స్వామి శివానంద గారి పుస్తకంలో ప్రచురించిన విషయమిది. 1996 లో ఈ పుస్తకం ముద్రితమైంది. ఒక మిత్రుడు అడిగారని నేటి నుంచి కార్తీకమాసం సందర్భంగా తెలుగులోకి అనువదించి పోస్ట్ చేయడం జరుగుతోంది.
శివయోగసాధన - 1
పంచాక్షరీ రహస్యం
నమశ్శివాయ అనే ఐదు అక్షరాలు కల మహామంత్రం పంచాక్షరి. తనను మననం చేసేవారికి సకల విఘ్నాలను, బాధలను తొలగించి, ఆత్మానందాన్ని, అమరత్వాన్ని ఇచ్చేది మంత్రము. సప్తకోటి మంత్రాల్లో పంచాక్షరి ఉత్తమమైనది. యజుర్వేదంలో ఏడు స్కందాలు ఉన్నాయి. మధ్యస్కందంలోని మధ్యలో రుద్రాధ్యాయం ఉంది. ఈ రుద్రాధ్యాయంలో 1,000 రుద్రమంత్రాలున్నాయి. నమశ్శివాయ లేదా శివపంచాక్షరి మంత్రం ఈ వేయి రుద్రమంత్రాల మధ్యలో అలరారుతోంది.
యజుర్వేదం వేదపురుషుడైన పరమేశ్వరిని తల. దాని మధ్యలో ఉన్న రుద్రం ఆయన ముఖము, పంచాక్షరి ఆయన కన్ను, నమశ్శివాయ మధ్యలో ఉన్న శివ ఆయన కనుగుడ్డు. ఈ పంచాక్షరీ మంత్రాని జపించేవాడు జనన మరణాల నుంచి విముక్తుడై శాశ్వత కైవల్యాన్ని పొందుతాడు. ఇది వేదాల స్పష్టమైన ప్రకటన. ఈ పంచాక్షరియే నటరాజు శరీరం. ఇదే శివపథం. మీరు నమ్మశివాయకు ప్రారంభంలో ఓం ను జత చేస్తే, అది షడక్షర మంత్రం (ఆరు అక్షరాల మంత్రం) అవుతుంది. ఓం నమో మహాదేవాయ అనేది 8 అక్షరాల లేక అష్టాక్షర మంత్రం.
పంచాక్షరి ఆరురకాలు. అవి స్థూలపంచాక్షరి (నమశ్శివాయ), సూక్ష్మ పంచాక్షరి (శివాయ నమః), కారణ పంచాక్షరి (శివాయ శివ), మహాకారణ పంచాక్షరి (శివాయ), మహామను లేదా ముక్తి పంచాక్షరి (శి).
నమః అంటే నమస్కారము. శివాయ నమః అంటే శివభగవానునకు నమస్కారములు. దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడు. 'నమః' జీవాత్మను సూచిస్తుంది. 'శివ' అనేది పరమాత్మను సూచిస్తుంది. 'ఆయ' అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ, పరమాత్మల ఉనికిని సూచిస్తుంది. అందుకే శివాయ నమః అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే 'తత్త్వమసి' లాంటి మహావాక్యం.
ప్రణవం అనేది భగవంతుని (వడ్లగింజ) బాహ్యరూపం (పొట్టు) మరియు పంచాక్షరి అనేది అంతఃస్వరూపం (బియ్యపు గింజ). ప్రణవము మరియు పంచాక్షరి ఒక్కటే. ఐదు అక్షరాలు భగవానుని ఐదు కర్మలను సూచిస్తాయి., అవి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. అవి పంచభూతాలను మరియు వాటి కలయికతో ఏర్పడిన సమస్త సృష్టిని/ జీవాలను సూచిస్తాయి.
'న' తిరోధాన్ని, 'మ' మలాన్ని లేదా అశుద్ధాన్ని, 'శి' శివుడిని, 'వా' ఈశ్వరానుగ్రహాన్ని, శక్తిని, 'య' జీవాత్మను సూచిస్తాయి.
స్నానం చేయండి, లేదా ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కోండి. భస్మాన్ని, రుద్రాక్షమాలను ధరించండి. పద్మాసనం లేదా సుఖాసనంలో, తూర్పు లేదా ఉత్తర అభిముఖంగా, ప్రశాంతమైన, నిశ్శబ్దమైన గదిలో కూర్చోండి. పంచాక్షరిని మౌనంగా జపించి, శివ భగవానుని రూపాన్ని ధ్యానించండి. ఆయన రూపాన్ని కనుబొమ్మల మధ్యలో లేదా హృదయంలో నిలుపుకోండి.
మీరు క్రమబద్ధంగా ధ్యానం సాధన చేస్తే, మీ హృదయం పరిశుద్ధమవుతుంది. సమస్త సంస్కారాలు, పాపాలు పూర్తిగా దగ్ధమవుతాయి. మీరు శివయోగ నిష్టను లేదా నిర్వికల్పసమాధిని పొందుతారు. మీరు ప్రకాశవంతమన శివపదాన్ని లేదా శివగతిని పొంది, శివునితో ఏకమవుతారు. శివానందన్ని అనుభవించి, అమరత్వాన్ని పొందుతారు.
శివుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.
No comments:
Post a Comment