Sunday, 19 August 2018

యక్ష ప్రశ్నలు - 73


హిందూ ధర్మం - 272 (కర్మసిద్ధాంతం- 12)



మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ ముడు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.

ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాసం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.

3 గుణాలు ఇవి.
సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.

రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెల్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.

తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.

పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.

ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.

విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు.

ఇంకా ఉంది .......