Thursday 30 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 117 వ భాగం



శరీరాన్నే ఆత్మయని భావించడం జీవాత్మ భావం. ఇది అనేక వాసనలతో కూడి యుంటుంది. అట్టి దానిని మట్టుబెట్టడం మాటలు కాదు. అట్టి దానిని కూడా కేవలం దీపాన్ని ఊదినట్లు పోగొట్టడం నిర్వాణం. అట్టి భావం పొందాలంటే ఎంతో సాధన ఉండాలి. భగవదనుగ్రహమూ ఉండాలి.


బుద్ధుడే ఈ నిర్వాణాన్ని గురించి మొదట చెప్పాడనడం అసంగతం. అంతకుముందే ఈ ముక్త స్థితిని మన గ్రంథాలు నిర్వాణమని అన్నాయి. గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలను చెపుతూ 'బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి' అన్నాడు. సన్న్యాస యోగంలో తన యందే క్రీడించువాడు, సుఖించువాడు, లోచూపు కలవాడైన యోగి, బ్రహ్మ స్వరూపుడై, బ్రహ్మ నిర్వాణాన్ని (బ్రహ్మానందాన్ని) పొందుతున్నాడని చెప్పాడు. (గీత. 5-24)


"యోఽంతస్సుఖః అంతరారామః తథా అంతర్ జ్యోతి రేవయః 

సయోగీ, బ్రహ్మనిర్వాణం, బ్రహ్మభూతోఽధి గచ్ఛతి 


బుద్ధుడు, నిర్వాణాన్ని గూర్చి చెప్పాడు. అంతకుముందు భగవానుడు, బ్రహ్మ నిర్వాణాన్ని గురించి చెప్పాడు. బుద్ధుడు, జీవాత్మ భావం పోతుందని, అదే శూన్యస్థితియని చెప్పగా జీవాత్మ భావం పోవడమే కాదు, బ్రహ్మమే అవుతాడని భగవానుడన్నాడు.


శుకుడు, దిగంబరుడని చెబితే పవిత్ర స్థితిలో నున్నాడని, స్త్రీ పురుష భేదం లేకుండా ఉన్నాడని, భేద భావం కలిగినవారు కూడా ఇతని సన్నిధిలో అట్టి భావం కల్గియుంటారని అర్థం.


శుకుడు, ఇంటినుండి నగ్నంగా వెళ్ళిపోతూ ఉండగా నగ్నంగా స్నానం చేసే స్త్రీలు ఇతనిని చూసినపుడు సిగ్గు పడలేదు. తరువాత పుత్ర అని ఆక్రోశిస్తూ వ్యాసుడు వచ్చాడు. జింక చర్మాన్నో, చెట్ల బెరడునో కట్టుకొన్నా ఆయనను చూసి సిగ్గుపడి స్త్రీలు తమ శరీరాన్ని కప్పుకున్నారట.


నేను ముసలివాణ్ణి కదా! ఏమిటీ సిగ్గని వ్యాసుడు ప్రశ్నించాడు. వయస్సుకేమి? అతని పవిత్రత చూసి ఆశ్చర్య చకితులమయ్యాము, మాకూ అతనికీ భేదం కనబడలేదని సమాధానం ఇచ్చారట. అట్టి శుకుని వంటివారికి నియమాలుండవు.


Wednesday 29 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 116 వ భాగం



ఇక చంద్రశర్మ, జ్ఞానోపదేశం పొందడానికి మహాభాష్యం అందించిన గురువు కోసం వెదకడం మొదలు పెట్టాడు. తన విద్యా గురువయిన గౌడుడు శుకుడి దగ్గర సన్న్యాసం తీసుకొని హిమాలయాల్లో ఉన్నాడని తెలిసి సమీపించాడు. ఇపుడు విద్యాగురువే సన్న్యాసి గురువైనాడు. దీక్షానంతరం, చంద్రశర్మ గోవింద భగవత్పాదులయ్యాడు. జగద్గురువైన కృష్ణుని ఉన్న నామాల్లో గోవిందుడొకటి. ఆచార్యుల గురువు గోవింద భగవత్పాదుల పేరులో కూడా గోవింద నామం ఉంది. అందుచేత ఆచార్యులకు గోవిందనామం అంటే ప్రీతి. అందుకే భజగోవింద స్తోత్రంలో శంకరులు భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం అని మూడుసార్లు అన్నారు.


గురు పరంపరంలో సన్న్యాసులు


నారాయణుని నుండి శుకుని వరకూ ఎవ్వరూ సన్న్యాసి గురువులు కారు. కాషాయం, ముండనాదులు లేవు. నారాయణుడు, బ్రహ్మ, దేవతలకు ఆశ్రమాలుండవు. ఇక వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు ఋషులే. కాని వీరిని కేవలం మనుష్య జాతిగా పరిగణించం. వీరు మంత్రద్రష్టలు. కనుక మానవాతీతులు. దేవతలకూ, మనుష్యులకు వీరు మధ్యనుంటారు. కనుక వీరు సన్న్యాసులు కారు. ఆత్మసిద్ధిని పొందిన వారు. శుకుడు, శిరో ముండితుడని చెప్పబడలేదు. ఆయన అవధూత లేక దిగంబరుడు.


దిక్కులే అంబరంగా అనగా బట్టగా ఉన్నవాడు. కనుక దిగంబరుడు. వస్త్రాన్ని విడిచి పెడితే శరీరం చుట్టూ దిక్కులే యుంటాయి. అట్టివాడు శుకుడు.


నిర్వాణం


గాలిని ఊది దీపం ఆర్పడాన్ని నిర్వాణం అంటారు. అగ్నికి ఉన్న శక్తి నీటికీ, గాలికీ కూడా లేదు. ఒక నిప్పురవ్వ మొత్తం అంతా కాల్చగలదు. అట్టిదానిని కేవలం రూపు లేకుండా చేయవచ్చు.


Tuesday 28 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 115 వ భాగం



ఇతని ధ్యాస, భాష్యాన్ని నల్గురికీ అందించాలనే తప్ప వివాహం చేసుకోవాలని లేదు. తప్పని సరి పరిస్థితులలోనే అట్టి వివాహాలుండడం వల్ల, ఇతని కట్టి కోరిక లేకపోవడం వల్ల వివాహమాడనని అన్నాడు. 


నీ ప్రాణాన్ని నిలబెట్టింది మా అమ్మాయి. తిరస్కరించడం సబబు కాదు, మేము అడగడంలో తప్పు లేదు, రాజుగారి దగ్గరకు వెడదాం పద అని వర్తకుడన్నాడు.


రాజు, చంద్ర శర్మ రూపాన్ని చూసి అంత విజ్ఞానవంతుడికి తన కూతురు నిద్దామనుకున్నాడు. ధర్మశాస్త్రం అంగీకరిస్తుందో లేదో అని మంత్రికి కబురు పెట్టాడు.


బ్రహ్మతేజస్సు గల బ్రాహ్మణులు చతుర్వర్ణాల కన్యలను వివాహమాడవచ్చని శాస్త్ర సమ్మతమని, మంత్రి చెబుతూ తన కుమార్తెను కూడా చంద్రవర్మకు ఇవ్వాలనుకుంటున్నన్నాడు. అందర్నీ వివాహమాడడం భగవత్ సంకల్పంగా భావించి రాజు సరే అన్నాడు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కన్యలు అప్పటికే ఉన్నారు. గనక చివరకు సేవ చేసే శూద్ర వనితను చంద్రశర్మ వివాహమాడ వలసి వచ్చింది.


అందరికీ సంతానం కలిగింది. వీరందరికీ భాష్యాన్ని అందించాడు చంద్రశర్మ.


అసలు మామూలుగా జరిగే వివాహాలలో మొదటి సంతానాన్ని ధర్మజుడని, మిగిలిన పిల్లలను కామజులని అంటారు. కనుక జ్యేష్ఠ కుమారునకే కర్మ చేసే అధికారం ప్రాప్తిస్తుంది. నంబూద్రి బ్రాహ్మణులలో పెద్ద పిల్లవానికే ఆస్తి చెందడం ఉండేది. అట్లాగే రాజ్యాధికారం పెద్ద కుర్రవానికే ప్రాప్తించేది. 

Monday 27 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 114 వ భాగం



అందువల్ల చంద్రశర్మగా అవతరించాడు. ఇప్పుడు శిష్యునికే (గౌడునకు) శిష్యుడయ్యాడన్నమాట. మానవునిగా అవతరించాడు కనుక ఒక గురువును సమీపించి రావి ఆకులపై మరల భాష్యాన్ని వ్రాయవలసి వచ్చింది.


వాటిని ఒక మూట కట్టి నిద్రిస్తూ ఉండగా కొంత భాగాన్ని ఒక మేక నమిలి వేసింది. అది తినిన భాగాన్ని 'అజభక్షిత భాష్యం' అంటారు.


మిగిలిన భాగాన్ని రక్షించి ప్రయాణం చేస్తూ ఉజ్జయిని వచ్చాడు. ఒక వర్తకుని ఇంటి అరుగు మీద కునుకు తీసాడు. అన్ని రోజుల అలసట వల్ల రక్తం పోవడం వల్లా రోజులకొద్దీ నిద్రలో మునిగిపోయాడు. ఆ వర్తకునికి ఒక కూతురుంది. ఇతడు నిద్ర నుండి లేపినా లేవడం లేదు. ఆకలితో మరణిస్తాడని పెరుగన్నం ఒంటినిండా పూసి రుద్దింది. ఆసారమైనా ఒంటబడుతుందని అట్లా చేసింది. కొంత కాలం గడవగా మెళకువ వచ్చి ఆ మూటను చంకన బెట్టుకుని ప్రయాణమయ్యాడు.


ఏమయ్యా! అట్లా వెళ్ళిపోవడం బాగుందా? నీ ప్రాణాన్ని నిలిపిన నా కూతురునిచ్చి నీకు వివాహం చేద్దామనుకుంటున్నానని వర్తకుడన్నాడు.


బ్రాహ్మణుడు వైశ్య కన్యను వివాహమాడడమేమిటి? అది ఈనాటి మాట కాదు. ఏనాటి కాలమో అది శంకరుల కాలానికే ముందు జరిగిన కథ. వారెన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారో మనకు తెలియదు కదా! పూర్వయుగాలలో అట్టి వివాహాలుండేవి.


మంట పెద్దదైతే నీటిని చల్లినా ఆరిపోదు. తక్కువ మంట మీద పోస్తే ఇట్టే ఆరిపోతుంది. అట్లాగే బ్రహ్మ తేజస్సంపన్నులైన వారు చేసిన పనులకు దోషం అంటదు కూడా. అట్టివారికి పిల్లలనీయడానికి మిగిలిన వర్ణాలవారూ ముందుకు వచ్చేవారు. ఇట్టివారు కలిలో లేరు కనుక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వర్ణాల స్త్రీని వివాహమాడాలని అన్నారు. కాని చంద్రశర్మ కాలంలో మిగిలిన వర్ణాల స్త్రీలను వివాహమాడడం ఉండేది.


Sunday 26 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 113 వ భాగం



శంకరుల స్తుతి


శంకరులు, గౌడపాదుని కారికలపై భాష్యం వ్రాసారు. ఆ గ్రంథం చివర సంసార సముద్రంలో చిక్కుకొన్న సామాన్యులకు, దేవతలకు కూడా దుర్లభమైన జ్ఞానా మృతాన్ని దయతో పంచి పెట్టారని నుతించారు. పరమ గురువులను పూజ్యులకు పూజ్యునిగా, మహాపూజ్యునిగా కీర్తించారు.


"పూజ్యాపి పూజ్యం పరమగురు మముం పాదపాతైర్నతోఽస్మి" అని అన్నారు.


జ్ఞాన సముద్రాన్ని మధించి గౌడపాదులు అద్వైతామృతాన్ని అందించారని పేర్కొన్నారు.


గోవిందుని పేరు చివర, శంకరుల పేరు చివర భగవత్పాదులని ఉంటుంది. గౌడపాదులనేది వ్యవహారం. అది పూజ్యపాదకం. ఇక చంద్రశర్మ, శంకరుల గురువైన గోవింద భగవత్పాదులెట్లా అయ్యారు?


చంద్రశర్మ వృత్తాంతం


పూర్వ జన్మలో చంద్రశర్మ, పతంజలియే. గౌడుని బ్రహ్మరాక్షసునిగా పతంజలి శపించాడు. కాని తానందించిన భాష్యం లోకంలో ప్రచారం కావాలి.


Saturday 25 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 112 వ భాగం



ఇది కేవలం, మాయ యొక్క ఊసెత్తని అద్వైత గ్రంథం, మొదటి భాగాన్ని ఆగమ ప్రకరణ మంటారు. మొత్తం గ్రంథాన్ని ఆగమశాస్త్రమంటారు. మామూలుగా ఆగమశాస్త్రం అంటే, దేవాలయ పూజాదులకు సంబంధించింది. కాని ఇది మాత్రం, అద్వైత వేదాంతానికి సంబంధించింది.


ఈ గ్రంథంలో మాయా ప్రస్తావన లేకపోయినా గౌడపాదుడు అమ్మవారి భక్తుడు కనుక ఆమెను బ్రహ్మ విద్యా స్వరూపిణిగా, మాయా స్వరూపిణిగా భావించాడు. సుభగోదయం అనే శ్రీవిద్యా తంత్రగ్రంథాన్ని రచించాడు.


జ్ఞానము భక్తి


కర్మ భక్తి మార్గాలలో పరిపక్వత గడిస్తే ద్వైత ప్రపంచం మాయగా భావించి జ్ఞాన మార్గంలో అడుగిడినపుడు ఇక ఈశ్వరుని భజించడం ఉండదు. జగత్తును మాయగానే భావిస్తాడు. మరొక రీతిలో ఈశ్వరుని పట్ల భక్తిని చూపిస్తాడు. తాను నిర్గుణుడని తెలిసినపుడు సగుణంలో ఉన్న ఈశ్వర లీలలను చూసి వినోదిస్తాడు, ప్రార్థిస్తాడు. ఆ స్థితిలో ప్రాణుల పట్ల అనుకంపను చూపించి, భక్తునిగా ప్రవర్తిస్తూ ప్రజల బాగుకోసం స్తోత్రాలు వ్రాస్తాడు. పఠిస్తాడు.


శుకుడే భాగవతోపదేశం చేయలేదా? శంకరులట్టి దశలో స్తోత్రాలు వ్రాయలేదా?


గోవా దగ్గర శిరోదా అనే ప్రాంతంలో గౌడపాదాచార్య మఠం ఉంది. గౌడసారస్వత బ్రాహ్మణులు, ఈ మతానుయాయులు. ఇట్లా ఈ నర్మదా ప్రాంతం, జాతీయ సమైక్యానికి తోడ్పడింది. గౌడుడు, బెంగాల్ నకు చెందగా, శంకరులు ద్రవిడ దేశానికి చెందగా గోవింద భగవత్పాదులు కాశ్మీరునకు చెందిన సారస్వత బ్రాహ్మణుడు. ఇట్లా నర్మదా ప్రాంతం అందరికీ కూడలిగా మారింది.


Friday 24 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 111 వ భాగం




ఆంగ్లంలో But ని Cutని ఒక విధంగా ఉచ్చరిస్తారు. అట్లాగే Putని పుట్ అనాలి గాని బట్, కట్ గా పట్ అనకూడదు. అట్లాగే పైది కూడా.

ఒకనాడు, ఒక కుర్రవాడు బ్రహ్మవర్చస్సుతో కనబడ్డాడు. అతడు పతంజలి భాష్యం నేర్వడానికి చిదంబరం బయలుదేరుతూ ఉన్నాడు. ఇతడు కాశ్మీరుకు చెందినవాడని కొందరు ఉజ్జయినికి చెందినవాడనీ అన్నారు. నీ పేరేమిటని బ్రహ్మరాక్షసుడు అనగా చంద్రశర్మయని సమాధానం చెప్పాడు.


బ్రహ్మరాక్షసుడు ఆ భాష్యం నా దగ్గర ఉందని, నేను చెబుతాను అని తనకు సరియైన సమాధానం చంద్రవర్మ ఇవ్వగానే సంతోషించి, మహాభాష్యం బోధించడానికి కఠినమైన నియమాలు పెట్టాడు. ఎందుకంటే బ్రహ్మరాక్షసుడుగా ఉన్నపుడు క్రూరమనస్తత్వం ఉంటుంది గదా.


నాతో కూర్చో, ఈ చెట్టు మీదనుండే పాఠం చెబుతా, కాని పాఠం అయేంతవరకూ రాత్రింపగళ్ళు ఎంత కాలమైనా సరే చెట్టు దిగడానికి వీలు లేదు అని రాక్షసుడు అన్నాడు. మరి పాఠం రాసుకోవడానికి పరికరాలు ఎక్కడ దొరుకుతాయి? అందుకోసం చంద్రశర్మ తన తొడను చీల్చి రక్తంలో ఒక రావి కొమ్మను ముంచి రావి ఆకులపై భాష్యం వ్రాసేడు. ఇట్లా తొమ్మిదిరోజులు గడిచాయి. ఎంత కష్టపడి విద్యను నేర్చుకున్నాడో గమనించారా? బ్రహ్మ రాక్షసునకు శాపవిమోచన మైంది. అదృశ్యమయ్యాడు.


గురువుగారు చెప్పిన పని చేసి తన నిజస్వరూపం తెచ్చుకున్న గౌడునిలో ఆధ్యాత్మికత మొదలైంది. ఆత్మజ్ఞానానికై గురువును వెదకడం మొదలు పెట్టాడు. హిమాలయాలలో నున్న శుకుణ్ణి సమీపించి శరణు జొచ్చాడు. ఇట్లా బ్రహ్మ రాక్షసుడు, గౌడపాదుడయ్యాడు. అతడు వ్రాసిన మాండుక్యోపనిషత్ కారికలకు ప్రముఖ స్థానం ఉంది. అతడే కాలాంతరంలో చంద్రశర్మకు గురువయ్యాడు.


Thursday 23 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 110 వ భాగం



శిష్యునిపై అనుగ్రహం


శిష్యుడు గురువుల ఎదురనున్న బూడిద కుప్పల భయంకర దృశ్యాన్ని చూసాడు. చెప్పిన పాఠాలు వ్యర్ధమయ్యాయని గురువు, బాధపడ్డాడు. గురు వాక్యాన్ని ఉల్లంఘించానని ప్రమాదం ముంచుకొస్తోందని శిష్యుడు భయపడ్డాడు. పోనీ ఒక్కడైనా మిగిలాడని గురువు సంతోషించి అతనిపై అనుగ్రహ శక్తిని ప్రసరించి వ్యాకరణ శాస్త్రాన్ని పూర్తిగా బోధించాడు.


అట్టి మహాత్ములు నేటికీ ఉంటారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుని అనుగ్రహించలేదా? ఎప్పుడో గాని అట్టి శక్తిని చూపించరు. అయితే ఇంతకు ముందు పెట్టిన నియమం ప్రకారం, అతడు బ్రహ్మ రక్షస్సు కావలసిందే. ఇతడు విద్వాంసులను భక్షించడం ఖాయమే. ఎవరైనా సరియైన సమాధానం ఇస్తే అపుడు వచ్చేవానికి మహాభాష్యాన్ని ఇతడు చెప్పాలనే నియమాన్ని పతంజలి ఏర్పాటు చేసాడు. అప్పుడితడికి శాపవిమోచనం కల్గుతుందని అన్నాడు.


సంస్కృతంలో ప్రత్యయాలు సాధారణంగా చివర వస్తూ ఉంటాయి. 'కృ' అనే ధాతువునకు 'క్త' అనే ప్రత్యయం చేరితే, కృతం అవుతుంది. 'భుజ్’కి చేరితే భుక్తం. వీటిని నిషాంతాలని అంటారు. 'పచ్' ధాతువునకు 'క్త' చేరిస్తే పక్వమౌతుందిగాని 'పక్తం' అనకూడదు. అట్లా సరిగా చెబితే అతనికి భాష్యాన్ని ఉపదేశించు, లేదా తినివేయవచ్చు అని పతంజలి అన్నాడు.


బ్రహ్మ రాక్షసుడు నర్మదా తీరంలోని రావిచెట్టు మీద కూర్చుని 'పచ' ధాతువునకు 'నిష్ఠ'తో రూపం ఏమి వస్తుందో చెప్పుమని వచ్చేపోయే విద్వాంసులనడిగేవాడు. చెప్పనివాళ్ళని ఆహారంగా భోజనం చేసేవాడు. పంచగౌడ దేశీయులకు, పంచ ద్రావిడ దేశీయులకు మధ్యగా నర్మదా తీరం ఉంటుంది. ఇది ఒక కూడలి.


Wednesday 22 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 109 వ భాగం



బ్రహ్మ రాక్షసులు - రాక్షసజాతి


బ్రహ్మ రాక్షస్సునగా ఒక పిశాచం వంటిది. ప్రాణులలో అనేక భేదాలున్నట్లు అనేక పిశాచాలూ ఉంటాయి.


రాక్షసులలో తేడాలున్నా రాక్షస జాతి, దేవజాతిలోనిదే. రాక్షసులు వీరితో యుద్ధం చేసారంటే ప్రత్యేక జాతియని పొరపాటు బడతాం. వీరు దేవతలలో క్రూరులు. దేవతల నుండి భిన్నులు, అసురులు. అందుకే దేవాసుర యుద్ధమని ఉంది కాని దేవరాక్షస యుద్ధమని లేదు. దేవజాతిలో వీరూ ఒకరేయని అమరకోశం చెబుతోంది. అందరిని దేవయోనులంటారు. అసురజాతిని అసుర - దైత్య దైతేయి - దనుజులుగా పేర్కొంది.


రాక్షసులలో ఒక ఉపశాఖ, బ్రహ్మ రక్షస్సులు. చిత్రమేమంటే ఈ పిశాచాలూ దేవజాతికి చెందినవే.


"పిశాచో గుహ్యకః సిద్ధి భూతోఽమీ దేవయోనయః


వేదాధ్యయనం చేసి తప్పుడు మార్గం త్రొక్కిన వాడు బ్రహ్మ రక్షస్సుగా పుడతాడు. వేదవేత్తలతో మృదువుగా మాట్లాడుతూ శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు వేసి వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తింటూ ఉంటాడు.


విపత్తు అంతం


పతంజలి తన అనుమతి లేకుండా వెళ్ళకూడదని తాను పాఠం చెబుతూ ఉండగా తెర ఎత్తిచూడకూడదనే నియమం పెట్టాడు. ఒక మనిషి వేయిమందికి వేయి ముఖాలతో పాఠాలు చెప్పడమా? అని ఒకనాడు ఒక విద్యార్థి తెర తొలగించి చూసాడు. అందరూ బూడిద పాలయ్యారు. "గురు వచనవ్యతి లంఘనం హ్యనర్థః" అని పతంజలి చరిత చెప్పింది. అయితే ఒక విద్యార్థి మందబుద్ధి అవడంవల్ల పాఠం అర్థంకాక ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాడు. అతడు దూరంగా నున్న గౌడ దేశం నుండి వచ్చాడు.


Tuesday 21 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 108 వ భాగం



యజ్ఞ నారాయణ దీక్షితుల సాహిత్య రత్నాకరంలో (11.124) పాణిని సూత్రానికి, పతంజలి భాష్యానికి నటరాజు యొక్క చేతులకు, కాళ్ళకు గల సంబంధం చెప్పే చమత్కార శ్లోకం ఉంది.


పాణియనగా చేయి. నటరాజు చేతిలోనున్న డమరుకం నుండి పాణిని సూత్రాలు వచ్చాయి. మరి కాలికి, భాష్యానికి సంబంధం ఏమిటి?


నిలబడిన నటరాజు నృత్యాన్ని చూడటానికి తృప్తి పడక పతంజలి పామై అతని పాదానికి ఆభరణమై యున్నాడు. ఆ అందె నోటినుండి మహాభాష్యం వచ్చింది. అందె చప్పుడు చేస్తుంది కదా!


సూత్రం చేతినుండి వస్తే, భాష్యంకాలి నుండి వచ్చిందని చమత్కారం.


వేయిమంది శిష్యులకు పాఠం


చిదంబరంలోని సహస్రస్తంభ మంటపంలో ఆదిశేషుడు పతంజలి అవతారమెత్తి వేయిమంది శిష్యులకు భాష్యం అందించదలచాడు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపించాలి. పాఠాన్ని త్వరగా ముగించాలి. ఎవరడిగినా వారికి సమాధానం ఈయాలి. ఇట్లా చేయడానికి ఒక ముఖంతో ఒక నోటితో కుదరదు కనుక పతంజలి మహర్షి, ఆదిశేషుని అవతారమెత్తి వేయి పడగలతోనున్నాడు.

మానవులు ఎవరూ ఆదిశేషుణ్ణి చూడలేరు కనుక, అతని శ్వాసను కూడా భరించలేరు కనుక, ఒక తెరను కట్టి, ఒక్కొక్క ముఖము ముందు ఒక్కొక్క శిష్యుణ్ణి కూర్చోబెట్టి, పాఠం చెప్పడం మొదలు పెట్టాడు.

గురువు తెర వెనుక ఉన్నప్పుడు శిష్యులు తరగతి విడిచి ఆయన అనుమతి లేకుండా వెళ్ళినట్లయితే బ్రహ్మరాక్షసులవుతారని శాపం చెప్పాడు.

Monday 20 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 107 వ భాగం



పై మూడింటికి మూడు గ్రంథాల నందించాడు. చిత్త దోషాన్ని పోగొట్టడం కోసం యోగ సూత్రాల నందించాడు. అదియే పాతంజలయోగ సూత్రం. అనేక యోగాలున్నా పతంజలి యోగాన్నే రాజయోగమంటారు. శ్లోకంలో “యోగేన చిత్తస్య” ఉంది. దీనివల్ల జీవాత్మ, పరమాత్మతో ఐక్యాన్ని పొందుతాడు. తరువాత వాగ్దోషం పోవడానికి, సుశబ్దాల నుచ్చరించడానికి వ్యాకరణ మహాభాష్యాన్ని అందించాడు. "పదేన వాచం".


పదమంటే వ్యాకరణం. "పదం వ్యాకరణం ప్రోక్తం" మహా విద్వాంసులను పదవాక్య ప్రమాణ పారావార పారీణులని యంటారు. పదమనగా వ్యాకరణం; వాక్యమనగా మీమాంస; ప్రమాణమనగా న్యాయశాస్త్రం. వాటిల్లో ఉత్తీర్ణులన్నమాట.


దేవతలు మాట్లాడే భాష, దేవభాష. వారీ ప్రపంచాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు కనుక వారితో మాట్లాడాలంటే మనకా భాష రావాలి. అపుడు మంత్రాలు, శ్లోకాలు బాగా తెలిసి కర్మానుష్టానం బాగా జరుగుతుంది. అందువల్ల సంస్కృతాన్ని మనమందరమూ అభ్యసించాలి. వ్యాకరణ శుద్ధమైన భాషలో మాట్లాడడమే ఒక యోగం. నాడీశుద్ధి కల్గుతుంది. మానసిక పవిత్రత లభిస్తుంది. అందనేక ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. మన సంస్కృతి తెలియాలంటే సంస్కృతం, తప్పనిసరిగా నేర్వాలి. "మలం శరీరస్యవైద్యకేన" అని ఉంది. శారీరక రోగాలను పోగొట్టడానికి ఆయుర్వేదాన్ని అందించాడు. అదే చరక సంహిత అనే ప్రసిద్ధ గ్రంథం. అందుకే అన్నిటి శుద్ధికోసం గ్రంథాల నందించాడు కనుక అతడు ముని ప్రవరుడయ్యాడు. మునులలో శ్రేష్ఠుడు. ప్రామాణిక గ్రంథాలు మూడు రకాలుగా ఉంటాయి. అనగా సూత్రం, భాష్యం, వార్షిక రూపంలో ఉంటాయి. సూత్రం, సూక్ష్మంగా, సంక్షిప్తంగా అందిస్తుంది. దానిని భాష్యం విపులంగా వివరిస్తుంది. భాష్యంలోని క్లిష్టమైన వాటిని వివరించేది వార్తికం. అనగా భాష్యంలో చెప్పనివాటినీ అందిస్తుంది. కొన్నింటిలో ఒక్కొక్కదానికి ప్రాధాన్యం ఉంటుంది. పతంజలి యోగ శాస్త్రానికి సూత్రాలు, వ్యాకరణానికి భాష్యం, వైద్యానికి వార్షికం వ్రాసేడు. ఇట్లా ఒక్కొక్క శాస్త్రంలో ఇతడు వ్రాసినవన్నీ ప్రాధాన్యాన్ని పొందాయి.


యోగ శాస్త్రానికి కొందరు భాష్యాలు వ్రాసినా ఇతని సూత్రాలే ప్రఖ్యాతి. పాణిని సూత్రాలు సామాన్యులకు అర్థం కావు కనుక ఇతని భాష్యానికే ప్రసిద్ధి. ఎన్ని వైద్య గ్రంథాలున్నా ఇతని చరకానికే ప్రసిద్ధి.


నాట్యానికి భరతశాస్త్రం, రాజనీతికి చాణక్యుని అర్థశాస్త్రం, ఎట్లా ప్రాముఖ్యాన్ని పొందాయో ఇతని చరకం వైద్యానికట్లా ప్రసిద్ధి పొందింది. యోగశాస్త్రాన్ని పూర్తిగా ఇతరులు ఏకీభవించకపోయినా దానిని ఒక ప్రధానాంగంగా అందరూ అంగీకరించారు. సిద్ధాంతం విషయమై, అద్వైతం కొంత విభేదాన్ని దీనితో కలిగి యుంది. కాని వ్యాకరణ మహాభాష్య విషయంలో ఎవ్వరికీ పేచీ లేదు.

Sunday 19 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 106 వ భాగం



విష్ణువు, పతంజలిని చిదంబరానికి వెళ్ళమన్నాడు. దానివల్ల లోకానికి ఉపకారం జరిగింది. నటరాజు చేసిన డమరుక నాదాన్ని విని పాణిని మహర్షి వ్యాకరణ సూత్రాలు వ్రాసేడు. దానికి మహాభాష్యాన్ని వ్రాసి లోకానికి ఉపకరించవలసిందిగా ఆదిశేషుడిని విష్ణువు పంపించాడు.

విష్ణువు, పాముపై పవ్వళించినపుడు అతనికి తల్పంగా; అతడు కూర్చుంటే సింహాసనంగా, నడుస్తూ ఉంటే గొడుగుగా, పాము ఉపయోగపడుతుంది. అయితే విష్ణువు నృత్యం చేయడు. శివుడే చేస్తాడు. నృత్యం చేసేవానికి పామెట్లా ఉపకరిస్తుంది? అది ఒక ఆభరణంగా శివునికైనపుడే. అందుకే అతని కాలియందెగా అయ్యాడు. పతంజలి మహర్షిగా నటరాజును సమీపించాడు. అపుడు విష్ణువునకు తల్పంగా లేడని భావించవద్దు. ఒక అంశ అట్లా వెళ్ళింది. 


పతంజలి, అత్రిమహర్షికి పుట్టాడు. కనుక అతడు, ఆత్రేయుడు. (ఆచార్యులు వారి గోత్రం కూడా ఇదే)


ఇతనికి గోణికా పుత్రుడని పేరు. పతంజలి చరిత్ర ననుసరించి, పురాణాల ప్రకారం గోణిక అనే తపస్వినికి పుట్టాడని, పతంజలిగా అవతరించాడని ఉంది. గోణీక, పుత్రునికై, సూర్యునకు అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆమె అంజలిలో ఆదిశేషుడు పడి అతడు పతంజలి అయ్యాడని కథ. అంజలిలో పత్ = పడుటవల్ల పతంజలి, ఇతనికే చరకుడని పేరు. నటరాజు తాండవాన్ని చూస్తూ ఉండేవాడు. అతడే మహాభాష్యం వ్రాసేడు.

త్రికరణాలు శుద్ధి

మనస్సు, శరీరం, వాక్కు అనే మూడు కరణాలను శుద్ధి చేసికొనుటకు పతంజలి ఉపకరించాడని ఒక శ్లోకం:

“యోగేన చిత్తస్య పదేన వాచం
మలం శరీరస్య చవైద్యకేన 
యోపాకరోత్ తం ప్రవరం మునీనాం 
పతంజలిం ప్రాంజలిరానతోస్మి"

Saturday 18 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 105 వ భాగం



దానిని విష్ణు హృదయంపై చేస్తున్నట్లు విగ్రహాన్ని మలిచారు. అందువల్ల మొత్తం విగ్రహం అంతా కప్పబడి త్యాగరాజు ముఖమే కనబడుతుంది. అంతేనే కాని, శివ విష్ణువులు శత్రువులు కారు. మాటిమాటికీ ఆలయాలు మారిపోయాయని భావించకూడదు.


విష్ణువు ధ్యానంలో ఉండి శివతాండవాన్ని తన హృదయంలో వీక్షిస్తూ ఆ ఆనందంలో ఆవేశానికి లోనయ్యాడు. ఆదిశేషుడు, ఆవేశపూరితుడైన విష్ణువు బరువును భరించలేకపోయాడు. ఈరోజు ఇంత బరువున్నారేమిటని విష్ణువు నడిగాడు. పరమేశ్వరుడు నా హృదయంలో నర్తనం చేస్తున్నాడు, అదే కారణమన్నాడు విష్ణువు.


సంతోషం వల్ల బరువు అనినపుడు అది అద్వైతం అవుతుంది. ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడనినపుడు, అనగా ఇద్దరూ ఒకచోట కలిసినపుడు ద్వైతం. ఆ అద్వైతాన్ని చూపించకుండా ఉండడం, విగ్రహాన్ని కప్పుతారు. అందుచేత సాధారుణులకు ద్వైతమూర్తిగానే కన్పిస్తాడు. కాని అద్వైత దర్శనం ఇప్పించాలి. ఆదిశేషుడు ఏమి అడుగుతాడో తెలుసు. ఈ పని ఆదిశేషుని ద్వారా జరగాలని భగవత్ సంకల్పం.


ఈ ఈశ్వర నృత్యాన్ని తాను చూడాలని ఆదిశేషుడడగాలి. అపుడతనిని చిదంబరం పంపించి చూపించాలి. తద్వారా చిదంబర మహాత్మ్యం నల్గురికీ తెలుస్తుంది. ఇది భగవంతుని ఆలోచన.


తిరువారూర్ లో జన్మిస్తే, మోక్షమని ఒకమాట. "జననాత్ కమలాలయే" అయితే పుట్టడం మన చేతిలో ఉందా? చిదంబరంలో దర్శనం వల్లనే ముక్తి, 'దర్శనాత్ అభ్రసదసి' ఎక్కడ పుట్టినా అక్కడకు వెళ్ళితే చాలు. మోక్షం వస్తుంది. మోక్షానికి దారి చూపిస్తుంది. 


Friday 17 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 104 వ భాగం



అజప- హంసనటనం


శివతాండవాలు పెక్కువిధాలుగా ఉంటాయి. చిదంబరంలో ఆనంద తాండవం. తిరువలంగాడులో ఊర్ధ్వతాండవం. ఇక చోళ ప్రాంతంలో ఏడుగురు త్యాగరాజులు ఏడు రకాలైన తాండవాలు చేస్తారు. వీటిని సప్తవిడంగ క్షేత్రాలని అంటారు. అందు ముఖ్యమైనది తిరువారూర్. ఇందున్న త్యాగరాజు, అసలైన మూర్తి. ఇతని నృత్యాన్ని హంసనటనమంటారు. ఇదే అజపానటనం.


జపం కానిది అజపం. మంత్రంలోని అక్షరాలను పల్కుతాం. ఆ కంపనల వల్ల నాడులలో కదలిక ఏర్పడుతుంది. దీనివల్ల శక్తి, సిద్ధి, మనస్సునకు స్పష్టత, అనేక దృశ్యాలు కన్పిస్తాయి. ఇవి రావాలంటే ప్రాణాయామంతో కలిపి చేయాలి. దీని కంటె భిన్నమైన ప్రక్రియ యుంది. శ్వాసను గమనిస్తూ ఉంటే చిత్తానికి శాంతి ఏర్పడుతుంది. ప్రాణాయామంలో శ్రమ యుంటుంది. కాని ఈ ప్రక్రియ అప్రయత్నంగా సాగిపోతూ ఉండడాన్ని గమనిస్తాం. ఇది ఆత్మస్థానాన్ని చేరుస్తుంది. ఇందు మంత్ర జపం ఉండదు. అందువల్ల అజపం, వట్టి శ్వాస యొక్క గమనాన్ని వీక్షించడమే.


మామూలుగా దీనినీ జపం అంటాం. ఇదే హంస మంత్రజపం. పీల్చేటప్పుడు, విదిలేటప్పుడు ఇస్ హం, అనే నాదాలుంటాయి. అహంసః = నేను అతడే. నేను జీవాత్మ, అతడు పరమాత్మ. నేను, అతడు అని ఊరుకుంటే బ్రహ్మయే జీవుడనే, అర్థం వస్తుంది. అతడు, నేను అనినపుడు సః అహం. కలిపితే సోహం. సోహంను హంసతో కలిపితే హంసమంత్రం. ఇట్లా జీవుణ్ణి పరమాత్మతో కలిపినపుడు జపమాగిపోయి, అజపమౌతుంది. స, హ, అణగిపోయి ఓం, ఒక్కటే మిగులుతుంది. అది తురీయస్థితికి తీసుకొని వెడుతుంది.


విష్ణువు, కుండలినియైన పామును తల్పంగా చేసుకొని యోగనిద్రలో, పరమాత్మతో ఐక్యమై పరమేశ్వర రూపాన్ని పొందుతున్నాడు. మహావిష్ణువు యొక్క శ్వాసగతిననుసరించి పరమేశ్వరుని కదలిక యుండడం వల్ల దానిని త్యాగరాజు యొక్క అజపానటనమని, హంసనటనమని అంటారు.


Thursday 16 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 103 వ భాగం



విష్ణుని హృదయంలో శివనర్తనం


నటరాజ ఆలయంలో నటరాజ దర్శన మంటపం దగ్గరనే విష్ణు సన్నిధి యుంటుంది. ఆదిశేషునిపై పవళిస్తున్నట్లు గోవింద రాజుగా కీర్తింపబడి యుంటాడు. అప్పయ్య దీక్షితులు, ఇద్దరూ ఒకచోట ఉండడం చూసి 'మారమణ, ఉమారమణ' అని ఇద్దర్నీ కీర్తించారు.


హృదయ పూర్వకంగా బంధుత్వం అంటాం. ఇక్కడ నటరాజు, మహావిష్ణువు హృదయంలో నర్తిస్తాడు.


పురాతన పరిశోధనలు చేసేవారు. తిరువారూర్ లో నున్న త్యాగరాజాలయాన్ని చూసి విష్ణునకు రంగరాజు, వరద రాజు, గోవిందరాజు అని ఉంది. కనుక, పై ఆలయం ముందు విష్ణువుదే అని తరువాత శివాలయంగా మార్చబడిందని అంటారు. అట్లాగే నాచ్చియార్ కోవెల ముందు శివాలయమని, తరువాత వైష్ణవాలయంగా మార్చబడిందని అంటారు. ఏమిటో ఈ పరిశోధన?


వారు స్థల పురాణాలను సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. ఎట్టి మార్పును చెప్పనవసరం లేదు. అవి ముందెట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. విష్ణ్వాలయంగానే తిరువారూర్ లో నిర్మింపబడింది. విష్ణు హృదయంలో త్యాగరాజున్న మూర్తి అక్కడ ఉంది.


నటరాజు మాదిరిగా త్యాగరాజు కూడా నటనమూర్తియే. అయితే అతని ముఖమే చూడగలం. మిగతా మూర్తి అంతా వస్త్రంచే కప్పబడి యుంటుంది. నటరాజు, త్యాగరాజుల నర్తనంలో తేడా ఉంది. నటరాజు నృత్యం చేస్తూ ఉంటే ఎడమకాలిని ఎత్తి నృత్యం చేస్తాడు. త్యాగరాజు తనంతట తాను చేయడు. అతడు విష్ణు హృదయంలో ఉన్నాడు. కాబట్టి విష్ణువు, శ్వాస పీలుస్తూ ఉంటే దానికి అనుగుణంగా త్యాగరాజు నృత్యం చేస్తాడు. ఆ కదలికయే నృత్యం.


విష్ణు హృదయంలో శివుడు నృత్యం చేస్తాడని నారాయణోపనిషత్తు చెబుతోంది. సహస్ర బాహువులు, సహస్రాక్షులు కలిగిన ఆ విరాట్ స్వరూపానికి హృదయం, పద్మకోశంలా అనగా తామర మొగ్గలా ఉంటుందట. దానిపై దహరాకాశం, అందు పరమాత్మ ప్రకాశిస్తాడని మంత్రం అంటోంది. బైట ఉన్నది, మహాకాశం, దానిలో నున్నది దహరాకాశం. చిదంబరంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగే యుంటుంది. జ్ఞానాకాశము, ఆకాశక్షేత్రము, చిత్సభ, తాండవమూర్తియైన నటరాజ శివుడు. అన్నిటికీ సంబంధం ఉంది.


Wednesday 15 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 102 వ భాగం



పతంజలి చరితం


17వ శతాబ్దం చివరలో తంజావూరు రాజైన షాహ్ జీ తన రాజ్యం విద్వాంసులతో కళకళలాడుతూ ఉండాలని ఎందరినో విద్వాంసులను - తిరువిసనల్లూర్ కి తీసుకొని వచ్చాడు. ఒక గ్రామాన్ని 64 మంది విద్వాంసులకు అగ్రహారంగా ఇచ్చాడు. అందొకడు రామ భద్ర దీక్షితులు. ఇతనిలో వ్యాకరణం కవిత్వం రెండూ ఉన్నాయి. అతణ్ణి ఆనాడు పతంజలియని పిలిచేవారు.


ఇతడు పతంజలి చరితమే కాకుండా జానకీ పరిణయమనే నాటకాన్ని వ్రాసేడు. రామభక్తుడగుటచే రామస్తవకర్ణ రసాయనం, రామచరితస్తవం అనే గ్రంథాలను, రామాయణంలో లేని విశేషాలను వ్రాసేడు. దక్షిణ దేశపు పరువును నిలబెట్టాడు.


ప్రస్తుతం ఎనిమిది సర్గలున్న పతంజలి చరితాన్ని చూద్దాం.


రాముడు గుర్తుకు వస్తే హనుమ గుర్తుకు వచ్చినట్లు నటరాజును ప్రస్తావిస్తే ఒక పాము, పెద్దపులి గుర్తుకు వస్తాయి. అవి అతని నృత్యాన్ని చూసి యుంటాయి. పెద్ద పులి పాదాలు కలిగినవాడిని వ్యాఘ్రపాదుడని అంటారు. పామును కాలుగా కలిగినవాడు పతంజలి.


ఇక వెంకట కృష్ణ దీక్షితులు వ్రాసిన నటేశ విజయంలోనూ పతంజలి ప్రస్తావన వస్తుంది. రెండు పుస్తకాలలోనూ పోలిక ఉంది.


వీటిల్లో పతంజలి, ఆదిశేషుని అవతారంగా చెప్పబడింది. ఆదిశేషునకు, - విష్ణువునకూ సంబంధం ఉంది. విష్ణువు దగ్గరగా నున్నవాడు నటరాజు భక్తుడెట్లా అయ్యాడు? క్షీరాబ్దినుండి చిదంబరానికి ఎందుకు వచ్చినట్లు? విష్ణువే పంపించినట్లుంది. అయితే విష్ణువునకు నటరాజునకు సంబంధం ఏమిటి?


Tuesday 14 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 101 వ భాగం



తరువాత ఏం జరిగింది? 'తరవోభినేదుః', అంటే చెట్లు ప్రతిధ్వనించాయి. అభినేత్రుకు మరొక అర్ధం ఉంది. క్రియ ద్వారా చూపువాడు. అనగా నటుడు. ఒకని వేషం వేసుకొని అతనిలా ఉండేవాడు. రాముడు గతించినా రామ వేషాలు వేస్తున్నారు. నాటకంలో దశరథుడు, రామ అంటే అసలు రాముడు పల్కాడా? అట్లాగే శుకుడు మాట్లాడలేదు. కాని అతని ప్రతినిధులైన చెట్లు ప్రతిధ్వనించాయి. ఎందుకు ఎందుకని ప్రశ్నించాయి? 


చెట్లెందుకు సమాధానం చెప్పాలి? శుకుడు సర్వభూత హృదయుడు, బ్రహ్మజ్ఞాని కనుక అంతటా ఉన్నాడు. కనుక అన్నీ ఇతడై పోయాయి. (‘తన్మయతయా') చెట్లేకాదు, పశువులు, పక్షులు, కొండలు, నదులూ కూడా చెట్లని చెప్పడం నిర్ధారణను సూచిస్తుంది.


శుకుడు సమాధానం చెప్పలేదు. అతడెంత జ్ఞానియైనా అతనిలో ప్రేమ ఉండదా? అందువల్ల చెట్లు సమాధానం చెప్పేటట్లు చేసాడు. అతనికి బదులవి సమాధానం చెబుతున్నాయని వ్యాసుడూ తృప్తి పడియుండవచ్చు. అతని ఆత్మ జ్ఞానమూ వికసించి యుండవచ్చు. ఒక కొడుకొక చోట ఉంటే అతణ్ణి విడిచి పెట్టి యుండలేడు. ఆ కొడుకే అన్ని భూతాలలో ఉండగా అతడెట్లా ఇతనికి దూరంగా ఉండగలడు? కనుక వ్యాసుడు విచారింపనవసరం లేదు. ఇది అనుభవం వల్ల పొందాడు. తన కొడుకు బ్రహ్మయని భావించాడు. అతడు తనతోనూ, అన్నిచోట్లా ఉన్నాడని భావించి యుంటాడు.


అట్టి శుకుని నుండి గౌడపాదుడుపదేశం పొందాడు. అతడు సన్న్యాస గురువు. ఇక గౌడపాదునకు విద్యా గురువు గురించి తెలుసుకుందాం. పతంజలి చరితం గురించి వివరిస్తా.


Monday 13 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 100 వ భాగం



ద్వైపాయనుడు అనగా రెండు ద్వీపాల మధ్య తిరుగువాడు, వ్యాసుడు కనుక 'పరివ్రజంతం' అని ఉంది. పుత్ర అనే సంబోధనతో ఉన్నాడు. అనగా వ్యాస పుత్రుడు. 'ద్వైపాయనం', అనే మాట శ్లోకంలో ఉంది. 'పుత్రేతి' అని వేరొకచోట ఉంది. సన్న్యాసులను పరివ్రాజకులని అంటారు. అనగా శుకుడు ఇంటినుండి వెళ్ళిపోతున్నాడు. దానికి ముందు రెండు విశేషణాలున్నాయి. అనుపేతం = ఉపనయనం కాకుండా; అపేతకృత్యం = అన్ని శాస్త్ర కర్మలను విడిచినవాడై. అనగా ఉపనయనానికి ముందే బ్రహ్మజ్ఞాని అయ్యాడు.


పుట్టుకతోనే జ్ఞానం. ప్రపంచ సుఖాలు, దుఃఖాలు అంటకుండానే జ్ఞానం సంపాదించడం. 'అనుపేతం' అనినపుడు ఉపనయన వయస్సు వచ్చినా ఉపనయనం కాలేదని అనాలి. ఒకడింకా ఉద్యోగ విరమణ చేయలేదంటే చాలాకాలం నుండి చేస్తున్నాడని, విరమణ కాలం సమీపించిందని అర్థం. క్రొత్తగా ఉద్యోగంలో చేరినవాడిని అట్లా అనం. కనుక ఉపనయనం కాలేదంటే ఉపనయనానికి తగిన వయస్సు వచ్చినా కాలేదని అర్థం. అసలు ఉపనయనం ఏడవ ఏట, బ్రహ్మ వర్చస్సును కావాలని కోరుకొనేవానికి ఐదవ యేటనే చేయవచ్చనే శాస్త్రవాక్యం ఉంది. అనగా ఐదవ ఏడు సమీపించే లోపునే జ్ఞానిగా గుర్తింపబడ్డాడు. అట్లా అని చెప్పడం అతని గొప్పతనాన్ని తగ్గించినట్లు కాదు.


దానికి ముందు 'పరిప్రజంతం' అనగా తిరుగుతున్నవాడై. ఇట్లా వెళ్ళడానికి 4,5 సంవత్సరాలుండాలి. పుట్టీ పుట్టగానే పరుగెత్తడం కుదురదు కదా! అసలు జ్ఞాని ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. అయితే ఒకచోట ఉంటే అతడా ప్రదేశానికే పరిమితుడౌతాడని, అతడు వారికి చెందినవాడని వారతనికి చెందినవారనే బంధం ఏర్పడుతుంది. అందువల్ల జ్ఞాని, పరివ్రాజకుడై యుండాలి.


వ్యాసుడెంత గొప్పవాడైనా శుకుని వంటి బ్రహ్మజ్ఞాని కాలేకపోయాడు. ఇంకా అతనిలో పుత్రవ్యామోహం ఉండిపోయింది. ఇంట్లో ఉన్న కొద్దీ బ్రహ్మచర్య దీక్ష, భిక్షాచర్య మొదలైన వాటివల్ల ఇంకా అనుబంధం గట్టిదైపోతుంది. అందువల్ల శుకుడు ఇంటి నుంచి తండ్రికి పుత్ర వ్యామోహం కల్గించకుండా వెళ్ళిపోయాడు. అతని దర్శనం వల్ల ఎందరో బాగుపడాలి. ఇది ఈశ్వర సంకల్పం. అంతేనే కాని తానితరులను దరిచేరుస్తానని శుకుడనుకోడు. ఏ సంకల్పం లేకుండా వెళ్ళిపోయాడు.


వ్యాసుడు తన కుమారుడు పారిపోవడం చూసి పట్టుకుని వెనక్కి తీసుకు రావడానికి ప్రయత్నించాడు. కాని శుకుడు చిక్కలేదు. అపుడు వ్యాసుడు 'పుత్ర, పుత్రా' అని ఎలుగెత్తి ఆక్రోశించాడు.


Sunday 12 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 99 వ భాగం





సదాశివ బ్రహ్మేంద్రులు కూడా జీవన్ముక్తులే. రెండు శతాబ్దాల వెనుక నున్నవారు. వారు తమ గురురత్న మాలికలో శుకుని గూర్చి ఇట్లా అన్నారు:


"జననీ జఠరాదిన చ్యవన్యో 

జగతో నాద్రవత్ ఆత్మవిత్ విపధ్భ్యః 

అనహంత మహంత మాత్మవంతం 

భగవంతం శుకమాశ్రయే ప్రశాంతం"


అనగా శ్లోకంలోని రెండవ భాగంలో అహంకారం లేని ఆత్మనెరిగిన శుకుణ్ణి, ప్రశాంతుని, భగవత్ స్వరూపాన్ని శరణు జొచ్చుతున్నానని అర్థం. మొదటి భాగంలో తల్లి గర్భం నుండి రాగానే ఆత్మజ్ఞానం కలిగిందని, ప్రాపంచిక వాసనలు, అణుమాత్రం లేనివాడని పొగిడారు. 'జననీ జఠరాత్' అన్నారు. అదే మాట భజగోవింద స్తోత్రంలో జననీ జఠరే శయనం" అని : ఉంది.

శుకుని గొప్పదనం భాగవత శ్లోకం అందించింది:


యం ప్రప్ర జంతం అనుపేతం అపేతకృత్యం

ద్వైపాయనో విరహకార ఆజుహావ

పుత్రేతి తన్మయతయా తరవో ఖినేదుః

తం సర్వభూత హృదయం మునిం ఆనతోఽత్మి 


వానికి నమస్కారం అని ఉంది కాని వారి పేరు శ్లోకంలో లేదు. 'సర్వభూత హృదయం మునిం' = అందరి హృదయాలలోనూ ఉండే మునియని మాత్రమే ఉంది. అనగా పరబ్రహ్మ స్వరూపుడన్నమాట. శుకుడని పేరు చెబితే అతడొక జీవుడని భావిస్తారు కనుక అట్లా చెప్పలేదు. అనగా నామ రూపాలను దాటినవాడని తెలుస్తోంది.


Saturday 11 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 98 వ భాగం



గురుని ఆజ్ఞ ప్రకారం రామానుజులు, పరాశరునిపై భక్తిని చూపించి, వారి పేర్లు శాశ్వతంగా ఉండాలని, తన శిష్యుడైన కూరత్తాళ్వార్ యొక్క తనయునకు పరాశర భట్టర్ అను నామకరణం చేయించారు.


మూడు సంప్రదాయాలకు వ్యాసుడే మూల పురుషుడు. ముగ్గురు బ్రహ్మసూత్రాలపై భాష్యం వ్రాసేరు. మాధ్వులలో వ్యాసరాయర్ అనే వారున్నారు. వారికి వ్యాస రాయర్ మఠం కూడా ఉంది. అట్లాగే శుకుడు కూడా ముగ్గురికీ గురువే. తరువాత గురుపరంపర, విడిపోయింది. మన అద్వైత సిద్ధాంతం గౌడ పాదునితో మొదలౌతుంది.


శుకబ్రహ్మము


శుకుడు అద్వైత జ్ఞానం మూర్తీభవించిన జీవన్ముక్తుడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. చాలామంది జీవన్ముక్తులకు పూర్వ కర్మలు కొంతకాలం వెంట రావడం, వాటిని వీరు జ్ఞానంచే ఎదుర్కొనడం జరుగగా ఇతడు పుట్టుకతోనే జీవన్ముక్తుడయ్యాడు.


కర్మశేషం ఉండగా పుట్టలేదు. ఏ ప్రయత్నం లేకుండానే ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు.


పుట్టుక అంటే పూర్వకర్మ ఉండాలి. శాస్త్రప్రకారం కర్మలు చేయడం, చిత్త శుద్ధిని పొందడం, ఆత్మ జ్ఞానం అవసరముండడం ఉంటుంది. అజ్ఞానం లవలేశం అంటకుండా పరమేశ్వరుడితణ్ణి అవతరింప చేసాడు. ఇది వాని లీల. ఇంతకంటే కారణం చెప్పలేను. ఈశ్వర సృష్టిలో ఇది యొక ప్రత్యేకత. ఇట్టివారు కూడా ఉంటారని లోకానికి వెల్లడి చేయడంకోసం పుట్టించాడేమో!


అట్టివాడు, వామదేవుడు కూడా. శుకుని కంటె ముందువాడు. “దేవతల జన్మలు నాకు తెలుసు. అనేక వేల జన్మలనెత్తాను. నేడు లెక్కలొచ్చాయి. అవి గరుత్మంతుని రెక్కల వంటివి, అందుకే బంధాలు వదుల్చుకుని ఎగిరిపోతున్నాను" అని ఐతరేయ ఉపనిషత్తులో ఇది ఉంది. పూర్వం అనేక జన్మలెత్తానని, ప్రస్తుతం గర్భవాసంలో ఉండగానే ఆత్మజ్ఞానం కల్గిందని ఆయన చెప్పగలిగాడు. అట్టి పూర్వ జన్మలులేనివాడు శుకుడు.


Friday 10 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 97 వ భాగం



కాని వసిష్ఠుని మాట వ్యర్థం కాకూడదు. అందువల్ల రాక్షసుడయ్యాడు. ఇంతవరకూ పురాణాలలో ఉన్నదే. అక్కడనుండి వ్యాఖ్యానంలో ఉన్నది వివరిస్తా. ఆధారం లేకుండా వారు వ్రాయరు.


కల్మష పాదుడు రాక్షసుడై, వసిష్ఠ తనయులనే తినడం మొదలు పెట్టాడు. అపుడు వసిష్ఠ తనయుడు శక్తి వచ్చాడు. అతని దర్శనం వల్లనే ఇతనికి జ్ఞానోదయమయింది. రాజు పాపం పోయింది. ఉపదేశం ఇమ్మని ఇతణ్ణి అడిగాడు. బ్రహ్మ విద్యోపదేశం చేయగా అతడు ముక్తుడయ్యాడు. అందువల్ల గురుపరంపరలో శక్తికి స్థానముంది.


శక్తి కొడుకు, పరాశరుడు, గర్భస్థుడై యుండగానే వేదాధ్యయనం చేసినవాడు. అతడు వ్యాసుడనే పుత్రుణ్ణి, విష్ణుపురాణాన్ని లోకానికి అందించాడు. భాగవతానికి మూలం, విష్ణు పురాణం. దానినుండి సూక్తులను శంకరులు పేర్కొన్నారు. అది భక్తి గ్రంథంగా కనబడినా పాలలో పంచదార కలిపినట్లుగా అందు భక్తి, జ్ఞాన, అద్వైత వేదాంతాలుంటాయి. అతడొక 'స్మృతి'నందించాడు. అదే 'పరాశర స్మృతి'. కలిలో ప్రధాన 'స్మృతి'.


తరువాత వ్యాసుడు. శంకరుల రచనలలో ఏది ప్రధానమైనదంటే, సూత్ర భాష్యమంటారు. వ్యాసుడందించిన బ్రహ్మ సూత్రాలకే అది భాష్యం. బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తుల సారం. వేద విభజన, 18 పురాణాల రచన మొదలైనవి. ఎన్నో వ్యాసుడు చేసాడు. శంకరుల చరిత్రలు తెలియాలంటే ఎన్నో పూర్వగాథలు తెలియాలి. ఆధ్యాత్మిక పరంపర తెలియాలి. లేకపోతే పెద్ద పర్వత పంక్తుల్ని చిన్న రంధ్రం నుండి చూసినట్లైతుంది.


మహావిష్ణువు నుంచి శుకుని వరకు పురాణ పురుషులు. వీరి ప్రభావం, శంకరులపై ఎట్లా ఉందో తెలియాలి.


విష్ణువు నుండి శుకుని వరకూ అద్వైతులతో బాటు విశిష్టాద్వైతులు, మాధ్వులు కూడా ఆ వరుసను పాటించి నుతిస్తారు. మనకు, ముఖ్య గురువులలో విష్ణువొకడు. కాని పై సంప్రదాయాలకు, అతడే ప్రధాన గురువు. 

Thursday 9 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 96 వ భాగం



వసిష్ఠుని నుండి వ్యాసుని వరకూ


బ్రహ్మ మానసపుత్రులలో వసిష్ఠుడొకడు. అతడు మంత్రద్రష్ట, సప్తర్షులలో ఒకడు. పరమ పతివ్రతయైన అరుంధతికి భర్త, నారాయణుడు, రామునిగా అవతారమెత్తగా అతనికి గురువైనాడు. అతడే రామునకు, జ్ఞానవాసిష్ఠాన్ని ఉపదేశించాడు. అందు బ్రహ్మయే సత్యమని, జగత్తు మిథ్యయని కొన్నివేల శ్లోకాలలో ప్రతిపాదింపబడింది. అందనేక కథలు. అతని తరువాత అతని తనయుడు శక్తి.


జీవన్ముక్తులైన సదాశివ బ్రహ్మేంద్రులు, గురురత్న మాలను వ్రాసేరు. అందు గురు పరంపర ఉంటుంది. దానిలో కంచిలోని 57వ పీఠాధిపతి వరకూ పేర్కొన్నారు. అందులో 87 శ్లోకాలుంటాయి. సుషమ అనే పేరుతో దానికి ఆత్మ బోధేంద్రస్వామి, ఒక వ్యాఖ్యానం వ్రాసేరు. అందు శక్తి గురించి వ్రాస్తూ, బహుమిత్రసహుడనే రాజునకు సంక్రమించిన పాపాన్ని కేవల తన దర్శనంవల్ల పోగొట్టాడని వ్రాయబడింది. అది అతని మహత్త్వము.


సూర్యవంశంలో బహుమిత్రసహుడు పుట్టాడు. వసిష్ఠుడతనికి కుల గురువు. ఒక రాక్షసుడు, తిన్నగా ఇతణ్ణి ఎదుర్కొనలేక వసిష్ఠ శాపానికి ఇతడు గురియగునట్లుగా చేసాడు. ఒక వంటలవానిగా ఇతని కొలువులో చేరాడు. మిత్రసహుడు, శ్రాద్ధం పెడుతూ వసిష్ఠుని భోక్తగా పిలిచాడు. ఆ వంటవాడు, మనుష్య మాంసాన్ని వండి దీనిని వసిష్ఠునకు వడ్డించండని అన్నాడు. దానిని చూడగానే వసిష్ఠునకు నరమాంసమని తెలిసింది. వెంటనే రాజును నీవు నరమాంస భక్షకునిగా మారి పొమ్మని శపించాడు.


రాజేమి చేస్తాడు? ఇతనికీ కోపం వచ్చింది. గురువని కూడా లెక్క చేయకుండా తిరిగి శాపం ఇద్దామని నీటిని గ్రహించి, వసిష్ఠుని మీద చల్లబోతూ ఉండగా మంత్రి వచ్చి, గురువును శపిస్తే వంశనాశమౌతుందని అన్నాడు.


అయితే చేతిలో నీటిని ఏం చేయాలి? ఎక్కడో చల్లాలి కదా? చల్లబడిన చోట, అది దగ్ధమై పోతుంది. తన పాదాలమీదే చల్లుకున్నాడు. కాలు నల్లబడి కాలిపోయింది. అందుకు కల్మషపాదుడయ్యాడు.


Wednesday 8 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 95 వ భాగం



ఆదిగురువు, దక్షిణామూర్తి. ఆయన ఎవరికీ ఉపదేశమిచ్చినట్లు లేదు. గురు పరంపర, విష్ణువుతో ఆరంభమౌతుంది. మరొక శ్లోకంలో పరమ శివుడే దక్షిణామూర్తి కనుక విష్ణువును విడిచి యుంటుంది, ఆదిగురువు పరమశివుడు, మధ్య గురువులు, తరువాత శంకరులు, తరువాత మనకుపదేశమిచ్చిన ప్రత్యక్ష గురువు పేర్లను చెప్పి నమస్కరిస్తారు.


"సదాశివ సమారాంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతం వందేగురు పరంపరామ్"


మొదటి శ్లోకం ప్రకారం విష్ణువు, బ్రహ్మ, ఇత్యాదిగా ఉంటుంది. విష్ణువు, బ్రహ్మకు వేదాలనిచ్చాడు కనుక ముందు విష్ణువు, తరువాత - బ్రహ్మ - వసిష్ఠుడు - శక్తి పరాశరుడు - వ్యాసుడు తరువాత, ఆయన కొడుకైన శుకుడు. అతడు వివాహమాడలేదు కనుక శిష్యుడైన గౌడపాదుడు గోవింద భగవత్పాదులు - చివరకు శంకరులకు వందనం సాగి, వీరి శిష్యులైన నల్గురు శిష్యులను పేర్కొంటూ మనకు ప్రత్యక్షంగా ఉపదేశమిచ్చిన గురువునకు వందనంతో ముగుస్తుంది.


మామూలుగా మనం చెప్పుకునే ప్రవరలో గోత్ర ఋషులను పేర్కొని తరువాత నున్న వారెవరో తెలియదు కనుక వారిని విడిచి కేవలం ముత్తాత, తాత, తండ్రులనే పేర్కొంటాం. కాని బ్రహ్మవిద్యా విషయంలో విష్ణువు నుండి ప్రత్యక్ష గురువు వరకూ పేర్కొంటాం. శంకరుల వరకు అవిచ్ఛిన్న పరంపర సాగింది. వరుసగా శంకరుల ముందు తొమ్మండుగురు పూర్వాచార్యులున్నారు. అయితే ఏనాటి విష్ణువు? ఏనాటి శంకరులు? యుగయుగాలు గడిచి పోయాయి. తొమ్మండుగురునే చెబుతున్నారేమిటని శంక.


వసిష్ఠాదులు దీర్ఘకాల జీవులు. వసిష్ఠుడు, వేదంలో, రామాయణంలో పేర్కొనబడినవాడు. మన కాలమానంతో, మన ఆయుర్దాయంతో లెక్కపెట్టగూడదు. వ్యాసుడు చిరంజీవియే కదా. వారిని చారిత్రక వ్యక్తులని మిడిమిడి జ్ఞానంతో చూడకూడదు. ఇది వివరిస్తూ ఉంటే మధ్యలో ఆదిశేషువు, పతంజలి కథలు వస్తాయి.

Tuesday 7 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 94 వ భాగం



వ్యాసుడు, శంకరుల గురువైన గోవింద భగవత్పాదులతో, ఈశ్వరుడవతరించబోతున్నాడు, అతడు నీకు శిష్యుడు కాబోతున్నాడని, ఉపదేశమిమ్మని అన్నాడు. బాలశంకరుడు గోవింద భగవత్పాదుల దగ్గరకు వచ్చినప్పుడు గురువు నీవెవరని అడిగాడు. నీవు, నేనూ, అతడూ అంతా బ్రహ్మమే కాదా! ఇది తెలిసికొనిన నేను (బ్రహ్మ స్వరూపాన్నే అని దశశ్లోకి రూపంలో సెలవిచ్చారు. ప్రతి శ్లోకం చివర శివోహం అని ఉంటుంది. వీటిలో కైలాస శంకర ప్రస్తావన తీసుకొని రాక ఉపనిషత్తులలో ప్రతిపాదింప బడిన శివం - శాంతం - అద్వైతం - అహం బ్రహ్మాస్మి - శివోహం, ప్రతిపాదింపబడ్డాయి. "తదేకో వశిష్టః శివః కేవలో.. హం" అని అన్నారు.

 

ఆచార్య పరంపర

 

మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, అందలి ఋషులను చెబుతాం. అయితే సన్న్యాసులకు ప్రవర ఉంటుందా?

 

ఇక మరొక ప్రవర వివాహాలలో ఉంటుంది. వధూవరులను గురించి చెప్పేటప్పుడు మూడు తరాలవారిని పేర్కొంటాం. ముందు ఋషుల పేర్లు చెప్పి గోత్రంలో ఉన్నాడో చెప్పి వరుని యొక్క ముత్తాత, తాత, తండ్రులను గురించి చెబుతాం. అట్లాగే వధువు గురించి కూడా చెబుతాం. శ్రాద్ధాదులలో తండ్రి, తాత, ముత్తాత పేర్లను వరుసగా ఉచ్చరిస్తారు.

 

శంకరులు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా ఆత్రేయ గోత్రమని, తండ్రి శివ గురువని; తాత, విద్యాధిరాజని చెప్పి యుంటారు. ముత్తాత పేరు చెప్పబడిందో లేదో నాకు గుర్తులేదు.

 

అయితే సన్న్యాసి యైనపుడీ ప్రస్తావన ఉండదు. అయితే గురు పరంపర గురించి చెబుతారు గాని, వంశ పరంపర ఉండదు. ఇక్కడ ప్రవరయనగా గురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాపరగురువుల ప్రస్తావన ఉంటుంది. చివరకు ఆదిగురువు.

Monday 6 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 93 వ భాగం



ఇక 'వినా వినాయకం' ఏమిటి? శక్తి పంచాక్షరి విధానంలో ఈశ్వరుణ్ణి, అంబికతోను, స్కందునితోనే గాక వినాయకునితోనూ కలిపి అర్చించాలి. శంకరులు, షణ్మతాలలో గణపత్యాన్ని కూడా స్థాపించారు. ఎందుక అన్నాడు? శంకరులు వినాయకుడు లేనివారంటే, బుద్ధుడు లేనివారని అర్ధం. బుద్ధునకు, వినాయకుడని ఒక పేరు కూడా ఉంది.


వినాయకుడనగా ఒక గణానికి నాయకుడని అర్ధం. ఇతని కంటే మరొక నాయకుడు లేనివాడని కూడా అర్ధం. భూత గణాధిపతిగా గణపతిని కొలుస్తున్నట్లు బౌద్ధులు, బుద్ధుణ్ణి వినాయకుడని అంటారు. (బుద్ధుణే కాదు, బౌద్ధమత గురువులందర్నీ ఆ పదంతో పిలుస్తారని ఆప్టే నిఘంటువులో ఉంది.


అమరకోశంలో "షడభిజ్జో దశబలో.. ద్వయవాదీ వినాయకః" అని ఉంది. కైలాస శంకరుడు, వినాయకునితో ఉంటాడు. మన కాలడి శంకరులు వినాయకునితో అనగా బుద్ధునితో ఉండరు.


కనుక శంకరులు, పరమశివులే. పరమ శివుడే, అపూర్వ శంకరునిగా మారారు.


శంకరులిచ్చిన సాక్ష్యం


ఇక వీరి మాటలలో తామీశ్వరావతారమని ఎక్కడైనా అన్నారా?


వీరు వినయ సంపన్నులు కదా. ఎన్ని గ్రంథాలు వ్రాసినా తమ గురించి ఒక్క ముక్క వ్రాసికోలేదు. ఆయన గురించిన విషయాలు మిగతావారు చెబితేనే తెలిసాయి. అందుకునే వీరి పుట్టిన కాలం గురించి, స్థాపించిన సంస్థలు గురించి, వ్రాసిన గ్రంథాల గురించి, దర్శించిన స్థలాల గురించి భిన్న అభిప్రాయాలు వచ్చాయి. కనుక ఈయన తను ఈశ్వర అవతారమని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా ఈ సంగతిని గుర్తించవచ్చు.


తాను మనిషినని రాముడన్నాడు. కృష్ణుడు కొన్ని సందర్భాలలో దేవుడని ప్రకటించుకొన్నా చాలా సందర్భాలలో పరోక్షంగా తన గొప్పదనాన్ని ప్రకటించాడు. ఇదంతా వారి లీల.


Sunday 5 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 92 వ భాగం



"రూక్షా సాక్షు ప్రతి గణఫణా రత్నాఘ భాభిక్ష శోభం

స్ఫటిక మణిశిలా మండలాభం" 


అనగా పడగలు గల పాములే ఆభరణాలుగా కలవాడు. భోగమనగా పడగ. కనుక శంకరుడు 'భోగి పరివార సంపద కలవాడు. శంకరులు అభోగి పరివార సంపద కలవారు.'


'నిరస్తభూతి'యనగా, సంపదను త్రోసివేసిన వారు శంకరులు. కైలాస శంకరుడు, విభూతిని పులుముకొన్నవాడు. భూతి యనినా, విభూతియన్నా ఒక్కటే. ఆయన అష్ట సిద్ధులు కలవాడే. ఆయన విభూతిని పూసుకొన్నా అష్టసిద్ధులు కలవాడే. అనగా విభూతులు కలవాడే. శంకరులు నిరస్త విభూతుడు. ఇక్కడ భూతీయనగా మామూలు సంపద.


శంకరుడు తన శరీరంలో అమ్మవారిని ధరించాడు. ఉమార్ధ విగ్రహుడు. సన్న్యాసులకు భార్య ఉండదు కనుక వీరు అనుమార్ధ విగ్రహులు.


శంకరులు, 'అనుగ్రం' - ఉగ్ర స్వభావం లేని వారు. అనగా సౌమ్యమూర్తి. దయామూర్తి. ఈ అనుగ్రమూర్తి, అనుగ్రహమూర్తి. ఇక కైలాస శంకరుడు. ఉగ్రమూర్తి. అతనికి ఉన్న నామాలలో 'ఉగ్ర' అనేది ఒకటి.


ఇక 'ఉన్మృదిత కాల లాంఛనం' ఏమిటి? కాలలాంఛనుడుగా, కంఠంలో మచ్చ కలవాడు శంకరుడు. శంకరులు, నీలకంఠులు కాదు కదా. అది లేనివారని ఉన్మృదిత కాల లాంఛనులని అర్థం.


ఆపైన నలుపు దోషాన్ని సూచిస్తుంది. అట్టిది లేనివారని కూడా అర్థం. అనగా మచ్చలేని జీవితం కలవారని అర్థం.


కాలలాంఛనాన్ని ఆంగ్లంలో చెబితే Black Mark అనాలి. (అట్టిది లేనివారని మహాస్వామివారు చమత్కరించారు). 


కాలుణ్ణి తన్నడం వల్ల శంకరుడు కాలలాంఛనుడై అనగా ఆ మచ్చ కలవాడై యున్నాడు. కాలాన్ని జయించినవారు శంకరులు.


Saturday 4 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 91 వ భాగం



ముందతడు శంకరుల దివ్య తేజస్సునకు ఆకర్షితుడు కాలేదు. అతడెప్పుడూ కర్మానుష్టానంలో ఉండేవాడు కనుక భావావేశానికి లోనయే పరిస్థితే లేదు. అట్టివారు తత్త్వాన్ని అంగీకరించిన తరువాత నమ్ముతారు. అందువల్లనే నిష్క్రియను బోధించే నైష్కర్మ సిద్ధి అనే గ్రంథాన్ని తరువాత వ్రాసేడు. తైత్తిరీయ ఉపనిషత్తుకు వార్షికం వ్రాసే సందర్భంలో పరమశివుని అవతారంగానే శంకరులను కీర్తించాడు.


"ముముక్షు సార్ధవాహస్య, భవనామభృతో యతే" అన్నాడు. ముముక్షువులలో ముఖ్యుడని, యతీయని, భవుడని అన్నాడు. సార్ధవాహుడు వర్తకులలో ముఖ్యుడు. ఆ వర్తకుల గుంపుకు దారి చూపిస్తాడు. అందువల్ల ముముక్షువులనే గుంపునకు దారి చూపించు సార్ధవాహులు శంకరులు. సంసార సముద్రాన్ని దాటించువారు.


ఇక పద్మపాదుడు, వీరిని "భాష్యవిత్తకగురుః" అన్నాడు. వారు వ్రాసిన భాష్యాలే వారి విత్తమని అర్ధం. శంకరులు బ్రహ్మ సూత్ర భాష్యంపై పంచపాదిక వ్రాస్తూ ఇట్లా అన్నాడు. అనగా జ్ఞానమే ద్రవ్యంగా కలవారని.


పద్మపాదుని వృత్తాంతాన్ని బట్టి అతనికి పాండిత్యమూ ఉంది. వీరిపట్ల అపారమైన భక్తి కూడా ఉంది. తోటకుడు, భక్తునిగానే కన్పిస్తాడు. 


హస్తామలకుడు, జ్ఞానంలో లీనమైనవాడే.


పద్మపాదుడు వీరిపై చమత్కారంగా ఒక శ్లోకం వ్రాసేడు. అసలు శివుడొక విధంగా శంకరులొక విధంగా ఉంటారని అన్నాడు. శంకరుల కాలంలో అసలు శివుణ్ణి, ఆదిశంకరుడని, వీరిని అవతార శంకరులని కీర్తించేవారు. శంకరాచార్య పరంపరలో శంకరులనే ఆది శంకరులని అంటున్నాం. ఇతడు వీరిని అపూర్వ శంకరుడని అన్నాడు. అనగా శంకరుని కంటె భిన్నులు, విశిష్టులనే అర్థంలో, శ్లేషతో కూడిన ఈ శ్లోకాన్ని చూడండి:


"నమామ్య భోగి పరివార సంపదం

నిరస్తభూతిం అనుమార్ధ విగ్రహం

అనుగ్రహం ఉన్మృదితకాల లాంఛనం

వినా వినాయకం అపూర్వ శంకరం".


ఇందిద్దరికీ భేదాలు చూపించబడ్డాయి. అవతార శంకరులు ఆరువేల మంది సన్న్యాస శిష్యులతో కూడి ఉండేవారట. "సర్వజ్ఞం బ్రహ్మసంస్థం మునిగణ సహితం" అని సురేశ్వరుడు వీరిని పేర్కొన్నాడు. శ్లోకంలో "భోగి పరివార సంపదం" అంటే భోగాలు లేని శిష్యులు కలవారని. ఇక కైలాస శంకరుడు, భోగి పరివార సంపద కలవాడు. ఎలాగంటే శంకరుని చుట్టూ పాములే. కంఠం చుట్టూ పూలదండలలాగా పాములుంటాయి. పడగ గలిగిన పామును భోగి అంటాం. అందు నవరత్నాలుంటాయి. ఆచార్యుడు శంకరుని నుతిస్తూ కన్నులే చెవులుగా గలిగిన పాములను ధరించినవాడని కీర్తించారు.


Friday 3 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 90 వ భాగం



హస్తామలకుడు, హస్తామలక స్తోత్రంలో ప్రాణులు లేరు, దేహాదులు లేవు, ఉన్నది ఒక్కటే, ఆత్మస్వరూపమని చాటాడు. కనుక ఆచార్య స్వరూపమని, అవతార స్వరూపమని విడిగా ఉంటాయా? ఇక మిగిలిన ముగ్గురు శిష్యులు వీరిని పరమేశ్వరునిగానే భావించారు. జ్ఞాన సూర్యుడని అన్నారు.


తోటకుడు, అష్టకం చివరలో "భవశంకర దేశికమే శరణం" అన్నాడు. శంకరులను, శంకరునిగా చూస్తున్నానని అన్నాడు. ఈశ్వర నామాలలో భవుడని ఒక నామం. 'భవ'ను క్రియగా భావిస్తే అగుగాక అని అర్థం.


'భవ ఏవ భవాన్' అన్నాడు. భవాన్ అనగా నీవు భవుడవే, నీవు శివుడవే, శివుడే భవుడని అర్థం.


"భవ ఏవ భవాన్ ఇతిమే నితరాం

సమజాయత చేతసి కౌతు కతా".


శంకరులనొక మానవ మాత్రునిగా, గురువుగా మాత్రమే భావించకుండా పరమేశ్వరుడే అని నోరారా కీర్తించాడు. పూర్తిగా సంతోషంతో ఉన్నట్లు 'నితరాం... కౌతుకతా' అన్నాడు. తరువాత 'గురుపుంగవ ప్రంగవకేతన' అని సంబోధించాడు. పుంగవ కేతనుడు అనగా వృషభాన్ని జెండాగా ధరించినవాడు శంకరుడే కదా. ఇక్కడ అవతార ప్రస్తావన వస్తుంది.


ముందుగా పట్టిజడుడైన తోటకుడు, శంకరుల అనుగ్రహం వల్ల భావావేశంతో వ్రాసాడు. అట్టి భావావేశం, సురేశ్వరాచార్యునకుండదు. ఎందుకంటే ఆయన శంకరుల శిష్యుడవక ముందు కర్మమీమాంసకుడు, యాగాలు, యజ్ఞాలు చేసినవాడు. శంకరులతో ఆయనకు వాద ప్రతివాదాలు జరిగాయి.


Thursday 2 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 89 వ భాగం



సూర్యునకే సవితయని పేరు. సౌర పురాణం సూర్యుని గురించి చెబుతుంది.


ఆ సవిత, శంకరునిగా అవతరిస్తాడని, వ్యాస సూత్రాలకు సరియైన అర్థం వివరిస్తాడని, వేదసత్యాన్ని తత్త్వ రూపంలో అందిస్తాడని చెప్పింది.


"వ్యాకుర్వన్ వ్యాస సూత్రార్ధం ప్రతేరర్థం యథోచివాన్

శ్రుతేర్న్యాయ్యస్ప ఏవార్థః శంకరః సవితాననాః"

సూర్యమూర్తే ఇందు శంకరులుగా అవతరించినట్లుంది. సూర్యుడు చీకటిని పోగొడతాడు. జ్ఞాన సూర్యులైన శంకరులు, అజ్ఞానమనే చీకటిని పోగొడుతున్నారు. విద్వాంసులకు జ్ఞాన భాస్కరులని అంటున్నాం. శంకరుని శిష్యులలో ఇద్దరు, శంకరులను సూర్యునిగానే నుతించారు.


తోటకుడనే శిష్యుడు వీరినుద్దేశించి అహిమాంశురివాత్ర విభాసి అన్నాడు. హిమాంశువనగా చంద్రుడు. అహిమాంశువనగా సూర్యుడు. అతడే మంచును కరుగునట్లు చేస్తున్నాడు.


వీరి శిష్యులలో సురేశ్వరాచార్యులు, తన బృహదారణ్యక వార్షికంలో వీరిని జ్ఞాన సూర్యునితో పోల్చారు. అజ్ఞానమనే చీకటిని పోగొడుతున్నారని కీర్తించాడు. శంకర విజయంలోనే గాక ఋగ్వేదం, శివరహస్యం, మార్కండేయ సంహిత, విష్ణు ధర్మోత్తర, వాయు, కూర్మ, లింగ, భవిష్యోత్తర, సౌర పురాణాల్లో శంకరులు ఇట్లా అవతార మూర్తిగా ప్రశంసింపబడ్డారు.


ఎవరైనా స్తోత్రాలు వ్రాయవచ్చు, తత్త్వాన్ని ప్రతిపాదించవచ్చు. కాని ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వం, నడవడి దగ్గరనున్న శిష్యులకో, సేవకులకో బాగా తెలుస్తుంది. అందుకే ఆంగ్లంలో 'No man is hero to his Valet' అనే మాట పుట్టింది. అందుకే శిష్యుల మాటలను పేర్కొన్నాను. 


Wednesday 1 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 88 వ భాగం



ఇక భవిష్యోత్తర పురాణంలో కలి ప్రారంభమై రెండువేల సంవత్సరాలు గడిచిన తరువాత శంకరులు, శిష్యులతో అవతరిస్తారని చెప్పబడింది.


"కల్యాదౌ ద్విసహస్రాంతే లోకానుగ్రహకామ్యయా 

చతుర్భిః శిష్యైస్తు శంకరోవతరిష్యతి"


ఈ రెండవ పంక్తి వాయు పురాణంలోనూ ఉంది. దీనిని వ్యాఖ్యానకర్తయైన అభినవ శంకరుడు గ్రహించాడు. ఇక బ్రహ్మాండ పురాణంలో మార్కండేయ సంహితలో 72వ కాండలోని 7,8 స్కందాలలో శంకరుల చరిత్ర చెప్పబడింది. దేవతలు మొరపెట్టగా చార్వాకాది మతాల నిర్మూలనకు ఈశ్వరుడు శివగురుని భార్యా గర్భంలో అవతరిస్తాడని చెప్పబడింది:


లోకానుగ్రహతత్పరః పరశివః సంప్రార్థితో బ్రహ్మణా

చార్వాకాది మత ప్రభేదనిపుణాం బుద్ధిం సదా ధారయన్

కాలట్యాఖ్య పురోత్తమే శివగురుర్ విద్యాధి నాథశ్చయః

తతృత్న్యాం శివావతారకాంశముదితః శ్రీ శంకరాఖ్యం వహన్"