పూర్వకాలంలో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనంలో శాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అధ్యయన - అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతడి ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవ గ్రహాలలాగా తొమ్మండుగురు పుత్ర సంతానం కలిగారు. వారిలో ధ్రువుడు - క్షమి - మధుడు - తారుడు జ్యోతిష్మంతుడు అనే అయిదుగురూ పరమ వైష్టికులు. కర్మిష్ఠులు. - నిత్యాగ్నిహోత్రులు. గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా వున్నారు. తక్కిన నలుగురూ విరక్తి మార్గం ఎంచుకున్నారు. నిర్మోహుడు -జితమాయుడు - ధ్యానకాష్టుడు- గుణాతిగుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహులై నిస్సంగులై నిష్పరిగ్రహులై శిఖా యజ్ఞోపవీతరహితులై అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీరి దృష్టిలో బంగారం ముద్దకూ, మట్టి గడ్డకూ తేడా లేదు. ఆకో అలమో మొలలకు అచ్ఛాదనగా ధరించడం, పండో ఫలమో దొరికింది తినడం - ఇదీ వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు- జితాహారులు. వాత శీత సహిష్ణువులు. ఈ చరాచర జగత్తులో అణువు అణువునా విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనంగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం. అణువంతైనా కర్మాచరణం చెయ్యని యోగులు, ధృఢ జ్ఞాన సంపన్నులు. సద్విచార విశారదులు.
వీళ్ళు నలుగురూ ఒక రోజున నీయింటికి వచ్చారు. అప్పుడు నీవు మత్స్యదేశంలో విప్రుడుగా భార్యాపుత్రాదులతో ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. నీకు అది ఎనిమిదవ జన్మ. వైశ్య దేవం ముగించుకొని అతిధులకోసం ఎదురుచూస్తూ నువ్వు వాకిలిలోకి వచ్చే సరికి ఈ నలుగురు నిరహులూ నీకు కనిపించారు. ఆదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో అతిధి మర్యాదలు చేసి సముచితాసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలి బద్ధుడవై వినమిత శిరస్కుడవై నిలబడ్డావు.
మహానుభావులారా ! ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది. జీవితం సమస్తమూ ధన్యమయ్యాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికీ స్వయంగా శ్రద్దగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు భక్తితో శిరస్సున జల్లుకున్నావు. అటుపైని వారికి పాద పూజలు చేసావు. షోడశోపచారాలు చేసావు. రుచిగా శుచిగా శాక పాకాలతో విందు భోజనం పెట్టావు. ఆ యతులు నలుగురూ పరంజ్యోతియైన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ యింటిలోనే విశ్రాంతి తీసుకున్నారు.