పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలనూ, మూర్ఛనూ, నోట చేదునీ, కంట ఎరుపునీ, శరీరంపై పొడినీ, లోపల మంటనీ, రోమకూపాల్లోంచి ఆవిరులొస్తున్న భ్రమనీ కలిగిస్తుంది.
హానికారక కఫం ఒక చోట స్థిరంగా వుండిపోయి అలా వెళుతున్న, జలనాళి కలలోని, వాయువుని అడ్డేస్తుంది. అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్రవస్తున్నట్లు వుండడం అనుభవమవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసము, తిండి నచ్చకపోవుట, అజీర్ణము- ఇవన్నీ త్రిదోషాలూ కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి.
చీము, అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాత, పిత్తాలు ఆందోళితమవుతాయి. దీని వల్ల రోగి కొంతసేపు వేడినీ కొంతసేపు చల్లదనాన్నీ తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి.
దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోష కారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం.
(అధ్యాయం - 154)
మదాత్యయరోగ నిదానం
మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది.
మధువును గాని సారాను గాని ఇతర మాదక ద్రవ్యాలను గాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారుచేస్తుంది. దాంతో అవి ఏ మందుకీ ప్రతి చర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలనుద్రేకపఱచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీరభాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా వుంటుంది కాని తరువాత ఆ సుఖం వుండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతునే ఉంటాడు. తాగుడుకి అలవాటుపడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పమువంటివాడు. ఈ మత్తులో గాని, అది దొరకనపుడు గానీ ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డపనులు చేయిస్తుంది.
No comments:
Post a Comment