Wednesday, 8 February 2017

దాశరధి శతకం - 2

11
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావం: గొప్ప ఐశ్వర్యంతో కూడిన రఘువంశమనే సముద్రాన్ని ఉప్పొంగింపజేసే చంద్రుని వంటి వాడవైన నీ పాదపద్మాలను వికసించిన్న కలువల చేత, సంపెంగ పూల మాలలతో, మాధర్యంతో కూడిన మాటలనే పువ్వుల చేత నీకు అర్చన చేస్తాను. నాయందు దయతో అంగీకరించు. సంసార సాగరం నుంచి ఉద్ధరించే తారకనామం కలవాడా! భద్రాచల వాసా! దశరధ తనయ! కరుణాసముద్రా! శ్రీ రామా! కరుణించి.

12
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: రామా! దశరధ తనయా! కరుణాసందురా! చంద్రుని వెన్నలకు చంద్రకాంతి శిలలు కరిగి దర్విస్తాయే కాని విద్య పర్వతం శిలలు ద్రవిస్తాయా? అలాగే భగవత్ పరమైన గ్రంధములలోని కూర్పుని చూసి రసికులు సంతోషిస్తారే కానీ మూర్ఖులు ఆనందించలేరు.

రసికులు అంటే సారమును గ్రహించేవారు, భగవద్భక్తులు. నవరసాలని మనకు శాస్త్రంలో ఉన్నాయి. నాట్యం మొదలైన కళలలో వీటిని ప్రదర్శిస్తారు. ఒక్కో సమయంలో ఒక్కో రసాన్ని ప్రదర్శిస్తారు. రసాన్ని ప్రదర్శించడం వలన మానసికంగా ఈశ్వరునిలో లీనమై తాత్కాలికంగా ఆత్మానందాన్ని పొందుతారు. సాధనతో అదే నిరంతరం పొంది, క్రమంగా భగవంతునిలో ఐక్యమవుతారు. భారతీయ కళాలన్నీ రసాస్వాదన కొరకే. మన కళలో రసం ప్రధానం. రసం అంటే ప్రారంభ దశలో భావన అనుకున్నా, అది అనుభవించిన తర్వాత, అది భావనకు అతీతమైనదని అర్దమవుతుంది. ఆ స్థితి రావాలంటే భగవతత్త్వం అర్దమవ్వాలి. అప్పుడే రాసలీల అర్దమవుతుంది. అంతేకానీ రాసలీల అంటే శారీరిక సుఖాలను అనుభవించడం కాదు.

భగవతత్త్వం మూర్ఖులకేమి అర్దమవుతుంది? కాబట్టి వారు తెలియక విమర్శ చేస్తుంటారు.

13
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఓ ఆర్తజనబాంధవ! జనకాత్మజాధవా! దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నా మాటలలో తప్పులున్నా, నీ పేరుతో ఈ కావ్యాన్ని రాస్తున్నాను కనుక అది పవిత్రమే అవుతుంది. ఎలాగంటే గంగానది నీరు వంకరగా పారినా, మురికిగా మారినా, దాని గొప్పతనం, పవిత్రత ఎక్కడకుపోతుంది స్వామి.

14.
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీ శ్రీ రామ అనే పవిత్రనామం సంసార సముద్రాన్ని తరింపజేస్తుంది. ఆ తారకనామమే భయంకరమైన మహాపాతకాలనే సముద్రాన్ని సైతం బడబాగ్ని వలె అడుగంటిస్తుంది/ ఎండగొడుతుంది. నీ నామం మళ్ళీ పుట్టు మళ్ళీ చస్తూ పడే బాధలనే కార్చిచ్చులనే మటలను ఆర్పే అమృతరస వర్షం వంటిది. అంతుములేని దుష్టమతాల ఆచారాలనే భయంకరమైన అడవని నరికివేసే తీవ్రమైన, కఠినమైన గొడ్డలు యొక్క అంచు వంటిది. నీ తారకనామ మహిమను వర్ణించడం నా తరం కాదు.

15.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీ పవిత్రనామము శివునికి, విభీషణునికి, పార్వతీదేవికి ఐశ్వర్యం కలిగించినది అయింది. గంజేంద్రునకు, ద్రౌపదికి, అహల్యకు ఆపద నుంచి రక్షించే బంధవుగా ప్రసిద్ధి చెందింది. పంచమహా పాతకాలు చేసినవారిని సైతం పవిత్రం చేసే నీ నామం నా నలుకపై ఎప్పుడూ నిలిచి ఉండేట్లు చేయమని నిన్ను ప్రార్ధిస్తున్నాను తండ్రీ!

16.
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! యమధర్మరాజు తన భటులను పిలిచి 'పరమదయానిధి! పాపాలను భస్మం చేసే నామం కలిగిన ఆ హరిని 'హరే్' అని స్థిరమైన భక్తితో నీయందే (రాముని యందే) మనసు నిలిపి నిరంతరం స్మరించే భాగవతోత్తముల పాదధూళి నా శిరస్సును ధరిస్తాను కనుక, మీరు అటువంటి వారి జోలికి వెళ్ళకండి సుమా!' అని ఆజ్ఞాపించాడు. (అటువంటి నీ నామస్మరణ మహత్యం తెలుసుకోవడం ఎవరి తరం రామా!)
యమభటులు రారు అంటే ఘోరమైన మరణం ఉండదని, దేహం విడిచి ఆత్మ వెళ్ళనని దుఃఖించక, మరణం సంభైంచగానే ఆ పరబ్రహ్మం అయిన ఆ రామునికి చెంతకే వెళ్ళిపోతుందని అర్దం.

17.
అజునకు తండ్రివయ్యు సనకాదులకున్ బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీవు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు తండ్రివి. సనకసనందనాది మహర్షులకు పరబ్రహ్మస్వరూపానివి. బ్రహ్మజ్ఞానసంపన్నులైన బ్రాహ్మణులకు, దివ్య ఋషులకు కులదేవతవు. సూర్యవంశ రాజులలో అధికుడవు. సమస్తమైన మంచి లక్షణాలు కలిగినవాడవై ప్రకాశించే ఓ గరుడ్వజా! నిన్ను తప్పక స్మరించు పొగుడుతాను.

18.
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీవు పండితులకు రక్షకుడవు. సమస్త జనులను వారి పాపాల నుంచి విముక్తులను చేయువాడవు. బ్రహ్మదేవుని చేత, దేవేంద్రుని చేత పూజింపబడినవాడవు. పదితలల రావణుడిని వాడియైన బాణాల చేత సంహరించి, ధనుర్విద్యలో నేర్పరివనే కీర్తిని పొందినవాడవు. అలాంటి నీ కీర్తి కాంతకు నాకున్న కవితా శక్తితో రచించిన పద్య కుసుమాలనే మాలను అర్పిస్తున్నాను. (నన్ను అనుగ్రహించు).

19.
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! సమస్త సిరిసంపదలను ఓసగే మహాలక్ష్మీ దేవియే భద్రాచలంలో సీతాదేవి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి నీకు పూజ మొదలైన సేవలు చేసేవారే నీ సేవక సముదాయము. ఇక్కడ ప్రవహించే గోదావరి నదియే వైకుంఠంలో ప్రవహించే విరజానది. ఈ భద్రాచల శిఖరమే నీ వైకుంఠం. ఈ భద్రాచలంలో నివసించే నీవు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడవు. ఈ విధంగా విష్ణు స్వరూపుడైవైన నీవు ఈ లోకంలో ప్రజలను పాపముల నుంచి విముక్తి చేసి తరింపజేస్తావు. అలాంటి నువ్వు నన్ను కూడా ఉద్ధరించు స్వామి.

20.
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! గోదావరి నదీతీరాన్ని, ఆ నదిని ఒడ్డున ఉన్న భద్రాచలాన్ని సేవించి ఆనందించాను. నీ అర్ధాంగి అయిన సీతమ్మను, నువ్వు ధరించే ధనుర్బాణాలను, శంఖుచక్రాలు మొదలైన వాటిని చూసి సంతోషించాను. సర్వ సద్గుణాలను కలియక అయిన నిన్ను, నిన్ను విడువకుండా ఎప్పుడూ సేవ చేసిన నీ తమ్ముడు లక్ష్మణుడిని నా అదృష్ట వశమున చూసి పరవశించాను. జగత్తులో ప్రజలను హింసించే రాక్షసులను మట్టుబెట్టేవాడా! నన్ను పాలించు.

No comments:

Post a Comment