.jpg)
ఆచరించవలసినవి - ఈ నెలలో కార్తీకస్నానం, కార్తీకదీపం, ఉపవాసం చాలా ముఖ్యమైనవి. రోజూ తెల్లవారు జామునే దగ్గరలో ఉన్న నది, చెరువు, తటాకం లోనో లేదా బావి దగ్గరో తలస్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి కంటె ముందే మిగియాలి. ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు వెళ్ళకముందే స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన|
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ||
అనే మంత్రం చెప్పి తలస్నానం చేయాలి. ఈ కార్తీకస్నానం కాయిక, వాచిక, శారీరిక దోషాలను తొలగిస్తుంది.
స్నానం తరువాత శివుడిని బిల్వదళాల (మారేడు ఆకులు) తోనూ, విష్ణువును తులసిదళాలతోనూ పూజించాలి. అలాగే ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ని, అవిసె పూలతో విష్ణువును పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం (సూర్యోదయానికి ముందు), సాయంకాలం ఇంటి గడపల దగ్గర, తులసి చెట్టు దగ్గర "ఆవునెయ్యితో" దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఈ మాసంలో చేసే దీపారాధనకు చాలా ప్రాముఖ్యం ఉంది. కార్తీకమాసం మొత్తం ఏకభుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం) ఉండడం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం చేత పుణ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది. పగలంతా ఉపవాసం చేయలేనివారు అల్పాహారం తీసుకోవచ్చు (బ్రహ్మచారులు (పెళ్ళి కానివారు), 80 సంవత్సరములు పైబడినవారు, ఆనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవారు (శారీరకశ్రమతో పని చేసేవారు, బలహీనులు) ఈ ఉపవాసం చేయనవసరంలేదు). ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి లాంటి పర్వదినాలలో అయినా ఆచరించడం ఉత్తమం.
ఈ మాసం మొత్తం బ్రహ్మచర్యాన్ని పాటించాలి, కార్తీకం లో ఉల్లి, ఇంగువ, పుట్టగొడుగులు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడు, పుచ్చకాయ, వెలగపండు, నూనె, చద్ది మొదలైనవీ, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ధాన్యాలు (ద్విదళాలు) వాడరాదు. మాంసాహారాలు, బిర్యానీలు, బయట అమ్మె వంటకాలు, చిరుతిళ్ళు, మసాలాపదార్ధాలు తినడం నిషిద్ధం. ఉపవాసం పక్కన పెట్టేసినా, అందరూ ఆచరించదగ్గవి ఆహారనియమాలు పాటించడం, ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ముగించడం, రోజు దీపం వెలిగించడం. ఈ రెండు చేసినా, అతిత్వరలో జీవితంలో పెనుమార్పు కనిపిస్తుంది.
ఓం నమో శివనారాయణాయ
mee articles chala informative ga untai!! Thanks!!
ReplyDeleteThanks andi
Delete