Friday, 18 January 2013

గంగావతరణం(3)

ఓం
గంగావతరణం(3)

భృగు మహర్షి వద్దకు వెళ్ళి ఎవరికి వశోద్ధారకుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది మహోత్సాహవంతులు జన్మిస్తారో అడుగగా, వారికి ఎవరు జన్మించాలో వారినే కోరుకోమన్నారు భృగువు.

కేశిని ధర్మం తెలిసినది. కన్నవారిని వదులుకుని, ఇంటి పేరును మార్చుకుని, భర్త వెంట నడిచి స్త్రీ ఎందుకు వస్తుంది అంటే భర్త వంశాన్ని నిలబెట్టాడానికే, తాను సంతానాన్ని కని, తన భర్త వంశాన్ని కొనసాగేలా చేయాడానికే అని ధర్మం చెప్తోంది. అంతేకాదు ఒక తండ్రి అదృష్టవంతుడని ఎప్పుడు అనిపించుకుంటాడంటే, తనకు మంచి సంతానం కలిగి, వారికి సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి, వారందరిని తన కళ్ళతో చూసినప్పుడే. ధర్మం తెలిసినది కనుక తనకు వంశకరుడు జన్మించాలని కోరుకుంది.

సుమతి తనకు 60,000 మంది మహోత్సాహవంతులు కలగాలని కోరుకుంది. ఎంత మంది పుడితే ఏం లాభం. ఒక్కడు పుట్టినా వాడు వంశం పేరు నిలబెట్టేవారు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి.

మహాతపశ్శాలి, సత్యమే మాట్లాడేవాడు, వేదం అర్ధం సహితంగా తెలిసినవాడూ, వేదాన్ని నిరంతరం పఠించేవాడైన భృగుమహర్షి మాటలు నిజమైనాయి.కొంతకాలనికి వారు గర్భం ధరించారు, ప్రసవించారు. కేశినికి వంశకరుడైన కూమారుడు జన్మించాడు, అతనికి అసమంజసుడు అని నామకరణం చేశారు. సుమతికి ఒక మాంసపిండం నుండి 60,000 వేల మంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు. వారు మరి చిన్నగా ఉండడం చేత నేతిభాండములలో పెట్టి వారిని పెంచారు. ఈనాడు మన చెబుతున్న test tube babies, ఇటువంటి గొప్ప శాస్త్రపరిజ్ఞానం త్రేతాయుగంలో, దాదాపు 12 లక్షల సంవత్సరముల క్రితమే మన హిందువులకు ఉంది. వారిని దాదులు(ఆయలు) పెంచి పెద్ద చేశారు. 

అసమంజసుడు, 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవారువుతున్నారు. 60,000 మంది బాగా ఉత్సాహవంతులయ్యారు. ప్రతి పనికి అత్యుత్సాహం చూపించేవారు. ఈ అసమంజసుడికి ఒక దురలవాటు ఉంది. రాజ్యంలో ఉన్న పిల్లలందరిని ఆడుకుందామన్న నెపంతో సరయు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, వారిని నదిలో ముంచి, వారి మీద నిలబడి తొక్కి, ఊపిరి ఆడకుండా చేసి, వారిని చంపి ఆనందించేవాడు. ప్రజలు చాలా కాలం పాటు సహనంతో ఉన్నా, కొంతకాలానికి వారికి సహనం నశించి, వెళ్ళి రాజైన సగరుడికి విన్నవించుకున్నారు.            

to be continued................

No comments:

Post a Comment