Tuesday 11 March 2014

హిందూ ధర్మం - 34 (అస్తేయం -1)

ధర్మం యొక్క తదుపరి లక్షణం అస్తేయం.

దొంగతనం చేయడం, దోచుకోవడం, వస్తువు యొక్క యజమాని అనుమతి లేకుండా ఆ వస్తువును అనుభవించడం, మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, నమ్మకద్రోహం చేయడం, అబద్ధాలను బోధించడం, వేదానికి విరుద్ధంగా బోధించడం స్తేయం, అది అధర్మం. దానికి విరుద్ధమనది అస్తేయం, అది ధర్మం అంటారు ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీ. అంటే నిజాయతీగా ఉండడం, మనది కానీ వస్తువును దాని యజమాని అనుమతి లేకుండా అనుభవించకపోవడం, వేదం చెప్పిందే బోధించడం మొదలైనవి.

ఒకరికి సంబంధించిన వస్తువులను వారి అనుమతి లేకుండా ఉపయోగించడం, అనుభవించడం, ఇతరుల వస్తువులను మనవిగా ప్రచారం చేసుకోవడం స్తేయం. దానికి విరుద్ధమైంది అస్తేయం. స్తేయం అంటే దొంగతనం. ఒక వ్యక్తికి రావలసిన కీర్తిని, ఒక వ్యక్తి పొందాల్సిన గౌరవాన్ని ఆ వ్యక్తికి దక్కకుండా చేసి, తద్వారా మనం ఆ సుఖాలను, పేరున అనుభవించడం పాపం, అది దొంగతనం క్రిందకు వస్తుంది, దాన్నేస్తేయం అంటారు.

ఉదాహరణ చెప్పుకుంటే ఒకరు కొన్ని విషయాలు వెళ్ళడిస్తే, వారి పేరు బయటకు రాకుండా, మొత్తం సమాచారాన్ని కొందరు తమ పేరున పుస్తకాల్లో ముద్రించుకుంటారు. కనీసం ఇది వీరి ద్వారా తెలిసింది అని కూడా చెప్పరు. ఇది దొంగతనం క్రిందకు వస్తుంది, దశపాపాల్లో ఒకటైన చౌర్యం అనే పాపం చుట్టుకుంటుంది. ఈ కాలానికి తగ్గ ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు బ్లాగులు, పేస్‌బుక్‌లో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి అనేక రకాల సమాచారాలు షేర్ చేస్తారు, దాన్నీ కాపీ, పేస్ట్ చేసినా, ఎక్కడి నుంచి కాపి చేసారో, వెళ్ళడించడానికి ఇష్టపడరు, క్రింద  Courtesy అని ఇవ్వరు. ఇలా చేయడం స్తేయం అనగా దొంగతనం, అటువంటి లక్షణం ఉండకూడదు అంటున్నది ధర్మం.

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ఉంటారు. అందరికి ఆస్థిలో సమానంగా వాటా వస్తుందంటే ఒప్పుకోరు, తమకే ఎక్కువ కావాలని, ఇతరులకు దక్కకుండా కుట్రలు చేస్తారు, ఆస్తి మొత్తం తామే అనుభవిద్దాం అనుకుంటారు. రకరకాల కుట్రలు చేస్తారు.కొందరైతే తల్లిదండ్రులను అస్సలు చూడరు, కానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలంటారు. అది దొంగతనంతో సమానం. తల్లిదండ్రులను చూడనివాడికి ఆస్తి అడిగే హక్కు ఎక్కడిది. అది పాపం. అదే అధర్మం. అటువంటి లక్షణం ఉండకూడదు అంటారు మనుమహర్షి.తద్విరుద్ధంగా ఉండడం అస్తేయం.

To be continued...........

Originally published: 11-March-2014
Edited 1st time: 04-March-2015

No comments:

Post a Comment