Monday, 19 January 2015

హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు)


మరణం మనిషికి అంతం కాదు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం మధ్యలో వచ్చే తాత్కాలికమైన విరామం మాత్రమే అంటాయి ఉపనిషత్తులు. ఇది కూడా మనకు, పాశ్చాత్య దేశాలకు మధ్యనున్న ఒక తేడా. మరణం అనేది అంతమని, ఇక ఆ తర్వాత అస్తిత్వం ఉండదని భయపడి, దాన్ని మర్చిపోవడం కోసం పాశ్చాత్యదేశాల్లో ప్రజలు, రకరకాల భౌతిక సుఖాల వెంట పరిగెత్తి, మరణాన్ని మర్చిపోవాలని, అది స్మృతిలో లేకుండా ఉండేలా చాలా ప్రయత్నిస్తారు. కానీ ప్రాచ్య (భారతీయ) సంస్కృతిలో మాత్రం ప్రజలు మరణానికి భయపడరు. జీవితంలో ఏది అనుభవించినా, అనుభవించకున్నా, ఏది లభించినా, లభించకున్నా, పుట్టిన ప్రతివాడికి మరణం తధ్యం. అది ఎప్పుడు వస్తుందనేది తెలియదు కానీ, ఏదో ఒక రోజు అందరూ ఎదురుకోవలసిన సత్యం మరణం. దాన్ని తప్పించుకోవడం శరీరానికి అసాధ్యం. అది ఆత్మ ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కూడా. కొన్ని కోట్ల జన్మల కర్మఫలాలను మోసుకొస్తున్న ఆత్మ, మరణం తర్వాత తన కర్మఫలాల మూటను విప్పి, ఏ కర్మఫలం పక్వానికి వస్తుందో, దాని ఆధారంగా శరీరం ధరిస్తుంది. పాతబట్టలు విప్పేసి, కొత్త బట్టలు కట్టుకోవడం ఎంత సహజమో, అలాగే పాతశరీరాన్ని విడిచి ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. వాళ్ళు మరణంతో అస్తిత్వం పోతుందని భావిస్తే, మనం మాత్రం మరణంతో దేహం ఒక్కటే నశిస్తుందని చెప్తాం. మరి ఈ మరణం తర్వాత ఆత్మ ఎక్కడకు వెళుతుంది, ఎలా వెళుతుంది. అసలు మరణం అంటే ఏమిటి? ఇటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చెప్పిన తత్వశాస్త్ర నిధులే ఉపనిషత్తులు.

అట్లాగే ఉపనిషత్తులు ఈ సృష్టి పట్ల, జీవరాశిపట్ల చూపించే ధృక్పధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని మతాల వాళ్ళు సృష్టిని కాదు, సృష్టి కర్తను పూజించాలి. మీ హిందువులు సృష్టిని పూజిస్తారు కనుక నరకానికి పోతారంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. దీనికి ఉపనిషత్తులు అద్భుతమైన సమాధానం ఇస్తాయి. ఉపనిషత్తు ఉపదేశాల ప్రకారం ఈ ప్రపంచం సృష్టి కాదు, ఒక అభివ్యక్తీకరణ మాత్రమే (As per upanishads, This Universe is manifestation, not creation). అనగా సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు, భగవంతుడే ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు.' ఈశావాస్య ఇదం సర్వం' - ఈ సృష్టి అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అంటుంది ఈశావాస్య ఉపనిషద్. బ్రహ్మానుభూతిని పొందిన యోగి రాయిలో, రప్పలో, బ్రాహ్మణునిలో, ఏనుగులో, కుక్కలో, కుక్కను తినేవానిలో, మట్టిలో,.......... ఒక్కటేమిటి, అన్నిటిలో భగవంతుడినే చూస్తాడు. కాదు భగవంతుడే కనిపిస్తాడు. ఈ ధృక్పధమే హిందూ వ్యవసాయవిధానానికి, హిందూ ఆర్ధికవ్యవస్థకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బీజం వేసింది. అటువంటి దృష్టి లోపించినవాడికి రాయి రాయిగానే కనిపిస్తుంది, సృష్టి...సృష్టిగానే కనిపిస్తుంది. వాడు భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోలేదని గుర్తు. అటువంటి వారితో వాదించడం కూడా దండగే. వారికి సృష్టి కేవలం సృష్టి మాత్రమే. అంతటా దివ్యత్వాన్ని చూపే ఈ ఉపనిషద్ ధృక్పదం కూడా మనకు, అన్యమాతలకు మధ్య భేధాన్ని నిరూపిస్తుంది.

To be continued ..............

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete