Sunday 30 August 2015

హిందూ ధర్మం - 173 (చంధస్సు)

చంధస్సు శాస్త్రం - ఇది వేదానికి కాళ్ళు వంటిది. వేదం చంధస్సు ద్వారానే నడుస్తుంది. వేదమంత్రాలను రక్షించడానికి, వాటిలో కొత్త పదాలను, అక్షరాలను చేర్చకుండా ఉండాటానికి, వేదం యొక్క యదార్ధస్వరూపాన్ని కాపాడటానికి, స్వరబద్ధంగా వేదాన్ని చదవటంలో దోషాలు దొర్లకుండా ఉండటానికి ఈ శాస్త్రం వచ్చింది. వేదమంత్రాల గతి తప్పకుండా ఉండటానికి, వాటిని సులువుగా జ్ఞాపకం ఉంచుకునేందుకు ఛంధస్సు ఉపయోగపడుతుంది. చంధస్సు అన్నప్పుడు ఇది వేదమంత్రాలను చదివే పద్ధతిని తెలిపేదిగా అర్దం చేసుకోవాలి. ఈ శాస్త్రం చాలా పెద్దది, సముద్రమంత విశాలమైనది. ఇందులోకి దిగడమే తప్ప, తేలడం ఎప్పటికో జరుగుతుంది, అది కూడ అతికొద్దిమంది పండితులకు మాత్రమే.

ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో, ఆ మంత్రాన్ని ఎంత సమయం చదవాలో, దానికున్న నియమాలేమిటో ఇది వివరిస్తుంది. వేదం మొత్తం చంధోబద్దంగానే ఉంటుంది. అందుకే అసలు వేదానికే చందస్సు అనే పేరు కూడా ఉంది. వైదికమైన ఛంధస్సుల గురించి వివరణ మొట్టమొదటగా సాంఖ్యాయన శ్రౌత సూత్రాల్లో కనిపిస్తుంది. కానీ దీనిమీద పూర్తి వివరణ ఇచ్చింది మాత్రం పింగళ మహర్షి. ఛంధః సూత్ర అనే తన గ్రంధం 8 వ అధ్యాయంలో మహర్షి పింగళుడు వీటిని ప్రస్తావించారు.

వేదపారాయణం వినడం వలన ప్రశాంతత లభించడం, దివ్యానుభూతులు కలగడం సంగీతం రోగాలను నయం చేయడం మొదలైన అనేక విషయాలను ప్రస్తావించినప్పుడు, ఛంధస్సు గురించి చెప్తారు. మొత్తం 7 రకాల ఛంధస్సులు వేదంలో ఉన్నాయి. అవి గాయత్రి, ఉష్ఠిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి ఛంధస్సులు. వాటికి వరుసగా షడ్జ, వృషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద అనే స్వరాలున్నాయి. వీటి నుంచే స, రి, గ, మ, ప, ద, ని అనే సప్తస్వర సంగీతం ఊపిరి పోసుకుంది.

వేదం అనగానే గుర్తుకు వచ్చేది యజ్ఞం. యజ్ఞంలో ఛంధస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేదమంత్రాలన్నీ ఛందోబద్ధాలు. ఏ ఫలితాన్ని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తున్నారు, ఏ కాలంలో, వాతవరణ పరిస్థితుల్లో చేస్తున్నరనే విషయాన్ని అనూరించి ఛంధస్సులను వాడతారు. ఛంధస్సు, వేదసంగీత ధ్వని స్వరాలకుండే ప్రభావశక్తిని ఋషులు పరిశీలించి అనేక పరిధులుగా విభజించారు. ఒక్కో పరిధిలో ఒక్కో ఛంధస్సు పని చేస్తుంది.  

To be continued ................ 

No comments:

Post a Comment