Tuesday, 28 October 2014

శివారాధన

ఓం నమః శివాయ

కార్తీకమాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివం అంటే శుభం, శోభనం, మంగళం అనే అర్దాలున్నాయి. దేవాదిదెవుడు, మహాదేవుడు, లయకారుడైన శివుడు భోళాశంకరుడు (అంటే అడిగిన వెంటనే వరాలు కురిపిస్తాడు, కొద్దిగా పూజ చేసిన, బోలెడు ఫలితాన్ని ఇస్తాడు, చిన్న సేవకే మురుసిపోతాడు). యోగ సంప్రదాయంలో శివుడు యోగులు యోగి, సృష్టిలో ఆదియోగి. శివుడి ద్వారానే లోకానికి యోగా, ధ్యానం మొదలైన విద్యలు పరిచయమయ్యాయి. కనుక యోగ సాధన చేసేవారు, పురోగతి కోసం తప్పకుండా శివారాధన చేయాలి.

శివారాధన చాలా సులువు. పెద్దగా పూజా సంభారాలు అవసరంలేదు, ఆడంబరాలు అసలే అవసరంలేదు. కాసిన్ని నీరు అభిషేకిస్తే చాలు, పొంగిపోతాడు. మంత్రాలు రావన్న బాధ అవసరంలేదు, ఓం నమః శివాయ అన్న మంత్రం చాలు. శివుడు యోగి అయినా, ఐశ్వర్యానికి అధిపతి. పూజించినవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. శివుడు విద్యను ప్రసాదిస్తాడు కనుకే అక్షరాభ్యాసంలో ముందుగా "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని రాయిస్తారు.

అటువంటి శివుడికి కార్తీకం అత్యంత ప్రీతికరం. ఈ కార్తీకంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. పెద్దగా ఆర్భాటం అవసరంలేదు. చిన్న శివలింగానికి, ఒక గ్లాసుడు మంచినీరు పోస్తూ, ఓం అని కానీ, లేక ఓం నమః శివాయ అని కానీ, మనసులో స్మరించుకుంటే చాలు, పెద్ద అభిషేకం చేసినట్టు పొంగిపోతాడు. అభిషేకం చేసే అవకాశం లేకపోతే, కనీసం మానసికంగా పూజించినా చాలు. మీ మనసులోనే ఒక శివలింగాన్ని ఊహించుకుని, మీరు మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం చేస్తునట్టు భావించి, మనసులో పూజించినా, ఫలితం వేసేస్తాడు పరమశివుడు.

శివపూజకు స్త్రీపురుష భేధం లేదు, వర్ణాశ్రమ బేధం అంతకంటే లేదు, ఎవరైనా, పరమశివుడిని అర్చించవచ్చు. ఉదయమే అరించాలన్న నియమం లేదు. శివుడికి ప్రదోష పూజ చాలా విశిష్టవంతమైంది. ప్రదోషం అంటే సాయంకాల సమయం. ఉదయమంతా ఆఫీసులో గడిపినా, సాయంకాలం ఇంటికి వచ్చాకా, ఆరాధన చేయవచ్చు. ఈ కార్తీకం నుండి శివారాధన ప్రారంభించండి.  

No comments:

Post a Comment