Monday 28 February 2022

శ్రీ హనుమద్భాగవతము (174)



సోదరా ! ఆంజనేయా! అనుచు దుఃఖించుచు భరతుడు ఆయనను తన వక్షఃస్థలమున హత్తుకొనెను. పవనకుమారా ! నేను ప్రభువునకు సంబంధించిన ఏ కార్యమునకు కూడ పనికి రాని వాడనైతిని. పాపాత్ముడనైన నా వలననే ప్రభువు అనేక కష్టముల అనుభవింపవలసి వచ్చెను. నా వలననే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. ఇపుడు కూడ నేను శ్రీరామకార్యములో ఆలస్యమగుటకు కారణమైతినని శ్రీభరతుడు వాపోయెను. 


ఆంజనేయుని సమాచారమును తెలిసికొని కౌసల్య, సుమిత్ర, వశిష్ఠుడు మొదలగువారు ఆ ప్రదేశమున కరుదెంచిరి. సుమిత్రా దేవి ఆంజనేయునితో నిట్లు బల్కెను. “ఆంజనేయా! శ్రీరామచంద్రునితో నామాటగా నిల్లు చెప్పుము. లక్ష్మణుడు తన కర్తవ్యమును పరిపాలించెను. ఇందులకు నేనెంత యో ప్రసన్న రాల నగుచున్నాను. సేవకుడు ప్రభుని సేవలో | ప్రాణము లను సహితము త్యాగ మొనరింపవలెను. లక్ష్మణుడు లేకున్నాను సీత లేని శ్రీ రామచంద్రుని ఆగమనమును నేను సహింపలేదు.  


కౌసల్యా దేవి ఇట్లు పల్కెను. “పవనకుమారా! ఈమె చెప్పిన వాక్యములను శ్రీరామునితో చెప్పకుము. ఈమె శ్రీ రాముని తన ప్రాణములకంటె అధికముగా ప్రేమించెను, అందు వలన ఈమెకు శ్రీరాముడు తప్ప అన్యులెవరు గోచరింపరు. నీవు శ్రీరామునితో నా మాటగ ఇట్లు చెప్పుము. రామా ! నీవు అయోధ్యను వీడు సమయమున లక్ష్మణుని వెంటనిడుకొని వెళ్ళినట్లే తిరిగి వచ్చు సమయమున లక్ష్మణునితో కలసి రావలయును. లక్ష్మణుడు లేనిదే నీవు అయోధ్యకు రారాదు.” పవనాత్మజునితో కౌసల్యా దేవి మాటలాడుచున్న సమయములోనే సేనాపతి యొక్క ఆదేశానుసారముగా అయోధ్యా నగర విశాల సైన్యము లంకను ముట్టడించుటకు సమావేశమయ్యెను. సముద్రమువలె గోచరించుచున్న ఆ సైన్యమును గాంఛి ఆంజనేయస్వామి ఆశ్చర్యచకితుడయ్యెను.


సర్వసైన్యాధిపతి లంక పై దాడి వెడలుటకు అనుజ్ఞ ఒసంగవలసినదిగ ప్రార్థింపదొడంగెను. వాని ప్రార్థనను విని కులగురువైన వశిష్ఠ మహర్షి ఇట్లు పల్కెను: “చక్రవర్తి యొక్క సైన్యము ఇట్లే ఉండవలెను. ధర్మోల్లంఘనము జరుగరాదు. ఈ పరిస్థితులలో శత్రుఘ్నుడైనను ఆ ప్రదేశము వెడలుట ఉచితముకాదు. ఇక ఈ సైన్యము మాట ఏమి? శ్రీ రఘునందనుడే ఒంటరిగా అవనిపైగల రాక్షసులను అందరిని సంహరించుటలో సర్వసమర్థుడు.


Sunday 27 February 2022

శ్రీ హనుమద్భాగవతము (173)



శ్రీరామచంద్రునకు జయము పల్కుచు ఆంజనేయుడు సచేతనుడయ్యెను. తన సమక్షమున ఉన్న భరతుని గాంచి తాను శ్రీరామచంద్రుని చెంతకు చేరితినని భావించెను. వెంటనే కపీశ్వరుడు భరతుని చరణారవిందములకు ప్రణామము ఒనరించి 'ప్రభూ! నేనెచ్చట ఉన్నా'నని అడిగెను. ఆనంద బాష్పములను తుడుచుకొనుచు భరతుడిట్లు పల్కెను. “మహా భాగా ! ఇది ఆయోధ్య! నీ పరిచయ భాగ్యమును గల్గింపుము.” 


ఆహా ఇది అయోధ్యయా! నేను పరమపావనమైన స్వామి యొక్క నగరమును చేరితినా ! నిత్యము నా ప్రభువు గుణగానం ఒనరించు భరతుడవు నీవే అని నాకు తోచుచున్నదని ఆంజనేయుడు పల్కెను.


“అవును నాయనా! అధముడనైన ఆ భరతుడను నేనే అని దుఃఖించుచు ఈ పాపాత్ముని కారణముననే రామచంద్రుడు పదునాల్గు సంవత్సరములు అరణ్యవాసం ఒనరించుటకు వెడలిపోయెను. నా కారణము వలననే మా తండ్రి పరలోకగతుడయ్యెను. జనక రాజకుమారి అనేక కష్టములలను అనుభవింపవలసివచ్చెను. దురాత్ముడనైన ఆ భరతుడను నేనే. శ్రీరామభక్తా ! నేడు నీ దర్శనముచే పవిత్రుడనైతివి. నీ పరిచయమును తెలిపి నన్ను కృతార్థునిగా నొనరింపుము" అని పలికెను. 


మరల ఆంజనేయుడు భరతుని పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను. "ప్రభూ! నేను శ్రీరామచంద్రుని దాసానదాసుడను; ఆంజనేయుడను. అంజనా దేవి నా తల్లి. దేవుడు నా తండ్రి. లంకాధిపతియైన రావణుడు జానకిని హరించి అశోక వాటికలో బంధించెను. ప్రభువు సముద్రము పై సేతునిర్మాణం ఒనరింపచేసి వానర భల్లూక సైన్యములతో లంకను చేరి యుద్ధమారంభించెను. నేడు మేఘనాథుడు ప్రయోగించిన శక్తిచే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. ఆయన కొఱకై సంజీవనిని తెచ్చుటకు నేను ద్రోణాచలమును చేరితిని. ఓషధులతో ప్రకాశించుచున్న ద్రోణాచలమును పెకలించి తెచ్చుచుంటిని. మార్గములో తమ దర్శనమగుట నా అదృష్టము. శ్రీరామచంద్రప్రభువు ఎల్లప్పుడు నీ గుణములను గానం ఒనరించుచుండును. నేడు నీ దర్శనముచే నేను కృతార్థుడనైతిని.


Saturday 26 February 2022

శ్రీ హనుమద్భాగవతము (172)



శ్రీరామనామమును ఉచ్చరించుచు వజ్రంగబలి ప్రసన్నుడై ద్రోణగిరిని చేరేను. ఆ పర్వతముపై అనేకములైన ఓషధులు ప్రకాశించుచుండెను. వానిలో సుషేణుడు చెప్పిన ఓషధులను వేఱుచేయుటెందులకని ఆలోచించి ద్రోణగిరినే పెకలించి గరుత్మంతునితో సమమైన భయంకర వేగముతో ఆకాశమునకు ఎగిరెను.


ద్రోణాచల సహితముగా వేగముగా ఆకాశములో ఆంజనేయుడు పయనించుచుండగా పెనుగాలి వీచుచున్నట్లు ధ్వనింప ఆకాశమున పయనించుచు శ్రీ ఆంజనేయుడు అయోధ్యను దాటుచుండెను. అయోధ్యా నగరమునకు ఆవల పర్ణకుటీరములో నివసించుచున్న శ్రీరామచంద్రస్మరణ పరాయణుడుడైన భరతుడు ఆకాశములో పయనించుచున్న భజరంగ బలిని గాంచెను. అసురుడెవడైన పర్వతమును ధరించి వచ్చుచున్నాడేమో అని తలచి భరతుడు మొనలేని బాణమును ధనువునందు సంధించి విడచెను.


ఆ బాణాఘాతమునకు 'శ్రీరామ, శ్రీరామ' అనుచు హనుమంతుడు మూర్ఛితుడై భూమి పైబడెను. సంజీవనీ పర్వతము మూర్ఛావస్థలో ఖూడా కదలకఉండెను.


ఆహా ! ఇతడు శ్రీరామచంద్రుని భక్తుని వలెనున్నాడేయని భరతుడు తలంచి కంపించెను. ఆంజనేయుడు మూర్ఛిల్లి ఉన్నను ఆయన ప్రతి రోమము శ్రీరామనామమునే పల్కు చుండెను.


జటాజూటాధారి, శ్యామలవర్ణుడైన భరతుని నేత్రములు అశ్రుపూరితములయ్యెను. ఆయన ఆంజనేయుని సచేతనునిగా ఒనరించుట అనేక ప్రయత్నముల ఒనరించి విఫలుడై తుదకు ఇట్లు పల్కెను. “దుర్లంఘ్యమైన ఏ విధి నన్ను శ్రీ రామచంద్రుని నుండి వేఱుపరచెనో అదియే నేడు ఇట్టి దుఃఖభరితమైన సంఘటనను గల్గించెను. కాని భగవంతుడైన శ్రీ రామచంద్రుని పావన చరణారవిందములందు నాకు విశుద్ధము, నిశ్చలమైన ప్రేమ ఉన్నచో శ్రీరఘునాయకుడు నా పై ప్రసన్నుడుగా ఉన్నచో ఈ వానర శ్రేష్ఠుడు పీడావిముక్తుడై పూర్వమువలె సచేతనుడు, సశక్తుడును అగు గాక !


Friday 25 February 2022

శ్రీ హనుమద్భాగవతము (171)



ఆంజనేయుడు జలాశయమును చేరి కపటముని చెప్పినట్లుగా జలములను త్రాగడం ఆరంభించెను. మహామాయావి ఘోరరూపిణియైన ఒక మొసలి ఆంజనేయుని పాదములను పట్టుకొనెను. నేత్రములను తెరచి తనను మ్రింగుటకు ప్రయత్నించుచున్న మకరిని గాంచి ఆంజనేయుడు కోపించి దాని ముఖమును చీల్చివేసెను. ఆ మకరి మరణించెను. 


మకరి శరీరములో నుండి ఒక దివ్యరూపధారిణియైన స్త్రీ బయల్వెడలి ఆకాశమున నిలచి ఆంజనేయుని అనేక విధముల స్తుతించి ఇట్లుపల్కెను. “కపీశ్వరా! నా పేరు ధాన్యమాలి. నేను శాపగ్రస్తురాలనైన ఒక అప్సరసను. అనఘా! నేడు నీకృపా విశేషముచే నేను శాపవిముక్తురాలనైతిని. పతితపావనా ! ఆశ్రమము కృత్రిమము. ముని వేషములో కాలనేమి అనే అసురుడు రావణుని ఆదేశానుసారముగా శ్రీ రామ కార్యమున విఘ్నములను ఒనరించుటకు ప్రయత్నించుచున్నాడు. దేవా! ఆ దుష్టుని సంహరింపుము. శ్రీఘ్రమే ద్రోణాచలమును చేరుము, పావనమైన నీ సంస్పర్శనముచే నేను కృతార్థురాలనై దివ్య లోకములకు పోవుచున్నాను, అనుజ్ఞనిమ్ము. 


ఇట్లు పల్కి ధాన్యమాలి అదృశ్యమయ్యెను. ఆంజనేయుడు కాలనేమి కడకు వెళ్ళగా మానవరూపములో నున్న అసురడు ఇట్లుపల్కెను. “వానరశ్రేష్ఠుడా! రమ్ము. నేనిపుడు మంత్రదీక్షను ఇచ్చెదను.” మంత్రిదీక్షా నెపముతో ఒక పెద్ద కార్యక్రమమును కల్పించి ఆంజనేయుని మాటలలో బెట్టి రాత్రి అంతయు గడుపవలయునిని అసురుడు ఆలోచించెను.


“ఋషివరా! మొదట దక్షిణను స్వీకరింపుము" అనిన ఆంజనేయుని వచనములను విని కపటజటాధారి ఆశ్చర్యచకితుడయ్యెను. వాడు ఆశ్చర్యములో నుండి తేరుకొను లోపలే పవనకుమారుడు వానిని తన వాలముతో బంధించి గగనమున కెత్తి భూమి పైగొట్టెను. అసురుడు శ్రీరామనామమును అచ్చరించుచు శిథిలశరీరమును వీడి సద్గతిని పొందెను. ఆహా ! భక్తుల ఆగ్రహము కూడ మానవుని ఉద్ధరింపగలదు. అయినచో అనుగ్రహమెంత ఉపకారం ఒనరింపగలదో గదా!


Thursday 24 February 2022

శ్రీ హనుమద్భాగవతము (170)



నీవు నా కమండలములో గల జలములను త్రాగుమని ముని పల్కగా ఆంజనేయుడు ఈ జలము తనకు చాలదని జలాశయమును చూపింపుడని పల్కెను. అది మునివర్యుని ముఖము మలినమయ్యెను. ఆంజనేయుని కార్యము ఆలస్యమగునట్లు అతడిట్లు పల్కెను. “కపీంద్రా! నాకంతయు అవగతమే. తపోబలముచే త్రికాలములను నేను గ్రహింపగలను. శ్రీరాముడు లంకాధిపతియైన రావణునితో యుద్ధం ఒనరించుచుండెను. ఇంద్రజిత్తుచే ప్రయోగించిన అమోఘమైన శక్తిచే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. కాని పవనకుమారా ! నీవిక ఆందోళనము చెందవలసిన పనిలేదు. లక్ష్మణుకు అచేతనుడై కుశలముగా ఉన్నాడు, కావున నీవిక వేగిరపడక మా ఆశ్రమమందు గల మధురఫలములను ఆరగించి, జలములను త్రాగి విశ్రమింపుము. తదనంతరం మరలిపోవచ్చును. 


ఆంజనేయుడు పల్కెను. మునిసత్తమా! దయతో మీరు జలాశయమునకు మార్గమును చెప్పుడు. శ్రీరామకార్యములో ఒక్క క్షణమైనను ఆలస్యమగుట నేను సహింపలేదు.


శ్రీరఘునాయకుని కార్యములో విఘ్నములను కలిగించుటకై రావణునిచే పంపబడిన కాలనేమి అనే రాక్షసుడే ఆ ముని వేషమును ధరించెను. వాని కమండలమునందు గల విషము వ్యర్థమయ్యెను. ముని రూపధారియైన ఆ మాయావి మఱల ఆంజనేయునితో ఇట్లు పల్కెను. "అపురూపమైనా ఆ ఓషధులు సామాన్యులకు దృష్టి గోచరములు గావు. అవి లుప్తములగును; కాని నేను నీకు సహాయమొనరించెదను. వెంటనే నీవు జలాశయములో జలములు త్రాగి స్నానమొనరించి రమ్మ. నీకు నేనొక మంత్రమును ఉపదేశించెదను. ఆ మంత్రప్రభావముచే ఓషధులు నీకు గోచరింపగలవు. అదిగో జలాశయము. నేత్రములను మూసుకుని జలములను త్రాగుము.”


Wednesday 23 February 2022

శ్రీ హనుమద్భాగవతము (169)



ఆంజనేయుడు ప్రళయంకరమైన తన స్వరూపమును ధరించుటకు సంసిద్ధుడయ్యెను; కాని లీలామానుషవిగ్రహుడైన శ్రీరఘునాయకుడు మనప్యోచితమగు ఆచరణము ఒనరింపవలయును. రుద్రావతారుని ఈ ఆవేశమును చూచి శ్రీరాముడు చింతించెను. విభీషణుని ప్రేరణచే మహాబుద్ధిమంతుడైన జాంబవంతుడు ఇట్లు పల్కెను. “పవనకుమారా! నిస్సందేహముగా నీవు సర్వము ఒనరింపగలవు. నీకేదీ అసంభవము కాదు. కాని నీవు ఇట్లు చేయవలసిన పనిలేదు. మొదట మహావైద్యుడైన సుషేణుని తోడ్కొనిరమ్ము. ఆయన చేయు చికిత్సచే నిశ్చయముగా లక్ష్మణుడు రక్షింపబడగలడు. సుషేణుడు అఱుదెంచి లక్ష్మణుని పరీక్షించెను. తగిలిన దెబ్బ బలమైనదని సూర్యోదయమునకు పూర్వమే సంజీవనిని తెచ్చినచో లక్ష్మణున కెట్టి ఆపద సంభవింపదనీ సుషేణుడు పల్కెను. తన ఎదుట విచార ముద్రలో నిలబడియున్న పవనకుమారుని గాంచి సుషేణుడు ఇట్లు పల్కెను. “మహాపరాక్రమవంతుడా! ఆంజనేయా ! ఈ మహాకార్యము నీవలననే సంపన్నము కావలయును, నీవు శీఘ్రమే హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళు, అత్యంతోన్నతములైన ఆ పర్వతపంక్తులలో ఉన్నతోన్నతముగా కైలాసశిఖరము, వృషభ శిఖరము విరాజిల్లుచున్నవి. ఆ రెండు శిఖరముల మధ్య అత్యంతదీప్తివంతమైన ద్రోణశిఖరమును దర్శింపగలవు. ఆ పర్వతరాజము సకలౌషధులకు ఆలవాలము - సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధాని అను మహౌషధులు సదా ప్రకాశించుచుండును. మహావీరా ! ఆ ఓషధులను శీఘ్రమే తెచ్చి లక్ష్మణునకు ప్రాణదాన ఒనరింపుము. వీరవరా ! ఓషధులు సూర్యోదయమునకు పూర్వమే ప్రయోగింపవలయును, సూర్యోదయమైన పిమ్మట సుమిత్రానందనుని రక్షించుటసంభవము కాగలదు.”


'జయ శ్రీరాం’ అని గర్జించి శ్రీ రాఘవేంద్రుని చరణారవిందములకు నమస్కరించి అంజనానందనుడు వాయు వేగముతో ఆకాశమునకు ఎగిరెను. క్షణములో హిమాలయ పర్వత పంక్తులను చేరెను. ఆ ప్రాంతములో అతి సుందరమైన ఒక తపోవనమును గాంచెను. యోజనవిస్తృతమైన ఆ తపోవనములో మధుర ఫల భరితమైన అనేక వృక్షములు కలవు. ఆశ్రమములో ఒక మునివర్యుడు శంకరుని పూజించుచుండెను.


ఆంజనేయునకు దప్పిక కల్గెను. ఈ ఆశ్రమములో జలములను స్వీకరించి ద్రోణగిరికి పయనము కావలయునని సంకల్పించి మహర్షికి నమస్కరించి ఇట్లు పల్కెను. “మునివరా! భగవంతుడైన శ్రీ రామచంద్రుని దూతను. పవన పుత్రుడనైన ఆంజనేయుడను. తమకు నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని కార్యార్థినై పోవుచున్నాను. దప్పికగొని ఉన్నాను. జలాశయమెచ్చట ఉండునో తెలుపవలసినదిగా ప్రార్థించుచున్నాను." -

Tuesday 22 February 2022

శ్రీ హనుమద్భాగవతము (168)



అదే సమయములో ఆంజనేయుడు మఱియొక వైపు రాక్షససంహారము చేయుటలో సంలగ్నుడైయుండెను. లక్ష్మణుడు మూర్ఛిల్లెననెడివార్త తెలియగానే ఆంజనేయుడు సాక్షాత్తుగా యమునివలె భయంకరుడయ్యెను. ఆయన నేత్రములనుండి అగ్నిజ్వాలలు బయల్వెడలెను, క్షణములో ఆ అసుర సమూహములను సర్వనాశనమొనరించెను. మిగిలినవారు ప్రాణములను అర చేతబట్టుకొని పారిపోయిరి. ఆంజనేయుడు పరుగున లక్ష్మణుని చేరి ఆయనను తనభుజములపైకి ఎత్తుకొనెను. సుందరుడైన సుమిత్రానందనుని ముఖారవిందము మూర్ఛచే మలినమగుట గాంచి వజ్రాంగబలి నేత్రములు అశ్రుపూరితములయ్యెను.


సంధ్యాసమయమయ్యెను. రాక్షస వానర వీరులు యుద్ధము చాలించిరి. శ్రీరఘునందనుడు లక్ష్మణుని గూర్చి ఆలోచించుచుండగానే ఆంజనేయుడు లక్ష్మణుని తన భుజములు పై నిడుకొని ఆ ప్రదేశమును చేరెను. మూర్ఛితుడైయున్న సుమిత్రాకుమారుని ప్రభువు సమక్షములో పరుండబెట్టెను. శ్రీరామానుజుడు మూర్ఛితుడగుట చూచి శ్రీ రామచంద్రుడు హృదయవిదారకముగా దుఃఖింపసాగెను. వానర భల్లూక వీరులందఱు కరుణామయమైన ఆ దృశ్యమును గాంచి చింతామగ్నులైరి.


శ్రీరామచంద్రుడే ధైర్యమును వదలి చింతించుట చూచిన పవనకుమారునినేత్రములు సజలములయ్యెను; కాని ఈ విషమపరిస్థితిలో అందరిని ఊరడింపగల బాధ్యత ఆంజనేయుని పైనుండెను. కావున ఆ మహానుభావుడు మనస్సును దృఢం ఒనర్చుకొని అందఱిని ఉత్సాహపరచుచు ఇట్లు పల్కెను. "ప్రభూ ! నేనుండగా మీరు లక్ష్మణుని కొఱకై చింతింప పనిలేదు. నీ ఆజ్ఞ ఉన్నచో స్వర్గమునుండి అమృతమును తెచ్చెదను. సుమిత్రానందనుని రక్షించుటకు నాగ లోకమునకైనను వెడలి అమృతమును తెచ్చి లక్ష్మణుని పునర్జీవితుని చేసెదను. రామచంద్రా ! నీ అనుజ్ఞ యైనచో ధ్వంస మొనరించెదను. ఇక లక్ష్మణుని కొఱకై మీ ఆందోళన సమసిపోగలదు. సర్వప్రాణులు మృత్యు భయమునుండి విముక్తులయ్యెదరు.

Monday 21 February 2022

శ్రీ హనుమద్భాగవతము (167)



రథము, సారథి, అశ్వములు తుదకు తాను కూడా ఆ పర్వత శిఖరము క్రిందపడి నశించియుండేడివాడు. ఆంజనేయుడు ఎన్ని పర్యాయములు దంద్వయుద్ధమునకై మేఘనాథుని ఆహ్వానించినను రావణపుత్రుడు దూరముగా తొలగి యుద్ధము చేయుచుండెను. పవనకుమారునితో యుద్ధమొనరించుట మృత్యువును వరించుటకన్న తక్కువేమి కాదని వానికి బాగా తెలుసు. 


మేఘనాథునకు, లక్ష్మణునకు భయంకరమైన యుద్ధం ఆరంభమయ్యెను. ఇంద్రజిత్తు సౌమిత్రిపై అనేక శస్త్రాస్త్రములను ప్రయోగించెను; కాని అవి అన్నియు వ్యర్ధములయ్యెను. అసురుడు\ తుదకు అవినీతికరమైన యుద్ధమునకు పాల్పడెను.


శ్రీరామానుజుడు కోపోద్దీపితమానసుడై తీవ్రము బాణములను ప్రయోగించి వాని రథమును చూర్ణమొనరించి సారథిని సంహరించెను.


రావణకుమారుడు క్రోధోన్మత్తుడై లక్ష్మణుని సంహరింపవలెనని అనేక విధముల అధర్మయుద్ధము చేయ యత్నించెను. వాని ప్రయత్నముల నన్నిటిని లక్ష్మణుడు విఫలమొనరించి అసంఖ్యాకమైన తీక్ష బాణములచే వానిని బాధించెను. మేఘనాథుని ధైర్యము సడలెను. తన్ను తాను రక్షించుకొనుటకు మఱియొక మార్గమును గానక క్రూరుడైన ఆ అసురుడు సౌమిత్రిఫై బ్రహ్మప్రదత్తమైన అమోఘమైన శక్తిని ప్రయోగించెను. అత్యంత తీవ్రగతితో ఆ మహాశక్తి బయలు దేరి సుమిత్రానందనుని వక్షస్థలమును చీల్చి అదృశ్యమయ్యెను. రక్తధారలు ప్రవహించుచుండగా లక్ష్మణుడు అచేతనుడై పృథ్విపై పడెను.


లక్ష్మణుడు మూర్ఛిల్లగానే మేఘనాథుడు లక్ష్మణుని అపహరించుటకు బయలుదేరెను. ఆ అసురుడు, బలవంతులైన పెక్కండ్రు రాక్షసులు లక్ష్మణుని కదల్చుటకు తమ శక్తియుక్తులతో ప్రయత్నించిరి; కానీ ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని వారు ఇసుమంతైనను కదల్చలేకపోయిరి, హతాశులై వారు మరలిపోయిరి.

Sunday 20 February 2022

శ్రీ హనుమద్భాగవతము (166)



రావణుడు తెప్పరిల్లినవాడై మహావీరులైన వానరులపై దాడి చేయుచు వారిని వధింపసాగెను. అది చూచి శ్రీరాఘవేంద్రుడు రావణునితో తలపడుటకు బయలుదేరెను. భగవంతుడైన శ్రీరామునకు అనన్య సేవకుడైన పవనాత్మజుడు ప్రభువు కడకు వెడలి ఇట్లు నివేదించెను.


శ్లో॥ మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తు మర్హసి । 

విష్ణుర్యథా గరుత్మంతమారుహ్యామర వైరిణమ్ | (వా. రా. 6.59.124)


ప్రభూ ! భగవంతుడైన విష్ణువు గరుత్మంతుని భుజస్కంధములపై ఎక్కి దైత్యులను సంహరించినట్లు నీవు నా భుజములపై అధిరోహించి ఈ రాక్షసులను వధింపుము.


ఆంజనేయుని ప్రార్థనను మన్నించి శ్రీరామచంద్రుడు ఆయన భుజస్కంధముపై ఆసీనుడయ్యెను. లక్ష్మణుడు కూడా ఆంజనేయుని భుజముపై ఆశీనుడయ్యెను. ఇట్లు మహావీరుడైన ఆంజనేయుడు యుద్ధభూమియందు ప్రముఖపాత్ర వహించెను. ఎందఱో రాక్షసులు ఆంజనేయునిచే సంహరింపబడి ముక్తులైరి. యుద్ధభూమిలో రాక్షసులకు హనుమంతుడు ప్రళయకాల రుద్రునివలె గోచరించెను, కాని ఆయన హృదయములో రాక్షసులపై అపారమైన కరుణ కలదు. ఆయన కొందఱు రాక్షసులను ప్రభువు సమ్ముఖమునకు గొని తెచ్చి సంహరించుచుండెను. అట్లు సంభవము కానిచో శ్రీ రామనామ ముచ్చరించుచు వారిని వధించుచుండెను. శ్రీరామదర్శనముచే శ్రీరామనామ శ్రవణముచే పవిత్రులై రక్కసులు అక్షయము, సుఖశాంతినికేతనమైన పరంధామమునకు చేరుచుండిరి.


సంజీవనిని తెచ్చుట


అసురులకు, వానరులకు సంగ్రామము భయంకరముగా సాగుచుండెను, రణరంగములో మేఘనాథుడు ప్రవేశించెను. లక్ష్మణుడు ధనుర్భాణములను ధరించి వానిని నిలువరించెను. పరస్పరము ఘోరసంగ్రామ మొనరింపసాగిరి. ఇంద్రజిత్తు బాణములను వర్షమువలె కురిపించి వానర భల్లూక వీరులను అధీరులుగా ఒనరింపసాగెను. మేఘనాథుని గర్జనములను విని, పరాక్రమమును గాంచి ఆంజనేయుడు వానిపై విశాలమైన ఒక పర్వ శిఖరమును ప్రయోగించెను. ప్రాణములను రక్షించుకొనుటకు ఆ నిశాచరుడు రథసహితముగా ఆకాశమునకు ఎగిరెను. 

Saturday 19 February 2022

శ్రీ హనుమద్భాగవతము (165)



ఇట్లా పవనాత్మజుడు ప్రచండవీరుడై రాక్షసవీరులను తన తీక్ష్ణమైన నఖములచే చీల్చి చెండాడెను. దైత్యుల రక్తముచే ఆంజనేయుని శరీరమంతయు అరుణవర్ణముగా ప్రకాశింపనారంభించెను. ఆ రక్తరంజనుని గాంచి స్వయముగా రావణుడే భయముతో కంపించెను. లక్ష్మణుడు ఒనరించిన శరవర్షముచే రావణుని శరీరమంతయు విదీర్ణమై రక్తము ప్రవహింప నారంభించెను. రాక్షసరాజు కోపించి బ్రహ్మదేవునిచే ప్రదత్తమైన అద్భుతమైన శక్త్యాయుధమును సుమిత్రానందనుని పై ప్రయోగించెను. ఆ శక్తి శ్రీరామానుజుని విశాల వక్షఃస్థలమును విదీర్ణమొనరించి అదృశ్యమయ్యెను. లక్ష్మణుడు క్షత గాత్రుడై భూమి పైబడెను.


రావణుడు ప్రసన్నుడై లక్ష్మణుని సమీపించి వాని నెత్తుటకు ప్రయత్నింపసాగెను. శివుని కైలాసపర్వతమునే పెకలించిన రావణుడు నేడు లక్ష్మణుని శరీరమును కదల్చనైనను కదల్చలేకపోయెను, ఆంజనేయుడు ఆ ప్రదేశమునకు ఏతెంచి జరిగి నది గాంచి కోపోద్దీపితమానసుడై రావణునివక్షఃస్థలము పై ముష్ఠిఘాత మొనరించెను.


ఆ ఆఘాతమునకు రావణుడు కంపించెను. పృథ్విపై మోకాళ్ళపై బడి, ముఖమునుండి నేత్రములనుండి కర్ణములనుండి రక్తము ప్రవహించెను. గిలగిలకొట్టుకొనుచు వివశుడై తన రథపృష్ఠ భాగమునకు పరుగిడి మూర్ఛితుడయ్యెను. కొట్టుకొనుచు ఆంజనేయుడు సుమిత్రానందనుని లేవనెత్తుకొని శ్రీరామచంద్రుని చెంతకు చేరెను. శత్రువులు కదల్పజాలని శేషావతారుడైన లక్ష్మణుడు పరమభక్తుడైన ఆంజనేయునకు సులభముగా తోచెను. పావనమైన శ్రీ రామచంద్రుని కరస్పర్శచే లక్ష్మణుడు మూర్ఛ నుండి లేచెను.


Friday 18 February 2022

శ్రీ హనుమద్భాగవతము (164)



ఆంజనేయుడు ఇట్లు ప్రత్యుత్తరం ఒసంగెను. “రాక్షస రాజా! నీకు ప్రాణ సమానుడగు అక్షయకుమారుడు నాచేతిలో మరణించుట మరచితివా ?"


శ్రీ హనుమంతుడిట్లు పలుకగానే రావణుని హృదయము మండెను. అతడు వెంటనే పవనాత్మజుని వక్షఃస్థలముపై తన సర్వశక్తిని కూడదీసికొని ముష్టిఘాత మొనరించెను.


బలపరాక్రమ సంపన్నుడు, మహా తేజస్వియైన రావణుని ముష్టి ఘాతముచే శ్రీహనుమంతుడు ఒక్క క్షణము చలించెను, కాని బుద్ధిమంతుడు, తేజస్వీయైన ఆ వానర వీరుడు మరుక్షణమందే సుస్థిరుడై రాక్షసరాజుపై వజ్రముష్టి ఘాత మొనరించెను.


పరాక్రమవంతుడు, వజ్రాంగుడు, మహావీరుడైన ఆంజనేయుని వజ్రముష్టిఘాతముచే రావణుడు కంపించెను. కొన్ని క్షణముల పిమ్మట అతడు తన్ను తాను సంబాళించుకొని సాధు సాధు వానరవీరా! పరాక్రమములో నాకు నీవు ప్రశంసనీయమైన ప్రతీద్వంద్వివి.


వీరవరుడగు పవనకుమారుడిట్లు ప్రత్యుత్తరమొసంగెను. 'ఓరీ! రావణా!


శ్లో॥ దిగస్తు మము వీర్యస్య యత్ త్వం జీవిత రావణ


(వా. రా. 6–59–67)


"నీవు ఇంకను జీవించియే ఉన్నావు. కావున నా పరాక్రమమునకు ధిక్కారము. నీవు మరియొక పర్యాయము నాపై ప్రహారమొనరింపుము. తదుపరి నేను నీపై ముష్టిఘాత మొనరించెదను. నీవు యమలోకమునకు పోవుట నిశ్చయము.


మర్కటాధీశుని వాగ్బాణములచే రాక్షసరాజైన రావణుడు కోపించినవాడై ఆంజనేయుని వక్షఃస్థలముపై తీవ్రముగా గ్రుద్దెను.


రావణుడు ఒనరించిన ఆ ఆఘాతముచే హనుమంతుడు మరల క్షణకాలము విచలితుడయ్యెను. ఆ క్షణమందే రావణుడు తనరథమును ఆ ప్రదేశమునుండి తప్పించి వానర సైన్యాధిపతియైన నీలునితో తలపడెను. రావణుడు శ్రీరామచంద్రునిచే మరణించుట విధివిధానమని ఎఱింగిన మారుతి వానిని వదలివేసెను.


Thursday 17 February 2022

శ్రీ హనుమద్భాగవతము (163)



నేరేడు పండ్లతో కొట్టిన గజరాజుపై ఎట్టిప్రభావముపడునో అట్లు ఆ మహాకాయుని కాయము అట్లుండెను, వానర భల్లూక వీరులు ఆ పర్వతాకారుని గాంచి భయమునొందిరి. అదే సమయములో ఆ ప్రదేశమునకు హనుమంతుడు వచ్చెను. అతడు కుంభకర్ణునిపైకి దుమికి వానిని పిడికిళ్ళతో కొట్టసాగెను. ఆ రుద్రావతారుని వజ్రముష్టిప్రహారములచే కుంభకర్ణుడు వ్యాకులుడై పృథ్విపైబడి నెత్తురుగ్రక్కెను. కుంభకర్ణుని మృత్యువు శ్రీరామచంద్రునిచే సంభవింపవలసియున్నది గావున, ఆంజనేయ వానిని వదలివేసెను. కుంభకర్ణుడు ఒకనాడు భీకరయుద్ధమొనరించి భగవంతుడైన శ్రీ రామచంద్రుని శరమునకు అసువులను అర్పించి ముక్తుడయ్యెను.


కుంభకర్ణుని మరణ వార్త రావణుని వివశునిగా చేసింది, అతడే స్వయముగా రణరంగమునకు వెళ్ళాడు. వాని హస్తమున అమితభయంకరము, దీప్తిమంతముమైన ధనువుండెను. ఆతడు తీక్షణశరవర్షముచే వాసర సైన్యమును నొప్పించెను. అపుడు వజ్రాంగుడు, మహాబలవంతుడైన హనుమంతుడు రావణుని సమ్ముఖమునకు వచ్చినవాడై తన దక్షిణకరమును ఎత్తి చూపుచు రావణుని భయాక్రాంతునిగా చేయుచు ఇట్లు పలికెను.


శ్లో|| ఏవ మే దక్షిణో బాహుః పంచశాఖాః సముద్యతః 

విధమిష్యతి తే దేహే భూతాత్మానాం చిరోషితమ్. 

( వా. రా. 6.59–56) 


‘రావణా! ఐదు వేళ్ళతో గూడిన నా దక్షిణ కరమును చూడుము. చిరకాలమునుండి నీ శరీరములో నివసించు జీవుని నా ఈ కరఘాతము నీ దేహమునుండి వేరుచేయును.’

పరమపరాక్రమవంతుడైన రావణుడు కోపించినవాడై ఇట్లు పల్కెను. “వానరా! నీవు నిశ్చింతగా నాపై ప్రహారం ఒనరింపుము. నీవు ఎంతటి పరాక్రమవంతుడవో చూచి నేను నీ ప్రాణములను హరించెదను”.


Wednesday 16 February 2022

శ్రీ హనుమద్భాగవతము (162)



బాణవిద్ధుడైన జాంబవంతుడు అధిక కష్టముతో ఇట్లు ప్రత్యుత్తరమొసంగెను.


శ్లో॥ అస్మిన్ జీవతి వీరో తు హతమమప్యహతం బలమ్ 

హనూమత్యుజ్ఞితప్రాణే జీవనోఒపి మృతా వయమ్ | 

ధరతే మారుతిస్తాత మారుతప్రతి మో యది  

వైశ్వానరసమో వీర్యే జీవితాళా తతో భవేత్ (వా. రా. 6.73.22, 23)


రాక్షసరాజా! వీరవరేణ్యుడైన ఆంజనేయుడు సజీవుడై ఉన్నచో వానర సైన్యము మరణించినను జీవించియున్నట్లె. ఆయన ప్రాణములు పోయినచో మేమందరము జీవించి ఉన్నను మరణించినవారమే అని తెలిసికొనుము. సమాన వేగవంతుడు, అగ్ని సమాన పరాక్రవంతుడు జీవించి ఉన్నచో మేమందఱము జీవించినట్లే యని ఆశింపవచ్చును.


అదే సమయములో ఆంజనేయుడు ఆ ప్రదేశమునకు వచ్చి వృద్ధవీరుడైన జాంబవంతుని రెండుపాదములను స్పృశించుచు వినయపూర్వకముగా నమస్కరించెను. మారుతాత్మజుని సంస్పర్శము కలుగగానే అస్త్రములచే పీడింపబడు జాంబవంతుని ముఖము ప్రకాశింపసాగెను. ఆయన ఆంజనేయునితో ఇట్లు పల్కెను.


శ్లో॥ ఆగచ్ఛ హరి శార్దూల వానరాంస్త్రాతుమర్హసి || 

నాన్యో విక్రమపర్యాప్త స్త్వమేషాం పరమః సభా ! 

త్వత్పరాశ్రమకాలోఽయం నాన్యం పశ్యామి కంచన |



వానరసింహమా! రక్షిం రమ్ము. వానరులనందఱిని రక్షింపుము. నీవు తప్ప అన్యులెవ్వరును పరాక్రమవంతులు కారు. నీవే వీరందరకు పరమసాహాయ్యకుడవు. నీవు పరాక్రమించుటకు ఈ సమయము తగియున్నది. మఱియొక్కరు దీనికి యోగ్యులుగా నాకు గోచరించుట లేదు.


కరాళ కాలసదృశుడు, కాటుక కొండ వంటి శరీరము కలవాడైన కుంభకర్ణుడు రావణుని ప్రేరణచే రణరంగమున ప్రవేశించెను. వానిని గాంచగనే వానర భల్లూక వీరులు మహా వృక్షములను, పర్వతములను పెకలించి ఆ మహాకాయునిపై విసరడం ఆరంభించిరి. ఒక్కొక్క పర్యాయము వారు కోట్లాది పర్వత శిలలనుకుంభకర్ణునిపై ప్రయోగించిరి; కాని అతడు కించిత్మాతమైనను చలింపలేదు. 

Tuesday 15 February 2022

శ్రీ హనుమద్భాగవతము (161)



ఆంజనేయుని రణకౌశలమును గుఱించి, పరాక్రమమును గుఱించి ఇంద్రజిత్తునకు బాగుగా తెలియును. ఆంజనేయుడున్న భయము చెందినవాడై మేఘనాథుడు ఆ మహావీరునితో తలపడకుండ దూరముగా ఉండి యుద్ధమొనరించుట ఆరంభించెను.  


ఇంద్రజిత్తు వానర సైన్యమును సంహరించుట ఆరంభించెను. వాని బాణవర్షమునకు సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, సుషేణుడు, మైందుడు, వేగదర్శనుడు, నలుడు, జ్యోతిర్ముఖుడు, దివిదుడు మున్నగు వానరవీరులందఱు క్షతగాత్రులైరి. మేఘనాథుడు 'శ్రీరామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి ప్రయోగింపగా వారిర్వురు మూర్ఛితులైరి.


క్షతగాత్రులై పడియున్న వానర సైన్యమును గాంచి విహ్వలుడై విభీషణుడు జాంబవంతుని సమీపించెను. మేఘనాథుని శరములచే విదీర్ణుడై పడియున్న జాంబవంతుని చూసి ఇతడు జీవించియున్నాడా లేదా అను సంశయము కలుగగా హస్తముతో అతని విశాలమైన కాయమును నిమురుచు కుశలమును అడిగెను. అపుడు జాంబవంతుడు ఇట్లు బల్కెను. “రాక్షస రాజా! నా శరీరమంతయు ఇంద్రజిత్తుని శరములచే విదీర్ణమైనది. కన్ను తెరచి నేను చూడలేక పోవుచున్నాను. కేవలము నీ స్వరమును విని నీవు విభీషణుడువని గుర్తించితిని. అంజనీనందనుడగు హనుమంతుడు సజీవముగా ఉన్నాడో లేదో తెల్పుము.


జాంబవంతుని ప్రశ్న విని పరమాశ్చర్యచకితుడై విభీషణుడు ఋక్ష రాజా! వానరరాజైన సుగ్రీవుని, యువరా జైన అంగదుని కుశలసమాచారమును అడుగక, భగవంతుడైన శ్రీరామచంద్రుని, శ్రీ రామానుజుని కుశలసమాచారమును కూడా అడుగక పవనాత్మజుడైన ఆంజనేయుని క్షేమము అడుగుచు ఆతనిపై అధికమైన ప్రేమను కనబరచుచున్నావు. ఇందులకు కారణమేమి అని ప్రశ్నించెను.


Monday 14 February 2022

శ్రీ హనుమద్భాగవతము (160)

 


ఏఏ ప్రదేశములలో వానర సైన్యముపై అసురుల ప్రభావం అధికముగా ఉండునో, ఆయా ప్రదేశములలో 'శ్రీరాం, జయ శ్రీరాం'అని గగనమండలము భేదిల్లునట్లుగా జయజయధ్వానముల ఒనరించుచు ఆంజనేయుడు రాక్షసులపై దుముకుచుండెను. ఆ మహావీరుని అఘాతమునకు రాక్షస సమూహములు నశించుచుండెను. రథ సహితముగా అసురు వీరులను, ఆకాశములోనికి వేగముగా విసరివేయుచుండెను. వారు రథసహితముగా గిరగిర తిరుగుచూ సముద్రములో పడి మరణించుచున్నారు. అసురులను బట్టి సముద్రములో విసరివేయుచుండెను. ఇట్లు త్వరితగతితో శ్రీ ఆంజనేయుడు లక్షలాది అసురవీరులను సంహరించుచుండెను. ఆయన చిన్న చిన్న వృక్షములను శిలలను స్పృశింపనైన స్పృశింపడు. గగనముకు ఎగిరి సమీపములో నున్న పర్వతములను పెకలించి విద్యుద్గతితో మరలివచ్చి అసురసమూహముల పై పడవేయుచుండెను. ఆంజనేయునిచే పర్వతశిలాఖండములు కొన్ని నేరుగా పోయి లంకలో పడుచుండెను. రణరంగములో అంతట అసురులు ‘త్రాహి, త్రాహి, అనుచు పలాయన మొనరించుచుండిరి.


కుమారుడైన ఆంజనేయుడు రణరంగములో అవిశ్రాంతముగా అసంఖ్యాకులైన రాక్షసులను భయంకరముగా సంహరించుచుండుట గాంచి మిగిలిన రాక్షసులు రావణుని నాశనము నిశ్చయమని తలపోయుచుండిరి. ఇందుగలడందులేడనునట్లు ఆంజనేయుడు రణరంగమంతయు వీరవిహార మొనరించుచుండెను. రాక్షసుల ప్రభావమును నాశమొనరించుచు 'వానర సైన్యములను ఉత్సాహపరచుచుండెను. ప్రతి వానరుడు ఆంజనేయుడు తన ప్రక్కనే ఉండి యుద్ధమొనరించుచున్నట్లుగా తలంచుచుండిరి. ప్రతి రాక్షసుడు ఆంజనేయుడు తమ ఎదుట నుండి యుద్ధమొనరించుచున్నట్లుగా భ్రమపడుచుండిరి.


దైత్య సైన్యములో ప్రఖ్యాత సైన్యాధిపతులైన ధూమ్రాక్షుడు, అవినయుడు, అకంపనుడు, అతికాయుడు, దేవాంతకుడు, త్రిశరుడు మొదలైన వారందఱు ఆంజనేయునిచే సంహరింపబడిరి. ఈ సమాచారం అందగానే రావణుని ధైర్యము సన్నగిల్లెను. వజ్రాయుధధారియైన ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు తన తండ్రియైన రావణును ఊరడించెను. మేఘనాథుడు తండ్రికి నమస్కరించి వివిధ ఆయుధములతో సంపన్నమై ఉన్న వేగవంతము, విశాలమైన రథమును అధిరోహించి రణరంగమునకు ఏగెను.


Sunday 13 February 2022

శ్రీ హనుమద్భాగవతము (159)



అందఱు తమతమ బుద్ద్యనుసారముగా వివరించిరి. తుదకు ఆంజనేయుడు ఇట్లు పల్కెను. "పరమపావనా! చంద్రుడు నీకు ప్రియుడైన దాసుడు, నీ సుందరమైన శ్యామలమూర్తి వాని హృదయములో విరాజమానమైయున్నది. ఆ శ్యామల వర్ణమే ఆ సుధాంశునినుండి బయల్వెడలుచున్నది. 


సత్యమేమనగా పవనతనయుని రోమరోమమందు తన ప్రాణారాధ్యుడైన శ్రీరామచంద్రుడే విరాజమానుడై ఉన్నాడు. కావుననే అంతట ఆ రాముని దర్శనమును ఆంజనేయుడు సదా పొందుచుండెను. చంద్రునిలో కూడా శ్రీరామచంద్రునే దర్శించుట ఆ అనన్యరామభక్తుని సహజస్వభావము.


దో॥ కహ హనుమంత సునహు ప్రభు ససి తుంహార ప్రియదాస | 

తవ మూరతి బిధు ఉర బసతి సోఇ శ్యామతా అభాస (మానసము 6–12)


సమరాంగణములో శ్రీ ఆంజనేయుడు


శ్రీరామచంద్రుడు తన మంత్రియైన జాంబవంతునితో ఆలోచించి దశకంఠుని చెంతకు రాయబారిగా అంగదుని పంపెను. అంగదరాయబారము తిరస్కరింపబడెను. యుద్ధము ప్రారంభమయ్యెను. రాక్షసులు మహామాయావులు. వారు ఖడ్గము, శూలము, పరశువు, శక్తి, తోమరము, గద మొదలగు ఆయుధములతో ధనుర్భాణములతో వివిధశస్త్రాస్త్రములతో యుద్ధ మొనరింపసాగిరి. వారు మహావీరులు, పరాక్రమవంతులు . రణరంగచతురులు. పరాజయము సంభవించెడిస్థితి ఉత్పన్నమైనచో వారదృశ్యులయ్యెదరు. ఆకాశము నుండి ధూళిని, అస్థికలను, రక్తమును కురుపించుచుండిరి. వానర సైన్యము వ్యాకులమగుట గాంచి మాయాపతి యగు శ్రీరాముడు ఒకే ఒక శరముతో రాక్షసమాయను వినాశమొనరించెను. వానర భల్లూక యోధులు అత్యధికోత్సాహముతో యుద్ధ మొనరింపసాగిరి.


Saturday 12 February 2022

శ్రీ హనుమద్భాగవతము (158)



కుతూహలముగలవాడై శ్రీరఘునందనుడు కొన్ని శిలాఖండములను సముద్రములో పడ వైచెను; కాని అన్నియు మునిగిపోయెను. అపుడాయన “నీటిపై శిలలు తేలుట ఎట్లు సంభవము! నేనే నా హస్తములతో సముద్రములో శిలలను పడవేయగా తేలుటకు బదులు అవి మునుగుచున్నవి. కారణమేమి” అని ప్రశ్నించెదను.


- వానర భల్లూక యోధులందఱు పరమాశ్చర్యచకితులై ఒకరిముఖములను ఒకరు చూచుకొనడం ఆరంభించారు.


జగన్నాథుడగు శ్రీరామచంద్రునకు అనన్యభక్తున శ్రీపవనాత్మజుడు ముకుళితహస్తుడై ఇట్లు ప్రత్యుత్తరం ఒసగెను. “జగదాధారా! నీవు నీ కరకమలముల నుండి వదలిన పదార్థములు సహజముగానే మునిగిపోవును. వృక్షము నుండి వేరయిన కొమ్మ నశించునట్లు నిన్ను వీడినవారు అధోగతి పాలయ్యెదరు. నీ ఆధారము లేని ప్రాణికి గతి ఎక్కడ". ఇది విని శ్రీ రామచంద్రుడు మందహాసము చేసెను.


వానర భల్లూక వీరులతో నిండిన మహా సైన్యమును తోడ్కొని శ్రీరామచంద్రుడు వారధిపై పయనించి లంకను చేరెను. సువేలపర్వతము చెంత శ్రీరాముని సైన్యము విడిది చేసెను. ఉన్నతము, సుందరము, సమతలమునైన శిఖరము పై వృక్షముల యొక్క కోమల పత్రములచే ఒక ఆసనమును సుమిత్రానందనుడు ఏర్పరచి దానిపై సుందర మృగ చర్మమును పఱచెను. ఆ ఆసనముపై కరుణావతారుడైన శ్రీరామ ప్రభువు వానరరాజైన సుగ్రీవుని ఒడిలో తలవంచుకొని శయనించెను. ఆయన ఎడమవైపు విశాలమైన ధనువుండెను, కుడి వైపు అక్షయతూణీరములుండెను. ప్రభువు ఒక దీప్తిమంతమైన తీక్షణతమమైన శరమును తన కరకమలములతో నిమురు చుండెను. భాగ్యవంతుడైన విభీషణుడు రామభద్రుని పరామర్శించుచుండెను. అదృష్టవంతులైన ఆంజనేయుడు, అంగదుడు ప్రభువుయొక్క చరణకమలములను మెల్లమెల్లగా నొక్కుచు ఆ దివ్య ముఖారవిందమును దర్శించుచుండిరి. వీరవరుడైన సౌమిత్రి ధనుర్భాణములను ధరించినివాడై ప్రభువు చెంత వీరాసనములో సావధానుడై కూర్చుండియుండెను.


అదే సమయమందు ఆకాశములో ఉదయించిన చంద్రుని గాంచినవాడై శ్రీరామచంద్రుడు 'మీ మీ బుద్ధ్యనుసారముగా చంద్రునిలో ఈ శ్యామవర్ణ మెట్లు ఏర్పడెనో వివరింపు' డని పలికెను. 

Friday 11 February 2022

శ్రీ హనుమద్భాగవతము (157)



శ్రీగోవర్ధన పర్వతము పరమానంద భరితుడయ్యెను. వాని నేత్రముల నుండి ప్రేమాశ్రుధారలు స్రవించెను. అతడత్యంతవినయపూర్వకముగా శ్రీరామభక్తుడగు ఆంజనేయునితో ఇట్లుపల్కెను. “పవనాత్మజా! నీవు ఒనరించిన ఈ మహోపకారమునకు ప్రత్యుపకారము చేయగలస్థితి నాకు లేదు; కావున నేను సదా నీకు ఋణపడియండెదను.”         

యుగయుగములనుండి శ్రీగోవర్ధనపర్వతము సకలజనులచే పూజింపబడుచుండెను. విరక్తులగు మహాత్ములు, భక్తులు, శ్రద్ధాభక్తి సమన్వితులై శ్రీగోవర్ధనగిరికి ప్రదక్షిణము లొనరించి తమతమ అభీష్టసిద్ధులను పొందుచున్నారు. పరమ భాగ్యవంతుడైన శ్రీగోవర్ధనపర్వతమునకు ఇట్టి అత్యున్నతపదమును ఆ భగవంతుడు తన భక్తుడైన శ్రీ ఆంజనేయుని వచనమును సత్యం ఒనరించుటకు ప్రసాదించెను. ఆ శ్రీరామచంద్రుడే ద్వాపరయుగములో శ్రీకృష్ణుడై శ్రీ గోవర్ధన పర్వతమును అనుగ్రహించెను.


శ్రీ ఆంజనేయుని అనుగ్రహమును, దర్శనమును పొందిన భాగ్యవంతునకు శ్రీరామచంద్రుని దర్శనము లభించుట నిశ్చయముగా జరుగును, కరుణామూర్తియైన శ్రీపవనకుమారుడు తన భక్తులను ప్రభువు చెంతకు చేర్చనిదే విశ్రమింపడు. అత్యంత ప్రేమపూర్వకముగా గోవర్ధనగిరిని అనుగ్రహించిన వాడై ఆంజనేయుడు శ్రీరామచంద్రుని చరణారవిందముల చెంతకు చేరెను.


విశాలసముద్రముపై నూఱుయోజనముల పొడవు, పది యోజనముల వెడల్పు కలిగిన సేతువును నిర్మించుట పూర్తియ్యెను. లీలావినోదియైన శ్రీరామచంద్రుడు ఆశ్చర్యచకితుడై ఈ పర్వతశిలలు సాగరజలముపై ఎట్లు తేలియాడుచున్నవని ప్రశ్నించెను; అందులకు వానరులు విన వినయపూర్వకముగా 'శ్రీరామప్రభో! ఇది అంతయు శ్రీరామనామమహిమ; నీ నామమహిమచే పర్వతములు, శిలలు మొదలగునవన్నియు సముద్రముపై తేలియాడుచున్న’ వని పలికిరి.


Thursday 10 February 2022

శ్రీ హనుమద్భాగవతము (156)



తానిచ్చిన మాటను మరువని హరతనయుడు గోవర్ధనముతో 'పర్వతేశ్వరా! నీవు చింతింపకుము. భక్త ప్రాణ ధనుడైన నా స్వామిని ప్రార్థించెదను. ఆయన తప్పక నేనిచ్చిన మాటను సత్యమొనరించి నిన్ను అనుగ్రహింపగలడు.' పవనాత్మజుని ఆ శ్వాసనమునకు గోవర్ధనగిరి ప్రసన్నుడై భగవంతుని ఆగమనము కొఱకై నిరీక్షింపసాగెను. శ్రీ ఆంజనేయుడు శ్రీ రామచంద్రుని చెంతకు వెళ్ళి ఆయన చరణారవిందములకు నమస్కరించి వినీతుడై స్తుతించెను. దయామయుడు, సర్వజ్ఞుడునైన ప్రభువు నీ అభీష్టమేమని ప్రశ్నింప, శ్రీ ఆంజనేయుడిట్లు వినమ్రుడై విన్నవించెను. “భక్త జనవల్లభా! నేను శ్రీగోవర్ధనగిరికి నీ దర్శనమును గల్గించెదనని, పతితపావనములైన నీ చరణారవిందముల సంస్పర్శాసౌభాగ్యము నొసంగెదనని బాస చేసితిని; కాని వానరవీరులు నీయా దేమును నాకు అందింపగ నే నేనా పర్వతేశ్వరుని ప్రజభూమిపై నుంచితిని. అతడు ఖిన్నుడై నన్ను ప్రార్థింపగా నీదర్శనమును, స్పర్శను తప్పక కల్గి చె దనని మరల బాస చేసితిని.”


సర్వాంతర్యామి, భక్తవత్సలుడునైన శ్రీరామచంద్రుడు శ్రీహనుమంతునితో ఇట్లు పల్కెను. “ప్రియభక్తుడా! మాట నా మాటయే యని తెలిసికొనుము. శ్రీ గోవర్ధన పర్వతమునకు నా అనుగ్రహము తప్పక ప్రాప్తించును. ఆతడు మయూరమకుటంతో మురళీ వినోదియైన నా శ్రీకృష్ణ రూపాన్ని సదా ఆరాధించును, కావున ద్వాపరయుగములో నేను శ్రీకృష్ణుడనై అవతరించెదను. ఆ అవతారములో గోవర్ధనగిరిని అనుగ్రహించెదను. ప్రజబాలకులతో కలసినవాడనై గోవర్థనగిరిపై విహరించుచు మధుర ఫలములను ఆరగించెదను, గోవులను గోవర్ధనముపై పాలించెదను; అంతియే కాదు, ఆ పర్వత శ్రేష్ఠుని సప్తదినములపర్యంతము నా చిటికెన వేలిపై ధరించెదను. ఈ విషయములనన్నింటిని అగిరి రాజునకు తెల్పుము.”


కృపామూర్తియైన శ్రీ రామచంద్రునకు "జయ"మనుచు శ్రీపవనకుమారుడు ఆనందముతో అంతరిక్షమునకు ఎగిరి గోవర్ధనమును చేరెను. "గిరిరాజా! నీవు ధన్యుడవు. భక్త పరాధీనుడై ప్రభువు నీ కోరికను మన్నించెదనను మాట నొసంగెను. ద్వాపరయుగములో నీ ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణునిగా అవతరించి ఆయన నిన్ను గ్రహించును. నీపై బాల్యలీలలను ఒనరించును. నీచే సమర్పింపబడు పత్రపుష్పఫలంతోయములను తాను అనుభవించును. సప్తదినముల పర్యంతము నిన్నా భక్త వత్సలుడు తన చిటికెన వేలిపై ధరింపగలడు. ఆహా! ఏమి నీ అదృష్టము అని ఆంజనేయుడు పలికెను.


Wednesday 9 February 2022

శ్రీ హనుమద్భాగవతము (155)



ఇట్లు గోవర్ధనగిరి ప్రభువును, భక్తుని స్మరించుచు గుణ గాన మొనరించుచుండెను. అచట భక్తవాంఛకల్పతరువైన శ్రీరామచంద్రుడు ఇట్లా ఆలోచించెను. 'ఈ గోవర్ధనగిరి గోలోకవాసి, నా మనోహరమైన మురళీధరమూర్తిని' సదా ధ్యానించు అనన్యభక్తుడు. అతడు నన్ను శ్రీకృష్ణరూపమున దర్శింపవలెనని ప్రార్థించినచో అది ఈ అవతారమున సంభవము కాదు.'


ఇట్లు శ్రీ రామచంద్రుడు ఆలోచించుచుండగానే ఐదవ దినమున నూఱు యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పుగల సేతునిర్మాణములో మిగిలిన ఇరువదిమూడు యోజనముల నిర్మాణము పూర్తియయ్యెను. “సేతుబంధన కార్యము పరిపూర్ణమయ్యెను. కావున వృక్ష పర్వతాదుల అవసరము లేదు. వారి వారి చేతులలో నున్న పర్వతములను, వృక్షములను ఆయా ప్రదేశములందే విడచి శీఘ్రముగా సాగరతటమును చేరవలయు”నని శ్రీ రామాజ్ఞ అంతట వెంటనే చాటబడెను.  


చంచలురైన వానరవీరులు పరుగుపరుగున దశదిశలకు పోయి శ్రీరామచంద్రుని ఆజ్ఞను తెలియజేసిరి. అందఱు వెంటనే తమ హస్తములలోనున్న శిలలను, వృక్షములను, పర్వతములను వదలినవారై ప్రభువు సమీపమునకు పరుగెత్తడం ఆరంభించారు. నేడు దక్షిణాపథములోనున్న పర్వతము అన్నియు నాడు వానర వీరులు వదలివేనని పురాణవేత్తలు పల్కెదరు. దక్షిణమున నున్న పర్వతములన్నీ సేతునిర్మాణ కార్యక్రమమునకు ఉపయోగింపబడెను.


మహామహీమామయుడైన కేసరీకిశోరుడు గోవర్ధనమును వామహస్తము పైకెత్తినవాడై ఆకాశమార్గమున పయనించుచు ప్రజభూమిని దాటుచుండెను. అప్పుడే శ్రీరామాజ్ఞను ఆలకించినవాడై ఆ మహావీరుడు గోవర్ధనగిరిని ఆ క్షణమందే ప్రజభూమిపై నుంచెను, ఈ హఠాత్పరిణామమునకు గోవర్ధనగిరి హతోత్సాహుడై ఆశాభరితములగు నేత్రములతో శ్రీ ఆంజనేయుని చూచెను.

Tuesday 8 February 2022

శ్రీ హనుమద్భాగవతము (154)



శ్రీ ఆంజనేయుడూ పర్వతమును పెకలించుటకు వినియోగించినను ఆ గిరిశిఖరము కదలలేదు. శ్రీరామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు ఆశ్చర్యచకితుడై ప్రభువును ధ్యానించెను. అపుడా ద్రోణగిరి సాక్షాత్తుగా భవవంతునిస్వరూపమైన గోవర్థనపర్వతమని, అది గోలోకము నుండి పృథ్వీకి వచ్చెనని, ఆ పర్వతమునందు గల శిలలన్నీ సాలగ్రామములని శ్రీ ఆంజనేయుడు గ్రహించెను. అపుడాయన మహిమామయమైన శ్రీగోవర్ధనమునకు అత్యంతాదర పూర్వకముగా నమస్కరించి చేతులు జోడించి వినయముగా ఇట్లు పల్కెను. “పర్వతరాజా! పరమపావనుడా! నేను నిన్ను భగవంతుని చరణముల చెంతకు చేర్చవలెనని ప్రయత్నించుచున్నాను. నీవెందులకు ప్రసన్నుడవగుట లేదో నాకు అవగతము కాకున్నది! దయాధాముడైన ప్రభుని దివ్య. మంగళ దర్శనము నీకు లభించుటయేగాక సుఖశాంతులకు నికేతనములైన తన దివ్యచరణారవిందములతో నిన్ను స్పృశించుచు ఆ జగన్నాథుడు సముద్రమును దాటి లంకను చేరగలడు.”


శ్రీ రామచంద్రునికి ప్రీతిపాత్రుడైన శ్రీ రుద్రావతారుని వచనములను ఆలకించగానే గోవర్ధనగిరి ఆనందమగ్నుడయ్యెను. 'ఆహా! ఆ ప్రదేశములో నాకు దుర్లభమైన భగవానుని దర్శనము లభించును. స్వామి నాపై తాపత్రయహరములైన తన చరణకమలముల నుంచి సముద్రమును దాటగలడు'. ఇట్లా ఆలోచించుకొనగనే గోవర్ధనగిరి ఆనందమునకు అంతు లేకపోయెను. అతడు శ్రీ ఆంజనేయునితో ఇట్లు పల్కెను. “పవనకుమారా ! నీ అనుగ్రహమునకు అత్యంత కృతజ్ఞుడను. ఈ మహోపకారమునకు నేను ప్రత్యుపకారం ఎన్నటికిని చేయలేను. దయామయుడా! శీఘ్రాతిశీఘ్రముగా నన్ను ఆ దేవాది దేవుని దివ్యచరణారవిందముల చెంతకు తీసుకునిపొమ్ము. నీవు నాపై చూపించుచున్న ఈ కృపావిశేషమునకు నేను సదా ఋణగ్రస్తుడనై ఉండెదను.”


ఆంజనేయుడు గోవర్ధనమును అవలీలగా నెత్తెను. కపీశ్వరుని వామహస్తముపై గోవర్ధనగిరి ఒక పుష్పమువలె పర్వతేశ్వరుని ఆనందమునకు అంతు లేకపోయెను. అతడు ఇట్లనుకొనెను. 'నేడు మహావీరుడైన హనుమంతుని కృపావిశేషముచే నా చిరకాల వాంఛితము నెఱవేఱనున్నది. మంగళమయుడు, పరోపకారమూర్తి అయిన పవనాత్మజుడీ ప్రకారముగా ఎందఱికి హీతమొనరించెనోకదా ! భాగ్యవశమున నేడీ మహిమాన్వితుని దర్శనము కల్గెను. ఈయనను స్పృశించు అదృష్టము సంప్రాప్తమయ్యెను. నేడు ఈ భక్తాగ్రేసరుని అనుగ్రహవిశేషముచే కమలనయనుడు, నా జీవన సర్వమునైన భగవంతుని దర్శనము కలుగబోవుచున్నది.'


Monday 7 February 2022

శ్రీ హనుమద్భాగవతము (153)



అయినా శ్రీఆంజనేయునకు పూర్ణమైన తృప్తి కలుగలేదు. ఆయన వనములకు, పర్వతములకు శీఘ్రముగా పోవుచు, వచ్చుచు శిలలను వృక్షములను అసంఖ్యాకములుగా తెచ్చుచుండెను. అందఱిని ప్రోత్సహించుచుండెను. వానర భల్లూక వీలందఱు శ్రీమారుతాత్మజుడు తమ చెంతనే ఉన్నాడని భావించుచుండిరి. నాల్గవదినమున ఇరువది రెండు యోజనముల వారధి నిర్మింపబడెను.


బుద్ధిలో, తేజస్సులో, శక్తిలో, పరాక్రమములో, అగ్రగణ్యుడైన శ్రీపవనకుమారుడు వానర సమూహములను ప్రోత్సహించుచు ఇట్లు పలికెను. “పరమభాగ్యవంతులైన వానర భల్లూక వీరులారా ! జగన్నియంత అయిన శ్రీరామ చంద్రుని యొక్క, నిఖిలభువనములకు జననియైన జానకీ దేవి యొక్క కార్యములో నిమిత్తమాత్రులగుట నిశ్చయముగా మీ సౌభాగ్యము. లేనిచో భగవంతుడైన శ్రీ రామచంద్రుడు తన సంకల్పమాత్రముననే సకలరాక్షసులను సంహరింపగలడు. ప్రభు చరణ సేవయందు మనయందరి జీవనములు సుజీవనములగుచున్నవి, జన్మములు సఫలములగుచున్నవి. ఇట్టి అదృష్టము ఇంద్రాది దేవతలకైనను దుర్లభమని తెలిసికొనుడు. నేటి వరకు ఇరువది మూడు యోజనముల దూరము సేతునిర్మాణము మిగిలియున్నది. కావున నేటితో మిగిలిన సేతువును లంకా నగరమువఱకు పూర్తి చేయవలసినది.


గోవర్ధనగిరి


‘జయ శ్రీరాం, జయ శ్రీసీతారాం’ అనుచు కోటాను కోట్ల వానర భల్లూక వీరులందఱు గర్జించిరి. శ్రీ ఆంజనేయుడు సింహనాదం ఒనరించుచు శ్రీరామచంద్రుని దివ్యనామములను కీర్తించుచు విశాలములైన పర్వతములను తెచ్చుటకు బయలుదేరెను. దశదిశయందుగల పర్వతములన్నియు సేతునిర్మాణమునకు వినియోగింపబడెను. శ్రీ పవనకుమారుడు ఉత్తరదిశగా పర్వతములను అన్వేషించుచు బయలు దేరేను. సప్త యోజనములు విస్తరించియున్న ఒక పర్వతమును ఆయన గాంచెను. ఆ పర్వతనామమే 'గోవర్ధనగిరి', భగవానుడైన శ్రీరామచంద్రుని అవతారసమయములో దేవగణములన్నియు దుర్లభములు, మంగళమయములైన ఆయన దర్శించుటకు, ఆయనను సేవించుటకు అవనిపైకి దిగి వచ్చెను. అపుడే శ్రీగోవర్ధనశిఖరము కూడ గోలోకమునుండి అవని పైకి వచ్చెను. 


Sunday 6 February 2022

శ్రీ హనుమద్భాగవతము (152)



అపరిమితమగు శక్తి సంపన్నడైన ప్రభుని చరణారవిందములకు సాష్టాంగ దండప్రణామములను అర్పించి, కానుకులను ఇచ్చి వినయ పూర్వకముగా స్తుతించి ఇట్లు పలికెను. " దేవాది దేవా ! సృష్టి నిర్మాణ సమయమందు నీవే నన్ను జడునిగా సృష్టించితివి. కావున నా జడత్వముపై దృష్టి నుంచక నన్ను క్షమింపుము. నాపై కృపను చూపుము. వానరసైన్యములో శిల్పకళానిపుణులైన నలుడు, నీలు ను వానరులు కలరు. నీ కృపా విశేషముచే మహర్షుల ఆశీర్వాదబలముచే ఆ ఇర్వురు శిల్పులు స్పృశించినంత మాత్రముననే పర్వతములైనను నాపై తేలి ఆడగలవు. వీరు సుందరము సుదృఢమైన సేతువును నిర్మించుటలో సమర్థులు. నేను కూడా వారితో సహకరించెదను. ఇట్లొనరించినచో నా మర్యాద సురక్షితముగా నుండగలదు. అందఱు ఈ ప్రపంచములో సకలపాపములను హరింపగల నీ కీర్తిని గాన మొనరించెదరు”. శ్రీరామచంద్రుడు సముద్రుని ప్రార్థన విని తానెక్కు పెట్టిన దివ్యాస్త్రమును ద్రుమకుల్యమనే ప్రదేశముపై విడిచెను. రామబాణం ఆ ప్రదేశమును నాశనమొనరించి తిరిగి శ్రీ రామచంద్రుని తూణీరమును చేరెను. ప్రభువు సేతువును నిర్మింపవలసినదిగ ఆజ్ఞాపించెను. 


"జయ శ్రీరాం, జయ శ్రీసీతారాం, జయ శ్రీలక్ష్మణ అనుచు వానర సైన్యమంతయు జయజయా కారములను ఒనరించినవి. ఆ విజయఘోష ఆకాశమునంతయు ప్రతి ధ్వనింపజేసెను. శ్రీ ఆంజనేయుని ఉత్సాహమునకు అవధులు లేకపోయెను. ఆయనయే స్వయముగా పర్వతశిలలను, వృక్షములను తెచ్చి నల నీలుల ఆదేశానుసారముగా సముద్రములో వేయుచుండెను. చంచలురైన వానరులు సంయములై శ్రీ ఆంజనేయును అనుసరించిరి. శ్రీ ఆంజనేయుని ఉత్సాహమును దక్షతను, శ్రమను గాంచి సర్వవానర భల్లూక వీరులు ప్రోత్సాహితులై ఎగురుచు, దుముకుచు పర్వతశిలలను తెచ్చి సాగరములో పడవేయడం ఆరంభించారు. నలనీలులు కూడా ఎంతయో శ్రమించినవారై మొదటి దినముననే పదునాల్గు యోజనములు దూరము సేతువును నిర్మించారు.


శ్రీ ఆంజనేయునకు సంతోషము కలుగలేదు. మరుదినమున ఆయన వానర భల్లూక వీరులను మరింత ప్రోత్సహపరుచ సాగెను. దానివలన ఆ దినము ఇఱువది యోజనముల దూరము సేతువు నిర్మింపబడెను; అయినను శ్రీహనుమకు సంతృప్తి కలుగలేదు. జానకి యొక్క కరుణామయమైన రూపము శ్రీ ఆంజనేయుని హృదయమును వ్యాకులం ఒనరించుచుండెను. శీఘ్రాతిశీఘ్రముగా సీతాదేవిని శ్రీ రామచంద్రుని చరణముల చెంతకు చేర్చవలెనని, లంకాధిపతియైన రావణునకు ముక్తి ఒసంగవలెనని శ్రీ ఆంజనేయుడు వ్యగ్రుడగుచుం డెను. నలుడు, నీలుడు సేతునిర్మాణ కార్యక్రమములో విశ్రాంతినైనను తీసుకొనక పరిశ్రమించుచుండిరి. వానర భల్లూక వీరులు తోడ్పడుచుండిరి. శ్రీ ఆంజనేయుడు అంతటి శ్రమను ప్రశంసించి, వారిని ఉత్సాహపర చుచుండెను. దానివలన మూడవదినమున ఇరువదియొక్క యోజనముల దూరము నిర్మాణమయ్యెను; 


Saturday 5 February 2022

శ్రీ హనుమద్భాగవతము (151)



విభీషణుని పట్టాభిషేకమును గాంచి వానర భల్లూక వీరులందఱు ప్రసన్నులైరి. శ్రీ ఆంజనేయుని ఆనందమునకు అవధులు లేకపోయెను. శ్రీ ఆంజనేయుని కృపా విశేషమువలననే విభీషణుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమునకు పాత్రుడైనాడనుట నిర్వివాదాంశము. లంకాధిపతియైన రావణునిచే తిరస్కృతుడై నిరాశ్రితుడైన విభీషణుకు శ్రీఅంజనానందనుని అనుగ్రహముచే నిఖిలిసృష్టికి ప్రభువైన శ్రీరామచంద్రుని ఆశ్రయమును పొందెను. లంకాధిపతి అగుటయేగాక ప్రభువునకు ఆత్మీయుడు, స్వజనుడు నయ్యెను. దయార్ద్రహృదయుడు, కరుణావారధియైన శ్రీ ఆంజనేయుని అనుగ్రహమునకిది సజీవమైన నిదర్శనము.


సేతుబంధనము


సర్వసమర్థుడైన శ్రీరామచంద్రుడు లంకను చేరుటకు మార్గము కొఱకై మూడుదినముల పర్యంతము సముద్రుని ప్రార్ధించెను. కాని మూఢుడైన సముద్రునిపై శ్రీ రామచంద్రుని అనునయ వినయముల ప్రభావం ఓకింతైనను పడకుండుట చూచి ఆయన కోపించెను. శ్రీరామచంద్రుని విశాలనేత్రములు పంకజవర్ణములయ్యెను. అపుడాయన బ్రహ్మదండముతో సమమైన భయంకరమైన బాణమును సంధించి అభిమంత్రించి ఆకర్ణాంతము ధనువును లాగుచు "నేడు సర్వులు ఈ రఘుకులోద్భవు డైన శ్రీరాముని పరాక్రమమును చూచెదరు గాక! నేనిప్పుడే ఈ సముద్రుని శుష్కింపజేసెదను. తదనందరము కోటాను కోట్ల వానర భల్లూకవీరులు సాగరమును తరించి లంకను చేరగలరు.


అచింత్యశక్తి సంపన్నుడు, మహాబాహుడైన శ్రీరాముడు ఒనరించిన ధనుష్టంకారమునకు పృథ్వి కంపించెను. పర్వతములు వణకెను. సూర్యుడు ప్రకాశించుచుండగానే దశ దిశలందు అంధకారముతో నిండెను. అంతరిక్షములో తుములధ్వనులతో పిడుగులు పడనారంభించెను. సముద్రుడు వ్యాకులుడై భయమతో కంపించుచు జాంబూనదములను దివ్యాభరణములను ధరించి స్నిగ్ధమైన వైడూర్యమణివలె ప్రకాశించుచు హస్తములతో అనేక దివ్యమణులను, రత్నములను కానుకలుగా తీసుకుని శ్రీరామచంద్రుని సమ్ముఖమున కేతెంచెను. 


Friday 4 February 2022

శ్రీ హనుమద్భాగవతము (150)



విభిషణుడు భక్తితో పల్కిన పల్కులను ఆలకింపగానే భక్త ప్రాణధనుడైన శ్రీరాముడు ప్రభువు దిగ్గున నిలుచుండెను. ఆ జగన్నాథుడు తన చరణములను ఆశ్రయించి ప్రార్థించుచున్న విభిషణుని లేవనెత్తినవాడై విశాలభుజములను చాచి హృదయమునకు హత్తుకొని ఆలింగనం ఒనరించుకొనెను. తదనంతరము ప్రీతిపూర్వకముగా విభిషణుని తన చెంత కూర్చుండ బెట్టుకొని ‘లంకేశ్వరా!’ అని సంబోధించెను.

 

గద్గదకంఠముతో విభీషణుడు శ్రీ రామచంద్రుని స్తుతించినవాడై ఇట్లుని వేదించెను. “ప్రభూ! సురముని దుర్లభములు, తాపత్రయహరములైన నీ దివ్యచరణారవిందములను దర్శించిన మాత్రముననే నేను కృతార్థుడనైతిని. నా జీవనము సుజీవనమయ్యెను. నాకు సర్వస్వము లభించెను. రాజరాజేశ్వరా! శ్రీరామభద్రా! నాకు విషయ సుఖముల పై ఇచ్ఛ లేదు. నాకు నీ చరణసరోజములపై అహైతుక భక్తిని (ప్రతి ఫలము నాశింపని భక్తిని) ప్రసాదింపుము.”

 

కాని శ్రీరామచంద్రుడు అనుజుడైన సౌమిత్రితో "లక్ష్మణా! నన్ను దర్శించినందులకు విభీషణునకు ఫలం ఈ క్షణమందే లభింపవలయును. సాగరజలమును తెమ్ము అని పల్కెను.

 

సీతామనోవల్లభుడైన శ్రీరామునాజ్ఞను పొందగానే రామానుజుడు కలశముతో సాగరజలములను తెచ్చెను. విభీషణుని ఉన్నతాసనము పై కూర్చుండబెట్టి వానర భల్లూక వీరులు ‘జయజయ ధ్యానములను ఒనరించుచుండగా లంకానగరమునకు వానిని సామ్రాట్టుగా అభిషేకించెను. రావణుడు తన పది శిరములను సమర్పించి శంకరుని ప్రసన్నునిగా చేసికొని పొందిన సకలైశ్వర్యములను శ్రీ ఆంజనేయుని అనుగ్రహమునకు పాత్రుడైన విభీషణునకు శ్రీరామచంద్రుడు ప్రసన్నుడై అనుగ్రహించెను. 

Thursday 3 February 2022

శ్రీ హనుమద్భాగవతము (149)



నేను సంకల్ప మాత్రముననే లోకపాలకులతో పాటు సమస్త విశ్వమును లయమొనరించి మరల సృష్టింపగలను. అసురులనందఱిని లక్ష్మణుడు ఒక్క క్షణములో సంహరింపగలడు. కావున నీవు చింతింపవలసిన పనిలేదు. వెంటనే విభీషణుని తోడ్కొనిరమ్ము.”


భక్తానుగ్రహవిగ్రహుడైన శ్రీ రామచంద్రుని మధుర వచనములను ఆలకించిన పవననందనుని ఆనందమునకు మేర లేకపోయెను. ఆయన శరీరము పులకించెను. నేత్రములు ప్రేమా శ్రువులతో నిండెను.


భక్త వత్సలుడైన శ్రీరామదంద్రునకు 'జయమగుగాక ' యని శ్రీ ఆంజనేయుడు సింహనాద మొనరించెను. అంగదాది వానరులను తోడ్కొని ఉల్లాసపూర్వకముగా ఎగిరినవాడై శ్రీ ఆంజనేయుడు విభీషణుని చెంతకు వెళ్ళి అతనిని ఆదర్శపూర్వకముగా ప్రభువు సమీపమునకు తోడ్కొనిని వచ్చెను. జటాజూటములను ధరించి శ్యామగౌరవర్ణముతో ప్రకాశించు శ్రీరామలక్ష్మణుల అలౌకిక సౌందర్యమును కన్నులారా విభీషణుడు దర్శించెను. కొన్ని క్షణముల అట్టి ఆనందస్థితిలో నుండి విభీషణుడు ప్రభువు పాదములపై పడి సాష్టాంగదండప్రణామముల ఒనరించుచు ఇట్లు ప్రార్థించెను. “పంకజలోచనా! శ్రీమన్నారాయణా! శరణు, శరణు. ప్రభూ! నీ సహధర్మచారిణియైన సీతా మాతను హరించినవాడు, రాక్షసకులోత్పన్నుడు, దుష్టుడైన దశకంఠుని కనిష్ఠ సోదరుడ నైన విభీషణుడను. నేను అత్యంత తామస ప్రవృత్తి గల్గిన రాక్షసుడను, అధముడను. విదేహ రాజకుమారియైన సీతను నీకు సమర్పించి శరణు వేడుమని నా అగ్రజుడైన రాక్షసరాజు అనేక విధముల ప్రార్థించితిని. కాని అతడు కాలవశుడై నాపై కోపించెను. దూషించి నన్ను కాలితో తన్నెను. దేవాది దేవా! నేను నీ దివ్యచరణావిందములను స్మరించినవాడనై నేను సంసార బంధముల నుండి ముక్తుడనగుటకు ముముక్షువునై దారా పుత్రాదులను లంకలో వదలి మంత్రులతో కలసి భువనపావనములైన నీ చరణారవిందములను శరణుజొచ్చితిని. కరుణానిధానుడా! నీవు అధముడనైన నాపై కృపా దృక్కులను ప్రసరింపజేసి జన్మమును సఫలమొనరింపుము. నీ దివ్య పాదారవిందముల నీడలో " నాకు ఆశ్రయము నిమ్ము.”


Wednesday 2 February 2022

శ్రీ హనుమద్భాగవతము (176)



మూర్తీభవించిన కృతజ్ఞతలో శ్రీ రఘునాథుడు ఎంత ప్రసన్నుడై ఆంజనేయుని తన వక్షఃస్థలమునకు హత్తుకొని ఇట్లు పల్కెను.


శ్లో॥ మారుతిం ప్రాహ వత్సాద్య త్వత్ప్రసాదాన్మహాక పే॥ 

నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ


(ఆధ్యాత్మ రామాయణం 6-7.30)


వత్సా! మహాకపీశ్వరా ! నేడు నీ కృపావిశేషము వలననే నేను నా సోదరుడైన లక్ష్మణుని నిరామయునిగా గాంచ గల్గుచున్నాను.


వజ్రంగబలి యైన ఆంజనేయుడు ఒనరించిన ఈ మహత్తర కార్యమును శ్రీరాముడు, పునర్జీవితమును పొందిన లక్ష్మణుడు ప్రశంసించుటయేగాక వానర భల్లూక వీరులందఱు వే నోళ్ళ పొగడనారంభించి. కాని అభిమానశూన్యుడైన ఆంజనేయుని హృదయములో ఎట్టి అహంకారము కలుగ లేదు. తానేమియు చేయనివానివలె ఆయన మిన్న కుండెను. అంతయు చేయువాడు మరియొకడు కలడని, ఆయనయే అభిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీరామచంద్రుడని, తాను కేవలము నిమిత్తమాత్రుడనని ఆంజనేయుని భావము. అతడు ఒంటరిగా, అందరినుండి దూరముగా ఉండి మనస్సులో అరుణకమలముల వలె ప్రకాశించు సుకోమలములైన ప్రభువుయొక్క చరణారవింద ధ్యానములో లీనుడయ్యెను.


ఇది శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందమిళిందాయ మా మాససత్వ మహావైభవ సంపన్నుడు శ్రీ మట్టుపల్లి వేంకట మహాలక్ష్మీ జగన్నాథుల తనూభవుడు భక్తజన దాసానుదాసుడు సుజన విధేయుడైన శివ సుబ్బారాయ గుప్తచే ప్రణీతంబైన శ్రీ హనుమద్భాగవతమందు పూర్వ భాగము సమాప్తము. 


శ్రీ హరిః ఓం తత్సత్


శ్రీ హనుమద్భాగవతము (148)





భక్తుల సర్వస్వమైనవాడు, భక్త సులభుడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో ఇట్లు పల్కెను.


శ్లో|| ఆర్తో వా యది వా దృక్తః పరేషాం శరణం గతః |

అరిః ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా ||

వినిష్టః పశ్యత స్తస్య రక్షిణః శరణం గతః | 

ఆనాయ సుకృతం తస్య సర్వం గచ్ఛేదరక్షితః || 

ఏవందోషో మహానత్ర ప్రపన్నా నామరక్షణే | 

అస్వర్గ్యం చాయశస్యం చ బలవీర్యవినాశనమ్ ||


(వా. రా. 6-18-28-81)


సఖుడా! నీవు నీతి యుక్తమైన సుందరవచనమును పల్కితివి; కాని శత్రువు దుఃఖితుడై తన శత్రువులను శరణు జొచ్చినచో పరిశుద్ధ హృదయముగల శ్రేష్ఠుడైన పురుషుడు తన ప్రాణములను సహితము త్యజించి వానిని రక్షింపవలయును. శరణాగతుడగువాడు రక్షణమును పొందక రక్షకుడు చూచుచుండగానే నశించినచో అతడు రక్షకుని సకల పుణ్యములను తనతో తీసికొని వెళ్ళగలడు. ఇట్లు శరణాగతుని రక్షింపనిచో మహత్తరమైన దోషము సంభవించునని చెప్పబడినది. శరణన్న వానిని త్యజించుట స్వర్గ సౌఖ్యములను, సుయశమును నశింపజేయును. మనుష్యుని బలవీర్యములను హరింపజేయును.


బ్రహ్మహత్యలను గావించినవాడైనా నన్ను శరణుజొచ్చిన వానిని నేను విడువజాలను. ఏ క్షణమున జీవుడు నన్ను శరణువేడునో, ఆ క్షణముననే వాని పాపము జీవుడు నన్ను శరణులన్నియు నశించిపోవును. వానరరాజా! సుగ్రీవా!


శ్లో॥ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే ! 

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ |


(వా.రా. 6–18–88) 


నన్ను శరణుజొచ్చి పరిశుద్ధహృదయముతో నేను నీవాడనని పల్కినవానిని నేను సర్వప్రాణులనుండి నిర్భయునిగా ఒనరించెదను. ఇది నావ్రతము. 

Tuesday 1 February 2022

శ్రీ హనుమద్భాగవతము (147)



ఇట్లా ఆలోచించుకొనుచు ఇంద్రునిసమానమైన తేజస్సు కలవాడు, ఉత్తమములైన ఆయుధములను ధరించినవాడు, దివ్యభూషణములచే అలంకృతుడు, కవచమును ధరించినవాడైన విభీషణుడు తన నలుగురుమంత్రులతో సముద్రమును దాటి ఆవలి తీరమును చేరెను. పర్వతము వలె భాసించుచు వచ్చుచున్న విభిషణుని గాంచి వానరులు రావణుని దూత అనుకొనిరి. వానరవీరులు ఈ విషయమును సుగ్రీవునకు విన్నవించిరి. అపుడు వానరరాజైన సుగ్రీవుడు భగవంతుడైన శ్రీరామచంద్రునితో వినయపూర్వకముగా "ప్రభూ! రావణుని సోదరుడైన విభీషణుడు నిన్ను దర్శించుటకు వచ్చుచున్నాడు.” అని పలికెను. అపుడు శ్రీరాముడు కిష్కింధాధిపతితో “స్నేహితుడు ఈ విషయములో నీ అభిప్రాయమును చెప్పు” మనెను.

నీతినిపుణుడైన సుగ్రీవుడు "ప్రభూ! రాక్షసులు మిగుల మాయావులు. వారిలో అంతర్థానమైన శక్తి కూడా కలదందురు. శూరుడు, వీరుడునైన విభీషణుడు అత్యంత క్రూరుడైన రావణుని సోదరుడు, కావున వీనిని మంత్రులతో పాటు వధించుట ఉచితమని పల్కెను.


సుగ్రీవుని వచనములను ఆలకింపగానే శ్రీ పవనకుమారుడు వ్యాకులుడయ్యెను. తనకు సన్నిహితులైన వారలను శ్రీరామచంద్రుని చరణారవిందములకు చేర్చి సంతుష్టుడగుట శ్రీఆంజనేయుని సహజస్వభావము. లంకలో విభీషణుడు ఆంజనేయునకు పరిచయమయ్యెను. వాని నిశ్చలమైన భక్తికి ప్రభావితుడయ్యెను. సీతా దేవి జాడను అతడే శ్రీహనుమంతునకు చెప్పెను. రావణువిసభలో శ్రీ ఆంజనేయునిపక్షమున వాదించెను. తన సర్వస్వమును త్యజించి శ్రీరామచంద్రుని చరణముల చెంతకు వచ్చెను. అట్టి పరిస్థితిలో వానరరాజు విభీషణుని విషయమై కటువుగా పల్కుట శ్రీ ఆంజనేయునకు అనర్థముగా తోచెను. పవన కుమారుడు శరణాగతవత్సలుడైన శ్రీ రాముని ఆదేశము కొఱకై నిరీక్షించుచుండెను.