Wednesday, 21 January 2015

హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ)

వేదంలో చెప్పబడిన శాస్త్రవిహితకర్మలను నిష్కామంగా (ఎటువంటి కోరికలు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, శ్రద్ధగా) ఆచరిస్తూ, ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను ధారణలో ఉంచుకుని, సాధన చేస్తే, మనిషి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఎదుగుతాడు.

ఏదైనా ఒక ఆహార పదార్ధం వండే ముందు పాత్రను శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన పాత్ర మాత్రమే వంటకు పనికి వస్తుంది. అంటే అప్పుడు మాత్రమే దానికి పాత్రత వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానానికి కూడా. మాములువారికి వేదాంతం చెప్పగానే అర్దమయ్యే విషయం కాదు. అర్దమైనట్టుగా అనిపిస్తుందేమో కానీ, అనుభూతికి దోహదపడదు. అలా అర్దమవ్వాలంటే ధర్మాచరణ చాలా ముఖ్యం.

ఒక విత్తనాన్ని నాటే ముందు, అక్కడి భూమి పరిస్థితిని గమనిస్తారు. విత్తనం నాటిన తర్వాత, దానికి తగిన నీరు అందిస్తారు, పోషకాలు అందిస్తారు. అన్నీ సక్రమంగా బయట నుంచి అందినా, విత్తనంలో ఉన్న జీవం వీటిని గ్రహించినప్పుడే మొలకెత్తుతుంది. అదే విధంగా బ్రహ్మజ్ఞానం కూడా. గురువు చెప్పిన బ్రహ్మవిద్య ముందు వినాలి. తర్వాత సాధన ద్వారా దాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. అనుభూతి చెంది ఆ స్థితిలో ఆత్మగా నిలబడాలి. అప్పుడే జీవితం పండుతుంది. దానికి ఉపనిషత్తులు ఎంత దోహదం చేస్తాయో, కర్మకాండ కూడా అంతే దోహదపడుతుంది. వంటకు ముందు పాత్రను శుభ్రపరిచిన విధంగానే వ్యక్తి యొక్క చిత్తాన్ని (అనుభవాల సమూహాన్ని) శుద్ధం చేయాలి. అలా చిత్తాన్ని శుద్ధం చేయగల శక్తి కేవలం వేదంలో చెప్పబడిన ధర్మానికి (కర్మలకు) మాత్రమే ఉంది. శుద్ధి చేయబడిన పాత్రలో వండిన పదార్ధం ఏ విధంగా నివేదనకు ఉపయోగపడుతుందో, అదే విధంగా కర్మలను ఆచరించడం వలన శుద్ధి పొందిన మనస్సు మాత్రమే బ్రహ్మవిద్యను అర్దం చేసుకోగలుగుతుంది. బయటనుంచి లభించనవన్నీవిత్తనం సరైన సమయంలో గ్రహించి మొలకెత్తినట్టు, చిత్తశుద్ధి వలన వ్యక్తి ఉపనిషద్ రహస్యాలను గ్రహించగలుగుతాడు. కనుక వేదంలో జ్ఞానకాండ ఎంత ప్రధానమో, ఆచారకాండ కూడా అంతే ప్రధానం. ఈ రోజు చాలామంది ఆచారకాండను విడిచిపెట్టి కేవలం జ్ఞానకాండ ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. అది చాలా తప్పుడు వాదన. ధర్మాన్ని ఆచరించకుండా ఉపనిషత్తులను అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తే, అవి అర్దంకాకపోగా, విపరీత అర్ధాలు వస్తాయి. అందుకే వేదం కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా విభజించబడింది.

To be continued .................

No comments:

Post a Comment