ఒక చేతిలో చాట, ఇంకో చేతిలో చీపురు, ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేయి అభయముద్ర చూపిస్తూ, గాడిదని వాహనంగా చేసుకుని, మనకు దర్శనమిచ్చే ఈ మాత పేరు శీతలా దేవి. అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి స్మరణ చేతనే జ్వరాది భయంకరమైన వ్యాధులు నిర్మూలించబడతాయి. శీతలా అంటే చల్లదనం చేకూర్చేది అనే అర్థం కూడా ఉంది. వేడి వలన కలిగే వ్యాధులను ఈ అమ్మవారు నశింపచేస్తుంది. ఈవిడ కాత్యాయని దేవి యొక్క అవతారం. ఉత్తర భారతదేశంలో శీతల నామంతో అర్చించబడుతుండగా, దక్షిణ భారతదేశంలో మరియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ మొదలైన పేర్లతో మనం పూజిస్తాం. అనగా గ్రామ దేవతల యొక్క స్వరూపము శీతలా దేవి.
అమ్మ వారి చేతిలో ఉండే చాట మనలో దుర్గుణాలను చెరిగి అవతల పార వేస్తుంది. చీపురు చెత్తని ఊడ్చి వేసినట్టుగా అమ్మవారు మనలో ఉన్న రోగాలు అనగా వ్యాధులను, అలాగే వాటికి మూలమైన ఆదులు అనగా మానసిక రోగాలను సైతం ఉపశమింపజేస్తుంది. అంటే చీపురుతో చెత్తని ఊడ్చి వేసినట్టుగా శరీరంలో పేరుకుపోయిన రోగాలను, వాటికి కారణమవుతున్న జీవుని ఖాతాలోని దుష్కర్మ అమ్మవారు చీపురుతో ఒక పోగు చేసి, చాటతో ఎత్తి పారవేస్తుంది. కర్మ తీసిన తర్వాత మనకు కావలసినది ఏంటి? జ్ఞానం.... అది ఆవిడ చేతిలో ఉన్న కలశం ద్వారా అందుతుంది. అందులో గంగాజలం ఉంటుంది. గంగా స్వచ్ఛతకు, పరిశుద్ధతకు, పవిత్రతకు, జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు మనకు కర్మ క్షయం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ జీవితంలో ఏ భయము లేకుండా జీవించమని.... అండగా తాను ఎప్పుడూ ఉంటానని చెప్పడానికి ప్రతీకగా అభయ హస్తం చూపిస్తోంది.
ఈ అమ్మ గారి గురించి శివుడే స్తోత్రం చేసినట్టుగా మనకు స్కంద పురాణంలో ఉంది. మన ధర్మం ప్రకారం రోగానికి మందు ఎంత అవసరమో, మంత్రం కూడా అంతే అవసరం. ఎందుకంటే గతంలో చేసిన పాపలే రోగాల రూపంలో బాధిస్తాయి.
అయితే మంత్రానికి కానీ ఔషధానికి కానీ లొంగని భయంకరమైన ప్రారబ్ధం వలన కలిగే రోగాలను, కేవలం తన ధ్యాన మాత్రం చేత శీతల దేవి నశింపజేస్తుందని, అంతటి తీవ్ర కర్మను భస్మం చేయడంలో తనకు శీతలాదేవి వేరొక దేవత తెలియదని, ఈశ్వరుడే అమ్మవారిని స్తుతించాడు.
ఈ అమ్మవారి ఆరాధనతో భౌతికమైన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, జ్ఞానము, ధైర్యం అలవడతాయి. ఈవిడ స్మరణ ఎక్కడ ఉంటే, అక్కడ రోగనాశనం జరుగుతుంది. భయము, ఘోరమైన ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. అటువంటి అమ్మని మనం నిత్యం అర్చించాలి.
లక్ష్మి, సరస్వతి, పార్వతుల స్వరూపం శీతలా దేవి...
No comments:
Post a Comment