Wednesday, 6 September 2017

భాద్రపద పూర్ణిమ- గణేశ ఆరాధన వైశిష్ట్యం

ఆకాశంలో ఎగిరే మూడు నగరాలను నిర్మించుకున్నత్రిపురాసురులు, తమ 3 నగరాలు ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడే తమకు మృత్యువు రావాలని వరం పొందుతారు. త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన శివుడు ఎన్నాళ్ళు యుద్ధం చేసినా, వారిని వధించలేకపోతాడు. అప్పుడు దీనికి కారణం ఆలోచిస్తాడు శివుడు. అంతలో పార్వతీ దేవి వచ్చి, అసురులతో యుద్ధానికి ముందు గణపతిని ఆరాధించలేదని, అందుకే ఇలా విఘ్నాలు ఎదురవుతున్నాయని చెప్తుంది. ఒకప్పుడు శివుడే అన్ని కార్యాలకు ముందు విఘ్నాధిపతి అయిన గణపతిని ఆరాధించాలని శాసనం చేశాడని, ఇప్పుడు తానే మరిచాడని గుర్తు చేస్తుంది. అప్పుడు శివుడు గణపతిని ఆరాధిస్తాడు. గణపతి సంతసించి ప్రత్యక్షమై తనను సహస్రనామాలతో అర్చించమని అడుగుతాడు. తన సహస్రనామాలను తానే స్వయంగా శివుడికి ఉపదేశిస్తాడు. అలా శివుడు గణపతిని అర్చించి త్రిపురాసురులను వధిస్తాడు.

శివుడు గణపతిని పూజించిన రోజు భాద్రపద పూర్ణిమ. కనుక ఈ రోజు తప్పకుండా గణపతిని ఆరాధించడం వలన సకల శుభాలను పొందగలమని పురాణ వచనం. ఈ రోజు గణపతి సహస్రనామాలను పఠించడం ఎంతో విశేషం.
----------------------



శ్రీ త్రిపురారి వరదో మహాగణపతి విజయతే ||

లోకానికి మర్యాద నేర్పాలి. శ్రేష్టులైన వారు ఏది ఆచరిస్తారో, అదే లోకులు పాటిస్తారు. లోకులు ఎవరిని ప్రేరణగా తీసుకుంటారో, వారు ఎలా ప్రవర్తించాలనే విషయంలో ప్రమాణం స్థాపిస్తారు. కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుడికి తెలియక కాదు. కానీ లోకులకు గణేశుని వైభవం తెలియాలి, ఆయన్ను విస్మరిస్తే ఎంతటి వారికైనా ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎన్ని విఘ్నాలు కలుగుతాయో తెలియజెప్పాలి. అందుకే మహాదేవుడు త్రిపురాసుర సంహారం ముందు గణపతిని పూజించలేదు. ఆ తర్వాత పూజించి, అనుగ్రహం పొందినట్లుగా లోకానికి చూపాడు. ఇదే క్రమంలో పెద్ద పెద్ద విఘ్నాలను సైతం పిండి చేసి, విజయం ప్రసాదించగల గొప్ప మహా మాలమంత్రం స్వరూపమైన సహస్రనామం కూడా జనులకు అందాలి. అలా విజయప్రాప్తికి, విఘ్నధ్వంసం కోసం గణపతి ఉపదేశంతో శివుడు చేసిన స్తోత్రం శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం.

శివుడు గణపతి గురించి తపస్సు ఆచరించిన, స్వామిని 20 చేతులతో, 10 తలలతో మహాగణపతిగా ప్రసన్నం చేసుకున్న ప్రదేశం రంజన్‌గావ్. మహారాష్ట్రలో అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ఈనాటికీ ఉంది. ఒకప్పుడు ఇక్కడి స్వామి ఉగ్రరూపంతో ఉండేవారని, ఆ తర్వాత శాంతమూర్తిని ఇక్కడ ప్రతిష్టించారని కొందరు పెద్దలు చెప్తారు. అలా శివుడు మహాగణపతిని ప్రసన్నం చేసుకుని, శ్రీ గణేశ సహస్రనామాలతో స్తుతించిన రోజే భాద్రపద పూర్ణిమ. ఇక్కడే గణేశుడి శివుడి ద్వారా లోకానికి ఒక సందేశం ఇస్తాడు. తన అనుగ్రహం కావాలంటే అహంకారం విడిచిపెట్టాలని, అహంకారానికి ప్రతీక అయిన కొబ్బరికాయను ఆయనకు అర్పించి, ఆయన పాదాల వద్ద ఏ భక్తుడైతే తన అహాన్ని అర్పిస్తాడో, అతడికి మాత్రమే తన అనుగ్రహం కలిగుతుందని చెప్తాడు.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః 
శ్రీ త్రిపురారి వరదో మహాగణపతి విజయతే ||

చిత్రంలో ఉన్నది రంజన్‌గావ్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మహాగణపతి. ఆ స్వామి స్మరణ, దర్శనం వలన విఘనాశనం జరుగుతుంది, విజయం వరిస్తుంది. 

No comments:

Post a Comment