Saturday, 19 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - శ్రీనివాసుడు వేంకటాచక ఆగమనం

ఓం నమో వేంకటేశాయ

భృగుమహర్షి వైకుంఠంలో ఉన్నంతవరకు లక్ష్మీదేవుకి మహర్షికి సపర్యలు చేసింది, విష్ణుమూర్తికి సహకరించింది. పాదపూజకు గోరువెచ్చటి నీరు తెచ్చింది, పాదపూజ చేస్తున్న సమయంలో విష్ణువుకు సహకరించింది, మహర్షి పాదోదకం తలపై చల్లుకుంది.

ఎంతగొడవలుంటే మాత్రం అందరి ముందు బయట పెట్టుకుంటామా? మన పరువుకే ఎసరు తెచ్చుకుంటామా? అందువల్ల అంతసేపు మౌనం వహించింది. కానీ మహర్షి వెళ్ళిపోగానే విష్ణువుపై కోపంతో విరుచుకుపడింది (కోపం నటించింది).విష్ణు వక్షస్థలం తన నివాస స్థానమనీ, అటువంటి చోట కాలితో తన్ని, ఒక మానవుడు తనకు అవమానం చేస్తే, విష్ణువు అతడిని శిక్షించకపోగా, సత్కరించాడని, అతనికి చేసే పాదపూజలో తానూ భాగం పంచుకోవలసి వచ్చిందని, ఇంత అవమానం జరిగాకా తాను వైకుంఠంలో ఉండే ప్రసక్తే లేదని, అందువల్ల తానూ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోతున్నాని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది.

అసలు అమ్మవారికి కోపం రావడమేమిటి? విష్ణువును విడిచివెళ్ళడమేమిటి? అంటే, ఇదంతా ఒక లీల. లక్ష్మీదేవికి మనమంతా బిడ్డలం. కలియుగంలో శ్రినివాసుడిగా శ్రీ మహావిష్ణువు వేంకటాచలం మీదకు రావాలి. తన బిడ్డలను కలిపురుషుడు ప్రభావం నుంచి రక్షించాలి, లోకకల్యాణం జరగాలి. వైకుంఠం మొత్తం తిరుమలకు తరలిరావాలి.. అందుకోసం లక్ష్మీదేవి ఈ నాటకమాడింది.

కృష్ణావతారంలో స్వామి యశోదకు వరమిచ్చాడు - శ్రీ కృష్ణుడిని చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచింది యశోద. కృష్ణుడు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్క వివాహం కూడా చూడలేకపోయింది. ఈ బాధ యశోదమ్మను బాగా వేదించింది.  పరమాత్ముడే తన బిడ్డగా పెరిగినా, సంసారమాయలో పడి, మోక్షం అడగాల్సిందిపోయి, కృష్ణుడి వివాహం చూసే భాగ్యం కలిగించమని వరం కోరింది. ఈ ద్వాపరయుగంలో, కుదరదని రాబోయే 28 వ కలియుగంలో తన కోరిక నేరవేరుతుందని యశోదకు కృష్ణుడు వరమిస్తాడు. మరి ఆ కోరికను నేరవేర్చాలంటే, విష్ణువే కృష్ణుడిగా, వేంకటేశ్వరునిగా భూలోకానికి రావాలి. అందుకోసం జరిగే మహానాటకంలో భాగంగా లక్ష్మీదేవి విష్ణువుపై అలిగింది.      
లక్ష్మీదేవి కరివీరపురం వెళ్ళి, అక్కడ తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ఉండలేక దుఃఖిస్తూ భూలోకానికి బయదేరాడు. శేషుడు, మేరుపర్వతాలకు ఇచ్చిన వరాల దృష్ట్యా విష్ణువు వేంకటాచలం మీదకు వచ్చాడు. రాముడు, కృష్ణుడు, వామనుడు లాగా ఇది విష్ణువు యొక్క వేరొక అవాతారం కాదు, సాక్షాత్తు విషువే కృష్ణుడి రూపంలో, వేంకటేశ్వరునిగా రావడం విశేషం. లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోయిందన్న బాధతో ఒక వల్మీకం (పుట్ట)లో చేరి ఈయన తపస్సు చేయసాగాడు.

చిన్నచిన్న నాయకులే ఒక ప్రదేశానికి వస్తుంటే, మందీమార్బలం తరలివస్తుంది. అదే పెద్ద నాయకుడైతే, బోలెడు రక్షణ, ఎంతో మంది పోలిసులు, మిలటరీవాళ్ళు, అభిమానులు......... పెద్ద సంఖ్యలో వస్తారు. మరి వేంకటాచలం మీదకు వచ్చిందేమైనా సామాన్య మానవుడా? కాదు......... అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వదేవతలకు అధిదేవుడు. మరి ఈయన వేంకటాచలానికి వస్తుంటే, ఈయన వెంట దేవతలు రాకుండా ఉంటారా?

మొత్తం వైకుంఠం తిరుమలకు తరలి వచ్చింది. ఆదిశేషుడే తిరుమల కొండ, శంఖుచక్రాలు మొదలైనవి వేంకటాచలం మీద తీర్ధాలుగా మారాయి. త్రేతాయుగంలో హనుమంతుడు వేంకటాచలం మీదే జన్మించారు. దేవతలందరు వృషాలుగా మారిపోయారు, ఋషులు, మునులు మృగాలుగా మారారు, పితృదేవతలు పక్షులుగా, యక్షకిన్నెరులు రాళ్ళుగా వేంకటాచలం మీద స్థిరపడ్దారు, వారు కూడా వారివారి సాధనలో మునిగిపోయారు. సమస్త బ్రహ్మాండమంతా వేంకటాచలం మీదకు వేంచేసింది.

అందుకే తిరుమల పరమపవిత్రం. తిరుమలలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం, చెత్త, ప్లాస్టిక్‌కవర్లు పారేయడం, సిగిరెట్లు కాల్చడం, మద్యపానం చేయడం, మాంసాహారం తినడం, ఇంకా నేను చెప్పడం ఎందుకు. తిరుమల పవిత్రతకు బంగం కలిగించే పనులు చేయడం పెద్దతప్పు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వామికి ఆకలి తీర్చేవారేరి? పాలసముద్రంలో శయనించే శ్రీనివాసుడు ఒక మానవుడిగా వేంకటాచలం మీద తపస్సు చేస్తున్నా, ఆయనకు గుక్కెడు పాలు ఇచ్చేవారేరి? శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు (కాదు, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆకలి నటిస్తున్నాడు. అదేంటో తరువాత తెలుస్తుంది).

ఎంత కోపగించుకున్నా, ప్రేమలు ఎక్కడికిపోతాయి? లక్ష్మీదేవి కరివీరపురంలో ఉంది కానీ, ఆవిడ మనసంతా శ్రీనివాసుడి మీదే ఉన్నది. భార్యాభర్తలంటే అంతేమరి.

లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఆకలి బాధ తీర్చడం కోసం తన కొడుకైన బ్రహ్మను, సోదరుడైన శివుడిని పిలిచి, బ్రహ్మ ఆవుగా రూపం స్వీకరిస్తారని, శివుడుని దూడగా స్వీకరించమని, తాను గొల్లదాని వేషం దరిస్తానని చెప్తుంది. శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న ప్రాంత రాజు యొక్క ఆవుల మంద వేంకటాచలం మీద గడ్డి మేతకు వెళ్తుందని అమ్మవారికి తెలుసు. శ్రీనివాసుడు క్షీరాభిమాని. ఆయనకు పాలు అంటే మహాప్రితి. ఈనాటికి తిరుమలలో ఉదయం ఆవుపాలు నైవేధ్యం పెడతారు, భోగశ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తారు, శుక్రవారం మూలవిరాట్టుకు కూడా క్షీరాభిషేకం తప్పక చేస్తారు). పుట్టలో ఉన్న తన స్వామికి కైంకర్యం ఏర్పాటు చేయాలనుకొంది.

చెప్పిన విధంగానే వేషం ధరించి ఆ ప్రాంతపు రాజ మందిరానికి, ఆవును, దూడను వెంట పెట్టుకుని వెళ్ళింది. అది చోళదేశం, ఆ రాజు పేరు చక్రవర్తి. తన దగ్గర ఉన్నది మేలుజాతి గోవని, అది మధురమైన పాలు ఇస్తుందని చెప్తుంది. మేలుజాతి ఆవు అంటోంది కనుక, ఆ ఆవుపాలు తన కొడుకు కోసం వాడితే బాగుంటుందని భావించిన మహారాణి, గోవును, దాని దూడను కొనాలని నిశ్చయించుకుని, దాన్ని కొంటుంది.

ఆ ఆవు ప్రతిరోజు మిగితా మందతో కలిసి వేంకటాచలానికి వెళ్ళేది. కానీ, మేతమేయకుండా శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్ట వద్దకు వెళ్ళగానే భక్తి పారవశ్యంతో ఎవరూ పిండకుండానే తన పొదుగునుంచి పాలు ధారులుగా కార్చేది. రోజూ ఇదే పరిస్థితి. ఆవు (బ్రహ్మదేవుడు) వేంకటాచలానికి రావడం, శ్రీనివాసుడి ఆకలి తీర్చడం.

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తిరిగి రాజమహలు చేరాక, పాలు ఇచ్చేది కాదు. రాణిగారికి పరిస్థితి అర్దమవలేదు. ఎంతో ఖరీదు పోసి కొన్న మేలుజాతు ఆవు ఉద్దరిణెకు సరిపడా పాలు కూడా ఇవ్వడంలేదు. కారణం తెలియదు. గోపాలకుడు పితుకుతున్నాడనుకుని అతడిని పిలిచి అడుగగా, తనకేమి తెలియదని, తాను పాలుపితకడం లేదని ప్రమాణం, చేసి మరీ చెప్తున్నాడు. ఏం చేయాలి?..... అని ఆలోచించి గోపాలకుడిని దండించింది, కొరడాలతో కొట్టించింది, హెచ్చరించింది, పరిస్థితి మారకపోతే కఠినశిక్ష తప్పదని హెచ్చరించింది.

హడలిపోయిన గోపాలకుడు ఆ ఆవు వెనుకాలే వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న వింత కళ్ళారా చూశాడు. ఆవు పొదుగునుండి పాలు ధార్లుగా పుట్టలోకి కారిపోతున్నాయి. తనను అంతగా కొట్టించి, మాటలు పడడానికి కారనమైన ఆవు మీద అతనికి పట్టరాని కోపం వచ్చింది. వేంటనే ఆవేశంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టబోయాడు.

భక్తవత్సలుడు, కరుణాసముద్రుడు, ఆశ్రితరక్షకుడు, జీవితకాలం దూషించి, జీవితం ఆఖరున పరమాత్మ అని ప్రేమతో పిలవగానే 'నేనున్నా రా' అంటూ పలికే పరంధాముడు, తన బిడ్డపై దెబ్బ పడుతుంటే చూస్తూ ఉరుకుంటాడా? కృష్ణావతరంలో బాల్యం మొత్త గోవులతో గడిపి గోవు విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గోకులనందనుడు గో హత్య జరుగుతుంటే మౌనం వహిస్తాడా? 

అందుకే పుట్టలో ఉన్న పరమాత్మ ఆవును పక్కకు నెట్టుకుంటూ ఒక్కసారిగా పైకి లేచాడు. గొడ్డలి దబ్బను స్వామి స్వీకరించాడు. ఆ దెబ్బకు స్వమి తల చిట్లి, ఏడు తాటి చెట్ల ప్రమాణం ఎత్తు ఎగిరిందని భవిష్యోత్తర పురాణం అంటుంది. అంతే, ఆ సంఘటనతో ఆ గోపాలకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిజానికి ఆయనది మనలా ప్రాకృతిక దేహం కాదు, అది సప్తధాతువులతో నిర్మితమై ఉండదు. కాని, ఒక లీల చూపడానికి, గో మహత్యం లోకానికి చెప్పడానికి, గోవును కొట్టాలన్నా ఆలోచనే తనకు గాయం చేస్తుందన్న విషయాన్ని లోకానికి తెలియజెప్పాలనుకున్నాడు.

ఆ గోపాలకుడు మరణించగానే, ఆ ఆవు కొండదిగి రాజమందిరానికి వెళ్ళి, రాజుసభలో రోదిస్తుంది. ఏదో జరిగిందని అర్దం చేసుకున్న రాజు, ఆ ఆవు వెంబడి సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ప్రవహిస్తున్న రక్తాన్ని, గాయపడిన దివ్యపురుషుడిని చూస్తాడు. ఆ రుజును చూస్తూనే శ్రీనివాసుడు ఆవేశంతో ఊగిపోతాడు.

చక్రవర్తితో స్వామి చాలా నిష్ఠురంగా మాట్లాడుతారు. 'ఓయి రాజా! నీ రాజ్యంలో ఇంత అరాచకమా? జరిగిన తప్పుకు శిక్ష అనుభవించు. పిశాచిగా మారిపో' అంటూ శపించారు.

నేనెం తప్పు చేశాను? గోపాలకుడు చేసిన తప్పకు నన్ను శిక్షించడం ఎందుకు? అయినా ఇంత పెద్ద శిక్ష వేస్తావా? చేయనై తప్పుకు శిక్ష అనుభవించాలా? అంటూ చక్రవర్తి స్వామివారితో పలుకుతాడు.

ఇంట్లో భార్య, పిల్లలు, పనివారు / సేవకులు చేసిన తప్పకు బాధ్యత యజమానిది. శిష్యుడి తప్పు చేస్తే బాధ్యత గురువుది. రాజ్యంలో తప్పులు జరిగితే బాధ్యత రాజుది. కనుక యజమానిగా, రాజుగా, నీ గోపాలకుడు చేసిన తప్పకు శిక్ష నీవే అనుభవించాలంటాడు శ్రీనివాసుడు.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కేవలం ఆవును దాడి చేయాలన్న ప్రయత్నం జరిగితేనే స్వామి ఆవేశం కట్టలు తెంచుకుంది. మరి గోవధ జరిగితేనో? ఈ ప్రపంచంలో పుట్టింది మొదలు మరణం వరకు, ఆఖరికి మరణీంచిన తరువాత కూడా సంపూర్తిగా లోకోపకారానికి ఉపయోగపడేది భారతీయ గోవు ఒక్కటే. గావో వీశ్వస్యమాతరం అంటుంది వేదం. ఆవు సమస్త విశ్వానికి మాతృస్థానంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధ జరగరాదని వేదం గట్టిగా చెప్పింది. గోవు సర్వదేవాతస్వరూపం.

ప్రతిరోజు ఉదయం, మన దేశంలో లేగదూడలను, ఆవులను వేలల్లో వధించి విదేశాలకు తరలిస్తున్నారు. ఆవు మీద దబ్బపడినందుకు అంత ఎత్తున లేచిన స్వామి మన దేశంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ పాపం ఎవరిది? మన నాయకులది............ కాదు, కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలది. మనం గోవధ మీద నోరెత్తకపోతే, మనకూ, మన పిల్లలకు కూడా ఇదే శాపం వర్తిస్తుందని మర్చిపోకూడదు.

పరమాత్ముడి మాటలతో రాజు దుఃఖిస్తాడు. రాజుకు ఊరట కలిగిస్తూ, త్వరలో తనకు పద్మావతీ దేవితో వివాహం జరుగుతుందని, అప్పుడు పద్మావతీదేబి తండ్రి ఆకాశరాజు ఒక కిరీటం బహుకరిస్తాడనీ, ఆ కిరీటాన్ని తాను ధరించిన ప్రతి శుక్రవారం ధరిస్తాననీ, అప్పుడు ఒక 6 ఘడియల కాలం ఆనందబాష్పాలు వస్తాయానీ చెప్పిన శ్రీనివాసుడు, అప్పుడు నీకు పిశాచపీడ ఉండదు, ఆ సమయంలో నీవు సుఖం అనుభవిస్తావు అంటూ రాజుతో పలుకుతాడు.

వల్మీకంలో ఉంటున్న స్వామి, ఒకానొక రోజు పుట్టనుంచి బయటకు వచ్చి, అక్కడ విహారం చేస్తుండగా, వరహాస్వామి తన పరివారంతో కలిసి దూరం నుంచి అటువైపు వస్తుండడం గమనించి, భయపడి గబగబా మళ్ళీ వల్మీకంలోకి వెళ్ళి దాక్కున్నాడు.

హిరణ్యాక్షుని వధించి, భూదేవిని కాపాడిన తరువాత ఆదివరహాస్వామి ఈ వేంకటాచల క్షేత్రంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు. శమీకధాన్యం పంటల్ని పరివారం చేత పండిస్తూ ఈ క్షేత్రంలో నివాసముంటున్నారు. తమ శమీక ధాన్యాన్ని దొంగిలించడానికి వచ్చిన దైత్యులను సంహరించి వస్తున్నారు.

శ్రీనివాసుడు వల్మీకంలోకి వెళ్ళడం చూసిన వరాహమూర్తి, పుట్ట దగ్గరకు వెళ్ళి బయటకు రమ్మని శ్రీనివాసుడిని పిలుస్తారు. ఇది ఒక మహాద్భుత ఘట్టం. ఒకే విష్ణువు యొక్క వేర్వేరు రూపాలు ఒకే దగ్గర కలుసుకోవడం, ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం, తమ వివరాలు చెప్పుకోవడం మాట్లాడుకోవడం మహావిశేషమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని దేవలోకం నుంచి తిలకిస్తున్న దేవతలు భక్తిభావంతో పుష్పవర్షం కురిపించారు.

అసలు భగవంతుడు ఒక్కడే. కానీ అనేకరూపాల్లో దర్శనమిస్తాడు. మాయ ప్రభావం చేత శివుడు, విష్ణువు, దుర్గ, లక్ష్మీ, గణపతి, సరస్వతీ........... ఇలా ఎంతో మంది దేవతలు ఉన్నారనుకుంటాము. ఎవరిని పూజించినా, ఆఖరున అన్ని దైవరూపాలు ఒకే సచ్చిదానందరూపంలొ ఐక్యమవుతాయి. ఇక్కడ విష్ణువు ఒక్క వివిధ అవతారాలు కలుసుకోవడం కూడా మాయలో పడవేయడానికే. అర్దమైనవారు దైవలీలగా అనందిస్తే, అర్దం కానీ వారు, దైవాలు వేరనుకోని కొత్తవాదన తిసుకువచ్చి, ఉపాసన నుంచి పక్కకు జరుగుతారు.

ఈ ఆదివరాహస్వామిని దర్శించి ఆయన స్తోత్రం పఠిస్తే, ఇల్లు కట్టుకోవాలన్న కల నేరవేరుతుంది. ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించడానికి భూమి దొరుకుతుంది.  

నాకు మీ వరహాచలం మీద నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలని శ్రీనివాసుడు వరహాస్వామిని అడుగుతారు. కలికాలంలో జరగబోయే పరిస్థితులు చూపించడానికన్నట్లు ఉంటుంది. అడగకుండానే, ఎన్నో రోజులుగా అక్కడ పుట్టలో అక్రమంగా ఉంటున్నారు. ఇవాళ వరహాస్వామికి కనపడ్డాడు కాబట్టి స్థలం కావాలని ఆడుగుతున్నాడు, ఇవ్వమని అనుమతి కోరుతున్నాడు.

ఈరోజు ప్రభుత్వం స్థలాల గతి కూడా ఇంతే కదా. ముందు అక్రమంగా, గుట్టూ చప్పుడు కాకుండా ఆక్రమణ చేయడం, తరువాత దాన్ని సక్రమం చేయమని వివిధరకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం , ప్రభుత్వం కూడా 'అక్రమం - సక్రమం' చేసే పధతులు ప్రవేశపెట్టి అక్రమ ఆక్రమణలను, నిర్మాణాలను సక్రమం చేయడం కనిపిస్తూనే ఉంది. పాతబడ్డ కొద్ది కొత్తగా అనిపించేది పూరాణం అంటుంది శాస్త్రం.

'ఊరికే స్థలం ఇవ్వడం కుదరదయ్యా! డబ్బు చెల్లించాలి అంటారు" వరాహస్వామి. "ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? కానీ భవిష్యత్తులో కోట్లాదిమంది భక్తజనం నా దర్శనానికి వస్తారు. వారు కొండకు వచ్చినప్పుడు, ప్రధమ దర్శనం నీది. తరువాత దర్శనం నాది. ముందు అభిషేకం నీకు, ఆ తర్వాతే నాకు, నైవేద్యం కూడా ముందు నీకే, తర్వాతే నాకు" అన్నాడు శ్రీనివాసుడు.

అందుకే తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామిని దర్శించుకున్నాకే వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి. లేకుంటే మనకు స్వామిని దర్శించిన ఫలితం దక్కదు.

సరేనన్న వరహాస్వామి శ్రీనివాసుడికి కొంత స్థలం ఇస్తాడు.  

ఈ భూమి / స్థలం నాది, ఈ ఆస్తి నాది, నాకు 10 ఇళ్ళు ఉన్నాయి అంటూ తరచూ విర్రవీగీపోతుంటాం. కానీ నిజానికి ఈ భూమి వరహాస్వామిది. రాక్షసుల బారి నుంచి భుమాతను తప్పించారు వరహాస్వామి. భూమియే కాదు, మనకు ఉన్నవన్ని దైవప్రసాదాలే. ఈ మనుష్యజన్మ, మనం తినే అన్నం ముద్ద, మన చదువు, సంస్కారం, ఈ భారతదేశంలో పుట్టడం, ఇవన్నీ దైవానుగ్రహం లేకుండా రావు.

అది మర్చిపోయి, ఇది నాది, అది నాది అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్నాం, నాది అనుకోవడమే బంధానికి హేతువు. బంధం మమకారానికి, అహంకారానికి కారణమై పునర్జన్మకు దారితీస్తుంది. ఇది నాది కాదు, నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందనుకోవడం వల్ల బంధం తెగిపోతుంది. శ్రినివాసుడు కూడా తన చేష్టల ద్వారా తన భక్తులకు అదే సందేశం ఇచ్చాడు. ముందు అభిషేకం వరహాస్వామికి అంటే తనకు అన్ని ఇచ్చినవాడికి, తరువాత తనకు. ముందు నైవేద్యం వరాహమూర్తికి, తరువాత స్వామికి. అంటే మనకు ఈ లోకంలో లభ్యమయ్యేవన్నీ కూడా ముందు పరమాత్మకు (ఇష్టదైవానికి) సమర్పించి, తరువాత స్వీకరించమన్నాడు. అన్నం తినే ముందు, ఇది నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందన్న భావనతో తినమన్నాడు, ఇది నాది, నేను సంపాదించానన్న అహం వీడి, ఇది భగవంతుని దయ వల్ల నాకు సిద్ధించిందని భావించమన్నాడు. సర్వకర్మలను భగవంతునకు అర్పించమని తన ఈ దివ్య చేష్ట ద్వారా లోకానికి చెప్పాడు.

స్థలం ఇచ్చాక ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. మనం ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఏ విధంగానైతే విచారణ (ఎంక్వైరి) చేస్తామో, అలాగే వరహాస్వామికి కూడా నీతో ఎంత మంది ఉంటున్నారని అడుగుతారు. నాకెవరు లేరు అంటాడు స్వామి. అయితే నీకు వంట చేయడానికి, ఇతర సేవలు చేయడానికి వకుళ అనే దాసిని పంపుతాను అని, వకుళను పంపుతారు వరహాస్వామి.

కధ వింటున్న శౌనకాదులు, సూతు మహామునితో "అసలీ వకుళ ఎవరు? ఆమె జన్మ వృతాంతమేమి?" అని అడుగుతారు.

To be continued..............

No comments:

Post a Comment