Thursday, 31 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (130)



కపిల - తిరు చెంగట్టాన్ కుడిలో వినాయకుడు


మూడవ నామం కపిలుడు. కొద్దిగా ఎఱుపు డాలుండే రూపమది గణపతి, పెక్కు రంగులలో కన్పిస్తాడు. శుక్లాంబరధరం శ్లోకంలో చంద్రకాంతి వంటి తెలుపుతో ఉన్నట్లు వర్ణింపబడ్డాడు. కుంభకోణం దగ్గర ఉన్న తిరు చెంగట్టాన్ కుడిలో, తిరుతురై పూండి దగ్గర ఉన్న ఇడుంబనంలో శ్వేత వినాయకులున్నారు. అవ్వైయార్, తన స్తోత్రాలలో స్వామిని నీలం రంగుతో ఉన్నట్లు, మరొక చోట పగడపు రంగుతో ఉన్నట్లు వర్ణించింది. ఆమెకు అనేక వర్ణాలతో ఉన్న మూర్తి సాక్షాత్కరించాడు. ఉత్తర దేశంలో సాధారణంగా సిందూరంతో ఉంటాడు. తంజావూరు జిల్లాలో గణపతీశ్వరం అని ఉంది. ఇందు ముఖ్యమైన పదం సెంకాడు అనగా ఎట్టని అరణ్యమని, గణపతి, గజాసురుని చంపినపుడు అసురుని రక్తం అరణ్యంలో ప్రవహించగా అది ఎఱ్ఱనైంది. స్వామి కూడా ఎఱ్ఱనయ్యాడట. అది శుద్ధమైన రక్తవర్ణం కాదు. ఏనుగు శరీరానికి రక్తం పులిమితే ఎట్లా ఉంటుందో అట్టి వర్ణం.


గొప్ప యోధుణ్ణి చంపి రక్తం కారేట్లుగా చేయడం వల్ల ఇతనికి బ్రహ్మహత్య దోషం చుట్టుకొందిట. అతనికి అసలు దోషం ఉంటుందా? లోకానికి చూపడం కోసం బ్రహ్మహత్యాదోషం ఉన్నట్లుగా నటించాడు. రావణుని చంపి రాముడట్టా బాధపడినట్లు కనబడలేదా? దానికి ప్రాయశ్చిత్తంగా రామలింగాన్ని స్థాపించి పూజించలేదా? అట్లాగే గణపతి అక్కడొక ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని దోషం నుండి విముక్తుడయ్యాడని కథ. రాముడు శివపూజ చేసినచోట రామేశ్వరమైనట్లు, తిరు చెంగట్టాన్ కుడి, గణపతీశ్వరంగా ప్రసిద్ధిని పొందింది.

Wednesday, 30 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (129)



విఘ్నేశ్వర గాయత్రి


ప్రతి దేవతకు గాయత్రీ మంత్రం ఉంది. ఉపనయనంలో ఉన్న గాయత్రీ మంత్రానికి సవిత, దేవత. ఆమెయే పరమాత్మ శక్తి. ఇందు 24 అక్షరాలుంటాయి. అందరు దేవతలకూ అట్లా అక్షరాల సంఖ్య ఉంటుంది. వారి గాయత్రీ మంత్రంలో దేవత పేరుంటుంది. మొదటి భాగంలో ఒక పేరు చెప్పి అట్టి దేవతను తెలిసికొందుము గాక అని యుంటుంది. రెండవ భాగంలో ఆ దేవత యొక్క మరొక పేరు చెప్పి అట్టి దేవతను ధ్యానింతుము గాక అని యుంటుంది. మూడవ భాగంలో మరొక పేరు చెప్పి ఆ దేవత మమ్ములను సన్మార్గమున నడిపించును గాక అని ఉంటుంది.


గాయత్రీ మంత్రంలో సవితకు రెండు భాగాలలోను ధ్యానింతుము గాక అని యుండి మూడవ భాగంలో పేరు చెప్పకుండా అట్టి దేవత, బుద్ధులను ప్రేరేపించుగాక అని యుంటుంది.


మహా నారాయణోపనిషత్తులో పెక్కు గాయత్రీ మంత్రాలు చెప్పబడ్డాయి. పరమ శివ, విఘ్నేశ, సుబ్రహ్మణ్య, నందికేశ్వర గాయత్రులున్నాయి. ముందుగా తత్పురుష అని యుంటుంది. కానీ అథర్వవేదంలో విఘ్నేశ్వరునకు ప్రత్యేక గాయత్రి ఉంది. దానిని గణపత్యథర్వశీర్షం అంటారు. అందొక గణపతి గాయత్రి ఉంది. ఇందులో ముందుగా ఏకదంత అనే పదముంది.

Tuesday, 29 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (128)



అతనితో స్త్రీత్వం


ఒక దంతంతో ఉండడంలోనూ ఒక తత్త్వం దాగియుంది. దేవతాత్మం, స్త్రీ పురుషాత్మకం. ఒక ప్రక్క దంతం కలిగియుండి పురుషునిగా, మరొక ప్రక్కదంతం లేక స్త్రీ లక్షణంతో ఉన్నట్లే కదా! అతని తల్లిదండ్రులు అర్ధనారీశ్వర స్వరూపులే. తానూ అర్ధనారీశ్వరునిగా కనబడుతున్నాడు. శివుని అర్ధనారీశ్వర. తత్వంలో కుడివైపున మగవాడు, ఎడమవైపున ఆడది ఉండగా వినాయకునిలో మార్పుతో ఉంది. ఇతని కుడివైపున దంతం లేకపోవడం వల్ల స్త్రీగా, ఎడమవైపున పురుషునిగా ఉన్నట్లుంటుంది. 


Monday, 28 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (127)



ఏకదంతుడు - త్యాగానికి నిదర్శనం


ఏకదంతుడనగా ఒక దంతం కలవాడు. సాధారణంగా మగ ఏనుగులకు రెండు దంతాలుంటాయి. ఆడ ఏనుగులకు దంతాలే ఉండవు. కాని వినాయకుడు ఏక దంతుడేమిటి?


అతనికి మొదట్లో రెండు దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడబెరుకున్నాడు. అది విగ్రహాలలో క్రిందనున్న కుడిచేతిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకీ పనిచేసాడు? పురాణాలలో రెండు కథలున్నాయి. ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు హిమాలయపు రాతిపై వ్రాయవలసి వచ్చిందట. వ్రాసే సాధనమేమీ లేదు. అందువల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడట. దేనిని ఏనుగు గొప్పగా భావిస్తుందో దానినే విరిచి త్యాగం చేసాడని త్యాగగుణాన్ని ప్రశంసించే కథ ఇది.


మరొక కథ ప్రకారం గజముఖాసురుడు ఏ ఆయుధం వల్ల చంపబడలేదట. అందువల్ల తన దంతాన్నే పెరికి ఆయుధంగా గణపతి ప్రయోగించాడట. లోక క్షేమం కోసం తన అవయవాన్నే వినియోగించాడు. ఇంద్రునికి వృత్రాసురుని చంపడానికి వజ్రాయుధం కావాలి. దధీచి తన వెన్నెముకనే ఇచ్చి దాని నట్లా వాడు కొమ్మన్నాడు. దంతం, ఏనుగు యొక్క ఎముకయే కదా! దధీచి మాదిరిగా ఇతడూ ఎముకనిచ్చి లోకాన్ని కాపాడాడు.

Sunday, 27 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (126)



ఇతనికి అనేక రూపాలలో విద్యాగణపతి రూపం ఒకటి. వినాయక చవితి నాడు పూజా కల్పంలో 21 రూపాలకున్న నామాలు, 21 రకాల పువ్వులతో అర్చించాలని ఉంది. ఇందులో విద్యాగణపతికి రసాల పుష్పంతో పూజించాలని ఉంది. రసాలమనగా మామిడి. అత్మకు విద్యయే పండు వంటిది, నారదుడు ఒక పండును తీసుకొని వచ్చి చూపించగా ఎవరు ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి పండు నిస్తానని ఆశ చూపించాడు. అందు గణపతి జయించినట్లున్న కథ మనకు తెలిసిందే. జ్ఞాన ఫలానికి గుర్తే ఆ మామిడి పండు.


ఏనుగు నోరు - దాని తత్త్వము


ఏనుగు నోటికి ఒక ప్రత్యేకత ఉంది. నరులకు, జంతువులకు పెదవులను కదిపితే నోరు కన్పిస్తుంది. కన్నులకు రెప్పలుండి అవి పైకి క్రిందకు కదులుతూ కన్నులను రక్షిస్తూ ఉంటాయి. కన్నులు చూడడానికి కనురెప్పల పని యేమీ లేదు. కాని మాట్లాడడంలో పెదవులకు పాత్ర ఉంది. నాల్క, పండ్లు, పెదవులవల్లనే మాట్లాడగల్గుతున్నాం. శబ్దం వినబడుతోంది. ప, మ, అనే ధ్వనులు పెదవుల కలయిక వల్లనే సాధ్యం. వాటిని ఓష్ఠ్యములని అంటారు. ఆంగ్లంలో అట్టి అక్షరాలను Labial అంటారు. 


నోటిని కప్పేది ఏనుగు యొక్క తుండమే. నోటిని, చేతితో కప్పుట వినయాన్ని సూచిస్తుంది. చేతితో నోటిని కప్పుతాం. కాని ఏనుగు సహజమైన తుండంతోనే నోటిని మూస్తుంది. అది నోట్లో ఆహారం వేసినపుడు, కాని ఇంక ఏదైనా కారణం వల్లగాని తుండం ఎత్తినపుడు దాని నోటిని చూడగలం. ఇందులో చాలా తత్త్వం ఇమిడి యుంది. తుండంతో కప్పబడిన నోరు, ఏమని సూచిస్తోంది? పాండిత్యం ఎంత ఉన్నా, వాగుడుతనం లేకుండా ఉండాలని తప్పనిసరియైనపుడు మాత్రమే ప్రదర్శించాలని అదే సరియైన విద్వాంసుని లక్షణమని సూచించడం లేదా! అనగా పాండిత్యానికి మౌనమే చివరి మెట్టు.


Saturday, 26 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (125)



ఆనందరూపుడు 


వినాయకుడు నవ్వుతూ కన్పిస్తాడు. సంతోషం పూర్ణత్వాన్ని సూచిస్తుంది, సదాశివ బ్రహ్మేంద్రులు 'సతతం అనందవూర్ణ పోతోఽహం' అని సచ్చిదానంద పూర్ణ పోతోఽహం' అని గానం చేస్తూ ఉండేవారు. సంతోషంగా ఉంటే నవ్వుతూ ఉంటాం. ఆడుతూపాడుతూ ఉంటాం. దుఖపడుతున్నవాడు గంతులు వేయగలడా? గణపతి ఆనంద స్వరూపుడు కనుక అతడు నృత్త గణపతి. చాలా శివాలయాలలో గర్భగుడికి ఉన్న దేవతా ప్రతిమలలో ప్రధానంగా ఈ నర్తనమూర్తి కన్పిస్తాడు. పెద్ద బొజ్జుతో నృత్యం చేస్తున్నట్లుగా ఉంటాడు. అనందాన్ని ముఖమే కాదు బొజ్జ కూడా సూచిస్తుంది. 


ముఖం అనగా ఆరంభమని అర్థం. సుముఖ పదంతో మొదలు పెట్టబడ్డాడు కూడా.


మంచి నోరు కలవాడు


ముఖానికి నోరని అర్థం కూడా ఉంది. సంస్కృతంలో నోటికి విడిగా పేరు లేదు. మాట్లాడడానికి ప్రధానమైన ముఖానికి అన్ని పేర్లు. ఉచ్చరించే దానికి పేరు లేదు చూసారా?


ముఖమనగా నోరని ప్రస్తుతం చెప్పదలచుకున్నాను. సుముఖం అనగా మంచి నోరు, ఏమిటిది? మంచి మాటలు మాట్లాడేది సుముఖం, కనుకనే మంచి విద్వాంసుణ్ణి సుముఖుడని అంటాం. ఇట్లా అర్థం చేసుకుంటే గణపతి సుముఖుడే. ఆయన గొప్ప విద్వాంసుడు కదా! విద్వాంసుడనే మాట వేదాలలో బ్రహ్మణస్పతి, బృహస్పతి పదాల ద్వారా వ్యక్తీకరింపబడింది.

Friday, 25 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (124)



మానవముఖం కాక, ఏనుగుముఖం ఎందుకు వచ్చింది?


ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చనే మాటను బట్టి నరముఖ గణపతిని కూడా ధ్యానించొచ్చు అను కొంటాం. చిదంబరంలోని దక్షిణ వీధిలో ఇట్టి విగ్రహముంది, తెలిసిన వాళ్ళు చెబితేగాని తెలియదు. కాని మనం చటుక్కున నమ్మలేం, తిరుచిరాపల్లిలో ఒక ఱాతి కోట ఆలయంలో నరముఖంతో ఉన్నాడు. 


కొన్ని కథలననుసరించి అతని రూపం నరుడే యని ఉంది. అమ్మవారు తన భవనానికి ఒక రక్షకుణ్ణి నియమించాలని అనుకొందట. తన శరీరాన్ని పసుపు సున్నిపిండితో రుద్దుకుందట. దానితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. అతణ్ణి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది.


అమ్మవారు అన్ని విధాలా పవిత్రమైనదే కదా. కనుక మంగళకరమైన పసుపుతో నలుగు బెట్టుకోవడం వల్ల అసలు వినాయకుడు పసుపువల్లనే ఏర్పడ్డాడు. అందుకే ముందుగా పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి కొలుస్తాం.


పరమేశ్వరుడు పార్వతి భవనానికి వచ్చాడు. ఎవరీ మగవాడని గద్దించాడు. ఏమీ తెలియనట్లు కోపపడి అతని తలను నరికాడు. అన్నీ తెలిసి ఇట్లా ఎందుకు చేసాడు? అది లోక క్షేమం కోసమే. అది నాటకంలో ఒక భాగం వంటిది. గజముఖాసురుడనే రాక్షసుడుండేవాడు. పేరునుబట్టి గజముఖంతో ఉన్నవాడనే కదా అర్థం. మానవులకు పుట్టని గజముఖం కలవాడే నన్ను సంహరించగలడనే వరాన్ని అది ఎలాగూ సాధ్యం కాదనుకొని పొందాడు. అపుడు కైలాసంలో ఉత్తరంవైపు తల పెట్టుకొని పడుకొన్న ఏనుగు కనబడింది. అట్లా పెట్టి పడుకోవడం లోకానికే అశుభం. దానిని చంపి ఆ తలను ఈ పిల్లవానికి అతికి నాటకం అడాడు శివుడు. మరల దానికి ప్రాణంబోసి అమ్మవారిని సంతోషపెట్టాడు. ఇట్లా వినాయకుని నిమిత్తంగా చేసుకొని గజముఖ సంహారం జరిగేటట్లు లోకాన్ని రక్షించాడు, శంకరుడు.


Thursday, 24 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (123)



సుముఖ


ఇది మొదటి పేరు. ఎవరినైనా మనం అహ్వానిస్తున్నపుడు సుముఖ పిలవాలి. అనగా మంచి ముఖం. అట్టి ముఖంతో ఉన్నపుడు ప్రేమను, సంతోషాన్ని చూపించగలం. అవి హృదయంలో ఉంటే ముఖంలో ప్రతిబింబిస్తాయి. Face is the index of the mind అని ఆంగ్లంలో ఉంది కదా. విఘ్నేశ్వరునకు ప్రేమను వ్యక్తీకరించే ముఖం ఉంది. మంచి మనస్సును ప్రకటింపచేసేది సుముఖం.


శుక్లాంబరధరం శ్లోకంలో ప్రసన్న వదనం అని ఉంది కదా, అది సుముఖం. ప్రేమ, సంతోషం ప్రతిబింబించినపుడు ప్రసన్నవదనమౌతుంది. అంతేకాదు, స్పష్టత, అత్యవిశ్వాసం, కాంతి ఉంటే ప్రసన్నవడనమౌతుంది. సుముఖ శబ్దంలో 'సు' ఉంది. ఆదీ ప్రసన్నత్వాన్ని సూచిస్తుంది.


విఘ్నేశ్వరుడు ఏ రూపంలో ఉన్నా అతడు సుముఖంగానే ఉంటాడు. ఏనుగు ముఖం ఉండడం వల్ల ఈ సుముఖత్వం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అందేదో ప్రత్యేకత దాగియుంది. ఎంతసేపు చూసినా తనివి తీరని లక్షణమేదో ఉంది, ముఖం విశాలంగా, ఆజ్ఞాపిస్తున్నట్లుగా, పరమశాంతంగా చెప్పనలవి కాని రీతిలో ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా అతనికి నప్పింది.

Wednesday, 23 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (122)



షోడశనామ శ్లోకాలు


స్వామికి ప్రధానంగా 16 నామాలు, సుముఖ, ఏకదంత, కపిల, గజకర్షక లంబోదర, వికట, విఘ్నరాజ, వినాయక, ధూమ్రకేతు, గణాధ్యక్ష, భాలచంద్ర, గజానన, వక్రతుండ, సూర్పకర్ణ, హేరంబ, స్కంద పూర్వజ - అనేవి. 


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః


లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః


ధూమ్రకేతుః గణాధ్యక్షః భాలచంద్రో గజాననః


వక్రతుండః పూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః


ఈ శ్లోకం తరువాత షోడశైతాని నామాని అనే శ్లోకం వస్తుంది.


విఘ్నేశ్వరుడు అనేక రూపాలనెత్తాడు. దానికి తగ్గట్లు షోదశగణపతులూ ఉన్నారు


ఈ 16 నామాలూ, 16 గణపతులను సూచిస్తాయని పరిశోధన చేయగా కాదనిపిస్తోంది. షోదశనామాలలో మూడవది కపిలుడు. అనగా ఎరుపున్న రూపం (నీల పీతమిశ్రిత వర్ణమని కొందరు, గోరోచన వర్ణమని కొందరంటారు). కాని ధ్యాన శ్లోకంలో ఇతనికి శరత్కాలపు కాంతి యున్నట్లు వర్ణింపబడింది. ఇక పదహారవ నామం హేరంబుడు. ఇందులోనూ అభిప్రాయ భేదాలున్నాయి. కనుక ఈ రెండూ భిన్న వర్గానికి చెందుతాయి. సరేసరి.


Tuesday, 22 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (121)



16 గొప్పదనం


16 నకు ప్రాధాన్యం ఉంది. చంద్రుడు షోడశకళాపూర్ణుడు కదా. అమావాస్య నుండి పూర్ణిమ వరకూ చంద్రునకు 16 కళలుంటాయి. 16వ కళ వచ్చేది పూర్ణిమనాడే. 16 ఉపచారాలు చేస్తాం. ఏడుగురు దేవులను కొలిచేటపుడు సప్తమాతృకలని అంటాం. అట్లాగే షోడశ మాతృకలూ ఉన్నాయి. అమ్మవారి మంత్రాలలో షోడశాక్షరికి ఉన్నత స్థానం ఉంది. అందువల్ల అమ్మవారు షోడశి.


తమిళనాడులో అశీర్వదించేటపుడు 16తో ఉంది గొప్ప జీవితాన్ని గడుపమని అంటారు. ఇక్కడ పదహారు మంది పిల్లలతో ఉండమని కాదు. మంచి జీవితం గడపాలంటే 16 మంచి లక్షణాలుండాలని. భర్తతో కూడిన స్త్రీని వైదికంగా దీవించునపుడు పదిమంది పిల్లలను కను భర్తను పదనొకండవ పిల్లవానిగా చూడుమని దీవిస్తారు.


పూజ చేసేటపుడు ముందుగా సంకల్పం చెబుతారు. ఫలానా వాటిని ప్రసాదించుమని ప్రార్థిస్తారు. ఇక 16తో ఉండడమేమిటి? భాగ్యం, స్థిరత్వం వీర్యం, విజయం, దీర్ఘజీవనం, మంచి ఆరోగ్యం, సంపద ఇవన్నీ మొత్తం కుటుంబానికి ఉండాలని; అనగా ఏడయ్యాయి. తరువాత ధర్మ, అర్ధ, కామ, మోక్షములు - కలిపి నాలుగు. కోరికలు నెరవేరుట, మంగలకరమైనవి సిద్ధించుట, పాప పరిహారం కలిపి మూడు; పిల్లలు, మనుమలు వృద్ధిలోనికి రావడం, చివరకు ఏ దేవతను పూజిస్తున్నాడో అతని అనుగ్రహం లభించుట. ఇట్లా మొత్తం పదహారయ్యాయి. ఇందు ప్రాపంచికమైన కోర్కెలే ఉంటున్నాయి. కాని జ్ఞాన వైరాగ్యాలను కలుపుతారు.


మంచి జీవితం కావాలంటే పై 16 ఉండాలి. స్వామికీ 16 నామాలున్నాయి చూసారా?


Monday, 21 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (120)



ఫలానా ఆశ్రమమని చెప్పకుండా అన్ని కార్యాలలోనూ "సర్వ కార్యేషు" అని విఘ్నం లేకుండా అని చెప్పింది.


సర్వ కార్యేషు విఘ్న: తస్య నజాయతే


ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పినపుడు మన మనస్సులో బాగా నాటుకుంటుంది. దేంట్లోనూ విఘ్నం ఉండదని అంటే నాటుకోదు. ఇక అన్నిటిలో విఘ్నం ఉండదని చెప్పినప్పుడు బాగా నాటుకుంటుంది.


విఘ్నాలు లేకుండా చేసే ఆ వ్యక్తి ఎవరు? అతనికున్న నామాలెన్ని? షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి


అనగా వినాయకుని 16 నామాలను ఎవరు పఠిస్తారో లేదా వింటారో వారికి వారి పనులలో ఆటంకాలుండవని. ఈ పదహారింటిని కంఠస్థం చేయాలి. చేయలేనివారు చదవడం వల్లగాని, వినడం వల్ల గాని లాభం పొందవచ్చు. అంతేకాదు, అనేక నామాలున్నాయి స్వామికి. 21 దళాలతో అర్చిస్తాం. 21 నామాలను పల్కుతాం. 21 దూర్వలతో అర్పిస్తాం. కాని శ్లోకంలో 16 నామాలే చెప్పబడ్డాయి.

Sunday, 20 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (119)



మనం గమనిస్తే ఈ కదలికకు, ఈ సంఘర్షణలకు దగ్గర సంబంధం ఉంది. ఒక కదలిక, ఒకనికే ఉండి, మిగిలినవన్నీ కదలకుండా ఉంటే అతడు హాయిగా తన కిష్టం వచ్చినచోటుకు వెళ్ళగలడు. (అన్ని కదలికల గురించి చెబుతున్నా, ఇది అభ్యాసంలో ఉందా? అందరికీ విశ్రాంతి లేని కదలికలే ఉన్నాయి. అచేతనాలలోనూ కదలిక ఉంది. అణువులోనూ నిరంతరం కదలిక యుంది. ఇట్లా చేతన అచేతన వర్గాలన్నీ కదిలేటప్పుడు పరస్పరం సంఘర్షణ ఉండదా? ఇట్టి సంఘర్షణ ఒకదానికొకటి పొసగక పోవడమే కదా.


అసలు మూలాన్ని అన్వేషిస్తే చేతనంగాని, అచేతనం గాని కదలికలో నుండుటయే సంఘర్షణ. శాంతి కలిగినపుడు ఎట్టి కదలిక లేకపోవడాన్ని గమనిస్తున్నాం. శాంతి లేనపుడు సంఘర్షణయే. యుద్ధం, శాంతి పరస్పర విరుద్దాలని మనం అనడం లేదా?

అసలు జీవితమే ఒక సంఘర్షణ కాగా ఇది ఇద్దరు యుద్ధం చేసినపుడు స్పష్టంగా గోచరిస్తోంది. అందువల్ల 'సంగ్రామే' అని శ్లోకం. అంటే యుద్ధం అట్టి సంగ్రామంలో కూడా విఘ్నాలుండవని, విజయం వరిస్తుందని శ్లోకార్థం.


దీనినింకా పొడిగిస్తే అన్ని రంగాలలోనూ విజయమే. ఇంకా ఈ అర్థాన్ని పొడిగిస్తే సంపూర్ణత్వం వస్తుందని అనగా సమాధి స్థితి కల్గుతుందని, అది కదలిక, సంఘర్షణ లేని స్థితియని తెలుస్తుంది. విద్యారంభమనగా బ్రహ్మచర్యాశ్రమమని, వివాహే అనగా గృహస్థాత్రమమని; అన్నాం. ఆత్మ సమాధి యనినపుడు సన్యాసాశ్రమమని అర్థం. 


Saturday, 19 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (118)

 


16 నామాలు-


అన్ని ఆటంకాలకూ విరుగుడు:


విద్యారంభంలో, వివాహంలో, క్రొత్త ప్రదేశానికి వెళ్ళేటపుడు, తిరిగి వచ్చేటపుడు, యుద్ధంలో ఇట్లా అన్ని కార్యాలలో స్వామిని పూజిస్తే ఎట్టి ఆటంకాలు లేకుండా ఉంటాయని ప్రసిద్ధి శ్లోకం:


విద్యారంభే, వివాహేచ, ప్రవేశ, నిర్గమే తథా 

సంగ్రామే, సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే


విద్యారంభే' - విద్యను నేర్చుకునేటపుడు, అనగా బ్రహ్మచర్యాశ్రమంలోనూ, 'వివాహేచ' అనగా గృహస్థాశ్రమంలోనూ ఆటంకాలు ఉండవు. కొందరే సన్న్యాసం తీసుకుంటారు గనుక మొత్తం జీవితంలో ఎట్టి ఆటంకాలూ ఉండవు. 

జీవితమంటే ఏమిటి? ఇందెన్నో మార్పులు, కదలికలు; మనస్సుతో వాక్కుతో, శరీరంతో, బుద్ధితో, డబ్బుతో ఎన్నో పనులుంటాయి. జీవితం అంటే అంతా కదలికయైనా శరీరం యొక్క కదలికలే బాగా కన్పిస్తాయి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బయలుదేరడం స్పష్టంగా కన్పిస్తుంది. అట్లాగే ఒకచోటునుండి మరొక చోటుకు రావడం అందుకే ప్రవేశే, నిర్గమే తథా అని శ్లోకం. ప్రవేశమనగా ఒక చోటునకు వెళ్ళుట, నిర్గమం అనగా తిరిగి వచ్చుట. ఇక ఈ కదలికలలోనూ ఆటంకం ఉండదంటున్నాడు.


జీవితం గురించి, మరొక నిర్వచనం జీవితమొక సంఘర్షణ యని పత్రికల వల్ల తెలుస్తోంది. డార్విన్, హెర్బెర్ట్ స్పెన్సర్ సిద్ధాంతాల ప్రకారం సంఘర్షణ నుండే జీవనం ఆరంభమైందని అంటారు.

Friday, 18 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (117)

దుఃఖాలూ, కోరికలే బరువు కాదు. తనను తాను చూసి గర్వించుట కూడా బరువే. నిజం చెప్పాలంలే ఇదే అసలైన పెద్ద బరువు. అనగా అహంకారం, ఏదో దుఃఖం కలిగినపుడు ఇది పోతే బాగుండునని అనుకుంటాం.

కాని అహంకారం బరువుగా కనబడకుండా ఎక్కువ బరువుతో ఉంటుంది. అసలు అది బరువని తెలియదు. ఇంకా తగ్గించకుండా దీనినింకా పొడిగించి మిక్కిలి బరువగునట్లు చేస్తున్నాం. మనం చెప్పుకోవలసింది ఏమీ లేకపోయినా ఏదో చేసినట్లు భావించి నానా అల్లరి చేస్తాం. ఎవడైనా సరిగా చేయకపోతే నేనైతేనా ఇట్లా చేసి యుండేవాణ్ణని బీరాలు పల్కుతాం, మనం అధమంగా చేసినా సరే! ఈ విధంగా చాలా బరువును మనమే మోస్తున్నాం. ఇట్టి కర్తృత్వ భావన నుండి దూరంగా ఉండడమే చేయవలసింది.


దేవతల ఆటంకాలను పోగొట్టానని వినాయకుడు గర్విస్తాడా? అతడెట్టా ఉంటాడు? తండ్రి నెత్తిమీదున్న చంద్రకళను లాగుతూ ఉంటాడు. తల్లి దండ్రులను కలిపినా నా అంత మొనగాడెవ్వడూ లేడని అంటున్నాడా? అతడేనుగు ఆకారం ధరించినా అతని మనస్సు తామర తూడులోని దారం మాదిరిగా తేలికగా ఉంటుంది.


ఆ రెండు శ్లోకాలూ వ్రాసి మనకెంత ఆనందాన్ని కల్గించారో! అట్టి వినాయకుడు మన కోరికలను నెరవేర్చు గాక. మన మనస్సులు తామర తూడులో దారాలలా తేలికగా ఉండుగాక.

Thursday, 17 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (116)



బరువును దించుగాక, ఆశీర్వదించుగాక


మనకున్న పెద్ద ఆటంకం మన మనస్సే. కొందరేదో కోరుతారు, కొందరు బాధపడతారు. ఇది ఇట్లా చేయాలి, అది అట్లా జరగాలి అనుకున్నది జరుగుతుందో జరగదో అని ప్రతిక్షణమూ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మనకు మనమే ఆటంకాలని సృష్టించుకుంటూ ఉంటాం. కాని నిరంతరమూ వినాయకుణ్ణి భజించేవారికే పిల్లల అమాయక ప్రవృత్తి అలవడుతుంది. అమలిన మనస్సు లభిస్తుంది


అట్టి శుద్ధ మనస్సుంటే ఏ బాధలూ, విచారమూ ఉండదు. అప్పుడు మనకేదైనా సంతోషించే సంఘటన ఎదురైతే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం విషాదం కలిగినపుడు ఒక్క ఏడుపు ఏడ్చి ఉత్తర క్షణంలో మర్చిపోతాం. అసలు పిల్లవాడు ఏడ్చే సమయం కంటే నవ్వే సమయమే ఎక్కువుంటుంది. అట్టి పిల్లవానిగా మనం మారిపోతే మనకంటే అదృష్టవంతులెవ్వరుంటారు ఇక సంతోషంతో అణుమాత్రమూ బాధ లేదు కదా! అందుకే స్వామి ఎంతో బరువున్నా మానసికంగా తేలికగా ఉంటాడు.


Wednesday, 16 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (115)

మొదటి శ్లోకం ఏమని చెప్పింది? మనమే దేవతను భజించాలన్నా, ఆ దేవత ముందుగా వినాయకుణ్ణి భజించాలని, అందువల్ల వినాయకుడే భజిస్తే సరిపోతుంది కదాయని చెప్పింది.


ఇక రెండవ శ్లోకం అట్లా చెప్పలేదు. శంకరుడు, పార్వతి కాళ్ళపై బడినా పార్వతి కోపాన్ని అభినయిస్తూనే ఉంది. లోపల కలవాలని ఆమెకూ ఉన్నా చివరకు వినాయకుని లీలావినోదం వల్ల హాయిగా వారు నవ్వుకొని హృదయ పూర్వకంగా కలిసారని ఉంది. అంటే ఇందు శంకరుడు ముందుగా వినాయకుణ్ణి అర్చించలేదు. పార్వతిని అర్చించినట్లైంది. కనుక అతని ప్రార్థన నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరింది? వినాయకుడు వినోదాన్ని కల్గించినపుడే. అంటే వినాయకుడు ఫలాన్ని అందించాడు. అట్లాగే శంకరుని కలవాలని పార్వతి భావించినా ఆమె కోపం అడ్డు తగిలంది. వినాయకుని వల్లే ఆమె కోపం చల్లారింది. కనుక ఇద్దరి ప్రార్ధనలూ ఇతనివల్ల నెరవేరాయి. ఇందువల్ల, ఇతడేదైనా ఎవరికైనా ఈయగలడని తేలలేదా? ఇతడు ఒక్కణ్ణి అర్చించినా చాలని తేలడం లేదా?


ఇలా వీరిద్దర్నీ కలపాలని అనుకొన్నట్లుగా ముందితనిలో లేదు. వారిద్దరు కలుసుకునేటట్లు ఒక ఆట ఆడాడు. రెండు శ్లోకాలలోనూ ఇతడు స్వార్థ ఫల ప్రదాతయే.

Tuesday, 15 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (114)

మనమందరమూ వారి సంతానమైనా గణపతివారికి మొదటి సంతానం, గణపతి వారిలో వారికి రాజీ కుదర్చగలడు. అందువల్ల ప్రపంచానికి క్షోభ ఉండదు. ఇట్లా తండ్రి శిరస్సు పైనున్న చంద్రలేఖను ఊడబెరికి వారినిద్దరినీ కలిపాడు.

పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకునేటపుడు వారు ప్రత్యక్షంగా పరస్పరం తాకినట్లు కవి చెప్పలేదు. హృదయపూర్వకంగా నవ్వుకున్నారని అన్నాడు. కృత్రిమంగా కోపాన్ని అభినయించినవారు పరస్పరం కలుసుకున్నారని అన్నాడు.

అట్టి వినాయకుడు మన పురుషార్థాలను నెరవేర్చుగాక. నః చింతితార్థం కలయతు.

ఇందలి శ్లోకం, న్యాయేందుశేఖరంలోని శ్లోకానికి ప్రమాణంగా ఉంది.

పార్వతి, తనతో కూడాలని పరమేశ్వరుడు భావించాడు. కాళ్ళ మీద పడ్డాడు. కాని వినాయకుడే అతని కోర్కెను తీర్చాడు. పై తర్క గ్రంథంలో ఈ సంపాదంలోనూ ఇందు శేఖర పదం ఉంది. చూసారా ఈ తర్కశాస్త్ర శ్లోకానికి ప్రామాణ్యాన్ని? ఇట్లా ప్రాచీన వాఙ్మయాన్ని పరిశీలిస్తే అది ఒక బంగారు గనిగా కన్పిస్తుంది.

Monday, 14 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (113)



ఇట్లా లీలావినోదం కలిగించే పిల్లవానిని చూసి వారిద్దరి కోపం పోయి హాయిగా నవ్వు కొన్నారట. శ్లోకంలో 'హృద్య స్మితాభ్యాం' అని ఉంది. అంటే కేవలం నోటితో నవ్వడం కాదు. అతడామె సేవకుడని నటించడం కాదు వారి హృదయలూ విచ్చుకొన్నాయి. విచ్చుకొని నోటితో నవ్వారన్నమాట. హృద్యా ఇద్దరు పిల్లవాణ్ణి ఒక్కమాటే ముద్దాడదామని అనుకున్నారు. హృద్యా స్మితాఖ్యాం అహమహమికయా ఆలింగ్యమానః శివాభ్యాం. హాయిగా నవ్వుతూ నేనంటే నేనని ముద్దాడాలని ముందుకు వచ్చారు.


ఒక్కమారే ముద్దు పెట్టుకున్నారు. పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకోవడంలో తల్లిదండ్రులు పొందే ఆలింగన భాగ్యాన్ని తిరుక్కురల్ కూడా ప్రశంసించిది. శకుంతలను విడిచి పెట్టిన దుష్యంతుడు, కణ్వాశ్రమంలోని తన కొడుకైన భరతుణ్ణి చూసీ చూడడంతోనే కౌగలించుకొనాలని బుద్ధి పుట్టిందని, తొడపై కూర్చుండబెట్టుకొన్నపుడు అతనికి కలిగిన ఆనందాన్ని వర్ణించాడు కాళిదాసు. అట్లాగే లవకుశులను రాముడు కౌగలించుకున్నట్లు భవభూతి ఉత్తర రామచరితంలో వర్ణించాడు.


పార్వతీ పరమేశ్వరులు గణపతిని నిజంగా కౌగలించుకున్నారా? నిజంగా వీరిద్దరే కౌగలించుకున్నారు. కౌగలించుకొనేటపుడు చేతులు చాస్తారు కదా!


వారు అభినయించే కోపం కలకాలం ఉంటుందా? వారు జగత్తునకు తల్లిదండ్రులు కదా!


Sunday, 13 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (112)



భజనలో 'లీలాలోల' అనే మాటను వినే యుంటారు. రాసలీలాలోల అనే మాట వినబడుతుంది. ఒకదానిని కోరి నృత్యం చేయడం లోలం.


లీలాలోలం అనే మాట వినాయకుని పూర్తి రూపాన్ని గురించి చెప్పదు. ప్రేమతో ఆడే తుండం యొక్క చివరి రూపాన్ని వర్ణిస్తుంది. శ్లోకం తరువాతి భాగంలో లీలాభిరామంగా వర్ణింపబడ్డాడు. ఏనుగు యొక్క ఒక అవయవమైన తుండం ఆటలాడాలని ఉవ్విక్ళూరుతోందట. కరాగ్రం లీలాలోలం అని ఉంది. తుండంతో ఏనుగు దేనినైనా పీల్చగలదు, నొక్కగలదు, బ్రద్దలు కొట్టగలదు ఇట్లా చెబుతూ ఉంటే తుండం తనంతట తనకే ప్రాణం ఉన్నట్లు అది ఆడాలని కోరికతో ఉన్నట్లు పైకి కన్పిస్తుంది.


తామర తూడులోని దారాల మాదిరిగా చంద్రుడుంటాడు. రెండూ చల్లగానే ఉంటాయి. దాని దారాల మాదిరిగా చంద్రకిరణాలూ ఉంటాయి.


పరాశక్తి, మనలోని కుండలినిగా తామర తూడులోని దారంగా ఉంటుంది. 'బిసతంతు తనీయసీ' అని లలితా సహస్ర నామాలలో ఒక నామం అమ్మవారికుంది.


తామర తూడులోని పీచు మాదిరిగా ఉండే చంద్రకళను వినాయకుడు పెకలిద్దామనుకున్నాడు. తుండాన్ని చాచాడు. చంద్రకళ శివుని తలనుండి పార్వతి పాదాలను తాకుతోంది.


తన తలపై ఉన్న చంద్ర కళను పీకాలని ప్రయత్నించే తనయుని చేష్టను చూసి సంతోషిస్తాడు శివుడు. అట్టి దృశ్యాన్ని చూస్తే మనమూ సంతోషిస్తాం. శివుడే లీలా వినోదుడు కదా! ఇక వినోదాన్ని కలిగించే పిల్లవానిని చూసి సంతోషించడా? అతడు చంద్రకళా విభూషితుడైనా తన పిల్లవాడు లాగుతూ ఉంటే సంతోషించడా?


ఇక తల్లి ఎట్లా సంతోషిస్తుంది? తండ్రి కంటె తానే ఎక్కువగా సంతోషిస్తుంది. బాగా జరిగింది, బాగా జరగవలసిందే, తన భర్త నెత్తి పైనున్న చంద్రకళ ఊడవలసిందే అనుకోదా?


Saturday, 12 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (111)



అసలర్థమేమిటి? జీవాత్యయే ఇక్కడి నాయిక. పరమాత్మయే నాయకుడు. పరమాత్మ నుండి బైటకు జీవుడు పోవాలనుకున్నా, పరమాత్మ తనలో కలుపు కొనేటట్లు చేస్తాడు. కనుక జీవాత్మను వేడుకొంటాడని అతని కాళ్ళపై పడతాడు. వీరిద్దరి మధ్య సఖి యుంటుంది. వీరిద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తుంది. ఇద్దర్ని కలుపువాడే ఆచార్యుడు లేదా గురువు. ఆ గురువే సఖి. పైపైన ఇది ప్రేమగా కనబడినా లోతుగా ఆలోచిస్తే జీవాత్మ పరమాత్మల కలయికయే పార్వతీ పరమేశ్వరుల బిడ్డయైన వినాయకుడు చేసాడు.


పార్వతి ఏదో ముభావంగా కూర్చొని యుంటుంది. పరమేశ్వరుడు కాళ్ళపై బడ్దాడు. ప్రణతశివ యనగా శివుడు నమస్కరిస్తున్నట్లుగా పడ్డాడని. జటతో కూడిన శిరస్సుతో పార్వతి పాదాలపై శివుడు పడగా ముందుగా చంద్రకళ యొక్క ప్రకాశం బాగానే పడింది.


పిల్ల యేనుగు సరస్సులో ప్రవేశించినపుడు తామరతూండ్లను పెకలించి అందలి నారను ఇష్టంతో తింటుంది. తామర తూడుతో బైటకు వస్తుంది. ఆ చంద్రలేఖ తామర తూడునుండి వచ్చే తెల్లని పీచులా కనబడింది గణపతికి. వెంటనే దాని నూడ బెరికి తిందామనుకున్నాడు.


అతనికి నిజంగా సందేహం కలుగుతుందంటారా? తల్లిదండ్రులను కలవడం కోసం నాటకం ఆడుతున్నాడా? శ్లోకాన్ని 'బాల లీలాభిరామతో ముగించాడు. లీలాలోలం' అనే మాట శ్లోకంలో వ్రాసాడు.


Friday, 11 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (110)



చంద్రకళతో స్వామి ఆడుకున్న రోజు


మైసూర్ రాష్ట్రంలో, చామరాజనగర్ లో రామశాస్త్రి అనే కవి యుండేవాడు. రావణ సీతా సంభాషణాన్ని సీతారావణ సంవాదంగా వ్రాసేడు. ఆమె తక్కువగానే మాట్లాడుతుంది. ఇందు రావణ సుదీర్ఘ సంభాషణయే యుంటుంది. ఆవిడ విని చాలా తక్కువగా మాట్లాడి తిరస్కరిస్తుంది. ప్రతి శ్లోకంలోనూ మూడు పంక్తుల సంభాషణ, రావణునిది. మిగిలిన పాదం, సంభాషణ సీతది. దీనిని సీతారావణ సంవాద ఝరి అని కూడా అంటారు. ఒక శ్లోకం వెంబడి మరొక శ్లోకం ఉండడం వల్ల దీనిని ఝరియని అన్నారు. ఇందు ముందుగా గణేశస్తుతి యుంది. ఈ శ్లోకంలో చంద్రమౌళియైన గణేశుని లీల ఉంది. కోపాన్ని నటించే పార్వతీ పరమేశ్వరులు ఈ లీలవల్ల ఒకటౌతారు. ఇది మంగల శ్లోకం:


క్రీడారుష్టాద్రి జాంఘ్రి ప్రణత శివశిరశృచంద్రఖండే కరాగ్రం 

లీలాలోలం ప్రసార్య స్ఫురతరామలబినసంఖ్యాక్రఘ్టకామః 

విద్యాత్ హృద్యస్మితాఖ్యాం అహమహమిక యాభిగమ్యమానః శివాఖ్యాం 

కశ్చిత్ సః చింతితార్థం కలయతు కలభోబాల లీలాభిరామః


తా: గణపతి అనే పిల్ల ఏనుగు క్రీడిస్తోంది. కలభో బాలలీలాభిరామ; అట్టి పిల్లవాడు మనం కోరేది ఇచ్చుగాక నః చింతిత అర్ధం కలయతు అనేది చివరిపాదం, ముందున్న మూడు పాదాలు గణపతి యొక్క క్రీడను వర్ధిస్తాయి. అది అమాయకమైన క్రీడయని గాని; తుంటరిపని యనిగాని అనలేం. ఏదైనా వినడానికి బాగుంటుంది. ప్రణయ కలహం ఇందలి తత్త్వం.


కవి, పార్వతిని అద్రిజయని చెప్పి ఆమె భర్తపై లేనిపోని కోపాన్ని ప్రదర్శిస్తోంది అని చెప్పడానికి క్రీడారుష్టా అన్నాడు. అంటే సరదాగా కోపమని. అట్టి సందర్భాలలో నాయకుడు, నాయిక యొక్క కాళ్ళపైబడి వేడుకుంటాడు. గీత గోవిందంలో రాధ పాదాలపై కృష్ణుడు పడినట్లుంది. తమిళంలోని తిరుప్పగళ్ లో సుబ్రహ్మణ్యస్వామి, ఆటవిక కన్యయైన వల్లి పాదాలపై పడినట్లుంది. 


Thursday, 10 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (109)



విఘ్నేశ్వరుడు రక్షించుగాక


ఇట్లా 'సర్వార్త ప్రతిపాదనైక చతురో...' తో న్యాయేందు శేఖర గ్రంథంలోని శ్లోకం పూర్తి అవుతుంది. తతః హేతున్యాయం ఉగ్గడింపబడింది కదా.


ఒకడు నవాబు గారిని యాచించడానికి అతడున్న భవనానికి వెళ్ళాడట, కాసేపు ఆగు; నవాబుగారు నమాజ్ కి వెళ్ళారని జవాబు వచ్చింది. నాకు కావలసింది అడగడానికి నవాబు దగ్గరకు వచ్చాను. అతనికేదో కావాలని అల్లాను ప్రార్థిస్తున్నాడు. అటువంటప్పుడు ఒక యాచకుడు, మరొక యాచకుణ్ణి అడగడానికి బదులు తిన్నగా అల్లానే అడుగవచ్చు కదా అని తిరిగి వెళ్ళిపోయాడట.


అట్లా అందరు దేవతలూ వినాయకుణ్ణి విఘ్నాలు లేకుండా ఉండాలని వేడుకొంటున్నారు కదా. ఏవో చిన్న కోరికలను వేడుకోవడానికి బదులు తిన్నగా విఘ్నేశ్వరుణ్ణి వేడుకోవచ్చు కదా అని పై శ్లోకం వల్ల తెలియవస్తోంది.


Wednesday, 9 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (108)


కథంను' లో 'ను' సందేహాన్ని తెలివిడి చేస్తోంది. 'ఇతి చిం' తయంతం శాస్తారం = ఇట్లా అయ్యప్ప బాధపడుతున్నాడు. ఈడే = స్తుతిస్తున్నాను. 


సకలార్థ సిద్ధైయ శాస్తారామీడే = సకల పురుషార్థాలను ప్రసాదించే శాస్త్రను నుతిస్తున్నానని దీక్షితులు శ్లోకాన్ని ముగించారు.


లోగడ విఘ్నేశ్వర స్తుతిలో 'సర్వార్ధ ప్రతి పాదన చతుర' అని విన్నాం . శాస్తకు సంబంధించిన శ్లోకంలో సకలార్థ సిద్ధియని అంటున్నాం. ఇట్లా ఇద్దరికీ సంబంధం ఉంది. వినాయకుని స్తోత్రం వ్రాసినవాడు దీక్షితుల వంశంలో జన్మించిన మన్నారు గుడి శాస్త్రిగారే. శాస్త శ్లోకాన్ని దీక్షితులు వ్రాసేరు.


దీక్షితుల శ్లోకంలో ఒక దేవత పెద్దయని, ఒకడు తక్కువ వాడని లేదు. అమ్మవారిని, లక్ష్మిని కలిపి వాడాడు. తన బుద్ధివైభవాన్ని చూపించడమే కాకుండా అన్ని పురుషార్ధాలు పొందాలంటే శాస్తను భజించాలని భక్తితో అన్నాడు.


మరో మాట ఏమిటంటే ఇది తెలియని ప్రశ్నల ద్వారా ఆడే ఆటలా ఉంది. ఈ చిక్కు సమస్యను ఎవరూ విప్పలేరు కూడా.


ఇక ఆ వ్రేలు క్రిందకు వచ్చింది. ఇట్లా విగ్రహం, మామూలుగా మారడాన్ని చూసినవారూ ముక్కుమీద వ్రేలు వేసుకొని ఆశ్చర్యపోతారు కదా! 


పరమేశ్వరుని పెద్ద కొడుకును చెప్పబోయి మిగిలిన పిల్లలను తడిమాం. ఇది బాగుంది.

Tuesday, 8 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (107)



ఇక దీక్షితులవైపు చూసాడు రాజు. ఈయనా శ్లోక రూపంలో సమాధానమిచ్చాడు.


అంబేతి గౌరీం అహమాహ్వయామి పత్న్యః పితుః మాతర ఏవ సర్వాః 

కథంను లక్ష్మీం ఇతి చింతయంతం శాస్త్రారమీడే సకలార్థ సిద్యై 


తా: శివుని భార్యయైన గౌరిని తల్లియని పిలుస్తున్నాను. "అంబ ఇతి ఆహ్వాయామి" కాని మోహిని రూపంలో విష్ణువుండడం వల్ల మోహినియే నా తల్లి. తండ్రి యొక్క భార్యలందరూ నాకు తల్లులే కదా! గణపతి, గంగను తల్లియని అనలేదా?


పరాశక్తితో నాకున్న సంబంధాన్ని నేను సందేహించడం లేదు. కారణమేమంటే ఈశ్వరుడు నా తండ్రి, విష్ణువు నా తల్లి. పత్య్నః పితుః మాతర ఏవ సర్వాః = తండ్రి భార్యలందరూ నా తల్లులే.


కాని ఒక విషయంలో సందేహం ఉండిపోయింది. ఈ బాంధవ్య విషయంలోనే. ఏమది? ఎవరితో నా బాంధవ్యాన్ని బాహాటంగా చెప్పలేకపోతున్నాను? లక్ష్మితోనున్న సంబంధాన్ని, లక్ష్మిని ఎట్లా సంబోధించను? = కథంను లక్ష్మీం? ఇది శాస్త యొక్క సందేహం. అందువల్ల ముక్కుపై వ్రేలు వేసుకున్నాడు. దీనికి సమాధానం మనకు తెలియదు ఎట్లా?


ఎవరు లక్ష్మి? విష్ణుని భార్య. విష్ణువెవరు? శాస్తతో అతనికున్న సంబంధమేమిటి? మహావిష్ణువు మోహినీ అవతార మెత్తాడు. పరమేశ్వరునితో కూడడం వల్ల శాస్త్ర పుట్టాడు. అందువల్ల శాస్త్ర, హరిహరపుత్రుడయ్యాడు. అయితే ఈ శాస్తకు లక్ష్మికి ఉన్న సంబంధమేమిటి? అంటే తల్లి యొక్క భార్యయని అనాలి కదా?


తండ్రి యొక్క భార్యయని, మేనమామ యొక్క భార్యయని విన్నాం. తల్లి యొక్క భార్యయనే మాటను విన్నామా? ఇప్పుడు శాస్త లక్ష్మిని ఎట్లా సంబోధించాలి?

Monday, 7 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (106)

 


అతడు భూతేశుడే కాదు, మహదేవుడు కూడా దేవతలలో గొప్పవాడు. దేవతల పై ఆధిపత్యాన్ని తన కొడుకైన సుబ్రహ్మణ్యునకు అర్పించాడు. అంటే సేనాధిపత్యం. భూతాలను రెండుగా చేసి అందొక దానికి గణపతిని నియమించాడు. గణపతి స్తోత్రంలో భూత గణాధి సేవితం అని అంటాం. మరొక విభాగానికి అయ్యప్పను నియమించాడు. కేరళలో అయ్యప్పను భూతేశుడని అంటారు.

భూతాలను అదుపులో పెట్టడం శాస్తకు గర్వకారణమైన బిరుదు. క్షుద్ర శక్తులను గ్రామాలలో చొరబడకుండా చేస్తాడు. ప్రజల బాధలనుండి విముక్తులను చేస్తాడు. శివ సంబంధమైన వాటిని చెప్పడానికి తాతాచార్యుల వారికిష్టముండదు కనుక ఇట్టి భూతాలకు ఆదినాథుడైన ఈశ్వరునకు కొడుకునయ్యానని బాధపడుతున్నట్లు వ్రాసాడు. ఏతైః భూతైర్వతః = భూతాలచే చుట్టుబడినవాడు అని. చింతయతీహశాస్తా అని శ్లోకాన్ని ముగించాడు. ఇట్టి కర్మం దాపురించిందని బాధపడుతున్నట్లు ముగించాడు అందువల్ల ముక్కుపై వ్రేలు వేసుకున్నాడు.

శ్లోకం చెప్పినా ముక్కుమీద వ్రేలును శాస్త తొలగించలేదు. భూతాలనుండి గ్రామాన్ని రక్షించడం బాధపడవలసింది కాదు. గర్వకారణం.

Sunday, 6 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (105)



చిత్రంగా ఉన్నాడేమిటని రాజు ప్రశ్నించాడు. అక్కడున్న భక్తులు, ఇది పురాతన విగ్రహమని; శిల్పికి ఇట్లా మూర్తి సాక్షాత్కరించడం వల్ల మలిచాడని అన్నారు. రాబోయే కాలంలో అన్నీ తెలిసిన విద్వాంసుడు వచ్చి శాస్త యొక్క బాధను వెల్లడి చేస్తాడని అప్పుడు మిగతా విగ్రహాల మాదిరిగా ముక్కు మీద వేలు ఉండకుండా ఉంటుందని అన్నాడట. అప్పటికే ఎందరో విద్వాంసులు వచ్చారు. రకరకాల కారణాలను చెప్పినా మునుపటి మాదిరిగానే విగ్రహం ఉందన్నారు. ఎవ్వరూ ఇంతవరకూ ఆ వ్రేలును క్రిందకు దింపలేక పోయారని అన్నారు. రాజు తాతాచారి పంక చూసాడు. దానికి కారణాన్ని ఇట్లా శ్లోకరూపంలో ఆయన అందించాడు:


విష్ణో: సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సుర సేవితోహం 

తథాపి భూతేశ సుతోహమేతై: భూతైః వృతైః చింతయతీహ శాస్తా 


శ్లోకంలో శాస్త ఇట్లా అన్నాడని ఉంది: "నేను విష్ణువు యొక్క తనయుణ్ణి. కనుక బ్రహ్మతో సమానం. అందువల్ల దేవతలచే పూజలందుకొంటున్నాను” కాని...?


శ్లోకంలో తథాపి, అనగా అయినా అని అర్థం. ఇందువల్ల శివునకు సంబంధించిన విషయాలలో తల దూర్చనని తాతాచార్యులగారి అభిప్రాయం.


శాస్త ఏమి చెప్పి యుంటాడు? నేను శివుని కుమారుణ్ణి కూడా అనాలి కదా. తథాపి భూతేశ సుతోహం అని అనాలి. శివునకు చాలా పేర్లున్నాయి. శివ, ఈశ్వర, శంభు, పశుపతి మొదలైనవి. ఇన్ని పేర్లున్నా భూతేశ పదం వాడబడింది. అనగా భూతాలకు నాయకుడని; అట్టి వాని కొడుకునయ్యానని బాధపడినట్లు తాతాచార్యులూహించారు.


భూతాల ఆధిపత్యం అంటే అది అతని శక్తిని, అధికారాన్ని సూచించడం లేదా? పరమేశ్వరుడు భూతాలను నియమిస్తాడు, మంచివారిని బాధించకుండా చేస్తాడు. అట్లా వారిని రక్షిస్తున్నాడు కదా! భూతాలను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చేస్తున్నాడు కదా.

Saturday, 5 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (104)



అయ్యప్ప విషయంలో వివాదం


ఇక పరమేశ్వరుని మూడవ సంతానమైన అయ్యప్పకు తల్లి ఎవరు? ఇతనికి రాను రాను భక్తులధికమౌతున్నారు. ఇతడీశ్వరునకు, మోహిని అవతారమెత్తిన విష్ణువునకు కలిగిన బిడ్డ.


16 వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులనే మహానుభావులుండేవారు. ఆయన వంశంలో మున్నారు గుడి శాస్త్రిగారు పుట్టారు. దీక్షితుల వారద్వైతియైనా శివభక్తిని ప్రచారం చేసారు. వారి కాలంలో శివ ద్వేషం బాగా ఉండేది. అందువల్ల అట్టి వారిని ఎదుర్కొనడం వీరి లక్ష్యమైంది. తాతాచార్యులనే వైష్ణవుడు ఆకాలంలో వుండేవాడు. విజయనగర రాజులతనిని పోషిస్తూ ఉండేవారు. అతడు వైష్ణవ మతవ్యాప్తిని తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే దాని నెదుర్కొనడం కోసం దీక్షితులు తీవ్ర ప్రయత్నం చేసారు. కాని వీరికి విష్ణు ద్వేషం లేదు. విష్ణువును పరమాత్మ స్వరూపంగానే భావించేవారు. యుక్తులతో, శాస్త్రాధారంతో విష్ణువు, రత్నత్రయంలో ఒకడని నిర్ధారించారు కూడా.


ఒకనాడు రాజు, తాతాచార్యులు, దీక్షితులు ఆలయానికి వెళ్ళారు. ఆ రాజు రామరాయలుగాని, లేక వెల్లోర్ కి చెందిన చిన్న బొమ్మ నాయకుడు గాని కావాలి. లేదా తంజావూరునకు చెందిన వీర నరసింహ భూపాలుడైనా కావాలి. ఆలయంలో అయ్యప్ప విగ్రహముంది. అతణ్ణి శాస్త అని కూడా అంటారు. అది చిత్రమైన విగ్రహం. ముక్కుమీద వేలు వేసుకొన్నట్లుగా ఆ విగ్రహముంటుంది, ఏదో ఆలోచిస్తున్నట్లుగానూ ఉంటుంది.


Friday, 4 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (103)



ఇట్లా గంగతో వినాయకునకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆమెను తల్లిగా భావించాడు. ఇది అతని ప్రేమతత్త్వాన్ని, స్నేహ తత్త్వాన్ని ప్రకటిస్తోంది. స్త్రీలనందరినీ తల్లులుగా భావించిన స్వచ్ఛమైన బ్రహ్మచారి.


ఏనుగుకి నీళ్ళంటే చాలా ఇష్టం. ఇట్లా గుఱ్ఱం, పెద్ద పులి, సింహం ఉండవు. బురదలో పొర్లాడడానికి ఇష్టపడతాయి గేదెలు. పెద్ద శరీరంతో నీళ్ళలో ఈత కొట్టడానికి ఇష్టపడుతుంది ఏనుగు. అవి గుంపులుగా నదులు వద్దకు వెళ్ళడం, అందులో జలకాలాడటం మనకు తెలిసిందే. అట్టి దృశ్యాన్ని మనం గజేంద్ర మోక్ష ఘట్టంలో చూడవచ్చు.


ఒకనికి ఆర్గురు తల్లులు


వినాయకునకు ఇద్దరు తల్లులైతే అతని తమ్ముడైన సుబ్రహ్మణ్యునకు ఆర్గురు తల్లులు. అతడు షాణ్మాతురుడు. అందు అమ్మవారు, గంగ లేరు. వీరు కృత్తికానక్షత్రానికి అధి దేవతలైన ఆర్గురు తల్లులు. వీరే ఇతనికి పాలనిచ్చారు. వీరిని తల్లిగా భావించాడు కనుక అతడు కార్తికేయుడయ్యాడు. 


Thursday, 3 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (102)



ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు (ద్వైమాతురుడు)


పై శ్లోకంలో మన స్వామి, ద్వైమాతురుడని పేర్కొనబడ్డాడు. అనగా ఇద్దరు తల్లులు కలవాడు. ఎప్పుడైనా ఒకనికి ఇద్దరి భార్యలున్నట్లు వింటాం. కాని ఒకనికి ఇద్దరు తల్లులుండడమేమిటి? అమ్మవారు తల్లియని తెలుసు.


ఈశ్వరుని నెత్తి పైనున్న గంగను అతనికి రెండవ భార్యగా తలుస్తాం. సౌందర్య లహరిలో శంకరులు, అమ్మవారి నేత్రాలు క్రోధాన్ని, ఆశ్చర్యాన్ని భయాన్ని, అసూయను ప్రదర్శిస్తున్నాయని, ఈశ్వరుని నెత్తిపై నున్న గంగను చూచినప్పుడు కోపమని సరోషా గంగాయం అని చెప్పారు (51 శ్లో). ఎవరీ గంగ? ఆమె నా తండ్రి భార్య, కాబట్టి ఆమెను కూడా తల్లిగా భావిస్తానని ప్రేమతో అంటాడట వినాయకుడు. అందువల్ల ద్వైమాతురుడు.


అంతకంటే సుబ్రహ్మణ్యుని గంగాతనయుడని అనడం మేలు, గంగనుండి పుట్టాడు కనుక. శివుని నేత్రం నుండి నిప్పురవ్వలు వచ్చాయని వాటిని గంగ భరించిందని, అపుడు సుబ్రహ్మణ్యుడవతరించాడని అందరికీ తెలుసు. కనుక అతడు గాంగేయుడు.

Wednesday, 2 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (101)



నేనిట్లా చెప్పానంటే శాస్త్రిగారి అభిప్రాయాన్ని అందించాను. అంటే ఒక్క వినాయకుణ్ణే పూజించి మిగతా దేవతలను పూజించవద్దని కాదు. రకరకాల అభిరుచులు, మనః ప్రవృత్తులుంటాయి కదా. ఆపైన ఒక్కొక్క దేవతనే పూజించడం వల్ల వారి విశ్వాసమూ గట్టిపడుతుంది. అందుకే తిరునల్లార్ లోని శనిని పూజించడం, మకర సంక్రమణకాలంలో అయ్యప్పను ఆరాధించడం విశేషంగా కన్పిస్తుంది. ఎవరికో గాని అద్వైత జ్ఞానం పట్టుబడదు. ఒక్కొక్క దేవతనే ఇష్టదైవంగా భావించేవారున్నా పెక్కుమందిని పూజించాలనే సాధారణంగా ఉంటుంది. అంతేకాదు, తమ ఇష్టదేవతనే రకరకాలుగా అలంకరిస్తారు.


రకరకాల రుచులను మనస్సు కోరుతుంది. కోరనీయండి. దానిని సహజ మార్గంలో పోనీయండి. అది ఒక్కదాని పై లగ్నమగునట్లు నెమ్మది నెమ్మదిగా దీనిని నియమించండి. అనగా ఒక్కదానినే పట్టుకోవాలని నిర్భంధంగా మనస్సును బిగించకూడదు. మనస్సునకు ఒత్తిడి చేస్తే అది మన అదుపులో అస్సలుండదు. ఇట్లా పెక్కుమంది దేవతలను ఆరాధించి మనస్సులోని మాలిన్యాన్ని క్రమక్రమంగా పొగొట్టుకొనేటట్లు చేయడమే మన లక్ష్యం. డ్వైతభావన నుండి అద్వైతానికి పయనించునట్లుగా చేయడమే లక్ష్యం. ఇదంతా విఘ్నేశ్వరుదొక్కడే చాలనే తతః హేతున్యాయాన్ని వివరించడం వల్ల ఇంతగా చెప్పవలసి వచ్చింది. అంత మాత్రంచే ఇతర దేవతలను భజించకూడదని కాదు. ఈ శ్లోక రచయిత కూడా పెక్కు దేవతలను భజించినవాడే. ఇట్లా చెప్పినవాడు శివుణ్ణి అర్చించాడు కదా!


ఏదో బౌద్ధిక స్థాయిలో (Intellectual Plane) చెప్పితే సరిపోదు. మనకు మనస్సుంది కదా. భక్తి విషయం వచ్చేప్పటికి బుద్దికి అవకాశం ఉండదు. అందువల్ల మనం ప్రాథమిక దశలో ఉన్నాం కనుక ముందుగా అందర్నీ కొలుద్దాం. ఇష్ట దైవాన్ని భజిద్దాం. ఏది మనకు తృప్తి నిస్తే అట్లా కొలుద్దాం. 


శ్లోకం చివరలో అనేక దేవతలను భజించవడం వల్ల వచ్చే అన్ని ఫలాలను వినాయకుడిస్తాడని ఉంది. సర్వార్థ ప్రతిపాదనైక చతురో ద్వైమాతురో, అనగా నాల్గు పురుషార్ధాలను ఇస్తాడని ఉంది.

3 డిసెంబరు 2020, గురువారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.



ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి గురువారం వచ్చింది.)


3 డిసెంబరు 2020, గురువారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.12 నిమి||


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


కార్తీక మాసంలో వచ్చిన దీనికి గణాధిప సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణాధిపాయ నమః

ఓం గం గణపతయే నమః

Tuesday, 1 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (100)

ఒక్క దేవతను పూజించే వారు అరుదు అని చెప్పాను కదా! ఆలయాలకు వెడితే అనేక దేవతల సన్నిధాలు కన్పిస్తారు. ప్రతి సన్నిధికి వెళ్ళి అందర్నీ పూజిస్తాం. శివాలయంలో విష్ణు విగ్రహం లేకపోయినా, విష్ణ్వాలయాలలో శివమూర్తి లేకపోయినా, శివాలయానికీ, విష్ణ్వాలయానికీ వెడతాం. కాంచీపురంలో భిన్న భిన్న మూర్తులకు భిన్న భిన్న దేవాలయాలు విడిగా ఉన్నాయి. కామాక్షి, ఏకామ్రేశ్వరుడు, వరదరాజు మొదలైనవి అనేకం ఉన్నాయి అన్నిటికీ వెడతాం. విష్ణ్వాలయంలో విఘ్నేశ్వరుడు, విష్వక్సేన నామంతో పిలువబడతాడు. అతనికి నామం ఉంటుంది నుదుటిపై.


ఇక ప్రతి దేవత వినాయకుణ్ణి పూజించాడని లోగడ చెప్పాను కదా. 


కనుక ఆటంకాలను తొలగించే బాధ్యత అతనికి అప్పజెప్పారు కనుక దానిని సమస్త దేవతలూ పాటించారు, పూజించారు. అందువల్ల అన్ని కోరికలను తీర్చే దేవతయని భావించక ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క దేవతను కొలుస్తున్నాం. ఇట్టి సందర్భంలో తతః హేతున్యాయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి.


సారాంశమేమనగా ఏ దేవతను పూజించినా ముందితణ్ణి పూజించాలని అందరి దేవతలపై ఆధిపత్యం కలవాడని, ఇతర దేవతలను ఫలాలనీయ వలసిందిగా ఆజ్ఞాపించగలడని, అతని ఆజ్ఞను మిగతా దేవతలు శిరసా వహిస్తారని, అట్టి ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆటంకాలెదురౌతాయని తేలింది.

Monday, 30 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (99)

 

అనేక దేవతల అవసరం


అనేక రుచులను ఇష్టపడతాం. నాటకంలో భిన్న రసాలుంటాయి. అది సంగీతమైతే భిన్నరాగాలుండాలి. కొందరు మండ్రస్థాయిని, కొందరు ద్రుత పద్ధతిని కోరుతారు. అట్లాగే ఉపాసనలో కూడా. సమాధి స్థితి చిట్టచివర దశలోనే. అందరూ ప్రాథమిక దశలో నున్నవారే. అట్టి మహోన్నత సమాధి స్థితి రావాలంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్పనిసరి. అతడు నానా రూపాలను ధరిస్తాడు. రకరకాల కోరికలను తీరుస్తాడు. పూజలో కూడా భిన్నంగా ఉంటుంది. ఒక దేవతకు మారేడు, మరొక దేవతకు తులసి, మరొక దేవతకు మోదకం ఇష్టం. భిన్న రుచులతో కూడినది లోకమనే నానుడి యుంది కదా. లోకో భిన్న రుచి:


ఈశ్వరుని లీలలను లెక్కపెట్టలేం. కొందరికి ఇష్టదైవముండి అతణ్ణి కొలుస్తారు. పెక్కుమందిని కొలవనే కొలవరు. తాము కొలిచిన దేవతయే పరమాత్మయని భావిస్తారు. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు, దేవీ భక్తులు, శివ భక్తులనే వ్యవహారం ఉంది. పరమాత్మ వీరి భక్తి తీవ్రతను గమనించి అన్ని ఫలాలనిస్తాడు.


ఇట్లా ఇష్ట దేవతయున్నా వినాయకుడే మాత్రం విస్మరించరు. శుక్లాం బరధరం అనకుండా పూజ నారంభించరు.

Sunday, 29 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (98)

ఇట్టి ప్రణాళికలో విఘ్నాలను తొలగించడం అనే పనిని వినాయకునకు ఈశ్వరుడు నిర్దేశించాడు. కనుక వినాయకుడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. వినాయక రూపంలో విద్యను, భాగ్యాన్ని, విజయాన్ని తిన్నగా ప్రసాదించడు. అట్టి పనులను వివిధ దేవతలకు పరమాత్మ, కేటాయిస్తాడు అయితే తతః హేతున్యాయం ఇక్కడ నప్పుతుందా?


ప్రభుత్వం ఏర్పడినప్పుడు వివిధ శాఖలను వివిధ మంత్రులకు కేటాయిస్తారు కదా! ఏ మంత్రియైనా వివిధ శాఖలను నిర్వహించగలడు. అతనికి అంతకుముందు ఆ విషయం తెలియకపోయినా. అయితే ఒక మంత్రికి కేటాయించిన శాఖలో మరొక మంత్రి తలదూర్చకూడదు. అట్లాగే జగత్ ప్రభుత్వం కూడా దేవతలచే అట్లా నిర్వహింపబడుతుంది. వారి వారి పరిధిలో ఆయా దేవతలు భక్తుల కోరికలను తీరుస్తారు.


ఇది సాధారణ నియమమన్నాను. అంటే ఏదో విశేష నియమం ఉండాలి కదా.


ఒక ప్రత్యేకమైన దేవత - అది వినాయకుడు కావచ్చు, మరొక దేవత కావచ్చు. పరమాత్మ మాదిరిగా ఒక ప్రత్యేక ఫలాన్నే ఈయడమే కాకుండా దేనినైనా ఈయగలడు. ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని నీవే నాకు ఏకైక దైవం, ఇక ఏ దేవతను కొలవనని భీష్మించుకొని కూర్చుంటే ఆ దేవత, పరమాత్మ మాదిరిగా అన్నిటినీ ఇస్తుంది. తాను పరమాత్మనని ఎఱుక లేని దేవత కూడా, ఇట్టి సర్వార్వణ భావాన్ని అసలు పరమాత్మ గ్రహించి ఈ చిన్న దేవత ద్వారా భక్తుడు కోరిన అన్నిటినీ ప్రసాదింపజేస్తాడు. అది మానవ రూపంలోనూ ఉండవచ్చు. అట్లా సర్వార్పణ భావం, ఒకే దేవతపై గాఢభక్తి కలిగి యుండడం, ఎక్కడో గాని ఉండదు.


Saturday, 28 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (97)

అన్ని ఫలాలూ అతడీయకపోయినా


వినాయకుడు శక్తిమంతుడైనా అతడన్నీ ఈయకుండా, ఉన్న ఆటంకాలను మాత్రమే తొలగిస్తాడని కాసేపు ఊహిద్దాం. మిగతా దేవతలే ఫలాలిచ్చేటట్లుగా చేస్తాడని భావిద్దాం. అతని గురించి ఎట్లా పరదైవమని అంటున్నామో మిగతా దేవతలను వర్ణించేటపుడూ ఎవరికి వారే పరమ దైవాలని పురాణ కథలంటున్నాయి కదా. అదీ సత్యమే. ఒక్క పరమాత్మయే భిన్న దేవతలుగా కన్పిస్తున్నాడు. మనపట్ల కూడా అంతే. మాయ, మనలను కప్పివేయడం వల్ల మనము అఖండాత్మ స్వరూపులమని గుర్తించలేకపోతున్నాం. అయితే దేవతా రూపాలలోనున్న వారు తాము పరమాత్మయనే గుర్తిస్తున్నారు.


ఈ పరమాత్మననే భావన అందరి దేవతలకూ ఉందా? అందుకొందరే భావిస్తున్నారని కొంత వరకే కొందరని ఒక అభిప్రాయముంది. ఇట్టి సందేహం మనం శివుణ్ణి, అమ్మవారిని, విష్ణువుని పూజించినప్పుడు కలగదు. వీరు ముగ్గుర్నీ రత్న త్రయంగా, పూర్ణ బ్రహ్మ శక్తి కలవారుగా అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు. వీరిని పూజించేటపుడు కూడా గణపతిని పూజిస్తాం.


సాధారణ నియమ మేమంటే ఏ దేవత యైనా అది తాను పరమాత్మనని తెలుసుకున్నా, పూర్తి ఫలాన్ని భక్తునకీయకుండా, భక్తుడు కోరినది మాత్రం ప్రసాదిస్తుంది. ఒక పరమాత్మ - భిన్న రూపాల లక్ష్యం ఇది కదా! ఈ సనాతన ధర్మంలో అనేక దేవతలుండాలని రకరకాలుగా అలంకరించి, వివిధ నైవేద్యాలు ఆయా దేవతలకు అర్పించవచ్చని భగవత్రణాళికగా ఉంది.


Friday, 27 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (96)


ఈ శ్లోకంలోని ఉపాసకుడు సామాన్యుడు కాడు. అతడు 'తతః హేతోరితివిత్' అనగా న్యాయం తెలిసినవాడు. తర్కశాస్త్రం బాగా తెలిసిన వాడగుటచే బాగా ఆలోచించి పూర్వాపరాలను వీక్షించి నిర్ణయానికి వస్తాడు. అతడు వినాయకుని పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు?


అందరు దేవతలు ముందు విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. అప్పుడే వారికి ఆటంకాల బాధ ఉండడం లేదు. ఏ దేవతయైనా ఇతణ్ణి పూజించకపోతే ఇతడు వారికి ఆటంకాలను కల్గిస్తాడు. అందువల్ల ఇతని అనుగ్రహం కోసం కొలుస్తున్నారు. అందువల్ల అందరి దేవతలకంటే ఇతడధికుడు, ఫలప్రదాత. గణేశుని నామాలను పరికిస్తే ఇది తేలతెల్లమౌతుంది. 'లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి మొదలైన నామాలు. అనగా లక్ష్మి, సరస్వతి దుర్గ లిచ్చేవన్నీ ఇస్తాడన్న మాట. అంతేకాదు సర్వసిద్ది ప్రద గణపతి అనగా అన్నిటినీ ఈయగలదు. అందువల్లనే చాలా చోట్ల సిద్ధి వినాయక ఆలయాలు వెలిసాయి. అందువల్ల సమస్త దేవతల కంటే ఇతడధికుడని, తెలివైన భక్తుడు, తర్కజ్ఞానం గల భక్తుడు, ఇతజ్ణి ఏకం పరందేవంగా భావిస్తాడు.


ఒక్క విఘ్నేశ్వరుడు అన్నిటినీ ఇచ్చినపుడు మిగతా దేవతలను పూజింప నేల? తతఃహే తో రేవ తతః హేతుత్వే మధ్యే కింతేన? అనగా తతః హేతున్యాయం తెలిసినవాడు అతడు పరమ దైవమని భావించి అతని పూజకే కట్టుబడి యుంటాడు.


తతః హేతోరితి నీతివిదు: భజతే దేవం యం ఏకం పరం


ఇంకా ఏమంటాడు? మామూలు పూజ ఇతనికి చేసి, విస్తారమైన పూజ మిగతా దేవతలకు చేసినా ఇతనికి జరిగిన పూజతోనే సరిబెట్టుకుంటాడు. 


Thursday, 26 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (95)



శ్లోకంలో రెండవ పంక్తిలో ఎవరిని తప్పక పూజించాలో అని ఉంది. మూడవ పంక్తిలో తతః హేతున్యాయం ప్రకారం మహోత్తమ దేవతగా ఎవనిని భావిస్తారో అని ఉంది. ఇందు కూడా ఆ ఒకని గురించి చెప్పలేదు. యం ఏకం పరం అని ఉంది. తేలిందేమిటి? సమస్త దేవతలకు మూలం పరబ్రహ్మం కదా! ఆ మాటను సూచిస్తూ ఏకంపరం ఉంది. ఆ ఒక్కడు, అద్వైతమైన పరబ్రహ్మమే అని చెప్పినట్లైంది. ఆ శ్లోక రచయిత పరవస్తువునే స్తుతిస్తున్నాడు తతః హేతున్యాయం ప్రకారం అతణ్ణే స్తుతిస్తున్నాడు.


శ్లోకం, అతని పేరు చెప్పకపోయినా అతడెవరో మనకు తెలుసు. మన వినాయకుడే. కనుక ఈ న్యాయం చెప్పి బాగా నప్పునట్లు చేసాడు రచయిత.


ఈ న్యాయం తెలిసినవారికి, తెలియనివారికి ఏం జరిగింది?


ఎవరైనా తమ ఇష్టదైవాన్ని ఒక ప్రధాన ప్రయోజనంతో కొలుస్తారు. ఏదైనా ఆటంకం వస్తుందేమోనని శంకిస్తారు. అయితే అట్లా శంకించడం ఆ దేవత పట్ల పూర్తి భక్తి విశ్వాసాలను ప్రకటించడం లేదని మనం నిర్ణయించవచ్చా! ఏదైనా ఆటంకం వస్తే తాను కొలచిన దేవత ఊరకే చూస్తూ కూర్చుంటాడా? అయితే బాధ పడడానికి కారణం ఉంది. పురాణాలు చూస్తే దేవతలు మంచి పనులను చేయాలని సంకల్పించినా ఆటంకాలెదురవడం, తరువాత గణపతి అట్లా చేయడం జరిగినట్లు చదువుకున్నాం. వాళ్ళే భయపడినపుడు మానవ మాత్రులం మనమెంత? పూజకోసం డబ్బు కూడబెట్టడంలో సామగ్రిని సేకరించడంలో, లేదా మనస్సు యొక్క ఏకాగ్రతలో ఆటంకాలు వస్తాయి. కనుక ఇట్టివి తొలగాలంటే దేవతలే పూజించిన గణపతిని మొదటగా ఆరాధిస్తే మంచిదే.

Wednesday, 25 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (94)



పాద పద్మం


పంకం నుండి పుట్టింది పంకేరుహం. పద్మం. మురికిగా నున్న బురదనుండి పుట్టి స్వచ్ఛంగా ఉంటోంది. ఇది ఏమని గుర్తు చేస్తోంది? ఏ స్థితిలో మనిషి పుట్టినా ఉత్తమునిగా తీర్చి దిద్దబడాలని, బడవచ్చని చెబుతోంది. పద్మం నీటిలో పుట్టడం వల్ల నీరజం, అంభోరుహం, సరసిజం అని పేర్లు వచ్చాయి బురదనుండి పుట్టడం వల్ల పంకేరుహమైంది. అట్లాగే సంశయాలతో కూడిన మనస్సు నుండే భగవానుని పాదపద్మం వికసించాలి.


అంతరాయహతయే = విఘ్నాలు పోవడానికి. ఇట్లా గణపతిని పూజించడం మంచికే కాదు, కార్యం తు అవశ్యం విదుః తప్పనిసరి కూడా అని తేలింది.


అందువల్ల ఇక్కడ ఫలానా వాడని చెప్పలేదు. ఆ ఎవరో చెప్పకపోవడం కవులు చేసే చమత్కారం. యత్ పాద పంకేరుహద్వంద్వారాధనం ఎవని పాద పంకేరుహాన్ని పూజిస్తే అన్నారు.


ఇతర దేవతలను పూజించాలన్నా ఆ ఒక్కణ్ణి అని చెప్పడం వల్ల అతని గొప్పదనం తెలియవస్తుంది. ఆ ఒక్కణ్ణి పూజించడం వారి లక్ష్యం కాదు అయినా ఆ ఒక్కణ్ణి పూజించి తీరాలి. ఇది అతని గొప్పదనాన్ని సూచించదా?


ఇతర దేవతలను పూజిస్తే వారికి విఘ్నాలను తొలగించే శక్తి లేదు. విఘ్నేశ్వరునకే అట్టి శక్తి.


Tuesday, 24 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (93)

మరొక ఉదాహరణతో ఈ న్యాయాన్ని వివరిస్తాను. మనకు బియ్యం బస్తాలు కావాలి. అది మన లక్ష్యం అనగా తతః. భూయజమాని దగ్గరే తీసుకొనవచ్చు. కనుక భూస్వామి ఇక్కడే హేతువు. కానీ అది స్థానికమైన కిరాణా వ్యాపారి సిఫార్సు చేస్తేనే ఇస్తాడు. ఈ కిరాణా వ్యాపారి ఎవరి సిఫార్సు అక్కఱలేకుండానే మనకిస్తాడు. కనుక ఇతడు మనకు ప్రత్యక్ష హేతువు. అటువంటప్పుడు ఇతని దగ్గరకే వెళ్ళి తీసుకోవచ్చు కదా. మధ్యలో భూ యజమాని ఎందుకు? ఇక్కడున్న దీపంలో చాలా వత్తులున్నాయి. తూర్పువైపు వెలుగు రావాలని అనుకున్నామనుకోండి. ఆ వైపున ఉన్న వత్తిని వెలిగిస్తే సరిపోతుంది. ముందు పడమరవైపు వెలిగించు, దానితో తూర్పువైపున ఉన్న దానిని ముట్టించని ఎవరైనా అంటారా? (అందరూ నవ్వారు) అట్లా తతః హేతుత్వేమధ్యే కింతేన ఈ న్యాయంతో ఆ శ్లోకంలోని గణపతిని ఎందుకు పూజించాలో చెబుతాను.


చదువుకై సరస్వతిని; డబ్బుకై లక్ష్మిని మొదలైనవి పూజించాలని చెప్పాను. వివిధ ఫలాలు కావాలంటే వివిధ దేవతలను పూజిస్తున్నాం. అయితే ఏ దేవతను పూజించినా ముందు గణపతినే పూజిస్తారెందుకు? ఇతర దేవతలను పూజించడంలో విఘ్నాలు రాకుండా ఉండడానికి అదే శ్లోకం ప్రథమ భాగంలో ఉన్నది.


అప్యన్యామరమారిరాధ యిషతా..


శ్లోకం మొదట్లో 'అపి' అని ఉంది. అంటే ఏదో చెప్పబోతున్నాడు. కుతూహలం ఏర్పడుతోంది కదా.


మిగతా దేవతలను పూజించేవారేమి చేస్తారు? వారిని పూజించేటపుడు కూడా ఆటంకాలు రాకుండా ఉండడానికి ఒకని పాద పద్మాన్ని అనగా గణపతిని పూజించాలి కదా, అదే సంస్కృతంలో యత్ పాదపంకే రుహ ద్వంద్వారాధనం, అంతరాయ పతయే కార్యం త్వవశ్యం విదుః అని ఉంది. పాదద్వంద్వం అంటే రెండు పాదాలను.


Monday, 23 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (92)

ప్రతి పుస్తకానికి ముందు మంగళ శ్లోకం ఉంటుంది కదా. సాధారణంగా గణపతి గురించే ఉంటుంది. ఈ స్తుతిలోనూ న్యాయ శాస్త్రాన్ని రుచి చూపించారు శాస్త్రిగారు.


అప్యన్యామరమారి రాధ యిషతాం యత్నాద పంకేరుహ

ద్వంద్వారాధనమంతరాయ హతయే కార్యం త్వవశ్యం విదు:


తద్దేతోవిధినీతివిత్తు భజతే దేవం యమేకం పరం

సర్వార్థ ప్రతిపాదనైక చతురోద్యైమాతురోజవ్యాత్ సనః 


అనగా గణపతి కంటే మిగిలిన దేవతలను పూజించేవారు కూడా ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతినే ముందు పూజించాలి. తాము పూజించే ఇతర దేవతల అనుగ్రహం కావాలన్నా ముందితనినే పూజించాలి. ఈ 'తతః హేతు' న్యాయాన్ని బట్టి ఇతడే ప్రథమ దేవత అవుతాడు. అట్టి విఘ్నేశ్వరుడు మా ప్రయత్నాలను ఫలించేటట్లుగా అనుగ్రహించుగాక.


తతఃహీతు న్యాయం


హేతువంటే కారణం. విద్యుత్తున్న తీగను ముట్టుకుంటే ప్రమాదం కదా. ఆ తీగ హేతువైంది. హేతువునకు విరుద్ధం అహేతువు. ఏ కారణం లేకుండా దేనినీ ఆపేక్షించకుండా భగవానుని పట్ల చూపు భక్తి అహైతుకీభక్తి అని అంటారు. అట్టి జ్ఞానియైన భక్తుడు, నిర్గుణ స్వరూపం రుచి చూసినవాడే.

Sunday, 22 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (91)

అనంతాచార్యులనే వారు అద్వైతాన్ని ఖండిస్తూ న్యాయభాస్కరం వ్రాయగా న్యాయేందు శేఖరం వ్రాసి శాస్త్రిగారు ఖండించారు. సూర్యుని మాదిరిగా వెలుగుతుందనే అర్ధంలో వారు న్యాయ భాస్కరం వ్రాయగా అతడస్తమిస్తే చంద్రుడే ప్రకాశిస్తాడు, చల్లని వెన్నెలను ప్రసారిస్తాడు. విద్వాంసుల హృదయం చల్లబడుతుంది కనుక న్యాయేందు శేఖరం మన శాస్త్రిగారు వ్రాసేరు. దానిని ఈశ్వర ప్రసాదంగా భావించారు. మనస్సులో చంద్రుడు, ఈశ్వరుడు ఉండాలి కనుక పుస్తకానికి ఆ నామముంచారు. ఈ పుస్తకంపై ప్రతి సంవత్సరమూ అద్వైత సభ జరుపుతారు. మా మఠానికి చెందిన పరమ గురువులీ ఏర్పాటు చేసారు. వారే ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీరు 1894లో ఈ సభను స్థాపించారు. ఈ పుస్తకం పై పరిశోధన చేసేవారికి ప్రతి ఏటా బహుమతినిస్తారు. ఇది ఈ పుస్తకం యొక్క గొప్పదనం.


ఇక్కడ తర్క శాస్త్రానికి, గణపతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తాను. తర్క శాస్త్రం కార్యకారణ విచారణ చేస్తుంది. ఈ నియమాలను న్యాయమని అంటారు. ఇందు కొన్ని పోలికలుంటాయి. లోకోక్తులూ ఉంటాయి ఉదాహరణకు కాకి, తాటి చెట్టు మీద వ్రాలితే తాటిపండు పడిందని దానినే కాకతాళీయ న్యాయమని అంటారని తెలుసు కదా!


చెవిదుద్దు, మంగలసూత్రము స్త్రీల సౌభాగ్య చిహ్నాలు. పూర్వకాలంలో నిరాడంబరంగా ఉండేవారు కనుక ఆ చెవి దుద్దు, మెడలో కట్టిన తాళి తాటాకులతో ఉండేవి. తాటాకును నేడు ధరించికపోయినా, వజ్రాన్ని ధరించినా ఆ పదాన్ని గుర్తు చేస్తూ వజ్ర తాటంకాలని నేటికీ వ్యవహారంలో ఉంది. శ్యామలా నవరత్నమాలలో అమ్మవారు తాళీపలాశ తాటంకం అని పేర్కొనబడింది. తాటాకుతో చుట్టబడి కర్ణాభరణంగా ఉందని అర్థం. మంగళ సూత్రంలోని బిళ్ళ కూడా తాటాకుతోనే ఉండేది. అందువల్ల మంగళసూత్రాన్ని తాళియని వ్యవహరిస్తారు. గణపతి గురించి చెబుతూ మిగతా విషయాలను ప్రస్తావించాను. ఇక పుస్తకంలోని గణపతిని పేర్కొంటాను.

Saturday, 21 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (90)



మన్నారు గుడికి చెందిన రాజు శాస్త్రిగారనే మహావిద్వాంసుడుండేవాడు. గొప్ప శివభక్తుడు. అనుష్ఠానపరుడు. ఆయన గురుకులం నడిపి ఎందరినో విద్వాంసులుగా తీర్చి దిద్దాడు. ఆయన అసలైన కులపతి. ఆయన గురించి ఎవరైనా చెప్పవలసి వచ్చినపుడు వారి పేరుతో చెప్పేవారు కాదు. మన్నారు గుడి పెరియవ అనేవారు. ఆ మాటకు మన్నారు గుడి పెద్దవారని అర్ధం. నా మాదిరిగా మఠాధిపతి కాదు. నన్నట్లా గౌరవంతో పిలుస్తున్నారు. అయన సన్న్యాసి కాదు, గృహస్థే. 


సుమారు వంద సంవత్సరాలు బ్రతికారు. 20 వ శతాబ్దం మొదటివరకూ ఉన్నారు. అంత విద్వాంసుడైనా గొప్ప వినయవంతుడు. 1887 లో తెల్లదొరల ప్రభుత్వం వారికి మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చింది. "ఇది పెద్ద విద్వాంసులకిచ్చేది. నాకు అర్హత లేదని" వినయంతో అన్నారు. ఆ బిరుదును ఢిల్లీ వెళ్ళి తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారే బిరుదును, బహుమతిని తీసుకొని వచ్చి యిచ్చారు. ఇతర విద్వాంసులు వీరితో వాగ్వాదం చేసినా సున్నితంగా సమాధానం చెప్పేవారు. తిరువిసైనల్లూర్ లో రామ సుబ్బశాస్త్రీ గారనే మహా మహోపాధ్యాలుండేవారు. ఆయన స్మార్తుడైనా అద్వైతాన్ని, సన్న్యాసాన్ని, శివభక్తిని గూర్చి నిందావాక్యాలు వ్రాయగా వ్యక్తిగతంగా వారిని దూషించకుండా ప్రతి మాటను శాస్త్రోక్తంగా దుర్జనకోటినిరాసం అనే గ్రంథంలో రాజుశాస్త్రిగారు ఖండించారు.     


వారు వ్రాసిన అనేక రచనలలో న్యాయేందు శేఖరగ్రంథము గొప్పది. అది తర్కవేదాంతాల సంగమం. దానినే న్యాయశాస్త్రమంటారు.

Friday, 20 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (89)

దేవతల విఘ్నాలను పోగొట్టినవాడు


ఏ పురాణం ఆరంభించినపుడైనా అసలు వాగ్దేవిని, విద్యాదేవిని స్మరించడం సబబు. కాని అంతకంటే ముందు గణపతిని నుతిస్తాం. వాగ్దేవిని పూజించడానికి కూడా ఏదైనా ఆటంకం వస్తే ఏం జరుగుతుంది? అందువల్ల ముందుగా గణపతిని పూజించవలసిందే.  


మరొక ముఖ్య కారణముంది. మనం పూజించేటపుడే కాదు. దేవతలు మనలను ఆశీర్వదించాలన్నా ఏదైనా వారికి ఆటంకం రావచ్చు. ఇట్లా .జరుగుతుందా? పార్వతీ పరమేశ్వరులు, మహావిష్ణువు, అతని అవతారాలు సుబ్రహ్మణ్య స్వామి మిగిలిన దేవతలు వారనుకొన్నవి జరుగకపోతే వారే గణపతిని పూజించినట్లు పురాణాలలో కావలసిన కథలున్నాయి. శ్లోకంలో బ్రహ్మాది దేవతలని ఉంది కదా! అంటే అంతటివారే ఇతణ్ణి అర్చించవలసి వచ్చింది. పూజిస్తేనే కాని వారి పనులు జరగలేదు. పుస్తకం వ్రాసినపుడు సరస్వతిని ప్రార్ధించినా డబ్బుకోసం లక్ష్మిని పూజించినా, రోగవిముక్తి కోసం సూర్యుణ్ణి ఆరాధించినా మునుముందుగా ఆయా దేవతలు కరుణించడానికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందుగా మనం గణపతిని పూజించవలసిందే. అప్పుడే దేవతలు మనపై అనుగ్రహం చూపించగలరు.


అది రుద్రాభిషేకం కావచ్చు, చండీహోమం కావచ్చు, ఏదైనా ముందుగా శుక్లాంబరధరం శ్లోకం చదువకుండా ఆరంభించం.

Thursday, 19 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (88)

సరస్వతి భర్త, బ్రహ్మ కనుక, ఆమెను వాగ్దేవియని అంటాం, కనుక ఇతడు వాగీశుడయ్యాడు. శ్లోకంలోని వాగీశుడు బ్రహ్మయే, బ్రహ్మ దేవతలలో వాగీశుడైనట్లు, వాగీశుడైన గణపతి - బుద్ధికి, పాండిత్యానికి పెట్టింది పేరైనాడు. 


బ్రహ్మ, సృష్టికర్త కదా! సృష్టి అనినప్పుడు కాలం గుర్తుకు వస్తుంది. కాలానికి సంవత్సరమొక కొలమానం క్రొత్త సంవత్సరం నాడు పంచాంగాన్ని వినేటపుడు ముందుగా బ్రహ్మను గుర్తుంచుకోవడం, సబబే. తరువాత బ్రహ్మాది దేవతలు కొలిచే గణపతిని స్మరించడం సబబు.


బ్రహ్మ, వాగీశుడైనా బుద్ధితో, పాండిత్యంతో సంబంధమున్నవానిని పూజించాలి. ఇంకా విఘ్నాలు లేకుండా ఉండాలన్నా గణపతిని పూజించాలి • అందుకే ముందుగా శ్రీ మహాగణాధివతయే నమః అని వ్రాసి మొదలుపెడతాం.


సరస్వతి భర్తయైన బ్రహ్మ, వాగీశుడైనా గణపతిని కొలిచాడు కనుక ముందుగా గణపతిని పూజించాలి. రామాయణాన్ని పారాయణం చేసేటప్పుడైనా వాగీశాద్యాః అనే శ్లోకాన్ని ముందుగానే చదువుతాం. తరువాత సరస్వతీ స్తుతి యుంటుంది.

Wednesday, 18 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (87)



వాగీశుడెవడు ?


ఈ పదం, తిరునావుక్కరుసు స్వామికి ఉంది. ఇతడు జైనుడై, జైన మత ప్రవర్తకులలో గొప్పవాడై ధర్మసేనునిగా కీర్తింపబడ్డాడు. అతడు తిరిగి శైవమతంలోకి వచ్చినపుడు పరమేశ్వరుడే అశీరవాణితో "నా వుక్కరసు" అనే బిరుదు నిచ్చాడట. అది సంస్కృతంలో వాగీసుడని అర్ధం. దీని తరువాత తిరుజ్ఞాన సంబంధర్ ఇతణ్ణి అప్పర్ అని సంబోధించాడు. ఈ పేరూ ప్రచారంలో ఉంది. శ్లోకంలోని వాగీసపదం అప్పర్ స్వామిని చెప్పడం లేదు. వాగీశ మరియు దేవతలని ఉంది కదా! అయితే దేవతలలో వాగీశుడెవడు? బ్రహ్మకు, బృహస్పతికి ఈ పేరుంది.


దేవ గురువు బృహస్పతి చాలా బుద్ధిమంతుడు. అందుకే లోకంలో నువ్వేమైనా బృహస్పతివా అనే మాట వచ్చింది. అతడన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. కనుక అతడు వాగీశుడు. అతడు గీష్పతి కూడా. రెంటికీ ఒకే అర్ధం. ఇతనికి గణపతికి దగ్గర సంబంధం ఉంది. వేదాలలో నున్న బ్రహ్మణస్పతియే పురాణాలలోని విఘ్నేశ్వరుడని పరితోధకులంటారు. గణానాంత్వా అనే మంత్రాన్ని వినాయక ప్రతిష్ఠలో వాడతాం. ఇక్కడ అతడు బ్రహ్మణస్పతియే.


ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గ్రహించవచ్చు. దేవతలు, వినాయకుణ్ణి వారి గురువు, బృహస్పతి ద్వారా తెలుసుకొని అర్చించారనవచ్చు. అనగా దేవగురువు. గణపతిని అర్చించి శిష్యులకిట్లా చేయాలని ఉపదేశించినట్లైంది.

Tuesday, 17 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (86)



అట్టి ఉగ్రత్వం తిరిగి ఆమెలో ప్రవేశించకూడదని విగ్రహంలోని ఉగ్రకళలను గ్రహించి తాటంకాలలో ఉంచారు. అంటే కర్ణాభరణాలుగా, అవి యంత్ర రూపంలో ఉంటాయి. వాటిని ఆమెకు అలంకరంగా ఉంచారట.


తాటంకం, సౌభాగ్యానికి గుర్తు, శంకరులు, సౌందర్యలహరిలో ఒక ప్రశ్న వేసారు. అమృతం త్రాగినా దేవతలు ప్రళయకాలంలో నామరూపాలు లేకుండా ఉన్నారేమిటి? ఒక్క పరమేశ్వరుడే నిలబడడానికి కారణం ఏమిటి? ఆపైన విషపానం చేసిన వాడుండడేమిటి? అని ప్రశ్న వేసుకొని, ఇదంతా నీ తాటంకాల మహిమయమ్మా, 'తవజనని తాటంక మహిమా' అన్నారు.


ఇట్లా ఉగ్ర కళలను తాటంకాలలో బంధించి, పాతివ్రత్యానికి చిహ్నమైన తాటంకాలనమర్చి ఎదురుగా కొడుకైన గణపతిని ప్రతిష్ఠించారు.


గణపతికి జంబుకేశ్వరంతో, సంబంధం ఉంది. జంబు అంటే నేరేడు. నేరేడు ఫలాలంటే స్వామికి ఇష్టం. ఒక స్తోత్రంలో 'కపిత్థ జంబూఫల సార భక్షితం' అని ఉంది. నేరేడు పండును సుబ్రహ్మణ్య స్వామి, అవ్వైయార్ అనే కవయిత్రికి ఇచ్చాడని, ఆమె గణపతి భక్తురాలని కథ.


శంకరుని అవతారమైన శంకరులు, శివపార్వతులకు ప్రీతిపాత్రుడైన వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేయడంలో ప్రత్యేకత ఉండాలి.


పరాశక్తి యొక్క కోపాన్ని తగ్గించగల శక్తి గణపతికే ఉంది. అతనికి శక్తి ఉందంటే ఏదో మంత్రాన్ని ఉపయోగిస్తాడనో, ఏదో చేసి పరాశక్తిని మారుస్తాడని కాదు. పరాశక్తి యొక్క చూపు పడితే చాలు. ఆమె కంటికి ఇతడు ప్రీతి పాత్రుడు ప్రేమ మూర్తి. అతని మనస్సూ గొప్పదే. వాగీశది దేవతలు ఇతనిని అర్చించి విజయాన్ని పొందారు కదా!

Monday, 16 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (85)

 

ఏనుగు కాని ఏనుగు ముఖం కలవాడు


అతడెంత ఉదార హృదయుడో చెప్పడానికి ఒక్క సంఘటన చెబుతాను. ఎవని దగ్గర కోపం రాదో, ఎవర్ని చూస్తే కోపం పటాపంచలౌతుందో, శాంత మనస్యులౌతారో అట్టివానికి ప్రేమ పూర్వకమైన హృదయం ఉండాలి కదా! దానికి ఉదాహరణ మన గణపతియే. చీమనుండి బ్రహ్మవరకూ ఎవరు ప్రేమిస్తారు? ఆమెయే అమ్మవారు. ఆమె విశ్వజనని. అట్టి తల్లి, అఖిలాండేశ్వరి ఒక సందర్భంలో ఉగ్రరూపం ధరించింది. తమిళనాడులోని జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అట్లా ఉండేది. కలియుగ ప్రజలను చూసి ఉగ్రురాలైందట. ఆమె అమిత శక్తి కలదైనా, లలిత మాదిరిగా అందరినీ ప్రేమించినా ఉగ్రమైన కాళిగా కూడా ఉండగలదు.


ఇట్టి కాళీ రూపం తగ్గించడానికి శంకరులు ఇక్కడకు వెళ్ళారట. వారు పరమేశ్వరుని అవతారం కదా! కనుక ఆయన సమీపించగలరు. ఈ సందర్భంలో గణపతి యొక్క మహత్త్వాన్ని లోకానికి చాటించాలనుకొన్నారు. అందువల్ల అమ్మవారి ముందరగా గణపతిని ప్రతిష్ట చేసారు. అంతే! ఎప్పుడైతే గణపతి వెలిశాడో అమ్మవారి కోపతాపాలు చల్లారాయి. పిల్లవానిపై తల్లికి మమకారం ఉంటుంది కదా.

Sunday, 15 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (84)

 


పువ్వు - మనస్సు


సుమనస్ అనగా మంచి మనస్సని అర్ధం. అసలు మంచి మనస్సే దేవశక్తి. చెడ్డమనస్సు అసుర శక్తి, పువ్వును కూడా సుమనస్ అంటారు. ఒక మొక్క లేక లతలా పువ్వులా ఉంటుంది మంచి మనస్సు. మంచి మనస్సు యొక్క లక్షణమేమిటి? అందులో ప్రేమ ఊరుతూనే ఉంటుంది. మొక్కకైనా, లతకైనా దాని యొక్క సారమైన మాధుర్యం పువ్వులో కన్పిస్తుంది. పండు కంటే తియ్యగా ఉండేది మకరందమే. కొన్ని మొక్కలలో, కొన్ని చెట్లలో పండ్లు చేదుగా ఉండవచ్చు. కాని వాటి పువ్వులలో తేనె, తియ్యగానే ఉంటుంది. చేదుగా ఎన్నటికీ ఉండదు. పువ్వు కంటికి, ఒంటికి, ముక్కుకు, నాల్కకు సంతోషాన్ని కల్గిస్తుంది. అందమైన ఆకారం వల్ల కంటికి, మెత్తగా ఉండడం వల్ల చర్యానికి సుగంధం వల్ల ముక్కుకు; దానిలోని తేనె నోటికి రుచికరంగా ఉంటుంది ఇక చెవి ఒక్కటే మిగిలింది. పువ్వు తుమ్మెదలను తనవైపునకు ఆకర్షించుకొనేటట్లు చేస్తోంది. ఆ తుమ్మెదల ఝంకారం వీనుల విందుగా ఉంటుంది.


ఈ సునమస్సుకి - మంచి మనస్సు, అందం, దేవతలు అనే అర్థాలిచ్చే చాలా శ్లోకాలున్నాయి. మహిషాసురమర్దనీ స్తోత్రంలో ఈ సుమనస్ పదం చాలాసార్లు వస్తుంది. దీనికున్న అన్ని అర్థాలలోనూ వాడబడింది. ఇందులో అమ్మవారిని నుతిస్తూ, కాంతి కలిగిన పువ్వులతో అమ్మవారు, మంచి మనస్సు కల దేవతలచే అర్చించబడిందనే అర్థంలో సుమనస్' మంచి హృదయమని దేవతలని, అందమని, పువ్వులని అనేకార్థాలలో వాడబడింది. ఆ శ్లోకం యొక్క నడకయే అందంగా ఉంటుంది. (ఈ శ్లోకం అనంతరామదీక్షితుల కాలంలో ప్రాచుర్యం పొందింది)


గణపతి, సుమనస్సులచే అర్చింపబడ్డాడని అనినపుడు మంచి మనస్సు కలవారిచే అర్చింపబడ్డాడని అర్ధం. అందుకే వాగీశాద్యాః సుమనసః అని వాడబడింది. దేవతలనిక్కడ ఏ పదంతోనూ కాకుండా సుమనస్ అనే వాడబడింది


మంచి మనస్సు కలవారు ఎవర్నో ఒకర్ని పూజిస్తారు. పూజింప బదేవాడూ మంచి మనస్సు కలిగి యుండాలి కదా.


Saturday, 14 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (83)



దేవతలారాధించిన దేవత


గజవక్తుని పూజ వల్ల విజయం


సంవత్సరాదినాడు పంచాంగ శ్రవణంలో ఈ శ్లోకాన్ని చదువుతారు: 


వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం నత్వా కృతకృత్యాస్యుః: తం నమామి గజాననం


ఇందు గజానన పదం వినబడుతోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా వినాయకుణ్ణి స్తుతిస్తున్నామని అర్ధమవుతుంది. ఏమని చెప్పింది? దేవతలు తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు ఈ గజాననుణ్ణి కొలుస్తారని.


బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథులలోనే కాదు, ఏదైనా పని ఆరంభించునపుడు నిరంతరమూ కొలుస్తారట. చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వీరి నమస్కారాన్ని మాత్రమే స్వీకరించడు, వారెందుకు నమస్కరించారో దానిని నెరవేరుస్తాడు. అనగా వారిని కృతకృత్యులను చేస్తాడన్నమట. అనగా వారి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.


వాగీశాద్యాః సుమనసః = వాగీశుడు మొదలగువారు. సుమనస్ అనగా దేవతలు.

Friday, 13 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (82)



జయంతుల ప్రత్యేకత


సౌర మాన పంచాంగాన్ని అనుసరించే తమిళులు అడృష్టవంతులంటున్నా కారణమేమంటే వీరికి గోకులాష్టమి (కృష్ణ జయంతి), వినాయక చవితి రెండూ త్రావణ మాసంలో వస్తాయి. ఇతరులకు గోకులాష్టమి త్రావణమాసంలో, వినాయక చవితి భాద్రపదమాసంలో వస్తుంది.


ఈ శ్రావణ మాసంలో దోసకాయలు విస్తారంగా పండుతాయి. ఇది సాత్త్వికాహారం కూడా. వండకుండానే పచ్చివాటిని తినవచ్చు. కృష్ణుడు, వినాయకుడు, బాలలీలలను చూపించే కాలమది. వారి జయంతులలో పచ్చి దోసకాయలు వస్తాయి. అధ్యాత్మికంగా మనం ఎదగడానికీ, అని తగిన కాలం దోసపండ్లను దేవతలకు నివేదించవచ్చు. మనం తినవచ్చు. మనము చల్లగా ఉండాలని వారు దీవిస్తారు.


సారాంశం


ఈ కథలవల్ల గణపతి, చిన్న పిల్లవాడే కాదు అనేక సందర్భాలలో పెద్దల కంటే పెద్దగా ఉంటాడు. ఎవరికంటె? తన తల్లిదండ్రులు, మేనమామ కంటె కూడా.


పరమేశ్వరునకు, లలితాంబకు రామునకు వచ్చిన ఆటంకాలను పోగొట్టినవాడు, సుబ్రహ్మణ్య వివాహానికి తోడ్పడినవాడు, మన అందరి సమస్యలను తీర్చువాడైన గణపతిని, అందరికంటే పెద్దగా ఉన్నానని నటించేవానిని భజిద్దాం.