Sunday, 19 April 2015

హిందూ ధర్మం - 155 (యజుర్వేదం)

2. యజుర్వేదం

'అనియతాక్ష రావసానో యజుః' - నియతమైన అక్షరములు లేనిది యజస్సు. యజుః అనేదానికి ప్రధానంగా 'గద్య' అనే అర్దం ఉంది, ఋగ్ వేదంలా కాకుండా యజుర్వేదం గద్యరూపంగా ఉంటుంది. 'యజుర్ యజతే' - మంత్రాలను యజ్ఞార్ధం ఉపయోహిస్తారు కనుక యజుర్వేదం అంటారని అర్దం.

యజుర్వేదం అనుసరించవలసిన పద్ధతులు, మానవ మనస్తత్వశాస్త్రం (human psychology), మానవుడు పరమ పురుషార్ధము, మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశమైన మోక్షాన్ని పొందటానికి ఏ విధమైన కర్మలు చేయాలో, ఎలాంటి మార్గాలను అనుసరించలో ప్రధానంగా చెప్తుంది. మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుని, లోకానికి మేలు చేసే కార్యాలను చేసి, ఇతర మానవులకు జ్ఞానాన్ని, మేలును ఎలా చేకూర్చే విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఇవేకాక తత్వం గురించి, మనసు, ప్రాణం గురించి కూడా వివరిస్తుంది.

యజుర్వేదం 33 వ అధ్యాయం, 7 వ శ్లోకంలో వేల మైళ్ళు ఆగకుండా ఎగిరే విమానాల గురించి ప్రస్తావన ఉంది. ఖగోళ (Astronomy), భూగోళ (Geography), భూగర్భ(Geology ), Hydrostatics, ఔషధ (Medicine), విమానశాస్త్రాల (air-flight) ప్రస్తావన యజుర్వేదం, 6 వ అధ్యాయం, 21 వ శ్లోకంలో ఉంది.

స్త్రీపురుషులు, అన్ని వర్ణాల వారు సమానమని యజుర్వేదం 31 వ అధ్యాయం చెప్తున్నది. స్త్రీలకు గౌరవం ఇవ్వాలని సందేశం ఇస్తోంది. 18 వ అధ్యాయం 48 వ మంత్రం స్నేహ సందేశాన్ని ఇస్తోంది. 21 వ అధ్యాయం 67 నుంచి 70 మంత్రాల వరకు వ్యవసాయపనులైన దున్నడం, నారుపెట్టడం, విత్తడం మొదలైన పనుల గురించి వివరణ ఉంది. ఇనుము, వెండి మొదలైన ఖనిజాల ప్రస్తావన కూడా ఉంది. 24 వ అధ్యాయం మొత్తం పక్షులు, జంతువులు, కీటకాల గురించి ప్రస్తావిస్తూ జంతుశాస్త్రానికి బీజం వేసింది. 21 వ అధ్యాయం ఋతువుల గురించి, ఆయ ఋతువులలో ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోదగిన ఆహారం గురించి చెప్తుంది. 23 వ అధ్యాయం 10వ మంత్రం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదని, సూర్యుని నుండి వెలుగును గ్రహించి ప్రసరిస్తున్నాడని వెల్లడిస్తోంది.

యజుర్వేద సంహితల్లో చాలా రకాల యజ్ఞాల ప్రస్తావన ఉంది. వాజసనేయ సంహిత దర్శపూర్ణమాసాలు, అగ్నిహోత్రం, వాజపేయం, అశ్వమేధం, సర్వమేధం, బ్రహ్మయజ్ఞం, పిత్రిమేధం, శౌత్రామణి మొదలైన వాటి గురించి చెప్పబడింది. సులువగా అర్దమవ్వడం కోసం వాటిని దర్శపూర్నమాశాలని, సోమయాగాలని, అగ్నిచయనాలని 3 గా విభాగం చేయచ్చు.

యజ్ఞం అంటే కేవలం అగ్నితో చేసేది మాత్రమే కాదనీ, మనకు తెలిసిన మంచి విషయాలను, జ్ఞానాన్ని పంచుకోవడం, ధర్మప్రచారం చేయడం కూడా యజ్ఞమేనని చెప్తుంది. సమానత్వము, ఐక్యత, విశ్వజనీన సహోదరత్వం గురించి సందేశం ఇస్తుంది.

ఉఛ్చారణా పద్ధతిని అనుసరించి యజుర్వేదాన్ని రెండుగా చెప్తారు. ఒకటి కృష్ణ యజుర్వేదం, రెండు శుక్లయజుర్వేదం. శుక్ల యజుర్వేదాన్నే వాజసనేయము అని కూడా అంటారు. ఉత్తరభారతదేశంలో శుక్ల యజుర్వేదము, దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదము తరతరాలుగా బోధిస్తున్నారు.
వీటి మధ్య బేధాన్ని ఈ వీడియోలో వినండి.

1) కృష్ణయజుర్వేదం

2) శుక్లయజుర్వేదం


యజుర్వేద మంత్రాలను काण्डिका (కాణ్డికాలు) అంటారు. యజుర్వేదంలో 40 అధ్యాయాలు, 1975 కాణ్డికాలు ఉన్నాయి. పతంజలి మహర్షి మహాభాష్యం రాసే సమయానికి యజుర్వేదానికి 101 శాఖలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 6 శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మిగితావి లుప్తమైపోయాయి.  తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. శతపథ బ్రాహ్మణం శుక్ల యజుర్వేదానికి చెందినది. అయినప్పటికి ప్రస్తుతం మొత్తం యజుర్వేదానికి సంబంధించి శతపధ బ్రాహ్మణం ఒక్కటి మాత్రమే లభిస్తోంది.

యజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యకాలు ఏవీ కూడా లభించడం లేదు.

ఉపనిషత్తుల విషయానికి వస్తే ఈశావాస్య, తైత్తరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు యజుర్వేదానికి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. అందులో శుక్ల యజుర్వేదానికి సంబంధించినది బృహదారణ్యక ఉపనిషత్తు. ఉపనిషత్తులను కూడా స్వరంతో చదివే సంప్రదాయం ఉన్నా, హిందువులకు లభిస్తున్న అన్ని ఉపనిషత్తుల్లో ఒక్క తైత్తరీయ ఉపనిషత్తు మాత్రమే స్వరంతో కూడి లభిస్తోంది. మిగితావి అన్యమతాల దండయాత్రాల్లో కోల్పోగా, కేవలం ప్రతులు మాత్రమే లభిస్తున్నాయి. యజ్ఞసమయంలో యజుర్వేదం చదివే పండితుడిని అధ్వర్యుడు అంటారు.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
http://ignca.nic.in/vedic_heritage_intro_yajurveda.htm
http://archive.org/stream/yajurveda029670mbp/yajurveda029670mbp_djvu.txt
http://www.vedicgranth.org/what_are_vedic_granth/the-four-veda/yajur-veda

No comments:

Post a Comment