నిజానికి యోగమార్గంలో సాధన చేస్తున్నప్పుడు అనేక అనుభూతులు కలుగుతాయి. కొన్ని భ్రమలు కూడా కలుగుతాయి. ఒకనొక దశంలో సాధకుడు తాను తన గమ్యాన్ని చేరుకున్నానని, లేదా సమీపానికి వచ్చేశానని భ్రమిస్తాడు. దాంతో ఎక్కడో ఒకచోట ఆగిపోతాడు. ఇవి వక్రములు.....
అనుభూతులు ఉన్నాయంటే అనుభవించేవాడు ఉన్నాడనే అర్ధం. అనుభూతులు మనసుకే కానీ తన (ఆత్మ) కు కాదు. ఒకరు రమణమహర్షి వద్దకు వచ్చి, 'నేను ధ్యానంలో శూన్యస్థితికి వెళిపోతున్నాను. అప్పుడు తలంపులేమీ ఉండటంలేదు. కానీ ఈ స్థితిని మాత్రం దాటలేకపోతున్నాను' అని అనగా, దానికి బదులుగా మహర్షి 'ఆ శూన్యస్థితిని అనుభవిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. తాను ఉన్నాడు కనుకే ఆ స్థితి ఉందని తెల్సుకోగలుగుతున్నాడు. ఆ ఉన్నది ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది' అని సమాధానమిచ్చారు..... కానీ చాలామంది తమకు కలిగిన అనుభూతులనే గొప్పగా భావించి, వాటిని పదేపదే నెమరువేసుకుంటూ కూర్చుంటారు. ఇది వక్రము.
నాకు శాస్త్రము తెలుసు.... నేను సాధన చేస్తున్నాను... నాకు మంత్రోపదేశం ఉంది.... నేను ఇన్ని లక్షల మంత్రజపం చేశాను... వాళ్ళు తప్పుగా ఆచరిస్తున్నారు.... వారిని సరి చేయాలి..... ఇలా ఎన్నో భావాలు మనసులో పెట్టుకుంటారు. వీటన్నిటికి మూలం అహంలో ఉంది. ఈ భావాలు ఉన్నన్ని రోజులు ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఎందుకంటే ఇవే వక్రములు. శాస్త్రం తెలిసి ఉండటం మంచిదే, కాని అది నీలో అహంకారాన్ని పెంచకూడదు, అణుకువను పెంచాలి. భక్తిశ్రద్ధలను పెంచాలి. నువ్వు ఇక్కడకు ఇతరుల్లో దోషాలు ఎంచడానికి, ఎవరు ఎలాంటి వారో తీర్పులు చెప్పడానికి రాలేదు. ఈశ్వరుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా ఎరుకతో జీవించి, ఆయనలో కలిసిపోవడానికి వచ్చావు. ఎవరు ఎంత జపం చేసినా, ఎంత సాధన చేసినా, ఆత్మసాక్షాత్కారం అనేది పూర్తిగా ఈశ్వరానుగ్రహం మీదనే ఆధారపడి ఉన్నది.......
ఇంకా ఇలా కూడా అంటుంటారు. నాకు మోక్షం ఈ జన్మలోనే వస్తుందని నమ్మకం లేదు, దానికి ఎన్నో జన్మల సాధన కావాలి, నేను ఇప్పుడే మొదలుపెట్టాను.... ఇలా మనం ఎన్నో భావాలను (presumptions, assumptions and preconceived notions) ఏర్పర్చుకుని ఉంటాము. కొన్ని ఎక్కడో, ఎవరో చెప్పగా విన్నవి... కొన్ని చదివినవి.... ఇవన్నీ వక్రాలే. ఇవి ఉన్నంతకాలం దైవానికి మనం దూరంగా ఉన్నట్లే. వీటిన్ననిటిని ధ్వంసం చేయువాడు వక్రతుండుడు. నిజానికి ఇవన్నీ వదిలించుకుని వర్తమానంలో, దైవాన్ని హృదయంలో స్థిరంగా నిలిపుకుని, పరిపూర్ణమైన జీవనం గడపడమే ఆధ్యాత్మికత.....అందుకే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి చక్రం. ఆయన అనుగ్రహంతో ప్రయాణం ప్రారంభిస్తే, మధ్యలో వచ్చే వక్రాలన్నీ నశించిపోతాయి. తన భక్తులను నేరుగా హృదయస్థానానికి తీసుకువెళ్ళి తన యందే నిశ్చలమైన దృష్టి ఉండే స్థితిని కలిగిస్తాడు.
వక్రం అనగా విఘ్నము... లౌకిక జీవనంలో అటంకాలుగా చెప్పుకుంటే, ఆధ్యాత్మికతలో విఘ్నమే మాయ... గణేశునికి విఘ్నరాజు అనే నామం ఉంది. అలాగే విఘ్నకర్త, విఘ్నహర్త అనే నామాలు కూడా ఉన్నాయి. విఘ్నరాజు అనగా విఘ్నములను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, అనగా మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆయనే పరబ్రహ్మం. ఈ జగత్తు ఆయన మాయ. ఈ మాయ కూడా ఆయనలోనించే వచ్చింది..... జీవుల కర్మ తీరటం కోసం వారికి ఉపాధి (శరీరం) కల్పించి, మాయలో ఉంచి, కర్మక్షయం చేస్తున్నాడు. తనను చేరటానికి కర్మక్షయం చేస్తున్న గణేశుని ఒక నామమే విఘ్నకర్త. తన పాదాలను గట్టిగా పట్టుకుని, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు, నీకే శరణాగతి చేస్తున్నాను, నన్ను ఉద్ధరించు అన్న భక్తునికి మాయను తొలగించి, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు కనుక ఆయన విఘ్నహర్త కూడా. లౌకిక జీవనంలో వీటి అర్ధాలు మనకు తేలికగానే బోధపడతాయి.....
కాబట్టి గణపతిని వక్రతుండ అనే నామంతో పూజిస్తే, ఆయన మనకున్న భౌతిక, ఆధ్యాత్మిక విఘ్నాలను తొలగించి, ఆయనలో కలుపుకుంటాడు.
వక్రతుండ గణపతి ఎంత శక్తిమంతుడంటే, మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా మనకు వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని స్మరిస్తే, ఆయన మంత్రం కానీ, నామం కానీ విశ్వాసంతో జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. ఈయన శత్రువులను కాదు, శత్రువుల శత్రుబుద్ధిని నశింపజేసి, ప్రేమను, స్నేహభావాన్ని పెంచుతాడు.
వక్రతుండ అని స్వామిని స్తుతించిన బ్రహ్మగారు, ఆ తర్వాత మహాకాయ అని స్తుతించారు. మహాకాయ అంటే పెద్ద శరీరం కలవాడు. అంటే గణపతి భారీ ఆకారంలో ఉంటాడు, లావుగా ఉంటాడు అని కాదు. గణపతి అథర్వశీర్షోపనిషత్తులో గణపతి రూపం గురించి ప్రస్తావన ఉంది. గకార పూర్వరూపం అంటూ..... గం అనే బీజాన్ని జపించినప్పుడు, ఏర్పడే గణపతి రూపం మనం చూస్తున్నట్లు పెద్ద ఉదరంతో ఉంటుంది. ఆ రూపం వెనుక ఎంతో తత్త్వం దాగి ఉన్నది. అయితే బ్రహ్మదేవుడు, స్వామిని మహాకాయ అనడంలో అర్దం ఇంకోలా ఉంది. స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా అంటే విశ్వమంతటా, విశ్వానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఆయన లేని చోటు అంటూ లేదు... అసలు ఆయన తప్ప అన్యమైనదే లేదు. అందుకే 'శుక్లాంబరధరం విష్ణుం' అని ఆయన్ను ప్రార్ధిస్తున్నాము. విష్ణుం అంటే సర్వవ్యాపి. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా శ్రీ మన్నారాయణుడు ఒక మాట అంటారు... విష్ణుత్వం కలిగి ఉన్నవాడే విఘ్నాధిపతి కాగలడు, అటువంటి వాడు పార్వతీ మాత ద్వారా ఆవిర్భవిస్తాడు' అని. స్వామిది, విష్ణుమూర్తిది ఒకటే తత్త్వం....
దశదిశలా వ్యాపించి ఉన్నాడు కనుక స్వామిని చెందిన సహస్రనామాల్లో దిగంబరః అనే నామం ఉంది. అది కూడా త్రిపురాసుర సంహారానికి పూర్వం పరమశివుడు, గణపతి గురించి తపస్సు చేసి, ద్విదశ భుజ (20 చేతులతో), దశముఖ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు స్వామిని స్తుతించగా, లోకానికి అందినవే గణేశ సహస్రనామాలు. వాటికి భాసకరరాయల వారు భాష్యం రాశారు. పరమశివుడు ఆ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్న క్షేత్రం మహారాష్ట్రలో అష్టగణపతి క్షేత్రాల్లో ఒకటై రంజంగావ్ గా ప్రసిద్ధమై ఇప్పటికీ ఉంది. అది దర్శించవచ్చు ..... వస్త్రాలు లేనివాడని కాదు. దిగంబరః అంటే దిశలెల్లా వ్యాపించి ఉన్నవాడు. ఇకా ఆయన వ్యాపించడానికంటూ చోటే లేదు. ఆ దిక్కులనే బట్టలుగా కట్టేసుకున్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడికి రూపం ఉంటుందా?? అన్ని రూపాలు ఆయనవే. అరూపం కూడా ఆయనదే. అదే మాహాకాయం.
ఇక్కడ ఇంకో విశేషం ఉంది. బ్రహ్మదేవుడు వక్రతుండిని ప్రార్ధిచిన తరువాత, సృష్టి జరిగింది. కానీ ఆ సృష్టిని బ్రహ్మగారు ఎక్కడ నుంచో చేయలేదు. అంతటా వ్యాపించి ఉన్న ఆ స్వామియే, ఈ చరాచర సృష్టిగా, అందులోని జీవులుగా మారిపోయాడు. మరి ఇంతకీ బ్రహ్మదేవుడు చేసినదేంటి? ఏమీ లేదు..... త్వమేవ కేవలం కర్తాసి| త్వమేవ కేవలం ధర్తాసి| త్వమేవ కేవలం హర్తాసి| త్వఏమ సర్వం ఖల్విదం బ్రహ్మాసి| - గణపతి అథర్వశీర్షోపనిషత్తు.
ఆయనే కర్త, ఆయన ధర్త (స్థితికారుడు), ప్రళయకర్త/ తొలగించేవాడు కూడా ఆయనే. ఈ సమస్త సృష్టి ఆయన తప్ప మరేమీ కాదు. ఆయన కాదు, మనమే కర్తలము అనుకోవడమే మన అజ్ఞానం. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్న ప్రాణులంతా పాత్రధారులు. ఆయన మాత్రమే కర్త. అదే జ్ఞానం.
వివరణ ఇంకా ఉంది.....
No comments:
Post a Comment