Monday, 3 November 2014

కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి

ఓం నమో లక్ష్మీనారాయణాయ
కార్తీక శుద్ధ ద్వాదశి

కృతయుగంలో ఇదే రోజున దేవతలు - రాక్షసులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణ వచనం. అందువల్ల దీనికి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పేరు.

యోగనిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా దేవతలతో కూడి ఈరోజు తులసివనం (బృందావనం) / తులసి కోటలోనికి ప్రవేశిస్తాడని,  ఆయన్ను పూజించడానికి దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నెర, కింపురుషులు, సిద్ధులు, యోగులు మొదలైనవారంతా వస్తారని బ్రహ్మ దేవుడే చెప్పాడు.

అందువల్ల ఈ రోజు విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, విష్ణులోకానికి వెళతారని, ఈరోజు చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన ప్రత్తిపోగును కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని పురాణవచనం.

ఉసరి చెట్టు విష్ణుస్వరూపం. తులసి లక్ష్మీ స్వరూపం. ఈ రోజు తులసి - దామోదర వ్రతం చేస్తారు. అంటే తులసి ఉసరిక చెట్లకు కల్యాణం చేస్తారు. ఈ కల్యాణం చేస్తే లక్ష్మీనారాయణులకు కల్యాణం చేసిన ఫలం కలుగుతుంది. ఈరోజున తులసి మొక్క వద్ద దీపం వెలిగించినవారికి విష్ణుకృప కలుగుతుంది. తులసివనంలో శ్రీకృష్ణ విగ్రహం వద్ద ఎవరు దీపారాధన చేస్తారో, వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. మరణం తరువాత వైకుంఠానికి వెళతారు. ఈ రోజున తులసి వనంలో విష్ణువును పూజించనివారికి పూర్వపుణ్యాలు కూడా నశించి నరకానికి పోతారని, కోటి జన్మల పాటు పాపిగా పుడతాడని, పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం వంటి అనేకమైన మహాపాపాలు కూడా నశించి మహామహా పుణ్యాలు పొందుతారని పురాణం చెబుతోంది. వెలుగుతున్న దీపాల మధ్య తులసివనంలో ఉన్న విష్ణువు లేక ఉసరి చెట్టును కాని చూసి నమస్కరిస్తే వారి కోరికలు సిద్దిస్తాయి.

ఈ రోజున తులసిమొక్క వద్ద తప్పకుండా దీపదానం చేయాలి. ఒక దీపం దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. పది దీపాలు దానం చేస్తే శివసానిద్ధ్యం, ఇంతకుమించి దీపాలు దానం చేస్తే స్వర్గలోకానికి అధిపత్యం లభిస్తుందని, బ్రహ్మా మొదలైన దేవతలకు కూడా దీపదానం వల్లనే ఆ వైకుంఠంలో శాశ్వతమైన స్థానం కలిగిందని పురాణంలో కనిపిస్తుంది. దీపం వెలింగిచడానికి ఆవునేయి ఉత్తమము. లేకుంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. తులసి మొక్క ముందు ముగ్గులు వేసి, దీపాలతో అలంకరించి, తులసి స్తోత్రాలు చదవాలి.                       

No comments:

Post a Comment