Sunday, 12 April 2015

హిందూ ధర్మం - 154 (ఋగ్ వేదం)

వేదామంతా ఒక్కటే అయినా మంత్రపద్దతిని అనుసరించి వేదాలను నాలుగుగా చెప్తారు. అందులో మొదటిది ఋగ్ వేదం. 'ఋచ్యతే స్తూయతే యయాసాఋక్' - దేవతలను ఉద్దేశించి చేసే స్తుతులను ఋక్కులు అంటారు. దేవతలు అనగానే అనేకమంది అనుకోకూడదు. ఈశ్వరుడికి అనేక గుణములు, శక్తులు ఉంటాయి. ఆయా గుణాలను అనుసరించి చెప్పినప్పుడు, ఒకే ఈశ్వరుడిని వేర్వేరు దేవతలుగా అభివర్ణిస్తారు. ఈ వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్క గుణాలు, లక్షణాలు వివరిస్తుంది. అదికాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన (chemistry), భౌతిక (physics), గణిత (Mathematics), ఖగోళ (Astronomy), విశ్వోద్భవ (Cosmology) శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలో అనుసరించవలసిన ధర్మాల గురించి, అనుగమించవలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. సాయానచార్యుడి మాటల్లో చెప్పాలంటే సమస్త భౌతిక (Physics), అధిభౌతిక (Meta Physics), ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది. వేదాలన్నిటిలో ఋగ్వేదమే పెద్దది. అందులో 10 మండలాలు, 1025 సూక్తాలు, 10581 ఋక్కులు ఉన్నాయి.

ఒకప్పుడు వేదంలో ఉండే ప్రతి శాఖకు బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఉండేవి. కానీ భారతదేశం మీద జరిగిన దండయాత్రల్లో అనేకమంది వేదపండితులు చంపబడ్డారు, గ్రంధాలయాలు, వైదిక గ్రంధాలు కాల్చబడ్డాయి. ఆ కారణం చేత ఇప్పుడు మనకు పూర్తి వేదభాగము లభ్యమవ్వడం లేదు. ఋగ్వేదంలో అన్ని మండలాలకు ఇప్పుడు బ్రాహ్మణాలు లభించడం లేదు. ఋగ్వేదానికి సంబంధించి ప్రస్తుతం ఐతరేయ, శాంఖ్యాయన, కౌస్తికీ బ్రాహ్మణాలు మాత్రమే లభిస్తున్నాయి.

1008 ఉపనిషత్తులను ఋషులు మనకు అందించగా, ఇప్పుడు కేవలం 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. వాటిలో కేవలం 11 మాత్రమే అందరికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఋగ్వేదానికి సంబంధించి ఐతరేయ ఉపనిషద్ ఒక్కటే లభిస్తోంది. వైదిక ధర్మంలో యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది.  యజ్ఞయాగాదుల్లో నాలుగువేదాలు తెలిసిన నలుగురు పండితులు పాల్గొంటారు. అందులో ఎవరికి వారికే ప్రత్యేక స్థానం, మర్యాద, గౌరవం ఉన్నాయి. ఋగ్వేదం అధ్యయనం చేసి, యజ్ఞంలో పాల్గొనే ఋగ్వేద పండితుడిని 'ఋత్విక్కు' అంటారు.

To be continued ...................

No comments:

Post a Comment