Wednesday 30 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (37)



ఆనాటి ఆంజనేయుని అనుభవం యీనాటి సమాజంలో అడుగడుగునా తారసపడుతుంది. ముఖ్యంగా సినిమాలు- టి.వి.ల ప్రభావం వలన యువత పెడదారులు తొక్కుతున్నది. ప్రలోభాలు, పలు ఆకర్షణలు మనస్సు మీద దెబ్బ తీసే ప్రమాదం పొంచి ఉంది. నిగ్రహశక్తి అవసరం.


పైగా శరీరంతో చేసింది తప్పుకాదు. మనస్సుతో చేసిందే. తప్పు అంటారు. “ఏనైవా లింగితే కాంతా తేనై వాలింగితా సుతా" ఈ శరీరంతో కాంతాలింగనం, సుతాలింగనం ఐతే మనస్సున కలిగే భావాల తీరు వేరుకదా! కాబట్టి మనశ్చాంచల్యం కలగనంతవరకు ఏ దృశ్యం వీక్షించినాసరే మనకేమీ అంటదు. నిగ్రహం కోల్పోయిననాడు అతని జీవితం త్రిశంకు స్వర్గమే.


హనుమంతునివలె ప్రతివారికి తాను చేసే పనిలో - మాటాడే తీరులో- అంటే కట్టులో- బొట్టులో - మాటలో- మంతిలో - సర్వే సర్వత్ర ఆత్మ పరిశీలన అవసరం తన మనస్సుకు తాను జవాబు చెప్పుకోవాలి.


ఆత్మకు ఆత్మయే చుట్టం, మిత్రుడు, శత్రువూను. ఆత్మతో ఆలోచించి మంచి సలహాల నందుకోవాలి. అతడే సమాజంలో సత్పౌరుడుగా రాణిస్తాడు. 


"మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" - మనస్సే బంధ మోక్షాలకు కారణం వ్యామోహాలకు, ప్రలోభాలకు చోటీయరాదు హృదయంలో. కాబట్టి మనస్సును పవిత్రముగ నుంచుట నలవరచుకొమ్మని యీ సన్నివేశం మనకు తెలియ చేస్తుంది. 


Tuesday 29 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (36)



చిత్త చాంచల్యం పనికిరాదు


శయన మందిరం వీడి పాకశాల చేరాడు. పాచకులు అనేక రకాలైన జంతు మాంసాలను తరిగి, పలు వంటకాలు చేయటంలో తలమున్కలయి ఉన్నారు. ఆ పాకశాల ఎంత అందంగా చూడ ముచ్చటగా ఉందోకదా! అనుకుంటూ సీత కానమి ముందుకు సాగాడు. అచట కొందరు స్త్రీలు నగ్నంగా, అర్ధ నగ్నంగా మైమరచి నిద్రపోతున్న తీరు 'యతి విటుడు గాకపోవునే మదీయ శృంగార కావ్య వర్ణనా కర్ణనమున' అన్న సంకుపాలవాని శపథం గుర్తుకు తెచ్చేటట్లున్నది. ఆ సందర్భంలో ఎంతటివానికైనా కామ వికారం కలుగకపోదుగాని పవన తనయుడు పశ్చాత్తప్తుడై పోరానిచోట్లకు పోవలసి వస్తున్నది. చూడరాని దృశ్యాలు చూస్తున్నాను. పర స్త్రీని చూడడమే పాపం అన్నపుడు యీ స్థితిలో చూడటం మరింత పాప హేతువగునో కదా! లేడిని లేళ్ళ గుంపులోనే వెదకాలి కదా. స్త్రీని స్త్రీలలో వెదకడంలో తప్పేముంది. ఐనా నా మనసున ఏ వికార భావాలూ కలగడం లేదు అని తనను తాను పరిశీలించుకున్నాడు. 


"న హి మే మననః కించిత్ న వైకృత్య ముపపద్యతే'


ఇచట మనకు కనిపించే విషయం ప్రధానంగా మనస్సు యొక్క ప్రాధాన్యత. ఏ సమయంలోనైనా సరే మనస్సును నిశ్చలంగా ఉంచాలి. విషయం మీదనే మనస్సు కేంద్రీకరించాలి. పరుగులు తీసే మనస్సునకు కళ్ళెం వేయాలి. మనస్సును సముద్రంతో పోల్చారు అనుభవజ్ఞులు సముద్ర తీరం అలలతో అల్ల కల్లోలంగా ఉన్నా సముద్ర మధ్యం మాత్రం ఏకొంచెం కదలికా లేక నిశ్చలంగా ఉంటుంది అలా సముద్ర మధ్యమువోలె నిండుగా, గంభీరంగా ఏకాగ్రత కలిగి ఉండాలి. అందుకే కాళిదాసు 'వికారహేతౌ సతి విక్రయంతే వీషాం న చేతాంపి త వివ ధీరాః' అంటాడు. వికార భావాలేర్పడే సమయాలలో సైతం ఎవరి హృదయం చంచలం కాదో వారే ధీరులు. ఇదే మానవ లక్షణం కావాలి. కొంతమంది అంతరంగాలలో అపరాధాలు చేసి మంచి వారిలా పైకి కనిపిస్తారు. వారిని వేమన 'మేడిపళ్ళ'తో పోలుస్తాడు. చిత్త చాంచల్యం పనికిరాదు. 

Monday 28 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (35)



బుద్ధి విశేషంతో భ్రాంతిని వీడాలి.


అంతఃపుర భవన సముదాయమంతా కలయచూస్తున్నాడు. అది ఎంత మనోహరమో అంత భయం కల్గిస్తున్నది. అరివీర భయంకరులైన రక్షక భటుల పర్యవేక్షణలో వుంది. ఆ ప్రాంతాన తిరుగుటన్న కత్తి అంచుమీద నడకన్న మాటే. ఒకవంక సింగారంగా శోభిల్లే యువతీ లలామలు, మరోవంక మత్తెక్కించే కల కూజితాలు- ఇంకోవంక సరోవరాలూ - వాటిచెంత ఫల పుష్పభరిత వృక్షాలతో ఉద్యానవనాలు- నవరసా లోలికిస్తూ ప్రకృతి శోభతో పరవశింప చేస్తున్నది. ఆయా ప్రదేశాలను మారుతి సీతకై కంట వత్తిడుకొని ఎంతగ వెదకినా సీత జాడ తెలియరాలేదు.


ఇంతలో మారుతి చూపులు ఒక విశాల భవనంపై బడినై. అదే రావణ మందిరం. పుష్పకం అను పేరుగల విమాన భవనం. కనులు మిరుమిట్లు గొలుపు ఆ భవనాన అడుగిడి వెతకడం మొదలు పెట్టాడు. ఒకచోట హంసతూలికా తల్పంపై నిదురించే నల్లని పర్వతాకారుడు లంకేశ్వరుడు రావణుని చూచాడు. ఆశ్చర్యంగా తదేకంగా కొంత తడవు చూచాడు. అతని దృష్టి మరో పర్యంకంపై బడింది. ఆ తల్పంపై అతిలోక సుందరి పట్టమహిషి మండోదరి నిదురిస్తున్నది. ఉత్తమ స్త్రీ లక్షణాలను ఊహించి అవన్నీ ఈమెలో కన్పడగా రాముని ఇల్లాలు సీత కాబోలు నను కున్నాడు. సంతోషించాడు. ఇంత కష్టం తానెవరికై పడుతున్నాడో- ఆ మూర్తిని కనులముందు కాంచగనే ఉక్కిరి బిక్కిరైన ఆనందం కలిగింది. ఆ దృశ్యాన్ని ఆదికవి వాల్మీకి పరమ రమణీయంగా వాస్తవానికి అద్దం పట్టినటుల వర్ణించాడు.


ఆస్ఫోటయామాన చుచుంబ పుచ్ఛం 

ననంద చిక్రీడ జగౌ జగామ 

స్తంభానరోహన్ నిపపాత భూమౌ 

నిదర్శయన్ స్వాం ప్రకృతిం కవీనాం.


తన వాలాన్ని నేలపై కొట్టాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్తంభం మీదనుండి యీ స్తంభం మీదకు దూకాడు. గంతులు వేశాడు. ఆనందంతో కోతి స్వభావాన్ని చూపిస్తూ ప్రవర్తించాడు.


ఇదొక భ్రాంతి కొన్ని కొన్ని సమయాలలో- వారెంతవార యినా భ్రాంతికి లోనవ్వటం సహజం. ఐతే సామాన్యులు యీ భ్రమకు లోనై అధఃపాతాళమున కంటుకు పోవుట సత్యదూరం కాబోదు. ఆంజనేయుడు మరుక్షణం మతిమంతుడై ఆలోచనలో పడి పొరబాటును గమనించి నేనెంత పొరపడ్డాను. కాంతుని వీడి సీత పరగృహంలో, పరుని సమక్షంలో హాయిగా అదమరచి నిదురించునా ! ఆభరణములను తాల్చునా! అన్నపానీయముల నారగించునా! ఎంతటి భ్రమకు లోనయ్యాను. ఈమె సీత కాదు, మరెవరోనై యుండవలె అని ఖిన్నుడై మరల కర్తవ్యోన్ముఖుడయినాడు, ఇటువంటి సమయాలలో సమయజ్ఞత, ఆలోచనా పాటవం కలిగి ఉండాలి.    

Sunday 27 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (34)



ఈ సన్నివేశం గమనించినట్లయితే సంభాషణ సానుకూలం కాచటానికి, ఎదుటివారిని తన వశం చేసుకోవటానికి కావలసిన మాట నేర్పు తేటతెల్లం కాగలదు. లంకిణి ఆవేశపరురాలు కాగా ఆంజనేయుడును ఆవేశం పొందలేదు. ఆవేశపరుని దగ్గర తానూ ఆవేశం పొందిన కార్యభంగం తప్ప మరే లాభమూ లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్లే. ఓర్పుతో నేర్పుగా ఆవేశం చల్లార్చే ప్రయత్నం చేయాలి. అంతేకాక పొగడ్తలకు పొంగిపోవటం- ఎంత కాదనుకున్నా ప్రతి ప్రాణికి సహజం. కార్యసాధకులు ఎదుటి వారిని గొప్పగచేసి తమ పనులు పూర్తిచేసుకుంటారు. ఇదొక ఎత్తు గడ. లంకా నగరం ఎంత గొప్పదో! దేవ నగరం అమరావతిని తలదన్నే రమణీయత గలదని చెప్పగా విన్నాను. చూడాలనే కుతూహలంతో వచ్చాను అంటాడు నింపాదిగా మాటనేర్పును చూచి వాల్మీకి ఆంజనేయుని 'మేధావి' అంటాడు. లౌకిక వ్యవహార లక్షణాలలో ఇది చాలా ప్రధానమైన లక్షణమన్న మాట. అందుకే ఒకచోట మారుతి ఇలా అంటాడు. 'ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామ సేవకం' తననుండి ఏవం విధమైన లోకజ్ఞత అలవరచుకోవాలి సుమా! అన్నది సందేశం.


శతృగృహం ఎలా ప్రవేశించాలి ? 


స నిర్జిత్య పురీం శ్రేష్ఠం లంకాం తాం కామరూపిణీం 

విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమః 

అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపప్లువే 

ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితం కరః 

చక్రేఽథ పాదం సవ్యంచ శతౄణాం స తు మూర్ధని 

ప్రవిష్టః సత్వసంపన్నో విశాయాం మారుతాత్మజః.


మారుతి అలా లంకిణిని జయించి అత్యుత్సాహంతో ముందుకు సాగి- 'ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాం ఘిర్మ్, కృత్వాగత శ్శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాత్ పురతో నృపాలం' ప్రయాణ కాలమందు గృహప్రవేశ సమయాన వివాహ కాలంలో ప్రథమంగా కుడి పాదం మోపాలి. శత్రు పట్టణ ప్రవేశ సమయంలోనైతే ముందుగా ఎడమ కాలు పెట్టవలె. అట్లు చేసిన శతృవు శిరమునందు అడుగిడినట్లు అన్న రాజనీతిశాస్త్ర మెరిగినవాడు గాన లంకానగరంలోనికి వాకిలి నుండి కాక ప్రాకారం లోనికి ఎడమ పాదం పెట్టి దిగి, రాత్రివేళ కోటలూ, పేటలూ- ఇళ్ళూ, వాకిళ్ళూ- వనాలు, ఉపవనాలూ- పుట్టలూ, చెట్లు ఇలా నగరమంతా అణువణువూ శోధిస్తూ ఒక్క అంగుళం నేలయైనా వదలకుండా అర్ధరాత్రివేళదాకా రమణీయమై, మనోహరమై, చిత్ర విచిత్రమై, నేత్రోత్సవంగా, వీనులవిందుగా సాగే లలితకళా విలసితమైన ప్రదేశాలను గాంచి అందెటను సీతను గానక తిరిగి తిరిగి రావణాంతఃపురం చేరాడు.


Saturday 26 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (33)



కథయిష్యామి తే తత్త్వం యన్మాం త్వం పరిపృఛ్ఛసి. 

కా త్వం విరూప నయనా పురద్వారేవ తిష్ఠసి

కిమర్థంచాపి మాం రుద్ధ్వా నిర్బర్త్సయసి దారుణా. 


నేనెవరినో చెబుతాను. ముందు నీ వెవరివో చెప్పు ? వాకిలి కడ్డంగా నిలబడి భీకరాకృతితో వికార నయనాలతో నన్నెందుకు బెదిరించాలనుకుంటున్నావు? హనుమ మాటలు విన్న లకిణి క్రోధావేశంతో ఓ ప్లవంగమా! రావణుని ఆజ్ఞతో యీ ద్వారాన్ని కాపలా కాస్తున్నాను అహం హి నగరీ లంకా. లంకా పట్టణాన్ని నేనే. నన్ను కాదని యీ లంకలో అడుగిడలేవు అని దారుణంగా పలికింది. 


వానరపుంగవుడూ, మేధావీ హనుమ "నేను వానరాన్ని. ప్రాకార తోరణాలతో- వన, ఉపవనాలతో- స్వచ్ఛజలాల సరోవరాలతో- కానన సీమలతో - రమ్య హర్మ్యాలతో అలరారే లంకా నగర సోయగాన్ని తనివితీర చూచి- నాదారిన నేపోతాను. అందు కింత కోపమెందుకు?" అన్నాడు.


ఓరీ వానరాధమా! నను గెలిచినగాని రావణ పాలితమైన లంకాపురిని చూడజాలవు" అంటూ లంకిణి చేయిచాపి ఒక్క చరుపు చరిచింది ఆంజనేయుని. ఆ దెబ్బకు సమీర కుమారుడు “ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః" పెద్దగా అరచి స్త్రీని చంపుట మహాపాపమని పిడికిలి బిగించి ఒక్కపోటు పొడి చాడు. ఆ పోటుకు కళ్ళు బయర్లు కమ్మగా లంకిణి నేలమీద పడి- ఒకనాటి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని “వానరా! ఇక నీకు తిరుగులేదు. ఈ లంకా నగరంలో నీవు యథేచ్ఛగా తిరుగు. ఓటమి లంకకు చేటని ఎపుడో విధాత చెప్పనే చెప్పాడు. లంకలోని కేగి నీ కార్యం చక్కబరచుకో" అంటూ దారిచ్చింది.


Friday 25 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (32)



వివేకంతో విరోధిని నిరోధించాలి.


మారుతి ఇలా అవరోధాలను అధిగమించి లంకాతీరంలో సముద్రప్రాంతాన గల త్రికూట పర్వత శిఖరంపై దిగాడు. ఇంత దూరం పయనించినా ఇసుమంత కందలేదు. తనువు విశ్రాంతిని కోరటం లేదు. ఉత్సాహం కించిత్తయినా కొరవడలేదు. పైగా యీ నూరు యోజనాలే కాదు, ఎన్ని నూరు యోజనాలయినా ఇట్టే వెళ్ళిరాగలను. ఇంత పెద్ద శరీరంతో నున్న తనను తేలికగా రాక్షసులు గుర్తించగలరని తలచి సూక్ష్మ రూపాన్ని ధరించాడు. లంకా నగరాన్ని తేరిపార చూచాడు.


విశ్వకర్మ నిర్మితమైన యీ లంకా నగరం రావణ రాజధాని. అభేద్యమైనది. శతృవులు ప్రవేశింపరానిది కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో పటిష్టమైన లంకా నగరాన్ని ప్రవేశించేదెలాగ? సీతామాత జీవించియున్నదో, లేదో? రక్కసు లెంతకైనా తగినవారు? ఆమెను భక్షించి యుండరు కదా! రావణుడామెను సముద్రము పాల్జేసి నాడో! ఏమో! అని ఆంజనేయుని మనస్సులో పరిపరివిధముల ఆలోచనలు చెలరేగినయ్. ఈ లంకను తానుకాక సుగ్రీవాంగద నీలులు మాత్రమే దాటగల సమర్థులు, సరే ఐనను లంకను చేరి సీతాసాధ్విని శోధించాలి అని లంకానగరివైపు నాలుగడుగులు వేశాడో లేదో లంకాధీష్ఠాత్రి లంకిణి చూడనే చూచింది.


కస్త్వం కేనచ కార్యేణ ఇహప్రాప్తో వనాలయ 

కథయ స్వేహ యత్తత్త్వం యావత్ప్రణా ధరంతి తే 

న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానర త్వయా 

రక్షితా రావణబలై రభిగుప్తా సమం తతః.


“ఎవడవురా నీవు! అడవిలో చెట్టుకొమ్మలపై తిరుగాడు కోతివి. ఈవైపునకేల వచ్చితివి. ప్రాణాలతో నుండాలంటే వెను దిరుగు. ఇతరు లెవరూ చోరరాని యీ లంకా నగరంలో కాలు పెట్టదలుచుకుంటే నీకు మరణమే శరణము" అని భీకర గర్జన చేసింది. 


Thursday 24 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (31)



నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే 'శ్రేయాంసి బహు విఘ్నాని' మంచిపనికే ఆటంకాలెక్కువ అనుట నూటికి నూరుపాళ్ళు నిజం ప్రతి కార్యంలో.


ఆంజనేయుడు మైనాకుని ఆతిధ్యం స్వీకరిస్తూ కర్తవ్యం మరచి స్వార్థ సుఖానికి చోటిస్తే పట్టుదల తరుగుతుందేకాని పెరుగదు కదా! ఉత్సాహం కొరవడేది. నిరుత్సాహం కార్యతిరోగమన కారి.


నాగమాత సురస సందర్భంలో అపాయాన్ని దాటటానికి బుద్ధిబలం ఉపయోగించేవేళ తొందరపడినా- ఆవేశం పెంచుకున్నా ఆవేదన తప్ప మరేముంటుంది, అందుకే ఆంజనేయుడు బుద్ధివైభవంతో యుక్తయుక్తంగా చరించి ముందుకు సాగాడు.


కనిపించని హింసిక సింహిక. ఆమె విషయంలో ఆలోచన పనికిరాదు. కాలాతీతం కారాదు. కార్యభంగం కానిరీతిలో, తన శక్తీతో రక్తి కట్టించాడు. సింహిక మరణవార్త విన్న గగనగాములు 


యస్యత్సేతాని చత్వారి వానరేంద్ర యథా తవ

ధృతిర్దృష్టిర్మతి రాక్ష్యం స్వకర్మను న శీదతి 


అంటారు. ధైర్యం, ముందుచూపు, బుద్ధిబలం, బాహు బలం - ఈ నాలుగు లక్షణాలు ఎవరికుంటవో వారే కార్యనిర్వహణా దక్షులు, ఇయ్యవి పుష్కలంగా హనుమంతునిలో గోచరిస్తున్నాయి.


ఏదేని ఒక కార్యము తలపెట్టినవానిని చూచి శల్య సారధ్యం చేసేవారు కొందరైతే, శకుని పాత్రధారులు మరికొందరు.


ఇంకొందరైతే కల్లబొల్లి కబుర్లతో ముందుకు సాగనీయరు. ఇదో రకం కార్యభంగం, ఇటువంటివారినందరినీ ఒక కంట కని పెడుతూ వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లు వింటూనే గమ్యమే లక్ష్యసాధనగా విఘ్ననిహన్యమానులగుచు ప్రజ్ఞానిధులుగా కార్య సాఫల్యత నందాలి సుమా అని కర్తవ్యబోధ చేశాడు హనుమ.

Wednesday 23 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (30)



అర్థ సిద్యై హరిశ్రేష్ఠ గఛ్చ సౌమ్య యధా సుఖం 

సమానయస్వ వై దేహీం రాఘవేణ మహాత్మనా


ఎంతగ ఆటంకము లేర్పడుచున్నవో అంతగ రెట్టించిన వేగంతో రామబాణంలా ముందుకు దూసుకుపోతున్నాడు. కొంత దూరంమాత్రమే యీ నడక సాగింది ఇంతలో తన్నెవరో బలవంతంగా పట్టి తన గమనాన్ని వెనుకకు లాగుతున్నట్లనిపించింది. చుట్టూ కలయచూచాడు. ఎవరూ కానరాలేదు. మతిమంతుడు కావడం వలన ఆలోచించి అవలోకించగా తన నీడను పట్టి నీటిలో నుండి ఎవరో లాగుతున్నట్లనిపించింది. అదే సింహికా నామ రక్కసి. ఛాయాగ్రాహిణి. అదొక హింసిక, ఏదో ఒకనాడు-‘దక్షిణ సముద్రంలో ఒక భయంకర రక్కసి కలదని, నీడను పట్టి లాగి వైచి హతమార్చ గలదని, ఆ ప్రాంతాని కేగినపుడు తగు రూకత వహించవలెనని' సుగ్రీవుడు చెప్పినట్లు హనుమకు గుర్తు వచ్చింది. 'ఇదే కావచ్చు' ననుకున్నాడు.


నీటిలోనికి దృష్టి సారించాడు. సింహిక నోటిని తెరచి హనుమంతుని మింగుటకు సిద్ధంగా ఉంది. మారుతి శరీరం పెంచాడు. సింహిక ఇంకా తన నోటిని పెద్దది చేసింది. నోటిలో సింహిక జీవ సానాలు కనిపించినై. అంతే. ఆంజనేయుడు అంగుష్ఠమాత్రుడై నోటిలో ప్రవేశించి దాని మర్మస్థానాలు తన వజ్ర నఖాలతో చీల్చి నిమేషమాత్రంలో బహిర్గతుడయినాడు. సింహిక జవజీవాలు చలించినై. అచేతనురాలై తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళింది. సింహిక కళేబరం నీటిపై తేలియాడింది.


ఆంజనేయుని యీ సముద్రయానం గమనించిన కార్య సాధకున కుండవలసిన ధైర్యము, ఉత్సాహము, కార్యదీక్ష, కర్తవ్యపరాయణత్వాది లక్షణాలు తేటతెల్లము కాగలవు.


"నడచుచు నుండువాని చరణంబులకేగద రాళ్ళ తాకుడుల్" అంటాడు ఒక కవి. రాళ్ళు తగులునని కూర్చుంటే గమ్యం చేరగలమా! తగిలే రాళ్ళను తప్పుకుంటూ ముందుకు సాగాలేకానీ ఆగరాదు. కొంతదూరం వెళ్ళి ఎదురుదెబ్బలకు జంకి వెనుకకు తిరిగిరారాదు. బుద్ధివిశేషంతో ముందుకే మున్ముందుకే సాగి సత్ఫలితాల నందుకోవాలి. అంతేకాదు, మార్గమధ్యంలో లభించిన వానితో సంతృప్తిపడి ఆగిపోరాదు. తన దృష్టిని గమ్యం మీదనే కేంద్రీకరించాలి. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత" లే జాగరూతుడవై గమ్యం చేరువరకు అగకు అంటుంది కఠోపనిషత్తు.

Tuesday 22 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (29)



కాన నా యీ శిఖరాలపై గల మధుర ఫలాలను ఆస్వాదించి కొంత విశ్రాంతి తీసుకొమ్మని కోరగా- మైనాకుని మాటలకు మారుతి సంతసించెను. “మైనాకా! ధార్మిక బుద్ధి అభినందనీయం. కాని రామకార్యార్థినై వెడలు నేను ఒక్కక్షణమైనా ఆగను. ఇది నా నిశ్చయము. పని తొందరలో నున్నాను" అని మైనాకుని స్పృశించి "నీ ఆతిథ్యము నందుకున్నట్లే” అని అమిత వేగంగా ముందుకు సాగాడు.


త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే

ప్రతిజ్ఞాచ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే. 


ఈ దృశ్యాన్ని తిలకించు గగన సంచారులు, విద్యాధరాది అప్సరో గణం ‘ సెహబాస్ వానరపుంగవా' అంటూ హనుమంతుని ఎంతగానో మెచ్చుకున్నారు.


హనుమంతుని శక్తినీ, బలాన్నీ పరీక్షించవలసిందిగా సిద్దులు, గంధర్వులు నాగమాత సురసను కోరారు. సురస వికృతాకారంతో, భీకర రూపముతో "ఏనాడో బ్రహ్మ నిన్ను నాకాహారంగ నిర్ణయించాడు. ఇప్పుడే నిన్ను మింగుతాను. కమ్మగ కడుపునకు విందు చేస్తాను" అంటూ హనుమంతుని ఎదుట నిలచి నోరు తెరచింది. ఇది మరో విఘ్నము కాబోలు ననుకుని పావని ప్రశాంతచిత్తుడై తన ప్రయాణకారణం వివరంగా చెప్పి- తిరిగివచ్చి నీకాహార మౌతాను దారి కడ్డుతొలగమని కోరాడు.


సురస 'ససేమిరా నిను వదలను, వదలను ఇప్పుడే భక్షిస్తాను' అంటూనే నోరు పెద్దది చేసింది. ఆంజనేయుడు ఆ నోటిలో పట్టనంతగా దేహాన్ని పెంచాడు. సురస ఇంకా తన దేహం పెంచి పెద్ద నోరు తెరచింది. బుద్ధిశాలి ఆంజనేయుడు ఇదే అదునుగా భావుంచి లిప్తమాత్ర కాలంలో అంగుష్ఠమాత్రడై నోటిలో ప్రవేశించి మరల తిరిగివచ్చి, "అమ్మా! నీమాట నెగ్గిందికదా! ఇక నాకు సెలవా" అన్నాడు .


ఆనందాశ్రువులు రాల సురస ధీమంతుని హనుమంతుని కొనియాడి "కార్యసిద్ధి నందుదువుగాక !" అని ఆశీర్వదించి "రామునితో సీతను చేర్చు" అని పల్కింది.

Monday 21 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (28)



ఈ మహత్కార్యంలో పవన తనయునికి తనవంతు సాయం అందించదలచాడు సాగరుడు, సాగరుడు సగర వర్ధితుడు, సగరుడు ఇక్ష్వాకు వంశీయుడు. అదే వంశ సంజాతుడు రాముడు. శ్రీరామ కార్యార్ధి హనుమంతుడు. తనకు అతిధి. అతనికి సేవలందించు బాధ్యత తనది. అందుకే తనలో దాగిన మైనాకుని “నీకూ నాకూ పూజనీయుడైన సమీర కుమారుని నీ శిఖరాలతో ఆతిధ్యం యీయవలసినది" అని ప్రోత్సహించాడు. మైనాకుడు తన శిఖరాన్ని గగనమంత ఎత్తుకు పెంచాడు. 


తన దారికడ్డంగా నున్న గిరి శిఖరాన్ని చూచి ఇదొక విఘ్నముగా భావించి (విఘ్నోయమితి నిశ్చితః) అమిత బలసంపన్నుడు అంజనానందనుడు వేగంగా, బలంగా ఢీకొట్టాడు. ఆ తాకిడికి తత్తరపడి తేరుకుని మారుతి శక్తి సంపన్నతను మెచ్చుకోనుచు మైనాకుడు తన శిఖరాలపై మానవాకృతిన నిలబడి ---


మహావీరా! నీవు వాయు కుమారుడవు. అయ్యనిలుఁడు నాకు అత్యంతాపుడు. ఎలాగంటే ఒకనాడు పర్వతాలకు రెక్కలుండేవి. పక్షుల వలెనే పైకెగిరేవి. ఏ నిమిషాన అవి తమపైబడునో యని అర చేత ప్రాణాలు పట్టుకొని దినదినగండంగా సమస్త ప్రాణిలోకం ప్రాణభీతితో అల్లాడసాగింది. ఇది ఇంద్రునికి కోపకారణమైంది. వెంటనే తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరకటం మొదలు పెట్టాడు. అపుడు నేను నా ప్రాణసఖుడైన వాయుదేవుని 'ఇంద్రబారి నుండి కాపాడమని' కోరాను. వాయుదేవుడు కరుణించి నన్ను యీ సముద్రంలోకి విసిరివైచినాడు. రామ కార్యార్ధమై సముద్రమును దాటు నీవు ఆ కారణంగా నాకు మాననీయుడవు, పూజనీయుడవు. నిన్ను పూజించిన నా మిత్రుడు వాయు దేవుని పూజించినట్లే. (పూజితే త్వయి ధర్మజ్ఞే పూజాం ప్రాప్నోతి మారుతః) అంతేకాక సముద్రుడును నీకు విశ్రాంతిని కల్గించమని నన్ను ప్రేరేపించినాడు.

Sunday 20 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (27)



ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత


ఇలా పలికిన జాంబవంతుని మాటలు సకల దేవతా వర ప్రసాదియైన ఆంజనేయుని ధీవైభవాన్నీ, బల పరాక్రమ శక్తి యుక్తులను తక్షణం స్ఫురణకు తెచ్చినయ్. అంతే అమితోత్సాహంతో ఇంతై ఇంతింతై ఎదుగుతూ "ఒడలు విరిచి ఒక్కసారి మెడ ముందుకు సాచిన మహా వృషభము"ను పోలి ఉన్నాడు. నిరాశ చెంది దిగాలు పడిన వానరుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు.


తతో రావణనీతాయాః సీతాయాః శతృకర్మనః 

ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి ॥ 


శతృకర్మనుడు ఆంజనేయుడు సిద్దచారణులు విహరించే వినువీథిన సముద్రాన్ని దాటటానికై మహేంద్రగిరిపై నిలచాడు. అతని పదఘట్టనకు అంతటి కొండ గజగజలాడింది. అర్థంకాక గుహలలోని జంతువులు బయటకు భయంగా పరుగులు తీసినై, భయంకర విషసర్పాలు బుసలు కొడుతూ రాళ్ళను కాటేస్తున్నాయి. ఆ గిరిపై విహరింప వచ్చిన గంధర్వ, సిద్ధచారణులు భయకంపితులై పరుగులు తీశారు. చెట్లు ఒక్కసారి కదలి పూలను జలజలా రాల్చాయి. ఆ సమయాన మహేంద్రగిరి పూల కొండలా భాసించింది.

తన కార్య సాఫల్యతను కోరుచూ పావని సూర్య, ఇంద్ర, బ్రహ్మాది దేవతలకూ తన తండ్రి వాయుదేవునికి నమస్కరించాడు. పర్వదినాలలో పొంగే సముద్రునిలా- సర్వ శక్తులను కూడ గట్టుకొని పిడికిళ్ళు బిగించి ఒక్క ఉదుటున గగనాని కెగసాడు. ఆ ఊరు వేగోద్ధతికి కూకటివేళ్ళతో పెకలింపబడి వృక్షాలు పైకెగసినై. అవి దూర తీరాలకు సాగిపోవు బందుగులను సాగనంప వచ్చినవారివలె కన్పించినై. ఆ గమన వేగం కడలిని కల్లోల పరచింది, తిమి తిమింగలాది జలచరాలు నీటిని వీడి బయటకెగరినై.

మహర్షులు చుక్కల వీధిని చేరి రామకార్యార్థమై ఏగు ఆంజనేయుని గమన వేగోద్ధతిని చెప్పుకొనుట విద్యాధరాది దేవ గణం విని పరవశమనసులయ్యారు. హనుమను ఆశీర్వదించారు. పయనించే మారుతివాలం ఒకసారి ఇంద్రచాపఁలా, మరో సారి దేహానికి కప్పబడి చక్రాకారంలో కానవచ్చింది. గాలి తాకిడికి సాగరం మహెూత్తుంగ తాల తరంగాలతో ఎగిసిపడింది. 

Saturday 19 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (26)



సమావిద్ధ్యచ లాంగూలం హరాచ్చ బలమేయివాన్ 

తేబసా పూర్వమాణస్య రూపమాసీద నుత్తమం.


వాలాన్ని విపరీతంగా పెంచాడు. అతని రూపం వెలుగుల జిలుగులతో నిండింది. "తాతా! నన్నిపుడేం చేయమంటావో చెప్పు. ఇదో గొప్ప పనా? ముజ్జగాల నాక్రమించిన వామనునిలా నేనీ సాగరాన్ని లంఘిస్తాను. లంకా నగరాన్ని గాలించి గాలించి తిరిగి రాగలను. అంతేకాదు, సమూలంగా వాలంతో లంకనే పెకలించి తెస్తాను. రామబాణంలా అమిత వేగంగా దూసుకు పోగలను. తిరుగులేని నా పయన వేగాన్ని ఎవరూ ఆపలేరు. ఆ వేగంతో సీతామాతకై ముల్లోకాలూ వెతుకుతాను. రావణునైనా బంధించి మీముందుంచగలను. నా గమన వేగాన్ని అందుకోగలవారు తండ్రి వాయుదేవుడు, గరుత్మంతుడు మాత్రమే. మీరిక నిశ్చింతగా ఉండండి. త్రికరణశుద్ధిగా నేనీ కార్యాన్ని సాధించగలను" అన్నాడు. వింటూన్న వానరులకు హర్షాతిరేకంతో రోమరోమం నిక్కబొడుచుకుంది, సంతోషంగా కరతాళ ధ్వనులు చేశారు. 


వానరాన్వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ 

యథా రాఘవ నిర్ముక్తి శ్శరశ్శ్వసన విక్రమః 

గచ్ఛే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం 

నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం. 

అనేనై వహి వేగేన గమిష్యామి సురాలయం 

యది వాత్రిదివే సీతాం నద్రక్షామ్యకృతశ్రమః. 

బద్ధ్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం 

సర్వధా కృతకార్యోహ మేష్యామి సహసీతయా.

ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం

ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరో త్తమః.


ఇది హనుమంతుని ప్రజ్ఞా వైభవం. సామాన్యంగా కార్య సాధకులు మాటలలో మూగగాను, చేతలలో సర్వ సమర్థులుగా నుండటం జగత్ప్రసిద్ధం, ఐతే ఇచట తనను గురించి తాను ఇంత గొప్పగా చెప్పుకొనుట సమంజసమా. అంటే ఒక్కసారి ఆంజనేయుని పాత్రను గమనిస్తే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాడో గమనించినట్లయితే సన్నివేశానికి తగిన రీతిగా తాను స్పందిస్తూ తనవారిని కాపాడే విధానం చూడగలం. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. తిరగవలసిన తావులన్నీ తిరిగారు. కార్యం సాధించగలం అన్న ఆశే లేదు. ఆశ మానవునిలో నైరాశ్యాన్ని రూపుమాపుతుంది. మరి వారి ఆశ ఎండమావే. ప్రాణత్యాగం వినా మరోదారి లేదన్న భావసలోకి వచ్చారు. మరి ఆ సందర్భంలో తనవారిని ఉత్తేజితులను చేయాలి అంటే వారిని ఉత్సాహపరచాలి. కొత్త రక్తం నింపాలి. మాటలలో, చేతలలో తనలోని ప్రవర్తనను చూచి వారుకూడ అదే స్ఫూర్తితో చైతన్యవంతులవుతారు. అపుడే కర్తవ్యోన్ముఖులై కార్యసాధకులౌతారు. అదే యిచట జరిగింది. అంతే తప్ప స్వాతిశయంగాని, మరొకటిగాని కాదు. భావితరాలవారికి అందించిన ఆంజనేయుని స్ఫూర్తి చైతన్యదీప్తే.


ఆంజనేయుని మాటలకు జాంబవంతుడు సంతోషించి, “పవనతనయా! వానర జాతిని సురక్షించే శక్తియుక్తులు నీకున్నయ్. మహర్షుల, దేవర్షుల, గురువుల అనుగ్రహ వీక్షణం నీకుంది. దేవతాప్రసాదసిద్ధి గలవాడవు. అందరూ నీ క్షేమాన్నే కోరుకుంటుంటారు. కార్యసాధకుడవై తిరిగి వచ్చేవరకు నీకై ఎదురు చూస్తుంటాం" అన్నాడు.   

Friday 18 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (25)



జితేంద్రియుడు 


సంతోషాతిశయంతో సముద్రపుటొడ్డు చేరారు. సాగరాన్ని చూడగానే అంత సంతోషం ఒక్కసారి మటుమాయమయింది. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని తరించేది ఎలాగ? అందరి ముఖాలు వెలవెలబోతున్నాయి. తమలో ఎవరెవరు ఎంతవరకు ఎగురగలరో చల్లగ చెబుతున్నారు. "ఈ సముద్ర లంఘన వయసులోనైతే నా వల్లయ్యేదేగాని ఇపుడు వార్ధక్య భారం కారణంగా అంత దూరం ఎగురలేను, ఐనా తొంబై యోజనాలు వెళ్ళిరాగలను. నేనీనాటి వాడనా!" అంటూ తన వయస్సును, అనుభవాలను అందుకున్నాడు జాంబవంతుడు. ఇలా అందరూ ఒకచోట చేరి సాగర తీర్ణం. తమ శక్తి సామర్థ్యాలను గురించి చెప్పుకుంటుంటే. “నేను ఛస్తే లేవను- లేచానా మనిషిని కాను" అని కుంటివాడు అన్నట్లుంది వీరి ప్రసంగ ధోరణ.


కార్యసాధకుడు మాటలలో మూగ, చేతలలో సర్వసమర్థుడు


ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు మౌన మునిలా ముద్రాంకితుడై ఏదో అనిర్వచనీయ ఆనందానుభూతుల్లో ఓలలాడు తున్న ఆంజనేయుని చూచాడు జాంబవంతుడు. అతని కనులు ఆంజనేయునిపై పడ్డాయి. అతడే అనితరసాధ్య సాధకుడనుకున్నాడు. దగ్గరకు చేరి ఇలా అన్నాడు.


సర్వశాస్త్ర విశారదా! హనుమా! ఏమీ పట్టనట్లు మౌనంగా, ఒంటరిగా కూర్చున్నా వేమియ్యా! 


"తూషీణం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి”


నీవిటులుంటే మమ్మీవిపదంబుధి నుండి దాటింపగలవా రెవరయ్యా! అమిత బలశక్తి సంపన్నా! యీ సముద్ర లంఘనం నీకొక లెఖ్కా! తండ్రికి తగిన తనయుడవే!! వైనతేయునంత బాహు బలశాలివి కదా! నీ భుజబల, బుద్ధి బలాలలో సాటిరాగల వాడీరేడు జగాల ఏరయ్యా!! ఇక మౌనం చాలు. దిగాలుపడి, విషణ్ణవదనాలతో నున్న నీవారిని ఒకసారి చూడు. పటుతర బుద్ధి శాలివై లేచి- కాలయాపన చేయక సముద్రమును దాట సిద్ధంకా! సీతామాతను చూచిరా! నీపై ఆశతో ప్రాణాలు నిలుపుకున్న వీరందరిని కాపాడు. కేసరి పుత్రా! ఆంజనేయా! సుగ్రీవ సమానుడవు. తేజోబల సంపదలలో రామ లక్ష్మణులంతటివాడవు" అన్నాడు. జాంబవంతుని మాటలు విని వానరులు హర్షధ్వానాలతో తమ ఆమోదం తెల్పినారు. ఈ పొగడ్త వలన ఆంజనేయుడు పర్వదినాలలో ఉప్పొంగే ఉదధిలా ఎదిగాడు. తన బలం తనకు తెలిసి వచ్చింది. నిదురించే సింహం మేల్కాంచి జూలు విదిలించి నట్లయింది. 


Thursday 17 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (24)



చుట్టమగు మధుర వాక్యము కలిమిన్ 


వానర సైన్యానికిదొక పరీక్షా సమయం. ఇపుడేం చేయాలో తెలియక వారు ఒకరి మొగముల నొకరు చూచుకొనుచుండగా  -  

సంకట హరణుడు, పవమాన సుతుడు ఆమెను చేరి మోకరిల్లి - 


అమ్మా! నీవెవరివి? ఎవరిదీ మందిరం? మేము రామకార్యార్థమై సీతామాతను వెతుకుచు అలసి ఆకలి దప్పులకు లోనై ఈ చోటికేతెంచినాము అంటూ తమ వివరాలను పూసగ్రుచ్చినటుల సవివరంగా మధుర వాగ్భణితితో వివరించగా- స్వయంప్రభ సజల నయనాలతో ముందు మీరు స్వాదునీరముల గ్రోలి, మధుర ఫలాల భక్షించుడని అనుమతిచ్చెను. ఆపై తన వృత్తాంతమును చెప్పి "కనులు మూసుకొనుడు. మీరీ బిలమునుండి బయల్పడ గలరని" చెప్పి బయల్పడు దారి కానరాక దిగాలు చెందినవారి నటుల అనుగ్రహించినది! 


ఈ సన్నివేశంలో ఆంజనేయుడు- ప్రవేశించరాని ప్రదేశం చేరినపుడు అందు ప్రతి అణువును పరిశీలించుచు, ఆంటే పరిసరాలను గమనించుచు - ప్రకృతి మార్పులను చూచుచుండవలెనని, దారితెన్నులను గూర్చి, తమ అవసరాలను గూర్చి తెలుసుకొనుటకై అచటివారి ఆగ్రహమునకు గురికాకుండ- అనుగ్రహ పాత్రులగుటకు కావలసిన మాటనేర్పునుపయోగించి తనను, తనవారిని విషమ పరిస్థితులనుండి ఎలా తప్పింపవలెనో చూపిన విధానము అవశ్యం ఆచరింపతగినది. అలవరచుకోవలసినదీ. అందుకే ఒక కవి మాటకారిత్వమును గూర్చి- కాకేమి తన్ను తిటైనె 

కోకిల తన్నేమీ కోకొమ్మనెనే 

లోకము పగయగు బరుసని 

వాకున జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ అంటాడు. 


ఆ అనుగ్రహంతో బిలద్వారం వెలుపల గల అడవిలోనికి రాగలిగారు. ఆప్పటికి సుగ్రీవుడిచ్చిన నెల రోజుల గడువు పూర్తయినది, ఇంతదనుక చూచాయగనైన సీత జాడ తెలియరాలేదు. దక్షిణదిశగా తిరుగవలసిన ప్రదేశమంతయు తిరిగినట్ల యినది. ఇక సుగ్రీవుని ఆగ్రహమున కెరగాక తప్పదు. ప్రాయోపవేశమే మనకిక శరణ్యము అని తిరుగుచున్నంతలో జటాయువు సోదరుడు సంపాతి తారసపడినాడు. మాటల సందర్భంలో రావణుని గూర్చిన సంగతులన్నీ చెప్పాడు. ఇక వానరుల ఆనందానికి హద్దు లేదు.


Wednesday 16 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (23)



ఆలోచనా శక్తి 


దక్షిణ దిశగా ఆయా ప్రాంతాల విశేషాలను పరికిస్తూ అంగద, జాంబవంత, హనుమంతాది వానర వీరులు ముందుకు సాగుతున్నారు. విరామమెరుగని పయనం. ఆకలిబాధ తీవ్ర మయింది. సుగ్రీవుడు చెప్పిన దారితప్పి నదీ ప్రాంతాలను, పర్వత, అరణ్య భూములను దాటి ఒక బిలద్వారం చేరారు. ఎటు చూచినా ఆకలిదప్పులు తీర్చగల ఫల వృక్షాలుగాని, నీటి మడుగులుగాని కానరాలేదు. ఐతే ఆ బిలద్వారం నుండి తడి ముక్కులతో నీటి పక్షులు రావటం చూచాడు పవన తనయుడు, అదే విషయం తనవారికి చెప్పాడు. "మిత్రులారా! అటుచూడండి. హంసలు, క్రౌంచ పక్షులు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు తడిసిన రెక్కలతో బిలం నుండి బయటకు వస్తున్నాయి. కాబట్టి యీ బిలంలో సరోవరాలో, దిగుడు బావులో ఉండి ఉండాలి. అంతే కాక బిల ప్రాంతాన వృక్షాలు కూడా ఉన్నాయి”


అందరూ కలసి ఆ బిలం చేరారు. అదే స్వయంప్రభాబిలం, నెమ్మదిగా బిలంలోకి దిగారు. నాలుగడుగులు వేశారో లేదో వీరనుకున్నట్లుగా నీటి మడుగు కనిపించకపోగా కనీసం వెలుతురు కూడా లేదు. అంతా చీకటి. కన్ను పొడుచుకున్నా దారి కానరావటం లేదు. పైగా ఇరుకు దారి. ఒకరిని పట్టుకుని మరొకరు నడవసాగారు, కొద్దిదూరం ఇలా సాగింది వారి నడక.

ఇంకొంచెం ముందుకు వెళ్ళగా నయనానందకరంగా వెలుగు కనిపించింది. మున్ముందుకు సాగగానే సుమధుర జలాల సరోవరాలూ, మధువొలుకు ఫల పుష్పభరిత వృక్షాలూ, తమాల, సాల, తాల, అశోక, చంపక, పున్నాగాది వృక్షతతులూ కనులపండుగ చేయుచూ కాన్పించినవి. అటునిటు తిరుగుచుండగా ఇంతకు ముందెన్నడు చూడని అత్యద్భుతమైన రమణీయ సుందర మందిర మొకదానిని చూచారు. లోనికేగి చూచుచుండగా మృగచర్మ ధారిణీ, పద్మాసవాసేన, నిమీలితనేత్రయై తేజఃపుంజములు వెదజల్లు ఒక తాపసిని చూచారు. ఆమెయే స్వయంప్రభ. అది స్వయంప్రభా మందిరం.

Tuesday 15 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (22)



వ్యవసాయశ్చ తే వీర సత్వయుక్తశ్చ విక్రమః 

సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ్ర మే. 


ఓ వీరుడా! నీ ఉత్సాహ బల విక్రమాలు నేనెరుగుదును. సుగ్రీవుడు నీతో చెప్పిన సందేశమూ, కార్యసిద్ధి నీవలననే అగునని నాకు చెప్పుచున్నట్లున్నది. నయపండితా! ఇది నా నామాంకితమైన ఉంగరము, దీనిని నీదగ్గర ఉంచు. ఇది చూచిన సీత తప్పక నిన్ను నమ్మును. ఈ కార్యమునకు నీవే తగినవాడవు. నీకు శుభమగు గాక!అని తన అంగుళీయకము (ఉంగరము) నిచ్చి ఆశీర్వదించి పంపెను.


ఈ సందర్భమున ఆంజనేయునకు దూతకు కావలసిన లక్షణములు కలవనియు, కార్యసాధనా సంపత్తి అతనిలో కలవనియు రామ, సుగ్రీవులకున్న' ఏకాభిప్రాయము, కావుననే అంత మంది వానర యోధులున్నను స్వనామాంకిత అంగుళీయకాన్ని హనుమంతున కిచ్చుట జరిగినది.


అధికారుల మన్ననలను పొందుటకు కేవలం బాజాబజంత్రీలను ఊదటం కాక ప్రతి మానవుడు శక్తి సామర్ధ్యాలతో ప్రభువుల ప్రశంసల నందుకోవాలేకాని పక్కదారులు, అడ్డదారులు తొక్కరాదు. ప్రతిభకు పట్టం కట్టాలి. సేవానిరతి కలిగి ఉండాలి, ఇది ఇచట హనుమంతుని ఆదర్శం. సేవకావృత్తి ఆత్మార్పణగ ఉండాలి. విశ్వాసము, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలి.


Monday 14 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (21)



విశ్వాస పాత్రత


రామాజ్ఞననుసరించి సుగ్రీవుడు సీతాన్వేషణకై వానర యోధులను వీరవరుల నేతృత్వంలో నాలుగు దిక్కులకూ పంపుచూ ఆయా దిగ్విశేషాలను వివరించి ఇలా అంటాడు.


కపివరులారా! మీరందరూ కడు జాగరూకతతో సీతాదేవిని కనిపెట్టి వెతకండి. మీకు గడువు ముప్పది రోజులు మాత్రమే. అలాకాక ఆపై ఒక్కరోజు జాగుచేసినా- మీకు మరణశిక్షయే. ఇదే సుగ్రీవాజ్ఞ.


ఇక దక్షిణ దిశగా పయనమైన వానరసేనకు అంగదుడు నాయకుడు. జాంబవదనుమంతాది కపి వీరులు అంగదునికి బాసటగ పయనమయ్యారు. ఇంతలో సుగ్రీవుడు మతిమంతుడైన హనుమంతుని దగ్గరకు పిలచి


విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థము క్తవాన్ 

న హితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్ధోర సాధనే. 

న భూమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే 

నాప్యునా గతిభంగం తే పశ్యామి హరిపుంగవ. 

సా సురాః సహ గంధర్వాః స నాగ నరదేవతాః 

విదితాః సర్వలోకా స్తే స సాగర ధరా ధరాః

గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే 

పితు స్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. 

తేజసా వాపి తే భూతం న సమం భువి విద్యతే 

తద్యథా లభ్యతే సీతా త త్త్వమేవాను చింతయ. 

త్వయ్యేవ హనుమన్నస్తి బలం వృద్ధిః పరాక్రమః 

దేశ కాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత.


అన్నిదిక్కుల సీతను వెదుక వానర సైన్యమును పంపినా సుగ్రీవునికి మాత్రం యీ కార్యమును సాధింపగలవాడు హనుమ మాత్రమే అన్నది దృఢమైన విశ్వాసము.


హనుమా! నేలమీద, నింగిలో, నీటిలో నీవు చొరరాని చోటు లేదు. దేవలోకాన కూడ నీ పయనం ఆపరానిది. నీవు ప్రవేశించ లేని చోటు ఎచటా లేదు. నీకు తెలియని చోటు లేదు. సర్వ లోకా లలో సంచరించగలవాడవు. గంధర్వ, యక్ష, నాగ, కిన్నర, కిం పురుష, దేవ, దానవ నివాస భూములన్నీ నీకు సుపరిచితాలే. గమన వేగంలో తండ్రికి తగిన తనయుడవు. బల, పరాక్రమ, సాహసాలలో నీకు నీవే సాటి, దేశ కాలానుకూలంగా సంభాషించ గల నేర్పు నీకు వెన్నతో పెట్టిన విద్య. సర్వకార్య సమర్థుడవైన నీకు నేను చెప్పవలసినది లేదు. ఈ కార్య భారాన్ని నీ భుజ స్కంధాల మీద పెడుతున్నాను. విజయుడవై తిరిగిరా! అంటూన్న మాటలు రాముడు విన్నాడు.


Sunday 13 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (20)



ఇటువంటి పరిస్థితిని ముందుగనే గమనించి జాగ్రత్తపడిన నీతివేత్త హనుమ. లక్ష్మణుని సమీపించి

 త్వత్తోధికతరో రామో భక్తోయం వానరాధిపః

రామకార్యార్ధమనిశం జాగర్తినతు విస్మృతః. 


మహారాజా! ఈ వానరరాజు రామునకు మీకంటెను గొప్ప భక్తుడు, రేబవలు రామకార్యార్థమైన ఆలోచనే. తన కర్తవ్యమును విస్మరించలేదు. ఇదిగో! ఇటు చూడు. నేల యీనినటుల కనిపించే యీ వానర వీరులు సీతామాతను వెతుకుటకై వచ్చినవారు. త్వరలో సీతాన్వేషనార్థమై నేల నాలుగు చెరగులకు వెళ్ళుటకై సిద్ధముగనున్నారు. సుగ్రీవుడు మిత్రకార్య నిర్వహణలో ఏ లోటూ రానీయడు సుమా! అని సమాధానపరచి లక్ష్మణుని ప్రసన్నునిగ చేసెను.


సహజంగా తమ కళ్ళముందు జరుగుతున్న విషయాలలో ఎవరితో ఏమంటే ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో మనకెందుకులే కాసేపు కళ్ళు మూసుకుని మౌనం వహిస్తే పోలా" అని సరి పెట్టుకునే మనస్తత్వం కలవాళ్ళే ఎక్కువమంది సమాజంలో తారసపడతారు. సకాలంలో సరియైన సలహా ఇవ్వగలిగికూడా ఇవ్వరు, లోపాలను చెప్పరు. పొగడ్తలతో మాత్రం ముంచెత్తుతారు అవకాశవాదులు. ఎటుచూసినా వారికి స్వార్ధం అడ్డు వస్తుంది. స్వార్థానికై ఎదుటివారిని బలి తీసుకుంటానికి కూడా సిద్ధపడతారు. స్వార్థం కొంచెం ప్రక్కన పెట్టి పరార్ధం కోసం పాకులాడరు. ఏ ఇంటిలో దీపం వెలగకపోతే మాకేం- మా ఇంటిలో దీపం వెలగాలి అనుకుంటుంటారు. అట్టివారి విధానానికి ఆంజనేయుని నీతిజ్ఞత ఒక చురక, ఏమాత్రం బెరుకు లేకుండగా ధైర్యంగా ఎదుటివారిలోని లోపాలను తగినసమయంలో నొప్పింపని రీతిలో ఎత్తిచూపి తగిన జాగరూకత వహించునట్లు చేయగల మతిమంతుడు, సారధి, సచివుడుగా యీ పై సన్నివేశంలో కనిపిస్తాడు హనుమంతుడు. మంచన మతి మహత్తును ఇలా చెప్పాడు - 


మతియ కళాకృషి బీజము

మతియ తను ఫలప్రదక్షమాజము తలపన్ 

మతియ చెలి మతియ చుట్టము 

మతిహీనులు చూడ మొరడు మ్రాకులు ధాత్రిన్.

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (19)



సన్మార్గగాములేపుడూ స్వసుఖాన్ని తృణీకరించి మిత్ర కార్యం నెరవేరుదాకా విశ్రమించరు. కృతఘ్నుని సిరిసంపదలు వీడిపోవును. రాముడు మనకు మిత్రుడు. కాలవేత్త. బుద్ధిమంతుడు. ఇప్పటికే కాలాతీతమైనది.


తానుగా వచ్చి మాత్రం కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. సమయా నికి తగినరీతిగా ప్రవర్తించనివాడు మిత్రుడే కాదు, నీకోసం వాలి ప్రాణాలు తీయటానికైనా వెనుకాడలేదుకదా రాముడు! మరి నీకి జాగేల కనుసైగ చేస్తే నీముందు వేనవేల వానర, భల్లూక వీరులు వచ్చి వాలుదురే? సమయం దాటిన తరువాత చేసిన కార్యం ఎంత మహత్తరమైనదైనా మిత్రున కుపకరించునా? కాన ఓరాజా! వెంటనే వానర, భల్లూకవీరులను సీతాన్వేషణకై తరలి రావలసినదిగా ఆజ్ఞాపించు, రాముడే అలిగిననాడు సముద్రము లింకకుండునా! యక్ష, గంధర్వ, దేవ, దానవులు గుండియలదరి ఆదరి ఆగకుండునా అని కాలానుగుణంగా చేసిన ప్రబోధానికి ఒకింత భయం, ఒకింత ఆంజనేయునిపై అభిమానం పెరగగా సుగ్రీవుడు కపిసేనను ఎటనున్నా పదిహేను రోజులలో చేరుకోవాలనీ, లేనినాడు శిరచ్ఛేదమే శిక్ష అని ఆజ్ఞాపించాడు.


మతియ కళా కృషి బీజము


ప్రస్రవణ గిరిమీద క్షణమొక యుగముగా గడుపుతున్న రామునకు వర్షాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చి ప్రకృతి- యుద్ధానికి తగినవిధంగా మారినా పూర్వం కుదుర్చుకున్న స్నేహ ఒప్పందం ప్రకారం ఇంకను సుగ్రీవుడు రాడాయె ఓర్పు రామునిలో నశించింది. తమ్ముడు లక్ష్మణునితో- "లక్ష్మణా! సుగ్రీవుడు విషయలోలుడై గతాన్ని మరచినట్లున్నాడు. ఒకసారి నీవు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుని హెచ్చరించు. సుగ్రీవా! ఇప్పటివరకు రాముని అనుగ్రహాన్నే చూచావు. ఇక ఇపుడు ఆగ్రహాన్ని చూడ బోతున్నావు? వాలి వెళ్ళినదారిన పయనించాలనుకోకు?”,


సహజ శాంతస్వభావుడైన లక్ష్మణుడు అన్నగారి మాటలకు తనువు కంపింపగా ధనుర్బాణపాణియై పిడుగుల గర్జనను బోలిన అడుగులతో కిష్కింధలో కాలిడెను. ప్రళయకాల రుద్రునిలా నున్న రామానుజుని చూచి కపులు గడగడలాడిరి. 

Saturday 12 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (18)



అందుకే అంటారు.


రజనీ కరః ఖలు శీతో రజని కరాచ్చందనో మహాశీతః

రజనీ కరచందనాభ్యాం సజ్జన వచనాని శీతాని.


చంద్రుడు శీతల కరణాలతో చల్లదనం కలిగిస్తే చందనం అంతకన్న చల్లదనం కలిగిస్తుందట. ఆ చంద్ర, చందనాలకన్న సమయమునకు తగినట్లున్న మాటకారి చల్లని మాట ఎంతటి ఆవేదననైనా- ఆవేశాన్నయినా ఇట్టేమాయం చేస్తుందట. అంటే ఒక్క మాట సన్నివేశాన్నిబట్టి ప్రయోగించేవాని వాక్చాతుర్యాన్ని బట్టి ఎన్నో రూపాల ఎదుటివానిని ఆకట్టుకుంటుందన్నమాట. ఇట్టి మాట నేర్పుండాలని, ఇంతటి బరువైన సన్నివేశంలో కూడ హృదయానికి తగిలిన ఎంతటి గుండె గాయాన్నయినా మాన్పి గుండె నిబ్బరం కలిగించగలదని లోకానికి చాటాడు హనుమ. స్వయముగ రాముడు వాలికి అంత్య సంస్కారాలు జరిపించి సుగ్రీవుని పట్టాభిషిక్తునిగా- అంగదుని యువరాజుగా చేశాడు.


క ర్త వ్య బో ధ


రామ లక్ష్మణులు ప్రస్రవణ గిరిపై వర్షాకాలము గడిపి నారు. శరదృతువారంభమయినది. కిష్కింధలో సుగ్రీవుడు భోగలాలసుడై తారా, రుమలతో కాలం గడుపుతూ రాజ్యభారం మంత్రులపై నిడి మధిరాస పానమత్తుడై పర్షఋతువు దాటి శరదృతువు వచ్చినా - తన యీ మహోన్నత స్థితికి మూలమైన రామునికి అనాడిచ్చిన తన మాట చెల్లింపునకు ప్రయత్నించు చాయలేవీ కన్పడలేదు.


"ఆకాశం మల్లెపూలవలె తెల్లగనున్నది. నదులలో నీరు నిర్మలంగా ఉంది. నెమళ్ళు నాట్యమాడ మానినవి. మార్గాలు ప్రయాణ యోగ్యాలుగా ఉన్నాయి సుగ్రీవుడు కర్తవ్యాన్ని మరచినట్లున్నాడు" అనుకుని మారుతి సుగ్రీవునిచే సత్యము, మనోహరము, హితము, శ్రవణ సుభగాలైన మాటలతో కర్తవ్యోన్ముఖుని చేయుచు —


రాజ్యం ప్రాప్తం యశశ్చైవకాలే శ్రీరభివర్ణితా

మిత్రాణాం సంగ్రహ శ్శేషః తద్భవాన్ కర్తుమర్హతి.


ఓ రాజా! రాజ్యం లభించింది. సత్కీర్తినందుకున్నావు. కాలానుగుణంగా సంపదా పెరిగింది. వైభవాల కన్నీటికి మూల కారణమైనది. మిత్రకార్యం మాత్రం మిగిలేవుంది. అనాడు ఋష్య మూకాద్రి పైన పవిత్రమైన మిత్రబంధం ఏర్పడినపుడు అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, అందు రాముడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ ఉపకారానికి ప్రత్యుపకారంగా ఆనాడు నీవు వర్షాకాలం పూర్తికాగానే సీతాన్వేషణ సాగిస్తానన్నది మాత్రం మాటగానే మిగిలిపోయింది. ఆ మాట మరచావో ? విషయలాలసుడవై ఉపేక్షించావో !

Thursday 10 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (17)



సుగ్రీవ మహారాజా! ఈ రాముడు మహాప్రాజ్ఞుడు, దృఢ విక్రముడు, సత్యవిక్రముడూనూ. వీరి జనకుడు ఇక్ష్వాకు వంశాన జనించిన దశరథ మహారాజు. గొప్ప తపస్వి సత్యసంధుడు ఆడి తప్పినదిలేదు. తండ్రి యానతి తలదాలిచి అడవులకు వచ్చిన యీ రాముడు ధర్మమూర్తి ఇల్లాలితో, సోదరుడైన యీ లక్ష్మణునితో కలసి వచ్చాడు. భార్యను ఎవరో అపహరించారు. భార్యా వీయోగంతో రాముని అంతరంగం శోకతప్తమయింది. నీ సాయం కోరి వచ్చిన వీరిని ఆదరించు. వీరి సఖ్యం నీకు అవశ్యం. ఈ తేజశ్శాలుర సన్నిహితం నీకు కొండంత అండ అని చక్కని పద బంధాలతో ముందు ముందు నీవు సుఖజీవనం చేయటానికి వీరి అవసరం ఎంతో ఉందిసుమా అని నర్మగర్భంగా చెప్పగా సుగ్రీవునికి వేయి ఏనుగుల బలం వచ్చినట్లయినది. గుండె బెదరు అడగినది. ఈవిధముగా రామ సుగ్రీవులకు పవిత్ర మైత్రీ బంధం కలిగించిన తీరు లోకోత్తరమైనది. భావితరాలవారికి ఒక కొత్త బాట నేర్పరచినట్లయినది .


ఒక చల్లని మాట - ఓదార్పు


అనుకున్న ప్రకారము వాలి వధ జరిగినది. ఈ వృత్తాంతమును సరగున పరుగిడి వానరులు తారకు తెల్పిరి. మూర్తీభవించిన శోక దేవతాలావచ్చి తార భర్త శరీరమును చూచి అతి దీనముగ విలపింపసాగినది ఆప్రాంతమంతా ఎటుచూసినా విషాదమే. ఎవరికీ తారను ఓదార్బుశక్తి - ఆమెదగ్గరకు వెళ్ళగల ధైర్యము లేకపోయినది. అంతలో సమయోచిత సంభాషణా చతురుడగు ఆంజనేయుడు తారనుచేరి-శ్రవణ సుభగములైన మాటలతోఇటుల నసునయించినాడు.


గుణదోష కృతం జంతుః స్వకర్మ ఫలహేతుకం

అవ్యగ్ర స్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభా శుభం 

శోచ్యా శోచసి కం శోచ్యం దీనం దీనానుకంప సే 

కస్య కోవా శోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. 

జాతస్య నియతామేనం భూతానామాగతిం గతిం 

తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితే నేహ లౌకికం. 

అంగదస్తు కుమారోయం ద్రవవ్యో జీవపుత్రయా 

ఆయత్యాం చ విధేయాని సమర్ధాన్యస్య చింతయ. 


దేహి తాను చేసిన మంచి, చెడు పనుల ననుసరించి వానికి తగిన ఫలితముల ననుభవించును. జీవితం క్షణ భంగురం. నీటి బుడగ. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. అనివార్యమైన యీ జనన మరణాలను గురించి నీవంటి విజ్ఞత గలవారు ఇలా ఏడ్వ వచ్చునా! గతాన్ని మరచి కర్తవ్యాన్ని ఆలోచించు. ఉన్న కుమారుని అంగదుని చూచైనా దుఃఖాన్ని దిగమ్రింగు'. ఈ ఓదార్పు వలన తార ఊరడిల్లినది.. 


తారా విలాపాన్ని ఆచటివారెవరూ ఆపలేకపోయారు. సరి కదా దరిజేరి ఓదార్చ ప్రయత్నమూ చేయలేకపోయారు. ఒక చల్లని మాటతో ఆమె దుఃఖాన్ని మరపింప ప్రయత్నించలేదు. కన్నీరు మున్నీరుగా విలపించే తారను తన చల్లని మాటతో- అంటే ఉపశమనం కలిగించే మాటలతో ఓదార్చాడు. ఆ ఓదార్పు ఆమెను కర్తవ్యోన్ముఖురాలిని చేసింది. 


Wednesday 9 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (16)



అదే ధీ వైభవం అంటే, సమయానికి స్ఫురించని బుద్ధి విశేషం చచ్చుబడిన చేయివంటిది.


ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధ జితేంద్రియా 

ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతాః.


ఇటువంటి బుద్ధి సంపన్నులు, జితక్రోధులు, జితేంద్రియులు నైనవారిని సుగ్రీవుడు స్వయముగా వచ్చి దర్శించుకో వలసివుండగా-వారే వచ్చి సుగ్రీవుని చూడవచ్చుట సుగ్రీవుని దెంత అదృష్టమో కదా !


వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి సుగ్రీవునియెడ అకారణ వైరమూని రాజ్యభ్రష్టుని చేయుటయే కాక భార్య రుమను కూడ చేపట్టినాడు. దిక్కుదోచని స్థితిలో సుగ్రీవుడు కానల వెంబడి తిరుగుచున్నాడు. వాలి వధించునను భయంతో మీరంగీకరించిన మా ప్రభు సన్నిధికి తీసుకుపోతాను అని వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చి - రాముని సుగ్రీవునకు పరిచయం చేసిన విధానం నీతి మంతమూ, ఆలోచనాయుతమూ, ఆదర్శవంతమూ-ఐనట్టిది.


ఈనాడు ఒక రాష్ట్రం మరో రాష్ట్రం, ఒక దేశం మరో దేశం ఆకారణ అసూయా రాగద్వేషాలతో, కక్షలూ కార్పణ్యాలతో కుహనా రాజకీయాలతో సమాజ అభ్యున్నతి, దేశపురోగతి కుంటు పడే ప్రమాదం క్షణక్షణం పొంచి వుంది. ఇటువంటి పరిస్థితులలో ఆలోచనాపరులు, రాయబారులు, సంధానకర్తలు - మొదలగు పరిష్కర్తలకు రామాయణ సన్నివేశాలలో హనుమంతుడు నెరపిన రాజనీతి, కార్యసాధనకు అతడు ఉపయోగించిన మేధాశక్తి, సమయ సందర్భములనెరిగి తనంత తాను తీసుకున్న నిర్ణయాలు-ఏ కాలము నాడు జరిగినవో - అయినా నేటికీ అనుసరించదగినవి. విభిన్న ప్రవృత్తులుగల నర, వానరులకే అంతటి సఖ్యత నొనగూర్చిన ఆంజనేయుని దీర్ఘ దర్శిత్వం అందరూ అవశ్యం ఆచరింపతగినవి. 'వసుధైక కుటుంబకం' అను సూక్తికి నిదర్శనమైనవి. చూడండి.


Tuesday 8 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (15)



వ సు ధై క కు టుం బ కం


తనకు మొదటి చూపులోనే రామలక్ష్మణుల యెడ పూజ్య భావం కలిగింది. ఆ భావంలోకూడ సుగ్రీవునికి వీరితో స్నేహమేర్పడిన కష్టములనుండి బయటపడునుగదా!అను భావనే. అలాగే రామునికిగూడ "ఇట్టివాని సాహచర్యము గల రాజు నిజముగ అదృష్టవంతుడు" అని అనిపించినది. ప్రశంసార్హమైన కార్యసాధనకిది మొదటి మెట్టయినది. సుగ్రీవుడు వారి వృత్తాంతము నరసి రమ్మన్నాడేగాని మరేమీ చెప్పలేదు. ఐనా రామ, సుగ్రీవుల మైత్రి ఇరువురకు శుభంకరమని, కళ్యాణయుతమని గ్రహించి "సుగ్రీవుడు మీతో చెలిమి చేయనున్నాడని, అతడు ధర్మాత్ముడు, విశ్వాసపాత్రుడు అని చొరవతీసుకు చెప్పుటలోనే హనుమంతుని దేశ కాల విదిత్వమున్నది.


సోదరుని అనుజ్ఞతో తమను తాము పరిచయం చేసుకుంటూ లక్ష్మణుడు "సచివోత్తమా! ఏది కావాలని కోరుకుంటున్నామో అనుకోకుండగ 'ఆడబోయిన తీర్థమెదురైనట్లు' మాకది లభించినది. ప్రహృష్టాంతరంగుల మయ్యాము. అయోధ్యా నగరాధిపతి దశరథ మహారాజు. ఆ రాజుకు పెద్ద కుమారుడూ, నాకగ్రజుడు యీ రాముడు. నన్ను లక్ష్మణుడంటారు. అరణ్యవాసానికి మా అన్న గారూ, వారివెంట మా వదిన జానకీ నేనూ అనుసరించి వచ్చాం. మేమిరువురము లేని సమయాన ఒక రాక్షసుడు మా వదినగారి నపహరించాడు,ఆమెను వెతుకుచూ తిరుగుచుండగా కబంధుడు కన్పించి సుగ్రీవుని గురించి చెప్పి సుగ్రీవుని కలుసుకోవలసినదిగా సూచించాడు.


"అహం బై వహి రామశ్చ సుగ్రీవం శరణం గతా"


నేను, రాముడును సుగ్రీవ మైత్రి కోరుకుంటున్నాం. మమ్ముల నాతని సన్నిధానానికి చేర్చవలసినదిగా కోరాడు.


లక్ష్మణుని మాటలు వినినంతనే ఆంజనేయుని హృదయాన మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.


Monday 7 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (14)



అవిస్తర మసందిగ్ధం అవిలంబిత మద్రుతం 

ఉరస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే. 

సంస్కారక్రమ సంపన్నామదృతా మవలంబితాం 

ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయ హారిణీం• 

అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్థయా 

కస్య ఆరాధ్యతే చిత్తముద్యతా సేర రేరసి


సంగి నంగిగా మాట్లాడటం. సందర్భానికి అతకనివి ఏవోవో మాట్లాడటం-విషయం అర్థంతరంగా ఆగిపోవటం లేదు. మాటల ఒరవడి ఒక ప్రవాహంలా దొర్లుతున్నది. హృదయ, కంఠ, మూర్ధాల నుండి మధ్యమ స్వరంతో వచ్చే మాటలు సంస్కార సంపన్నమై క్రమ పద్ధతిలో కళ్యాణగుణయుతములై వినువారి డెందాలకు హత్తుకొని అలరిస్తున్నవి. సర్వశాస్త్ర విశారదుడు మాత్రమే ఇలా మాటలాడగలడు. చిత్ర, విచిత్రమై రమణీయంగాసాగే యీ వచోధారకు ఎవడు వివశుడు కాడు. కత్తిదూసి మీదికి వచ్చు విరోధి సైతము మ్రాన్పడి శిరము వంచి నమస్కరింపకుండునా !


ఇదీ హనుమంతుని అద్భుత వచో వైభవం. మాటకారి మన్నన పొందని ప్రదేశమే లేదు.


ఈ సన్నివేశాన్ని పదేపదే మనసము చేస్తూ సాలోచనగ ఆలోచించగలిగినవాడు చక్కని వాక్ నైపుణ్యం కలవాడగును. అతడు పుష్పగుచ్ఛమువలె సకల మానవాళి శిరము నధివసించగలడు. ఇది నిజం. మృదుమధురంగా మాట్లాడేవారికి శతృవు లెవరుంటారు?


ఆంజనేయుని వచోవైభవం ఒక యెత్తు దేశకాల పాత్రతల నెరిగి సమయోచితంగా కార్యసాధన చేయగల చతురత మరో ఎత్తు. స్వార్థమెరుగని స్వామిభక్తి పరాయణుడు. స్వామి కార్యమే గాని స్వకార్యమున కెచటా చోటిచ్చినట్లు చూడబోము అతని చరిత్రలో. ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడాలి? ఆ పదానికున్న శక్తి ఎంత ? వ్యంగ్య వైభవం ఎంత? ఎదుటి వ్యక్తిని అంచనా వేయటంలో గల ఊహాశక్తి వీటన్నిటిని గురించి అంటే కార్యసాధకున కుండవలసిన లక్షణాలను గురించి రాజనీతి ఇలా చెప్తుంది.


అనురక్తి శ్ళుచిర్దక్షః సృతిమాన్ దేశకాలవిత్ 

వపుష్మాన్ వీతిభిర్వాగ్మీ దూతో రాజ్ఞఃప్రశస్యతే.


అనురక్తుడు, కల్లాకపటం లేనివాడు, స్మృతిమంతుడు, దేశ కాల విదుడు, రూపసి, నిర్భయుడు, చక్కని మాటకారిగనున్న కార్యసాధకుని దూతగపొందిన రాజు సాధించరానికార్యముండునా!


Sunday 6 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (13)



హనుమంతుని - ధీ వైభవం


సుగ్రీవ సచివుడైన ఆంజనేయుని మాటలకు ఆనందపరవశుడైన శ్రీరాముడు లక్ష్మణునితో


చూచావా! లక్ష్మణా! ఆంజనేయుని వాక్చాతుర్యం 

సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః 

తమేవ కాంక్ష మాణస్య మమాంతిక ముపాగతః.


అభిభాష స్వసౌమిత్రే సుగ్రీవ సచివం కపిం 

వాక్యజ్ఞం మధురై ర్వాక్యైః స్నేహయుక్తమరిందమ.


నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః 

నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం.


ఋగ్వేదం-స్వర ప్రధానమైనది. ఉదాత్త అనుదాత్త స్వరిత ఫ్లుతాలతో గురుముఖతః అధ్యయనం చేసినగాని అది పట్టుపడదు. దీనికి చిత్త చాంచల్యం పనికిరాదు. మనో నిశ్చలత అవసరం. ఆ విధంగా అధ్యయనం చేసినవాడు వినీతుడు.


యజుర్వేదానికి ధారణ ప్రధానం. ఎందుకంటే ఒకే విధమైన పద జాలాలు మరల మరల తిరిగి తిరిగి రావటం జరుగుతుంది. ధారణ లోపించిన జాయతే వర్ణ సంకరః, కాబట్టి ధారణాశక్తి కల వాడే యజుర్వేదాధ్యాయి.


సామము- గాన ప్రధానమైనది. కాన రాగ తాళ లయ స్వర జ్ఞానములు అత్యంత ఆవశ్యకాలు. ఇది నవనవోన్మేషశాలిని ప్రతిభ అదే వైదుష్యం. వైదుష్యం కలవాడే విదుషి కాగలడు. అంటే యీ మారుతి ఏవం విధమైన మూడు వేదాలను అధ్యయనం చేసినవాడన్నమాట, ఋగ్వేద వినీతుడు. యజుర్వేద ధారి, సామవేద విదుడు. వేదవేదాంగ పారంగతుడు.

నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం 
బహు వ్యాహరతానేన న కించిదప శబ్దితం.

స ముఖే నేత్ర యోర్వాపి అలాటే చ భ్రువో స్తధా 
అన్వేష్వపి చ గాత్రేషు దోషః సంవిదతః క్వచిత్ . 

అంతేకాదు లక్ష్మణా ఇంతసేపు మాటలాడిన మాటలలో ఒక్క అప శబ్దము కూడ దొర్లలేదు. వ్యాకరణం నేర్చినవానికి మాత్రమే అది సాధ్యం.

ముఖము కనులు, కనుబొమలు, లలాటము మొదలైన అవయవాలలో ఏవిధమైన వికారమూ కానరాదు. అంటే శాస్త్రం విధించిన పాఠకాధములు ఆర్గురు. వారు- కూనిరాగాలు తీసేవాడు, సంగీతంలో చెప్పేవాడూ, తల ఆడిస్తూ చెప్పేవాడూ, రాసినదానిని చూస్తూ చదివేవాడూ, శబ్ధ జ్ఞానం అర్థజ్ఞానం లేనివాడూ, తీచుగొంతువాడు. ఆంజనేయునిలో యీ విధమైన వికార భావాలు మచ్చుకైనా లేవు.

Saturday 5 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (12)



ఇచట మాటకున్న శక్తి ఎట్టిదో- దానిని ఎలా వశం చేసుకోవాలో హనుమంతుడు తన సంభాషణద్వారా తెలియపరచినాడు. ఇసుమంతైనా పరిచయం లేనివారితో మాట్లాడునపుడు ముందుగా తనను తాను పరిచయం చేసుకోవాలి. అందులో ఆత్మస్తుతి పనికి రాదు. వినయంతో కూడిన ఆత్మార్పణ కలిగి ఉండాలి. మాటకారిత్వం. హనుమంతుని మాటలకు రామ లక్ష్మణులు మంత్రముగ్ధులైనారో అలాంటి మాట నేర్పు కలిగి ఉండాలి.


మాటలచేత దేవతలు మన్ననజేసి వరంబు లిత్తుర  

మ్మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు లిత్తుర 

మ్మాటలచేత కాముకులు మన్నన జేసి సుఖంబు లిత్తుర

మ్మాటల నేర్వకున్న నవమానము నూనము మానభంగమున్. 


అంటాడు ఓ కవి. మధుర భాషణము మానవుని మాననీయునిగ చేస్తుంది. చక్కని మాటకారిని అన్నిచోట్ల, అన్ని వేళలా అందరూ ఆదరిస్తారు. ఏనాడూ ఎవరిని ఏ సన్నివేశంలోనూ మెచ్చుకోని వాక్యజ్ఞుడూ, వాళ్య కుశలుడూయైన రాముడు మొదటి చూపులోనే ఎంత గానో మెచ్చుకున్నాడూ అంటే ఆంజనేయుని వాక్ నైపుణ్యం ఇంతింతనరానిది. ఆ బుద్ధి కుశలతను వాల్మీకి వాక్యకోవిద అంటాడు. అంటే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలో తెలిసినవాడన్నమాట. ఇదొక సమ్మోహనాస్త్రం. ఆ బుద్ధికుశలత మూడు విధాలుగా ఉంటుందని చెప్తారు. అవి సదా జ్ఞప్తి యందుంచుకొనుట అవసరం.


స్మృతిర్వ్యతీతవిషయా మతిరాగామి గోచరా !

బుద్ధి స్తాత్కాలికీ జ్ఞేయా ప్రజ్ఞా త్రైకాల్య గోచరా ॥ 


గతాన్ని గమనిస్తూ వర్తమానాన్ని పరికిస్తూ భావిని ఊహిస్తూ పొందికగా మాటలాడాలన్నమాట.


Friday 4 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (11)



మా ట . మ న్న న


తన స్వామి ఆదేశానుసారం సామీరి వారెవరో తెలుసుకొనుటకై కపి రూపమును వీడి బ్రహ్మచారిగ రామ, లక్ష్మణులను సమీపించి


ఆర్యులారా! మీరెవరు? ఏపనికై ఇటకేతెంచినారు? అనితర సాధ్యమైన మీ రూప బల సంపదలు చూస్తే ఉత్తమ క్షత్రియ సంజాతులవలె కన్నట్టుచున్నారు. వేషమందుమా - బ్రహ్మ తేజ ముట్టిపడు తాపసోత్తముల సైతము మరపించుచున్నది. వృషభ గమనంతో, ఇంద్రచాపమును బోలు ధనుస్సులను ధరించి సూర్య చంద్రులవలె వెలుగొందు మిమ్ము చూచి ప్రకృతి సౌందర్యంతో పులకించే అడవి జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. బంగరు కాంతులనీను ఖడ్గాలు బుసకొట్టు కోడెత్రాచులాగున్నాయి.


ఇంతకీ మీరెవరు? అని సరస సంభాషణా చతురుడు- స సందర్భ వాగ్బాణ నిపుణుడు- వాక్య కోవిదుడు అంజనాసూనుడు వారిని పలుకరించి ప్రశ్నించెను.


హనుమ ఎంతగా పలుకరించినా ఆ అన్నదమ్ములు పెదవి విప్పనే లేదు. వారిని అంతగా తన్మయులను చేసింది హనుమ ద్వాణి. వారి ఉపేవోభావము నుపేక్షింపక మరల తిరిగి అయ్యలారా! నేనింతదనుక మాటలాడినా మీరు స్పందించరదేమి? ఔను నిజమే. నేనెవరినో ముందుగా మీకు చెప్పనేలేదు కదా!


సుగ్రీవుడు వానర రాజు, ధర్మాత్ముడు. మహా వీరుడు. అన్నచే పరాభవింపబడి అడవుల పాలైనాడు. అతడు పంపగా మీ దగ్గరకు వచ్చాను. మీ స్నేహాన్ని కోరుచున్నాడు. అతని ఆంతరంగిక సచివులలో నేనొకడను. నన్ను హనుమంతుడని పిలుస్తారు. వాయు పుత్రుడను. కామరూప, కామగమన శక్తులు కలవాడను అని మనోహరంగా పలికినాడు.


Thursday 3 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (10)



ఇటులుండగా ఒకనాడు అమిత తేజోవంతులు, దృఢకాయులు, నారచీరలు ధరించినవారు. ధనుర్బాణపాణులు, ఆజానుబాహులు, మూర్తీభవించిన క్షత్రియత్వముగల వారిరువురు తమ వైపునకే వచ్చుటనుచూచిన సుగ్రీవుని గుండియలదరగా- భీరువు వోలె పారిపో‘జూచుచు ఆంతరంగిక సచివుడైన ఆంజనేయునితో—


హనుమా! అదిగో! ఆటు చూడు! ముని వేషధారులయ్యు, ధనుర్బాణములను ధరించి 'ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం' అన్నటుల కాన్పించుచు ఎవరికోసమో వెతుకుచున్నవారివలె తోచు చూపులతో వచ్చుచున్నారు. వాలి పంపగా నా ప్రాణము లపహరించుటకై వచ్చుచున్నట్లున్నారు. పైకి వేసిన వేషమువలె వీరి అంతరంగము ఉండకపోవచ్చు. బ్రతికున్న బలుసాకు తినవచ్చు. వాలి తాను ప్రవేశించగరాని ప్రదేశము కనుక నిరంతరం తన మిత్రులచే నన్ను వధించ చూచుచున్నాడు. వారిని నమ్మరాదు. ఇటనుండి తప్పుకొనుట శ్రేయోదాయకము.


ఏలనందువా! శతృ సంచారమును వేయి కనులతో కనిపెట్టి వుండవలెను. ఇటువంటివారు బహు నమ్మకస్తులు గకన్పించి సమ యం కోసం కాచుకుకూర్చుని నమ్మినవారిని కాటువేయుదురు.


అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్ఛద్మచారిణః | 

విశ్వస్తా నామ విశ్వస్తా శ్చిద్రేషు ప్రహరన్త్యపి ||


అన విని పరేంగితజ్ఞుడైన అంజనాసూనుడు — వాలిని తలచుకొని సుగ్రీవుడు భయపడుచున్నాడని గ్రహించి సాంత్వ వచనాలతో ఇటుల పలికెను.


వానరేంద్రా! నీకు భయమేలనయ్యా! వాలి యీ పరిసరాల వైపు కన్నెత్తి చూచుటకైన సాహసించడు. వారు మన కహితులని నేననుకోను. వారివలన నీకేం భయం లేదు. సహజంగా భయం ఆవరించియున్న మనసుకు అన్నీ అనుమానాలే.


భయము తొంగిచూడ పరువెత్తు మగసిరి

భయము వెంట భూత చయము వచ్చు 

భయము నిలుచుచోట జయలక్ష్మి నిలువదు"


అనికదా కవి వాక్కు. భయము ఆలోచనను చంపుతుంది. కాన బుద్ధిశాలివై ఆలోచింపుమనగ శుభంకరమైన ఆ మాటలకు సంతసించి సుగ్రీవుడు వాని యథార్థ వృత్తాంతమును కనుగొని రమ్మని హరీశుని పంపెను.


Wednesday 2 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (9)



కాన “ఓ రాజా ! యీ ఋశ్యమూక పర్వతంమీద నిర్భయంగా యధేచ్చగా చరించవచ్చు. భయపడవలసినది లేదు" అని మారుతి చెప్పిన మాటలు సుగ్రీవునకు ఎడారిలో ఒయాసిస్సును తలపించినట్లయి నది. అందరూ ఋశ్యమూకాద్రి చేరిరి.


"ఏ జనుడు విపత్తి సౌఖ్య సదృశ క్రియు డాతడుమిత్రుడు" అన్నరీతిగా తోడు-నీడగా సుగ్రీవుని వెన్నంటి నడచాడేగాని బృహస్పతివంటి బుద్ధిశాలియైన పవన తనయుడు మునుల శాపకారణంగా తన శక్తి సామర్థ్యాలు మరచిపోవడం జరగకుండినట్లయితే సుగ్రీవుని కష్టాల కడలినుండి ఏనాడో గట్టెక్కించి ఉండేవాడు. నిజమైన మిత్రుడిలా ఉండాలి అని తన నడవడికలో అడుగడు గునా చూపించి సన్మిత్ర మార్గదర్శకుడైనాడు.


"శీలాన్ని గమనించి కలసి మెలసి ఉండండి. మాటకు, నడతకు సంబంధం లేనివాళ్ళతో స్నేహం చేయరాదు” అని సన్మిత్రపదాన్ని సార్ధకం చేసిచూపాడు మారుతి యీ సన్నివేశంలో.


భయమున్న - జయలక్ష్మి నిలువదు


ఇలా వాలిచే బహిష్కృతుడైన సుగ్రీవుడు ఆంజనేయుని ధీశక్తియుక్తులపై పరిపూర్ణమైన విశ్వాసముంచి నిర్భయుడై ఋష్యమూక పర్వతాన మకుటము లేని మహారాజుగా వెలుగొందుచుండెను. ఐతే పగబట్టిన కోడెత్రాచులాంటి మనస్తత్వం కల వాలి స్వయముగా తాను రావీలులేని కారణాన ఆంతరంగికుల నంపి సుగ్రీవుని సంహరింప ప్రయత్నించుచునే యుండెను. కాని వారు సూర్యునిముందు దివిటీలవలె సమీర కుమారుని శక్తి సామర్ధ్యముల ముందు నిలబడలేక పలాయనమంత్రము పఠించుచుండిరి.


Tuesday 1 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (8)



కార్యార్థులై అవతరించిన దేవతామూర్తులు కూడా గురూప దిష్టులే సామాన్య మానవునిలా ప్రవర్తించుట గురువు యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటుటకే !


విద్యాభ్యాసానికి ఏకాగ్రత, పట్టుదల, ఆసక్తి, శ్రద్ధ- అవసరాలు. 'విద్యావినయేన శోభతే కదా! ఆనాటి గురుకుల విద్యా భ్యాసాలు గమనించిన ఎంతటి కఠోరమైనవో గమనించవచ్చు. మరి యీనాటి విద్యార్థులు తమ ముంగిటికే నచ్చి విద్యాబోధన చేయుచున్నా పాఠ్యేతరాంశాల మీదున్న శ్రద్ధ వారికి విద్యార్జనలో ఏ మాత్రం లేకపోవుట కడు శోచనీయం అట్టివారికి ఎంతో కఠినమైన అంజనేయుని విద్యాభ్యాసం కర్తవ్యదీక్షను గుర్తు చేస్తుంది.


ఆంజనేయుడు . సన్మిత్రుడు


వానరరాజైన ఋక్షరజనునకు వాలి, సుగ్రీవులు కుమారులు. తండ్రి మరణానంతరం పెద్దవాడైన వాలి రాజు కాగా, సుగ్రీవుడు యువరాజు. ఈ యువరాజుకు స్నేహితుడు ఆంజనేయుడు. వాలి సుగ్రీవునిపై అకారణ వైరము పూని తరిమినపుడు ఆంజనేయుడు సుగ్రీవుని వెంట కొండ కోనలలో తిరుగాడుచు ఒకనాడు తన చెలికాడైన సుగ్రీవునితో.


“ఓ రాజా! దుందుభి అను రాక్షసుడు అమిత శక్తి శాలి. అతడొకనాడు మహిష వేషధారియై వాలిని యుద్ధము చేయ రమ్మని సవాలు చేసెను. వాలి క్రోధావేశుడై దుందుభి నెదుర్కొనెను. పోరు ఘోరముగ సాగెను. మహావీరుడైన వాలి పిడికిలి పోట్లతో, కాలి తాపులతో, రాళ్ళు విసిరి, చెట్లు పెకలించి కొట్టగా- బలమైన ఆ దెబ్బలకు దుందుభి ప్రాణాలు అనంత వాయువులలో లీనమైనవి. ఆవేశపూరితుడైన వాలి దుందుఖి కాయాన్ని రెండు చేతులు పైకెత్తి గిర గిర త్రిప్పి విసరివైవెను. అది పోయి పోయి మతంగ ముని ఆశ్రమాన పడి అందుండి రక్తబిందువులు ఎగిరి అమ్మునిపైపడగా పరికించి చూడగా మందుభి కాయం మతంగునికి కన్పించెను. దూర దృష్టితో తేరిపార చూచిన మతంగ మహాముని పరిస్థితిని గమనించి "ఈ అకృత్యమునకు పాల్పడినదెవరో. అతడు యీ ఆశ్రమం ప్రవేశించిన వాని శిరసు శతధా ఛిన్నమగును" అని శపించెను.