Saturday, 14 September 2013

హేరంబ గణపతి

గణపతికి హేరంబుడని, హేరంబ గనపతి అని పేరు. దీనమైన, దయనీయ స్థితిలో ఉన్నవారు, ఆజ్ఞానాంధకారంలో పడి ఉన్నవారు, మాయచేత కప్పబడినవారు, శరణార్ధులు మొదలైనవారికి సంకేతం 'హే' అని అక్షరం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నవారిని రక్షించేవాడు, పాలిచేవాడు అని సూచుస్తుంది 'రంబః' అనే అక్షరం. దీనులైనవారిని, బలహీనులను, రక్షిస్తూ, వారి బాధ్యతలను స్వీకరించి స్వయంగా తానే చూసుకుంటూ పాలించేవాడు కనుక గణపతిని హేరంబః అని అంటారని బ్రహ్మవైవర్త పురాణం గణేశ ఖండంలో చెప్పబడింది.

నిజానికి మనమంతా దీనులమే. కనిపించే ఈ రక్తమాంస నిర్మితమైన శరీరమే శాశ్వతమనుకుంటూ, ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతూ, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక, క్షణికసుఖాలే జీవతమనుకుంటూ, మాయలో మునిగిపోయిన మనమే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాం. శరణు వేడిన వెంటనే అందరిని ఇటువంటి స్థితి నుంచి ఉద్దరించి, మనం ఈ శరీరం కాదు, ఈ దేహంలో ఉన్న పరిపూర్ణ ఆనంద ఆత్మ స్వరూపలమనే జ్ఞానం కలిగజేసి,ఈ దయనీయ స్థితినుంచి ఉద్ధరించి, మన బాధ్యాతలను స్వీకరించి మనల్ని ఆ హేరంబ గణపతి సదా పాలిచుగాకా.

దీనార్ధవాచకో హేశ్చ రంబః పాలకవాచకః |
పాలకం దీనలోకానాం హేరంబం ప్రణమామ్యహం ||

ఓం గం గణపతయే నమః          

No comments:

Post a Comment