Wednesday, 8 December 2021

శ్రీ హనుమద్భాగవతము (96)మీ అందరికి దుర్దినములు దాపురించినవి. మీకిక శరణు లభించదు. కావున మూర్ఖ స్త్రీలారా ! ఆమెను దుర్వచనములచే బాధించుట మానుకొని, ఆరాధించండి. సీతా దేవితో మధురంగా మాట్లాడుతూ సౌమ్యంగా వ్యవహరించండి. క్షమింపవలసినదిగా విదేహరాజపుత్రిని ప్రార్థించండి. ఇందులోనే మీకు శుభము కలదు.


త్రిజట పలికిన వచనములను ఆలకించి రాక్షసస్త్రీలు భయము చెంది సీతాదేవి పాదములపై బడి క్షమించమని ప్రార్థించి ఆ ప్రదేశము నుండి తొలగిపోయారు. సీతాదేవి దుఃఖమునకు అంతులేదు. ఆమె వ్యాకులయై త్రిజటతో ఇలా పలికింది. “తల్లీ ! ఈ విపత్కాలములో నీవు నాకు ఊరట కల్గింప ప్రయత్నించుచున్నావు; కాని ప్రాణనాథుని వియోగముచే దుఃఖించుచున్న నేను ఈ భయంకరులైన రాక్షసుల మధ్య జీవించి ఉండుటవలన ఎట్టి లాభమును లేదు. నీవు నాకొక సహాయం ఒనరించు. శుష్క కాష్ఠములను సమీకరించి చితిని పేర్చుము. దానిని జ్వలింపజేసి నేను అగ్నికి ఈ శరీరాన్ని ఆహుతి చేసెదను. నీ ఈ ఉపకారమును నేను మరువ లేను. భరింపలేను. ఈ కష్టములను నేనింక భరించలేను.


ఇట్లు పల్కి సీతాదేవి దుఃఖంపనారంభించింది. ఆమె దుఃఖమును గాంచి త్రిజట దుఃఖితురాలై అనేక ఉక్తులతో ఊరడించి సమాధానపరచి వెడలిపోయింది. సీతా దేవియొక్క కరుణాక్రందనమును విని వృక్షముపై దాగియున్న వజ్రాంగుడైన శ్రీహనుమంతుని హృదయము విదీర్ణమయ్యింది. ఆయన నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింపనారంభించాయి. సీతాదేవి సమక్షమునకు తత్ క్షణమే వెళితే ఆమె భయపడుతుందేమో అనే శంకతో ఆగిపోయింది.


దుఃఖావేగముచే సీతా దేవి శరీర త్యాగమే ఉచితమని సంకల్పించుకొన్నాడు. ఆమె ఇట్లా ఆలోచింపసాగింది. “ఉరి తగిలించుకొని మరణించుటకు నా వేణి చాలును” అని ప్రాణములను విడచుటకు నిర్ణయించుకొని విదేహరాజకుమారి లేచి నిలుచుంది. ఆమె నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించుచున్నాయి.

Tuesday, 7 December 2021

శ్రీ హనుమద్భాగవతము (95)

అప్పుడు త్రిజట ఇట్లు పలికింది. “అసుర స్త్రీలారా ! నేను స్వప్నములో రావణుడు బోడితలతో, నూనెలో స్నానమాచరించి, ఎఱ్ఱని వస్త్రములను ధరించి ఉన్నట్లు గాంచాను”.కరవీర (గన్నేరు) పుష్పమాలను ధరించి మదిరోన్మత్తుడైన రావణుడు పుష్పక విమానము నుండి భూమిపై పడుచున్నట్లు గాంచాను. బోడితల గలిగిన రావణునకు నల్లని వస్త్రములను ధరించాడు. వానిని ఒక నల్లనిస్త్రీ ఎచటికో ఈడ్చు కొని పోవుచున్నాడు. శరీరముపై ఎఱ్ఱని చందనము అలదుకొని, ఎఱ్ఱని పుష్పమాలను ధరించి, నూనెను త్రాగుతూ, అట్టహాసం ఒనరిస్తూ, గార్దభముపై ఎక్కి దక్షిణదిశగా రావణుడు పోతున్నాడు. ఒక్క విభీషణుడు తప్ప రావణునితో పాటు వాని పుత్రులు, సేనాపతులు, పరివారమంతా ముండిత మస్తకులై నూనెలో స్నానమాడుచున్నట్లు కాంచాను. రావణుడు సూకరముపై, మేఘనాథుడు శింశుమారము (మొసలి) పై, కుంభకర్ణుడు ఒంటెపై ఆసీనులై దక్షిణాభిముఖముగా పోవుచున్నట్లు చూచాడు. ఇంతే కాదు ఎఱ్ఱనిముఖముగల మహాతేజ స్సంపన్నుడైన వానరుడు అసురులను ఎక్కువ మందిని సంహరించి లంకకు నిప్పుపెట్టినట్లు, ఆ మంటలకు లంక భస్మమైనట్లు చూసాను. ప్రాతః కాలమున గల్గిన ఈ స్వప్నము త్వరలోనే సత్యమవుతుంది”.


భక్తురాలు, బుద్ధిమంతురాలైన త్రిజట ఆ రాక్షస స్త్రీలకు ఉపదేశిస్తూ ఇట్లా పలికింది. “రాక్షసస్త్రీలారా! మహాచక్రవర్తి యొక్క గారాల కోడలు సీతాదేవి సమస్తరాజ్య భోగాలను, వైభవాలను కాల తన్ని తన భర్తతో అరణ్య వాసమునకు వచ్చింది. మహావీరుడైన శ్రీరామచంద్రునితో ఆమె కుశ కంటకములతోనూ, రాళ్ళతోనూ కూడి ఉన్న అరణ్యమార్గములందు చరిస్తూ కష్టములను అనుభవించు చున్నా అది తనకు పరమసుఖమే అని భావించింది. అట్టి మహాపతివ్రతే, పరమాదరణీయురాలు, శ్రీరామచంద్రునకు పరమప్రియురాలైన సీతాదేవిని ఇట్లా భయపెడుతూ, బెదరిస్తూ ఉంటే కౌసల్యానందనుడైన శ్రీరామచంద్రుడు ఇట్లా సహించగలడు ? 

Monday, 6 December 2021

శ్రీ హనుమద్భాగవతము (94)తదనంతరము దశాననుడు అమిత భయంకరముఖములు గల రాక్షసస్త్రీలకు ఆదేశమిస్తూ ఇట్లా పలికాడు. “నిశాచర స్త్రీలారా ! ఆదరముతో గాని, ప్రలోభమునగాని, భయమునైన గాని, మఱి ఎట్లైనా సీత నాకు అనుకూలమవునట్లు ప్రయత్నించకు. ఒక నెలదినములలో ఈమె మనస్సు మార్చుకుంటే మహారాజుభోగములను అనుభవింపగలదు. లేనిచో మరణించి నాకు ఉదయమున ఫలహారము కాగలదు.


రావణుడు మరలిపోగానే వాని కోరిక ప్రకారము భయము గొల్పు రాక్షసస్త్రీలు శ్రీజానకీ దేవిని అనేక ప్రకారముల భయపెడుతూ బెదరించడం ఆరంభించారు. ఈ దృశ్యమును గాంచి శ్రీ పవనాత్మజుడు మిగుల కోపించాడు. ఈ రాక్షస స్త్రీల ఇప్పుడే సంహరించాలి అని సంకల్పించాడు; కాని నీతి నిపుణుడు మేధావియైన హనుమ శ్రీరాముని కార్యము సంపూర్ణం ఒనరించవలెనని సహనము వహించాలి.


దుష్టలైన ఆ రాక్షసస్త్రీలు పతీవియోగముచే దుఃఖించుచున్న సీతా దేవిని బాధించుటను త్రిజట అనే రాక్షస స్త్రీ చూసి వారిని వారిస్తూ ఇట్లు పలికింది. “అధమనిశాచర స్త్రీలారా ! నిశ్చయముగా మీకు చెడుకాలము దాపురించినది. లేనిచో విూరు జగన్నాయకుడైన శ్రీ రాముని అర్థాంగిని ఇట్లు బాధించెడివారలు కారు. నా నిద్రావస్థలో ఇంతకుమునుపే ఒక భయంకరస్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో దశకంఠుని సహితముగా సకల రాక్షసవంశ వినాశమును, శ్రీ సీతారామ చంద్రుల సమాగమమును చూసాను”. త్రిజట పలికిన పలుకులు ఆలకించి రాక్షసస్త్రీలు భయవిహ్వలలై ఆ స్వప్న వృత్తాంతమును సాంగోపాంగముగా చెప్పవలసినదిగా ఆమె అడగటం ఆరంభించారు. 


Sunday, 5 December 2021

శ్రీ హనుమద్భాగవతము (93)క్రూరతముడైన దశముఖుని విషమయములు, బాణ సదృశములైన పరుష వాక్యములకు జానకీ దేవి కొంచమైనా చలించలేదు, భయపడలేదు. ఆమె తన ముందు ఒక గడ్డిపోచను పడవెసి తల దించుకొని ఇలా పలికింది. “అధముడవైన రాక్షసుడా ! నీ వేమి చేయదలచుకొంటివో దానిని వెంటనే చెయ్యి. నీవంటి పాపాత్మునికి లొంగుట కంటె మరణించుట మేలు. నిన్ను నీవు త్రైలోక్యవిజయుడవని తలంచుచున్నావు. ఓరీ ! నీచ శునకమా ! నాప్రాణనాథుడు లేని సమయమున నన్ను అపహరించి తెచ్చి నీ గృహములో అసహాయురాలనైన నా పై బింకములు పల్కుచున్నావు. శ్రీ రాఘవేంద్రుడు లంకలో అడుగిడునంతవఱకే నీవిట్టి వాచాలత్వమును చూపగలవు. త్వరలోనే నీ బంగారులంక అగ్నిలో కాలి బూడిద కాగలదు. నీవు నీ సకలపరివారముతో శ్రీరామచంద్రుని తీక్ష్ణశరములకు బలైతావు. శ్రీకోసలేంద్రుని శరవర్షముచే విదీర్ణుడవై నేల కొరిగినప్పుడు గాని ఆయన ప్రతాపము నీకు తెలియరాదు. ప్రభువు దూరముగా ఉన్నంతవరకే నీ విట్టి పిచ్చిమాటలను నీ ఇష్టానుసారంగా పలుతావు".


శ్రీరామవియోగం అనుభవించుచున్న సీతా దేవి పలికిన ఈ కఠోరవచనములును ఆలకింపగనే రావణుని నేత్రములు రక్త వర్ణములయ్యాయి. క్రోధోన్మత్తుడై ఆ అసురుడు వరనుండి ఖడ్గమును తీసి జనక నందినిని సంహరించుటకు సిద్ధము కాగా, పట్టమహిషియైన మండోదరి వాని కరమును పాట్టుకొని ఆపుతూ ప్రేమపూర్వకముగా ఇట్లు పలికాడు. “హృదయేశ్వరా! దుఃఖితురాలైన ఈ దీనురాలిని వదలివేయ్యి. ఈమెలో ఏమి కలదు? నిన్ను వరించుటకు దేవగంధర్వనాగాదులలో అధిక లావణ్యవతులైన స్త్రీలు ప్రతిక్షణము నిరీక్షించుచున్నారు”.


ఇట్లా రావణుని పాదములపైబడి మండోదరి ప్రార్థించగా రావణుడు క్రోధముతో ఇట్లా పలికాడు. “జానకీ ! నేటికి నిన్ను విడచుచున్నాను. కాని ఒక నెలదినములలో నీవు నన్ను అంగీకరించకపోతే నా చేతిలో నీ మరణము నిశ్చితమవుతుంది; కావున శీఘ్రముగా ఆలోచించుకొని నీ నిర్ణయమును తెలుపు”.

Saturday, 4 December 2021

శ్రీ హనుమద్భాగవతము (92)మరుక్షణమే తల్లి యొక్క దయనీయమైన దశను గాంచి హనుమంతుడు అత్యంత దుఃఖితుడయ్యాడు. ఆయన తానిప్పుడు ఏమి చేయవలెనో అని ఆలోచింప ఆరంభించాడు. అంతలో కోలాహలమును విని పవననందనుడు అశోకవృక్షము యొక్క కొమ్మలలో సావధానుడై దాక్కున్నాడు. జానకీ దేవి భయముతో ముడుచుకొని కూర్చున్నాడు.


కాటుక కొండవంటి వర్ణము గల దశముఖుడైన రావణుడు అనేక రాక్షససుందరీమణులతో పరివృతుడై వచ్చుటను పవన పుత్రుడు గాంచాడు. వారిలో రావణపట్టమహిషి మండోదరి కూడకలదు. 


సీతా దేవిని సమీపించి రావణుడిట్లా పలుక ఆరంభించాడు. “జనక రాజకుమారీ! నేనంటే నీవేందుకు భయపడుతున్నావు? నేను నిన్ను నా ప్రాణముల కంటె అధికంగా వాంఛించుచున్నాను; వ్యర్థముగా నీవెందుకు ఈ కష్టములను అనుభవించుచున్నావు? నీ ఈ అపారదుఃఖమును చూడలేకున్నాను. ఆ వనవాసియైన రామునిలో ఏమి కలదు ? ఆతనిలో ఎట్టి శక్తి ఉన్నా ఇచ్చటి వచ్చి నిన్ను బంధవిముక్తురాలుగా చేయగలిగెడ్వాడు; కాని నేను ముల్లోకములను జయించినవాడను. దేవతలైనను, అసురులైనను, నాగ కిన్నెర గంధర్వ కింపురుషాదులైనను నా పేరు విన్నంతనే కంపించెదరు. ఇక మానవులెంత? ! త్రికూటస్థితమైన ఈ లంకానగరములో గల దుర్భేద్య దుర్గమందు ఒక పక్షియైనా నా అనుజ్ఞలేక ప్రవేశించుట అసంభవము. ఇక శతయోజన విస్తీర్ణముగల సాగరమును దాటి ఆ వనవాసియైన రాముడీ ప్రదేశమునకు ఎట్లా రాగలడు ? అతడు అసమర్థుడు; మమకారము లేనివాడు; నిరభిమానుడు; మూర్ఖుడు. అట్టివాని కొఱకై ఎందులకు ఎదురు చూచెదవు ? నీవు నాదానివి కమ్ము, గంధర్వులు, నాగులు, యక్షలు, కిన్నెరులు మొదలైన వారందఱు వారివారి స్త్రీలతో కూడా నిన్ను సేవించెదరు. నేను అత్యంతసమర్థుడను. నేను సంకల్పించినచో నిన్ను బలాత్కారముగా నా దానిగా చేసికొనగలను; కాని నేను నిన్ను హృదయపూర్వకముగా ప్రేమించుచున్నాను. ఈ కారణము వలననే నీ కెట్టి క్లేశమును కలిగించుట ఉచితముకాదని ఆలోచించుచున్నాను. నీవు స్వయముగా నాకోరికను మన్నించు. ఇందులోనే నీకు శుభము కల్గును”.


ఎన్ని సార్లు బుజ్జగించినా, బెదరించినా సీతా దేవి పై ప్రలోభము యొక్క ప్రభావము ఏమాత్రము పడకుండుట చూసి దశకంఠుడు మరల ఇట్లు పలుకసాగాడు. “సుందరీ! నాలో రోషానలజ్వాల ప్రజ్వరిల్లక ముందే నీ నిర్ణయమును నాకు అనుకూలంగా చేసుకో, లేనిచో ఈ తీక్ష్ణకరవాలముచే నీ శిరమును ఖండిస్తారు. నీ శరీరమాంసమును ఈ రాక్షసులు భక్షింపగలరు. 


Friday, 3 December 2021

శ్రీ హనుమద్భాగవతము (91)హనుమంతుడు సీతాదేవికడకు చేరుట


బ్రాహ్మీముహూర్తమున అసురులు ఎక్కడివారక్కడ గాఢనిద్రామగ్నులై ఉన్నారు. శ్రీరామపరాయణుడుడైన పవనపుత్రుడు అశోకవనమును జేరుటకెట్టి విఘ్నములు సంభచపలేదు. ఆ సుందరవాటిక, నిర్మలసరోవరము, అద్భుతమైన దేవాలయము మొదలగు వానియొక్క శోభను ఎలా ఆంజనేయుడు తిలకించగలడు? ఆయన సీతాదేవి దర్శనముకొఱకై అధీరుడగుచున్నాడు, నేరుగా అశోకవృక్షమును చేరి దట్టమైన కొమ్మలపై దాగి కూర్చుండి క్రిందకు చూసాడు.


మూర్తీభవించిన కరుణాస్వరూపిణీ, పతివ్రతా, తేజోమూర్తీ అయిన సీతా దేవి తన చరణములవైపు దృష్టిని సారిస్తూ మౌనముగా కూర్చొని ఉంది. అప్పుడప్పుడు ఆమె నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించుచుండెను. శ్రీ జానకిని దర్శించి శ్రీరామభక్తుడైన అంజనీనందనుడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. ఆయన ఆనందమునకు హద్దులు లేవు. తన అదృష్టమును పొగడుకొనుచు తనలో తానిట్లనుకొన్నాడు. 


శ్లో|| కృతార్ధోఽహం కృతార్ధోహం దృష్ట్వా జనక నందనీమ్ | 

మయైవ సాధితం కార్యం రామస్య పరమాత్మనః |


(ఆధ్యాత్మిక రామాయణం 5-2-11-12) 


నేడు జనకమహారాజుపుత్రికయైన జానకిని గాంచి కృతార్థుడనైయ్యాను. ఆహా! పరమాత్ముడైన శ్రీరాముని కార్యము సిద్ధించుటకు నేను కారణుడనైతినిగదా !


Thursday, 2 December 2021

శ్రీ హనుమద్భాగవతము (90)తదనంతరము శ్రీపవనపుత్రుడు సావధానుడై పలికాడు. ‘సోదరా ! విభీషణా ! నేను ప్రభువు యొక్క ఆదేశానుసారముగా నా తల్లిని వెదకుటకు వచ్చాను. సమయము పరిమితము. సూర్యోదయానంతరము వెలుగులో జనని చెంతకు పోవాలన్న అత్యంత కష్టమవుతుంది. అక్కడ సముద్రమునకు ఆవలితటముపై కోటాను కోట్ల వానర భల్లూక సేనలు అత్యంతోత్సాహముతో నాకొఱకై నిరీక్షించుచున్నారు. నేను స్వయముగా తల్లి దర్శనార్ధమై ఉత్కంఠత తోనున్నాను. నీవు కృపతో నా తల్లి దర్శనం ఎక్కడ కఅలుగుతుందో వివరించమని కోరుచున్నాను.


విభీషణుడు పలికాడు :


శ్రీరామభక్తాగ్రేసరా ! ఇచటికు ఆనతిదూరములో రాజ ప్రాసాదమునకు సమీపమున రావణునకు అత్యంతప్రియమైన అశోకవనము కలదు. ఆ వనము అనేకములైన సుగంధపుష్ప వృక్షములతోనూ, సుస్వాదుఫలములతో నిండిన వేలకొలది తరువులతోనూ నిండియున్నది. ఆ వనము భ్రమరముల ఝుంకారములతో, పక్షుల కిలకిలారవములతో ప్రతిధ్వనించుచుండును.


ఆ సుందర వాటిక యొక్క మధ్యభాగమున నిర్మలపూర్ణమైన సుందరసరోవరము కలదు. ఆ సరోవరతటముపై అసురకులపూజ్యుడైన శంకరభగవానుని విశాలరమణీయ మందిరము కలదు. ఆ ప్రాంతమును వేలకొలది రాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి రక్షించుచుండెదరు. శివాలయమునకు ఆనతి దూరములో విశాల శాభాసమన్వితము, అత్యున్నతమైన అశోకవృక్షము కలదు. జననియైన సీత ఆ వృక్ష ఛాయలో ప్రభువుయొక్క వియోగముచే తపించుచు దుఃఖించుచున్నది. ఆమె సుదీర్ఘ కేశములు జటలుగా మారిపోయాయి. ఆహారమును విసర్జించిన కారణమున ఆమె శరీరము శుష్కించిపోయాయి. ఆమె శరీరముపై మాసిన వలువ తప్ప మరేమీ లేదు.


అత్యంత క్రూరలైన రాక్షసస్త్రీలు అహర్నిశలు ఆ సాధ్వీని భయపెడుతూ బెదిరించుచున్నారు. ఆ తల్లిని చేరుకొను అత్యంతకష్టము. నా భార్య నా జ్యేష్ఠ పుత్రిక అప్పుడప్పుడు తల్లిని దర్శించి ఊరడించి వస్తుంటారు. తల్లియొక్క ఆ కరుణ దశను తలచుకొనినంతనే నేను కంపిస్తాను. ఆమెకు ఒక వేయి మంది క్రూరరాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి కాపున్నారు. వాయునందనా ! అత్యంత సావధానుడవై తల్లి చెంతకు వెళ్ళు. జగజ్జననియైన జానకీ దేవియొక్క యిట్టి కరుణాభరితమైన దశను ఆలకింపగానే కరుణాంతరంగుడైన అంజనీనందనునకు దుఃఖము పెల్లుబికింది. హనుమ విభీషణుని ఆలింగనమొనర్చుకొని ఇలా పలికాడు. “విభీషణా ! నీవు చింతింపవలసిన పనిలేదు. సర్వసమర్థుడైన ప్రభువు యొక్క దయవలన నేను జానకిని దరిస్తాను”.


హనుమ మరల సూక్ష్మరూపధారియై అశోక వాటిక దిక్కుగా తీవ్రగతితో పయనించాడు.