Sunday 31 December 2023

శ్రీ గరుడ పురాణము (49)



(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


జిహ్వయాః కారణం చైవ ప్రాణ స్యైవచ కారణం | 

హస్తయోః కారణం తద్వత్ పాదయోః కారణం తథా ॥ 


వాచశ్చ కారణం తద్వత్ పాయో శ్చైవతు కారణం | 

ఇంద్రస్య కారణం చైవ కుబేరస్య చ కారణం ॥   


యమస్య కారణం చైవ ఈశానస్య చ కారణం | 

యక్షాణాం కారణం చైవ రక్షసాం కారణం పరం ॥ 


నృపాణాం కారణం శ్రేష్ఠం ధర్మస్యైవతుకారణం ! 

జంతూనాం కారణంచైవ వసూనాంకారణం పరం ॥


మనూనాం కారణం చైవ పక్షిణాం కారణం పరం | 

మునీనాం కారణం శ్రేష్ఠం యోగినాం కారణం పరం ||


సిద్ధానాం కారణం చైవ యక్షాణాం కారణం పరం | 

కారణం కిన్నరాణాంచ గంధర్వాణాంచ కారణం || 


నదానాం కారణం చైవ నదీనాం కారణం పరం | 

కారణం చ సముద్రాణాం వృక్షాణాం కారణం తథా ||


కారణం వీరుధాం చైవలోకానాం కారణం తథా |

పాతాళ కారణం చైవ దేవానాం కారణం తథా ||


సర్పాణాం కారణం చైవ శ్రేయసాం కారణం తథా | 

పశూనాం కారణం చైవ సర్వేషాం కారణం తథా ||


దేహాత్మా చేంద్రియాత్మాచ ఆత్మాబుద్ధిస్త థైవచ | 

మనసశ్చత థైవాత్మా చాత్మాహం కార చేతసః ||


జాగ్రతః స్వపత శ్చాత్మామహదాత్మా పరస్తథా | 

ప్రధానస్య పరాత్మా చ ఆకాశాత్మా హ్యపాం తథా ||


పృథివ్యాః పరమాత్మాచ రసస్యాత్మా తథైవచ |

గంధస్య పరమాత్మా చ రూపస్యాత్మా పరస్తథా ||


శబ్దాత్మాచైవ వాగాత్మా స్పర్శాత్మా పురుషస్తథా | 

శ్రోతాత్మాచ త్వగాత్మాచ జిహ్వాత్మా పరమస్తథా || 


ఘ్రాణాత్మా చైవ హస్తాత్మా పాదాత్మా పరమస్తథా | 

ఉపస్థస్య తదైవాత్మా పాథ్వాత్మా పరమస్తథా ||


Saturday 30 December 2023

శ్రీ గరుడ పురాణము (49)

 


(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


బుధస్యచ పతిశ్చైవ పతిశ్చైవ బృహస్పతేః । 

పతిః శనైశ్చరస్యైవ రాహోః కేతోః పతిస్తథా ॥


లక్ష్మణో లక్షణశ్చైవ లంబౌష్టో లలితస్తథా | 

నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః ॥


నానారసోజ్జ్వల ద్వక్ర్తో నానాపుష్పోపశోభితః । 

రామో రమాపతిశ్చైవ త్రాతార్యః పరమేశ్వరః ॥


రత్నదో రత్నహర్తాచ రూపీ రూప వివర్ణితః । 

మహారూపోగ్రరూపశ్చ సౌమ్య రూపస్తథైవచ ॥


నీలమేఘ నిభఃశుద్ధః కాలమేఘనిభస్తథా | 

ధూమవర్ణః పీతవర్లో నానావర్లో హ్యవర్ణకః ॥


విరూపోరూప దశ్చైవ శుక్లవర్ణస్తథైవచ । 

సర్వవర్ణోమహాయోగీ యజ్ఞోయజ్ఞకృదేవచ ॥


సువర్ణ వర్ణ వాంశ్చైవ సువర్ణాఖ్యస్తథైవచ |

సువర్ణావయవశ్చైవ సువర్ణః స్వర్ణమేఖలః ॥


సువర్ణస్యప్రదాతాచ సువర్ణేశస్తథైవచ | 

సువర్ణస్య ప్రియశ్చైవ సువర్ణాఢ్య స్తధైవచ ॥


సువర్ణీచ మహాపర్జీ సువర్ణస్యచ కారణం । 

వైనతేయస్తథాదిత్య ఆదిరాదికరః శివః ॥


కారణం మహతశ్చైవ ప్రధానస్య చ కారణం |

బుద్ధీ నాం కారణం చైవ కారణం మనసస్తథా ॥


కారణం చేత సశ్చైవ అహంకారస్యకారణం ! 

భూతానాం కారణం తద్వత్ కారణం చ విభావసోః ॥


ఆకాశకారణం తద్వత్ పృథివ్యాః కారణం పరం | 

అండస్య కారణం చైవ ప్రకృతేః కారణం తథా ॥


దేహస్య కారణం చైవ చక్షుషశ్చైవ కారణం |

క్షేత్రస్య కారణం తద్వత్ కారణం చ త్వచస్తథా ॥ 


Friday 29 December 2023

శ్రీ గరుడ పురాణము (48)

 


(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


నాగానం పతిరర్కస్య దక్షస్య పతిరేవచ |

సుహృదాంచ పతిశ్చైవ నృపాణాంచ పతిస్తథా ॥


గంధర్వాణాం పతిశ్చైవ అసూనాం పతిరుత్తమః |

పర్వతానం పతిశ్చైవ నిమ్నగానాం పతిస్తథా ॥


సురాణాంచ పతిఃశ్రేష్టః కపిలస్య పతిస్తథా |

లతానాంచ పతిశ్చైవ వీరుధాం చ పతి స్తథా ॥ 

మునీనాంచ పతిశ్చైవ సూర్యస్య పతిరుత్తమః । 

పతిశ్చంద్రమసః శ్రేష్ఠఃశుక్రస్య పతిరేవచ ॥


గ్రహాణాంచ పతిశ్చైవ రాక్షసానాం పతి స్తథా |

కిన్నరాణాం పతిశ్చైవ ద్విజానాం పతిరుత్తమః ||


సరితాంచ పతిశ్చైవ సముద్రాణాం పతి స్తథా |

సరసాంచ పతిశ్చైవ భూతానాం చ పతిస్తథా ॥


వేతాలానాం పతిశ్చైవ కూష్మాండానాం పతిస్తథా |

పక్షిణాంచ పతిః శ్రేష్ఠః పశూనాం పతి రేవచ ॥


మహాత్మా మంగలోఽమేయో మందరో మందరేశ్వరః |

మేరుర్మాతా ప్రమాణంచ మాధవో మల వర్ణితః ॥


మాలాధరో మహాదేవో మహాదేవేన పూజితః | 

మహాశాంతో మహాభాగో మధుసూదన ఏవచ ॥


మహావీర్యో మహాప్రాణో మార్కండేయర్షి వందితః |

మాయాత్మామాయయా బద్ధో మాయయా తు వివర్జితః || 


మునిస్తుతో మునిర్మైత్రో మహానాసో మహాహనుః ।

మహాబాహుర్మహాదంతో మరణేన వివర్జితః ॥


మహావక్త్రో మహాత్మాచ మహాకాయో మహోదరః । 

మహా పాదో మహాగ్రీవో మహామానీ మహామనాః ॥


మహాగతిర్మహా కీర్తిర్మహారూపో మహాసురః । 

మధుశ్చ మాధవశ్చైవ మహాదేవో మహేశ్వరః ॥


మఖేజ్యో మఖ రూపీచ మాననీయో మఖేశ్వరః । 

మహావాతో మహాభాగో మహేశోఽతీత మానుషః ॥


మానవో మనుజశ్చైవ మానవానాం ప్రియంకరః |

మృగశ్చ మృగ పూజ్యశ్చ మృగాణాంచ పతిస్తథా ॥


Thursday 28 December 2023

శ్రీ గరుడ పురాణము (47)

 


(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)

ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియంవదః |

సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః ॥


సర్వస్య జగతోధామ సర్వదర్శీచ సర్వభృత్ |

సర్వానుగ్రహకృద్దేవః సర్వభూత హృదిః స్థితః ॥


సర్వపూజ్యశ్చ సర్వాద్యః సర్వదేవనమస్కృతః । 

సర్వస్య జగతో మూలం సకలో నిష్కలోఽనలః ॥


సర్వగోప్తా సర్వ నిష్ఠః సర్వకారణ కారణం ।

సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూప ధృక్ ॥


సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః ।

దుష్టానాం చాసురాణాంచ సర్వదా ఘాతుకోంతక ||


సత్యపాలశ్చ సన్నాభః సిద్ధేశః సిద్ద వందితః |

సిద్ధి సాధ్యః సిద్ధి సిద్ధః సాధ్యసిద్ధి హృదీశ్వరః ॥


శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్త థైవచ |

శుభకృచ్ఛోభనః సౌమ్యః సత్యః సత్య పరాక్రమః ||


సత్యస్థః సత్యసంకల్పః సత్యవిత్ సత్యదస్తథా |

ధర్మో ధర్మీచ కర్మీచ సర్వకర్మ వివర్జితః ॥


కర్మ కర్తాచ కర్మైవ క్రియా కార్యం తథైవచ |

శ్రీపతిర్ నృపతిః శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః ॥


సదేవానాం పతిశ్చైవ వృష్ణీనాం పతిరీడితః |

పతిర్ హిరణ్యగర్భస్య త్రిపురాంత పతి స్తథా ॥


పశూనాంచ పతిః ప్రాయోవసూనాం పతి రేవచ |

పతిరాఖండల స్యైవ వరుణస్యపతిస్తథా ॥


వనస్పతీ నాంచ పతిర నిలస్య పతిస్తథా !

అనలశ్చ పతిశ్చైవ యమస్య పతిరేవచ ॥


కుబేరస్యపతిశ్చైవ నక్షత్రాణాం పతిస్తథా !

ఓషధీనాం పతిశ్చైవ వృక్షాణాంచ పతిస్తథా ॥


Wednesday 27 December 2023

శ్రీ గరుడ పురాణము (46)

 


జగదానందకారకులలో తనంతటి వాడైన పరమేశ్వరుడీ ప్రార్థనను లోక కల్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు. 

పరమేశా! పరమబ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడునైన విష్ణుభగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర, శ్రేష్ఠతమ, జపయోగ్య, సమస్త పాప వినాశకర మహా స్తోత్రాన్ని వినిపిస్తాను, ఆకర్ణించండి.


ఓం

(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


వాసుదేవోమహావిష్ణుర్వామనో వాసవో వసుః ।

బాలచంద్ర నిభోబాలో బలభద్రో బలాధిపః ॥


బలిబంధన కృద్వేధా వరేణ్యో వేదవిత్ కవిః |

వేదకర్తా వేదరూపో వేద్యో వేద పరిఫ్లుతః ॥


వేదాంగ వేత్తా వేదేశో బలాధారో బలార్దనః ।

అవికారో వరేశశ్చ వరుణో వరుణాధిపః ॥


వీరహాచ బృహద్వీరో వందితః పరమేశ్వరః |

ఆత్మాచ పరమాత్మాచ ప్రత్యగాత్మా వియత్పరః ||


పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః |

పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః ॥


పద్మ జంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః ।

పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః ॥


అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః |

పండితః పండితే ద్యశ్చ పవిత్రః పాపమర్దకః ॥


శుద్ధః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః |

పిపాసావర్ణితః పాద్యః పురుషః ప్రకృతి స్తథా ॥


Tuesday 26 December 2023

శ్రీ గరుడ పురాణము (45)

 


క్షరానికీ (ప్రపంచం) అక్షరానికీ (చేతన) అతీతుడను, శరీరధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రి యుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత (గంధాన్ని గ్రహించు వాడు)నూ నేనే.


అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానినీ జ్ఞాన స్వరూపాన్నీ నేనే. *దృగ్రూపుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకార జన్య వికారాల నుండి కూడ ముక్తుడను నేనే.


* దృగ్రూపుడనగా సమస్త ప్రపంచానికీ ద్రష్ట. దృశ్యము, దృష్టి అయినవాడు 



ఈ జగత్తుకి సాక్షినీ, నియంతనూ నేనే. పరమానంద స్వరూపమూ నాదే. జగత్తు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షీభూతుడనైన నాకు ఏ అవస్థలూ వుండవు. తురీయ బ్రహ్మనూ విధాతనూ నేనే. *దృగరూప పరమాత్మనూ నేనే. (సమస్త ప్రపంచానికీ ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడూ పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు) నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే'.


* దృగ్రూప


ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని, తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి, ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువ్రతులలో నుత్తముడవగు శంకరదేవా! నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన, మననాలను చేసేవారికీ విష్ణులోకం ప్రాప్తిస్తుంది.” (అధ్యాయం - 14)


విష్ణు సహస్రనామం


(విశ్వం విష్ణుర్వషట్కారో... అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటుంది. దానిని శ్రీ కృష్ణుని సమ్ముఖంలో భీష్ముడు ధర్మరాజునకుపదేశించాడు. అది వేరు)


"హే ప్రభో! అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు గొని తేగల నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి” అని ప్రార్థించాడు శివుడు.


Monday 25 December 2023

శ్రీ గరుడ పురాణము (44)

 


(ఈ స్తోత్రంలో యజ్ఞశూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో కూడ ఇదే పదం వరాహస్వామిపరంగా వాడబడింది. విశాలాక్షశబ్దం గరుడవంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తోంది. అలాగే ఆకూపారమనగా మేదినీకోశం ప్రకారం కూర్మావతారం)


పరమశివా! ప్రాచీన కాలంలో సర్వ ప్రథమముగా నేనీ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు.


* పంజరమనగా “రక్షించునది' అని అర్ధము. విష్ణువను పేరు గల రక్షకుడు మనం ఈ స్తోత్రం చేస్తే మనను రక్షిస్తాడు.


(అధ్యాయం - 13)


ధ్యాన - యోగవర్ణన


పరమేశ్వరా! భోగాన్నీ మోక్షాన్నీ ఇచ్చే శక్తి యోగానికుంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికీ ధ్యానానికీ గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్త్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా :


'నేను విష్ణువును. నేనే అందరికీ ఈశ్వరుడను. నేనే అనంతుడను. *షడూర్మ రహితుడను నేనే. నేను వాసుదేవుడను. నేనే జగన్నాథుడను. బ్రహ్మరూపమూ నాదే. సమస్త ప్రాణుల శరీరాలలోనుండు ఆత్మనూ, సర్వదేహ విముక్తుడైన పరమాత్మనూ నేనే.


* * 'షడూర్మ - శోకమోహొ జరా మృత్యూ క్షుత్పిపాసే షడూర్మయః - అని శబ్ద కల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే ఆరు ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు.


Sunday 24 December 2023

శ్రీ గరుడ పురాణము (43)

 


విష్ణు 'పంజర స్తోత్రం


శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు “హే రుద్రదేవా! పరమకల్యాణకారియైన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి.


ప్రవక్ష్యామ్యధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం ॥ 

నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ॥ 

ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః 

గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే || 

యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః

హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ || 

ప్రతీచ్యాం రక్షమాం విష్ణోత్వామహం శరణం గతః 

ముసలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్షమాం ॥ 

ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః | 

ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే ॥ 

నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః । 

పాంచజన్యం మహాశంఖమనుఘోష్యంచ పంకజం ॥ 

ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞశూకర | 

చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా ॥ 

నైరృత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ |

వైజయంతీం సంప్రగృహ్య శ్రీ వత్సంకంఠ భూషణం ॥ 

వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే | 

వైనతేయం సమారూహ్య త్వంతరిక్షే జనార్ధన | 

మాం రక్ష స్వాజిత సదా నమస్తేఽస్త్వ పరాజిత । 

విశాలాక్ష సమారూహ్య రక్ష మాంత్వం రసాతలే | 

అకూపార నమస్తుభ్యం మహామీన నమోఽస్తుతే | 

కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహు పంజరం ॥

కృత్వారక్ష స్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ । 

ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ 

పురారక్షార్థ మీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ । 

నాశయామాస సాయేన చామరం మహిషాసురం ॥ 

దానవం రక్తబీజంచ అన్యాంశ్చ సురకంటకాన్ | 

ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా ॥ (6 0 13/1-14)


శ్రీ గరుడ పురాణము (42)



ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహా పురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూటయెనిమిది మార్లు జపించాలి. తదనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప, అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి.


తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణు దేవునికీ, అచ్యుతాది ఆంగిక దేవతలకీ బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవునీ ఇతర దేవతలనూ పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట యెనిమిది ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది ఆరుగురు అంగదేవతలకు మూడేసి ఆహుతులనూ, దిక్పాలకులకొక్కొక్క ఆహుతినీ ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి నివ్వాలి.


తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి.


గచ్ఛ గచ్ఛ పరంస్థానం యత్రదేవో నిరంజనః ।

గచ్ఛంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే ॥


దేవతలారా! సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష - ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలాకాకుండా అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్త్వాన్నీ, అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది.


చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి.


ఓం చక్రాయ స్వాహా |

ఓం విచక్రాయ స్వాహా |

ఓం సుచక్రాయ స్వాహా ।

ఓం మహాచక్రాయ స్వాహా |

ఓం అసురాంత కృత్ హుం ఫట్ |

ఓం హుం సహస్రార హుం ఫట్ |


గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు 'ద్వారకా చక్రపూజ' అని పేరు. ఇది సర్వమంగళదాయిని"


(అధ్యాయం -12)

Friday 22 December 2023

శ్రీ గరుడ పురాణము (41)

 


తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి.


ఓం వజ్రాయనమః | ఓం శక్త్యై నమః |


ఓం దండాయ నమః | ఓం ఖడ్గాయ నమః |


ఓం పాశాయ నమః | ఓం ధ్వజాయ నమః |


ఓం గదాయై నమః | ఓం త్రిశూలాయ నమః |


పిమ్మట అనంతునికీ, బ్రహ్మ దేవునికీ ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి.


ఓం లం అనంతాయ పాతాలాధిపతయే నమః ।


ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః ।


అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే పన్నెండక్షరాల బీజయుక్త శబ్దాలనూ, దశాక్షర మంత్రంలోని పదక్షరాల బీజయుక్త శబ్దాలనూ జపించాలి. ఇలా :


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః |


ఓం ఓం నమః | ఓం నం నమః | ఓం మోం నమః |


ఓం ఓం భం నమః | ఓం గం నమః | ఓం వం నమః |


ఓం తేం నమః | ఓం వం నమః | ఓం సుం నమః |


ఓం దేం నమః | ఓం వాం నమః । ఓం యం నమః ।


ఓం ఓం నమః | ఓం నం నమః । ఓం మోం నమః ।


ఓం నాం నమః | ఓం రాం నమః | ఓం యం నమః ।


ఓం ణాం నమః । ఓం యం నమః |


ద్వాదశాక్షర మంత్రం – ఓం నమోభగవతే వాసుదేవాయ


దశాక్షర మంత్రం – ఓం నమో నారాయణాయ నమః


అష్టాక్షర మంత్రం – ఓం పురుషోత్తమాయ నమః |


ఈ మూడు మంత్రాలనూ వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి.


నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన |

సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ ||


Thursday 21 December 2023

శ్రీ గరుడ పురాణము (40)

 


'ఆం హృదయాయ నమః |


ఈం శిరసే నమః |


ఊఁ శిఖాయై నమః |


ఐం కవచాయ నమః |


ఔం నేత్రత్రయాయ నమః |


అః ఫట్ అస్త్రాయ నమః ।


తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి.


ఆం సంకర్షణాయ నమః |


అం ప్రద్యుమ్నాయ నమః ।


అః అనిరుద్ధాయనమః |


ఓం అః నారాయణాయ నమః |


ఓం తత్సద్ బ్రహ్మణే నమః 


ఓం హుం విష్ణవే నమః |


క్షౌం నరసింహాయ నమః |


భూర్వరాహాయ నమః |


పిమ్మట స్వామి వారి పరివారాన్నీ ఆయుధాలనూ ఇలా కొలుచుకోవాలి.


కం టం జం శం వైనతేయాయ నమః |


జం ఖం వం సుదర్శనాయ నమః |


ఖం చం ఫం షం గదాయై నమః ।


వం లం మం క్షం పాంచజన్యాయ నమః ।


ఘం ఢం భం హం శ్రియై నమః |


గం డం వం శం పుష్ట్యై నమః ।


ధం వం వనమాలాయై నమః |


దం శం శ్రీ వత్సాయ నమః |


ఛం డం యం కౌస్తుభాయ నమః ।


శం శారంగాయ నమః |


ఇం ఇషుధిభ్యాం నమః |


చం చర్మణే నమః |


ఖం ఖడ్గాయ నమః |


అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికీ ముందు 'ఓం' కారాన్ని ఉచ్ఛరించాలి.


లం ఇంద్రాయ సురాధిపతయే నమః ।


రం అగ్నయే తేజోఽధిపతయే నమః ।


యమాయ ధర్మాధిపతయే నమః |


క్షం నైరృతాయ రక్షోఽధిపతయే నమః ।


వం వరుణాయ జలాధిపతయే నమః ।


యోం వాయవే ప్రాణాధిపతయే నమః ।


ధాం ధనదాయ ధనాధిపతయే నమః ।


హాం ఈశానాయ విద్యాధిపతయే నమః |



Wednesday 20 December 2023

శ్రీ గరుడ పురాణము (39)

 


పూజానుక్రమ - నిరూపణం

 

రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి.

 

తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.

 

ముందుగా నొక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలనూహించుకొని ఈ మంత్రాలను పఠించాలి.

ఓం అనంతాయ నమః |

 

ఓం ధర్మాయ నమః |

 

ఓం జ్ఞానాయ నమః |

 

ఓం వైరాగ్యాయ నమః ।

 

ఓం ఐశ్వర్యాయ నమః ।

 

ఓం అధర్మాయ నమః |

 

ఓం అజ్ఞానాయ నమః |

 

ఓం అవైరాగ్యాయ నమః ।

 

ఓం అనైశ్వర్యాయ నమః |

 

ఓం పద్మాయ నమః |

 

ఓం ఆదిత్య మండలాయ నమః ।

 

ఓం చంద్ర మండలాయ నమః ।

 

ఓం వహ్ని మండలాయ నమః |

 

ఓం విమలాయై నమః ।

 

ఓం ఉత్కర్షిణ్యై నమః |

 

ఓం జ్ఞానాయై నమః |

 

ఓం క్రియాయై నమః ।

 

ఓం యోగాయై నమః |

 

ఓం ప్రహ్వ్యై నమః |

 

ఓం సత్యాయై నమః |

 

ఓం ఈశానాయై నమః ।

 

ఓం సర్వతోముఖ్యై నమః ।

 

ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః |

 

తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసు దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది న్యాసం చేయాలి.


Tuesday 19 December 2023

శ్రీ గరుడ పురాణము (38)

 


ఓంకారం ప్రతి మంత్రానికీ ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈయీ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) వాడాలి. ఓం


కం టం పం శం              గరుడుడు

జఖం వం                   సుదర్శనం

షం చం ఫం షం              గద

వం లం మం క్షం             శంఖ

ఘం ఢం భం హం             లక్ష్మి

గం జం వం శం              పుష్టి

ఘం వం                   వనమాల

దం సం                   శ్రీవత్సం

ఛం డం పం యం           కౌస్తుభం


గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శునునిది సహస్ర సూర్యకాంతి. శ్రీవత్సం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం. వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి 'పుండరీకాక్ష' విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ అర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.


(అధ్యాయం 11)


Monday 18 December 2023

శ్రీ గరుడ పురాణము (37)

 


భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా 'ఓం అం వాసుదేవాయనమః, ఓం అం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అః అనిరుద్దాయ నమః అనే మంత్రాలతో పూజించాలి.


ఓంకారం, తత్పత్, హుం, క్షోం, భూః ఈ అయిదూ క్రమంగా, నారాయణ, బ్రహ్మ విష్ణు, *నరసింహ మహావరాహ భగవానుల బీజమంత్రాలు.


కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణునీ ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ, ఓం హుం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవునీ, ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహునీ, ఓం భూః మహా వరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్నీ పూజించాలి.


* 'నరసింహ' అనే శబ్దం సరికాదనీ 'నృసింహ' అనియే ఉండాలనీ కొందరు పండితులంటారు. బీజమంత్రాలు అనే మాట కన్న బీజాక్షరాలు అనే మాట తెలుగు ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతోంది.


పైన చెప్పబడిన తొమ్మండుగురు దేవతలూ (వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ) నవవ్యూహాధినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనెరంగు (రెండవ ఎరుపు గులాబీ రంగు) ఈ దేవతలంతా ఈయీ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్ధము.


Sunday 17 December 2023

శ్రీ గరుడ పురాణము (36)

 


తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో 'ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః' అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని వ్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై ననః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి.


పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాల నుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.


ఆపై సాధకుడు మండలమధ్యంలో దిశాభేదానుసారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ వ్యాసం చేయాలి.


ఈ ప్రకారంగా అందరు దేవతల న్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ద ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర, మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడవు పిడికిటిలో కుడిబొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటినీ సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి వుంచి ఒక్కొక్క వ్రేలిని వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.


రెండు చేతుల బొటనవ్రేళ్ళనూ వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను 'నరసింహ' ముద్ర అంటారు. కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తాన స్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని 'వారాహీ' ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని 'అంగముద్ర అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి.


Saturday 16 December 2023

శ్రీ గరుడ పురాణము (35)



సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్ఛాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి.


తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించుకోవాలి. తరువాత అష్టదళకమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.


వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాల పైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి.


తూర్పువైపు దళంలో  హృదయాయ నమః

దక్షిణం వైపు దళంలో  శిరసే స్వాహా

పశ్చిమం వైపు దళంలో   శిఖాయై వషట్

ఉత్తరం వైపు దళంలో    కవచాయ హుం

మధ్యంలో   నేత్రత్రయాయవైషట్

కోణంలో   అస్త్రాయఫట్ 


అంటూ న్యాసం చేయాలి,


Thursday 14 December 2023

శ్రీ గరుడ పురాణము (34)

 

తరువాత శరీరంలో, చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్ఠంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)


తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి.


తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.


బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి.


తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్రచిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :


అగ్ని కోణంలో            ఓం ధర్మాయ నమః


నైరృత్య కోణంలో          ఓం జ్ఞానాయ నమః


వాయు కోణంలో          ఓం వైరాగ్యాయ నమః


ఈశాన కోణంలో          ఓం ఐశ్వర్యాయ నమః


తూర్పు దిక్కులో          ఓం అధర్మాయ నమః


దక్షిణ దిక్కులో           ఓం అజ్ఞానాయ నమః


పడమటి దిక్కులో         ఓం అవైరాగ్యాయ నమః


ఉత్తర దిక్కులో           ఓం అనైశ్వర్యాయ నమః



అని అంటూ న్యాసం చేయాలి.


Wednesday 13 December 2023

శ్రీ గరుడ పురాణము (33)

 


* సమస్త శరీరాన్నీ రక్షిస్తూ, ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి వుంటుంది. దాన్ని 'అస్త్ర' అంటారు. న్యాసం చేసినపుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి.

తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజలో వలెనే స్థాపించాలి. హవనమూ చేయాలి. తరువాత


ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః 

అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి.


అటు పిమ్మట సాధకుడు- 'ఓం సౌం సరస్వత్యై నమః ।' ఓంహ్రీం సౌం సరస్వత్యై నమః | 'ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహాః' ఓం హ్రీం సరస్వత్యై నమః ' అను మంత్రాలనుచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి.


(అధ్యాయాలు 6-10)


నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం


“పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు.


“మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.


సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత 'రం' అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత 'యం' అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత 'లం' అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట 'వం' అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ 'పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే' అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి.


Tuesday 12 December 2023

శ్రీ గరుడ పురాణము (32)

 


విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి 'యం' అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి 'రం' అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి 'వం' అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ ధర్మాభిరుచినీ విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.


మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారాలుంటాయి. చేతిని పద్మంగానూ, వ్రేళ్ళనుపద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును.


ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గొనిపోవాలి.


శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధివిధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు.


ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రః 


అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.


ఓం శ్రాం హృదయాయ నమః |

ఓం శ్రీం శిరసే స్వాహా । 

ఓం శ్రూం శిఖాయై వషట్ | 

ఓం శ్రైం కవచాయ హుం | 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్ | 

ఓం శ్రః *అస్త్రాయ ఫట్ |


సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి. 


Monday 11 December 2023

శ్రీ గరుడ పురాణము (31)

 


సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేషపూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్ఠకాలతో నిర్మించాలి.

 

వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీ భావించుకొని న్యాసం చేసుకోవాలి. తరువాత అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ పద్మంలో (మండలంలో నిర్మింపబడిన పద్మంలో) కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధుని, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.

 

ఓం ఇంద్రాయ నమః - ఇంద్రుని - తూర్పులో

ఓం అగ్నయే నమః - అగ్నిని - ఆగ్నేయంలో

ఓం యమాయనమః - దక్షిణంలో - యముని

ఓం నిరృతయే నమః - నైఋతిలో - నిరృతిని

ఓం వరుణాయ నమః - పశ్చిమంలో - వరుణుని

ఓం వాయవే నమః - వాయవ్యంలో - వాయువుని

ఓం కుబేరాయ నమః - ఉత్తరంలో - కుబేరుని

ఓం ఈశానాయ నమః - ఈశాన్యంలో - ఈశ్వరుని

 

స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.

 

దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకొనేవారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం. (దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు)


Sunday 10 December 2023

శ్రీ గరుడ పురాణము (30)

 

శంకర దేవా! విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీ దేవి ప్రముఖమైనది. ఆమెనూ మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి.


ఓం హ్రాం హృదయాయ నమః | 

ఓం హ్రీం శిరసే నమః |

ఓం హ్రూం శిఖాయై నమః |

ఓం హ్రీం కవచాయ నమః |  

హౌం నేత్రత్రయాయనమః । 

ఓం హ్రః అస్త్రాయ నమః |


సరస్వతీ దేవి యొక్క యెనిమిది శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.


ఓం హ్రీం శ్రద్దాయై నమః ।

ఓం హ్రీం బుద్ద్యై నమః |

ఓం హ్రీం కలాయై నమః ।

ఓం హ్రీం మేధాయై నమః ।

ఓం హ్రీం తుష్ట్యై నమః |

ఓం హ్రీం పుష్ట్యై నమః |

ఓం హ్రీం ప్రభాయై నమః |

ఓం హ్రీం మత్యై నమః ।


తరువాత క్షేత్రపాలునికీ, గురువుకీ, పరమ గురునికీ ఈ మంత్రాలతోపూజలు చేయాలి.


ఓం క్షేత్రపాలాయ నమః |

ఓం గురుభ్యో నమః |

ఓం పరమ గురుభ్యో నమః ।


తరువాత సరస్వతీదేవికి కమలవాసినీ రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.


Saturday 9 December 2023

శ్రీ గరుడ పురాణము (29)

 


ఆ తరువాత


ఓం వాసుదేవమూర్తయే నమః॥ 

ఓం అం ఓం నమోభగవతే వాసుదేవాయ నమః |

ఓం ఆం ఓం నమోభగవతే సంకర్షణాయ నమః॥ 

ఓం అం ఓం నమోభగవతే ప్రద్యుమ్నాయ నమః ।

ఓం అః ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః ।


అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు


ఓం నారాయణాయ నమః |

ఓం తత్సద్ బ్రహ్మణే నమః |

ఓం హ్రూం విష్ణవే నమః |

ఓం క్రౌం నమోభగవతే నృసింహాయనమః ।

ఓం భూః ఓం నమోభగవతే వరాహాయ నమః |

ఓం కంటం పంశం వైనతేయాయ నమః |

ఓం జం ఖం రం సుదర్శనాయ నమః |

ఓం ఖంఠంఫంషం గదాయై నమః ।

ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః |

ఓం ఘం ఢం భం హం శ్రియై నమః ।

ఓం గండం వంసం పుష్యై నమః ।

ఓం ధం షం వంసం వనమాలాయై నమః |

ఓం సం దం లం శ్రీ వత్సాయ నమః |

ఓం ఠం చం భం యం కౌస్తుభాయ నమః |

ఓం గురుభ్యో నమః |

ఓం ఇంద్రాది భ్యోనమః |

ఓం విష్వక్సేనాయ నమః | 


అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి.


Friday 8 December 2023

శ్రీ గరుడ పురాణము (28)

 


శివపూజను ఇలా చేయాలి :


ఓం హ్రాం శివాయనమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. 

ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః! 

ఓం హ్రీం శిరయే స్వాహా! 

ఓం హ్రూం శిఖాయై వషట్ । 

ఓం హ్రీం కవచాయ హుం | 

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్ । 

ఓం హ్రః అస్త్రాయ నమః । 

అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత


ఓం హ్రాం సద్యోజాతాయ నమః ।

ఓం హ్రీం వామదేవాయ నమః | 

ఓం హ్రూం అఘోరాయ నమః ।

ఓం హైం తత్పురుషాయ నమః ।

ఓం హౌం ఈశానాయ నమః ।

అనే మంత్రాలతో ఆయన పంచముఖాలనూ పూజించాలి.


ఇలాగే విష్ణుదేవుని పూజించునపుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి.


Thursday 7 December 2023

శ్రీ గరుడ పురాణము (27)

 


దేవపూజా విధానం - వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీపూజ

 

రుద్రదేవా! ధర్మార్థకామమోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి :

 

ఓం నమః సూర్యమూర్తయే ।

ఓం హ్రాం హ్రీం సః సూర్యాయనమః ।

ఓం సోమాయ నమః |

ఓం మంగలాయ నమః |

ఓం బుధాయ నమః ।

ఓం బృహస్పతయే నమః ।

ఓం శుక్రాయ నమః |

ఓం శనైశ్చరాయ నమః |

ఓం రాహవే నమః |

ఓం కేతవే నమః |

ఓం తేజశ్చండాయ నమః |

 

ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి.


Wednesday 6 December 2023

శ్రీ గరుడ పురాణము (26)

 


ఖగా యను నామెకు యక్ష రాక్షస గణాలూ, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలూ, అరిష్టకు పరమసత్వసంపన్నులైన గంధర్వులూ పుట్టారు. నలభై తొమ్మిది మరుత్తులను దేవతలు (రాక్షస మాతయైన) దితి కడుపున పుట్టారు.


ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు ఏడుగురూ ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొకగణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋత, ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది నాలుగవ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు. అయిదవ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది ఆరవమరుద్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయీ, విరాట్టు, ఉద్వేషణులది ఏడవ మరుద్గణం. వీటిని వాయుగణాలనీ, స్కంధాలనీ కూడా అంటారు.


ఈ నలభై తొమ్మండుగురు మరుత్తులూ విష్ణురూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాదిగ్రహాలు వీరినే పూజిస్తారు.


(అధ్యాయం-6)


Tuesday 5 December 2023

శ్రీ గరుడ పురాణము (25)

 


పులోమా, కాలకా వైశ్వానరకన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలినుల వివాహం మరీచిపుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములనీ కాలకంజులనీ వ్యవహరించాడు.


విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు.


ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు రెండు వందలమంది ఉదయించారు. తామ్రాకు సత్త్వ గుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు. వారి పేర్లు :శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్రిక. వీరికి క్రమంగా 1. చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2. శ్యేనాలు 3. భాసాలు 4. అశ్వాలు, ఒంటెలు 5. నీటి పక్షులు 6. గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశమన్నారు.


(క్రమతలో తేడా : సుగ్రీవునికి గుఱ్ఱాలూ, గృధ్రికు గ్రద్దలు పుట్టాయి.)


వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా, కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు.


క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులూ, ఎద్దులూ, ఇరావతికి వృక్షకుటుంబమూ జన్మించాయి.


Monday 4 December 2023

శ్రీ గరుడ పురాణము (24)

 


దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి, రుద్ర నందనులైన హర, బహురూప, త్య్రంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు.


కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.


రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, ప్రద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి 'హ్లాదు’ లుగా ప్రసిద్ధి చెందారు; ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా(హ్రా)దునికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.


హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు.


దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాతవీరులు.


స్వర్భానుని కన్య సుప్రభ. వృష పర్వుని కూతురు శర్మిష్ఠ. అతనికింకా ఉపదానవి, హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు.


Sunday 3 December 2023

శ్రీ గరుడ పురాణము (23)



దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మరి రాలేదు.


దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు 'శబలాశ్వ' నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసివచ్చింది. 

ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా అరవైమంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరామహర్షికి, ఇద్దరు కన్యలను కృశాశ్వునికీ పది మందిని ధర్మునికీ, పదునాల్గురిని కశ్యపునికీ, ఇరవై ఎనమండుగురిని చంద్రునికీ ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను నలుగురు కన్యలను అరిష్టనేమి కిచ్చి వివాహముగావించాడు.


ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు. శంకరదేవా! భానుకి పన్నెండుగురు భానులూ, ముహూర్తకు ముహూర్తులూ జన్మించారు. లంబనుండి ఘోషులు, యామీ ద్వారా నాగవీథి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు.


ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వికాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు. అనల (అగ్ని) పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి; కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడై నాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు.