Sunday, 5 January 2014

రోజు ఇంట్లో దీపారాధనకు పాటించవలసిన నియమాలు ఏంటి?

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.

అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.

ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా.    

5 comments:

  1. దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం.దీపం తేజస్ తత్వానికి ప్రతీక. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.ఇంట్లో శాంతి నెలకొంటుంది

    ReplyDelete
  2. Thank you sir ,for great article.

    ReplyDelete
  3. Thanks for sharing this. Please visit our hand drawing art gallery Ganpati Painting

    ReplyDelete