14 లోకాలను మానసిక స్థితుల ఆధారంగా శరీరంలో ఎలా దర్శించవచ్చో చూశాం, ఇప్పుడు ఈ భూమి మీద ఇతర లోకాలు ఉన్నాయనే విషయం కూడా మన ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే ఒకే అంశాన్ని వేర్వేరు కోణాల్లో అనేక విధాలుగా దర్శించడం సనాతన ధర్మంలో కనిపించే గొప్ప లక్షణం.
పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. మనం భూమికి అవతలవైపు అన్నప్పుడు Anti-podes గురించి చెప్పుకోవడం లేదని గ్రహించాలి. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్నాయి. ఆష్ అనేది ఆంగ్లపదం, దానికి అర్దం బూడద, భస్మం. హార్స్ అంటే గుఱ్ఱం. ఐల్యాండ్ అంటే ద్వీపం. సగరపుత్రులు భస్మం అయిన ప్రదేశమే ఆష్ ఐల్యాండ్ అని, గుఱ్ఱాన్ని కట్టేసిన ప్రదేశం హార్స్ ఐల్యాండ్ అని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు. అసలు ఎప్పుడూ అమెరికా వెళ్ళని పరమాచార్య స్వామి వారు, అక్కడున్న ప్రాంతాలు, వాటికి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం గురించి చెప్పడం ఆశ్చర్యం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరిగ్గా ఆ హార్స్ ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్ ఉన్న ప్రాంతాలకు భూమికి ఇవతలవైపు గంగోత్రి హిమానీనదం ఉంది. ఈ రెండు ప్రదేశాలు (ఐల్యాండ్, ఆష్ ఐల్యాండ్) కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. భగీరథుడు తన పూర్వీకులైన సగరపుత్రుల బూడదకుప్పల మీద నుంచి గంగను పారించడానికి తపస్సు చేసి ఆకాశగంగను భూమికి తీసుకువస్తాడు. సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే ఈ ప్రాంతాలు ఉండటం, ఇక్కడి కథను సూచించే నామాలు కలిగి ఉండటం, అక్కడి స్థానిక సంస్కృతి నశించినా, ఆంగ్లంలో కూడా అవే పేర్లు కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అద్భుతం కూడా.
వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు. అలాగే మహాబలినగరం (మలిపునగర్)కు దగ్గరలోనే ఒక విష్ణు (వేంకటేశ్వర) ఆలయం నిర్మించారంటే అది ఆ ప్రాంతంలో ఉన్న శక్తిని తెలియజేస్తున్నది. అక్కడ నిక్షిప్తమైన తరంగాలే ఆ విధమైన నిర్మాణానికి సంకల్పం కలిగించాయేమో!
అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.
ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.
రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు. దక్షిణ అమెరికా లో ఒకనాడు పూజించబడిన ఆ భారీ వానరమూర్తి కొన్ని మెట్లు కలిగి ఎత్తున పెద్ద సింహాసనంలో కూర్చుని ఉండేదట. ఆ ఆలయానికి ప్రారంభంలో ఒక వైపు కప్ప, ఇంకో వైపు మకరం (మొసలి) చెక్కి ఉన్నాయి. హనుమంతులవారి స్వేదం స్వీకరించిన ధీర్ఘదేహి అనే దేవలోక కన్య రూపమే ఆ మకరం కావచ్చు. అలాగే ఆ భారీవానరమూర్తి సింహాసనానికి అటు, ఇటు క్రిందవైపున దర్బార్ మాదిరిగా ఉండి, అనేక వానరాలు కొలువై ఉన్నట్లు అక్కడి పరిశోధకులు కనుగొన్నారు. అది ఆంజనేయస్వామి వారి పరివారం కావచ్చు, లేదా మకరధ్వజుడు/ మత్స్యవల్లభుడి విగ్రహం కావచ్చు. సరిగ్గా ఆ భారీ వానరమూర్తికి ఎదురుగా బలులు ఇచ్చే స్థానం ఉంది. హిందూ ఆలయాల్లో కూడా మూలావిరాట్టుగా ఎదురుగా ధ్వజస్థంభం ముందు బలిపీఠం ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన అంశం.
1933 లో Honduras ప్రెసిడెంట్ Tiburcio Carías ఇక్కడ అన్వేషణ కోసం స్పాన్సర్ చేశారు. అక్కడి స్థానిక జాతులవారి జీవితం చెదిరిపోకముందే అక్కడ పరిశోధన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. Museum of the American Indian సంస్థాపకుడు George Gustav Heye తో అక్కడ పరీశీలన చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అన్వేషకుడు R. Stuart Murray దీన్ని ముందుకు నడిపించారు. అయితే ఆయన కొన్ని పురాతన అవశేషాలతో పాటు 'దట్టమైన అడవిచేత కప్పబడి ఉన్న పెద్ద శిథిలాలు' అనే వదంతులను ఆయన వారికి తెలియజేశారు. అక్కడే బహుసా శిథిలైన నగరం ఉండేది, దాన్నే ఇండియన్స్ (స్థానిక జాతులు) City of the Monkey God గా పిలుస్తారు... వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళినవారు ఒక నెలలోపు విషసర్పం యొక్క కాటు చేత మరణిస్తారని వారు నమ్ముతారు' అని నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం 1934 లో జరిగినా, దాన్ని అన్వేషించలేకపోయారు. అలా అక్కడ శిథిలాలను కొనుగొనాలనుకున్న అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది.
శతృబాధలు, పిశాచ భయాలు, రోగ నివారణ కోరకు నిత్యం పఠించవలసిన పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం ఇది. ఇందులో స్వామి రూపాన్ని గొప్పగా వర్ణించారు.
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం —— వానర ,నారసింహ ,గరుడ ,వరాహం, అశ్వ (హయగ్రీవ) అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన 15 నేత్రాలు (ఒక్కో ముఖానికి 3 కన్నులు), పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, ఢాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు (ఖట్వాంగం), మణులు, పాము, చెట్టు 10 హస్తములతో ధరించిన వాడు, పసుపు వన్నె కలవాడు, గర్వాన్ని హరించే వాడైన హనుమంతునికి నమస్కారం.
To be continued ...........
Source: https://pparihar.com/2015/03/29/hanuman-travelled-to-patala-loka-south-america-through-a-tunnel-worshipped-in-south-america/
https://en.wikipedia.org/wiki/La_Ciudad_Blanca#/media/File:Lost_City_of_the_Monkey_God.png
https://ramanan50.wordpress.com/2014/02/28/americas-the-patala-of-hinduism-mayas-hindus/
This comment has been removed by the author.
ReplyDeletehttps://www.youtube.com/watch?v=I2Q7RJmvkcE
ReplyDelete