Showing posts with label ఏకాదశి. Show all posts
Showing posts with label ఏకాదశి. Show all posts

Friday, 22 November 2019

ఈ రోజు 22 నవంబర్ 2019, శుక్రవారం, ఉత్పన్న ఏకాదశి.



కార్తీక బహుళ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ఏకాదశి వ్రతాచరణలో ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అయిన ఏకాదశీ దేవిని ఉద్దేశించి ఏకాదశి ఉపవాస వ్రతాన్ని చేస్తారు భక్తులు. యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంహరించాలనుకున్న మురాసురుడిని అంతమొందించడానికి శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తియే ఏకాదశీ దేవి. అందువలన శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణ శక్తుల్లో ఏకాదశి ఒకరు. సప్తమాతృకల్లో ఒకరైన వైష్ణవి శ్రీ మన్నారాయణుని మరొక శక్తి. అందువలన ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి మాత జన్మతిథిగా జరుపుతారు. సంవత్సరమంతా ఏకాదశీ వ్రతం ఆచరించాలనుకునే వారు ఈ ఏకాదశి రోజునే ప్రారంభిస్తారు.

ఏకాదశి శ్రీ మన్నారాయణుని ఆరాధానకు అత్యంత విశేషమైనది. ఆనాడు చేసే విష్ణు నామస్మరణ, సహస్రనామపారాయణ అనేక రెట్ల ఫలితాన్నిస్తుంది.

ఓం నమో నారాయణాయ 

Sunday, 23 October 2016

హిందూ ధర్మం - 228 (జ్యోతిష్యం - 10)



తిధుల ప్రాముఖ్యత గురించి గత భాగంలో వివరించుకున్నాం. ఇప్పుడా తిధులకు, ఆయా సమయంలో ఆచరించే నైమిత్తికాలకు మధ్య శాస్త్రీయ సంబంధం చూద్దాం. ఒక్కో తిధి రోజు ఏకభుక్తం చేయాలని, ఫలానా తిధి నాడు ఉపవసించాలని మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఏకాదశినే తీసుకోండి. చంద్రుని గమనంలో, పూర్ణిమ నుంచి అమావాస్యకు, అమవాస్య నుంచి పూర్ణిమకు మధ్యలో 11 వ తిధి ఏకాదశి. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా ఉపవసించడం అందరికి తెలిసిందే.

ఆధునిక సైన్స్ ప్రకారం వాయు పీడనం (air pressure) అమావాస్య, పూర్ణిమల్లో తీవ్ర పరిమితుల్లో ఉంటుంది. దీనికి కారణం సూర్య, చంద్ర, భూ కక్ష్యల స్థానాలే. దీన్ని ప్రకృతిలో సముద్రం వద్ద గమనించవచ్చు. ఆ రెండు రోజుల్లో ఉధృతంగా ఉండే కెరటాలు, తర్వాత రోజు నుంచి మాములుగా ఉంటాయి. పీడినం తగ్గిందనడానికి సూచకంగా.

సైన్సు ప్రకారం, మనం తిన్న ఆహారం మెదడును చేరడానికి 3-4 రోజులు పడుతుంది. మనం ఏకాదశి రోజు ఉపవసించినా, అల్పాహారం తీసుకున్నా, ఆ ఆహారం అమవాస్య, పూర్ణిమ తిధులకు మెదడుకు చేరుతుంది. ఈ రెండు రోజుల్లో, భూమి పీడనం (pressure) అధిక స్థాయిలో ఉంటుంది, దాని కారణంగా అన్నిటి యందు సమతుల్యత లోపిస్తుంది, మానవుల ఆలోచనా విధానంలో కూడా.  మెడదకు పంపే ఆహారం కూడా చాలా తక్కువ ఉంటే, అధిక పీడనం కారణంగా మెడదు దారి తప్పి ప్రవర్తించే అవకాశం కూడా తగ్గిపోతుంది.

అలాగే చంద్రగతిలో వాతవరణ పీడనం ఏకాదశి తిధిన అత్యల్పంగా ఉంటుంది మిగితా తిధులతో పోల్చితే. అందువల్ల ఇది ఉపవసించి, ప్రేగులను శుభ్రం చేసుకోవటానికి చాలా మంచి సమయం. అదే ఆ తర్వాత రోజున పీడనం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. కనుక ద్వాదశి రోజు ఉదయమే, సుర్యోదయం కాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారణ(భోజనం) చేసి ఉపవాస వ్రతాన్ని ముగించమని శాస్త్రం చెప్పింది. లేకుంటే కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని. ఇలా ప్రతి శుక్ల పక్ష, కృష్ణ పక్ష ఏకాదశులకు ఉపవాసం చేయడం మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇందులో ఎంతో శాస్త్రీయత కూడా ఉంది. చూడండి తిధులు, ఆ రోజు వాతావరణంలో ఏర్పడే మార్పులు, అవి శరీరం మీద చూపే ప్రభావాలను ఎంత చక్కగా గుర్తించో మన సనాతన ధర్మం. అలానే మన సంప్రదాయంలో ఎన్నో పండుగలకు, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ ఒక విషయంలోనే ఖగోళ, వాతావరణ, వైద్య, ఆధ్యాత్మిక శాస్త్రాల సమన్వయం, పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. శాస్త్రంలో ఒక చోట ఒక మాట చెబితే, దాని వివరణ వేరే శాస్త్రంలో ఉంటుంది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం వేరు కాదు. అన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఆ సమన్వయం సనాతనం, అదే భారతీయం.

మనమొక విషయం గమనించాలి. ఏకాదశి రోజు ఉపవసించాలని చెప్పిన శాస్త్రమే కొందరికి మినహాయింపు ఇచ్చింది. బ్రహ్మచారులు, రోగులు లేదా ఔషధ సేవనం చేసేవారు, ముసలివారు, కాయకష్టం చేసేవారు, నిత్యం చెమట చిందించి పని చేసే రైతులు, కూలీలు ..... వీళ్ళు ఉపవాసాలు చేయవలసిన పనిలేదు. వారికి చేయకపోయిన దోషం ఉండదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా శాఖాహారులైతే, తరుచుగా ఉపవసించకూడదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం తినే బియ్యంలో బలం లేదు, పాలు కల్తీ, కూరలకు ఎరువులు వేసి పండిస్తున్నారు, పర్యావరణం అంతా కలుషితమైపోయింది. ఉపవాసం చేయమని చెప్పిన శాస్త్రమే బలమైన ఆహారం కూడా స్వీకరించమని చెప్పింది. ఏమి తినాలో, ఎలా పండించినవి, ఎలా వండుకుని తినాలో కూడా చెప్పింది. అవేమీ చేయకుండా తరుచూ ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.

To be continued ...................

Wednesday, 31 December 2014

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం

ఓం నమో నారాయణాయ

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పాలసముద్రంలో యోగనిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి తో కలిసి గరుడవాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తరద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహా విష్ణువును పూజించారని పురాణ కధనం.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు 33 కోట్లమంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగివస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు.

కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర ' అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండే వాడు. వాడు దేవతలను గాలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవతలు వైకుంఠం విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణువు వారి దీనస్థితిని చూడలేక భూమికి దిగివచ్చి మురాసురుణ్ణి అంతం సంహరించాడు. ఆ సంహారం ఈ ఏకాదశి నాడే జరిగింది. విష్ణు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన రోజు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు.

ఈ రోజున విష్ణుముర్తి ఆలయాలు, ఆయన అవతారాలకు సంబంధించిన ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనిని స్వర్గ ద్వారం అంటారు. ఈ ద్వార వెళ్ళి పరమాత్మను దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది.

"ఉత్తరద్వార దర్శనం" గురించి తాత్వికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరం అంటే పైభాగం అని, తరువాత వచ్చేది అని అర్ధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జీవన విధానం నుంచి ఉన్నత స్థితికి, భౌతికజీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి ఇది నాంది పలుకుతుంది.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఊర్ధ్వముఖంగా (పైకి) ప్రయాణింపజేసి ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి, బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలోఐక్యమవడమే ఉత్తరద్వార దర్శనం అని చెప్పవచ్చు.

వైకుంఠ ఏకాదశి ఉపవాస విశేషాలు

ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు.

మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.

జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.

మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురుగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి. ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు,దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్ప్లులు కూడా వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

దశమి నాడు ఉదయమే లెచి శిరస్నానం చేసి, ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి,భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి.ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు,ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి.విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి,  ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి,  పారణ(భోజనం)చేయాలి.ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.

ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.

ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం.
ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం.మనశ్శంతిని,తద్వార పరమగతిని పొందుదాం.             

ఓం నమో లక్ష్మీనారాయణాయ