Saturday 30 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 57 వ భాగం



జ్ఞాన శివుడే జ్ఞానావతారం


ఆరోగ్యం కావాలంటే సూర్యుణ్ణి, జ్ఞానం కావాలంటే మహేశ్వరుణ్ణి వేడుకోవాలని ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది.


"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, జ్ఞానదాతా మహేశ్వరః"


జ్ఞానము మోక్షాన్నిస్తుంది. గీత యొక్క చివరలో నన్నే శరణు పొందమన్నాడు. అన్ని పాపాలనుండి పోగొడతానని అన్నాడు. ఈశ్వరునే శరణు పొందమన్నపుడు అతనివల్లనే శాంతి లభిస్తుందని అన్నాడు. అది జ్ఞానం వల్లనే.


"తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం"


విశ్వరూప రుద్రుడు చేసే సంహారము తానూ చేస్తున్నట్లు చెప్పాడు. గీత చివరలో మోక్షాన్ని గూర్చి ప్రస్తావించేటపుడు దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని, అది అతని కృత్యమని సూచించాడు. భేదం ఉన్నట్లుగా కన్పింపచేసాడు.


కలిలో 72 మతాలు విజృంభించగా జ్ఞానోపదేశం చేయాలి కనుక దీనిని ఈశ్వర కృత్యంగానే సంభావించాడు. 'సంభవామి యుగే యుగే' అన్నపుడు, ఇద్దరూ ఒక్కటే.


తానెన్నో అవతారాలెత్తాడు. మౌనంగానున్న దక్షిణామూర్తి సంచారం చేస్తే శిష్యగణంతో అతనికి సాయం చేస్తానని విష్ణువు సంకల్పించాడు. శంకరుల శిష్యులలో ఒకడైన పద్మపాదుడు, విష్ణ్వంశతోనే జన్మించినట్లు శంకర విజయంలో ఉంది.


Friday 29 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 56 వ భాగం



పరమ శివునితో ఐక్యమయినట్లు, కానట్లుగా ఉంటాడు విష్ణువు. విశ్వరూప దర్శనంలో నా ఈశ్వర యోగాన్ని చూడుమని అన్నాడు. చివరి అధ్యాయంలో తనకంటె ఈశ్వరుడు భిన్నుడైనట్లు ప్రకటించాడు.


"ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి 

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"


"తమేవ శరణం గచ్చ"


అనగా అందరి హృదయాలలోనూ ఈశ్వరుడున్నాడు. మాయాశక్తి వల్ల జంత్రగాడు, యంత్రంలో ఉన్న బొమ్మల మాదిరిగా నున్న జీవులను త్రిప్పుచున్నాడు.


"అతనినే శరణు పొందు"


ఒకచోట నన్ను అని అంటాడు. మరొకచోట అతనిని అంటాడు. అయితే ఈ భేదాన్ని నిరంతరం పేర్కొంటాడా? లేదు. విభూతి యోగంలో అందరిలోనూ ఆత్మగా నున్నానని అంటాడు:


“అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః"


ఆశయమనగా హృదయం. ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నా విష్ణువు చేసే పనిని చేస్తున్నాడని ఈశ్వరః అనే శ్లోకంలో ఉంది. నన్నే శరణు పొందమని అనినపుడు విరుద్ధంగా కనబడడం లేదా? లేదు. 'మామేవం' అనగా ఒక్కడైన నేనే అని అర్థం. ఇక ఈశ్వరుడు తనకంటె భిన్నుడని అన్నాడా?


Thursday 28 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 55 వ భాగం



అసుర శక్తులు కలిలో చాలామందిలో ప్రవేశించడం వల్ల దుష్ట సంహారం చేయడానికి వీలు పడదు. అందువల్ల సాత్వికమార్గంలో ఉపదేశం చేయవలసి వచ్చింది. ఇది అవతారం ఉన్నంతవరకూ సాగవలసిందే. అందువల్ల జ్ఞానిగా బ్రాహ్మణ వంశంలో పుట్టవలసి వచ్చింది.


దీనిని విష్ణ్వతారమనాలా? జ్ఞానోపదేశానికి, జ్ఞానావతారం ఎత్తుతాడా? అతడట్టి అవతారం ఎత్తితే ఈశ్వరుడు, తన కృత్యంలో ఇతడు వేలు పెట్టాడేమిటని శంకించడు. భిక్షాటనమూర్తియై శంకరుడు ఋషిపత్నులను మోహింప చేస్తే మోహినీ అవతారంలో విష్ణువు ఋషులనే మోహపుచ్చాడు. శంకరుడపుడు ఋషులకు తత్త్వోపదేశం చేసాడు కనుక ఇద్దరిలోనూ భేదం లేదు.


జ్ఞానోపదేశం ఈశ్వరుని కృత్యమైనా అవసరం వస్తే విష్ణువు దత్త, ఋషభ, నరనారాయణ, వ్యాస రూపాలలో ఉపదేశమిస్తూ ఉంటాడు. శివ కృత్యాన్ని తానూ నిర్వహిస్తున్నానని ప్రకటించడం కోసం. కాని అటువంటిది పూర్తిగా దశావతారాలలో చేయలేదు. హయగ్రీవుణ్ణి "జ్ఞానానందమయం దేవం" అని కీర్తిస్తాం. సాధకులకు ఉపయోగిస్తాడు. అతణ్ణి లక్ష్మీ హయగ్రీవునిగా కూడా అంటారని మరిచిపోకూడదు.


అవతారాలలో విష్ణువు మాయావిగా కన్పిస్తాడు. విష్ణు జ్ఞానమని, విష్ణు యోగమనే మాటలు లేవు. శివజ్ఞానము, శివయోగ పదాలు మాత్రమే ప్రసిద్ధి. కాని విష్ణుమాయ అంటాం.


కనుక కలిలో క్షాత్రధర్మంలో కాకుండా సాత్విక రూపంలో జ్ఞానోపదేశం చేయాలి. అది శివావతారంగా ఉండాలి.


Wednesday 27 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 54 వ భాగం



సంహారం చేసాడంటే బాగానే ఉంది కాని మహావిష్ణువునకు పరిపాలించడమే ప్రధాన కృత్యమైనపుడు ఉపదేశం చేయవచ్చా? ఆ బాధ్యత పరిపాలించే రాజుకు పూర్తిగా లేదని భావించకూడదు. రాజు పాలనతోబాటు ప్రజలలో వినయాన్ని నేర్పాలని కాళిదాసు, రఘువంశంలో రాజులను గురించి "వినయా ధానాత్" అని అన్నాడు. అంటే జ్ఞానోపదేశమూ అతనిలో భాగమే.


అయితే అది అతని ప్రధాన కృత్యము కాదు. రాజు శాస్త్రాలను, శాస్త్రజ్ఞులను, జ్ఞానులను పోషించి నిర్వహింపచేస్తూ ఉంటాడు.


పురాణాలలో పెక్కుమందిరాజులు పెక్కు సందర్భాలలో ఉపదేశించినట్లున్న మాట వాస్తవమే. అయినా క్షత్రియుడు ధర్మాన్ని రక్షించాలే గాని ఉపదేశానికి అతడు పరిమితుడు కాకూడదు. అది బ్రాహ్మణ ధర్మము, యోగులు, జ్ఞానుల పని.


రాముడు క్షత్రియుడు, అయినా సాత్త్వికమైన లక్షణాలున్నవాడు. పరశు రాముడు బ్రాహ్మణుడైనా రాజసిక లక్షణాలున్నవాడు. ఇద్దరూ అధర్మాన్ని పోగొట్టారు. వామనుడు బ్రాహ్మణునిగా వచ్చి దానం పట్టాడు. అసురుని నెత్తిపై కాలు పెట్టాడు. అసుర రాజ్యానికి అతణ్ణి అధిపతిని చేసాడు. అయినా అక్కడ క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు. అది వేరే కథ.


మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలకు వర్ణాలను అంట గట్టలేం. అయినా అవతారాలు క్షత్రియ ధర్మాన్నే అవలంబించారు. కూర్మావతారం, దేవతలు అమృతం సంపాదించుకొని మృతులు అవకుండా ఉండడానికి తోడ్పడింది. బలరామావతారం, కృష్ణునితో సంబంధం కలిగి ఉంది. కృష్ణావతారానికి బలం చేకూరుస్తూ బలరాముడూ దుష్టులను సంహరించాడు. కృష్ణుడు, సంహారంతో బాటు బ్రాహ్మణ ధర్మమైన ఉపదేశం చేసాడు. అదైనా అవతారం చివరి దశలోనే.


Tuesday 26 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 53 వ భాగం



ఎందుకిన్ని మూర్తులు ధరించాలంటే ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పెక్కుమంది నిర్వహించాలి. దేవతలు అట్లాగే ఉందని అనుకోవచ్చు. వారి కృత్యాల విభజన కూడా.


ఇక విడుదల గురించి రెండు రకాలుగా ఉంటుందని చెప్పాను. ఒకటి సంసారం నుండి దయతో విముక్తి. అనగా ప్రలయకాలంలో విముక్తి. ఆ మాటకు కూడా సంహారమని కాదు. తనలో లీనం చేసుకొనుటయే. ఇక కేవలముక్తిలో తనలో శాశ్వతంగా లీనం చేసుకుంటాడు. మొదటి లయలో పుట్టుక, మరల సంహారమూ ఉంటాయి. కాని అందులో జీవులకు తాత్కాలిక విశ్రాంతి యుంటుంది. అదీ దయతోనే. కాని చిత్తశుద్ధి కలిగిన జీవులకు శాశ్వతముక్తిని దక్షిణామూర్తి రూపంలో ఇస్తాడు.


తాత్కాలిక ముక్తినిచ్చినపుడు శాంతంతో ఇస్తాడా? అట్లా ఇస్తే ప్రజలలో భయభక్తులు లేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు కనుక ప్రలయాన్ని సంహారమూర్తి రూపంలోనే చేస్తాడు.


దేవతలకు ప్రత్యేక విధులను పరమాత్మ చేసాడని చెప్పాను. అపుడు కూడా దేవతలందరూ ఒకటే అనే భావన కలిగియుండాలి. లేకపోతే నా దేవుడు గొప్ప అని కీచులాడుకుంటారు. కనుక ముఖ్య దేవతలైన శివ, విష్ణు శక్తులు జగన్నిర్వహణ చేస్తూ తమలో భేదం లేదని ప్రకటిస్తూ ఉంటారు. కాని క్షుద్రదేవతలట్టి స్థితిలో ఉండరు. ముఖ్య దేవతలు, ఒకరి విధులను మరొకరు కూడా నిర్వహించగలరు. శాశ్వతంగా మాత్రం మార్చుకోరు.


కృష్ణునికి ముందున్న అవతారాలు కొంత కాలమే యుండి దుష్టులను, పరిహరించి ధర్మస్థాపన చేసారు. మహావిష్ణువు క్షాత్రధర్మాన్ని అనుసరించి దుష్టులను సంహరించి ప్రజలను రక్షించాడు. వారితో యుద్ధం చేసినపుడు ఈశ్వర సంహార కృత్యాన్నే చేసాడు. కృష్ణావతారంలో ఆ పని చేస్తూ సంహారాన్ని చేస్తున్నానని ప్రకటించాడు. అదే సందర్భంలో జ్ఞానోపదేశం చేయవలసిన ఈశ్వర లక్షణాలతోనూ ఉన్నాడు. పూర్వావతారాలలో ఉపదేశం లేదు.


కాని కృష్ణావతారంలో అసుర లక్షణాలు రాజులలో ప్రవేశించడం వల్ల వారిని సంహరించుటకు అర్జునునకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసాడు.


Saturday 23 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 52 వ భాగం



పరమేశ్వరుణ్ణి ఈశ్వరుడని అనడం చాలా కాలం నుండి యుంది. అమర కోశంలో "ఈశ్వరః శర్వ ఈశానః" అని యుండగా; కాళిదాసు, రఘువంశంలో


"హరిర్యధైకః పురుషోత్తమః స్మృతః 

మహేశ్వరః త్ర్యంబక ఏవ నాపరః"


విష్ణువును పురుషోత్తముడని అన్నట్లు, ముక్కంటిని మహేశ్వరుడని అంటున్నారని వ్రాసేడు. కాని పరమశివుణ్ణి పురుషోత్తముడని అనం. పురుషోత్తముడు విష్ణువు. భగవానుడు విశ్వరూపాన్ని చూపించేటపుడు విష్ణువుగా, రక్షకునిగా, పోషకునిగా కనబడ్డాడా? లేదు. ప్రలయకాలంలోని రుద్రరూపంతోనే కనబడ్డాడు.


"కాలోఽస్మి క్షయకృత్ ప్రవృద్ధః" (11-32)


అనగా నేను కాలుణ్ణి, లోకాలను నాశనం చేయగలవాడని అన్నాడు. ఇది అతిశయోక్తి. ప్రపంచాన్ని దగ్ధం చేశాడా? కృష్ణ అవతార సమాప్తికి ముందు కౌరవనాశం, తరువాత యాదవనాశం జరిగినా మిగిలియున్నాడు. ఎందుకిట్లా అన్నాడంటే యుద్ధం చేయనని భీష్మించుకొన్న అర్జునునకు ప్రోత్సాహం కల్గించడానికే. నీవు లేకపోయినా నేను ఈ పనిని చేయగలనని, నీకు కీర్తి రావడం కోసం నిన్నొక సాధనంగా వాడుకుంటున్నానని అన్నాడు. అందుకై అట్లా అతిశయోక్తితో చెప్పవలసి వచ్చింది. మనమేదైనా పుణ్యకార్యం తలబెట్టి, దానికి ఒక వెయ్యి రూపాయలను కావాలనుకుని చందాకై వెడితే, ఎవరైనా ఇవ్వనంటే నీవీయకపోతే వెయ్యికాదు, లక్ష రూపాయలను నేను ఇవ్వగలను అంటాము. ఇక్కడ కావలసింది వేయి కాని లక్ష కాదు. అట్లాగే కొంతమంది దుష్టులను సంహరించవలసి వచ్చినపుడు, మొత్తం నేనే సంహరిస్తానని అనడం అటువంటిది. సంహారకృత్యం, రుద్రునిదైనా ఇందులో భేదాన్ని సూచించాడు. 'యోగమైశ్వరం' అనినపుడు ఈశ్వరయోగాన్ని చూపిస్తానని సంహార కృత్యాన్ని చేస్తానని అన్నాడు.


Friday 22 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 51 వ భాగం

 


సాధారణంగా మహావిష్ణువు మాయా జగత్తును రక్షిస్తే పరమశివుడు మోక్షాన్నిస్తాడు. అయితే ఒకరి పనులను మరొకరు బదిలీ చేసుకుంటూ ఉంటారు కూడా.


విష్ణువు దుష్టులను పరిమార్చేటపుడు తనలో కలుపుకొన్నపుడు రుద్రమూర్తి కాదా?


వేదంలోని శివవిష్ణుసూక్తాలు, ఇద్దరికీ భేదం లేదనే చెబుతాయి. అట్లాగే స్మృతులు కూడా. పురాణాలలో మాత్రం, శివ పురాణంలో శివుణ్ణి అధికంగా, విష్ణు పురాణాలు విష్ణువుని అధికంగా పొగుడుతాయి. ప్రమాణ గ్రంథాల వరుసలో ముందు వేదాలు, తరువాత స్మృతులు, అపైన పురాణాలని మరిచి పోవద్దు. ఇట్లా ఎక్కువ తక్కువల నెందుకు చూపించినట్లు? తమ ఇష్టదైవాలపై భక్తులకు ఏకాగ్రత కల్గించడం కోసమే. కనుక విడివిడిగా మనం వారిని చూడకూడదు.


విష్ణువు, కృష్ణునిగా వచ్చినా సంహారమూ చేసాడు, జ్ఞానోపదేశమూ చేసాడు. మిగిలిన అవతారాలలో ప్రధానంగా సంహారమూర్తియైనా ఈ అవతారంలో జ్ఞానోపదేశం చేయడం ప్రత్యేకత.


అర్జునునకు విశ్వరూప సందర్శనంలో "వందదామి తేచుక్షుః పశ్యమే యోగమైశ్వరం" (11.8)


అనగా నేను నీకు దివ్య దృష్టినిస్తున్నా. నా ఈశ్వరీయ సామర్ధ్యాన్ని చూడుమని అన్నాడు. ఇక్కడ ఈశ్వరుడనేమాట వేదాంతంలో చెప్పే సగుణ బ్రహ్మమా? లేక పరమేశ్వరుని ఈశ్వరుడనడమా?

Thursday 21 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 50 వ భాగం



శివ విష్ణు అవతారాలు పోలికలు తేడాలు


శివ విష్ణువులంటూ ప్రత్యేకంగా ఇద్దరు లేరు. ఉన్నది పరమాత్మయే. ప్రశ్నోత్తరమాలికలో శంకరులిట్లా ప్రశ్నించారు.


కశ్చభగవాన్? = భగవానుడనగా ఎవరు?

మహేశఃశంకర నారాయణాత్మైకః


వేదాంతంలో ఈశ్వర - ఈశ ప్రస్తావన ఉంటుంది. అక్కడ శివుడని అర్ధం కాదు. సగుణ బ్రహ్మయైన ఈశ్వరుడే. ఆ మహేశ్వరుడు శివుడా విష్ణువా అని అడిగితే శంకర - నారాయణ - ఆత్మా - ఏకః అని శంకరుల సమాధానం, అనగా శంకరునకు, నారాయణనకు ఉన్నది ఆత్మయనిగాని, లేదా ఉన్న ఆత్మయే శంకరనారాయణులని గాని అర్ధం. ఉన్నది ఆత్మయే లేదా బ్రహ్మము. అదే శివుడు, విష్ణువని అర్ధం.


ఇద్దర్నే ఎందుకు చెప్పినట్లు? మనమూ ఆత్మస్వరూపులం కదా! అయితే అట్లా భావించామా? వారిద్దరూ అట్లా కాదు. వారు ఆత్మయని వారికి తెలుసు. తాను విష్ణువని ఈశ్వరునకు; తానీశ్వరుడనని విష్ణువుకు తెలుసు.


పరమాత్మ అనేక రూపాలను ధరిస్తాడు. ప్రవృత్తి మార్గాన్ని నడిపేవాడు శ్రీ విష్ణువు కాగా, నివృత్తి మార్గాన్ని శంకరుడు నిర్వహిస్తాడు. శంకరుడు మోక్ష ప్రదాత. ఆయన రెండు రకాల మోక్షాన్నిస్తాడు. సంసారం నుండి ప్రళయంలో విముక్తినిస్తాడు. అది శాశ్వతం కాదు. ప్రాణులు మరల జన్మించాలి. రెండవది శాశ్వత మోక్షం, జ్ఞానాన్నిచ్చి సంసార విముక్తులను చేస్తాడన్న మాట, ప్రలయ కాలంలో అతడు సంహారమూర్తి, అర్హులకు మోక్షాన్నిచ్చేటపుడు, దక్షిణామూర్తి.


Wednesday 20 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 49 వ భాగం



పుట్టినప్పటి నుండీ సన్న్యాసి యైతే ఇక వేదకర్మలతో సంబంధం ఎట్లా వుంటుంది? ప్రజలకు వైదిక కర్మలపట్ల ఆసక్తిని కల్గించవద్దా? వర్ణ విభజన తప్పని వైదిక కర్మానుస్థానాలు అక్కరలేదనే కాలమది. పరిపక్వమైన మనస్సులు లేనివారికి ఒక్కమాటే జ్ఞానోపదేశం చేయడమా? ఒంటబడుతుందా? వేదశాస్త్ర ధర్మాలు ప్రజలందరికీ తెలియపర్చాలి. శాస్త్ర కర్మల పట్ల వారిలో అనురక్తిని కల్గించాలి. పుట్టుకతోనే సన్న్యాసి, ఆదర్శంగా ఉండలేదు కదా?

కనుక బ్రహ్మచర్మాశ్రమంలో ఉన్నారు. వేదాధ్యయనం, సమిధానం, భిక్షాచర్య, గురుసేవ, శాస్త్రాభ్యాసం మొదలైనవి చేసి సన్న్యాసం పుచ్చుకున్నారు. ఇట్లా బ్రహ్మచారి ఎట్లా ఉండాలో చూపించారు. ఇది లోకానికి ఆదర్శంగానే ఉంటుంది.


బ్రహ్మచర్య ఆదిగాగల నాలుగు ఆశ్రమాలు తప్పనిసరియని శాస్త్రాలనలేదు. బ్రహ్మచర్య దశలోనే నైష్టిక బ్రహ్మచారిగా ఉండి జీవితాంతం వేదాధ్యయనం చేస్తూ ఉండవచ్చు. లేదా తీవ్ర వైరాగ్యం ఉన్నవారికి సన్న్యాసం పుచ్చుకోవచ్చని జాబాలశ్రుతిలో ఉంది. కనుక బ్రహ్మచారిగా ఎనిమిది సంవత్సరాలుండి సన్న్యాసం గ్రహించారు.


బ్రాహ్మణ వంశంలో జన్మ


పూర్వావతారాలలో క్షేత్రధర్మం అవలంబించి శత్రు సంహారం చేయడానికి రామ, బలరామ, కృష్ణావతారాలలో క్షత్రియవంశంలో జన్మించి దుష్టులను సంహరించాడు.


కలిలో ఉపదేశం ప్రధానం కనుక, సాత్వికాచార్యునిగా ఉండాలి కనుక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పూర్వావతారాలలో క్షత్రియ ధర్మం, ఈ అవతారంలో బ్రాహ్మణ ధర్మం. కృష్ణుడెన్నో చిలిపి పనులు చేసాడు. అట్టిది జ్ఞానావతారంలో కుదురుతుందా? ఏ అవతారమైనా ధర్మ సంస్థాపనమే లక్ష్యం.


Tuesday 19 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 48 వ భాగం



కలిలో జ్ఞానోపదేశం బాగా జరగాలి కనుక సన్న్యాసిగా అవతరించాలి. కలిలో గృహస్థుదుపదేశిస్తే జనాలు శంకిస్తూ ఉంటారు. ఆచరించకుండా ఏదో ఉపదేశిస్తున్నాడులే అనే చులకనభావం కల్గుతుంది. ఇంద్రియాలను జయించే గృహస్థులరుదు. ఇక కలిలో వానప్రస్థం నిషేధింపబడింది కూడా. కలిలో గృహస్థాశ్రమం నుండే సన్న్యాసం.


కనుక నివృత్తి మార్గంలో ఉన్నవారికే ఉపదేశానికి అర్హత. ప్రవృత్తి మార్గంలో కూరుకుపోయిన వారు, నివృత్తి మార్గాన్ని ఉపదేశించడమా?


రాత్రి కాలంలో చిన్న దీపం వెలిగిస్తే చాలనే కాలం, పూర్వం ఉండేది. కాని నేడు రాత్రి, పగలూ అనే తేడా లేకుండా దీపం నిరంతరం వెలుగుతూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.


శంకరులు జీవించినది 32 సంవత్సరాలే. 8 సంవత్సరాల జీవిత కాలం 16 సంవత్సరాలయ్యాయి. తరువాత 16 సంవత్సరాలు వ్యాసుని చేత పొడిగింపబడ్డాయి. 32 సంవత్సరాలు జ్ఞానోపదేశానికి సరిపోతుందని భగవత్ సంకల్పం. శంకరులు జీవితాంతం, ఉపదేశంతో గడిపారు.


బ్రహ్మచర్యంలోనూ 


వీరి జీవితంలో కొద్దికాలం బ్రహ్మచర్యం, గురుకులంలో సంపూర్ణ విద్యాభ్యాసం తరువాత సన్న్యాసం, ఆపైన ఉపదేశం, ఇట్లా సాగింది.


పిల్లవాడు, పుట్టీ పుట్టగానే ఉపదేశం మొదలు పెడితే అదేదో అద్భుత కృత్యమని జనులాశ్చర్యపోతారు. అవతారంలో మానవాంశ కూడా కనబడాలి. కదా! అట్టి అలౌకక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారా? ఆశ్చర్య చకితులౌతారు  గాని ఆదర్శంగా తీసుకోలేరు. అందువల్ల ఆదర్శ బ్రహ్మచారిగా కనబడ్డారు.


Monday 18 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 47 వ భాగం



కృష్ణుడు, సన్న్యాసి కాకపోయినా ఉపదేశం ఇచ్చాడు. కృష్ణుడు అనేక కార్యాల చేసాడు. ఆయన ద్వారకు రాజై ఏలాడు. పాండవులను అనేక పర్యాయాలు రక్షించాడు. అర్జునికి రథ సారథి అయ్యాడు. నరకునితో బాటు అనేక రాక్షసులను సంహరించాడు. ఇట్లా కృష్ణుడు చేసిన అసంఖ్యాకమైన పనులలో గీతోపదేశం ఒకటి. కలిలో ఇది సరిపోదని జీవితాంతము జ్ఞానానికే అంకితమైన సన్న్యాసి గురువే కావాలనుకున్నాడు. 


అనేక కార్యాలలో మునిగే గృహస్థులవల్ల ఈ పని సాగదు. ఎట్టి బాదరబందీ లేని సన్న్యాసియే జ్ఞానియై జ్ఞానోపదేశం చేయగలడని భావించాడు.

భారతదేశంలో అలుముకున్న అవైదిక మతాలను ఎదుర్కొని నిజమైన వేదాంతాన్ని బోధించవలసిన అవసరం ఏర్పడింది. దేశాటన చేయాలి. వాదాల నెదుర్కొనాలి. ఇట్టిది గృహస్థు చేయగలడా? అతడు తిరిగే పరివ్రాజకుడు కాగలడా? బ్రహ్మచారి అంతే వాసిగా గురువు దగ్గరే ఉండాలి. ఇక వాన ప్రస్థుడు, అరణ్యంలోనే ఉండాలి. అందుకే సన్యాసి అవతారం.


కృష్ణుడు, దేశం అంతా తిరిగి ఉపదేశించలేదు. అర్జునునకు, ఉద్ధవునకు మాత్రమే ఉపదేశించాడు. అన్నిటికీ ప్రభువునని తన విశ్వ రూపాన్ని చూపించాడు. అతడు పరమ పదాన్ని పొందిన తరువాత భగవంతునిగా అందరూ గుర్తించారు. ఇది భారత, భాగవతాదుల ద్వారా వెల్లడైంది. కనుక ఆ అవతారాన్ని ఏ ఆశ్రమానికి చెందినవాడని ప్రశ్నించనవసరం లేదు. అవసరం లేకపోయింది కూడా. తాను అవతరించినప్పుడు తాను దేవుడనని అన్నివేళలా ప్రకటించలేదు. మామూలు మనిషిగానే చాలా సందర్భాలలో ప్రవర్తించాడు.


Sunday 17 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 46 వ భాగం



'దుష్కృతాం' బదులు 'దుష్కృత్యానాం' అనాలి. అసంఖ్యాకమైన దుష్ట స్వభావాలుంటే వాటిని సంహరించవలసిన అవసరం లేదని అనిపించవచ్చు. ఇట్టి పర్యవసనాలకు దుష్ట భావాలనే విత్తనాలు మనసులో పుడుతున్నాయి. అవి కార్య రూపాన్ని ధరిస్తున్నాయి. వీటిని పెకలించగలగాలి. అపుడు ధర్మ మార్గం వైపు ప్రజలు నడుస్తారు. అపుడు ధర్మ సంస్థాపనం జరుగుతుంది. ' 


మనస్సును సరిదిద్దడం ఎలా? మంచి ఉపదేశాల వల్ల. వట్టి ఉపదేశం సరిపోతుందా? చెప్పే వాని ఆచరణ కూడా ఉండాలి. అందువల్ల పరమాత్మ, జ్ఞానిగా అవతరించాడు.


సన్న్యాసావతారం ఎందుకు?


సన్న్యాసులొక్కరే జ్ఞానులు కానవసరం లేదు. చండాలుడు, జ్ఞానియైతే అతడే గురువని శంకరులనలేదా? జ్ఞాని ఎక్కడోగాని ఉండదు. వారికి గురువుతో నిమిత్తం లేదు. ఇతరులకు ఒక పద్ధతి ప్రకారం ఉపదేశ గురువు బోధించి అర్హులుగా తీర్చిదిద్దాలి. అతడు ఉపనిషత్తులలోని మహావాక్యాలనందిస్తూ ఉండాలి. అన్నీ శాస్త్ర విరుద్ధంగా కన్పిస్తున్నప్పుడు శాస్త్రోపదేశం ద్వారా, క్రమశిక్షణాయుతులైన వారిని, శాస్త్రప్రకారం తీర్చిదిద్దాలి. శాస్త్రాలతో సంబంధమే లేకుండా ఎక్కడో ఒక జ్ఞాని యున్నా అట్టివానికి అవతారంతో సంబంధం లేకుండా ఉంటుంది. అట్టివారిని ఆదర్శంగా చూపితే అవతార ప్రయోజనం సిద్ధించదు. ఒక మూల వేదశాస్త్రాలపై దండెత్తేవారు కత్తులు నూరుతున్నారు. వారిని ఎదుర్కొనాలంటే వేదశాస్త్ర జ్ఞానం కలిగిన వారిని తీర్చి దిద్దవలసిందే. వేదశాస్త్ర పరిరక్షణ ముందుగా ప్రధానం. వేద తత్త్వమైన అద్వైతాన్ని అందించాలి. అందువల్ల అవతారమూర్తి సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత జ్ఞానం సంపాదించినవాడుగా ఉండాలి.


జ్ఞానానికి అంకితమైనవారే భిక్షువులుగా ఉండాలని బౌద్ధ జైనాలలోనూ ఉంది.


Saturday 16 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 45 వ భాగం



గీత ఇచ్చిన అభయం- సమస్య పరిష్కారం -


గీతలో సాధువుల్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం అవతార ప్రయోజనమని యుంది.


శంకరుల కాలంలో సత్పురుషులను రక్షించనవసరం లేకపోయింది. పూర్వకాలంలో సత్పురుషులెక్కువగా ఉండేవారు కనుక వారిని ఈశ్వరుడు రక్షించవలసి వచ్చింది. కాని కలిలో సత్పురుషులే తక్కువ. వీరిని రక్షించడం తేలికే. ఇక దుష్టులను సంహరించడమేమిటి? పూర్వావతారాల కాలంలో అసుర రాక్షసులు, క్రూరమైన రాజులు, వారి సహచరులూ చాలామంది ఉండేవారు కనుక విడిగా గుర్తించి వారిని సంహరించడం జరిగింది.


మరీ శంకరుల కాలంలో ఆనాడు రాక్షసులులేరు. కంస, జరాసంధుల వంటివారు లేరు. అసుర లక్షణాలు కలిగిన దుర్యోధనుని వంటివారు కృష్ణుని కాలంలో కంటె శంకరుల కాలంలో ఎక్కువగా ఉన్నారు. మంచిగా కనబడుతూ అధర్మాన్ని పాటించేవారే ఎక్కువగా ఉండేవారన్నమాట. కొంతమందిని మినహాయిస్తే అధర్మమే ఎక్కువగా ప్రబలియుంది కనుక ఇట్టి వారిని విడదీసి సంహరించడం అంటూ కుదరదు. దుష్టులను సంహరించడం అనే మాటను పాటిస్తే అందర్నీ సంహరించవలసి వచ్చేది. అపుడు ధర్మ సంస్థాపనమెట్లా అవుతుంది? రాబోయే ప్రలయాన్ని ముందే ఆహ్వానించినట్లే కదా!


విశ్వామిత్రుడు యాగం చేసేటపుడు కొందరు రాక్షసులు రావడం, రాముడు సంహరించడం, యాగ సంరక్షణ జరిగింది. ఆ విశ్వామిత్రుడే కలియుగంలో పుడితే అతనికి యాగం చేయాలనే సంకల్పమే ఉండదు.


కనుక కలిలో దుర్మార్గులను చంపడం కాదు. దుర్మార్గ ప్రవృత్తిని సంహరించాలని పరమేశ్వరుడు భావించాడు. చెడ్డ వారనుటకు బదులు చెడ్డ పనులను అని సవరించాలి.


Friday 15 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 44 వ భాగం



మామూలు మానవుల మాదిరిగా కోపతాపాలను ప్రదర్శించగలడు. వేషం వేసినపుడు దానికి తగ్గట్టు చూపించాలి కదా! శరీరం ఫలానా రీతిలో ఉండాలని జ్ఞాని, దాని నెట్లు నియమించడో, అవతార పురుషుడు మనస్సు పట్ల కూడా అట్లా ప్రవర్తిస్తాడు. అతడు భావావేశానికి లోబడినట్లు కన్పిస్తాడు. ఇక మనం వాటికి లోబడతాం. కాని వాటికి అతడు లోబడడు, అదీ తేడా. తన పరమాత్మ స్థితిపై భావావేశాలు, ఆటంకాలు ఉండలేవు. అతడు మన మాదిరిగా క్రింద మీద పడుతున్నట్లు కనబడినా నిలద్రొక్కుకునే యుంటాడు.


అవతారం గురించి సందేహమేల?


అవతార పురుషుడు, దీనునిగా ఉన్నట్లు కన్పిస్తాడు. ఆ సందేహం రాకూడదని, మాయను ఆధీనంలో ఉంచుకొన్నానని గీతలో అన్నాడు. కాలడిలో నదీ గమనాన్ని మార్చినా, నర్మద వరదలను అడ్డుకున్నా, జ్ఞానం విషయంలో సర్వజ్ఞులైన శంకరులు మామూలు మనిషిలా ఎందుకు ప్రవర్తించారు? కాశీలో విశ్వనాథుడు, పంచముడిగా రాగా, అతడు స్వామియే యని శంకరులెందుకు గుర్తించలేకపోయారు? పొమ్మని ఎందుకన్నారు? తరువాత అతనికి నమస్కరించి ఉపదేశాన్ని ఎందుకు పొందారు? అట్టి సందర్భాలలో గీతా సూక్తులను గుర్తుంచుకోవాలి.


అవతార పురుషుని ఆధీనంలో మాయయున్నా, మాయ గుప్పిట్లో తానున్నట్లు కన్పిస్తాడు. అనుకుంటే వెంటనే దానిని తరమగలడు. సీతకోసం విలపించిన రాముడు, రావణుని సంహరించి నా ధర్మం నేను నిర్వర్తించాను. నీకూ నాకూ ఏ సంబంధం లేదని, ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మని సీతతో అన్నాడు. అనగా ఒక తీవ్రదశనుండి మరొక తీవ్రదశకు చేరుకున్నట్లుగా కన్పిస్తాడు. ఇట్లా ఎందుకని మనం అవతారాన్ని ప్రశ్నించకూడదు.


ధర్మక్షయం


కృష్ణుడెందుకు అవతరించాడో శంకరులూ అందుకే అవతరించారు. క్రీ.పూ. 2500 నాటి భారత స్థితి, అవతరించడానికి అనువుగానే ఉంది. కృష్ణుని కాలంలో ప్రవృత్తి నివృత్తి ధర్మాలెట్లా క్షీణించాయో అట్టి పరిస్థితే, శంకరుల కాలంలోనూ ఉంది. కృష్ణుని కాలం కంటె, అవి ఎక్కువగా క్షీణించాయి. కృష్ణుని కాలంలో స్వర్గం నిమిత్తమై కర్మానుష్టానం ఉండేది. కర్మల విషయంలో వేదాలలో చెప్పిన వాటికి తగిన గౌరవం ఉండేది. శంకరుల కాలంలో వేదాన్ని విడిచి పెట్టారు. ఇక నివృత్తి మార్గంలో శూన్య సిద్ధాంతము చోటు చేసుకుంది. అది ఒక త్రిశంకు స్థితి వంటిది. అట్టి శూన్యబోధ, కృష్ణుని కాలంలో లేదు. అందువల్ల శంకరులవతరించవలసి వచ్చింది.


Thursday 14 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 43 వ భాగం



మానవకారం చూసి మనకు సందేహాలు రాగా, మీ మాదిరిగా మాయలో పడనని, మాయనే తన ఆధీనంలో ఉంచుకొన్నానని చూపిస్తాడు. "ప్రకృతిం స్వామధిష్ఠాయ" అన్నాడు కదా! నేను పరబ్రహ్మనైతే మాయ, నా దగ్గర రాదు. అదైనా నా చెప్పు చేతలతో ఉంచుకుంటాను" అని అంటాడు.


ప్రళయానంతరం, జీవులు పుట్టాలి. పుట్టించాలి కదా! సత్త్వ రజస్తమో గుణాలతో ఉన్న మాయను సాయంగా చేసుకొని అవతారంగా వస్తానంటాడు.


మానవాకారంతో ఉన్నాడంటే, మాయతో ఉన్నాడని కాదు. దీనితో ఏదైనా చేస్తాడు. దీనిని పొమ్మని ఆత్మారాముడై యుండగలదు. కోపం ప్రదర్శిస్తాడేమిటి? అవి వస్తే రానీ, పోతే పోనీ, ఉంటే ఉండనీ, అవి లోనున్న నిజరూపంపై ప్రభావాన్ని చూపించగలవా అనే ధోరణిలో ఉంటాడు.


ఆత్మజ్ఞాని, దేహం గురించి ఏమీ పట్టించుకోలేదని వింటాం. లోనున్న ఆత్మను శీతోష్ణాదులేమీ చేయలేవని శాంతంగా ఉంటాడు. అయితే ఆత్మకంటె, మనస్సు భిన్నంగా ఉంది. బాధపడనీ, కోపబడనీ అని మనస్సనుకోదు. భగవానుడు కూడా మాయకు లోబడి యున్నట్లుగా జీవునిగా నున్నాడు. అయినా మనస్సును నియమించి ప్రత్యేకంగా మాయతో నున్న జీవునిగా ఉండకుండా, జ్ఞాని గానే ఉంటాడు. అటువంటప్పుడు మనస్సునెట్లా ఆహ్వానించి తన దగ్గరే ఉంచుకుంటాడు? కోపం, దుఃఖం మొదలగు లక్షణాలు కలిగిన మనస్సు నెట్లా తనంతట తాను ఇష్టం వచ్చినట్లుగా వెళ్లేదానినిగా చేస్తాడు? అతడు మాయకు అతీతుడు కనుకనే మాయకు లోబడకుండా తన అదుపులో ఉంచుకోగలడు. పరమాత్మ అనే స్థితినుండి ఎప్పుడూ దూరంగా ఉండదు. మహామాయ, జ్ఞానులను కూడా లోబరుచుకొంటుందని, దుర్గాసప్తశతిలో ఉంది. అట్టిది కూడా, అవతారం దగ్గర తలవంచవలసిందే. అందుకే మాయను (మనస్సును) రమ్మనగలడు, పొమ్మనగలడు కూడా.


Wednesday 13 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 42 వ భాగం



ఆయన సామాన్య మానవునిగా ఉంటే కూడా ఆయన పనులను మనం పట్టించుకోం. ఈనాటికీ ధార్మికులనేకులున్నారు. వారిని పట్టించుకుంటున్నామా? ఇతరులపై వారు ప్రభావాన్ని చూపలేరు. మొత్తం జాతికంతటికీ ఉపయోగించే పనులు చేసే గాంధీ వంటి వారక్కడక్కడ ఉంటారు. అందువల్ల అవతారమూర్తిలో కొన్ని మానవ లక్షణాలుంటాయి. దైవ లక్షణాలు, దైవీశక్తుల ప్రదర్శన కూడా ఉంటుంది. అందువల్లనే అవతారం చాలించినా అట్టివాని ప్రభావం తరతరాల వరకూ ఉంటుంది. అందుకే చిన్ననాటినే శ్రీరాముడు తాటకను వధించడం, సుబాహువును చంపడం, రాజ్యాన్ని త్యాగం చేయడం, అరణ్యాలకు వెళ్ళమంటే సంతోషంతో వెళ్ళడం జరిగింది. ఆయనో దేవుడు, మనకు చాలా దూరంగా ఉన్నాడని జనులు భావించకుండా సీతాపహరణంలో విలపించాడు. మీరు సీతను చూసారా అని చెట్టును, పుట్టనూ అడిగాడు. ఇట్లా ఒక్కొక్కప్పుడు మానవునిగా, మరొక సందర్భంలో దేవునిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.


ఆయన దేవుడు కదా, గొప్ప పనులు చేసాడు. మనమేమి చేయగలం? అని నిరుత్సాహ పడనవసరం లేదు. ఇంద్రియాలను నియమించి పవిత్ర జీవనం గడిపే వారు కూడా కొన్ని అద్భుత కృత్యాలు చేయగలరు. వారు యోగేశ్వరులైతే దేవతల కంటె మిన్నగా పనులు చేస్తారు కూడా. అట్టివారెందరో ఉన్నారు. ఇట్లా ప్రోత్సాహమీయడానికే దేవుడవతరిస్తాడు.


ప్రజలతో కలిసి మెలిసి యుండాలని తపన


సంకల్పం వల్ల ధర్మ సంస్థాపనం కాదు. తాను సృష్టించిన ప్రాణులతో కలిసి మెలిసి యుండాలనే తపనతో ఉంటాడు. ఈ సృష్టి అంతా అతని సంతానమే. పిల్లలతో తల్లిదండ్రులుండడానికి ఇష్టపడరా? అట్లాగే పరమాత్మ కూడా. పిల్లలెట్లా ఉన్నా వారితో ఉండాలనే ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అతనికట్టి కోరిక కలిగియుంటే అతడు నిర్గుణ బ్రహ్మమైతే ఎట్లా మనం తెలిసికోగలం? మనకు తెలియని బ్రహ్మముతో మన కలయిక ఎట్లా? నాల్గు చేతులతో శంఖ చక్రాలతో కనిపిస్తే మనమాతనిని సమీపించగలమా? అట్టి మూర్తిని చూడగానే వరాలనడుగుతాం. లేదా వెంటనే మూర్చపోతాం. అందువల్ల మానవాకారాన్ని ధరించి వస్తాడు. అట్టి అవతారాన్ని ఒక బోయగాని, ఒక కోతిగాని, లేదా ఒక గొల్ల వనితగాని సమీపించగలరు. అతడు మానవుడని దగ్గరకు చేరుతారు. ఆ అవతారాలలో క్రోధం, దుఃఖం కూడా మానవుల మాదిరిగానే ప్రదర్శిస్తాడు. కనుక వీరు సమీపించగలరు. అంతకంటే అనంతమైన ప్రేమ, జ్ఞానం, సత్యం చూపుతూ ధర్మస్థాపన చేస్తాడు. ధర్మం క్షీణించినపుడవతరిస్తాడు.


Tuesday 12 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 41 వ భాగం

 


ఇది లీలా సృష్టి కనుక శాశ్వతంగా ధర్మ సంస్థాపన చేయడు. అతడవతరించాలని అనుకోకపోయినా మన చేష్టలవల్ల అతడవతరించునట్లు చేస్తాం. అతడన్నిటినీ గమనిస్తాడు. అందువల్లనే సృష్టి, పోషణ, సంహారమూ కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా జీవుల కర్మలనుసరించే అతడవతరించడం ఎందుకని, అతణ్ణి బాధ పెట్టడమేమిటని మనం ఊరుకుంటామా? అతని సంకల్పానికి దూరంగా ఉండము. అట్టి సందర్భంలో కేవలం సంకల్పబలం వల్లనే సృష్టిని మూసివేయకుండా అవతరిస్తాడు. ధర్మ సంస్థాపన చేస్తాడు.


అంతా అతని సంకల్పము. అది మరొక దాని ద్వారా జరుగునట్లు చేస్తాడు. అధర్మం తల ఎత్తడమూ అతని సంకల్పమే. అసురుల వల్ల, క్రూరుల వల్ల అధర్మం తల ఎత్తుతుంది. కలిలో మానవులు చెడిపోయారంటే అది వారి మనస్సుల వల్లనే. మనస్సులో చెడ్డ ఆలోచన వచ్చినపుడు ఇంద్రియాలూ పనిచేస్తాయి అనగా సాధనలు, ఉపకరణాలు. కాని సంకల్పం బైటకు కనపబడదు. సంకల్పాల వల్లనే చెడ్డ పనులు. సంకల్పం వల్లనే వాటి నిర్మూలనం జరుగుతుంది. మంచి వాటికి చెందిన సాధనాలూ కావాలి. అందువల్లనే మహాత్ములనే సాధనాలను మాటిమాటికీ పంపుతాడు. పుట్టునట్లు చేస్తాడు. వారివల్ల సాధ్యం కాకపోతే తానే అవతరిస్తాడు.


మానవ స్వభావం - అవతారంలో దివ్యత్వం


ధర్మాన్ని స్థాపన చేయడంలో ఎన్నో దృష్టిలో పెట్టుకుంటాడు. ధర్మోపదేశం చేయడమే కాదు, దానిని ఆచరించి చూపిస్తాడు. వట్టి ఉపదేశం, తలకెక్కుతుందా? తాము ధర్మాచరణ చేస్తూ సుఖంగా ఉన్నవానిని చూసి ఇతరులకు వారిని అనుసరించాలనే బుద్ధి పుడుతుంది. తన జీవితాన్ని దృష్టాంతంగా చూపించడం అందుకోసమే.


అవతార పురుషులకు మానవులలో ఉన్న లోపాలుండవా? అందరికీ అందుబాటులో ఉండకుండా ఏ కొండ శిఖరాన్నో అధిరోహించి యుంటాడా? కోరికలు, ఎట్టి భావ సంఘర్షణలూ లేకుండా మనకందుబాటులో లేకుండా ఉంటాడా? అట్లా ఉండకుండా ఉంటే అతడు మనకాదర్శప్రాయుడెట్లా అవుతాడు? ఒక వస్తాదు, తన వక్ష స్థలంపై ఏనుగు నెక్కించుకొని యుండగా దానిని చూసి ఆశ్చర్యపోతాం. అయితే ఆ పనిని మనం చేయడానికి సిద్ధపడతామా? అవతార పురుషుడు అట్టివాడు కాడు. మనలో ఒకనిగా ఒకడై ఉంటాడు. మానవ స్వభావంతో ఉండి ధార్మికంగా మసలుతాడు. ధార్మిక కార్యాలలో ఎక్కడ మనం తప్పటడుగులు వేస్తామో అట్టి చోట్ల విజయాన్ని పొందుతూ ఆదర్శంగా ఉంటాడు.  


Monday 11 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 40 వ భాగం



అసలు సృష్టే లేకుండా సంకల్పం వల్ల చేయవచ్చు. ఆదిలో సచ్చిదానందుడై లేడా? అతడాతృప్తితో ఉండకుండా లీలగా మాయ యొక్క సాయంతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రలయంలో లీనమైన జీవులను మరల సృష్టించడం, వారు జనన మరణ ప్రవాహంలో ఇరుక్కోవడం ఏమిటి? అయినా అతని సంకల్పాన్ని, చేష్టను అర్థం చేసుకోలేం. ఏదో ఒక కారణం వల్ల సృష్టిస్తున్నాడు. ఏం జరిగింది? వేదాంతంలో, చివరి మాట ప్రకారం అసలు సృష్టే లేదు. అంతా కల్పనే. (దీనిని అజాత వాదం అంటారు) మాయా విలాసం ఎందుకుండాలి? వీటినన్నిటికీ లీలయని చెప్పగలం.


భగవానుని స్వభావం తెలియదు. శాంతంగా ఉండిపోవచ్చు. శాంతంతో ఉంటూనే ఆట ఆడిస్తున్నాడు. సృష్టికి అంతం అంటూ లేదు. దానిని ముగించడు. ప్రలయం వచ్చేవరకూ ఆట సాగుతూనే ఉంటుంది.


సంకల్పంతోనే ధర్మ సంస్థాపనం చేయవచ్చు. లేదా సృష్టికి చాపచుట్టవచ్చు.


అధర్మం ప్రబలి, ధర్మం నాశనమవుతూ ఉంటే ధర్మ సంస్థాపనం కొనసాగాలనుకున్నాడు. ఈ పని, శాశ్వతంగా ఉంటుందా? ఇట్లా జరిగితే ఈ నాటకం భిన్న భిన్న రసాలతో, సన్నివేశాలతో ఉండకుండా విసుగు కల్గిస్తూ ఉంటుంది. ఒక పెద్ద త్రాటిని అటూ ఇటూ కొంతసేపు లాగుతూ ఉంటారు. ఒక్కసారి ఒక పక్షమే లాగితే ఇంక వినోదమేమిటి? అటూ ఇటూ లాగుతూ ఉంటేనే ఆట. అందరూ ధర్మాన్ని ఆచరించి మోక్షం పొందితే ఇక సృష్టేమిటి? అసలు ప్రపంచం మిశ్రలోకం. అంటే ఇందులో మంచి, చెడు, రెండూ ఉంటాయి. అసుర లోకం అంతా కశ్మలంగా, దేవగంధర్వ లోకాలు సంతోషమయంగా; తపోలోక సత్యలోకాలు శాంతిమయంగా ఉంటాయి. దానికి భిన్నంగా ఈ మిశ్ర లోకాన్ని సృష్టించాడు. ఈ జీవులకు కొంత స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆట సాగించాడు. ఈ మిశ్ర లోకం, అమిశ్రలోకమై ధర్మలోకమైనపుడు ఇక నాటకాన్ని శాశ్వతంగా మూయవేయవలసి వస్తుంది.


అందరూ మోక్షాన్ని పొందితే ఇక సృష్టి సాగడమేమిటి? నేను సృష్టించిన దానిని ప్రాణులే మూసేస్తారా అని అనుకోడా? నేనే ఆ పని ఎందుకు చేయకూడదని భావించడా?


Sunday 10 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 39 వ భాగం



అవతార రహస్యం - సూచన


'ప్రకృతిం స్వామధిష్టాయ' ప్రకృతిని వశం చేసుకొని అని ఎందుకన్నాడు? మరొక చోట గీతలో 'ప్రకృతిం స్వాం అవష్టభ్య' అని ఉంది. దాని అర్థమూ పై మాదిరిగానే. ఆ రెండింటికీ 'వశీకరించుకొని' అని శంకరులు వ్యాఖ్యానం చేసారు. ముందు తానట్లా జన్మ నెత్తినట్లు, రెండవచోట జన్మలను ప్రాణులకు ప్రసాదిస్తున్నానని అన్నాడు. ప్రకృతి యొక్క సాయంతో ప్రకృతి యొక్క స్వాధీనంలో ఉన్న ఈ సమస్త భూత సముదాయాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాడు.


ఇక్కడ ధర్మం కోసం జన్మల నెత్తుతున్నాని చెప్పి ఊరుకోవచ్చు. లేదా ప్రలయంలో అన్నీ లీనమైన జీవులు, తమ తమ కర్మలననుభవించడానికి మరల పుట్టిస్తున్నానని చెప్పవచ్చు. రెంటిలోనూ ప్రకృతినే వశం చేసుకొని అని ఎందుకన్నట్లు?


ఇక్కడే అవతార రహస్యం వస్తుంది. అందువల్ల దానిని తెలియజేయడం కోసం, అట్లా అన్నాడు.


కేవలం సంకల్పం వల్ల సృష్టించవచ్చు కదా! అని మరొక ప్రశ్న. ధర్మం క్షీణించింది, ప్రజలు బాధ పడకూడదని ప్రజలు ధార్మికులుగా జీవించాలని అనుకోవచ్చు. సంకల్పం చేస్తే చాలు కదా! జన్మలేనివాడు జన్మనెత్తడమేమిటి? నామ రూపాలు లేనివాడు, నామరూపాలతో అవతరించడమేమిటి? అతడు సచ్చిదానందుడైనా మన మాదిరిగా కోపతాపాలు, శృంగారం, మొదలైనవి ఏమిటి? ఏ వైకుంఠంలోనో కూర్చొని సంకల్ప బలం ఉపయోగించవచ్చు కదా! ఇట్టి ప్రశ్నలు వస్తాయి.


Saturday 9 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 38 వ భాగం



అర్జునుడడగకపోయినా మనవంటివారికి అట్టి సందేహాలు కలిగాయని కృష్ణుడు ఇట్లా జవాబిచ్చాడు "నాకు జన్మ లేకపోయినా, అనంత శక్తులతో కూడిన స్వభావం కలవాడినై అన్ని ప్రాణులను నియమిస్తూ, స్వీయ ప్రకృతిని వశం చేసుకుని నా మాయవల్లనే అవతరిస్తున్నా"నని అన్నాడు.


అజోఽపిసన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపిసన్

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా   

ఇక ఎందుకు జన్మనెత్తాడో సమాధానం చెబుతున్నాడు. ఎపుడు ధర్మానికి పతనం, అధర్మానికి అభివృద్ధి ఉంటుందో అపుడు నేను నా శరీరాన్ని సృష్టించుకుంటానని అన్నాడు.


ధర్మం పతనమైతే సత్పురుషులకు రక్షణ ఉండదు కనుక, వారిని రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం అవతరిస్తానని అన్నాడు:


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే


ఇట్లా ధర్మాన్ని స్థాపించినా మరల అసుర శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. కనుక స్థాపనంతో సరిపెట్టక సంస్థాపనమన్నాడు. అంటే బాగుగా స్థాపించుట. అది కొంతకాలం ఉంటుంది. మరల అసురల శక్తుల విజృంభణం. అందుకే యుగ యుగాలలోనూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం కాదు. ఎన్ని యుగాలు రానీ, ఎన్ని సృష్టులు రానీ, విసుగు చెందకుండా మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని అర్థం చేసుకోవాలి. శ్లోకం, యుగంతో ఆరంభం కాలేదు. ఎప్పుడు ధర్మానికి పతనం అధర్మానికి అభివృద్ధి ఉండవో అన్నవాడు, ఒక్క యుగంలోనే అంటాడా? ప్రకృతికి బద్ధులై మిగిలినవారు పుడతారు. తానేమో ప్రకృతిని వశం చేసుకొని పుడతానన్నాడు. అదీ తేడా.


Friday 8 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 37 వ భాగం

 

అసలవతార తత్త్వం


కృష్ణుడు తాను సూర్యునకు 'సనాతన ధర్మాన్ని' ఉపదేశించినట్లు అది చాలాకాలం సాగి క్రమక్రమంగా క్షీణించినట్లు దానిని మరల అర్జునునకు ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు. ఇదేమిటయ్యా! నీవు నాకు కన్పిస్తున్నావు, యుగాల వెనుక ఉపదేశమిచ్చానంటావేమిటని అర్జునుడన్నాడు. 


"అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః

కథ మే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి"


దానికి సమాధానంగా “నీకూ నాకూ అనేక జన్మలు గడిచాయని, నేను వాటినన్నిటినీ ఎరుగుదనని, నీవెరుగవని" కృష్ణుడు అన్నాడు.


"బహూని మే వ్యతీతాని జన్మాని తవార్జున

తాన్యహం వేద సర్వాణి నత్వం చేత పరంతప"


అర్జునుడు తిరిగి ప్రశ్నించాడా? నాకున్నట్లే ఇతనికీ బహు జన్మలున్నాయని ఊరుకున్నాడా? అతడు గుర్తు పెట్టుకున్నాడులే అని ఊరుకున్నాడా?. ఎందుకు? ఎప్పుడు జన్మనెత్త వలసి వచ్చిందని అడిగాడా? గత జన్మల గురించి ఇప్పటికీ ఎట్లా గుర్తుందని అడిగాడా? ఇట్లా శంకించి భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడా? మనకైతే సందేహం కల్గుతుంది. అర్జునుడు మానవుడు కనుక, గత జన్మ కర్మలు వెంటబడడం, జన్మలనెత్తడం ఉంటుంది కాని, భగవంతునకు కర్మలు - జన్మలూ ఉంటాయా? కర్మల వల్ల పుట్టుక ఉంటుందా? ఎందువల్ల భగవానుడు జన్మనెత్తవలసి వచ్చింది? ఇపుడు లీలగా జన్మనెత్తినట్లు అప్పుడూ లీలగా ధరించాడా? అనే ప్రశ్నలు మనవంటి వారికి వస్తాయి. 

Thursday 7 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 36 వ భాగం



విప్లవాత్మక మతాలు


పాతవాటిని నిర్మూలించాలని, క్రొత్తవాటిని ఏర్పాటు చేసుకుందాం అనడం చాలాకాలం నుండి నేటి వరకూ ఉంది. పూర్వకాలంలో ఈ ధోరణి తక్కువగా ఉండేది. నేడిది అధికం. వేదం ఎందుకు? మా శాస్త్రాన్ని భగవానుడే అందించాడని కొందరు, వేదము లేదు, శాస్త్రమూ లేదు. శాస్త్రమే గొప్పదని కొత్త మతాలను స్థాపించారు.


ఇట్లా బౌద్ధ జైన మతాలు వచ్చాయని చెప్పాను. అయితే పచ్చి భౌతిక వాదాన్ని చెప్పే చార్వాకాన్ని చాలామంది స్వీకరించలేదు. బౌద్ధ జైనమతాలకు రాజాదరణ లభించింది. వారిద్దరు రాజ కుటుంబాలలో పుట్టడం, అన్నిటినీ త్యజించడం, వారి ప్రవర్తన, ప్రజలకు నచ్చింది ఇక రాజపోషణ కూడా ఉంది. ఆ పైన జనులు మాట్లాడుకొనే ప్రాకృత భాషలోనే బుద్ధుడు ప్రవచనాలను సాగించాడు. జినుడు, అందరికీ ఉపయోగపడే పాఠశాలలను స్థాపించి విద్యావ్యాప్తి చేసాడు. వారి వారి మాతృ భాషలలోనే పాఠాలుండేవి. ఆ మత సిద్ధాంతాలు సామాన్య జనులకు తెలియవు. జీవితంలో వాటిని ఆచరణలో పెట్టడం తెలియకపోయినా ఆ మతాలలో జనులు చేరారు. చివరగా ఆ మతాలవారు, విగ్రహారాధనను కూడా ప్రవేశపెట్టారని చెప్పాను. అందువల్ల చేరారు.


ఈ రెండు మతాలలో శంకరుల కాలంలో జైనం ఎక్కువగా వ్యాప్తి చెందకపోవడం వల్ల దానిని ఎక్కువగా శంకరులు ఖండించలేదు. బౌద్ధమతాన్ని అక్కడక్కడ ఖండించారు. ఇక మీమాంసకులనెక్కువగా ఖండించవలసి వచ్చింది. కారణం చెబుతాను.


అవతరించుటకు తగిన పరిస్థితులు


శంకరుల కాలంలో వైదిక మతం క్షీణించింది. వైదికం కాని మతాలు కొన్ని, తాంత్రిక మతాలు కొన్ని, భగవంతుడే తమ మతాలు చెప్పాడని కొన్ని, ఇలా 72 మతాలున్నాయి. అందువల్ల ఈశ్వరుడే అవతరించవలసి వచ్చింది. కృష్ణావతారానికి, శంకరావతారానికి సంబంధం ఉంది.


Wednesday 6 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 35 వ భాగం



సాంఖ్యం గః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా"


అనగా ఇందులో వేదం కంటే భిన్నంగా మతాలు పేర్కొనబడ్డాయి. ఐదు మతాలలో వేదం ఉంది. అంటే మిగిలినవి అవైదికములనే కదా అర్థం! ఇక శివ మహిమ్నస్తవంలో "త్రయీ (వేదం) సాంఖ్యం యోగః పశుపతిమతం, వైష్ణవ మితి" అని ఉంది. త్రయి అంటే వేదమే. దానికి భిన్నంగా మిగతా మతాలు పేర్కొనబడ్డాయి. శివుణ్ణి కీర్తించే స్తోత్రమైనా శైవాన్ని వైదిక మతమని పుష్పదంతుడు అనలేదు.


కనుక వేద మార్గమే సత్యమైన మార్గమని మిగిలినవారు కొన్నిటిని గ్రహించి కొన్నిటిని విడిచి, కొన్నిటిని చేర్చి వైదికములనే భ్రాంతిని కల్గించారు. వీరు విద్వాంసులగుటచే బుద్ధిమంతుల్ని ఆకర్షించారు. సామాన్య జనులపై కూడా ప్రభావం చూపారు.


అట్లాగే కొన్ని తంత్రాలు వైదికములనే భ్రాంతిని కల్గించాయి. ఇక కొందరు వేదాలకంటె ఆగమాలకే పట్టం గట్టారు. అవి దేవాలయ అర్చనాదులను చెప్పేవి. వాటిని భగవంతుడే చెప్పాడని ప్రచారం చేసారు.


తాము అవైదికంగా ఉన్నా, వైదిక మతాన్ని వారెట్లా గుర్తించారో చూడండి. భగవంతుడే తంత్రాన్ని 'లేదా ఆగమాన్ని చెప్పాడని, పురాణాలలో ఇట్లా చెప్పబడిందని వాటిని ప్రమాణంగా చూపుతూ వైదిక కర్మలకు సామాన్యులను దూరంగా ఉంచారు.


Tuesday 5 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 34 వ భాగం



వేదాలలో యజ్ఞాలు, వాటిలో హవిస్సుల నర్పించుట; అవి వివిధ దేవతలకు చెందుట అనే ప్రక్రియ వైదికము. ఇందొక దేవతకే అర్పిస్తాను, ఇంకొక దేవతకు అర్పించననడం అవైదికం. ఒక దేవతను ఇష్టదైవంగా ఆరాధించడంలో తప్పులేదు. ఇక కర్మకాండ దగ్గరకు వచ్చేటపుడు శ్రుతి, స్మృతులలలో చెప్పబడినట్లే చేయాలి. ఒక దేవత పట్ల ప్రత్యేకాభిమానము, మరొక దేవత పట్ల దురభిమానాన్ని ప్రకటించడానికి వీలు లేదు.


40 సంస్కారాలే స్మృతులలో చెప్పబడ్డాయి. దానికి మించి అనుసరిస్తే అది అవైదికమే. శంఖం, చక్రం, త్రిశూలం, ఋషభం వంటి ముద్రలను శరీరంపై ముద్రాధారణం, వైదికం కాదు. అవైదికమే అనాలి. ముద్రాధారణ జరిగితేనే శైవునిగానో, వైష్ణవుని గానో పరిగణిస్తామని అనడం శాస్త్రసమ్మతం కాదు.


నాకు భక్తే ప్రధానం, వర్ణాశ్రమాలలో పని లేదన్నా ఆ పద్ధతి కూడా అవైదికమే.


కేవలం తత్త్వాన్నే గ్రహిస్తాం, మిగిలిన వాటిని పట్టించుకోం అని కొందరంటారు. కర్మకాండ, భక్తి, తత్త్వవిచారణ మొదలైన అంశాలన్నీ ఎవరికి ఏ దశలో, ఏ స్థితిలో చెప్పారో గ్రహించుకొని నిర్ణయానికి రావాలే గాని, తమ కిష్టం కాని దానిని విసర్జిస్తామని, మాకా వేదాంతమే ప్రధానమని, అందలి వర్ణాశమ్రాలు నేటి సమాజంలో పనికిరావని వాదించేవారిని వైదికులని ఎట్లా అనగలం? వేదం అందించిన మార్గాన్ని పట్టుకోలేకపోతే అదీ అనవసరం అనడం సబబు కాదు.


ఏది వైదికమో, ఏది అవైదికమో భారతమే నిర్ణయించింది. వివరాలకై అమృతవాణి-1, పుట 55 చూడండి) అయినా సూక్ష్మంగా అందిస్తా.


Monday 4 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 33 వ భాగం



చిత్రమేమిటంటే దేవుణ్ణి గురించి మాట్లాడని బుద్ధుణ్ణి దేవతగా చేసి పూజించడం మొదలు పెట్టారు. ఈ మూర్తులను చూస్తే శాంత భావం మనలో ఉదయిస్తుంది. పూజలతో వారు ఆగలేదు. తరువాత భిక్షు సంఘాలు వచ్చాయి. ఎంతమంది సన్న్యాసులుంటే అంత ఘనతగా భావించారు. అర్హత, పరిపక్వమైన మనస్సు లేనివారు సన్న్యాసం తీసుకొంటే రకరకాల వికారాలు పుట్టడం సహజం. (స్త్రీలకూ సన్న్యాస దీక్ష మొదలైంది కూడా) కోరికలను తీర్చుకోవడంకోసం తాంత్రిక పూజలను మొదలు పెట్టారు. పూజలేని మతంలో పూజలు ప్రారంభమయ్యాయి. వీరిని చూసి మన మతంలో మనవారూ ప్రవేశపెట్టారు.


పాశుపతమతం, వైదికమని, అవైదికమని చీలింది. వైదిక పాశుపతంలో అసభ్యకరమైన పూజలు లేవు. అట్లాగే వైష్ణవ, భాగవత, పాంచరాత్రంలోనూ అసభ్యం లేదు. ఇక కాశ్మీర శైవ సిద్ధాంతంలోనూ వామాచారం లేక పోయినా పూర్తిగా వైదిక మతం కాలేకపోయింది. భక్తి ద్వారా ఏకాగ్రతను సంపాదించి అద్వైత జ్ఞానాన్ని పొందవచ్చని చెప్పింది. ఇది ఆద్వైతానికి దగ్గరగా ఉంటుంది. పూర్తిగా అద్వైతంలో ఉండదు.


వైదికం అంటే పూర్తిగా వేదాలను నమ్మితేనే


వేదంలో కొంత భాగాన్ని నమ్మి, కొంత దానిని నమ్మని మతాన్ని పూర్తి వైదిక మతమని అనలేం. ఇందు శివసూక్తాలున్నాయని పాశుపత మతాన్ని వృద్ధి చేసామని; విష్ణు సూక్తాలను గ్రహించి భాగవత పాంచ రాత్రాన్ని వృద్ధి చేసామంటే అది సరియైన వాదం కాదు. వేదంలో శివ, విష్ణువులని అన్నా అవి పరబ్రహ్మ వాచకములే, శివుడే పరమ దైవమన్నా, విష్ణువే పరమ దైవమన్నా ఇబ్బంది లేదు. కాని ఒకరికంటే మరొకరు తక్కువని నిందించుకోవడం వేద సమ్మతం కాదు. అందువల్ల ఆ మతాలు, అవైదికాలని పిలువ బడతాయి.


Sunday 3 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 60 వ భాగం



శంకరులు, శైవులూ, వైష్ణవులూ, శాక్తేయులు కూడా 


శంకరుల గురించి "అంతః శాక్తో బహిః శైవః వ్యవహారే తువైష్ణవః" అంటారు. ఆయన లోపలేమో అంబిక. విభూతి, రుద్రాక్ష ధారణచే శివుడు. ప్రాపంచిక వ్యవహారాలో విష్ణువు. ఆయన నోటినుండి నారాయణ, నారాయణ అని వస్తుంది. వ్రాయవలసి వచ్చినప్పుడు "క్రియతే నారాయణ స్మృతిః" అనగా విష్ణు భావనతో శివావతారంగా చెలామణి అయి చేసేదంతా నారాయణ కృత్యమే. ఇట్లా శివ- విష్ణు అద్వైతం కుదిరింది.


విష్ణువు చేస్తున్నాడంటే అమ్మవారు చేస్తున్నట్లే. అవతారం పురుషాకారంలో ఉంది. నారాయణుని పేరుతో పనులు. ఆ నారాయణుడూ అమ్మవారి పురుష రూపమే. లోపల అమ్మవారి రూపం. మరొకవిధంగా హృదయంలో అపారమైన దయ యుంటుంది. అందువల్ల "అంతశ్శక్తః"


ఇక్కడ శక్తి అంటే దయయే. అది లేకపోతే శివం లేదు. శివుడు, తనలో నున్నది శక్తియని తెలియాలన్నా శక్తియుండవలసిందే. శివం దయను చూపిస్తే అది శక్తియే. ఆమె లేకపోతే ఆయన, రాణించడనే మాట ఉంది కదా.


అయితే ఈ అవతారం, సీతారాముల మాదిరిగా, రాధాకృష్ణుల మాదిరిగా ఉండదు. సన్న్యాసిగా అవతరించాడు కనుక, అమ్మవారు బైటకు కనబడదు. తన భార్య కనబడేటట్లు విష్ణువు, ఆమెను ధరిస్తాడు. నరనారాయణులుగా కన్పడినపుడు విష్ణువుగా కన్పడకుండా అంశావతారంగానే కన్పిస్తాడు. కలిలా భగవత్ శక్తి అవతరించాలి. అయినా లక్ష్మి - విష్ణువనే జంటగా కాదు. సన్న్యాసి కదా! ఆపైన దక్షిణామూర్తి శుద్ధమైన, సంపూర్ణమైన పరమేశ్వరునిగా కన్పిస్తాడు. పార్వతీ పరమేశ్వర రూపంలో కాదు. అందువల్ల దక్షిణామూర్తి నుండి శంకరువతరించాలి.


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 32 వ భాగం



ఆనాటి పూజా పద్ధతులు


ఒక ప్రక్క కాపాలికం, కాలాముఖం, భైరవం లాంటి క్రూర పూజావిధానాలు విజృంభించాయి. శక్తి ఉపాసనలో వామాచారం మధువు, మత్స్యము, మాంసము, ముద్ర, మైథునాలతో సాగేవి. అసహ్యకరమైన ఈ చర్యలకు కొత్త కొత్త అర్థాలను చూపించి సమర్థించినవారూ ఉండేవారు.


సాత్వికపూజలతో బాటు తామసిక పూజలూ చాలాకాలం నుండి వస్తున్నాయి. కల్లు, మాంస నైవేద్యం, భయంకర నృత్యాలు మొదలైనవి నేటికీ సాగుతున్నాయి. ఇప్పటికీ ఆదివాసులు ఇట్టి నైవేద్యాలను అర్పిస్తూ పండుగలు జరుపుకుంటూ ఉంటారు.


దేవతారాధన పేరుతో కొన్ని భయంకరాచారాలు తంత్ర గ్రంథాలలో కన్పిస్తాయి. అందు సాధన, చేసినవారికి కొన్ని సిద్దులూ సంప్రాప్తిస్తాయి. ఈ ఉగ్ర లేదా క్షుద్ర దేవతలను ఆరాధించే సమయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ దేవతయే ఆ సాధకునికి హాని చేస్తుందని అంటారు. యోగాభ్యాసంలో కూడా సరిగా చేయకపోతే హాని కలగడం ఖాయం. మనసుకెట్టి వికారాలూ అంటకుండా, క్షోభ లేకుండా వీటిని ఆచరించడం, కత్తి అంచుమీద నడవడం వంటిది. బ్రహ్మవిద్య కూడా అట్టిదేయని ఉపనిషత్తులున్నాయి. రామకృష్ణ పరమహంస లక్ష్యాన్ని సాధించడానికి ఇవి కూడా మార్గాలే కాని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం గుండా కాక దొడ్డిదారి ద్వారా ప్రవేశించడం లాంటిది" అని అన్నారు. కనుక దొడ్డిదారి బాగుందని అనేవారు భయంకర ఆచారాలను బాహాటంగా ఆచరించకుండా ఉంటే మంచిది. కానీ తామాచరించడమే కాకుండా ప్రచారం చేయడం చేసిన కాలమది.


Saturday 2 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 31 వ భాగం



పచ్చి భౌతికవాదం 


ప్రాపంచిక జీవితం, బంధహేతువని ఇంతవరకూ చెప్పిన మతాలకు భిన్నంగా, ఇది బంధ హేతువు కాదని అన్నిటినీ అనుభవించడమే లక్ష్యంగా చెప్పింది చార్వాకమతం. చార్వాకమనగా మధురమైన మాట. తపశ్చర్యలు, వ్రతాలు, శరీరాన్ని శుష్కింప చేసుకోవడం వంటివి దండుగని, ఇష్టమైనది. తినడం, త్రాగడం మంచిదని బోధించింది. వినడానికి బాగానే ఉంది కనుక ఇది చార్వాకం. ఈశ్వరుడు లేడు. ఉంటే కనబడుతున్నాడా? ఏది శరీరానికి, మనస్సునకు ఆనందాన్నిస్తుందో దానిని అనుభవించండని అన్నారు.


దానిని బృహస్పతియనే దేవ గురువు స్థాపించాడని, సన్మార్గంలో నడిచే అసురుల మనస్సులను విరవడం కోసం దీనిని స్థాపించాడని, ఇది బార్హ స్పత్యమని, లోకాయతమని ప్రసిద్ధిని పొందింది. అసుర ప్రవృత్తిలో ఉన్న నేటి వారికి ఈ మాటలు రుచికరంగానే ఉంటాయి.


వేదాలను నమ్ముతూ వేదాంతాన్ని త్రోసివేసినవి


వేదంలో భాగమైన ఉపనిషత్తు చెప్పే జీవ బ్రహ్మల అభేదాన్ని అంగీకరించకుండా కేవలం కర్మకాండలకే పరిమితమైన మీమాంసక మతాన్ని కృష్ణుడే ఖండించాడు. అయినా కర్మానుష్ఠానికే బ్రాహ్మణులు మొగ్గు చూపారు. వేదమంత్రాలు అర్థ విచారణ, వీరిని ఆకట్టుకొంది. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక సిద్ధాంతాలను చాలా తక్కువమంది విద్వాంసులు పాటిస్తూ ఉండేవారు. యోగసిద్ధాంతంలో ఈశ్వరుణ్ణి అంగీకరించినా ఇదీ పూర్తిగా సనాతన ధర్మాన్ని అనుసరించలేదు.


ఇక కొందరు బుద్ధిమంతులు బౌద్ధమతం కొమ్ముకాసేరు. వేదాంత సిద్ధాంతము క్షీణదశలో నుండగా కర్మలపట్ల విముఖత చూపించిన బ్రాహ్మణులు దీనికి ఆకర్షితులయ్యారు. అందు ధ్యానానికి అవకాశం మెండుగా ఉండడం వల్ల కావచ్చు. కనుక యాగమనే మాటను స్మరిస్తేనే ప్రజలు చెవులు మూసికొంటున్నారని దేవతలు, పరమేశ్వరునితో మొరపెట్టుకొన్నట్లుగా కొద్ది అతిశయోక్తితో శంకర విజయంలో చెప్పబడింది. ఇది ఆనాటి పరిస్థితి.


Friday 1 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 30 వ భాగం



జైన బౌద్ధాలందించిన సత్యాహింసలను అన్ని మతాలూ చెప్పాయి. మనుస్మృతిలో ఇవి లేవా? వీటిని చెప్పడానికి ప్రత్యేక శాస్త్రాలంటూ అక్కర్లేదు. అయితే ఆచరణలో పెట్టినపుడు కోరికలు బుస కొడతాయి. తత్త్వ విచారణ చేసేవారు వీటిని అదుపులో పెట్టగలరు. మిగిలినవారు చెడునుండి దూరంగా ఉండాలని కోరుతూ మంచిని ప్రసాదింపుమని ఈశ్వరుని వేడుకుంటారు.


బౌద్ధ జైనాలలో ఈశ్వరుడూ లేడు. వాటి తత్త్వాలు సామాన్యులకు బోధపడవు. వారు చెప్పిన నీతి సూత్రాలను పాటించడమూ కుదరదు. అందరికీ అన్ని నియమాలంటే కుదురుతుందా? సమానమైన హక్కులన్నారు. హిందూ మతంలో పక్షపాతంతో కూడిన వర్గ విభజన ఉందని ప్రచారం చేసారు. అయితే జినుడు, బుద్ధుడు తమ నడవడికల ద్వారా ఆనాటి ప్రజలనాకట్టుకున్నారు.


అయితే జినుడు, బుద్ధుడు తనువులు చాలించిన తర్వాత, వట్టి నడవడిక ప్రజలను ఆకట్టుకొనలేకపోయింది. సిద్ధాంతాలు, ఎట్లాగూ పట్టుబడవు. ఆ తర్వాతి వారు ఈశ్వరుణ్ణి నమ్మకపోయినా జైన, బౌద్ధ, జ్ఞాన సిద్ధుల విగ్రహాలని మలిచి ప్రజలముందుంచారు. ఇట్లా మూర్తి పూజ నేర్పాటు చేసారు. చివరకు మిగిలిందేమిటి? బుద్ధుడు, బోధి సత్వ విగ్రహాలు, జైన తీర్థంకరుల విగ్రహాలూ వెలిసి వాటిని ఆసరాగా తీసుకొని నడవండని, ఆ మతనాయకుల అనుయాయులు ప్రచారం చేసారు. పెద్ద పెద్ద విహారాలు, పెద్ద పెద్ద విగ్రహాలూ వచ్చాయి. ఇంతవరకూ హిందూ దేవతలను మ్రొక్కనివారు వీటికీ మ్రొక్కడం మొదలు పెట్టారు. అవి ప్రసాదించు, ఇవి ప్రసాదించు అనే మాటలు కూడా మామూలే. జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదింపుమని అడిగినా బాగుండేది. సామాన్యులకు అవి కావాలా? ఆ మూర్తులందించిన ఆదర్శాలపై దృష్టి పెడతారా? పెట్టరు. చివరకు వారి మందిరాలలో వాటినీ పూజించడం మొదలు పెట్టారు. దేవుడు లేడు, దెయ్యమూ లేదనే మతాలు, వారి మత నాయకులనే దేవతలుగా భావించిన పరిస్థితి వచ్చింది. ఇదంతా 2500 సంవత్సరాల వెనుక.