సదాశివుని నుంచి వచ్చే చైతన్యం యొక్క కాంతి, వాస్తవంలో శివలింగం. ఆయన నుంచి చరాచరమైన సృష్టి ఉద్భవిస్తుంది. ఆయనే అన్నిటికి లింగం లేదా కారణం. అంతిమంగా సమస్త ప్రపంచం ఆయనలోనే ఐక్యమవుతుంది. పీఠం అంబమయం సర్వం శివలింగశ్చ చిన్మయం అంటుంది శివపురాణం. పీఠం లేదా ఆధారంగా ఉండేది సమస్త ప్రకృతి లేదా పార్వతి, మరియు లింగం అనేది స్వయంప్రకాశమైన దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించే చిన్మయ పురుషుడు. ప్రకృతి పురుషుల సమాగమము లేదా పార్వతీ పరమేశ్వరుల సమాగమమే ఈ ప్రపంచానికి కారణం. శివపురాణం సనత్కుమార సంహితలో, పరమశివుడు ఇలా అంటాడు: "ఓ పార్వతీ, పర్వతరాజు పుత్రిక, లింగమే సమస్తానికి మూలకారణం అని, ప్రపంచం లింగమయం లేదా చిన్మయమని తెలుసుకుని, నన్ను లింగరూపంలో పూజించే వ్యక్తి కంటే నాకు దగ్గరివాడు వేరొకడు లేడు."
లింగం అండాకారంలో ఉంటుంది. అది బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నదంతా లింగమే. సమస్త ప్రపంచమూ శివస్వరూపమే. ప్రపంచమే లింగము. లింగము కూడా శివుని రూపమే.
ప్రకృతి పురుషుల సమాగమం ద్వారా సృష్టి ప్రభావితమవుతుందని లింగం సూచిస్తుంది. అంటే అది లయం, జ్ఞానం, వ్యాప్యం, ప్రకాశం, ఆరథప్రకాశం, సామర్ధ్యం మరియు పై అర్ధాన్ని సూచిస్తుంది. లింగం అంటే ప్రపంచం మరియు జీవులు లయమయ్యే స్థానం. అది సత్యం, జ్ఞానం, అనంతం అనేవాటిని కూడా సూచిస్తుంది. శివుడు సర్వవ్యాపకుడని, స్వయంప్రకాశ తత్త్వం కలవాడని అందులో అర్ధం దాగుంది. పైన చెప్పిన అనేక అర్థాలను మనం అర్ధం చేసుకునేందుకు లింగం చిహ్నము. అండలింగం, పిండలింగం, సదాశివలింగం, ఆత్మలింగం, జ్ఞానలింగం మరియు శివలింగం అనేవి ఆరు లింగాలు. ఈ లింగాలు అండ, పిండ, సదాశివ మొదలైన వాటి గుణాలను తెలుసుకుని, అర్ధం చేసుకునేందుకు పరిగణలోకి తీసుకుంటారు.
యోని (పానపట్టము) తో లింగం యొక్క సంయోగము అనేది పరమ సత్యం యొక్క నిశ్చల/స్థిర మరియు చంచల తత్త్వాల శాశ్వతమైన/ అద్యంతరహితమైన ఐకమత్యానికి నిదర్శనము. దృగ్గోచరమైన వైవిద్యాలు దేని నుంచి వచ్చాయో ఆ సనాతనమైన ఆధ్యాత్మిక మాతృ మరియు పితృ తత్త్వాల ఐకమత్యానికి ఇది నిరూపిస్తుంది. ఇది మార్పుచెందని తత్త్వం మరియు చంచలమైన, నిరంతరం మార్పు చెందే శక్తి యొక్క శాశ్వతమైన కలియిక.
ఇంకా, ఈ ఘనమైన భావనతో సాధకుల యొక్క నీచమైన కామవాంఛలు తొలగుతాయి. లింగం మరియు యోని యొక్క ఆధ్యాత్మీకరణం మరియు పవిత్రీకరణం అనేవి సాధకుడు కామపూరితమైన ఆలోచనల నుంచి విముక్తిని పొందేలా చేస్తాయి. ఉత్కృష్టమైన/శ్రేష్టమైన ఈ భావన ద్వారా అన్ని నీచమైన ఆలోచనలు క్రమంగా మాయమవుతాయి. ప్రపంచంలోని సమస్త కామంతో కూడిన సంబంధాలు సనాతనమైన ఆత్మానందంతో కూడిన, స్వయంవృద్ధి కలిగిన పరతత్త్వమైన చైతన్య శక్తి అయిన పరమశివుడు మరియు ఆయన శక్తి యొక్క అభివ్యక్తీకరణలుగా ఆధ్యాత్మీకరించబడుతాయి.
యోని (పానపట్టము) తో లింగం యొక్క సమాగమము పరమశివుడు, ఆయన శక్తితో కలిసి చేసిన ఈ సృష్టిని సూచిస్తుంది.
విద్యావంతులుగా పిలువబడే ఈ ఆధునిక మానవులకు ఆధ్యాత్మిక లోదృష్టి మరియు తాత్త్వికత లేదు. వారి తీవ్ర అజ్ఞానం మరియు విచారణ శక్తి లేకపోవటం చేత, లోతైన ఆలోచన మరియు ఋషులతో సత్సంగం లేని కారణంగా వారు యోనితో లింగం యొక్క సంయోగాన్ని నీతిబాహ్యమని, అశ్లీలమని విమర్శిస్తారు. ఇది అత్యంత శోచనీయము మరియు దుఃఖప్రదము. అజ్ఞానంతో ఉన్న జీవులకు భగవంతుడు జ్ఞానం ప్రసాదించుగాక!
- స్వామి శివానంద
No comments:
Post a Comment