అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తికెక్కినవాడు ఎంత చెడ్డ పనిచేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకని వాడు, ఆ దొరకని నాడు పరమనీచుడై పోయి గుక్కెడు మద్యం కోసం హత్యచేయడానికైనా వెనుకాడడు. ఈ దశకి వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి వుంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినపుడు నవ్వుతాడు. నవ్వవలసినపుడు ఏడుస్తాడు. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు.
సహజంగా బాగా తిని అరిగించుకొనేశక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్నా వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తుకోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు.
తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త, కఫ దోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలూ ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును.
తఱచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు చీకట్లు కమ్ముట, వెక్కుళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్రపట్టక పోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనల్లో ఏదో అడ్డు పడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడిచేస్తే బయటికి కనిపించే లక్షణాలు. రోగి ఏదో కలల లోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు.
ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంటపుడుతున్నట్లుంటుంది. లోనాపైనా కూడా. జ్వరం, స్వేదనం, స్పృహ తప్పుట, గుండె దడ కనిపిస్తాయి.
కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట (ఉదరగౌరవం) అనే లక్షణాలు బయటపడతాయి.
తెలిసి తెలిసీ మత్తుకి అలవాటుపడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతీదీ వారికి ఆనందాన్నే కలిగిస్తుంటుంది.
కర్రముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో వుంచినా ఒకలాగే, చిన్నపిల్లల్లా, సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్న ట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులెక్కువగా వుంటాయి. ఏం మాట్లాడిన పెద్దగా అర్ధం వుండదు. ఒకటనుకొని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలొస్తుంటాయి. ఊపిరి హాయిగా, సక్రమంగా ఆడక అవస్థ పడుతుంటారు. దాహం, జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తుంటాయి. ఏదో ఒకటి రెండు మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు.
వంచనకు గురైనవారు, ప్రథమకోపులూ మత్తుకి సంబంధించిన మూడు రోగాలకూ అనగా మూర్ఛలు, నేలపైబడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పులకూ లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత, పిత్త, కఫలోపాలూ, మలిన రక్తం, శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలాకాలం పడుతుంది.