను తెలిసికొంటారని లక్ష్మణునితో అన్నాడు రాముడు.

రామాయణమే ఒక ప్రపంచం వంటిది. ఏడు కాండలతోనున్న రామాయణ రథం ఆగే సందర్భంలో సీతాపహరణం, ఆమె ఎక్కడుందో తెలియక పోవడం జరిగింది. హనుమను చూడడంతోటే రామాయణ రథానికి అతణ్ణి ఇరుసుగా భావించాడు. మరల రథం తిరగడం మొదలుపెట్టింది. సుగ్రీవుడు, వాలితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తరువాత వాలి సంహారం, వానరులు సీతాన్వేషణకు బయలుదేరటం, సేతు నిర్మాణం, రామరావణ యుద్ధం, తరువాత పట్టాభిషేకం చకచకా సాగిపోయాయి. అన్నింటిలో హనుమపాత్ర గణనీయం.

Sunday 2 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (09)



సీత ఎక్కడుందో రామునికి చెప్పడమే హనుమ చేసిన ఉపకారం. సీత ప్రాణత్యాగం చేసే సమయంలో రక్షించాడు. వారి వారి శక్తులను పోగొట్టుకొనే దశలో తిరిగి వారి వారి శక్తిని ప్రసాదించాడు.


ఇట్లా రెండు పనులెట్లా చేయగలిగాడు? ఇది రామనామ బలం వల్లనే.


ఎట్లా సముద్రాన్ని దాటగలిగాడు? రామనామం వల్లనే. సీతనెట్లా రక్షించగలిగాడు? ప్రాణత్యాగం చేసే సమయంలో ఆమె కాళ్ల మీదపడి, చేయవద్దని బ్రతిమాలాడితే మానివేస్తుందా? రావణుడే, ఈ వేషంలో వచ్చాడని భావించదా? మారీచుని నడవడికను చూసిన తరువాత అంతా రాక్షస మయంగా కన్పిస్తోంది కదా! ఆంజనేయుడు, బ్రహ్మచారి కావడంచే ఇతరుల మనస్సులను గ్రహించగలడు. ఆ దశలో ఏం చేసాడు? అప్పుడు రామనామాన్ని జపించాడు. రామనామం ఉచ్చరించిన వెంటనే రాక్షసమాయ, మటుమాయం కాదా? ఆమె శోకాగ్నిని రామ నామ ఉచ్చారణవల్ల కొంత తగ్గించగలిగాడు. అందువల్లనే ఆమె కరుణించడం వల్ల అగ్ని ఏమీ చేయలేకపోయింది ఇతనిని.


మేము ఆంజనేయుని ద్వారా రక్షింపబడినామని సీతారాములిద్దరూ అన్నారు. సంజీవనిని తీసికొని రావడం వల్ల లక్ష్మణుని ప్రాణము రక్షింపబడిందని అన్నారు. ఏ విధంగా ఇతని ఋణాన్ని తీర్చుకోగలనని సీతమ్మ నిరంతరం చింతిస్తూ ఉండేది.  

అయితే వారేమిచేసారో చూద్దాం. అయోధ్యలో రామపట్టాభిషేకం జరిగే సందర్భంలో రాముడెందరికో కానుకలనిచ్చాడు. సీతకు ముత్యాలహారమిచ్చాడు.

సీత అది గ్రహించి చేతిలో పెట్టుకొని రాముని వైపు చూసింది. వారి శరీరాలు భిన్నంగా ఉన్నా ఆలోచన ఒకటే కదా! అంజనేయుణ్ణి సత్కరించాలని భావించారు.


సీత యొక్క చూపుతోనే రాముడు గ్రహించి ఈ హారాన్ని హనుమకిద్దామని భావించాడు. బుద్ధి, వినయం, సాహసం, కలిగిన వానికి ఇమ్మన్నాడు. పేరు చెప్పలేదు. సీత గ్రహించి, హనుమకిచ్చింది.


ఇద్దరూ కలిసి ఈ సత్కారం చేసారు. ఆ హారం హనుమ శరీరంపై మేఘాలు చంద్రకాంతితో పర్వతాన్ని ఆక్రమించినట్లుందిట.

Saturday 1 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (08)

జానకీశోకనాశనం 


అంజనానందనం వీరం జానకీ శోకనాశనం


అంజన అనే వానర స్త్రీకి పుట్టాడు. జన్మించి తల్లికి ఆనందాన్ని కల్గించాడు. అదేమంత గొప్పది కాదు. అందుకే కొడుకును నందనుడని పిలుస్తారు. ఆంజనేయుడు, అంజనా నందనుడు. దశరథనందనుడన్నట్లు, దేవకీనందను దన్నట్లుగా మన స్వామి, ఒక్క తల్లికేకాదు, తల్లులందరికీ తల్లియైన సీతమ్మ యొక్క శోకాన్ని పోగొట్టాడు. అందుకే అతణ్ణి కీర్తిస్తాం.


దుఃఖాగ్నిచే సీత, దహింపబడుతోంది. హనుమతోకను, రావణుడు నిప్పుపెట్టించాడని వింది. అసలు అగ్ని, లంకను కాల్చిందా? ఆ అగ్నికి మరొక అగ్నిని జోడించాడు హనుమ. అదే సీత యొక్క శోకాగ్ని, (శోకాగ్నికే మామూలు అగ్నిని చేర్చాడందాం)



యఃశోకవహ్నిం జనకాత్మజాయాః


ఆదాయతేనైవ దదాహ లంకాం


జనకాత్మజయనగా జానకి. శోకమనే నిప్పుతో ఉంది. 'శోకవహ్నిం'. ఆమె ఉంచబడినది, అశోకవనం లోపల. ఆమె లోపల ఉంది శోకవహ్ని. తేనైవ దానివల్ల; లంకాందదాహ = శోకాగ్నిచే లంకను కాల్చెను.


తోకకు నిప్పంటించినా తోక కాలలేదు. సీతానుగ్రహం వల్లనే అది కాలలేదు. అయితే లంక అంతా కాలడానికి సీతా శోకాగ్ని కారణమైనా, హనుమతోక చివరగానున్న అగ్నియే కాల్చిందని రావణుడు భ్రాంతి పడ్డాడు. తోకకు నిప్పంటించాలనే ఊహ రావణునకెట్లా వచ్చింది? ఈ ఊహ రావడానికి ముందే సీత యొక్క శోకాగ్ని చల్లారక అందువల్ల ఆమె బాధపడుతూ ఉంటే ప్రపంచమే భరించలేకపోయింది. అట్టిది కొంత ఖర్చు పెట్టబడాలి. ఎవరో ఒకరు ఆ శోకాగ్ని యొక్క తీవ్రతను సహించవలసి వస్తుంది. ఎవరు భరించగలరు? ఆంజనేయుడు తప్ప ఇతరులెవ్వరూ ఆ అగ్ని తీవ్రతను తట్టుకోలేరు. రావణుడితనిని శిక్షించాలని అనుకొన్నప్పుడు ఈ ఊహ తట్టి తోకకు నిప్పు పెట్టండని అన్నాడు. అదీ ఈశ్వర సంకల్పమే. అందువల్ల సీత యొక్క శోకాగ్నిని గ్రహించి దానితో లంకను కాల్చాడు. అది దుష్టులను కాల్చింది కాని శిష్ఠులను కాల్చలేదని గుర్తించండి. అందువల్లనే శోకాగ్ని, హనుమను కాల్చలేదు.