Wednesday, 25 March 2020

వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ?



వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ? 

పొద్దున ఒకతను ఫోన్ చేశారు...
అతను : నమస్తే సర్! ఉగాది శుభాకాంక్షలు
నేను : ఉగాది శుభాకాంక్షలండి....
అతను: ఎలా ఉన్నారు?
నేను: బాగున్నా, మీరెలా ఉన్నారు?
అతను: బాగున్నాం సార్, కానీ ఈ సారి ఉగాదికి వేపపువ్వు దొరకలేదండి,  ఉగాది పచ్చడి చేసుకోకుండానే పండుగ జరుపుకోవలసి వస్తోంది..
నేను: పర్లేదండీ, వచ్చే ఏడాది తినచ్చు... ఈ ఏడాదికి ఇంట్లోనే ఉండండి...
అతను: తినకపోతే ఏమీ కాదా సార్ ? అది తప్పు కాదా ?
నేను : ఏమీ కాదండి... తప్పేమీ లేదు...
అతను: మరి శాస్త్రంలో చెప్పారు కదా సార్ తప్పకుండా తినాలని...
నేను: అవునండి... కానీ శాస్త్రం అంతవరకే చెప్పి ఊరుకోలేదు. మనకు ఆయుర్వేదమనే వైద్యశాస్త్రం ఉంది. అది ఉపవేదం కూడా. అది కృతజ్ఞత అని సూత్రం మీద పని చేస్తుంది. అనగా మనం ప్రకృతికి మేలు చేసే విధంగా బ్రతికినప్పుడు, ప్రకృతి మనకు మేలు చేస్తుంది... మన వంతుగా మనం ప్రకృతికి ఏ మేలూ చేయనప్పుడు, మనం ఆరోగ్యం కోసం ఎలాంటి ఔషధం పుచ్చుకున్నా పని చేయదని చెబుతుంది ఆయుర్వేదం.
అతను: అర్ధం కాలేదు సార్...
నేను : మన ఆయుర్వేద శాస్త్రాన్ని ముందు బ్రహ్మదేవుడు ప్రజాపతికి చెప్పారు. ఆయన ఆశ్వినీ దేవతలకు, వారు ఇంద్రునకు, ఆయన అత్రిపుత్రుడైన ఆత్రేయ పునర్వసు మరియు ఇతర మునులకు, వారు అగ్నివేశునకు మరియు  ఇతర ఋషులకు చెప్పారు. అలా ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరీ నారాయణ స్వామి. 
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఏదైనా ఒక మూలికను చెట్టు నుంచి గ్రహించాలంటే, దానికి ఒక ముహూర్తం చెబుతుంది. ఎప్పుడుబడితే అప్పుడు మూలికలు కోస్తే అవి పని చేయవంటుంది.... చెట్టు నుంచి ఆకులు సేకరించినా, బెరడు, వేరు లేదా ఇంకేదైనా సేకరించినా, ముందుగా ఆ చెట్టుకు నమస్కరించి, దానిని పూజించి, నాకు వచ్చిన రోగం నయమవడానికి ఈ మూలిక కోస్తున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి, నా రోగం ఉపశింపజేయండి అని మనస్సులో ఆ చెట్టుకు చెప్పుకోవాలి. ఆ తర్వాత దానికి నీళ్ళు పోసి, అప్పుడు కృతజ్ఞతా భావనతో, ప్రసాదంగా ఆ ఆకును కోయాలి. అప్పుడే అది ఔషధంగా పని చేస్తుంది. లేదంటే పని చేయదు. పని చేసినా అది తాత్కాలిక ఫలితమే ఇస్తుంది, ధీర్ఘకాలం కాదు. 

బెరడు చెట్టు కాండాన్ని చీడపీడల నుంచి కాపాడుతుంది. ఒక చెట్టు బెరడును సేకరించాల్సి వస్తే, ఆ చెట్టు బెరుడును తీసిన చోట, కొద్దిగా పసుపు, తర్వాతా ఆవుపేడ ఆ ప్రాంతంలో పూయాలి. ఎందుకంటే మనం సేకరించిన తర్వాత ఆ చెట్టుకు ఏ చీడ పట్టకూడదని... అదీగాక మనం ప్రకృతిహితకరమైన జీవనం గడుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం సేకరించే ప్రతి మూలిక ప్రకృతిలో భాగం. ఒక ప్రక్క ప్రకృతిని హింసిస్తూ, కలుషితం చేస్తూ, ఇంకో ప్రక్క ఆయుర్వేదం వాడితే ఏమీ ఉపయోగం లేదు....
ఇప్పుడు మనం ఇవేమీ చేయకుండా చెట్టు నుంచి ఆకులు, పూలు కోస్తే, దాన్ని శాస్త్రం చౌర్యం అంటుంది, దొంగతనం చేసిన పాపం పడుతుంది. మీకో చిన్న విషయం చెబుతా. మార్నింగ్ వాక్ చేసే చాలామంది ఒక చేతిలో కవరు, ఇంకో చేతిలో పాలకోసం బుట్ట పట్టుకుని దండయాత్రకు బయలుదేరతారు. వాళ్ళు పోయే దారిలో ఏ పూల చెట్టు కనిపించినా, ఒక్క పువ్వు కూడా వదలకుండా మొత్తం దులిపేస్తారు. ఆ చెట్టు ఎవరు నాటారు అనేది వీళ్ళకి అనవసరం. కనీసం వీళ్ళు ఏనాడు ఒక మొక్కకు నీళ్ళు కూడా పోసి ఉండరు... ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి పూజ చేస్తారు. మరి వీళ్ళకు పుణ్యం వస్తుందనుకుంటున్నారా? వీళ్ళందరికి చౌర్యం (దొంగతనం) చేసిన పాపం వస్తుంది. తర్వాత మేక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అదన్నమాట సంగతి. 

ఇప్పుడు వేప పువ్వు, మామిడాకుల విషయంలో కూడా అంతే. మన ఇంటి ముందు మనం కనీసం ఒక వేప చెట్టు, మామిడి చెట్టు నాటలేమా ? పోనీ ఇంటిముందు చోటు లేకపోతే మనముండే వీధిలో ? ఏదైనా చెట్టుకు నీరు పెట్టక, అది ఎండిపోయే స్థితికి వస్తే, ఎప్పుడైనా నీళ్ళు పోసే మొహమా మనది ? కనీసం దేవతార్చనకు పూల మొక్కలు కూడా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? అయినా మనకు పట్టదు. ప్రకృతికి ఏమైతే మనకేంటీ అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు కరోనా లాంటి విషవ్యాధులు ప్రబలి, ప్రకృతి మనకు సహకరించడంలేదు.

మనం ఎవరి నుంచైనా మేలు పొందితే, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం మన ధర్మం మనకు నేర్పింది. అది మనం మర్చిపోతున్నాం. ఇంటికో వేప చెట్టు, వీధికో రావి చెట్టు ఉంటే ఏ రోగాలు మన జోలికి రావు. పండుగ రాగానే ప్రకృతి మీద పడి దండయాత్ర చేసి, చెట్లన్నీ దులిపే బదులు, మన ఇంటి ముందే ఒక మొక్క నాటి పెంచుకోవచ్చు కదా... దానికి రోజూ నీళ్ళు పొస్తే, యజ్ఞం చేసిన ఫలం మనకు వస్తుంది. దాన్ని భూతయజ్ఞం అంటుంది శాస్త్రం. ఇప్పుడు పచ్చడి తిన్నా, మన జీవన విధానం మార్చుకోకపోతే, మనకు తప్పకుండా వ్యాధులు వస్తాయి. మనం చేసిన తప్పులను తెలుసుకుని ప్రకృతి మాతను క్షమాపణ వేడుకున్నప్పుడే, ప్రకృతిహితంగా జీవించినప్పుడు మనం ఆచరించేవి మనకు ఫలాన్నిస్తాయి. ఉగాది పచ్చడి గురించి చెప్పినప్పుడు కూడా వేపచెట్టును పూజించే పువ్వు సేకరించమన్నారు.కాబట్టి ఎత్తుకొచ్చి వేపపువ్వు తినేకంటే మనమే ఓ మొక్క నాటుకుంటే సరిపోదా? 

అతను: అర్ధమైంది సార్... ఈ ఏడాది నేను కూడా మా ఇంటి ముందు వేప, మామిడి వంటి కొన్ని ఔషధ మొక్కలు నాటి, జాగ్రత్తగా పెంచుతాను.... 

No comments:

Post a Comment