భగవంతుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఎప్పుడూ మంచి మాత్రమే చేస్తాడు. ఎవ్వరికీ అపకారం చేయడు అనే భావన కలిగి ఉన్నప్పుడు, నాకు ఏది మంచిదో కూడా ఆయనకే తెలుసు. నేను అనవసరంగా అది అని, ఇది అని బాధపడేకంటే, ఆయన మీద భారం వేసి, ఆందోళన చెందకుండా, ఆయన ఏది ఇస్తే, అది ప్రసాదంగా స్వీకరిస్తాను అని బలమైన విశ్వాసంతో ఉండడమే శరణాగతి.
నువ్వు నమ్మింది జరుగుతుంది అని కాదు. నీవు నమ్మింది జరిగినా, జరగకున్నా, జరిగింది నీకు ప్రస్తుతానికి మంచిది అనిపించకున్నా, భగవంతుడు మంచి మాత్రమే చేస్తాడు అని భావన కలిగి ఉండటమే విశ్వాసం అని అంటారు ఛాయ అధర్వణ వేద పండితులు శ్రీధర్ గురూజీ.
భగవద్గీత ఆప్తవాక్యం. భగవానుడు ప్రేమతో కలియుగంలో మానవుల కోసం ఎన్నో విషయాలను అందులో చెప్పాడని అన్నారు సద్గురు శివానంద మూర్తి గారు. అందులో భగవానుడు ఎన్నో ప్రమాణాలను చేశాడు. నామే భక్తః ప్రణశ్యతి (భగవద్గీత 9-31) అన్నాడు. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ నశించడు. అతడు అధర్మవర్తనుడైనా, నన్ను నమ్మాడు కనుక క్రమంగా ధర్మవర్తనుడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడని చెప్పాడు. అతడిని ఉద్దరించడం నా కర్తవ్యం అని కూడా స్పష్టం చేశాడు.
అంతేనా 18 వ అధ్యాయంలో
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ !
అహం త్వా సర్వపాపేభ్యోమోక్షయిష్యామి మా శుచః !! 66
భావం - అన్ని ధర్మాలను విడిచిపెట్టు, నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేసి, మోక్షం ప్రసాదిస్తాను.
అన్ని ధర్మాలను విడిచిపెట్టడమంటే బాహ్యంలో కాదు. భార్యా/ భర్తని, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం కూడా చేయాలి. ఇతరమైన ప్రయత్నాలన్నీ విడిచి నన్ను మాత్రమే శరణు వేడు అంటున్నాడు. అంటే మనసులో చీకుచింతలు వదిలెయ్, భవిష్యత్తు గురించి ఆందోళన పడకు; గతంలో పాపాలు చేశానంటావా? గతం గడిచిపోయింది, ఇప్పుడు బాధపడి వ్యర్ధం, ఇకముందు మళ్ళీ ఆ తప్పులు చేయకు. జరిగిపోయిన దాని గురించి కూడా బాధపడకుండా వర్తమానంలో నా మీద మనసు నిలిపి ఉంచు. నీకు మోక్షం నేను ఇస్తాను అన్నాడు.
9 వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ - 22
ఎవరైతే వెరొక ఆలోచన లేకుండా నా యందే మనసు నిలిపి, నాకు దగ్గరగా (మానసికంగా) ఉంటారో, అటువంటి వారి యోగక్షేమాలను 'వ్యక్తిగతంగా' నేను వహిస్తాను.
వేరే ఇతర చింతలు (ఆలోచనలు) వద్దు. నా మీద విశ్వాసం కలిగియుండు. ఎల్లప్పుడు నన్నే మనసులో నిలుపుకో. నీ యోగక్షేమాల బాధ్యత నాది అన్నాడు. ఇవన్నీ ఆయన చేసిన శపథాలు. నా మీద భారం వేయవయ్యా! నీ భారం నేను మోస్తాను అని ఆయన అభయం ఇస్తున్నప్పుడు, మనం దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? భయపడితే మనకు ఆయన మీద ఉన్నది విశ్వాసం కాదు, అవిశ్వాసం.
ఆయన గీతలో కూడా చెప్పింది శరణాగతియే.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment