Thursday, 10 October 2013

శ్రీ మహాలక్ష్మీ

శ్రీ మహాలక్ష్మీ సిరులతల్లి, విష్ణుపట్టపురాణి. ఈ లోకంలో అందరూ లక్ష్మీకటాక్షం కోసం చేయని పూజ ఉండదు.

లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణనించాకా ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్ప్కించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కునే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.

లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా లక్ష్మీకటాక్షమే. ఆత్మ తత్వం తెలుసుకోవాలంటే ఈ మానవదేహం చాలా అవసరం. అటువంటి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యలక్ష్మీకి చేసే ఆరాధనవుతుంది.

యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

సర్వజీవులయందూ జీవసక్తిగా, ప్రాణశక్తిగా లక్ష్మీదేవి కొలువై ఉంది. సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడం, ఇతర జీవల ఆకలి తీర్చడం, వాటి జీవనానికి సహాయపడడం భూతలక్ష్మీకి (భూతములంటే జీవజాలం అని అర్దం) చేసే పూజ. అందరికి కొద్దొగొప్పొ డబ్బు ఉంటుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వెచ్చించడం మనం ధనలక్ష్మికిచ్చే గౌరవం అవుతుంది. సంతానం లక్ష్మీదెవి అనుగ్రహం వల్లనే కలుగుతుంది, పిల్లల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో తిరుగుతుంటుంది. అటువంటి పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించడం, మంచి విద్యావంతుల్ని చేయడం ద్వారా సంతానలక్ష్మీని పూజించినవారమవుతాం.

లక్ష్మీదేవికి నిత్యానపాయిని, విష్ణువును విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. విష్ణువంటే వ్యాపకత్వం కలిగినవడు. ఈ సృష్టిలో వ్యాపకత్వం కలిగినది ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప ఈ జగత్తులో మరకొటి లేదు. మనకు కనిపించేవన్నీ ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఇవి ఏదో ఒకరోజు లయం అయిపోతాయి. కానీ ఆత్మ సనాతనమైనది, ఆత్మ ఆనందస్వరూపం. విష్ణువు ఆత్మ అయితే, ఆత్మానందం లక్ష్మీదేవి. ఆత్మానూభూతిని పొందడం వలన, ఆత్మ స్థితిలో ఉండడం వలన కలిగే చిదానందమే లక్ష్మీకాటాక్షం.

ఓం నమో లక్ష్మీనారాయణాయ                       

No comments:

Post a Comment