Sunday, 25 September 2016

హిందూ ధర్మం - 225 (జ్యోతిష్యం - 7)

జ్యోతిష్యంలో భాగంగా ఋతువులు, కాలాల గురించి మన గ్రంధాల్లో చెప్పబడిన విషయాలు తెలుసుకుందాం.

వర్షాలు దక్షిణాయనంలో వస్తాయని ఋగ్వేదం 6-32-5 చెప్తోంది. దేవయానం అయిన ఉత్తరాయనం గురించి ఋగ్వేదం 10-18-1 లో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం గురించి వివరించగా, 10-88-15 లో సూర్యుని దక్షిణ దిశ ప్రయాణమైన పితృయానం (దక్షిణాయనం) గురించి చెప్పబడింది. శునఃశీరుడు అంతరిక్షంలో సిద్ధమైన నీటిని కురిపించాలని ఋగ్వేదం 4-57-5 ప్రార్ధిస్తోంది. (ఇక్కడ అంతరిక్షం అంటే భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పైన ఉండే ప్రదేశం). శునఃశీరుడు అంటే మృగశిరా నక్షత్రం. దానినే ఈ రోజు శాస్త్రవేత్తలు కానిస్ మేజర్, కానిస్ మైనర్ అంటున్నారు. ఈ రోజుకీ పల్లెటూళ్ళలో రైతులకు జ్యోతిష్య శాస్త్రం మీద ఎంతో అవగాహన ఉంది. సూర్యుడు మృగాశిరా నక్షత్రం వద్దకు రాగానే, మృగాశిరా కార్తె మొదలుతో మన దేశంలో ఈ రోజుకీ వ్యవసాయం ప్రారంభిస్తారు. తరతరాల విజ్ఞానం, వారి పూర్వీకులు అందంచిన విజ్ఞానం అది.

మృగం అంటే జంతువు. జంతువు శిరస్సు వంటి ఆకారం కలిగిన తార సమూహం కనుక ఆ మండలానికి మృగశిరా నక్షత్రమని పేరు. శునఃశీరుడు అంటే కూడా జంతువు ముఖం కలిగినవాడని అర్దం. ఋగ్వేదం 1-101-13 లో ఋభువును నిద్రలేపిందేవరు అనే ప్రశ్న వస్తుంది. దానికి సూర్యుడు సమాధానం చెప్తూ, శునకం నిద్రలేపింది, ఎందుకంటే ఈరోజు సంవత్సరానికి అంతము అంటాడు. పైన చెప్పిన శునః అంటే శునకం - ఇది జంతువు. ఈయనే శునఃశీరుడు. ఋభువు అంటే మేఘాలు. అంటే పురాతన కాలంలో సూర్యుడు మృగశిరా నక్షత్రంలో ఉండగా వర్షాలు ప్రారంభమయ్యేవి. అది ప్రకృతి నియమం కూడా. ఇప్పుడు ఆధునిక మానవుడు కాలుష్యం పేరుతో భూమికి నిప్పు పెట్టి, భూతాపాన్ని పెంచడంతో ఋతువుల వ్యవస్థ అస్తవ్యస్తమై ఎప్పుడు వర్షాలు పడతాయో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. అయినా ఈ రోజు నైఋతి ఋతుపవనాలు మృగశిరా కార్తె సమయంలోనే రావడం ఇప్పటికీ గమనించవచ్చు. ఇది మనకు ఏమి స్పష్టం చేస్తోందంటే ఈ దేశంలో వాతావరణ శాస్త్రం కూడా జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగమని.

అంతే కాక సూర్యునికి ఋతువులకు సంబంధం ఉందని చెప్పింది కూడా సనాతన ధర్మమే. ఋతువులు ఏర్పడి వాతావరణంలో మార్పు సంభవించడానికి, సూర్యుడు ఉదయించే స్థానానికి సంబంధం ఉందని ఋగ్వేదం 1-95-3 లో పేర్కొనబడినది. అదే ఋషులు చంద్రునికి ఋతువులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సూర్యుడు కారణంగానే ఈ విశ్వం నిలబడుతోంది, అలాగే జీవకోటి మనుగడ సాగిస్తోంది. కాలం ముందుకు వెళుతోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని ఆత్మ అన్నారు. వ్యక్తిగత జ్యోతిష్యంలో వ్యక్తి ఆత్మనూన్యతకు లోనవుతున్నా, తన మీద తనకే అనుమానం ఉన్నా, ఆత్మ విశ్వాసం లోపించినా, అప్పుడు సూర్య ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆయనకు సంబంధిచిన దానాలు, జపాలు చేయమంటారు. అక్కడ కూడా సూర్యుడు ఆత్మకారకుడు. ఖగోళ అంశం, వ్యక్తులకు సంబంధిచిన అంశాల్లో ఎంత సమన్వయం నిగూఢంగా ఉందో చూడండి.

పద్మాకర్ విష్ణు వర్తక్ గారి రచనల నుంచి సేకరణ

To be continued .............

No comments:

Post a Comment