Tuesday 31 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 87 వ భాగం



శివసాయుజ్యం పొందిన వారి భక్తి గురించే యుంటుంది. భక్తిని, జ్ఞానానికి అంగంగా శంకరులు భావించారు. కేవలం భక్తికే పట్టం గట్టలేదు. అయినా నాయనార్ల సరసన వీరి చరిత్ర ఉండడం వల్ల దీని ప్రామాణ్యాన్ని పేర్కొంటున్నాం. ఆపైన వీరిని ఈశ్వరావతారంగా భావించింది.


తొమ్మిదవ భాగంలో పదునొకండవ అధ్యాయంలో ఒక ఉత్తమ బ్రాహ్మణుడు నా అంశతో చచలగ్రామంలో (కాలడిలో) పుట్టబోతున్నాడని శంకరుడు, అమ్మవారితో చెప్పినట్లుంది.


"కేరళే చలచల గ్రామే, విప్రపత్న్యాం మదంశజః

భవిష్యతి మహాదేవి శంకరాభ్యో ద్విజోత్తమః" ఇక కూర్మ పురాణంలో శంకరావతారం:


"కరిష్యత్యవతారం స్వం శంకరో నీలలోహితః

శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భూతానాం హితకామ్యయా" అనగా లోకహితం కోసం నీలలోహితుడు (శివుడు) పుట్టబోతున్నాడని అర్ధం. శివుణ్ణి ఎఱ్ఱవానిగా, తెల్లనివానిగా వర్ణనలున్నాయి. వేదాలలో రాగి, అరుణ, నీలలోహిత వర్ణాలతో నున్నట్లుంటుంది. ఎర్రని శివుడు, నీలమైన అమ్మవారిని ఎడమవైపు ధరించి యుంటాడు. హరి హరమూర్తిగా నున్నపుడు నీలలోహితుడు. కృష్ణ పింగలం అని కీర్తించినపుడు ఆయన ఎరుపు, విష్ణువు (కృష్ణ) నలుపు. పింగలుడనగా ఎర్రని శివుడు.


శ్రాత స్మార్త కర్మల ప్రతిష్టాపనకై పుడతాడని అన్నాడు. ఇక లింగ పురాణంలో, కలిలో వేదవిద్యలడుగంటుతాయని, వాటిని నిందిస్తారని, రుద్రుడు శంకరులై పుట్టి కలి దోషాన్ని పోగొడతాడని యుంది:


"కలౌ రుద్రో మహాదేవః శంకరో నీలలోహితః"


Monday 30 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 86 వ భాగం



శివుని ఇతిహాసం చెప్పేది శివరహస్యం. ఇది 50 వేల శ్లోకాలతో ఉంటుంది. దీనిని నిర్ణయ సింధువు వంటి ధర్మశాస్త్ర నిబంధన గ్రంథము ప్రామాణికమని పేర్కొంది. సుబ్రహ్మణ్యుడు, జైగీషవ్యునకుడనే ఋషికి ఉపదేశమిస్తే అతడు నైమిశారణ్యంలోని ఋషులకు అందించాడు. అట్లా లోకంలో ప్రచారమైంది. దీనిని జైగీషవ్యుడు సంకలనం చేసాడు. పరమేశ్వరుడు, అమ్మ వారికి చెప్పగా నేను నీకు చెబుతున్నానని సుబ్రహ్మణ్యుడే అన్నాడు.


ఇది 12 అధ్యాయాలతో ఉంటుంది. అంతా శివుని గురించే. తొమ్మిదవ భాగంలో శివభక్తుల గురించి ఉంటుంది. 63 నాయనార్ల చరిత్ర ఉంటుంది. మారికూవరం దగ్గర కంజనూర్లో ఒక వైష్ణవుడుండేవాడు. అతడు శైవుడై అతిహరదత్త శివాచార్యుడయ్యాడు. అతని కథ కూడా అందే ఉంది. మన శంకరుల చరిత్ర కూడా ఉంది. రాబోయే కథలను జ్ఞాన దృష్టితో పరికించి చెప్పబడిన కథలవి.


అద్వైతియైన శంకరుల గురించే కాకుండా భక్తుడైన శంకరుల గురించే యుంటుంది. వారు శివుడు, విష్ణువు, అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతలపై అనేక స్తోత్రాలు చేసారు. కనుక వారు జ్ఞానులు, భక్తులూ కూడా.


అమ్మవారి గురించి సౌందర్యలహరియే వ్రాసారు. శ్రీ యంత్రాన్ని అనేక ఆలయాలలో ప్రతిష్ఠించారు. విష్ణు సహస్రనామాలకు భాష్యం వ్రాసారు. వారి మఠాలలో కొలిచేది, చంద్రమౌళీశ్వరుడినే. శివానందలహరిని శివునిపై వ్రాసేరు. అందువల్ల శివ భక్తునిగా శివరహస్యం పేర్కొంది.


కాలడిలో పుట్టుక దగ్గరనుండి కంచిలో ముక్తి పొందేవరకూ వీరి చరిత్ర అందులో ఉంది. పరమేశ్వరుడు పంచ స్ఫటిక లింగాలిచ్చినట్లు కూడా ఉంది. అద్వైత ప్రతిష్టాపనం గురించి ఇది స్పృశించదు.


Sunday 29 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 85 వ భాగం

 

దీని తరువాత వ్యుప్తకేశ పదముంది. ఈ పదం, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, జాలరి వంటి కులాల పదాల మధ్యలో రాదు. ఈ రెండు పదాలు విడిగా చెప్పబడ్డాయని, ఏక వచనాంతములని అన్నాను. వ్యుప్తకేశునిగా అనగా సన్న్యాసిగా ఉంటాడు. 24 శివమూర్తులలో తలగొరుగుకొన్న మూర్తి కనబడడు. అన్ని మూర్తులు జటాధారులై యుంటాయి. అతడే అవతారంలో అట్లా ఉన్నాడంటే కేవలం శంకరాచార్యులు అవతారంలోనే. అట్లా అభినవ శంకరులు వ్యాఖ్యానించారు.


ఆ ఆధారం ఒక్కటీ సరిపోతుందా? పురాణాల ఆధారాలను చూపిస్తాను. ఇతిహాస పురాణ జ్ఞానం లేకుండా వేద మంత్రాలు అర్థం కావు. అన్నిటినీ కలిపి చదివిన వానిని బహుశ్రుతుడని అంటారు. వీటిని జోడించంకుండా వేదానికి అర్థం చెబితే వేదం, భయపడుతుందనే శ్లోకం ఉంది.


"ఇతిహాసపురాణాభ్యాం వేదం సముప బృంహయేత్

బిభేతి అల్ప శ్రుతాత్ వేదో మా మయం ప్రతరిష్యతి”


ఏమిటా భయం? ఇష్టం వచ్చినట్లు మా మంత్రాలకు అర్థం చెబుతున్నాడని వేదం భయపడుతుందట. కనుక వ్యాఖ్యానకర్త వ్యుప్తకేశుడెవరని పురాణాలను శోధించాడు. తాను చెప్పే మాటలకు పురాణాధారం చూపించాలి కదా!


శివ రహస్యం అనే గ్రంథంలో వ్యుప్తకేశుడనగా శంకరులనే ఉంది. ఇక శ్రుతిలో ఉన్నదానిని విష్ణు ధర్మోత్తర పురాణం బలపరిచిందని తెలుస్తోంది.


Saturday 28 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 84 వ భాగం



ఇక యజుర్వేదంలో - వేదాలకు త్రయి యని పేరు. బుక్, యజుస్, సామములు. అందు మధ్య యజుర్వేదం. ఆలయం మధ్యలో గర్భగృహం ఉన్నట్లు కర్మకాండలకు అది ప్రాధాన్యం. (బొమ్మ గీయడానికి గోడ ఆధారమైనట్లుగా కర్మకాండలకిది ఆధారమనే ప్రమాణం కూడా ఉంది - అనువక్త)


యజుర్వేదం 7 కాండలతో ఉంటుంది. అందు మధ్యలో రుద్రమంత్రాలుంటాయి. ఆ రుద్రం మధ్యలో శివ పంచాక్షరి మంత్రం. ఆ మంత్రానికి ముందుగా శంభు, శంకర పదాలున్నాయి. పంచాక్షరిలో శివనామం. ఆ పై రెండు పదాలూ ఈ మంత్రాన్ని నడిపిస్తున్నాయి. ఆచార్యుని నుండి పంచాక్షరిని ఉపదేశం పొందాలి. ఆచార్యుడే మన శంకరులు. ముందు శంభువై, తరువాత శంకరుడయ్యాడని చెప్పాను. రుద్రంలో శంభవే... శంకరాయ... పదాల తరువాత పంచాక్షరి ఉంది. శంభువు, శంకరులయ్యాడు. రుద్రానికి, అభినవ శంకరులు వ్యాఖ్యానం వ్రాస్తూ మన శంకరుల ప్రస్తావన అందున్నట్లు వ్రాసేరు. చరాచర వస్తు ప్రపంచం అంతా శివమయమని రుద్రంలోని మంత్రాలుంటాయి. ఇందు మూడు వందల మంత్రాలుండడం వల్ల నామావళిగా, రుద్ర త్రిశతిగా రూపొందింది.


ఇందు రుద్రునకు అసాధారణ నామాలూ ఉన్నాయి. సాధారణ నామాలు బహువచనంలో వాడబడ్డాయి. అసాధారణ నామాలు, ఏకవచనంలో ఉన్నాయి. ఉదాహరణకు కూర్చున్నవారికి, నిలబడినవారికి నమస్కారాలంటూ అసాధారణ నామాలైన కపర్ది, వ్యుప్తకేశ పదాలు వాడబడ్డాయి. కపర్ది యనగా జడలు కలిగినవాడు. వ్యుప్తకేశుడనగా తలగొరుగుకొన్నవాడు, ముండి.


కపర్దమనగా జట. జటలున్న ప్రతివానినీ కపర్దియని అనం. పరమేశ్వరుని జటకే కపర్దమని అంటాం. మిగిలిన దేవతల నెత్తిపై కిరీటాలను ధరిస్తారు. కాని శివుడు యోగియై నెత్తిపై జటలతోనే ఉంటాడు.


Friday 27 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 83 వ భాగం



ఋగ్వేదంలో పరోక్షంగా శంకరుల గురించి యుందని వ్రాసేరు:


"శ్రీరామం ప్రతి పుష్కరాభిధ మహాయక్షేన వేదత్రయీ 

వ్యాకరణావసరే విశిష్య కథితం, శ్రీ విష్ణు ధర్మోత్తరే 

ఏతాం ధేనుముపాహ్వయామి సుదుఘాం ఇత్యుద్రథం శంకరా 

చార్యం శిష్య చతుష్టయేన సహితం వందే గురుణాం గురుం" 


ఇందు గురువులకు గురువని యుంది. శ్లోకారంభంలో శ్రీరామం ఉంది. శంకరులకు రామునకు ఏమి సంబంధం?


రామాయణంతోనే రామచరిత్ర, పూర్తికాదు. అందు చెప్పనవి మిగిలిన గ్రంథాలలో ఉన్నాయి. అందులో ఒకటి యోగవాసిష్ఠం లేదా జ్ఞాన వాసిష్ఠం. రెండవది విష్ణుధర్మోత్తర పురాణం. వసిష్ఠుని నుండి అద్వైత జ్ఞానాన్ని రాముడు పొందాడు. అది విష్ణుపురాణానికి అనుబంధం. పుష్కరుడనే యక్షుడు రామునకట్టి ఉపదేశం ఇచ్చాడు. అందుకే శ్లోకంలో 'పుష్కరాభిధ మహాయక్షేన' అని ఉంది. రాముడే ఉపదేశం పొందాడంటే ఇచ్చిన వాడు పెద్దవాడై యుండాలి కదా. అందుకే మహాయక్షుడు వేదసారాన్ని అందించాడు. ఇక వేదమంత్రం గురించి:


"ఏతాం ధేనుం ఉపాహ్వయామి సుదుఘాం" (ఋగ్వేదం ప్రథమ మండలం - 164 సూక్తం, 26వ మంత్రం) ఆవు తనే పాలనిచ్చి దూడను సాకుతున్నట్లు ఈశ్వరుడట్లా ప్రజలను పాలిస్తున్నాడని ఈ వేదమంత్రానికి అర్ధం. విష్ణు ధర్మోత్తరంలో ఈ మంత్రానికి పరోక్షంగా అర్థం చెప్పబడినదని పుష్కరుడు రామునితో అన్నాడు. అద్వైతతత్త్వం మరిచిపోయిన కాలంలో ఆవు దూడకు పాలునిచ్చునట్లుగా పరమేశ్వరుడు శంకరాచార్య స్వామిగా వచ్చి జ్ఞానాన్ని అందిస్తాడని అంతేకాదు, నల్గురు శిష్యులతో అవతరిస్తాడని భాస్కరాచార్యుల వారు వ్రాసేరు.


Thursday 26 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 82 వ భాగం




దక్షిణామూర్తి అనుగ్రహంతో అట్టివారు చరిస్తూ ఉంటారు. రామకృష్ణ అవతారాలు గడిచినా భక్తులను నేటికీ వారు అనుగ్రహించడం లేదా? ఎట్లా? అనుగ్రహం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటుంది. భక్తి పెంపొందినకొలదీ అనుగ్రహం, మానవ రూపాన్నెత్తుతుంది. కనుక శంకరులు అనుగ్రహ శక్తితో నేటికీ ఉన్నారు .


శంభువనగా, సుఖం ఈయన వలన కలుగునని అర్థం. సుఖ రూపియై యుండువాడు. ఆయన ఉత్పత్తి చేస్తాడు. పంపిణీదారుడు కాదు. దానికి తగ్గ ప్రతినిధులుంటారు. మిల్లుల్లో తయారైన వస్తువులు, వాటికి పంపిణీదారులు వివిధ ప్రదేశాల్లో లేకపోతే తయారైన చోటే అవి నిలవ యుండిపోతాయి. కనుక శంభువు, శంకరుడు కావాలి. అనగా ఈ పదానికి సుఖమును చేస్తాడని. ఆయన నానా ప్రదేశాలు తిరగాలి. గంగ, గంగోత్రిలో పుట్టి నానా ప్రదేశాలు తిరిగి చివరకు ఇంట్లోని గొట్టాల ద్వారా మన దగ్గరకు వస్తోంది. అట్లా జ్ఞానాన్ని శంకరులందించారు. దక్షిణామూర్తిని సమీపించలేము, అతడే ప్రజల దగ్గరకు శంకరులుగా వచ్చాడు.


అవతార విషయమై ఆధారాలు


శంకర విజయంలో శంకరుడే, శంకరాచార్యులుగా అవతరించినట్లుంది. ఆ వ్రాసినవారు శంకర భక్తులై అట్లా వ్రాసియుండవచ్చు అని శంకిస్తారు. దానికంటే ఇతరమైన ఆధారాలను చూపిద్దాం.


వేదం కంటె మించిన ప్రమాణ గ్రంథం లేదు కదా! అయితే అక్కడ పరోక్షంగా ఆధారం చూపబడింది. ఇది యజుర్వేదంలోని నమక మంత్రాలలో ఉంది. అట్లే ఋగ్వేదంలోనూ ఆధారముంది. వాటికంటే ముందుగా, 18వ శతాబ్దంలో 95 సంవత్సరాలు జీవించిన భాస్కర రాయల మాటలను చెబుతాను. ఆయన పేరునకు తగ్గట్లు విద్వత్ సూర్యుడే. మంత్ర శాస్త్ర రహస్యాలను లోకానికి అందించినవాడు. దేవీ భక్తుడు. లలితా సహస్రనామంపై ఆయన వ్రాసిన వ్యాఖ్య ప్రసిద్ధమైనది. వారే శంకరులను నుతిస్తూ శ్లోకాలు వ్రాసేరు. 

Wednesday 25 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 81 వ భాగం



అన్ని నదులకూ ఒక మూలం ఉంటుంది. అది ఒక సన్నని త్రోవలా ఉంటుంది. అక్కడ నీరు నిలవగా ఉంటుంది. గంగోత్రికి ఉత్తరాన అట్లా ఉంటుంది. గంగ, ఆవు ముఖంలా ఉండే గోముఖి అనే రాతి తొర్రలో నుండి ప్రవహిస్తుంది. కావేరీ నది కూడా మూలమైన తలకావేరీలో సహ్యాద్రి కనుమలలోని కొడగులో అట్లాగే ఉంటుంది.


ఆ సన్నని త్రోవనుండి నీరు ప్రవహిస్తే ప్రజలకు లాభం లేదు. కానీ రొద చేసుకుంటూ పోతున్న నదీ ప్రవాహం ప్రజల అవసరాలు తీరుస్తుంది. దక్షిణామూర్తి కూడా శబ్దం చేయని సన్నని త్రోవలోని నీరులాగా ఉంటాడు. నదీ మూలాన్ని కొందరే గుర్తిస్తున్నట్లుగా సనకాదులే అతణ్ణి సమీపించగలరు. మామూలు జనులు సమీపించలేరు.


2500 సంవత్సరాల వెనుక ఉన్నవారు, అట్టివారి ఉపదేశాలు వినక, గురూపదేశాలు వింటున్న కాలమది. వారు అజ్ఞానమనే అరణ్యంలో చిక్కుకొన్నారని శ్లోకంలోని 'అజ్ఞానంతర్గహన పతితం' మాటకు తాత్పర్యం. అంతేకాదు, ఆ అరణ్యంలో దావాగ్ని కూడా ఉంది. ఇక చెప్పేదేముంది? . అజ్ఞానమనే అరణ్యంలో చిక్కుకున్నారు. సంసారమనే దావాగ్ని మధ్యలో ఉన్నారు. అందుకే 'భవదావశిఖాతాప పాపచ్చమానాన్' అక్కడ జ్ఞాన తీర్థంలో, దక్షిణామూర్తి సేద తీరుతున్నాడు. ఈ దావాగ్ని చల్లారాలంటే ఆ నీరు విడుదల కావాలి ! భగీరథుడు, గంగను తీసుకొని వచ్చినట్లు ఆ గంగను ఎవరైనా తీసుకుని రాగలరా? ఇప్పుడు తనంతట తానే రావాలి. దయయే కారణం కావాలి.


అందుకే లోకాలను విడిచాడు. 'ముక్త్యామౌనం'. ఆ చిన్ని గుంట నదిలా మారింది. అది జ్ఞాన గంగగా మారింది. శంభువు శంకరుడయ్యాడు, శాశ్వత సుఖాన్నిచ్చేవాడయ్యాడు. కదలనివాడు, కదిలే శంకరుడయ్యాడు. దక్షిణామూర్తి, మూలవిరాట్టయితే శంకరులు, ఉత్సవమూర్తిగా అయ్యారన్నమాట. ఎప్పుడో కదిలాడని కాదు. కదులుతూ ఉన్నాడని 'చరతి' అని వాడబడింది. ఎప్పుడో శంకరులుగా అవతరించిన వారిప్పటికీ వర్తమాన కాలంలో కూడా చరిస్తున్నారని చెప్పబడింది.


Tuesday 24 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 80 వ భాగం



శంభువే శంకరుడు


"అజ్ఞానాం తర్గహన పతితం ఆత్మవిద్యోపదేశైః 

త్రాతుంలోకాన్ భవదావశిఖాతాప పాపచ్యమానాన్ 

ముక్త్యామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ 

శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా"


- మాధవ శంకర విజయం (4-60)


శంభువు, ప్రపంచంలో సంచరిస్తున్నాడని వర్తమానం కాలంలో చెప్పబడింది. గమనించండి.


స్వామి శంభువు. అమ్మవారు శాంభవి. శాంభవీ దీక్ష అనే మాటను విన్నారు కదా. శం అనగా శాశ్వత సుఖం. రెండు రకాల శుభాలున్నాయి. ఒకటి శం. రెండవది 'మయస్'. రుద్రంలో "మయోభూః", "శంభు" అనే పదాలున్నాయి. ఒకటి మామూలు సుఖమని, రెండవది శాశ్వత సుఖమని వ్యాఖ్యానకర్తలు వ్రాసేరు.


శంభువనగా శాశ్వత సుఖం పుట్టినచోటు. అనగా మోక్ష సుఖం లభించేచోటు. అందువల్ల శంభువు.


దక్షిణామూర్తి మఱ్ఱి చెట్టు క్రింద ఆసీనుడై యుంటాడు. ఎందుకు? ఒకడు మాట్లాడుతూ ఉంటే వినేవాడుండాలి కదా! తనకంటె వేరొకడు లేడని అనినపుడు బ్రహ్మజ్ఞానిగా నున్నపుడు మాట్లాడడమేమిటి? అందువల్ల మౌనం. మాట్లాడాలంటే మనస్సుండాలి కదా. మాయవల్ల ఏర్పడిన మనస్సే అతనికి లేదు. అది లేనపుడు మాటేమిటి? అఖండ మౌనంలో ఉండిపోతాడు.


Monday 23 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 79 వ భాగం



ఈ పెద్దలు కూడా ఒక దశలో ఏమిటి ఇదంతా? ఈ మాయేమిటి? అన్నవారే. మనము కూడా స్వార్థ పూరితమైన కర్మలనే తెరను క్రమక్రమంగా తొలగించుకోవాలి. అంతేనే కాని నేనీ సేవ చేస్తున్నానని, చేస్తానని బిగుసుకొని పోయి యుండడం చీకట్లో తచ్చాడడమే.


తనకు జ్ఞానరేఖలు పొడసూపుతూ ఉంటే కోట్ల కొలది కర్మఫలాలు అనుభవించే ప్రాణులకు నేను చేసే సాయం ఏపాటిది? నా సాయం లేకపోతే ఇతరులుద్ధరింపబడేది ఎలా? అనే అహంకారం రానీయకూడదు. ఈశ్వరలీల కొనసాగుతూనే ఉంటుంది. నిమిత్తమాత్రుడవని భావించాలి. ఇట్టి భావాలనూ తొలగించి ధ్యానంలో ఉండి ఆత్మ విచారణ చేయాలి.


పని చేయకపోయినా ప్రపంచానికి మంచి చేసినట్లే


నిష్క్రియంగా ఉన్న జ్ఞానివల్ల, ఏ ఉపయోగం లేదని భావించకండి. అట్టి జ్ఞానుల సన్నిధిలో శాంతి మనకు లభిస్తుంది. శుకుడు, జడభరతుడు, సదాశివ బ్రహ్మేంద్రయోగి వంటి వారి మాటలను విన్నా శాంతి లభించడం లేదా?


అట్టివారిని సమీపిస్తే ప్రాపంచిక సమస్యలూ తీరుతాయి. ఆ సమస్యలను తీరుస్తున్నామని వారనుకోరు. ఇట్టి విషయాన్ని అవగతం చేయడానికే దక్షిణామూర్తి అవతరించాడు. ఇంతవరకూ ఇట్లా ఉన్నా ఇట్టి స్థితియొక్క గొప్పస్థితిని తెలియపర్చడంకోసం అవతరిస్తానని శంకరులుగా అవతరించాడు. నిష్క్రియంగా ఉండండని మనం నిరంతరం మాట్లాడుతున్నాం, ప్రచారం చేస్తున్నాం చూసారా (అని స్వామి నవ్వుకున్నారు).

Sunday 22 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 78 వ భాగం



స్వార్థంతో ఉండడం కాదు


నీవొక జీవుడవనుకొని, డబ్బు, అధికారం, మొదలైనవి సంపాదించడం స్వార్ధ పరత్వం. వీటిని ఇతరులకు త్యాగం చేయవలసి వస్తుంది. ఇక కేవలం ఆత్మగా భావిస్తే, క్రియారహితుడవైతే స్వార్ధమూ లేదు, ఇతరులకు సాయం చేయడం అంటూ ఉండదు. కేవలం నేను అనేది పోతే ఇక స్వార్ధం ఎక్కడ? శాశ్వత సత్య స్థితిలో ఈ నేను పోయినపుడు ఇతరులకొరకై చేస్తున్నాననడం అసందర్భం. 


అట్టి క్రియారహిత స్థితి చేరుకోనంత వరకూ కార్యక్రమాలు చేయవలసిందే. ఆ పై స్థితి, ఎందుకు పట్టుబడడం లేదు? ఎన్నో కర్మఫలాలు వెంటబడుతూ ఉండడంవల్ల దీనిని తెలిసికోలేకపోతున్నాం. దుష్టకర్మ ఫలాలనుండి తప్పించుకోవడం కోసం శాస్త్ర కర్మలు చేయాలి. ఇతరులకు సాయమూ చేయాలి. ఆ అడ్డు వచ్చే తెర, అట్లాగే ఉండుగాక, నేను చీకట్లో ఉంటానంటే అది తెలివైన పనికాదు. ఈశ్వరుని సంతోషపెట్టడమూ కాదు. "ఉద్ధరేత్ ఆత్మనాత్మానం" = నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవు విడుదల చేసుకోవాలి. "న ఆత్మానం అవసాదయేత్" = నిన్ను నీవు తగ్గించుకోవద్దు. జ్ఞానమార్గంలో అడుగు బెట్టనని కర్మలోనే మునిగిపోతానని పట్టుబట్టకు, "ఆత్మా ఏవహి ఆత్మని బంధుః" = నిన్ను నేను విడిపించుకోగలిగితే ఆత్మయే నీ దగ్గర బంధువు "ఆత్మా ఏవరపు రాత్మనః" = నేను ప్రయత్నం చేయనని బిగుసుకునిపోతే నీవే నీకు శత్రువౌతావు, అని భగవానుని మాటలు నా ఆత్మకు ఏదైనా కానీ, నేను ప్రపంచానికి మంచి చేస్తానని భీష్మించుకొంటున్నావు. ఆ మంచి ఫలాలు నీ చేతిలో లేవు, పైవాడి చేతిలో ఉన్నాయని మరిచిపోతున్నావు. నీవనుకున్నవి జరగకపోవచ్చు కూడా.


మోక్షసుఖం కూడా అక్కర్లేదు. ప్రాణులకు సాయం చేస్తామనేవారి మాటలు, మనం ప్రాథమిక దశలో ఇతరులకు సాయం చేయాలని బోధించడానికే, కేవలం స్వార్ధంతో ఉండకూడదని హెచ్చరించడానికే. పైవారు మోక్ష సుఖాన్ని కూడా త్యజిస్తున్నారంటే మనము కేవల స్వార్ధపూరితమైన పనులను విడిచిపెట్టాలని బోధించడానికే.


Saturday 21 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 77 వ భాగం

 


మోక్షం కోసం దిగులు పడడం లేదు, అది వస్తే రానీ, సేవ చేయడం నా వంతని అనడం కూడా అహంకార సూచకమే. 

 

సరే నీవు మంచి చేస్తున్నావు. ఈశ్వరుడు నీకొక మనస్సు నిచ్చి మాయతో బద్ధుణ్ణి చేసాడు. అంతటితో ఆగకుండా సాధన మార్గాన్ని ఉపదేశించాడు. కర్మబంధాల నుండి విముక్తిని పొందే మార్గాన్నీ నీకుపదేశించాడు. అట్లా ఉన్నప్పుడు నేనీ కర్మలోనే ఉండి, అనగా ఈ కారాగారంలోనే ఉండి ఇందున్నవారికి సాయం చేస్తానని అనడం ఏమిటి? అతని ఆజ్ఞను పాటించవద్దా? నీవు చేసే పని అంతా కర్మబద్ధులకే అని గుర్తుంచుకో. కారాగారంనుండి విడుదల చేయటం నీవల్ల కాదు. అది వాని చేతిలో ఉంది. ప్రతివాడూ ప్రయత్నిస్తే అతడు తాళాలు తెరుస్తాడు. నీవు చేసేదంతా సంసారంలో కొట్టుమిట్టాడుతున్నవారికే. అందులో ఉన్నవారికి సాయం చేసి తృప్తి పొందుతానంటే, జ్ఞాన మార్గాన్ని పట్టుకోనంటే, అఖండానందం అక్కర్లేదనుకుంటే అది ఎంత మూర్ఖత్వమో ఆలోచించు. తెలియకుండానే నీలో అహంకారం గూడు కట్టుకొని యుంది సుమా!

 

అప్పుడీశ్వరుడేం చేస్తాడు? ఇట్లా సేవ చేసినా చిత్తశుద్ధి ఏర్పడితే చాలని అనుకుంటాడు. చేసేది నిజమైన సాయం కాకపోయినా కర్మయోగమైనా చేస్తున్నాడని ఊరుకుంటాడు. నా సృష్టి గురించి నేను చూసుకుంటాను. నన్నొక సాధనంగా వాడుకొని నిన్ను బాగు చేయడానికి ఉపయోగిస్తా. ఇతరులకు సాయం, నీవల్లనే జరగదులే అని భావిస్తాడు.

 

ఈశ్వరునికి లేని బాధ నీకెందుకు? అతడు నీకిచ్చిన మనస్సును శుభ్ర పరచులేకపోతున్నావు. ఎవరికో సాయం చేద్దామని అనుకుంటున్నావు. చిత్తం అటూ ఇటూ తిరకుండా మంచి కర్మలను చేయవలసిందే. ఆత్మవిచారానికి అనువుగా నున్నపుడు కూడా నేను కర్మనే చేస్తాను, లోకాన్ని ఉద్దరిస్తానని అనడం ఏమిటి? ఏదో జరిగిపోయిందని ఊహించుకుంటున్నావు.

Friday 20 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 76 వ భాగం



కర్మలో మునుగుట లక్ష్యము కర్మరహిత స్థితి


చాలా పనులు చేయవలసి వస్తే వాటిని క్రమపద్ధతిలో చేస్తాం. ఉన్నది. ఒక్కటే అయినపుడు క్రమ పద్ధతి యొక్క అవసరమే ఉండదు. ఆ ఒక్కటే ఉన్న స్థితిలో రెండవవాడు లేడు, సాధనం లేదు, క్రియ లేదు. అయితే నిత్య వ్యవహారమంతా క్రియలతో కూడింది. క్రియ లేకుండా ఎట్లా ఉండగలమని ప్రశ్నించడం కాదు. ప్రాథమిక దశలో కర్మయోగం ఉండాలని గీతలో ఉంది కదా! ఉన్నతస్థితిలో ఏ పనీ లేదనీ ఉంది. "తస్య కార్యం నవిద్య తే" అయితే చివరి మాటను మొదటినుండీ మరిచిపోకూడదని, క్రియారహిత స్థితిని గీతలో ముందే వివరింపకపోలేదు.


లోకంలో మనం మంచి పనులు చేస్తున్నాం. తగిన లాభాన్ని పొందుతున్నాం అంటారు. అది అహంకారాన్ని సూచించడం లేదా? ఆ అహంకారాన్ని అణచడం కోసం ఏ మంచి చేసినా కొంత చెడు జరుగుతూ ఉండడాన్ని పరాశక్తి ఏర్పాటు చేసింది. లేకపోతే చేసేవాడి అహంకారాన్ని పట్టుకోలేం. మంచి చెడులు, సాపేక్షికం. ఓటములు తటస్థిస్తున్నాయి. సాయంలో కొందరికి అపకారాలు అందుకే జరుగుతున్నాయి.


ఇట్టి మాటలు నిరాశావాదాన్ని కల్గించడం కోసం కాదు. చేసే కర్మలవల్ల ఇట్టి లోపాలు రావడం వల్ల కర్మ రహిత స్థితి కొంతవరకూ ఏర్పడుతుంది. లేకపోతే ద్వంద్వ ప్రపంచంలో కూరుకొని పోతాం. అపజయాలు, ఎదురౌతున్నకొద్దీ ఈశ్వరుడే నడిపిస్తున్నాడని, మనచేత అతడు సాయం చేయిస్తాడనే భావన కల్గుతుంది. జ్ఞానికి, ఏ పని లేదని చెబుతూ జనకుడు మొదలైనవారు, వారే జ్ఞానులైనా లోక సంగ్రహం కోసం మంచి పనులు చేసారని గీతలో చెప్పాడు. కర్మ, మనచేత చేయిస్తే చేద్దాం. మనం చేస్తున్నామని కాక మన చేత చేయిస్తున్నాడనే భావనతోనే చేస్తూ ఉండాలి. ఏదో సేవ చేయడం, త్యాగం అని పైపైన కనబడినా ఏదో ఒకమూల అహంకారం పొడసూపుతూనే ఉంటుంది. అది పోనంతవరకూ మోక్షమనే మాట కల్ల. 


Thursday 19 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 75 వ భాగం



ఇదీ బాగానే ఉంది. చెడ్డ భావాలు, చెడ్డ పనులు చేయడం కంటే సత్కర్మలు చేయాలనుకోవడమూ మంచిదే. ఏదైనా మంచి వలన చెడు ఎదురైనా పెద్దలనడిగి తెలసికొని పరిష్కారం చేస్తాం. ఇట్లా సత్కర్మలు చేయాలనే సంకల్పం, చేయుట జరిగితే మన కర్మ భారం తగ్గుతుంది. ఏ మంచి చేయకుండా క్రియారహితులుగా ఉండడం మంచిదని ఇంతకుముందు చెప్పాను, అది విని మీలో, వేదరక్షణ, రోజూ పిడికెడు బియ్యం ఇతరులకై ఉంచడం, చెఱువులు త్రవ్వడం వంటివి నేను చెప్పినవి చేయకుండా ఉందామంటే అది సబబు కాదు. అవే కాదు, ఇంకా మంచి పనులు చేయండంటాను.


నిష్క్రియత్వం గమ్యమని చెప్పిన శంకరులు, శాస్త్రప్రకారం నడవండి, ఇతరులకు సాయం చేయండి. పంచాయతన పూజ చేయండని చెప్పారు.


కర్మల వల్ల కర్మ రహిత స్థితి


వారనేక సత్కర్మలను చేయాలని ఎందుకన్నారంటే, కర్మ రహిత స్థితిని చేరుకోవడానికే. ఎంత మంచి పనియైనా అదే అంతిమ స్థితి కాదు. కర్మ, భక్తి యోగాలు, పూజ, ధ్యానాదులు అన్నింటి లక్ష్యమూ కర్మ రహిత స్థితియే. ఏ పని చేయకుండా ఎవ్వడూ ఉండలేదు. కనుక నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవద్దని, కర్మానుష్ఠానం చేయాలని, చిత్తశుద్ధిని పొందాలని, ఋజుత్వాన్ని కలిగియుండండని అందరూ అన్నారు.


ఆత్మలో మనస్సు లీనం కావాలంటే ముందు చిత్తానికి శుద్ధి ఏర్పడాలి. సామాన్యులకు కర్మానుష్ఠానం తప్ప మరొక మార్గం లేదు. ఆత్మ సాక్షాత్కారానికి ముందు సత్కర్మానుష్ఠానం చేయవలసిందే. అందువల్లనే అన్ని గ్రంథాలూ కర్మయోగాన్ని ప్రశంసించాయి. తద్వారా కర్మ రహిత స్థితి.


Wednesday 18 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 74 వ భాగం



ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా ప్రయోజనం లేదు గాబట్టి నిష్క్రియత్వాన్ని బోధించడమే మంచిదని సంకల్పించాడు. దానికై శంకరావతారం వచ్చింది. అయితే, ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసి శంకరులు తల్లిదండ్రులు వీరిని కన్నారు. కాని విధవయైన తల్లిని వదిలి సన్న్యాసం పుచ్చుకొనవలసి వచ్చింది. తరువాత మండన మిశ్రులను ఓడించడం, శిష్యునిగా చేసుకుని సన్న్యాసిగా అతణ్ణి మార్చడం వల్ల అతని భార్యకు దుఃఖాన్ని కలిగించడం జరిగింది. కనుక ఇందులోనూ మంచి చేయడం వల్ల కొందరికి కష్టాలెదురయ్యాయి. అందువల్ల నిష్క్రియాన్ని ఉపదేశ రూపంలో ఇచ్చారు. మేము చెప్పేదే సత్యం, మంచి జరుగుతుందని అనేక మతాలను చాలామంది బోధించారు. అనేక సిద్ధాంతాల వల్ల ప్రజలలో సంశయాలేర్పడ్డాయి. దేనిననుసరించాలో తెలియని స్థితి. నిష్క్రియంగా ఉండడమే అన్నిటికంటే మేలని అదే మోక్షానికి దారి తీస్తుందని ఉపదేశించారు.


ఒకనికి మంచి చేద్దామనుకున్నాం. మనం అనుకున్నది చేయగలమా? ఫలదాతయైన ఈశ్వరుడున్నాడు. అతడు సంకల్పించకపోతే మనమా పనిని చేయగలమా? ఇతరుల కర్మ గురించి మనకు తెలియదు. పాప కృత్యాల వల్ల అతడట్లా బాధపడవలసి వచ్చిందేమో! కనుక ఎంత మంచి చేద్దామన్నా ఒకప్పుడు సాధ్యం కాదు.


నిత్య జీవితంలో సత్కర్మ ఫలాలు


మరొక విధంగా అనుకుందాం. అవతలివాని సమస్య మన సాయం వల్ల ఎందుకు పరిష్కారం కాకూడదు? నిత్య జీవితంలో పరస్పర సహకారం ఉండాలి కదా! కొన్ని సందర్భాలలో చేయవలసినది చేయకపోయినా చాలా వాటిల్లో కృతకృత్యులమౌతున్నాం. కనుక నిరాశానిస్పృహలతో ఉండేకంటె ప్రేమను, దయను చూపించవద్దా? బాధపడనీ నాకేమిటి సంబంధం అని ఊరుకుంటామా?


Tuesday 17 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 73 వ భాగం



వేయిమందికి అన్నదానం చేసామంటే ఇన్ని సంవత్సరాలూ వారు అన్నం తినకుండా ఉన్నారంటారా? ఆ రోజు కూడా వారెక్కడో తినేవారు. అంతమందిని పిలిచి పెట్టాం, 10,15 మందికి పెట్టలేకపోవడం జరిగింది. సేవ చేయడం మంచిదా? అందరికీ సేవ చేయలేకపోవడం మంచిదా? ఆలోచించండి. ఎందుకు చెప్పానంటే ఒకనికి సాయపడినా అనేక సమస్యలు, బాధలూ తప్పవని చెప్పడానికే. చేస్తామని చేయలేకపోయాం కదా!


ఒకడందరికీ సాయం చేయలేదు. కోటీశ్వరుడైనా దానాలిస్తూ పోతే చివరకు యాచకులను పొమ్మనే పరిస్థితి ఏనాటికైనా వస్తుంది. కొంత చెడు జరిగినా మంచి పనులు చేయవలసిందే కాదనను.


మరొక ఉదాహరణ. ఒక ప్రదేశంలో మకాం వున్నాం. ఆ ఇంటి వాసాలు పుచ్చిపోయి అందుండి పెద్ద పెద్ద పురుగులు రొద చేయడం మొదలు పెట్టాయి. అందొకటి క్రిందబడి వెల్లకిలా పడింది. లేవలేదు. అక్కడున్న చీమలు దానిచుట్టూ మూగి కుడుతున్నాయి. ఆ చిమ్మట పురుగును మామూలుగా చేస్తే ఎగిరిపోతుందని, అట్లా చేస్తే అది ఎగిరిపోలేదు సరికదా, ఈ చీమలన్నిటినీ తినడం మొదలెట్టింది.


ఒక జీవికి సాయం చేద్దామంటే అనేక జీవుల హింసకు కారణమయ్యాం. ఒక ప్రాణిని రక్షించామనే అహంకారానికి దెబ్బ తగిలింది. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే పతివ్రతయైన మండోదరి, విధవ కాలేదా? ఇట్లా మంచి, చెడు ఒక దాని వెంట మరొకటి అనుసరిస్తూనే ఉంటాయి.


అవతారం బోధించేది క్రియాశూన్యాన్నే


ఏ అవతారంలోనైనా ఎక్కువ మంచి జరిగినా కొంత చెడు జరగక తప్పదు. మంచిని చేయడమే, ధర్మాన్ని స్థాపించడమే అవతారం లక్ష్యం. ఎప్పుడైతే క్రియ యుందో కొందరికి ఉపకారం, కొందరికి అపకారం తప్పవు. కాబట్టి పరమాత్మ సంకల్పించాడంటే ఎన్నో అవతారాలు మంచిని చేసాయి.


Monday 16 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 72 వ భాగం



క్రొత్తగా ఆలయమెందుకు? పాఠశాలలు, వైద్యాలయాలు కట్టవచ్చు కదా "అని ప్రశ్నిస్తారు. మానవ సేవ చేయడం మంచిదే. దానిని చేయండని శాస్త్రాలూ చెబుతున్నాయి. రోగులకు మందీయడం మంచిదే. కాని ఒక దుర్మార్గుణ్ణి కాపాడితే వాడు సంఘానికి చేటు తీసుకు రావడం లేదా?


మంచిని నిరాకరిస్తున్నానని, చెడును ఎక్కువగా చూపిస్తున్నానని భావించకండి. ఏదో మంచి చేద్దాం, చివరికిట్లా చేటు వచ్చిందని అనడం వినడం లేదా?


గాంధీగారు కొన్ని నెలల్లో చంపబడతారనగా దేశం విభజింపబడి లక్షలాది ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇందుకా స్వరాజ్యం తెచ్చిందని బాధ పడలేదా?


ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాం. కాలం గడిచిన కొద్దీ క్రొత్త సమస్యలు పుట్టుకుని వస్తాయి. ఒక రోగాన్ని కుదర్చడం కోసం ఒక మందు వాడతాం. కుదిరినట్లుంటుంది. కొన్ని మందుల వల్ల అసలు రోగం కంటే క్రొత్త రోగాలు వస్తున్నాయి.


ఒక మాటు అన్నదానం ఏర్పాటు చేసాం. పెద్ద పెద్ద అన్నరాసులు ఖర్చయిపోయాయి. ప్రజలు తృప్తి పడ్డారు. మాకూ తృప్తి కలిగింది. తృప్తి పడ్డాం అంటే మేము చేసాం అనే అహంకారం, అందులో దాగి యుంది. అంతా ముగించిన వెనుక ఎండలో మాడి చాలాదూరం నుండి పది పదిహేనుమంది వచ్చారు. అన్నం లేదు. అన్నీ ఖాళీ పాత్రలు. అనాటి వారి నిరుత్సాహాన్ని చూస్తే బాధ కలిగింది. పై తృప్తి ఆవిరైపోయింది. వారికి ఏవో పళ్లు, డబ్బు ఇచ్చి పంపవలసి వచ్చింది.


Sunday 15 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 71 వ భాగం



కేవలం భాదీని వాడినా మన దేశంలోని మిల్లు యజమానులూ బాధపడతారు. చేతివృత్తులను ప్రోత్సహిస్తే మిల్లులు దెబ్బతింటాయి. ఇక మిల్లులను ప్రోత్సహిస్తే చేతివృత్తుల వారు బాధపడతారు.


మరొకటి. అనేకమైన చట్టాలను చేస్తున్నాం. దానివల్ల కొందరికి ఉపకారం, కొందరికి అపకారం జరుగుతూనే ఉంటుంది. లేకపోతే హర్తాళ్లు ఎందుకుంటాయి? ప్రతిపక్షం లేకుండా, ఆక్షేపణలు లేకుండా బిల్లులు తయారవుతున్నాయా? రాజకీయాలలోనే కాదు, మత విషయాలలోనూ అంతే. ఒకే మార్గాన్ని రుద్దలేం. ఒక మార్గంలో పయనిస్తే మోక్షమనీ ఉండదు. అందువల్లనే అనేక మతాలు వచ్చాయి. ఏ పార్టీ ఉన్నా, ఏ మతమున్నా అభిప్రాయ భేదాలు తప్పవు.


సనాతన వాదికి మంచి జరిగితే సంస్కర్తలు గగ్గోలు పెడతారు. అట్లాగే సంఘసంస్కర్తలకనుకూలంగా ఉంటే సనాతన వాదులు అల్లరి చేస్తారు.


అట్లాగే భాషల విషయంలో కూలీలు - యజమానులు; అగ్రవర్ణాలు బలహీన వర్గాలు; అనే వర్గాల విషయంలోనూ ఒక భాష అభివృద్ధి పొందితే ఒకటి క్షీణిస్తూ ఉంటుంది. కూలీలకు మంచి జరిగితే యజమానులకు ఇబ్బంది జరగొచ్చు. అగ్రవర్ణాలకు సుఖం. వెనుకబడ్డ వర్ణాలకు బాధ జరగొచ్చు. ఇట్లా అన్నిటిలోనూ మాకన్యాయం జరిగిందంటూ గోల పెడతారు.


ఇక పవిత్ర దేవాలయ నిర్మాణంలోనూ ఎందరో శ్రమకు లోనౌతారు. రథోత్సవంలో ఎక్కడో ఒకచోట ఒకడు దుర్మరణం పాలవుతాడు.


Saturday 14 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 70 వ భాగం



సేవలో కూడా కొందరికి అపకారం


మంచి చేద్దామని అనుకున్నా అనుకోకుండా కొంత హాని జరుగుతూ ఉంటుంది.


మిల్లు బట్టలు విదేశాలనుండి వచ్చేవి. మిల్లు బట్టలను విడిచి ఖాదీని ప్రోత్సహించండని గాంధీగారన్నారు. దానితో విదేశీ వస్తు బహిష్కరణతో బాటు స్వదేశీ వస్తువుల ప్రోత్సాహము రెండూ సిద్ధించాయి.


1922 లో రామేశ్వరానికి యాత్రకై వెళ్ళినపుడు మఠంలో ఉన్నవారందరూ ఖాదీని ప్రోత్సహించాలని అన్నాను. ఆనాడు విదేశీ వస్త్రాలను తగుల బెడుతూ ఉంటే బాధ కలిగి తగులబెట్టే బదులు వీటిని సముద్రంలో పడవెయ్యమని, ఖాదీని ధరించండని అన్నాను. ధనుష్కోటిలో వాటిని సముద్రంలో పడవేశారు. మదురై నుండి ఖాదీ బట్టలు వచ్చాయి. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం వల్ల కుటీర పరిశ్రమలు వృద్ధి పొందాయి. దేశాభిమానం తొంగి చూసింది. బాగానే ఉంది.


లాంక్లైర్, మాంచెస్టర్లో నున్న మిల్లు యజమానులు గగ్గోలు పెట్టారు. వారి దేశంలో బొగ్గు, సున్నం తప్ప ఏమీ దొరకవు. అందువల్ల పరిశ్రమలు స్థాపించారు. విదేశాల నుండి ప్రత్తిని దిగుమతి చేసుకొని బట్టలను తయారు చేసి ఎగుమతి చేసుకొని బట్టలను తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉండేవారు. కనుక వీరి నడవడికను తప్పు పట్టలేం. మిగిలిన దేశాలలోని చేనేత కార్మికులూ బ్రతకాలి కనుక కొన్ని రకాల బట్టలకే వారి వ్యాపారం పరిమితమైతే బాగుండుననిపించింది. అప్పుడు వారూ బ్రతుకుతారు కదా! ఇండియా, చైనా వంటి దేశాలు స్వదేశీ వస్తువులను ఉత్పత్తి చేసి తప్పనిసరి పరిస్థితులలో కొన్నిటినే విదేశాలనుండి దిగుమతి చేసుకుంటే బాగుండుననిపించింది. అయితే వ్యాపారమే వృత్తిగా గల ఇతర దేశాలవారు, మనం కేవలం స్వదేశీనే ప్రోత్సహిస్తే బాధపడరా అనిపించింది. అందువల్ల నా అంతట నేను భాదీనే వాడుతూ ఇతరులకు దీనే వాడండని ఉపదేశం చేయలేదు.


Friday 13 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 69 వ భాగం



అందుకే శంకరులు, ముందు కర్మలను అనుసరించండని మొదటగా ఉపదేశించారు. దానితో ఈశ్వరుని భజించండని అన్నారు.


"తేనేశస్య విధీయతాం అపచితిః" అపుడు కర్మ యోగమై కర్మ ఫలాల పట్ల కోరిక పోతుంది. ఫలాలనపేక్షించకుండా కర్మలను చేయాలన్నారు. "కామ్యే మతిః త్యజ్యతాం" అట్లా ఉంటే సత్సంగం చేయాలన్నారు "సంగః సత్సు విధీయతాం". చివరకు మనస్సునకు పరిపక్వత వస్తుంది. నివృత్తి మార్గంలో అడుగు పెడతాడు. గురువును సమీపించి ప్రణవోపదేశాన్ని, మహావాక్యాలను వింటాడు. జీవబ్రహ్మైక్యం సిద్ధిస్తుందని మార్గాన్ని విశదీకరించారు శంకరులు. ఇదే మాట శ్లోకంలో


"సద్విద్వాన్ ఉపసర్వ్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం


బ్రహ్మైకాక్షర మర్థ్యతాం ప్రతి శిరోవాక్య మాకర్ణ్యతాం" బ్రహ్మాస్మీతి విభావ్యతాం=నేను బ్రహ్మనని భావించు. "పరబ్రహ్మాత్మనా స్త్రీయతాం" అపుడు బ్రహ్మయైపోతావు. "ఏకాంతే సుఖ మాస్యతాం... పూర్ణాత్మా సుసమీక్ష్యతాం" అపుడేకాంత స్థితి, క్రియారహిత స్థితి వస్తుంది.


చెడుతో కలవని మంచి ఉండదు


ఏ పనియైనా తనకోసం కాకుండా ఇతరుల మంచికై పూర్తిగా ఉంటుందా? ఉండదు. ఏ పని చేసినా కొంత చెడు ఉంటుంది. మంచిలో ఇతరులకూ కొంత హాని జరగడమూ ఉంటుంది.


మంచికై కర్మయోగాన్ని అవలంబించి యుద్ధం చేయమని కృష్ణుడనలేదా? అయితే యుద్ధం వల్ల అంతా మంచే జరిగిందా? ఎందరో వీరులు నేలకొరిగారు. వారిలో అభిమన్యుడూ ఉన్నాడు. దీనివల్ల లోక కల్యాణం జరిగిందా అని శంకిస్తాం. కర్ణుడు తనవాడే అని తెలిసికొన్న తరువాత ఇదంతా నావల్లనే జరిగిందని ధర్మరాజు వాపోయాడు. ద్రౌపది పిల్లలను అందరినీ పోగొట్టుకొనవలసి వచ్చింది.


Thursday 12 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 68 వ భాగం



అతడు నిర్గుణుడైనా లోనున్నది సగుణ శక్తియే. అట్లా ఉండడం లేదా? అవతార లక్ష్యం ఏమిటి? కర్మ భక్తులద్వారా జ్ఞానాన్ని పొందడమే అయితే అందరూ క్రియారహిత స్థితిని పొందగలరా? ఏ పని లేకుండా కూర్చోగలమా?


కనీసం నిద్రలో అట్టి స్థితిని పొందడం లేదా? ఏ పని చేయకుండా మనస్సు ఊరుకోదు కదా! "నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠతి అకర్మకృత్" (భగవద్గీత 3.5) అంతేకాదు, మనస్సులో ఆలోచననే రాకూడదంటోంది అద్వైతం. ఈ మాటను ఎవరు వింటారు? విన్నా వినకపోయినా ఉపదేశించాలి. ఎవడో ఒకడైనా విని బాగుపడతాడు. ఒకనాటికైనా పరిపక్వస్థితి వస్తుందని ఆశ.


అందరూ కర్మ భక్తులను అనుసరించగలరు. భక్తిలో పండితే వైరాగ్యం వస్తుంది. అది పట్టుబడకపోయినా ఈశ్వరునిపట్ల అమిత ప్రేమను చూపించగలడు. కర్మకాండలు చేయలేకపోయినా పూజ, ఆలయదర్శనం, తీర్థయాత్రలైనా చాలు.


కనుక ప్రజలను దారి మళ్లించడం కోసం అవతరించాలి. వైదిక కర్మలను చేయుటకు ప్రోత్సహించాలి. తద్వారా చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పాలి. ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు చేయాలి. ప్రజలను భక్తిమార్గంలో పెట్టాలని అవతారం ఏర్పడింది.


అంతేకాదు, క్రియారహిత స్థితియే పరమ లక్ష్యమని ప్రజలకు బోధించాలి. అపుడు జ్ఞాన మార్గానికి మళ్ళుతారు. దీనిని చాలామంది అనుసరించలేక పోవచ్చు. పరిపక్వత లేకపోతే అట్టి మార్గంలో అడుగు పెట్టవద్దని ఈశ్వర సంకల్పం కాబోలు. అందుకే ప్రవృత్తి మార్గాన్ని ముందు బోధించి, అందు వారు నిలద్రొక్కుకున్నతరువాత నివృత్తి మార్గాన్ని బోధించాలని అవతార సంకల్పం.


Wednesday 11 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 67 వ భాగం



జీవులపై దయ చూపించి దక్షిణామూర్తి శంకరులుగా అవతరించాడంటే 'అతడూ మనస్సుతో ఈ పని చేసాడా? అయితే అతణ్ని ఆత్మయని, అఖండానందం అనుభవిస్తున్నాడని, ఎట్లా క్రియారహిత్వం ప్రాప్తించిందని శంక కల్గుతోంది.


ఈశ్వరుడు మాయతో ఉన్నా జ్ఞానియే


అతడు మాయతో ఉన్నా తానాత్మరూపుడనే ఎఱుక, ఎల్లవేళలా ఉంటుంది. మాయ అతని ఆధీనంలో ఉంటుంది. అదే మన ఆత్మను తెలిసి కోకుండా చేస్తుంది. అట్టి మాయ, ఈశ్వరుణ్ణి ఏమీ చేయలేదు. యోగి కొన్ని వస్తువులను సృష్టించినా, గారడీవాడు కొన్నింటిని చూపించినా వాటిని వారు నిజమని నమ్మరు. చూసినవారు నమ్ముతారు. అట్లాగే దక్షిణామూర్తి జగన్నాటకాన్ని ఆడుతున్నాడని శంకరులన్నారు.


"మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే"


అతడు మాయతో ఉన్న ఈశ్వరుడెట్లా జ్ఞాని అవుతాడని శంక. ఈశ్వరుడవడం వల్లనే అని సమాధానం. మనమట్టి స్థితిలో లేనంత మాత్రంచే అతడూ అట్లా ఉండలేడని భావించడం తప్పు. మన మాదిరిగానే ఈశ్వరుడుండాలా? అతడే కదా జ్ఞానులను, అజ్ఞానులను సృష్టించింది? రెండు రూపాలూ ఒకటై ఎందుకుండలేడు?


Tuesday 10 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 66 వ భాగం



కాని అద్వైతం ప్రకారం మాయవల్ల ఏర్పడిన మనస్సున్నంతవరకూ జీవుడు అనేక భావావేశాలకు లోనౌతాడని, జీవుడు, మాయను దాటగలిగితే శాశ్వత శాంతియని చెబుతుంది. సమస్త జగత్తు మాయవల్ల సంక్రమించింది. జీవునకు మనస్సెటువంటిదో బ్రహ్మమునకు మాయ అట్టిది. ఆత్మయొక్క నిజరూపం మనస్సు ఎట్లాకాదో, మాయ బ్రహ్మము యొక్క అసలు రూపం కాదు. బ్రహ్మము మాయతో కూడినపుడు ఈశ్వరుడు తన నిజరూపాన్ని చూపించడు. అట్లాగే మనస్సుతో కూడిన జీవుడు కూడా. మనస్సును దాటినపుడు, ఆత్మ తన సహజ రూపంలో ఉంటుంది. మాయను త్రోసి బ్రహ్మము తన నిజరూపంలో ఉంటుంది.


అట్లా అనినపుడు జీవాత్మ, పరమాత్మలు ఒకటి కావా? బ్రహ్మము మాయను గ్రహించి జగత్తును, మనస్సుతో కూడిన జీవుణ్ణి సృష్టిస్తున్నాడంటే బ్రహ్మము జగత్తుగా జీవునిగా కనిపిస్తున్నాడనే కదా! జీవుని నుండి మనస్సును తీసివేస్తే అతడు బ్రహ్మమే అవుతున్నాడు. రెండు ఆత్మలంటూ లేవు. ఉన్నది ఒక్కటే. అదే బ్రహ్మము.


స్వామి, మనల్ని వైకుంఠానికి తీసుకొని పోతున్నాడంటే, అది ఎంత గొప్ప స్థితియైనా మన నిజరూపమే మనకు తెలియడం లేదు. అతడు తన నిజరూపంలోనూ లేకుండా ఉంటాడు. అక్కడ జీవులు భక్తిని చూపిస్తూ ఉంటారు. అతడనుగ్రహిస్తూ ఉంటాడని అంటారు. మనస్సు లేకుండా భక్తినెట్లా చూపించగలం? ఎప్పుడైతే మనస్సుందో ఆత్మకు దూరంగా ఉండి మనస్సుతోనే అక్కడ జీవులుంటారు కదా! వారికి నిజరూపం ఎట్లా అవగతమౌతుంది? అందువల్ల పరమాత్మ ఎట్టి దివ్యానుగ్రహం చూపించాలి? అక్కడ జీవుడు  భక్తి చూపించనవసరం లేదని, భిన్నులనే భావన రానీయకూడదని వారిని తనకంటే భిన్నులుగా చూడవద్దని, భక్తుని మనస్సును పూర్తిగా పోగొట్టి తనలో భిన్న స్థితిని తీసుకొని రావడమే మోక్షమని అద్వైతం చెబుతుంది.


మోక్షముననుభవించుటయే గాని, మోక్షలోకం అంటూ ఏదీ లేదు. అక్కడ క్రియలేదు. పని ఉందంటే మనస్సున్నట్లే, మనస్సున్నంతవరకూ భేదభావం తప్పదు. కనుక దానినుండి విడుదల చేస్తాడు.


Monday 9 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 65 వ భాగం



అది శూన్యము కాదు, సచ్చిదానందమే 


ఏదీ లేనపుడు శూన్యమని, అన్నీ శూన్యంలో అంతమౌతాయని భావించకండి. అది శూన్యమైనా దాని కాధారము ఆత్మయే. నీవాత్మ స్వరూపుడివి. శూన్యమెట్లా కుదురుతుంది? ఈ ఆత్మ అనే మాట పుస్తకాల వల్ల కొంతే తెలుస్తుంది. మనస్సు నిర్మూలింపబడిన స్థితి పట్టుబడడం కష్టం. అది అనుభవైకవేద్యం. పుస్తకాలేమంటాయి? నీకు మత్తు మందిచ్చినా, నిద్రబోతున్నా నీ సత్ స్వరూపం అవగతం కాదు. నీవు జ్ఞాన మార్గంలోకి వెళ్ళితే సమాధి స్థితిని చేరుకోగలిగితే నీవు సత్ అని తెలిసికోగలవు! అన్నీ అసత్యాలే. ఆత్మయే సత్యము. అది తాత్కాలిక సత్యానికి అనగా వ్యావహారిక సత్యానికి ఆధారం. నీవు సత్తే అని తెలిసికో. ఇట్లా అని చెప్పినపుడు చిత్ ప్రకాశిస్తూ ఉంటుంది. అనగా జ్ఞానంతో ఉంటావు. వట్టి జ్ఞానం వల్ల సత్ ని తెలిసికొంటే అది తప్పే. అపుడు ద్వైత భావన కల్గుతుంది. అంటే సత్ వేరని, తెలిసికొనేవాడికి చిత్ వేరనే భావన వస్తుందన్నమాట. సమాధి స్థితిలో సత్ ఒకటి, దీనిని తెలిసికొనుట మరొకటి ఉంటుందా? రెండూ ఒక్కటే. అపుడు చిత్ తో తెలిసికోవడం కాదు. నీవు చిత్ వి. అంతేకాక నీవు, ఆనంద స్వరూపుడవనే స్థితికల్గుతుంది. అప్పుడు ప్రపంచ బాధలు లేవు. అపుడు శూన్యం కాదు. బ్రహ్మానందం. ఇది లోనుండి వచ్చింది. బయటినుండి వచ్చింది కాదు. బాహ్యమైన వాటివల్ల కలిగే ఆనందం, ఈ అఖండానంద సాగరంలో ఒక్క బిందువే. కనుక సత్ - చిత్ ఆనందం ఒక్కటే. ఈ స్థితిలో బైటనుండి ఆనందం వస్తే అపుడది ద్వైతమే. కాబట్టి ఏ స్థితిలో సత్ చిత్ ఆనందంలో ఉన్నదో ఆ స్థితి బంధాలనుంచి విముక్తి చేసేదే మోక్షస్థితి. కాని శూన్యం కాదు.


జీవాత్మ పరమాత్మల భేదం లేదు


బంధాలనుండి జీవులను విముక్తులను చేసి ఈ ప్రపంచం కంటే పైనున్న వైకుంఠానికో లేదా కైలాసానికో పరమాత్మ తీసుకొని వెడతాడని, అక్కడే ఉంచుట మోక్షం అనే సిద్ధాంతాలవారంటారు. అంటే మోక్షంలో స్వామి యొకడు, ముక్తులు వేరనే భావన ఏర్పడుతుంది. మనకంటె భిన్నుడు స్వామియని భావిస్తారు. అనగా జీవుడు వేరు, పరమాత్మ వేరని. అతడు చరాచర వస్తు ప్రపంచ కర్తయని భావిస్తారు.


Sunday 8 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 64 వ భాగం



మన కంటే మరొకడు లేనప్పుడు, మనకన్నా మరొకటి విడిగా లేనపుడు ప్రేమగానీ, ద్వేషం గాని కల్గుతోందా?


అంటే మిగిలినవారు లేకుండా నాశం చేయాలని కాదు. అట్లా ఎవ్వరూ చేయలేరు. అట్టి శక్తియున్న ప్రాణులను సంహరించవచ్చు గాని జడరూపాన్ని రూపుమాపగలమా? దానిని నిర్మూలిస్తే మనం ఎక్కడ ఉంటాం?


విడిగా నున్న వ్యక్తుల వల్లనే కాదు, జడ ప్రకృతి వల్ల, శాంతికి భంగం కల్గుతోంది. మామిడిపండు కనబడితే తినాలనే ఉబలాటం ముళ్ళ చెట్టును చూస్తే ముళ్ళు గ్రుచ్చుకుంటాయేమోనని బాధ, ఇక ఉరుములు, మెరుపులు, భూకంపాల వల్ల భయం మొదలైనవి ఎన్నో కల్గుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఎలా?

అన్నిటినీ వదిలించుకున్నా ఆకలి దప్పులు మనల్ని బాధిస్తాయి. ఇక కోరిక, దుఃఖం సరేసరి. కోరికల పరంపరకు అంతులేదు. ఎవ్వరూ కనబడకపోయినా ఒంటరిగా ఉన్నా అట్టి భావాలు వెంట తరుముతూ ఉంటే శాంతి ఎక్కడ? ఏమిటి? మూర్ఖునిగా ఆలోచించానేమిటియని తనను తానే నిందించుకుంటాడు. 


తనకంటే భిన్నమైనది లేదనే భావనను అద్వైతము అందిస్తున్నదంటే దానికి అర్ధం తనకంటే భిన్నమైన వ్యక్తి ఉండకూడదని కాదు. అయితే ఉండకూడనిది ఏమిటిది? మనస్సే. ఇది ఎంతవరకూ మన దగ్గర ఉంటుందో అనేక దుఃఖ పరంపరలు సిద్ధం. మత్తుమందిచ్చి శస్త్ర చికిత్స చేసినపుడు బాధ పడుతున్నామా? రోజూ నిద్ర బోతున్నారు. అపుడు చరాచర వస్తు ప్రపంచం లేకుండా ఉందా? అయితే ఎప్పుడు బాధ కల్గుతోంది? మనస్సు పనిచేసినపుడే. మనస్సుంటేనే కదా సుఖ దుఃఖాలనుభవించేది?


కనుక రెండవ వ్యక్తి ఎవరు? నీ మనస్సే. నిద్ర బోతున్నపుడు గాని, మత్తు మందిచ్చినపుడు గాని నీ మనస్సు లేదు. కాని నీవు బ్రతికే యున్నావు. అట్టి ప్రాణశక్తియే ఆత్మ. అదే నీ నిజరూపము. మాయ, మనస్సును రెండవదానిగా తీసుకొని వచ్చింది. జ్ఞానం వల్ల దీనిని నిర్మూలించు, అపుడు నీకంటె మరొకటి కనబడదు. అపుడు అద్వైతం పట్టుబడుతుంది. నీకంటే మరొకటి లేదనినపుడు క్రియలేదు, మాట లేదు, దానికై వెంపర్లాడడం లేదు. నిన్ను అటూ ఇటూ లాగే ప్రపంచమూ నిన్నేమీ చేయలేదు. అపుడు నీ దృష్టిలో ప్రపంచము లేదు. నీవు ఒంటరిగా ఉన్నా కోపతాపాలు నీ దరిచేరవు. శాశ్వత కాంతితో ఉండిపోతావు. నిన్ను మంచి చెడులు రెండూ బాధించవు.


Saturday 7 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 63 వ భాగం



నిష్క్రియునకు దయయా?


దక్షిణామూర్తి, మౌనంగా మర్రిచెట్టు క్రింద ధ్యానంలో ఉంటాడు. ఆయన చూడడు, మాట్లాడడు కాని ఆయన మనస్సు దయతో పొంగుతోంది. అద్వైతంలో మనస్సే లేదు. మనస్సు పోతేనే ఆత్మ ప్రకాశిస్తుందని ఉంటుంది. అయితే దయతో, అయ్యో మానవులిట్లా అయిపోతున్నారేమిటని జాలిపడ్డాడు. (నవ్వుతూ అన్నారు స్వామి). అయితే అద్వైతమూర్తి ఎట్లా కాగలడతడు? మనపై దయ చూపించాడంటున్నాం. అయితే మనస్సుండాలి కదా!


ఘోషాస్త్రీ కనబడదు. వినబడదు కూడా. అయితే పిల్లవాడొక గోతిలో పడిపోతున్నపుడు బైటకు వచ్చి కేకలు వేస్తూ రక్షించదా? దక్షిణామూర్తికి అట్టి పరిస్థితి ఏర్పడింది. అతడు నిష్క్రియుడైనా దయతో వీక్షించాడు.


ప్రజలు బుద్ధితో వాదవివాదాలు చేసికొంటున్నారు. చేతులు కలబడడం వల్లనే కాదు, సంకల్పాల వల్లనూ సంఘర్షణలు వస్తాయి. ఇపుడు మనస్సును సక్రమ మార్గంలో పెట్టాలని చివరకు క్రియా రహిత స్థితిని పొందునట్లు చేయాలి.


మనస్సులోని ద్వైతాన్ని తొలగించడం అద్వైతం


సంకల్పాలను లేకుండా మనస్సును నిర్మూలించుటయే అద్వైతం. మనకంటే భిన్నమైనది ఒకటుందని మనస్సు వల్లనే కల్గుతోంది. స్వప్నంలో మరొకటి కనబడదు. మనస్సు అణిగియుండడం వల్ల అట్లా జరిగింది. అందువల్ల ప్రశాంతంగా ఉంటున్నాం. మరొక వ్యక్తి కనబడితే శాంతికి భంగం. అతనికేదో ఉపకారం చేయాలని ఒక మాటు, మరొక సందర్భంలో ఒకర్ని చూస్తే ఈర్ష్యా ద్వేషాలు కల్గుతున్నాయి. ఒకనిమీద ప్రేమ చూపిస్తే మనసులో సంతోషం, ద్వేషం చూపిస్తే అవతల వ్యక్తికి కీడు కంటె మనకపకారం కల్గుతోంది.


Friday 6 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 62 వ భాగం



(అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


ఈ అవతారానికి తల్లిదండ్రులెవరు? ఎక్కడ?


అవతారానికి ఉపక్రమం


పోలీసు స్టేషన్లో ఎవరైనా దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగు చర్య తీసుకుంటారు. అట్లాగే అవతరించడానికి తగిన కారణం కోసం భగవానుడు ఎదురు చూస్తున్నాడు. ధర్మం క్షీణిస్తోందని దేవతలు, ఆర్జీ పెడితే భగవానుడవతరిస్తాడు. అంతేకాదు అవతారానికి జన్మనిచ్చే దంపతులు తమకు మంచి సంతానం కావాలని అనాలి. ఏదీ లేకుండా అవతరిస్తాడా?


ఇట్లా రెండువైపులా ఆర్జీ ఉంటుంది. ఇట్టిది రామకృష్ణావతారాలలో చూసాం. ముందు దేవతల ఫిర్యాదు. దశరథుడు పుత్రకామేష్టి చేయుట. తరువాత రామావతారం. సుతపస్ అనే ప్రజాపతి, అతని భార్య పృశ్ని చాలాకాలం పాటు తపస్సు చేసారని భగవానుడే మూడు జన్మలలో అవతరిస్తాడని ఉంది. అందు కృష్ణావతారం చివరది. దేవకీ వసుదేవుల బిడ్డడై జన్మించాడు. అంతకుముందు అదితి కశ్యపులకు వామనునిగా పుట్టాడు. విష్ణువు విషయంలో అట్టి ఆర్జీలుంటే శివుని విషయంలో ఉండవద్దా?


అతనికి లాంఛనాలతో పనిలేదు. అతనిలో ఉన్నది దయయే.


Thursday 5 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 61 వ భాగం



ఇక అవతారం, గురు రూపంలో ఉండాలి. అసలు, పరమాత్మయే గురువు. ఉపనిషత్తు, అతణ్ణి గురువని చెప్పింది. అతనికి నమస్కరించుట, శరణు జొచ్చుట చెప్పబడింది. బ్రహ్మయే వేదాలనిచ్చాడు. ఆ మంత్రాలతోనే సృష్టి కార్యక్రమం మొదలౌతుంది. బ్రహ్మ విద్య నందించువాడు కూడా అతడే. అతణ్ణి పరమాత్మ సృష్టించి అతనికి వేదాలనందించాడు. ముముక్షువైన నేను అతనికి శరణు జొచ్చుతున్నానని మంత్రం:


"యో బ్రహ్మాణం విదధాతి పూర్వం 

యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై 

తం (గ్0) హ దేవం అత్మబుద్ధి ప్రకాశం  

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే"


-శ్వేతాశ్వతరం (6-18)


ఇందే మరొకచోట పరమ గురువు శివరూపంలో ఉన్నాడని ఉంది. మహర్షి రుద్రుడు. వేదాలను పఠించే బ్రహ్మజననం కోసం చూస్తున్నాడని (అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని శ్లోకార్ధం.


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


Wednesday 4 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 60 వ భాగం



శంకరులు, శైవులూ, వైష్ణవులూ, శాక్తేయులు కూడా 


శంకరుల గురించి "అంతః శాక్తో బహిః శైవః వ్యవహారే తువైష్ణవః" అంటారు. ఆయన లోపలేమో అంబిక. విభూతి, రుద్రాక్ష ధారణచే శివుడు. ప్రాపంచిక వ్యవహారాలో విష్ణువు. ఆయన నోటినుండి నారాయణ, నారాయణ అని వస్తుంది. వ్రాయవలసి వచ్చినప్పుడు "క్రియతే నారాయణ స్మృతిః" అనగా విష్ణు భావనతో శివావతారంగా చెలామణి అయి చేసేదంతా నారాయణ కృత్యమే. ఇట్లా శివ- విష్ణు అద్వైతం కుదిరింది.


విష్ణువు చేస్తున్నాడంటే అమ్మవారు చేస్తున్నట్లే. అవతారం పురుషాకారంలో ఉంది. నారాయణుని పేరుతో పనులు. ఆ నారాయణుడూ అమ్మవారి పురుష రూపమే. లోపల అమ్మవారి రూపం. మరొకవిధంగా హృదయంలో అపారమైన దయ యుంటుంది. అందువల్ల "అంతశ్శక్తః"


ఇక్కడ శక్తి అంటే దయయే. అది లేకపోతే శివం లేదు. శివుడు, తనలో నున్నది శక్తియని తెలియాలన్నా శక్తియుండవలసిందే. శివం దయను చూపిస్తే అది శక్తియే. ఆమె లేకపోతే ఆయన, రాణించడనే మాట ఉంది కదా.


అయితే ఈ అవతారం, సీతారాముల మాదిరిగా, రాధాకృష్ణుల మాదిరిగా ఉండదు. సన్న్యాసిగా అవతరించాడు కనుక, అమ్మవారు బైటకు కనబడదు. తన భార్య కనబడేటట్లు విష్ణువు, ఆమెను ధరిస్తాడు. నరనారాయణులుగా కన్పడినపుడు విష్ణువుగా కన్పడకుండా అంశావతారంగానే కన్పిస్తాడు. కలిలా భగవత్ శక్తి అవతరించాలి. అయినా లక్ష్మి - విష్ణువనే జంటగా కాదు. సన్న్యాసి కదా! ఆపైన దక్షిణామూర్తి శుద్ధమైన, సంపూర్ణమైన పరమేశ్వరునిగా కన్పిస్తాడు. పార్వతీ పరమేశ్వర రూపంలో కాదు. అందువల్ల దక్షిణామూర్తి నుండి శంకరువతరించాలి.

Monday 2 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 59 వ భాగం



శక్తిని అంతర్గతం చేసుకొని దక్షిణామూర్తి


పరమేశ్వరుడనేక రూపాలలో ఉంటాడు. అవి కళ్యాణ సుందరమూర్తి, సోమస్కంద మూర్తి, నటరాజమూర్తి, భైరవమూర్తి మొదలైనవి. ఇందులో ఏది అవతారానికి కారణం? కలిలో సన్న్యాస గురువు అవతరించాలి కనుక శక్తితో కూడిన సోమస్కందాది మూర్తులు వీలుపడవు. ఎందుకంటే పక్కనే అమ్మవారుండాలి కదా! ఇక భైరవమూర్తి వచ్చాడంటే భయంకరంగా ఉంటాడు. అటువంటివాడు, శాంతమైన పలుకులతో ఉపదేశం ఎలా ఇస్తాడు?


కనుక దక్షిణామూర్తి, అవతార కారకుడు కావాలి. అతడు, అమ్మవారితో కలిసి యుండడు. అయితే బాలా త్రిపుర సుందరిగానో, కన్యాకుమారిగానో, దుర్గగానో అమ్మవారు వచ్చినా అయ్యవారు ప్రక్కన ఉన్నట్లు కనబడరు. శివశక్తులు విడదీయరానివి కనుక విడిగానున్నట్లు భావించకూడదు. నిర్గుణ సగుణ బ్రహ్మమే అసలైన శివశక్తి స్వరూపము. ప్రపంచంలో లీలార్ధమై దంపతులుగా ఒకమారు, విడిగానున్నట్లు ఒక మారు కన్పిస్తారు.


పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వచ్చినా, నిష్క్రియుడైనా, క్రియా స్వరూపిణి యైన అమ్మవారు లోపలే ఉంటుంది. ఆమెను మనం చూడలేం. అట్టి శక్తి లేకపోతే శంకరులుగా అవతరించి దేశాన్ని ముమ్మారు పర్యటించి, అనేక గ్రంథాలు వ్రాసి, వాదాలలో పాల్గొని అందర్నీ అనుగ్రహించడం కుదురుతుందా?


శుభమును చేయువాడే శంకరుడు. కనుక నిష్క్రియుడెట్లా అవతరించాడు? అన్ని శక్తులకు పరాశక్తియే మూలం. అనగా క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తులకు మూలం. ఇట్టి పరాశక్తి, దక్షిణామూర్తిలో సూక్ష్మాకారంతో ఉంటుంది.


Sunday 1 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 58 వ భాగం



పరమ శివునకు ఎన్నో పేర్లున్నాయి. వేదంలో సమస్త విద్యలకు అతడధిపతి యని, అతడే సమస్త ప్రాణులకు ప్రభువని చెప్పబడింది. "ఈశానః సర్వవిద్యానాం..." అనే మంత్రంలో. సదాశివుణ్ణి ఓంకారంగా చెప్పి అదే ఆత్మస్వరూపమని చెప్పి చివరగా అట్టి మంగలమూర్తియైన శివుడు మాకు అనుకూలుడగు గాక అని యుంది. ఆ పై మంత్రమే గీతలోనూ చెప్పబడింది.


అట్టి విద్యాధినాథుడు, శంకరులై ఉపదేశ గురువు కావద్దా? 


తంత్ర గ్రంథాలలో పరమేశ్వరుడే అమ్మవారికి ఉపదేశించినట్లు ఉంటుంది.


అద్వైత విద్య అన్ని విద్యలకంటే అధికం. అది ఒక పుస్తకం కాదు, మంత్రం కాదు. అనుభవంతో కూడిన విద్య. అట్టి అద్వైతవిద్యయే శివుడు. 'అహం బ్రహ్మాస్మి' అన్నట్లుగా 'శివోహం' అని అంటారు. కేవలం ఈ మూడు అక్షరాలపై ధ్యానం చేయవచ్చు. మాండూక్యోపనిషత్తులో కూడా 'శివం అద్వైతం' అని యుంటుంది. కనుక అద్వైతాచార్య రూపంలోనే అవతరించడం సబబు. అమర కోశంలో పరమేశ్వరుణ్ణి సర్వజ్ఞుడని యుంది.


ఆపైన ప్రశ్నోత్తర మాలికలో ఎవరు జగద్గురువని ప్రశ్న. "కోహి జగద్గురు రుక్తః?" చటుక్కున మనం ఆదిశంకరులని అంటాం. అంతకు ముందే కృష్ణునకు జగద్గురు పదం ఉంది. కాని శంకరులు "శంభుః" అని సమాధానం చెప్పారు. ఆ శంభువే శంకరుడు. జ్ఞానం ఎవని వల్ల వస్తుందని ప్రశ్న. "జ్ఞానం కుతః?" శివుని నుండే అని జవాబు. "శివాదేవ"


కనుక జ్ఞానావతారం, పరమశివుడే కావాలి. ఇంతకుముందు వచ్చినవి విష్ణ్వతారాలు. కలిలో పరమేశ్వరుడవతరించాలి. వారే శంకరులు.