కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శనను నిషేధించారు. ఈపాటికి జనులంతా ఛార్ ధామ్ యాత్రకు సిద్ధమయ్యేవారు. నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. తిరువణ్ణామలైలో పూర్ణిమ నాడు లక్షలమంది గిరి ప్రదక్షిణం చేస్తారు, కానీ మొన్న పూర్ణిమకు అసలు ఒక్క వ్యక్తిని కూడా అనుమతించలేదు. ఇలాంటిది తామెప్పుడు చూడలేదని అక్కడి జనులు చెబుతున్నారు.
✍️ ఇలాంటి సమయంలో నిజంగా మనం అసలు తీర్థయాత్రలు సక్రమంగా చేస్తున్నామా? అసలు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి మనకు అర్హత ఉన్నదా అని ప్రశించుకోవాలి.
👉 ముందుగా మనం వెళ్ళేది విహారయాత్ర (Tourism) కు కాదని, తీర్థయాత్రకని (Pilgrimage) గుర్తుపెట్టుకోవాలి. పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు విహారస్థలాలు, పిక్నిక్ స్పాట్‌లు కావు. మీరు విహార యాత్రకు వెళ్ళాలంటే ఊటి, కొడైకెనాల్, హార్స్లీహిల్ల్స్ వెళ్ళండి. తిరుమల, అహోబిలం, అరుణాచలం, శ్రీశైలం, ఛార్ ధామ్, అమర్‌నాథ్, కైలాస మనససరోవరాలు మొదలైనవి విహరాస్థలాలు కావు.
👉 పుణ్యక్షేత్రాలు అడవి మధ్యలో ఉండవచ్చు, అంతమాత్రాన ప్రకృతిని ఆస్వాదించడానికి అక్కడకు వెళ్ళకండి. ప్రకృతిని చూసి ఆనందించండంలో తప్పులేదు గానీ మనం ఆ పేరుతో అక్కడ చేసేదంతా కాలుష్యమే. తిరుమలకు కాలినడకన వెళ్తున్నప్పుడు పక్కన చూస్తే అంతా ప్లాస్టిక్ కవర్లు, నీటి బాటిళ్ళు, స్ట్రాలు కనిపిస్తాయి. అరుణాచలం, అహోబిలంలో కూడా అంతే. తిరుమలలో ప్రతి రాయి వేదమే, ప్రతి చెట్టు ఒక ఋషి, దేవత, సిద్ధపురుషుడే అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అసలు ఆ కొండకే శేషాచలం అని పేరు. ఆ కొండ ఎవరో కాదు ఆదిశేషుడు. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడు. అహోబిలం అంటే గరుత్మంతుడు. అయినా అలాంటి ప్రదేశాల్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము. నిజానికి మనం కలుషితం చేయట్లేదు, దైవదూషణ చేస్తున్నాము, అక్కడి దైవాన్ని అవమానిస్తున్నాము. ఇక ఆ యాత్ర చేసి ఉపయోగం ఏమిటి ? పనిగట్టుకుని వెళ్ళి పాపం మూటగట్టుకోవడం ...
👉 దేవుడు గుడి లోపలే ఉంటాడు అనుకోవడం మన సంస్కృతి కాదు. అంతటా దైవం వ్యాపించి ఉన్నా, అది మనం తెలుసుకోలేకున్నాము గనక, మనకు ఆ అనుభూతి పొందడానికి తీర్థయాత్ర చేస్తాము. తిరుమల అంటేనే వేంకటేశ్వరుడు, అహోబిలం అంటే నరసింహుడు, అరుణాచలం అంటేనే శివుడు. అక్కడ గుడిలో ఉన్నది ఒక స్థూల రూపమైతే, ఆ క్షేత్రమంతటా ఆ దైవం అధికశక్తితో వ్యాపించి ఉంది. ఛార్ ధామ్ విషయంలోనూ అంతే. మరి మనకు అలాంటి భావన లేనప్పుడు వెళ్ళడమెందుకు ? అక్కడి పరిసరాలను పవిత్రంగా ఉంచలేనప్పుడు ఇంట్లో ఉండి ప్రార్ధించడం ఉత్తమం కాదా ?
👉 అక్కడ మనం చేసే భౌతిక కాలుష్యం ఒక్క దోషమైతే, మానసిక కాలుష్యం ఇంకా పెద్ద దోషం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు రాగద్వేషాలు, కోపతాపాలు పక్కన పెట్టి దైవస్మరణతో యాత్ర చేయాలి. కానీ మనం ఆ ప్రదేశాలకు వెళ్ళినా, అక్కడ కూడా కుళ్ళు, కుతంత్రాలు, కోపము, అహంకారం, దర్పము, అధికారము ప్రదర్శిస్తాము. అది అక్కడి మానసిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.
👉 తీర్థయాత్రల పేరుతో వ్యాపారం తగదు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే మనం పవిత్ర ప్రదేశాలను వ్యాపారీకరణ (commercialize) చేస్తున్నాము. అది ఎక్కువైతే ఆ క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బ తింటుంది, అక్కడ జరిగే ప్రార్ధనలు ఇంతకముందు వలె శీఘ్రఫలితాలను ఇవ్వలేవు. అక్కడున్న స్థానికులకు ఆ ఆలయాలు జీవనభృతిని కల్పిస్తూ ఉండవచ్చు గానీ ఇప్పుడు వందల కొద్దీ టూరిస్ట్ ట్రావేల్స్ తిర్థయాత్రల పేరుతో చేసేది వ్యాపారమే..
👉 గుర్తుంచుకోండి ! ఎక్కడైతే వ్యాపారం మొదలవుతుందో అక్కడ పవిత్రత తగ్గిపోతుంది.
👉 ఛార్ ధామ్, కైలాస మనస సరోవరం, అమర్‌నాథ్ మొదలైన క్షేత్రాలు హిమాలయాల్లో ఉన్నాయి. అవి తపోభూములు. మన పూర్వీకులైన ఋషులు అక్కడ తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. స్వార్ధము, కామక్రోదాదులు వదిలిపెట్టినవారు దర్శించాల్సిన పుణ్యభూములు అవి. భౌతికమైన కోరికలు అడగడం కోసం పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలేదు. మనం కోరికలు అడగటానికి వెళ్ళాలనుకుంటే మనకు దగ్గర్లో అనేక క్షేత్రాలున్నాయి. అక్కడే అడగవచ్చు.
👉 తన యాత్రకు వచ్చే భక్తుడు అనేక కష్టనష్టాలను తట్టుకుని రావాలని, తద్వారా అతనికి మరణభయం తొలగుతుందని అమరనాథుడు చెప్పాడు. కానీ మనకు అసలు కష్టపడటం ఇష్టంలేదు. అందుకే అమర్‌నాథ్ యాత్రకు కాలినడక ఎందుకని హెలికాఫ్టర్‌లో వెళ్తున్నాము. దాని ఫలితంగా అక్కడి వాతావరణంలో వేడి పేరిగి ఆ లింగం ఇంతకముందు వలె ఎక్కువ సమయం దర్శనం ఇవ్వడంలేదు. త్వరగా కరిగిపోతోంది. అయినా మీరు ఎలా రావాలో ఆ క్షేత్ర దైవమే చెప్పినప్పుడు, నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళడమెందుకు ? దైవం ముందు అది బల ప్రదర్శన కాదా? కేదార్‌నాథ్ విషయంలోనూ అంతే. వీలుంటే నడుచుకుంటూ వెళ్ళు, లేదా అక్కడ గుఱ్ఱం ఎక్కు. నువ్వు హెలికాఫ్టర్ లో వచ్చి దణ్ణం పెట్టుకో అని నీకు కేధారనాథుడు చెప్పలేదు. శరీరం సహకరించనప్పుడు అసలు అలాంటి క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి ? అక్కడి ప్రకృతిని ఎందుకు కలిషితం చేయాలి ?
👉 ఫలాన క్షేత్రం అడవిలో ఉందండీ, దానికి మంచి రోడ్డు లేదు, అక్కడ సెల్ టవర్ లేదు; బిర్యానీలు, కట్‌లెట్‌లు దొరకవు అంటూ నిట్టూర్పులు ఎందుకు ? సుఖం కావాలనుకుంటే ఇంట్లోనే ఉండి, టి.వి.లో చూడు. గుడికి వెళ్ళేది దైవంతో మాట్లాడటానికా? లేక అక్కడి నుంచి నీ పిల్లలతో ముచ్చట్లు పెట్టుకోవడానికా ? అన్ని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఉండచ్చు కదా ?
👉 తిరుమల కొండ మీద కూడా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించి చేసే ఆహారలు అమ్ముతున్నారు. మనకు సాత్త్వికాహరం అని ఒకటుంది. తీర్థయాత్రల్లో తామసిక, రాజసిక ఆహారాలు తినకూడదు. కానీ మనకు తిరుమలలో కట్‌లెట్, ఫ్రైడ్‌రైస్ కావాలి. కేధారనాథ్‌లో అన్నం కావాలి. అంటే మనం ఎక్కడకు వెళ్ళినా, మనకు సకల సౌకర్యాలు ఉండాలి, ఆహారవిహారాల్లో నిగ్రహం పాటించము. అక్కడ దొరికిందేదో సర్దుకుని తినాలని ఉండదు. కానీ మన పూజలు ఫలితమివ్వాలి, యాత్రలు సఫలీకృతం కావాలి. ఎలా సాధ్యం ?
👉 నదిలో స్నానం చేయాలంటే సబ్బు వాడి నదిని కలుషితం చేస్తావా ? పూజించి దీపాలు వదిలి, అదే నదిలో ఆ పూజ అయిపోగానే ప్లాస్టిక్ కవర్లు విసిరేస్తావా ? కానీ పూజకు ఫలితం వచ్చేయ్యాలా ? మరి చేసిన పాపానికి ?
👉 ఇప్పుడు హిందూ క్షేత్రాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. పదువులు దక్కని వారందరికీ ఆలయాల్లో పదువులు ఇస్తున్నారు. అక్కడ కూడా రాజకీయాలు. అది మన ఖర్మ.
👉 ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను ప్రభుత్వాలు రక్షించాలి అను నినదించకు. నువ్వు హైందవుడివే కదా ... నీ కర్తవ్యమేంటో అది నువ్వు నిర్వర్తించు. నీ తరఫున పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాల పవిత్రతను కాపాడు. గుర్తుంచుకో ! పవిత్ర ప్రదేశాల్లో మనం చేసే ఏ పనైనా అనేక రెట్ల ఫలితం ఇస్తుంది. అది పాపం అయినా, పుణ్యం అయినా ...
బహుసా మన పద్ధతి బాగోలేకనే కోవిడ్-19 పేరున భగవంతుడు మనకు తన దర్శనం ఇవ్వడం మానుకున్నాడేమో ?! ఆలోచించండి....