Tuesday, 2 September 2014

గణపతి - సందేశం

ఓం గం గణపతయే నమః

గణపతి అనే శబ్దంలో 'గ' జ్ఞానానికి, 'ణ' నిర్వాణానికి సంకేతాలు కాగా, రెండింటికి అధిపతి, రెండిటిని ఏక కాలంలో ప్రసాదించగలిగినవాడు కనుక ఆయన్ను గణపతి అన్నారు అని బ్రహ్మవైవర్త్త పురాణ వచనం. జ్ఞానమే గణపతి యొక్క రూపం. గణపతికి పెద్దతల ఉంటుంది. ఇది బాగా ఆలోచించమని సూచిస్తుంది, పెద్దతల జ్ఞానానికి, మేధాశక్తికి సంకేతం. ఏనుగు కళ్ళు చిన్నగా ఉన్నా, చిన్న సూదిని కూడా చూడగలదు. చిన్నకళ్ళు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించమని, ప్రతి చిన్న విషయాన్నిపరిశీలించమని చెప్తాయి. చేట చెరుగుతుంది. అలాగే గణపతికున్న పెద్ద చెవులు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించమని, శ్రద్ధగా వినమని తెలియజేస్తాయి. జ్ఞానమును, విద్యను ఆర్జించడంలో శ్రద్ధయే కీలకం. గురువు అందరికి ఒకేలా చెప్తాడు. కానీ అది విన్నవారిలో ఒకడు మాహామేధావి, ప్రజ్ఞావంతుడవుతుంటే, ఒకడు వక్రమార్గం పడుతున్నాదు, విద్యను అర్దం చేసుకోలేకపోతున్నాడు. దానికి కారణం శ్రద్ధ.

గణపతి ఏకదంతుడు. ఒకే దంతం ఉన్నవాడు, చెడును వదిలి, మంచిని మాత్రమే నిలుపుకోమని తన ఏకదంతం ద్వారా లోకానికి సెలవిస్తున్నాడు. గణపతి వక్రతుండం ఆత్మకు, పరిపూర్ణమైన చైతన్యానికి సంకేతం. చిన్న నోరు తక్కువగా మాట్లాడమని సూచిస్తుంది.

గణపతికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో పాశం ధరించి ఉంటాడు. అంకుశం అహకారాన్ని, క్రోధాన్ని నాశింప చేసుకోవాలని చెప్పగా, పాశం మోహాన్ని వశం చేసుకోవాలని తెలుపుతుంది. గణపతి చేతిలో ఉండే మోదకం(లడ్డు), ఆ స్వామి మన సాధనకు మెచ్చి, ఇచ్చే పురస్కారం, అదే ఆత్మజ్ఞానం. మరొకచేతితో అభయముద్రలొ స్వామి సాక్షాత్కరిస్తాడు. భగవంతుడి మార్గంలో నడిచేవారికి సర్వేశ్వరుడు అభయాన్ని, రక్షణను ఇస్తాడని చెప్తుందీ అభయహస్తం.

గణపతికి పెద్ద బోజ్జ ఉంటుంది. అందుకే ఆయనకు లంబోదరుడని పేరు. సర్వలోకాలు, సమస్త బ్రహ్మాండాలు తన ఉదరమందు ఉండడం చేత ఆయన లంబోదరుడయ్యాడు. జీవితం అంటే కష్టసుఖాలు, మంచి చెడుల సంగమం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను, మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలని సూచన చేస్తుంది లంబోదరం. అట్లాగే ఎవరు ఏది చెప్పినా విను, ఇతరులు బాధలో పంచుకున్న రహస్యాలను నీలోనే దాచుకో అని చెప్తుంది లంబోదరం.

గణపతి వాహనం ఎలుక. ఎలుక మనసుకు, కోరికలకు ప్రతీక. మనసు ఒక విషయం మీద ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనలని మన మనసు నియంత్రిచడం కాదు, మనమే మన మనసును నియంత్రించుకోగలిగిన సత్తా కలిగి ఉండాలని సూచిస్తుంది ఎలుక వాహన. అంతేకాదు, మనం మన కోరికల మీద స్వారీ చేయాలి కానీ, కోరికలు మన మీద స్వారీ చేసి, మనకు బాధను మిగల్చకూడదని చెప్పడానికి గణపతి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు.

గణపతి పాదాలచేత ఉంటుంది ప్రసాదం. మనం కోరాలేకాని ప్రపంచం మొత్తాన్ని మన కాళ్ళ దగ్గర ఉంచగలడు గణపతి. అంతేకాదు, పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్నవాడి పాదాలకు ప్రపంచం దాసొహం అంటుందని అర్ధం.

గణపతి గురించి చెప్పుకుంటే సమస్త బ్రహ్మాండం గురించి చెప్పుకున్నట్టు. అటువంటి గణపతి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండుగాకా.

ఓం గం గణపతయే నమః            

No comments:

Post a Comment