2007 లో వార్తపత్రికలో చదివినట్లు గుర్తు. అప్పట్లో మన దేశానికి చైనా అధ్యక్షుడు పర్యటనకు వచ్చినప్పుడు వేప చెట్ల గురించి తెలుసుకుని ఓ పది లక్షల వేప చెట్లు తమ దేశానికి ఎగుమతి చేయమన్నాడట. అవన్నీ చైనాలో నాటుకోవడంతో పాటు ఒక విప్లవంగా 2.2 కోట్ల వేప మొక్కలు నాటించారు. చైనాలో వ్యవసాయం మరియు మొక్కల పెంపకంలో వచ్చే చీడపీడల నివారణకు వీటిని ఉపయోగిస్తారట. వేప చెట్టు పుట్టిల్లు భారతదేశం, అనాదిగా మన దేశంలో ఆయుర్వేదంలో వేపను ఉపయోగిస్తున్నాము. కానీ 1995 లో అమెరికా వేప మీద పేటెంట్ హక్కులు తీసుకోగా, భారత్ పోరాడి రద్దు చేసింది. మరలా చైనా కూడా పేటెంట్ పేరుతో జీవయుద్ధం (బయోవార్) చేయడానికి పూనుకుంది.
ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొంచ్చిందంటారా ? బయట ఎండలు మండిపోతున్నాయి. అసలు ఎప్పుడూ ఇలాంటి ఎండలు చూసి ఉండలేదు మనము. డబ్బున్న వారు ఏసీలు వాడుతున్నారు, కొందరు కూలర్లు ఉపయోగిస్తున్నారు.ఏమీ లేనివారు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. మన బాధ చెప్పుకోవచ్చు కానీ జంతువులు, పక్షులు మొదలైన జీవుల సంగతి ఏంటి ? ఒక వేప చెట్టు పది ఏసీలకు సమానమని అప్పట్లో తేలింది. చైనా దీని మీద ఆశ కనబరచడానికి ఇది కూడా ఒక కారణం. కనీసం ఊరికో రావి చెట్టు, వీధికో వేప చెట్టు ఉండాలని నానుడి. అప్పుడే ఆరోగ్యం. కానీ ఇవాళ చాలా వీధుల్లో అసలు చెట్లే కానరావు. మొత్తం సిమెంట్ చేసిన వాకిళ్ళే. మట్టి కనిపిస్తే కదా. మనము సైతం వేప మొదలైన ఓషధీ వృక్షాలా ప్రముఖతను* గుర్తించి ఉంటే, ఇంత వేడి భరించే స్థితి రాకపోవును. ఓషధీ యుక్తమైన గాలి పీలిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు కూడా రావు. (*సంస్కృత వ్యాకరణ పండితులు చెప్పే విషయం - ప్రముఖత సరైన పదప్రయోగం - ప్రాముఖ్యత తప్పుడు ప్రయోగం).
ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఏడు వర్షాకాలం రాగానే కనీసం మనిషికి ఒక మొక్క నాటుదాము. కుటుంబానికి ఒక వేప మొక్క నాటి సంరక్షిద్దాము. వేప అంటే లక్ష్మీదేవి. వేప మొక్కను నాటి, నీరు పోసి సంరక్షిస్తే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏమంటారు ?
నేను ఊరికే నీతులు చెప్పడంలేదు. 2014 నుండి ప్రతి ఏడు మొక్కలు నాటుతున్నా.
వేప చెట్టు విశిష్టత బాగా చెప్పారు. ప్రముఖత లేదా ప్రాముఖ్యం అనవచ్చు. ప్రాముఖ్యత ప్రాధాన్యత సరికాదు. ప్రధానత లేదా ప్రాధాన్యం అనవచ్చు.
ReplyDeleteప్రతి వేసవిలోనూ వేడి ఎక్కువగానే అనిపిస్తుంది. నిజానికి ఈ సారి వేసవి తాకిడి ఆలస్యంగా మొదలయ్యింది అనే చెప్పాలి. లాక్ డౌన్ వలన కావచ్చు.