అధోలోకాలు
నారదుడు పాతాళలోకాల్లో సంచరించడం గురించి వర్ణిస్తూ, ఆయా లోకాల వర్ణన విష్ణుపురాణం అందించింది. పాతాళం స్వర్గం కంటే సుందరంగా ఉందని నారదమహర్షి అంటారు. పాతాళం మొత్తం దివ్యమైన మణులతో, సుందరమైన తోటలతో, అందమైన రాక్షసకన్యలతో నిండి ఉంటుంది. గాలి మొత్తం సువాసనలతో, చక్కని సంగీతంతో నిండి ఉంటుంది. ఇక్కడి మట్టి నలుపు, తెలుపు, ఊదా, పసుపు, ఇసుక, రాయి మరియు బంగారంతో ఉంటుంది. భాగవతం ఈ అధోలోకాలను బిలస్వర్గాలు అని అంటుంది. ఇవి ఊర్ధ్వలోకాల కంటే ఐశ్వర్యంలో మరింత గొప్పవని, స్వర్గం కంటే కూడా గొప్ప ఐశ్వర్యంతో ఉంటాయని చెబుతుంది. ఇక్కడ జీవనం విలాసం, సంపద, సుఖాలతో నిండి ఉంటుంది. మయుడు ఈ లోకాల్లో రాజభవనాలను, ఇళ్ళను, ప్రయాటకులకు వసతిగృహాలను దివ్యమైన మణులతో నిర్మించాడు. ఇక్కడుండే ప్రకృతి అందం ఊర్ధ్వలోక అందాలను ప్రక్కకు తోసేస్తుంది. అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఈ లోకాల్లో సూర్యకాంతి ఉండదు, కానీ అంధకారం మొత్తం మణులతో కాంతులతో తొలగించబడి ఉంటుంది. వృద్ధాప్యం, స్వేదం, రోగం అనేవి పాతాళంలో ఉండవు.
విష్ణుపురాణం ప్రకారం ఈ 7 అధోలోకాలు ఒకదాని మీద ఒకటిగా భూమి క్రింద ఉన్నాయి. భూభాగం క్రింద 70,000 యోజనాల్లో, ఒక్కో లోకం 10,000 యోజనాలు విస్తరించి ఉంటుంది.
అతలం= మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.
వితలం= హాఠకేశ్వరుడు (భవుడు) భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు. హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు. ఈయన బంగారు గనులకు అధిపతి. భూతగణాలతో ఉంటాడు. ఈయన పితృశాపాల నుంచి విముక్తిని కలిగిస్తాడు.
సుతలం= బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.
తలాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు. రుద్రుడి రక్షణలో ఉంటుంది.
మహాతలం= కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.
రసాతలం = ఇక్కడ నివసించే దానవులు, దైత్యులు వీరులు, కానీ మహాకౄరులు. దేవతలకు శతృవులు. పాముల వలే బిలాల్లో ఉంటారు.
పాతాళం= నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అధోలోకాలంటే అక్కడ దైవం ఉనికి ఉండదు అని భావిస్తాం. కానీ సనాతన ధర్మంలో దైవం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. నరకలోకంలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ అధోలోకాల్లో కూడా భగవంతుడు ఒక్కో రూపంలో వ్యక్తమవుతూ, రాక్షసులను, ఆ లోకవాసులను తన దిశగా నడిపించుకుంటాడు. ఈ లోకాల్లో పరమాత్మ ఉనికి లేదు అనుకోవడం పాశ్చాత్య మత భావనల వలన మనలో ఏర్పడిన భావం మాత్రమే.
To be continued .............
సేకరణ: వికీపీడియా
No comments:
Post a Comment