ఓం శ్రీ దత్తశరణం మమ
ఒకసారి నారదుడు సరస్వతి,లక్ష్మీ,పార్వతులు కలిసి ఉండగావచ్చి మీకంటే గొప్ప పతివ్రత ఉంది ఈ లోకంలో, ఆమె అత్రి మహర్షి భార్య అనసూయ దేవి అన్నాడు. వారు ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి తెలియపరచాలనుకున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఆమెను పరిక్షించడానికి, ఆమె పతిభక్తిని లోకాలకు తెలియజేయడానికి సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి బిక్షకు వెళ్తారు. అప్పుడు అత్రి మహార్షి ఆశ్రమంలో ఉండరు. అనసూయదేవి వారిని లోపలికి ఆహ్వానించి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. వడ్డించే సమయానికి వారు ఆమెను వివస్త్రగా ఆహారం పెట్టమని కోరుతారు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, చేతిలో నీరు తీసుకుని, తన భర్తను స్మరించి, మంత్రం జపించి వారి మీద చల్లుతుంది. వేంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోతారు. వారు కోరినట్టుగానే అనసూయదేవి త్రిమూర్తులకు పాలు ఇస్తుంది. అత్రిమహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చాకా ఆ ముగ్గురు పసిపిల్లలను తన హృదయానికి హత్తుకుని 3 తలలు, 6 చేతులు ఉన్న ఒక పిల్లవానిగా మార్చివేస్తారు. తమ భర్తలు ఎంతసేపటికి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి-అనసూయ దంపతులతో తమ భర్తలకు నిజరూపాలు ఇవ్వమని వేడుకుంటారు. అందుకు అనసూయ దేవి అంగీకరించి వారి మీద తిరిగి మంత్రించిన జలం చల్లుతుంది. వారి వారి సాధారణ రూపాలను పొందిన త్రిమూర్తులు అత్రి-అనసూయలకు తమ అంశయైన దత్తాత్రేయ స్వామిని కూమారునిగా ప్రసాదిస్తారు. దత్తాత్రేయ స్వామి అవతారం మార్గశిర పౌర్ణమి నాడు జరిగింది.
ఈయనను పూజిస్తే భూతప్రేతపిశాచాల బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్ధులకు దత్తాత్రేయ స్వామి విద్యాప్రదాత. మేడి చెట్టు (ఔదుంబర వృక్షం) కింద ఉంటాడు. ఈయన వద్ద నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు.
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం శ్రీ దత్త శరణం మమ
ఓం శాంతిః శాంతిః శాంతిః
No comments:
Post a Comment